జిహ్వకో రుచి

“ఎవ్వరైనా అరటి పండుని ఎలా తింటారబ్బా! తొక్క ఒలిచిన అరటి పండు ఆకారం చూస్తే చాలు, నాకు దానిని నోట్లో పెట్టుకో బుద్ధి పుట్టదు!” అంటూ అరటి పండు ఇష్టంగా తినే నా బోంట్లని చూసి ఆశ్చర్య పడ్డది ఒక గృహిణి.

నేను అప్పుడే నోట్లో పెట్టుకుని ఒక కొరుకు కొరికిన అరటి పండు ముక్కని మింగాలో కక్కాలో తెలియని తికమక పరిస్థితిలో పడ్డాను. అరటి పండు నాకు ఇష్టం. రోజుకో పండైనా తింటాను. అరటి పండు ఎంత ఇష్టమైనా ఎవ్వరైనా ప్రసాదం అంటూ చేత్తో చిదిమి, ఒక ముక్కని నా చేతిలో పెడితే నాకు తినబుద్ధి కాదు.

కొందరు అరటి పండు తొక్కంతటినీ ఒలిచేసి, తొక్కని పారేసి అప్పుడు పండుని తింటారు. కొందరు పండుని చక్రాలులా కోసుకుని, ఒకొక్క చక్రాన్నే ఫోర్కుతో తింటారు. వెంకట్రావు పండు మొదటి భాగాన్నీ, చివరి భాగాన్నీ విరచి పారేసి, మధ్య భాగాన్నే తింటాడు. సూజన్ ‘మీట్ అండ్ పొటేటో’ పిల్ల. ఆమెకి పళ్ళల్లో కాని, కాయగూరల్లో కాని గింజ కనబడ కూడదు. ఒక సారి ఇండియన్ రెస్టారాంటుకి తీసికెళ్ళి బైంగన్ బర్తా తెప్పిస్తే వేలేసి ముట్టుకో లేదు – వంగ గింజలని చూసి. కడుపుతో ఉన్న కేటీ సాల్ట్ బిస్కట్ మీద పీనట్ బటర్ రాసుకుని, దాని మీద టూనా ఫిష్ పెట్టుకుని, దాని మీద నిలువుగా కోసిన అరటి పండు బద్దని పేర్చి తింటూంటే చూసే వాళ్ళకి కడుపులో తిప్పిందంటే తిప్పదూ?

పళ్ళన్నిటిలోనూ అగ్రగణ్యమైన మామిడిపండు అంటే మా అన్నయకి ఇష్టం లేదు. కాదు, కూడదు అని మొహమాట పెడితే కోసుకు తినే ఏ బంగినపల్లి పండో ఒక ముక్క తింటాడు తప్ప పిసుక్కు తినే పళ్ళంటే అస్సలు పడదు. మూతి చిదిమి, జీడి పిండేసి, సువర్ణరేఖ పండుని తింటూ ఉంటే రసంతో పాటు మామిడి పండు గుజ్జు చిన్న చిన్న ముక్కలుగా నోట్లోకి వస్తూ ఉంటే దాని రుచితో స్వర్గానికి ఒక మెట్టు దిగువకి చేరుకుంటాను నేను. అదే పండుని నోట్లో పెట్టుకుని వాంతి చేసుకున్నంత పని చేసేడు మా అన్నయ్య.

లోకో భిన్న రుచి అన్నారు. మనుష్యులు ఎన్ని రకాలు ఉన్నారో వాళ్ళ రుచుల ఎంపకాలు, తిండి అలవాట్లు కూడ దరిదాపుగా అన్ని రకాలూ ఉన్నాయి. మా పెద్దన్నయ్య కూతురు లక్ష్మి చిన్నప్పుడు కందిగుండ అన్నంలో కలుపుకు తినేది తప్ప కంచంలో ఉన్న మరొక వస్తువుని ముట్టుకునేది కాదు. నూనెలో వేసి సాతాళించిన చిక్కుడు కాయలని తప్ప మరేదీ ముట్టుకునేవాడు కాదు మా అబ్బాయి సునీలు. యోగర్టు అంటే అసహ్యించుకునేవాడు. ఇప్పుడు నాకు అరటి పండు ఎంత ఇష్టమో వాడికి యోగర్టు అంత ఇష్టం. వయస్సుతో పాటు రుచులు, అభిరుచులు మారతాయి మరి.

