వీళ్ళు, ఆ పెద్ద చిత్రకారులు, ఇలా మహా ముచ్చటగా ఉంటారు. చంద్రగాడు, బాలిగాడు, మోహన్‌గాడు అనుకుంటూ. ఎదురుపడగానే ‘ఒరేయ్ అరేయ్ తురెయ్’ అనుకుంటూ. నాకది ఎప్పటికీ చేతకాదు. బహు మర్యాదగా నేను బాపుగారి బ్యాచ్. ఎంతటి గారి నయినా ఎదురుగా సార్ అనే అంటాను, వాడు వెనక్కి తిరగ్గానే ‘జారే నీయఖ్ఖ బోస్ డికె’ అనడమే కద్దు.

నేను మాదేవి ఇద్దరం గల్సి బువ్వమ్మవ్వ దగ్గర్కి పోతిమి. చల్ల కాలం కదా, స్కూల్ గోడ నీడ బలే సల్లగుంటది. గోడానాంకుని బువ్వమ్మవ్వ సిన్న చక్క పెట్టెలో వక్కో అరలో బటానీలు, రేక్కాయిలు, బుడ్డలు, పత్తి పండ్లు పెట్టుకుని అమ్ముకుంటా ఉంటాది. బువ్వమ్మవ్వ ఏం వయ్సో తెల్దు గాని బాగ ముసిలిగుంటది. నేనైదు పైసలు పెట్టి రేక్కాయలు కొనుక్కుంటి. మాదేవి బుడ్డలు కొనుక్కునె.

ఐదేళ్ళ కిందట ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లందరూ కలిపి కట్టుకున్న హౌసింగ్ సొసైటీలో మాకు పై అంతస్తు అలాట్ అయింది. చెప్పకేం! సంతోషంగానే అనిపించింది. వంటింటి పక్కనుంచి డాబామీదకి వెళ్తే, చిన్నదే అయినా, పనివాళ్ళకోసం కట్టించిన ఒక గది, బాత్రూమ్ అదనంగా దొరికాయి. మేమున్న గవర్నమెంటు ఇల్లు ఎంత విశాలంగా, ఎన్ని వసతులతో ఉన్నప్పటికీ ఇది స్వార్జితంతో కట్టుకున్నది.

లాహోర్‌నుండి రప్పించిన అమ్మాయిల ముజ్రా నాట్యం రహస్యంగా జరిగింది. వాకిట ఇద్దరు తుపాకీలు పట్టుకుని రక్షణ ఇస్తున్నారు. పెషావర్‌లో ఇలాంటి డాన్సులకి అనుమతి లేదు. నలుగురు అమ్మాయిలూ ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టే సినిమా పాటలకి డాన్సులు చేశారు. మగవాళ్ళు డబ్బు నోట్లను వాళ్ళమీద చల్లడం మొట్టమొదటసారి చూశాను.

దిక్కు తోచక దాచుకున్నవన్నీ బయటికి తీసి చూస్తావు. చాకొలేట్ రేపర్, సినిమా టికెట్, రుమాలు, ఎండిన మల్లెపువ్వొకటి, రెండు గవ్వలు, నాలుగు మబ్బులు మూసిన సాయంత్రాలు, కొన్ని పాత పాటలు. చెదలు తినేస్తూ. దేన్నీ రేకెత్తించని, దేన్నీ సూచించని ఈ చెత్తంతా ఎందుకు ఏరిపెట్టుకున్నట్టో అర్థం కాదు. బరువు దించుకుని అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. అప్పుడు తను ఈ భూమ్మీద ఇదే కాలంలో జీవించే తోటి మనిషి.

రాజుగారి ప్రస్తుత పరిస్థితికీ ఈ నడింపిల్లోరి టెంకబాబుకీ ఏదో మెలికుంది. ఏంటదీ? టెంక మాటెత్తితేనే ఈయన ఉలుకులికిపడుతున్నారు. టెంకగారేమో అస్సలు ఏమీ తెలనట్టే వుంటాడు. ఆ బాబు కూడా చాలా మంచోడు. అందరితో కలివిడిగా వుంటూ ఊరికేదో ఉపకారం చేద్దాం అనే బాపతే తప్ప అల్లరి చిల్లర రకం కూడా కాదు. అసలేమై వుంటది?

