అల్లదివో సూశారా! అనపడతాంది కాలవ, ఆయ్! అది మాసేలకి నీల్ల కోసం తెల్లోళ్ళు తొవ్వించినదండి. ఇది పంట కాలవండి. పెద్ద కాలవమీద మాకోసమే లాకోటి కట్టిచ్చారండి. రెండు పంటలకి నీటికి కొఱవ లేదండి. ఆయ్! ఇక్కడ మొదలండి, ఇదిగిదిగో! ఇటు సూడండి. అల్లదిగో సింతసెట్టండి, అది దచ్చిన సరద్దండి, అల్లాపడతన్నాది కొబ్బరి సెట్లొరస, అదండి పచ్చిమ సరద్దు, ఆయ్! ఇటు సూడండి తాడిసెట్ల గుంపు, అదండి ఉత్తర సరద్దు.

“మొదటిసారి సుజాత ఇచ్చిన పాయసం వల్ల నా ప్రాణలు నిలిచి గౌతముడినైన నేను జ్ఞానోదయంతో ధర్మాన్ని కనుక్కోగలిగాను. ఆ రోజు సుజాత పాయసం ఇచ్చి ఉండకపోతే తథాగతుడే లేడు. బుద్ధత్వం పొందాక ప్రారంభించిన ధర్మ చక్ర పరివర్తనం ఈ రోజుకి దాదాపు పూర్తైంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు; ప్రతీ ప్రాణీ అంతమై తీరుతుంది. ఆ క్రమంలోనే ఈ పరివర్తనం అనేది ఎప్పుడో ఒకసారి అంతమవ్వవల్సిందే కదా?”

ఇది తెలుగులో ఎలా పుట్టింది? మీకు తెలియనిది ఒకటి ఉంది. అదేమిటంటే ఇదే సమయంలో అమెరికన్లు కూడా మీలానే ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఇక ర్యాండమ్ హౌస్, మెక్‌మిలన్, పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ వంటి పెద్ద పెద్ద ప్రచురణ సంస్థల్లోని పెద్ద తలకాయలెన్నో తెగిపడబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం వారికీ తెలియక, అవసరం తీరేలోపు వారికది దొరకక.

“ఎవరు మీరు? ఏం కావాలి?” అడుగుతుంది వరండాలోకి వచ్చిన ఆమె. ఆమెని గుర్తు పట్టాడు. “మీతో మాట్లాడాలి!” నిలబడలేక అక్కడే ఉన్న కుర్చీ వైపు చూస్తుంటే, “కూర్చోండి!” అని చెప్పింది. “మీరు కూడా కూర్చోండి!” కూచుంది అతని వైపే చూస్తూ “ఏ విషయం? కాలేజ్ విషయమయితే మీరు ఆఫీసుకు వచ్చి అక్కడే మాట్లాడండి.” “కాదు. పర్సనల్. మీకు నాగేంద్ర గుర్తున్నాడా? డిగ్రీ మొదటి ఏడు.”

మనం అంటున్నావ్. మనం అంటే ఎవరు? నువ్వూ, నేనూ మన పిల్లలూనా? మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళకి తల్లిదండ్రులమైన మనల్ని వాళ్ళ లిస్టు లోంచి తీసేస్తారు. కనుక మన లిస్టులో వాళ్ళని వేసుకున్నా వాళ్ళు మనల్ని వేసుకోరు. ఇంక మిగిలింది నువ్వూ నేనూ. ఇప్పుడు ఆలోచిద్దాం. నన్ను కన్న తల్లిదండ్రులు నా కుటుంబ పరిధిలోకి రారు. నేను కన్న పిల్లలు నన్ను వాళ్ళ పరిధిలోకి రానీయరు. ఇంక కేవలం నువ్వు మిగిలావ్.

శ్రీనివాసరావు కాకుండా ఆరోజు మరో ఇద్దరు బాగ్దాద్ నుంచి అదే విమానంలో బొంబాయి వెళ్తున్నారు. అందులో శివస్వామి తెలుగువాడే. “కల్సే వెళ్దాం” అన్నాడు శ్రీనివాసరావుతో. శ్రీనివాసరావు “మనం కల్సిరాలేదు. కల్సి వెళ్ళడం ఎందుకు?” అన్నాడు. శివస్వామి అసలే నాస్తికుడు. ఇనుముతో ఉన్న నిప్పుకి సమ్మెట పోట్లు తప్పవు. అతని దురదృష్టం తనకి అంటుకొంటుంది అనుకొన్నాడు శ్రీనివాసరావు.