ప్రజలని వేలి ముద్రలతో ఎలా పోల్చుకో వచ్చో అలాగే వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని “నాలుక ముద్రలు” తో పోల్చుకో వచ్చేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వేలి ముద్రలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. కాని, “నాలుక ముద్రలు” జీవితంలో క్రమేపీ మారుతూ ఉంటాయి. “నాలుగు రుచులూ తినటం అలవాటు చేసుకోవాలి” అంటూ మా మామ్మ మా చేత తను కాచిన వేప పళ్ళ పులుసుని బలవంతాన్న తినిపించేది. అప్పుడు ఈసురో మంటూ ఆ చేదు పులుసు తిన్నా, ఇప్పుడు అలాంటి పులుసు ఎవ్వరైనా కాచిపెడితే తిందామని కలలు కంటూ ఉంటాను.

కారానికి రుచేమిటి అని మీరనొచ్చు కానీ, అలవాటు పడని నోటికి కారం కారంగానే అనిపిస్తుంది; అలవాటు పడ్డ తర్వాత కారంలో కారం కంటే “రుచిని” నాలుక ఎక్కువగా పోల్తి పడుతుంది. కాఫీ కాని, కారం కాని, కాకరకాయ వేపుడు కాని – ఇవేవీ కూడా మొదటి సారి రుచించవు. అలవాటు పడ్డ తర్వాత వాటిని వదలబుద్ధి కాదు. కుంకుడుకాయ రసంలా ఉందని ఒకప్పుడు బీరుని చీదరించుకున్న నేను ఇప్పుడు బీరులలో రకరకాలని గుర్తించి, వాటిలో తేడాలు చెప్పగలను.

ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉన్నట్లే ఆ వ్యక్తి తినే ఆహార పదార్ధాలలలోనూ, తినే విధి విధానాలలోనూ కూడ ఒక ‘వ్యక్తిత్వం’ ఉంటుంది. మనం ఎక్కువ ఇష్టపడి తినే వస్తువులు, మనకి ఇష్టం లేని వస్తువులు, మనకి అసహ్యమైన వస్తువులే కాకుండా మనం తినే పదార్ధాలని మనం తినే విధానం కూడ మన జఠర వ్యక్తిత్వాన్ని (గేస్ట్రొనోమిక్ పెరసనాలిటీ) వెల్లడి చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చెబుతాను. “నేను శాకాహారం అయినంత సేపూ, ఏది ఎలా వండి పెట్టినా సమదృష్టితో రుచులు ఎంచకుండా తింటాను” అని అందరితోటీ చెప్పేవాడిని. అంటే నాకు ఒక జఠర వ్యక్తిత్వం అంటూ లేదని గొప్పగా చెప్పుకునేవాడిని. నాకు పెళ్ళయిన తర్వాత నా శ్రీమతి వచ్చి, నేను అనుకున్నట్లు నాకు అన్నీ సాయించవనిన్నీ, నాకు కూడా ఇష్టమైనవీ, ఇష్టం లేనివీ ఉన్నాయనీ సోదాహరణంగా రుజువు చేసింది. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా నా అక్క చెళ్ళెళ్ళు, “నీకు చేగోడీలు ఇష్టంరా, అందుకని చేసేం” అని చేసి పెట్టేవరకూ నాకు చేగోడీలు ఇష్టమనే తెలియదు. అయినా ఇంత అమెరికా వచ్చీ ఏ ఫేషనబుల్ గా ఉన్న తిండినో ఇష్టపడాలి కానీ ఈ నాటు వంటకం ఇష్టం అని నలుగురికీ తెలిస్తే నా పరువు పోతుందో ఏమో.

ఈ జఠర వ్యక్తిత్వం అనే ఊహనాన్ని వ్యక్తిగత స్థాయి నుండి జాతీయ స్థాయికి లేవనెత్తవచ్చు. మానవుడు సర్వాహారి. దేశ, కాల పరిస్థితులని బట్టి ఏది దొరికితే అది తిని బతకనేర్చిన జీవి. అయినా సరే కొన్ని కొన్ని జాతులు ఒకొక్క రకమైన జఠర ముద్రని ప్రదర్శిస్తాయి. హిందువులు ఆవుని తినరు. ముస్లింలు పందిని తినరు. కొరియా వారు కుక్కలని, చైనా వారు పాములనీ తింటారు కాని, అమెరికాలో కుక్కలని, పాములని తినరు. కీటకాలనీ, వానపాములనీ చాల మంది తినరు. ఫ్రాంసులో నత్తలని గుల్లల పాళంగా వేయించి, దాని మీద వెల్లుల్లి జల్లి ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఆయా సంస్కృతుల జఠర వ్యక్తిత్వాలు.

