(వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికా సాహితీ ప్రియులందరికీ చిరపరిచితులు. తనదైన బాణీలో మనం అందరం అనుభవించే, గమనించే విషయాల్నే మనకి కొత్తగా అనిపించేట్లు చెప్పటం వీరి ప్రత్యేకత. వీరి కథలు కొన్ని పాత సంచికల్లో కూడా వచ్చాయి. ఇంతవరకు వాటిని చదవని వారూ, మళ్ళీ చదవాలనుకునే వారూ “పాతసంచికలు” ద్వారా వాటిని చదవొచ్చు. )
శివరాం మామగారికి మామిడి చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు ఇలాటి పురాణకాలం నాటి చెట్లంటే చాలా ఇష్టం. మెడ్రాసులో నాలుగు వందల సంవత్సరాల మర్రిచెట్టు చరిత్ర, గయలో బుద్ధుడు కూచున్న రావిచెట్టు,కాకినాడలో 1923లో తన ఇంట్లో నాటిన బంగినపల్లి మామిడిచెట్టు ఇలా ఎన్ని కథలైనా ఆయన చెప్పగలడు.
అమెరికా తెలుగు వారి ఆచారం ప్రకారం అల్లుడి తల్లిదండ్రులని sponsor చెయ్యకుండా అమ్మాయిని అడ్డుపెట్టి మనవణ్ణీ మనవరాల్నీదగ్గిరుండి చూసుకునే నిమిత్తం ఆ చెట్లన్నీ వదులుకుని శివరాం మామగారు, అత్తగారు అమెరికా వలస వచ్చారు. మధురవాణి సంపాదన నాలుగు రాళ్ళే అయినా, శివరాం సంపాదన కేవలం రెండు రాళ్ళే కనక మామగారికి మరీ ఎక్కువ అథార్టీ వచ్చేసింది.
“పోనీ, నన్నూ రమ్మంటావేమిటయ్యా అల్లుడూ” అన్నారు మామగారు.
“ఎక్కడికీ?” అన్నాడు శివరాం ఎక్కడికో, ఏమిటో తెలిసినా కూడా.
“అదేనయ్యా! అప్పుని కాలేజీలో చేర్పించటానికి”
తన భార్య పేరు లక్షణంగా నాగసుబ్బలక్ష్మి అని ఉండగా .. అది మానేసి మనవరాలికి మన ఇంటా వంటా లేని “అపూర్వ”అనే అస్తవ్యస్తమైన బెంగాలీ పేరో గుజరాతీ పేరో పెట్టారని కూతురి మీద కొంచెం, అల్లుడి మీద చాలా కోపం ఆయనికి. అందులోనూ అమెరికాలో అల్లుడు అప్పులు చేసి బతకడం చూసి ఆ వంకా ఈ వంకా పెట్టి మనవరాలిని అప్పూ అని పిలిచి క్షణం క్షణం ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు శివరాం మామగారు.
“బాగానే ఉంటుందనుకోండి, కానీ అత్తగారు ఒక్కరూ ఇంట్లో ఉండగలరా మనమంతా వెడితే?” అన్నాడు శివరాం. “పైగా ఇప్పటికే చాలా ఖర్చయింది కూడాను..”
“చాల్లే, ఊరుకో శివరాం. అక్కడికి నీ సొంతడబ్బేదో ఖర్చు పెడుతున్నట్టుగా చెప్తున్నావు… అపూర్వకి వాళ్ళే మంచి scholarship ఇచ్చారుగా, మిగిలిందానికి stafford loan తీసుకున్నావుగా .. ఇక నీ చేతినుంచి ఏమవుతోంది ఖర్చు?”
శివరాం భార్యకి ఇండియాలో పెట్టిన పేరు మధురవాణి. అమెరికా రాగానే మధురం తగ్గించేసి ఉట్టి వాణిగా చెలామణి అయింది. తను నాలుగు రాళ్ళు సంపాదించడం మొదలుపెట్టిన దగ్గరినుంచీ మొగుణ్ణి ఏమండీ, మీరూ అనడం మానేసింది వాణి. కాస్త గీరగా కూడా మాట్టాడ్డం మొదలుపెట్టి గీర్వాణిగా మార్చుకుంది పేరు. శివరాం అత్తగారు కూడా ఇదేదో బాగానే ఉందనుకుని ఆయన రిటైరైపోయి గవర్నమెంటు కారూ, డ్రైవరూ, ఇల్లూ పోయి అద్దె కొంపలో పడగానే తను కూడా భర్తని ఏకవచన ప్రయోగం చెయ్యడం మొదలు పెట్టబోతే, “నడ్డి మీద చంపేస్తాను” అని బెదిరించీ, పాతివ్రత్యం కథలు చెప్పీ, బతిమాలీ, శివరాం మామగారు మర్యాదగానే పిలిచే ఒప్పందం చేసుకుని గౌరవం దక్కించుకున్నారు.