రాత్రంతా ఒక్క కునుకైనా తీస్తే ఒట్టు. టెన్షన్… టెన్షన్. ఎప్పుడూ లేనంత ఉద్వేగం. యామిని నించి ఏ క్షణాన ఏ కబురొస్తుందో అని భయం. గుండె దడ. ఏదో జరగరానిదే జరిగుంటుందని మనసు పదే పదే సూచిస్తోంది. లేకపోతే ఇంటికెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పినా, చేయలేదంటే అర్ధం? రాత్రంతా అది కూడా నాలానే మానసిక క్షోభననుభవించి వుంటుంది. కోపంతో శ్రీధర్ అన్నయ్య యామిని మీద చేయి చేసుకోలేదు కదా?

తొలిరోజే నేనామెను గమనించాను. ఆమెది హృదయాన్ని కట్టిపడేసే అందం కాదు. అయితే ఆకర్షణీయంగా ఉంటుంది. చిక్కని ఆకుపచ్చ రంగు కళ్ళు. ఆమె ఒంటి చాయని మంచు దేశపు మనుషులకుండే తెలుపు చాయ అనలేము. ఇలాంటి మేనిచాయ కోసమే ఐరోపా దేశాల ఆడవాళ్ళు తూర్పు దేశాల సముద్రతీరాలకెళ్ళి గుడ్డపేలికలు చుట్టుకుని మండే ఎండలో అష్టకష్టాలు పడుతుంటారు అని చెప్తే మీకు అర్థం అవుతుంది.

కొన్ని ప్రశ్నలూ జవాబులూ అవుతూండగానే ఆకర్షణ వల్ల ఒంట్లో విద్యుత్తు, దాన్నుంచి చెంపల్లో వేడి, కళ్ళలో మెరుపులు, పెదాల మీద నవ్వులూ. కొన్ని మాటల్లో తెలిసీ, కొన్ని మాటల్లేకుండానూ. చేతులు పట్టుకుని నడకలు, అర్థాలతో బరువెక్కిన మాటలు, ఊహలతో మత్తెక్కిన కళ్ళూ, కొన్ని ‘మిస్ యూ’లూ చేతికి అందేంత దూరంలో ఆశగా. మరికొంత దూరంలో ఒళ్ళు విరిచే ఉద్రేకాలూ బిగి కౌగిలింతలూ తడి ముద్దులూ.

గురువారం సంత కాడ, దొమ్మరాటొచ్చిందని, సూత్తాకెల్తంటే, రొప్పుకుంటా ఎదురొచ్చిన చిర్రావూరి పంతులుగారబ్బాయి బద్రం, “ఉరేయ్ ఈర్పినోరి చిన్న శీనుగాడు ఎర్ర కాలవలో కొట్టుకు పోతన్నాడంట” అని చెప్పి అదే పోత పొయ్యాడు. నేనూ ఆడెనకాలే పరిగెట్టుకుంటా పోయా. ఆయిలు కొట్టు తాతాలు గారి పెద్దరగుల వీధి గుండా పోతే దెగ్గరని అటేపునుంచి పోతంటే, అప్పుడెదురొచ్చాడు చిన్న శీనుగాడు.

అతను మిలిటరీలో పని చేసినవాడన్న సంగతి చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది. దృఢమైన దేహం, తగిన ఎత్తు. ముఖం మాత్రం అప్పుడే ఎవరినో కొరికేసి వచ్చినవాడిలా ఉంటుంది. అయితే ఆ పూట మాత్రం దరహాసాన్ని తెచ్చిపెట్టుకుంటూ ‘తన కొడుకు పెళ్ళి ఏర్పాట్లకని పందిళ్ళవీ వేశామనీ, శ్రమ కలిగించుతున్నందుకు క్షమించమనీ; కారు వీధి చివర్లో పెట్టి ఇంటికి నడిచి రమ్మనీ’ ప్రాధేయపడ్డాడు.

అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. మధ్యాహ్నం 3:15.
ఇంకో నలభై ఐదు నిమిషాలు ఉంది విద్య రావడానికి.
అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 3:20. 2016 మార్చి 27 అది.
అంటే మూడు రోజుల్లో విద్య బర్త్‌డే.
అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 3:48. 2016 సెప్టెంబర్‌ 27.
అంటే మూడు రోజుల్లో తన బర్త్‌డే.

ఓ పక్కన వంటలైపోతున్నాయ్. అంటించాల్సిన మైదా వుడుకుతోంది. మరో మూల గడ్డిమంట మీద డప్పులు వేడి పెడుతున్నారు. మా శీనుగాడు గుర్రం తోకలోంచి వెంట్రుక పీకే ప్రయత్నం చేశాడు. గుర్రం ఒక్కసారి తుళ్ళిపడి భయంతో సకిలించింది. అంతే! మున్సిపల్ గ్రౌండ్స్ హద్దులు దాటేదాకా తరిమారు. బతుకు జీవుడా అని బయటపడ్డాం. ఇహ మాకు అవే కబుర్లు. ఎవడి అనుభవాలు వాడు తవ్వుతున్నాడు.