ఈ విపరీతమైన ఉదాహరణలని అటుంచి, మనం సర్వ సాధారణంగా తినే వస్తువుల సంగతి చూద్దాం. మా చిన్న బావ కొత్తిమిర దుబ్బు కనిపిస్తే చాలు మైలు దూరం వెళ్ళిపోతాడు. ఇలాగే బెండ కాయలు, టొమేటోలు, బ్రోకలీ, కేబేజీ, కొబ్బరికాయ మొదలైనవి తినలేని వాళ్ళు మనకితరచు తారస పడుతూ ఉంటారు.

ఈ అయిష్టతలు అన్నీ పుట్టుకతో వచ్చినవి కావు. పిల్లలందరికీ పుట్టగానే తెలిసేది తల్లి పాల రుచి. తర్వాత నెమ్మదిగా ఆవు పాలో, డబ్బా పాలో మొదలు పెట్టేసరికి కొంచెం తీపి అలవాటు అవుతుంది. ఆ తర్వాత సంస్కృతులకి అనుగుణంగా రుచులు అలవాటు అవుతాయి. మన దేశంలో అయితే అన్నంలో వాము నెయ్యి కలిపి కొత్త రుచులు అలవాటు చేస్తాం. సాధారణంగా పిల్లలు ఏ కొత్త రుచిని పరిచయం చేసినా మొదట్లో నచ్చుకోరు. మనం వాళ్ళ నోట్లోకి కుక్కటం, వాళ్ళు దాన్ని ఉమ్మెయ్యటం, మనం దానిని మళ్ళా చెంచాతో నోట్లోకి తొయ్యడం – ఈ తంతు ప్రతి తల్లికి తెలిసినదే.

పుట్టుకతో పసి పాపలు తీపిని నచ్చుకోవటం, చేదుని ఏవగించుకోవటం సర్వసాధారణంగా జరిగే పని. నాలుగు నెలల ప్రాంతాలలో ఉప్పదనం మీద మోహం పెరుగుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రకరకాల రుచులు అలవాటు అవుతాయి. పాపకి భవిష్యత్తులో ఏయే రుచులు అలవాటు అవుతాయో ఆ పాప గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినే రుచుల మీద కూడ ఆధారపడి ఉంటుందిట. తల్లి వెల్లుల్లి తింటే పిల్లలకి కూడ వెల్లుల్లి మీద ఇష్టత పుట్టటానికి సావకాశాలు ఎక్కువట. ఈ సిద్ధాంతం ఎంత శాస్త్రీయమైనదో చెప్పలేను కాని, నా శ్రీమతికి వంకాయ ఇష్టం, మా అమ్మాయి సీతకి వంకాయ అంటే అసహ్యం.

కొత్త రుచులని ప్రయత్నించటానికి కూడ భయపడే పరిస్థితిని ఇంగ్లీషులో నియోఫోబియా అంటారు. ఈ భయమే పెద్దయిన తర్వాత “పికీనెస్” గా మారుతుంది. ఈ పికీనెస్ ని తెలుగులో ఏమంటారో ప్రస్తుతానికి స్పురించటం లేదు కాని, ఈ రకం వ్యక్తులు మనకి తరచు తారసపడుతూ ఉంటారు. కొందరు కంచంలో వడ్డించిన వస్తువులని వేళ్ళతో కోడి కెక్కరించినట్లు కెక్కరించి, ఏదీ సయించటం లేదని లేచి పోతారు. ఇలాంటి వాళ్ళతో రెస్టారెంటుకి వెళితే మన పని గోవిందా. వీళ్ళకి మెన్యూలో ఉన్నవి ఏవీ నచ్చవు. నూనె ఎక్కువ వేసేడనో, కారం సరిపోలేదనో, సరిగ్గా ఉడకలేదనో, అన్నం మేకుల్లా ఉందనో, ముద్దయిపోయిందనో, మరీ కరకరలాడుతోందనో, మాడిపోయిందనో, ఏదో ఒక వెలితి కనిపిస్తుంది వీరికి. వీరిని చూసి జాలి పడాలి కాని కోపగించుకునీ, విసుక్కునీ లాభం లేదు. మనందరికీ భక్ష్యాలూ, భోజ్యాలూ, చోష్యాలూ, పానీయాలు లా కనిపించేవే వీరికి ఏకుల్లాగో, మేకుల్లాగో కనిపిస్తాయి. అందుకని తినలేరు.

