ఒకసారి… కాస్త కనికరం ఉన్న రజాకారు ఒకడు సహరన్‌పూర్‌లో ఇద్దరు అమ్మాయిలు పాకిస్తానులో ఉన్న అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళడానికి నిరాకరించారని, వాళ్ళని అక్కడే ఒదిలిపెట్టేశానని నాకు చెప్పాడు. జలంధరులో ఒక అమ్మాయిని తాము బలవంతాన తీసుకెళ్ళినప్పుడు, అక్కడున్న కుటుంబాలన్నీ ఎవరి ఇంటి కోడలో దూరప్రయాణానికి వెళ్తున్నట్టు వీడ్కోలు చెప్పారని, ఒక రజాకారు చెప్పాడు.

మేకకి సంబంధించినంతవరకూ చావు అనేది, కత్తికీ దాని కుత్తుకకీ మధ్య కార్యకారణ సంబంధం. ఇందులో వాదోపవాదాలకీ తర్కోపతర్కాలకీ తావు లేదన్నది కత్తిమేక ప్రగాఢ విశ్వాసం. చావుని దూరం లాగో, భారం లాగో, కాలం లాగో, వేగం లాగో కొలవడం సాధ్యం కాదని, అన్నీ కలగలిపిన ఓ క్రొత్త ప్రక్రియని కనిపెట్టాలని, చావుని బెత్తడు దూరం నుంచి తప్పించుకొన్నప్పుడే కత్తిమేక నిశ్చయించుకొంది.

పెద్దోడు ఆ ఎర్రరంగు బాల్‌ను గట్టిగా తన్నాడు, ఈ చిన్నోడు దాన్ని ఆపలేక దాని వెనకాలే పరుగెత్తాడు. ఇద్దరూ నైట్‌ప్యాంట్లు వేసుకున్నారు. ఇద్దరి కాళ్ళకూ బూట్లు ఉన్నాయి. పెద్దోడు నల్లచొక్కా తొడుక్కుంటే, చిన్నోడు టీ షర్ట్‌ వేసుకున్నాడు. చిన్నోడికి మొన్న మొన్నే హెయిర్‌ కట్‌ చేసినట్టుగా కొంత మొండి తల కనబడుతోంది. పెద్దోడి బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి. వాడు పరుగెత్తినప్పుడు వాడి నల్లటి జుట్టు కూడా వాడిలాగే గంతులేస్తోంది.

కరుణను ఎన్నో విషయాలు బాధపెట్టేవి. తను ఒక్కతే కూతురు. చిన్నతనం చాలా వరకూ ఒంటరిగానే గడిచింది. వాళ్ళ నాన్నకు జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు, రోజు రోజూ చావుకు దగ్గరవుతూ చివరికి ఒకరోజు చచ్చిపోయినప్పుడు, తనకు ఎవరూ తోడు లేరు. తనకు అన్న, తమ్ముడు అంటూ ఎవరూ లేరు. ఆ లోటు పూరించడంలో తనకు బాగా దగ్గరగా వచ్చింది నేను, శ్రీనివాస్ మాత్రమే.

భగవానుడి ఎదురుగా పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్న నందుడికి మొదటగా కనిపించినది, కాలుతున్న ఇనప స్తంభం. దానిమీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఒక కోతి. స్తంభం మీద చేయి వేసినప్పుడల్లా కోతి చేయి కాలుతోంది. చేయి వెనక్కి తీసుకోవడం మళ్ళీ మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కోతి కాళ్ళూ చేతులూ నోరూ చెవులూ కాల్తున్నాయి.

నేతల తలకోతలు: నాయకులు బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారనేది నిజం కాదు. అలా అంటున్నారూ అంటే మన రాజ్యాంగపు చట్టాలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాటే. నాయకులను ప్రజలతో నిజంగా కలిపే బంధం మన చట్టాల నిజమైన అర్థం, ఆశయం. నేతల తలలే తెగిపడతాయి ఎందుకూ అంటే తెగిపడడానికి సిద్ధపడని తల ఒక సమాజానికి పెద్దతల కాలేదు.

పోతూ వస్తూ దాటేసుకుంటూనే ఉంటాం. కానీ ఇంతకాలమైనా పరిచయం కాకుండా ఎందుకు ఉండిపోయింది? మనతో ప్రత్యేకించి పని పడకపోతే, ఉద్యోగరీత్యా సంభాషించుకోవాల్సిన అవసరం రాకపోతే ఎలా పరిచయం అవుతుంది? పనిగట్టుకొని పరిచయం చేసుకోవడంలో నాకు ఉత్సాహం లేదు. జరిగిపోవాలంతే. మన చుట్టూనే జీవితాలు ప్రవహిస్తూవుంటాయి. మనం వాటిని ఖండించుకుంటూనో, ఒరుసుకుంటూనో పోము. అసలు ఆ ప్రవాహానికీ మనకూ నిమిత్తమే లేదు. ఇదెంత శూన్యం?