ఎలా అయితేనేం, మొత్తానికి శివరాం, గీర్వాణి, మామగారూ, అపూర్వ హ్యూస్టన్ నించి బయల్దేరి ఎక్కడో వర్జీనియాలో విలియమ్ అండ్ మేరీ కాలేజీకి బయల్దేరారు.
“అంత చంటిపిల్ల, గట్టిగా పదిహేడు ఏళ్ళు లేవు.. దానికి ఈ అమెరికా గవర్నమెంటు అప్పు ఇచ్చి .. దాని life అప్పుతో మొదలుపెట్టించడం ఏమిటి నా తలకాయ” వ్యాఖ్యానించాడు శివరాం మామగారు student loan గురించి వినగానే.
Rental car drive చేసుకుంటూ శివరాం Richmond airport నుంచి అపూర్వ కంప్యూటరూ, అరడజను పెట్టెలూ అన్నీ వేసుకుని యూనివర్సిటీకి బయలుదేరాడు. కాలేజీ ఆవరణలోకి ప్రవేశించగానే అక్కడ అంతా చెట్లూ, మంచి వాతావరణం చూసి, “చూశారా, మన Houstonలాగా కాకుండా ఈ వర్జీనియా ఎంత scenicగా ఉందో” అన్నాడు శివరాం.
చుట్టూ తీవ్రంగా కళ్ళతో అన్నీ వెదుకుతున్న మామగారు, “scenic ఏమిటి నా తలకాయ, ఎక్కడా ఒక్క యూనివర్సిటీ బిల్డింగ్ కనపడటం లేదు. అంతా అడివిలా ఉంది .. ఆ వెనకాల ఎక్కడో బిల్డింగ్ కడితే ఎలా కనపడి చస్తుంది, రోడ్డు మీద ఉండాలి గానీ” అని విరుచుకుపడ్డారు.
మొత్తానికి యూనివర్సిటీ సెంటర్‌లో orientationకి వెళ్ళారు నలుగురూ. Reception area లో ఏ forms fill చేయాలో చెప్తున్న జాన్సన్‌ని చూసి “ఈయన ఇంగ్లీషు మేష్టారా?” అనడిగాడు శివరాం మామగారు.
“ఇంగ్లీషు మేష్టారేమిటి?”అనడిగింది మధురవాణి.
“అదేనే.. వీడి చెవులకి రింగులూ అవీ ఉంటేనూ .. ఇక్కడ ఎలాగా తెలుగు మేష్టర్లు ఉండరు గదా.. చెవిపోగులూ, పిలకా పెట్టుకుని ఉంటే ఇతను ఇంగ్లీషు మేష్టరనుకున్నాను” అన్నాడు మామగారు.
“కాదండి.. ఇతను ఇక్కడ second year student. అపూర్వ admission formsకి సాయం చేస్తున్నాడు”
“second year student చెయ్యటం ఏమిటి? ఏ రిజిస్ట్రారో ప్రిన్సిపాలో చెయ్యాలి గాని”
“ఇక్కడ అంతేనండి. Orientation, registration, అన్నీ సీనియర్ కుర్రాళ్ళే చేస్తారు”
“నా మొహంలా ఉంది. ఆఖరికి పాఠాలు కూడా వీళ్ళే చెప్తారా?” కొంచెం అనుమానంగా అడిగాడు.
“అబ్బబ్బ, ఊరుకోనాన్నా! వాటికి మంచి professors ఉన్నారులే. అన్నీ ముందే కనుక్కున్నాం” అంది వాణి శివరాం ఇచ్చిన కాగితాల మీద సంతకం పెడుతూ.
“నువ్వెందుకే అంత కులాసాగా సంతకం పెడుతున్నావు అన్నింటి మీదానూ? అల్లుడు ఒక్కడు చాలడూ అప్పు పుచ్చుకోడానికీ?” వార్నింగు ఇచ్చారు మామగారు.
“Thank you, congratulations. Your registration is complete. Here is your ID.. అదిగో ఆ హాల్లో కూచోండి.. మా యూనివర్సిటీ ప్రెసిడెంటూ, Dean of student affairs, Admissions Dean అందరూ కాసేపట్లో మీకు orientation ప్రారంభిస్తారు”
“అదేమిటయ్యా! డబ్బు కట్టి, చలానా తీసుకోకుండానే admission అయిపోయిందంటాడేమిటి ఈ వెధవ, చెవులికి పోగులూ, ఒంటినిండా పచ్చబొట్లూ వీడూనూ”
“లేదండీ, కట్టవలసిన డబ్బంతా రెండు వారాల క్రితం loans ఇచ్చిన bank వాళ్ళు schoolకి directగా కట్టేశారు. ఇవాళేం అక్కర్లేదు” శివరాం విశదీకరించాడు.