జేన్ కావర్ అనే ఆవిడ ఇటువంటి పికీ ఈటర్స్ మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడ పుచ్చుకుంది. ఫిలడెల్ఫియాలో 500 మందిని కూడగట్టి వారికి ఒక ప్రశ్నావళి సమర్పించింది. వీటికి ప్రజలు ఇచ్చిన సమాధానాలు చదవటం ఒక అనుభూతి. “నేను కరకరలాడే వస్తువులని తినలేను.” “నారింజ రంగులో ఉన్న తినుభండారలనే నేను తినగలను.” “పళ్ళెంలో వడ్డించిన వస్తువులని ఎల్లప్పుడూ అనుఘడి దిశలోనే తింటాను.” “నేను ఇంట్లో వండినవి తప్ప బయట వండినవి తినలేను.” ఇవీ ఆమె సేకరించిన సమాధానాలలో కొన్ని మచ్చు తునకలు. ఆవిడ పరిశోధనలో తేలిందేమిటంటే ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా పికీ ఈటరే. ఆవిడ వరకుఎందుకు. అమెరికాలో మన తెలుగు వాళ్ళల్లో నేను చూసేను. బయటకి వెళ్ళి ఏది తిన్నా ఇంటికివచ్చి ఆవకాయ డొక్క తో ఇంత మజ్జిగ అన్నం దబదబా తింటే కాని నిద్ర పోలేరు.

కొన్ని అలవాట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కొన్నింటికి మనం అలవాటు పడిపోయి పట్టించుకోము. కార్న్ ఫ్లేక్సు, ఓట్ మీలు మొదలైనవి ఉదయమే తినాలని ఎక్కడైనా నియమనిబంధనలు ఉన్నాయా? ముందు పప్పూ అన్నం, ఆ తర్వాత కూర, ఆ తర్వాత పచ్చడి, ఆఖరున పులుసు, చారు, మజ్జిగ తినాలని ఎవరు నియంత్రించేరు? మా ఇంట పురోహితులు సోమయాజులు గారు ముందు కూర, పచ్చడి తిని, తర్వాత పిండివంటలు తిని, అప్పుడు పప్పు అన్నం తినే వారు. ఎందుకు అలా తిరకాసుగా తింటున్నారని నేను చిన్నతనంలో మర్యాద తెలియని రోజులలో అడిగేసేను. “పప్పు అన్నం ముందు తినెస్తే కడుపు నిండిపోతుంది. అప్పుడు మిగిలినవి తినటం కష్టం. అందుకని” అని ఆయన చెప్పేసరికి మా అమ్మ, నాన్నగారు కూడ తర్కబద్ధంగా ఉన్న ఆ సమాధానం విని ఆశ్చర్యపోయేరు.

నేను అమెరికా వచ్చిన తర్వాత తిండి తినే పద్ధతిలో ఒక కొత్త బాణీ ప్రస్పుటం కావటం మొదలైంది. ఇంటి దగ్గర అన్నంలో కలుపుకుందుకి పప్పు, కూర, పచ్చడి, తర్వాత పులుసు, చారు, మజ్జిగ – ఆ వరసలో తినేవాళ్ళం. ఆయ్యరు హొటేలుకి వెళ్ళి తిన్నా దరిదాపు అవే వంటకాలు తగిలేవి. మొన్న వాషింగ్టన్ వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ ఇండియన్ రెస్టరాంటు కి వెళ్ళేను. వాడు ఒక కప్పు అన్నం, దానితో తినటానికి బైంగన్ బర్తా ఇచ్చేడు. ఎంతకని బైంగన్ బర్తా తింటాను? మర్నాడు చైనా వాడి దగ్గరకి వెళ్ళేను. వాడూ కప్పుడు అన్నం తో పాటు మరొక పాత్ర నిండా వేయించిన చిక్కుడు కాయలు పెట్టేడు. ఎంతకని చిక్కుడు కాయలు తింటాను? పోనీ అని రాత్రి పీట్జా తినటానికి వెళ్ళేను. అక్కడా అంతే. అంటే ఏమిటన్న మాట? ఒక్కళ్ళం రెస్టరాంటుకి వెళితే, వెళ్ళిన చోట మనకి థాలీ లాంటిది దొరకక పోతే మనకి నాలుగు రకాల ఆధరువులు లేకుండా “ఏక భుక్తమే” గతి.