“నేనెందుకు మరొకరి దగ్గర సాయం అడగాలి? ఇది నా బాధ్యత కదా? చెట్టుకు మధ్య భాగమే బలం. గట్టిబడి ఉక్కులా ఉంటుంది. ఆ చెట్టులో మొట్టమొదటి భాగమూ అదే. అయితే చెట్టుకి కావలసిన ఆహారాన్ని సరఫరా చెయ్యడం ఆ భాగంవల్ల కాదు. చెట్టుయొక్క తాట భాగమే ఆహారాన్నీ నీటినీ సరఫరా చేస్తుంది. ఆ భాగం లేతది, వయసులో చిన్నది. మనుషులూ అంతే. పెద్దలు కుటుంబానికి బలం. కొత్తతరం వాళ్ళే సంపాదనలవీ చూసుకోవాలి.”

అల్లదివో సూశారా! అనపడతాంది కాలవ, ఆయ్! అది మాసేలకి నీల్ల కోసం తెల్లోళ్ళు తొవ్వించినదండి. ఇది పంట కాలవండి. పెద్ద కాలవమీద మాకోసమే లాకోటి కట్టిచ్చారండి. రెండు పంటలకి నీటికి కొఱవ లేదండి. ఆయ్! ఇక్కడ మొదలండి, ఇదిగిదిగో! ఇటు సూడండి. అల్లదిగో సింతసెట్టండి, అది దచ్చిన సరద్దండి, అల్లాపడతన్నాది కొబ్బరి సెట్లొరస, అదండి పచ్చిమ సరద్దు, ఆయ్! ఇటు సూడండి తాడిసెట్ల గుంపు, అదండి ఉత్తర సరద్దు.

“మొదటిసారి సుజాత ఇచ్చిన పాయసం వల్ల నా ప్రాణలు నిలిచి గౌతముడినైన నేను జ్ఞానోదయంతో ధర్మాన్ని కనుక్కోగలిగాను. ఆ రోజు సుజాత పాయసం ఇచ్చి ఉండకపోతే తథాగతుడే లేడు. బుద్ధత్వం పొందాక ప్రారంభించిన ధర్మ చక్ర పరివర్తనం ఈ రోజుకి దాదాపు పూర్తైంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు; ప్రతీ ప్రాణీ అంతమై తీరుతుంది. ఆ క్రమంలోనే ఈ పరివర్తనం అనేది ఎప్పుడో ఒకసారి అంతమవ్వవల్సిందే కదా?”

ఇది తెలుగులో ఎలా పుట్టింది? మీకు తెలియనిది ఒకటి ఉంది. అదేమిటంటే ఇదే సమయంలో అమెరికన్లు కూడా మీలానే ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఇక ర్యాండమ్ హౌస్, మెక్‌మిలన్, పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ వంటి పెద్ద పెద్ద ప్రచురణ సంస్థల్లోని పెద్ద తలకాయలెన్నో తెగిపడబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం వారికీ తెలియక, అవసరం తీరేలోపు వారికది దొరకక.

“ఎవరు మీరు? ఏం కావాలి?” అడుగుతుంది వరండాలోకి వచ్చిన ఆమె. ఆమెని గుర్తు పట్టాడు. “మీతో మాట్లాడాలి!” నిలబడలేక అక్కడే ఉన్న కుర్చీ వైపు చూస్తుంటే, “కూర్చోండి!” అని చెప్పింది. “మీరు కూడా కూర్చోండి!” కూచుంది అతని వైపే చూస్తూ “ఏ విషయం? కాలేజ్ విషయమయితే మీరు ఆఫీసుకు వచ్చి అక్కడే మాట్లాడండి.” “కాదు. పర్సనల్. మీకు నాగేంద్ర గుర్తున్నాడా? డిగ్రీ మొదటి ఏడు.”

మనం అంటున్నావ్. మనం అంటే ఎవరు? నువ్వూ, నేనూ మన పిల్లలూనా? మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళకి తల్లిదండ్రులమైన మనల్ని వాళ్ళ లిస్టు లోంచి తీసేస్తారు. కనుక మన లిస్టులో వాళ్ళని వేసుకున్నా వాళ్ళు మనల్ని వేసుకోరు. ఇంక మిగిలింది నువ్వూ నేనూ. ఇప్పుడు ఆలోచిద్దాం. నన్ను కన్న తల్లిదండ్రులు నా కుటుంబ పరిధిలోకి రారు. నేను కన్న పిల్లలు నన్ను వాళ్ళ పరిధిలోకి రానీయరు. ఇంక కేవలం నువ్వు మిగిలావ్.