సరే, orientation meeting లో వాళ్ళ కాలేజ్ ఎంత గొప్పదో, studentsని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అన్నీవివరంగా చెప్పి, ఇక మీరు మీ పిల్లల తాలూకు సామాన్లన్నీ వాళ్ళ వాళ్ళ dormsలో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళని కలవడానికి వీల్లేదు. ఎందుకంటే మీ పిల్లలు ఈ క్షణం నించీ మా బాధ్యత. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళి .. నెల నెలా డబ్బు మటుకు పంపిస్తూ ఉండండి.. అని ఆ యూనివర్సిటీ ప్రెసిడెంటూ వగైరాలు గంటన్నర సేపు lecture ఇచ్చారు. అవన్నీ విన్న శివరాం మామగారికి నోట మాట రాలేదు.
“అంత దూరం నించీ ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని మనం ఇక్కడికి తగలడితే ఇక చాలు ఇంటికి పో అంటారేవిటయ్యా!అసలు ఇది నిజమైన యూనివర్సిటీయేనా? ఆ మాటకొస్తే ఇప్పటికి అందరూ కుర్రవాళ్ళే గాని అప్పు గాడికి పాఠం చెప్పే ఒక professor కూడ వచ్చి అది ఏం చదువుతుందీ .. క్లాసులు ఎన్నింటికీ, ఎక్కడా.. ఇలాటివేమీ చెప్పలేదేమిటి?..” ఇలా గిజగిజలాడిపోతున్నాడు మామగారు. శివరాంకీ మధురవాణికీ కూడా కొంచెం బాధగానే ఉంది .. అంత అర్జెంటుగా అపూర్వని అక్కడ వదిలెయ్యడానికి. చేసేదేమీలేక, ఎవడో కుర్రాడి ధర్మమా అని అపూర్వ ఉండే dorms దగ్గరికి వెళ్ళి సామానంతా మూడో అంతస్తులో తన రూంలో పెట్టారు.
“ఏమే, అప్పూ, మీ నాన్నకి ఎలాగా తెలియదేమో గానీ.. మీ hostel warden ఎవరూ, ఆయన ఆఫీసు ఎక్కడా కనుక్కున్నావా?” అని అడుగుతుండగా ఒక తెల్లబ్బాయి, మరొక నల్లమ్మాయిని తీసుకొచ్చింది అపూర్వ రూంలోకి.
“Hi, I am Janice, your daughter’s room mate” అని పరిచయం చేసుకుంది నల్లమ్మాయి.. “ఇదుగో this is Robert, our resident advisor. He is in a room downstairs” అంటూ. ఇంతలోకి శివరాం ఆఖరి బాక్స్ తీసుకుని వచ్చి, మూర్ఛ పోయిన మామగారి మొహం మీద నీళ్ళు జల్లి .. తర్వాత అన్ని విషయాలూ తెలుసుకుని .. ఆయనకి అర్థం అయేలా చెప్పాడు.అమెరికాలో జైళ్ళకే గాని హాస్టళ్ళకి వార్డెన్లు ఉండరనీ, ఆ dorms లో పై రెండు అంతస్తుల్లో ఆడపిల్లలూ కింది రెండు అంతస్తుల్లో మగపిల్లలూ ఉంటారనీ, ఆ తెల్ల కుర్రాడు వీళ్ళందరికీ వార్డెన్ లాటి వాడనీ ఏం ఫరవా లేదనీ ఓదార్చాడు.
మొత్తానికి అమ్మాయిని కాలేజీలో చేర్పించి మళ్ళీ హ్యూస్టన్ వచ్చి పడ్డారు శివరాం, మధురవాణి, మామగారూ.
రాగానే అత్తగారితో అన్నాడు శివరాం, “ఏమండీ.. గత నాలుగు రోజులుగా మామగారు పాపం అదోలా ఉన్నారు.ప్రయాణం, ఆ యూనివర్సిటీ వ్యవహారాల వల్ల అనుకుంటాను. పాపం, ఏమిటో పోగొట్టుకున్న వాడిలా ఎక్కడికి వెళ్ళినా అలా చుట్టూ చూస్తూ, ఏదో వెతుక్కుంటున్నట్టు కనబడ్డారు. కాస్త కనుక్కోండి” అని.
గుంభనంగా నవ్వింది శివరాం అత్తగారు, “అది చిదంబర రహస్యం అల్లుడు గారూ” అంటూ.
“అంటే?”
“అదే… అమెరికా వచ్చిన దగ్గర్నించీ ఆయనకి ఎక్కడా మామిడిచెట్టూ మర్రిచెట్టూ లాటివి కనబడలేదు. ఎక్కడ చూసినా చిన్న చిన్న చెట్లూ, పొదలూ, scenic, scenic అని మీరనుకునే అడివే గాని. అందుకే పాపం ఆయన అలా మామిడిచెట్టు కోసం, మర్రిచెట్టు కోసం, రావిచెట్టు కోసం వెతుక్కుంటూ ఉండి ఉంటారు. అసలు అందుకే ఆయన మీతో కూడా వచ్చింది. టెక్సస్‌లో ఎలాగూ లేవు, కనీసం వర్జీనియాలో నన్నా ఉండకపోతాయా అని!”
టక్కున ముక్కున వేలేసుకున్నాడు శివరాం!