భళ్ళున బద్దలయిందది. పొరపాటున జారిపడిందా కావాలని విసిరికొట్టిందా తెలియదు. మిటకరించిన కళ్ళలో భయం లేదు. ఏం చేస్తావో చేయి అన్నట్టు నిల్చుంది మూడడుగుల ఎత్తుగా. పెదాల చివర్లలో నవ్వొలుకుతుందా? దాన్ని తాకొద్దని ఆమె వారిస్తూనే ఉంటుంది. చాలా ప్రియమైనది అది. చెదిరిన ముక్కలన్నీ ఏరుతూంటే ఏడుపు ముంచుకొచ్చింది.

జిరాఫీ విజిటర్స్ వంక తూస్కారంగా చూసి నాలుగు ఆకులు పీకి చపక్ చపక్ మని నముల్తోంది కారా కిళ్ళీ నమిల్నట్టు. ఏనుగులు నిద్రలేచి దుమ్ము స్నానాలు చేస్తన్నాయి. పక్కన్నే తొట్లల్లో నీళ్ళు. ఎన్నియల్లో మల్లియల్లో అని పాడుకుంటా తానాలు చేసుంటాయి చిన్నప్పుడెప్పుడో అడవుల్లో. వాటిని పాపం ఎర వేసి. వల వేసి. పట్టార్రా మామా.

ఘుమఘుమలాడే కాఫీ కప్పు కళ్ళకెదురుగా పట్టుకుని చరిత నా ముందు ప్రత్యక్షమై నా పరధ్యానం పోగొట్టింది. తనను చూసినప్పుడల్లా నన్ను భర్తగా స్వీకరించి నాకు ఈ విశ్వాన్ని బహుకరించినట్టు ఉంటుంది. పెళ్ళై ఐదేళ్ళైనా నాకు చరిత ఎప్పుడు ఒక విచిత్రమైన స్వప్నంలా ఉంటుంది. తన కళ్ళకో విశ్వసంగీతం తెలిసినట్టు ఉంటుంది.

నాకప్పుడు పాకిస్తాన్‌లోని ఈశాన్య మూలనున్న పెషావర్‌లో ఉద్యోగం. ఆరోజుల్లో నాకొక వంటమనిషి కావలసి వచ్చాడు. మనిషంటూ దొరికితే, అతని పని చాలా సులువుగానే ఉంటుంది, సందేహం అక్కరలేదు. వంట చెయ్యాల్సింది నా ఒక్కడికి మాత్రమే. ఉదయం అల్పాహారం నేనే చేసుకుంటాను. టోస్ట్ చేసుకుని బ్రెడ్‌కి వెన్న రాసుకోడానికీ తినడానికీ నాకు సరిగ్గా నాలుగు నిముషాలు సరిపోతుంది. మధ్యాహ్నానికీ, రాత్రి భోజనానికే ఇబ్బంది.

ప్రాణసఖిగా అతని జీవితంలోకి ప్రవేశించి, ప్రేయసిగా మారిన ఆమె ఉన్నట్టుండి ఒకనాడు తన జీవితాన్నుండి అతన్ని బహిష్కరించింది ఎందుకెందుకెందుకెందుకని అడిగేందుకు వీలివ్వకుండానే. ఒకే చరణం పదే పదే పాడే అరిగిపోయిన గ్రామఫోను రికార్డ్ లాగా ఆమెనూ, ఆమె జ్ఞాపకాలనూ మించి ఆలోచించలేకపోయాడు అతను.

వీటిలో కొమ్మూరి ఎక్కడున్నారో? కొవ్వలి ఎక్కడున్నారో? ఎంతోమంది నేరస్థులని ఒంటి చేత్తో మట్టికరిపించిన ఆ డిటెక్టివ్ యుగంధర్ రుబ్బురోట్లో నలిగిపోతుంటే… పాపం ఎంత యమయాతన పడ్డాడో. అయ్యో… అయ్యో… ఆ క్రిజ్లర్ కారు ఎలా పచ్చడయిపోయిందో? విక్రమార్కుడి భుజంమీది ఆ భేతాళుడన్నా చెట్టెక్కి తప్పించుకున్నాడా? లేకపోతే వాడూ రోట్లో పడి పచ్చడయిపోయేడా?

ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణ స్నేహితులయిపోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు. బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా.