ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం

వెండి కొండ మీది వెన్నెలవి
మంచు వానవి
ఎడారి మండే ఇసుకవి
కొండ చరియల జలపాతానివి
కొండవి ఎండవి
ఇసుకవి నువ్వు
ఆర్ద్రతనివ్వు
స్థైర్యాన్నివ్వు

శరద్రాత్రి మౌనానివి
వర్షాకాలపు నిశిరాత్రి
ఫెళఫెళ గర్జనవు నువ్వు
మౌనాన్నివ్వు
శబ్దాన్నివ్వు

మహా సముద్రానివి
ఓడలను ఉయ్యాలూపే
మహా అలవి
సముద్రాన్ని వెలిగించే
అగ్ని మండలానివి
అగాధాల లోతుల్లో
చిమ్మ చీకటివి
నువ్వు
వెలుగునివ్వు
స్థిరత్వాన్నివ్వు.

భూమిని చీల్చుకు
ఆకాశాన్నంటే
మహా వృక్షానివి
ఖండాలు దాటి
అఖండ ఆకాశంలో
ప్రయాణించే పక్షి రెక్కల్లో
సత్తువవి
నువ్వు
సాహసాన్నివ్వు
బుద్ధి బలాన్నివ్వు.

గూటిలోని పక్షిపిల్లల
నోటికందే ఆహారానివి
తాబేలు పిల్లల్ని
సముద్రం వైపుకు
నడిపించే
అదృశ్య హస్తానివి
నువ్వు
బలాన్నివ్వు
లక్ష్యాన్నివ్వు

విజయానివి,కాలానివి,కల్పనవి,శాంతివి,సంతోషానివి
ఆహ్లాదానివి,సుఖానివి,సమృద్ధివి,సంతుష్టివి నువ్వు.

నువ్వే నేనవ్వు
నువ్వే నేనవ్వు.

  1. అప్పుడెపుడో చిన్నపుడు గుళ్ళో ఉన్నప్పుడు భోరున వర్షం కురవడం మొదలై అక్కడే కూచుండిపోతే ఆ చీకట్లో దీపపు వెలుగు లో రాజరాజేశ్వరీ అమ్మవారి మొహం నిర్మలంగా నన్నే చూస్తోంటే-
    ఉన్నట్టుండి మెరుపు మెరిసి మిరుమిట్లు గొలుపుతోన్న ఆ తెల్లటి వెలుతురు తెర వెనుక వెచ్చగా వెలుగుతోన్న రాజరాజేశ్వరీ దేవిగా నువ్వు నన్నే చూస్తోంటే- నేను నిన్నే చూస్తోంటే – అప్పుడు నువ్వే నేనయ్యాను.

    ఎప్పుడూ నువ్వే నేనవ్వు.

  2. ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. అంతా పొలాలు. ఎవరూ లేరు నేను తప్ప. చల్లని వానగాలి కొడుతోంటే, రంగురంగుల పాల పిట్టలు భూమికి ఆకాశానికి మధ్యలో కరెంటు తీగెల మీద ముముక్షువుల్లా వరసలు కట్టి కూచున్నాయి. గట్ల వెంబడి కొబ్బరి చెట్లు కోరికల్లా తలలూపుతోంటే ఆకాశమంతా నల్ల నల్లని కారుమబ్బులు కమ్ముకుపోతే అప్పుడు ఆ చల్లగాలిలో పొలాల్లో నిలబడి మబ్బుల్లోకి చూస్తోంటే నువ్వే నేనయ్యాను.

    ఎప్పుడూ​ ​నువ్వే నేనవ్వు.

  3. ఎప్పుడూ ఏదో ఓ కోరిక కోరుతూ ఉంటాను. అవి తీరినప్పుడల్లా నువ్వు నా ప్రార్ధనలన్నీ వినేస్తున్నావని సంతోషపడిపోయేను. కానీ నేను నిన్ను ప్రార్ధనలతో వేధించి తీర్చుకున్న కోరికలన్నీ నాకు కష్టాలే తెచ్చిపెట్టాయి. నాకేది మంచిదో అది నీకు తెలుసు, అదే నాకివ్వు అని అడగడం మొదలు పెట్టాను ఈ మధ్య. అదీ కాదు, ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నాను – నువ్వే నేనవ్వు అని.

    ఎప్పుడూ నువ్వే నేనవ్వు.

  4. అవి అభిమానాలని, ఇవి ప్రేమలని, అవి బంధుత్వాలని, ఇవి స్నేహాలని అలివిమాలిన ప్రేమతో అల్లుకుపోబోతాను. అవి నన్ను నవ్వించి, ఏడిపించి, క్షణ క్షణానికీ రంగులు మార్చీ, ఏమారీ ఏమార్చీ, ఎండాకాలం పెళుసు గాలిలా పారిపోతాయి. నేనే ఆ పరిష్వంగాన్ని వదిలించుకుని, పిట్టలా పారిపోతే, చిటారు కొమ్మల్లోకి దూరిపోతే, అవి కన్నీటితో నా బొమ్మలు వేస్తాయి. లేదూ, గొంతు బొంగురు పోయేలా ద్వేష గీతాలు ఆలపిస్తాయి. విషాదపు నిషా నిండిన కవితలు రాసి రాసులు పోస్తాయి. కానీ వాటితో గట్టిగా చెప్పేను,​ ఎప్పుడూ ​నువ్వే కావాలని నాకు.

    నువ్వే నేనవ్వు.
    నువ్వే నేనవ్వు.