మహేశ్వరుడు ఆహ్వానించాడు
తనయుణ్ణి తనకి దగ్గరగా రమ్మని.
తనమహిమకు తార్కాణంగా తానానాడు కల్పించిన
సర్వసౌష్టవ సౌందర్య విగ్రహం
ఇంతటి విజ్ఞానఖనిగా మారిన
తన బంగారు తనయుణ్ణి
చూసి మురిసిపోయింది పార్వతి.
వినాయకుని మనస్సులో
సంకోచాలు సందేహాలు
ఒకర్నొకటి తోసుకుంటూ
బయటకి దూకటానికి
ప్రయత్నిస్తున్నాయి.
తండ్రి మనస్సుని నొచ్చకుండా
వినయపూర్వకంగా వినిపించాలని
ఎన్ని యుగాలూ కల్పాల నుంచో
ప్రయత్నిస్తున్న గణపతికి
ఈనాడు ధైర్యం పుంజుకుంది.
కుమారస్వామికి తెలిసిన విషయమే
ఎన్నోసార్లు ప్రోత్సహించాడన్నని
నాన్నకన్నీ చెప్పి
సందేహనివృత్తి చేసుకోమని.
నందికేశ్వరునికీ తెలుసు
ఆందోళనతో ఊగిసలాడుతున్న
హేరంబుని చిత్తప్రవృత్తి.
సర్వజ్ఞుడైన సర్వేశ్వరునికి
తన మనస్సులోని ఆలోచనలు
తెలియక పోవునా అనుకుంటూ
గడిపిన రోజులెన్నో.
నారదుని ప్రోద్బలంతో
నిశ్చయానికొచ్చిన గణపతి
ధైర్యంగా సమీపించాడు.
ముక్తకంఠంతో మంచిమాటలతో
స్తుతించి ప్రార్థించి సవినయంగా
విన్నవించుకున్నాడు వినాయకుడు.
“ఎక్కడ ఎవరి ప్రయత్నానికి
ఏ విఘ్నం కలగబోయినా
నన్ను ముందు తలచిన వారికి
కన్ను వేసి కాపాడటం
నా జీవిత లక్ష్యం
అది మీరిచ్చిన ఆదేశం
అనుగుణంగా అన్ని విధాలా
యుగయుగాలుగా మీ ఆజ్ఞను
శిరసావహించి పాటిస్తున్నాను.
అనంతకోటి బ్రహ్మాండాలలో
అనేక రకాల లోకాలలో
ఏ జీవికి అవసరమయినా
నేనక్కడ ప్రత్యక్షమయే
ప్రతిభాశక్తులు ప్రసాదించి
నా ధర్మనిర్వహణకి
సహకారం చేసిన మీ దయకి
నా కృతజ్ఞతలు.
ఏ లోకంలోనూ
నన్నాహ్వానించని వారు లేరని
నాశక్తి ప్రభావంతో
విఘ్నాలన్నిటికి విరుగుడు
కలుగుతోందని
నారదులు చెప్పిన మాటలు
మీకూ తెలుసు.
నరలోకంలో మాత్రం
పరిస్థితులు వింతపోకడలు పోతున్నాయని
పలికిన మహాముని మాటలు
కలత కలిగిస్తున్నాయి.
నా గురించి
నానారకాలుగా చెప్పుకుంటున్నారు
నా పుట్టుకని కట్టుకథలుగా కట్టి
వింతలు వింతలుగా వర్ణిస్తున్నారు
పురాణాలు, హరికథలు
నాటకాలు, సినిమాలు.
మీ ధర్మమా అని
నేను పుట్టిన క్షణం ఎవరికీ తెలీదుట
లేకపోతే జాతకాలు వ్రాసి
నా భవిష్యత్తుని కూడా
ఇష్టమొచ్చినట్లు వ్రాసి పారేద్దురు.
నేనొక బ్రహ్మచారినని అపవాదొకటి.
విష్ణుమూర్తి లక్ష్మీదేవులు
నాకిచ్చిన తమ పదారు కన్యకలు
మోద, ప్రమోద, సుభగ, సుందరి,
మనోరమ, మంగళ, కేకిని, కటక,
చారుహాస, నందిని, కమద
వారందరూ నా భార్యలేగా.
మరీచి మహర్షి ప్రేమతో
తన కుమార్తె వల్లభ సిద్ధలక్ష్మిని నాకివ్వలే.
నా ప్రియసఖి పుష్టి
నిత్యం నాదగ్గరే ఉంటుంది కదా
మా రతిరహస్య శృంగారాలను
శిల్ప ఖండాలలో భద్రపరచిన
శిల్పులున్నా రనేకులు.
నాకు ఒకటి కాదు
బోలెడు తలలూ, చేతులూ ఉన్నాయట
నయం, కాళ్ళు మాత్రం రెండే.
వికృత రూపాలుగా చిత్రించారు నన్ను.
ఒక రకం కాదు
పదహారని కొందరు
ఏభయ్యారని కొందరు
ఇష్టమొచ్చిన ఆకారంలో
చేసి పారేస్తున్నారు నా బొమ్మని.
నా రూపమేమిటో నాకే తెలియని
పరిస్థితిలో పెట్టారీ నరమానవులు.
బౌద్ధులు నన్నపహాస్యం
చేసిన విషయం తెలుసుకదా!
నాలాంటి ఆకారాలపై
నాట్యమాడారు వజ్రయాన బౌద్ధులు
అపరాజితట ఆమె నన్నోడించి
నృత్యం చేసిందట నా శరీరంపై.