అది కాదురా ఆక్సిడెంట్. మొన్న మ్యూజియం దగ్గర కాలేజీ పిల్ల పోయిందే అది. పెట్రోల్ బంక్ ఎదురుగా. పెట్రోల్ ఫిల్ చేసుకుని తుర్రుమని రోడ్డుమీదకి దూసుకొచ్చింది టూవీలర్ మీద ఎడం వేపు చూసుకుంటూ. కుడివేపు నుంచి వాటర్ టాంకర్ 304A మచ్చ వేసేసింది రోడ్డుమీద. ఆ దెబ్బకి హెల్మెట్, నో హెల్మెట్ మేక్స్ నో డిఫరెన్స్. అసలీ టాంకర్ డ్రైవర్స్‌కి నీటితో నిండి ఉన్న బండి డైనమిక్స్ అర్థంగాదు.

రాజా! నువ్వు ఇంత కష్టపడటం వెనక నీ ఉద్దేశం తెలియకపోవటానికి, నేనేమీ రాజకీయనాయకుల ఉపన్యాసాలు నమ్మి ఓటు వేసే ప్రజల్లో ఒకడ్ని అనుకోకు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో అలాంటి వాళ్ళని ఎలా గద్దె దింపాలో తెలిసిన ఓటర్లలాంటివాడిని నేను. నీ పన్నాగాన్ని తిప్పికొట్టటానికి ఓ కథ వినిపిస్తాను. నేనో సూర్యతేజాన్ని అనుకుని, నన్ను నీ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకుండా కారును జాగ్రత్తగా నడుపు.

ఈ ఆలోచనతో సిద్ధార్థుడికి మరింత పట్టుదల, ఓపిక అంకురించాయి. గిన్నెలో పాయసం పూర్తిగా తిన్న కాసేపటికి, ఆహారం తిన్న తనని జ్ఞానమార్గంలోంచి భ్రష్ఠుడైనట్టు భావించి దూరంగా కదిలిపోతున్న అయిదుగురు శిష్యులూ కనిపించారు. మరోసారి చిరునవ్వు గౌతముడి మొహంలో. పోనీయ్. ఈ జీవితంలో తాను జ్ఞానం సంపాదించనంతవరకూ ఎవరికీ ఏ ఉపదేశం చేయలేడు. ఎవరికెవరు? కోహం? కోహం? ఇదీ తాను మొదట తాను తెలుసుకోవల్సినది.

రాత్రి ఎక్కడికీ పోదు, గమనించావా? మిట్ట మధ్యాహ్నం పూట కూడా. అనంతమైన ముక్కలుగా, అది అన్నిచోట్లా దాక్కొని ఉంటుంది. ఒక చెట్టు ఆకు ఎత్తి చూడు. దానికింద దాక్కుని ఉన్న చీకటి వీచిక ఒకటి తటాలున వేరులోకి పాకిపోయి తలదాచుకుంటుంది. ఎటుచూసినా– నడవాల లోపల, గోడల వెనుక, ఆకుల కింద–రాత్రి, ముక్కలైపోయి పీలికలుగా తచ్చాడుతూ ఉంటుంది.

మానవాళిలో విస్తరిల్లిన ద్వేషాన్ని నేను ఇంధనశక్తిగా మారుస్తాను. అస్థిమూలగతమైన ద్వేషాన్ని లోలోపలే ఆపుతున్న ఆ తలుపులు మనం తెరచి, దానికి అడ్డు లేకుండా సమాజంలోకి ప్రవహించనిస్తే, ఈ పచ్చ బొగ్గు–అవును, పచ్చగా పసరులాగా మనలో పేరుకుపోయే ఈ పైత్యరసప్రకోపితద్వేషాన్ని, నేను పచ్చబొగ్గు అని పిలుస్తున్నాను–మన కర్మాగారాలను మళ్ళీ నడిపిస్తుంది.

మరుసటి రోజు, వాళ్ళమ్మాయి రాత్రికి రాత్రి మాయమైపోయిందని తెలుసుకున్నాక, వాడి అత్తవారింట్లో పెద్ద గొడవ మొదలైంది. ఒక వారం వరకూ ఆమె కోసం అక్కడా ఇక్కడా వెతికారు. ఎవరికీ ఈ సంగతి గురించి తెలియనివ్వలేదు. కానీ తర్వాత, అమ్మాయి వాళ్ళ అన్నయ్య నా దగ్గరకి వచ్చాడు. అతడికి తోడుదొంగనైనట్టు మొత్తం కథ చెప్పుకు రావాల్సి వచ్చింది.

ఇప్పటికీ ఆరోజుని తల్చుకుంటే గుండె మెలిపెట్టినట్టుగా ఉంటుంది–నా పెదాలతో ఆమె పెదాలని అందుకోవాలని ముందుకు వంగాను, అలవాటుగా ఆమె కళ్ళలో వాడికోసం చూశాను. ఆ కనురెప్పల కిందగా కనిపించి చేయి ఊపాడు. వాడి కళ్ళల్లో ప్రయత్నపూర్వకంగా దాచుకుంటున్న విషాదం. చప్పున వెనుతిరిగి ఆమె కంటిపాప లోలోపలికి పరుగెత్తిపోయాడు.

