[ డాక్టర్ జె. బాపురెడ్డి గారు ఒక వంక ఐ.ఎ.ఎస్. ఆఫీసర్‌గా అనేక బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో పనిచేస్తూనే మరో వంక పుంఖానుపుంఖాలుగా సాహిత్య సౌరభాల్ని వెదజల్లిన వారు. దాదాపు ముప్ఫై ఏళ్ళ పైగా సాహితీ వ్యాసంగంలో ఉండి ప్రపంచ దేశాలెన్నిటినో పర్యటించి తన కవిత్వాన్ని, కవిత్వ తాత్వికతని వినిపించారు. ఎన్నో International literary organizationsలో ప్రముఖ పాత్రధారి. ఛందోబద్ధ పద్య కవిత్వం నుంచి గేయ, వచన కవితా స్థితులన్నిటినీ అనుభవించి తన అనుభవాల్ని భావాల్ని హృద్యంగా పాడి వినిపించారు. ఎన్నో కావ్యాలు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రచురించారు. అప్పుడప్పుడు ఆస్టిన్‌కి వస్తున్న కారణంగా వారి కవితలు ఈమాట పాఠకులకు అందించే అవకాశం కలుగుతున్నది. ]
ఉజ్వల సంస్కృతి విరిసిన
ఓ భారత దేశమా!
విశ్వంభర మోము మీద
వెలిగే దరహాసమా!
తరతరాల చరిత్రను
కిరీటముగ పెట్టుకొని
నవయుగ చేతనమునే
కేతనముగ పట్టుకొని
కాలానికి బెదిరిపోని
కలల కోట కట్టుకొని
శతకోటి ప్రజాజీవన
ప్రగతిని నడిపించేవు
ప్రజాస్వామ్య భారతీ!
గాలికేమొ నీవు, వీర
గంధం దట్టించావు
మట్టికేమొ దేశరక్ష
మంత్రం బోధించావు
గులాబీల తోటలకు
ఘోరాటవి బాటలకు
కంటకాల నెదిరించే కళ నేర్పావు
కారుచిచ్చులను ఆర్పే కౌశలమిడినావు!
చెట్టు చేమ గట్టు పుట్ట
చరాచరాలన్నీ
గనులు, వనులు, ఫాక్టరీలు
పంట పొలాలన్నీ
డేగలనే కాదు, కందిరీగలనైనా సరే
వాలనీవు నీ పచ్చని
ఇంటి మీద ఒంటి మీద
దూరనీవు నీ పవిత్ర
వాటికపై, వాకిటిపై!