ఇలాంటి ఇబ్బందులనుండి తప్పించుకోవాలంటే చైనా రెస్టరాంటుకీ, ఇండియన్ రెస్టారాంటుకీ, ఒక్కళ్ళూ వెళ్ళకూడదు, ఒక చిన్న మందలా వెళ్ళాలని ఒకడు నాకు హితోపదేశం చేసేడు. ఇంట్లో మా ఆవిడ చెప్పినట్లు, ఆఫీసులో మా సెక్రటరీ చెప్పినట్లు వినటం అలవాటయిపోయిందేమో మనమంచికే చెబుతున్నాడు కదా అని ఆ హితైషి చెప్పినట్లు ఒక సారి అరడజను మంది సహోద్యోగులతో చైనా రెస్టరాంటుకి వెళ్ళేను. వాళ్ళంతా బాతులని, కుక్కలని, పందులనీ ఆర్డరు చేసుకుంటున్నారు. నేను బితుకు బితుకు మంటూ బుద్ధాస్ డిలైట్ ఆర్డరు చేసేను. అందరివీ ఒకటీ ఒకటీ వస్తున్నాయి. నేను తప్ప అందరూ వడ్డించుకుని లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. నేను బిక్క మొహం బైటకి కనిపించకుండా బింకంగా పోజు పెట్టి బుద్ధాస్ డిలైట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆది వచ్చే సరికి ఒక వాయి భోజనాలు కానిచ్చేసిన నా సహోద్యోగులు దీని మీద కలబడి పంచేసుకుని, “రావ్, మేము కూడ నీలాగే వెజిటేరియన్ ఆర్డర్ చెయ్యవలసింది, ఇది చాలా బాగుంది” అంటూ ఆ ప్లేటుని ఒకరి చేతుల మీదుగా మరొకరు నా దగ్గరకి పంపేసరికి అది కాస్తా ఖాళీ అయిపోయింది. నేను మొర్రో మొర్రో అంటే మరొక ప్లేటు తెప్పించేరు. ఆది వచ్చేసరికి అందరి భోజనాలు అయిపోయాయి.

నా తిండి అలవాట్లని తలచుకొని నా మీద నేను జాలి పడిపోయేలోగా మరొక సంగతి. కొందరికి అన్ని రకాల తిండి వస్తువులు పడవు. అంటే ఎలర్జీ. అమెరికాలో నాలుగింట ఒక వ్యక్తికి ఎదో విధమైన తిండి ఎలర్జీ ఉందిట. ఈ ఎలర్జీలలో కూడ రకాలు ఉన్నాయి. కొంతమందికి నువ్వులు, వేరుశనగ తింటే నోరు పూసెస్తుంది. మరికొందరికి వేరుశనగ పొడ తగిలితే చాలు ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురౌతుంది.

అందుకోసం ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలచినప్పుడు వారిని అడగెయ్యటమే. నిషిద్ధం కావచ్చు, పడక పోవచ్చు, ఇష్టం లేక పోవచ్చు. మతం ఒప్పుకోకపోవచ్చు. మా చిన్న బావని ఎవ్వరైనా భోజనానికి పిలిస్తే, మొహమాటం లేకుండా,”అమ్మా! దేంట్లోనూ కొత్తిమిర వెయ్యకండి. కొత్తిమిర వాసన కూడ దేనికీ తగలకుండా చూడండి” అని చెప్పెస్తాడు.

ఇంకో రకం ప్రజలకి మరొక సమస్య. వీరి నాలుక రుచులలో అతి చిన్న తేడాలని కూడ ఇట్టే పట్టేయగలదు. వీరి రుచి బొడిపెలు అతి సున్నితం. మన బోంట్లకి చక్కెర లేని కాఫీ, టీ లు కొద్దిగా చేదనిపిస్తే వీరికి పరమ చేదుగా ఉంటాయి. అదే టీ లో ఒక చెంచాడు పంచదార వేసుకుంటే మనకి సరి పోతుందికాని వీరి నోటికి ఆ టీ పానకంలా అనిపిస్తుంది. వీళ్ళని ఇంగ్లీషులో “సూపర్ టేస్టర్స్” అంటారు. మామిడి పండు ఇష్టం లేని మా అన్నయ్య ఒక సూపర్ టేస్టర్. వంట వండి వాడిని మెప్పించటం ఆ బ్రహ్మ దేవుడి తరం కాదు. ఉప్పు ఎక్కువైంది, పులుపు సరిపోలేదు, కారం మరి కాస్త పడాలి అంటూ వాడి గొణుగుడు భరించటం మాకు అలవాటైపోయింది. కాని ఆవకాయలు పెట్టే రోజులు వచ్చినప్పుడు మాత్రం పాళ్ళు సరిగ్గా పడ్డాయో లేదో చూడటానికి వాడు లేకపోతే ఆవకాయ సరిగ్గా వచ్చేదే కాదు. ఇండియాలో పుట్టి గుర్తింపు లేక, రుచులు ఎంచుతాడని నలుగురి చేత చివాట్లు తినేవాడు కాని, వాడి వంటి సూపర్ టేస్టర్స్ కి అమెరికాలో మంచి ఉద్యోగాలే దొరుకుతాయి.


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...