శ్వేతాంబరులు నాపేరు మార్చి
గౌతముడన్నారు నన్ను
గుర్రమెక్కించి ఊరేగించి.
తాంత్రికులు నాకు తెలియని శక్తులు
నాకున్నాయని
రకరకాల కర్మలు చేయించారు
నన్ను పూజించే మిషతో.
ఈ మధ్యన మరొక విడ్డూరం
నాకు నిజావస్థ లేదుట
మానవుల మనస్సులలో పెరిగిన
కల్పితాకృతినట
తాను పైకి చెప్పుకోలేని
వికృత సహజ ప్రవృత్తులకి తార్కాణంగా
నన్ను ఊహించాడుట నరుడు
తన రతిసంభోగ రహస్యాలకి
తన మన్మథావేశానికి
నా తిండి పద్ధతులు, నా వంకర తొండం
నా వికృతాకారం ప్రతిరూపమట.
నేనొక నపుంసకుణ్ణట
నేనిదని ఒకరు, అదని ఒకరు
ఇది కాదని ఒకరు, అది కాదని ఒకరు
వాదోపవాదాలతో
సంస్కారం లేని సంభాషణలతో
సంస్కృతిని మరచి
తర్జన భర్జన లాడుతున్నారు.
ఈ నరలోకం నా వరాల కర్హమా
అని అనుమానం కలుగుతోంది
ఇది నాలో లోపమా!
తండ్రికేసి చూశాడు, తల్లికేసి చూశాడు.
చవితి నాటి చంద్రుడు చెవినొగ్గి వింటున్నాడు
గణేశుని కేసి చూడటానికే భయం
జ్ఞాపకముంది తనకిదివరకు జరిగిన శాస్తి
తన పదహారు కళలూ
అమృత, మానస, పూష, తుష్టి
పుష్టి, ఆరతి, ధృతి, శనిని,
చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ,
ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత
తన అవివేకం వల్లనేగా
శాశ్వతత్వం కోల్పోయారు.
శివుని జటాజూటంలో
కిక్కురు మనకుండా కూర్చున్నాడు.
తనయుని మనోవ్యథని గమనించిన
పార్వతి హృదయం
శివునిలోనే రెపరెపలాడింది.
కైలాసమంతా నిశ్సబ్దం
సర్వజ్ఞుని ప్రశ్నలకి
సర్వేశ్వరుడే సమాధానం ఇవ్వాలి.
వాత్సల్యం ప్రకటిస్తూ
చిరునవ్వు నవ్వుతూ
పార్వతి హృదయంలోని అనురాగం
తన కనుచూపుల్లో ప్రకటిస్తూ
వినాయకుని రెండు చేతులూ
దగ్గరకు తీసుకున్నాడు.
“నీకే కాదయ్యా
నాకూ కలత కలిగిస్తుందీ నరలోకం.
విష్ణుమూర్తి భూదేవి కిచ్చిన
బహుమానం ఈలోకం.
ఈ భూమిని భూదేవి కూడా
భారంగా భరిస్తుంది
బ్రహ్మ సరస్వతులు
నిత్యావస్థ పడుతున్నారు
ఇంత పెద్ద బ్రహ్మాండంలో
ఆవగింజలాంటి ఈ చిన్న గ్రహాన్ని
చూసుకుని సంరక్షించుకోలేక.
భూలోకపు చరిత్రలు
మనందరికీ అగ్నిపరీక్షలు
శ్వేతవరాహ కల్ప ప్రారంభంలో
శారద కూర్చిన సృజనాత్మక శక్తికి
మంచీ, చెడూ సరిసమానంగా కలిపి
నరజాతిని కల్పించి
నరుడు చేయు ప్రతిసృష్టిని
పరికిద్దాం అద్భుతాన్నని
బ్రహ్మయ్యను ఒప్పించినది
నేనూ, విష్ణుమూర్తే.
సరస్వతి బ్రహ్మలు
కల్పాని కొకసారి
సవరణలు చేస్తూనే ఉన్నారు
సృష్టిస్థితి కార్యక్రమాలకి.
రాబోయే కల్పంలో
మరికొన్ని మార్పులు చేస్తామని
మాటిచ్చి వెళ్ళారు మొన్ననే.
సృజనాత్మక శక్తి
నరుని మస్తిష్కంలో
సవ్యంగా పరిమళించి
వృద్ధి చెందే పణాళిక
ఇంకా పరిపక్వం కాలేదుట.
ఈ కల్పాంతం వరకూ ఓపికపట్టు.
ఈలోపుగా నీకింకా ఏమయినా
శక్తులు కావాలంటే
సర్వశక్తిమయం మీ అమ్మ ఉందిగా.
కావలసినవి అడిగి తీసుకో.
నీరూపం నీకు నచ్చటమే మాకు సంతోషం.
వచ్చే కల్పంలో
మరొక మంచి స్వరూపం కావాలంటే
బ్రహ్మగారికి సిఫార్సు చేస్తా.”
గజాననుని ముఖంలోకి చూశాడు పరమశివుడు
తొండపు మృదుస్పర్శతో
తండ్రిని అంగీకరించాడు.
“నాకిది నచ్చిన రూపం
మీరిచ్చిన రూపం
ఇదే నా శాశ్వత స్వరూపం”
మనశ్శాంతి పొందిన మహాగణపతి
వరగణపతి, విరిగణపతి
చంద్రునికేసి చూశాడు
ఒక చిరునవ్వు నవ్వాడు
చంద్రుని పదహారు కళలు
పరవశించి వికసించాయి.