శ్రీనివాసరావు కాకుండా ఆరోజు మరో ఇద్దరు బాగ్దాద్ నుంచి అదే విమానంలో బొంబాయి వెళ్తున్నారు. అందులో శివస్వామి తెలుగువాడే. “కల్సే వెళ్దాం” అన్నాడు శ్రీనివాసరావుతో. శ్రీనివాసరావు “మనం కల్సిరాలేదు. కల్సి వెళ్ళడం ఎందుకు?” అన్నాడు. శివస్వామి అసలే నాస్తికుడు. ఇనుముతో ఉన్న నిప్పుకి సమ్మెట పోట్లు తప్పవు. అతని దురదృష్టం తనకి అంటుకొంటుంది అనుకొన్నాడు శ్రీనివాసరావు.

అది కాదురా ఆక్సిడెంట్. మొన్న మ్యూజియం దగ్గర కాలేజీ పిల్ల పోయిందే అది. పెట్రోల్ బంక్ ఎదురుగా. పెట్రోల్ ఫిల్ చేసుకుని తుర్రుమని రోడ్డుమీదకి దూసుకొచ్చింది టూవీలర్ మీద ఎడం వేపు చూసుకుంటూ. కుడివేపు నుంచి వాటర్ టాంకర్ 304A మచ్చ వేసేసింది రోడ్డుమీద. ఆ దెబ్బకి హెల్మెట్, నో హెల్మెట్ మేక్స్ నో డిఫరెన్స్. అసలీ టాంకర్ డ్రైవర్స్‌కి నీటితో నిండి ఉన్న బండి డైనమిక్స్ అర్థంగాదు.

రాజా! నువ్వు ఇంత కష్టపడటం వెనక నీ ఉద్దేశం తెలియకపోవటానికి, నేనేమీ రాజకీయనాయకుల ఉపన్యాసాలు నమ్మి ఓటు వేసే ప్రజల్లో ఒకడ్ని అనుకోకు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో అలాంటి వాళ్ళని ఎలా గద్దె దింపాలో తెలిసిన ఓటర్లలాంటివాడిని నేను. నీ పన్నాగాన్ని తిప్పికొట్టటానికి ఓ కథ వినిపిస్తాను. నేనో సూర్యతేజాన్ని అనుకుని, నన్ను నీ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకుండా కారును జాగ్రత్తగా నడుపు.

ఈ ఆలోచనతో సిద్ధార్థుడికి మరింత పట్టుదల, ఓపిక అంకురించాయి. గిన్నెలో పాయసం పూర్తిగా తిన్న కాసేపటికి, ఆహారం తిన్న తనని జ్ఞానమార్గంలోంచి భ్రష్ఠుడైనట్టు భావించి దూరంగా కదిలిపోతున్న అయిదుగురు శిష్యులూ కనిపించారు. మరోసారి చిరునవ్వు గౌతముడి మొహంలో. పోనీయ్. ఈ జీవితంలో తాను జ్ఞానం సంపాదించనంతవరకూ ఎవరికీ ఏ ఉపదేశం చేయలేడు. ఎవరికెవరు? కోహం? కోహం? ఇదీ తాను మొదట తాను తెలుసుకోవల్సినది.

రాత్రి ఎక్కడికీ పోదు, గమనించావా? మిట్ట మధ్యాహ్నం పూట కూడా. అనంతమైన ముక్కలుగా, అది అన్నిచోట్లా దాక్కొని ఉంటుంది. ఒక చెట్టు ఆకు ఎత్తి చూడు. దానికింద దాక్కుని ఉన్న చీకటి వీచిక ఒకటి తటాలున వేరులోకి పాకిపోయి తలదాచుకుంటుంది. ఎటుచూసినా– నడవాల లోపల, గోడల వెనుక, ఆకుల కింద–రాత్రి, ముక్కలైపోయి పీలికలుగా తచ్చాడుతూ ఉంటుంది.

మానవాళిలో విస్తరిల్లిన ద్వేషాన్ని నేను ఇంధనశక్తిగా మారుస్తాను. అస్థిమూలగతమైన ద్వేషాన్ని లోలోపలే ఆపుతున్న ఆ తలుపులు మనం తెరచి, దానికి అడ్డు లేకుండా సమాజంలోకి ప్రవహించనిస్తే, ఈ పచ్చ బొగ్గు–అవును, పచ్చగా పసరులాగా మనలో పేరుకుపోయే ఈ పైత్యరసప్రకోపితద్వేషాన్ని, నేను పచ్చబొగ్గు అని పిలుస్తున్నాను–మన కర్మాగారాలను మళ్ళీ నడిపిస్తుంది.

మరుసటి రోజు, వాళ్ళమ్మాయి రాత్రికి రాత్రి మాయమైపోయిందని తెలుసుకున్నాక, వాడి అత్తవారింట్లో పెద్ద గొడవ మొదలైంది. ఒక వారం వరకూ ఆమె కోసం అక్కడా ఇక్కడా వెతికారు. ఎవరికీ ఈ సంగతి గురించి తెలియనివ్వలేదు. కానీ తర్వాత, అమ్మాయి వాళ్ళ అన్నయ్య నా దగ్గరకి వచ్చాడు. అతడికి తోడుదొంగనైనట్టు మొత్తం కథ చెప్పుకు రావాల్సి వచ్చింది.