ఇవి సాధారణమైన వెండినాణేలు– గుండ్రటి అంచులు, అచ్చుపోసిన అంకెలు, తగరపు మెరుగు. అయితే, వాటి మీద ఏదో కంటికి కనిపించని ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. కొత్తవాళ్ళకి శ్మశాన శాంతిని ప్రసాదించే ఆ నాణేలు మాత్రం విశ్రాంతిని ఎరగవు. వాటిల్లో ఉన్న ఏదో దురద వాటిని చేతి నుంచి చేతికి, పర్సు నుంచి పర్సుకీ మార్చుతూనే ఉంటుంది. ఎంతవరకూ అంటే… అహా అలాకాదు, మొదటినుంచీ వరసలో వద్దాం.

సాయంత్రం గంగా హారతికి ఇంకా సమయముంది. ముగ్గురం ఒక చోట కూర్చున్నాం. అతను విదేశీయుడిలా కనిపించలేదు. ఆమె చెప్పినట్టుగానే భారతీయతను కలవరించి, భారతీయతను తొడుక్కున్న వ్యక్తిగానే ఉన్నాడు. ఇద్దరి ముఖాల్లో అనిర్వచనీయమైన ఆనందం. మురళి కూడా వచ్చిఉంటే ఎంత బావుణ్ణు అనిపించిందోక్షణం. పక్కనే కలకలం వినిపించి చూస్తే ఒక ఏడాది పాపాయి పాకుతూ గంగా ప్రవాహపు అంచు వరకూ వెళ్ళింది.

ఒక్కసారి గుండె మీద వేయి శతఘ్నుల పోటు. ఊపిరి అందడం లేదు ఇవాన్‌కి. పెద్ద గోతిలో పడిపోతూండగా చివర్లో కనిపించిన ఓ వెలుగు. ఓ పక్కకి వేగంగా వెళ్తూంటే నిజంగా అటుగాక మరో వ్యతిరేక దిశలో వెళ్తూన్న భావన. ‘హమ్మయ్య, ఇదేదీ నిజం కాదన్నమాట. సరే మరేది నిజం?’ ఇవాన్ మనసులో కొత్త ఆలోచన రూపు దిద్దుకోవడం తెలుస్తోంది, అన్నింటినీ ముంచేసిన కొత్త నిశ్శబ్దం లోంచి.

మనుషులు మనుషులని చంపారు. ఆడవాళ్ళని చెరిచారు. భవనాల్లోని ఎండిన కట్టెలు, నోరులేని ఇటుకలను కూడా అదే చేశారు. ఆ తుఫానులో ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టారని, వారి రొమ్ములను కోశారని విన్నాడు. అతడు చుట్టుపక్కల చూస్తున్నవన్నీ నగ్నంగా, ప్రాణం లేకుండా తెగి పడున్నాయి.

ఒక్క టూ మినిట్స్ టైమ్ ఇవ్వండి సార్. టోటల్ ప్రోజక్ట్ డిటైల్స్ చెప్పేస్తాను. ఎకరాకి ఎనభై మొక్కలు వేస్తాం. ఫస్ట్ క్రాప్ పదకొండు నెలకొస్తుంది. కానీ… అది వేసే పిలకలు పెరిగి పెద్దయి గెలలేస్తే, ప్రతి మూడు నెలలకీ ఓ క్రాప్‌లా అనిపిస్తుంది. యావరేజిన ఏడాదికి ఫోర్ కటింగ్స్. ఎలా లేదన్నా గెలకి వంద పీసులుంటాయి. ప్రభుత్వం ‘లెవీ’కి యాభై పళ్ళు తీసేసినా, జస్ట్ టూ లాక్స్ మీవి కాదనుకుంటే… మీ టూ హండ్రెడ్స్ ఫ్రూట్స్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీక్వెల్టూ… లెక్కేసుకోండి!

“ఏంటో ఇక్కడంతా చీకటి చిక్కగా భయంగా ఉంది.” అందామె.

ఆచితూచి అడుగులేస్తూ తలుపు దగ్గరకి చేరుకుంది.

“అబ్బా, ఈ తలుపెంత బరువుగా ఉందో!”

అంటుండగానే భళ్ళున లోపలి వైపుకి తెరుచుకుంది బరువైన ఆ తలుపు.

మనకి రైళ్ళంటే రైలు బండి. రైల్స్ మీద నడిచే బండి. మనకి రైళ్ళంటే రైల్స్ కావు. ఆ రైళ్ళలో స్లీపర్ లుంటాయి. ఈ రైల్సు కిందా స్లీపర్ లుంటాయి. దీనర్ధం catwalk అంటే తెలియని వాళ్ళకి అర్ధం కాదు. Catwalk అంటే పిల్లినడకలని, haven అంటే స్వర్గధామం అని అనువాదం చేసే మన జర్నలిస్ట్‌లకి, చానలిస్ట్‌లకీ ఎప్పటికీ అర్ధం కాదు.