“అమ్మయ్య, ఈ బస్సుకోసమే ఇంతసేపూ కాచుక్కూచున్నానండీ. ఇంతకు ముందు టూట్వెంటీవన్ వచ్చింది కానీ దానికి ఏసీ లేదు.”
“సార్, అది ఇండియనెక్స్‌ప్రెస్సేనా? ఏదీ వోసారి జస్ట్ హెడ్‌లైన్స్ చూసిచ్చేస్తాను.”
“అహహ, టికెట్ వెనక రాయొద్దు, నేనెప్పుడూ ప్రాపర్ చేంజ్ క్యారీ చేస్తాను.”
“ఐతే కంట్రోల్ రూమ్ దగ్గర దిగిపోయి ఆటో పట్టుకుంటే సరిపోతుందిగా?”
“అంతే అంతే.”
హలో అక్కా! వియ్ లవ్ రేడియో మిర్చీ!
“లేదొదినా, అమ్మాయీ ఐటీనే. అమెరికాలోనే లోనే చేసుద్ది. ఐనా ఆడదాని ఉద్యోగాన్దేముందిలే వదినా. రేపే కడుపో కాలో వస్తే…”
“మనావోళ్ళే ఇరవయ్యారు లక్షలకి కొనేశారు. డెడ్డు చీపన్నమాట. ఇప్పుడా యేరియాలో స్క్వేరుయార్డొచ్చి ఎంతనుకున్నావ్?”
“మా… మీ… నాన్న పోదాం.”
“వెళ్దాం కన్నా. రెండ్రోజులు… అమ్మకి పనుంది కదా.”
“ఊఁ… ఊఁ… నా… న్నా…”
హాబీసంటే వాచింగ్ టీవీ. చాలా సార్లు ట్రై చేస్తామక్కా, ఇవ్వాళే ఫస్ట్‌టైమ్ కలిసింది. అక్కా, మా ఫేవరెట్ సాంగ్ ఒకటి ప్లే చెయ్యరా! ప్లీజ్!
“పెళ్ళికూతురి చీరలు కంచిలోనే తీస్తన్నాం. డబల్నేత లేకపోతే అసలు బాగోదు. ఏదో పిల్ల కన్నూ ముక్కూ బావుందనే కానీ వాళ్ళిచ్చిన డబ్బుల్తో ఏమొచ్చుద్దొదినా? ముష్టి…”
“పండూ, ఏడవకమ్మా! జెమ్స్ ఇవ్వనా? అదిగో ఆ బ్లూ కార్ చూడు!”
“ఊఁ… ఊఁ… బ్లూ కార్… ఊఁ… బ్లూ నాకొద్దూ… నాన్నా…”
“టెన్నియర్సుగా ఉన్నా ఈ ఫీల్డులో. ఆరోజేంటన్నావ్? ఔటుస్కర్ట్సు అనా? మరిప్పుడు చూడు, అటేపెల్తే అసలా రేట్లకి చుక్కలు, చుక్కలు కనిపిస్తయ్! ఇంక ఆ ఫ్లయోవరు గానీ ఎప్రూవు ఐపోయిందనుకో…”
“ఏం చేస్తావే? అంకుల్ నన్నడిగారు ప్రవీణ్ గురించి.”
“అదేనే భయం. తెలిసిపోతే కాలేజ్ మానెయ్యమంటారు. అస్సలు నచ్చవు ఇలాంటివి. రెండ్రోజులు అన్నం మానేస్తే అమ్మ వింటది కానీ, అమ్మో, డ్యాడీ, ఇదివరికి చూశాగా, అన్నయ్యని బెల్ట్ తో…”
“మరి? వదిలేస్తావా!”
“ఆఁ… ఏమో. ఐనా వాడు అంత సీరియస్సంటావా? ఊర్లో మరదలుందన్నాడు ఒకసారి.”
గాల్లో తేలినట్టుందే గుండే పేలినట్టుందే
తేనేపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే…
“పెళ్ళి మాత్రం గ్రాండుగా చేయమన్నాం. దానికే ఏడిచ్చస్తన్నారు. మనకి సిటీలో ఫ్లాటు, గోల్డూ అదీ బాబే తీశాడు. బాబుకిప్పుడు గ్రీన్‌కార్డ్ కూడా వుందిగా వొదినా.”
“మామీ… అమ్మమ్మా ఇంట్లో ఏసీ లేదుగా. వెళ్ళొద్దూ… ఊఁ… నాన్న పోదాం…”
“ఉఫ్, కన్నా! వెళ్తాం నాన్నా. ఊరుకోవూ? ఇదిగో జెమ్స్, అమ్మకి నీరసం రా.”
“వాడికే లేంది నీకేంటే అంత ఇది. లైట్ తీస్కో.”
“కానీ, బావుంటాడు కదే? అచ్చం…”
“ఊర్లో పొలాలుంటే ఎవడికంటా? అహఁ, ఇంత పొజిషన్లో ఉన్నావా?! సిటీలో విల్లా ఉండకపోతే… ఏంటి, విన్నావా? మనలాగా మనపిల్లలు కూడా మిడిలు క్లాసు లాగా… బాగోదు. చెప్తున్నా అని కాదు. థింక్ చెయ్యి.”
“అంతగాక ఎంతలే వదినా. ఐనా అందం కొరుక్కుతింటామా పాడా? ఎంత పెట్టుబడి పెట్టాం వాడి మీద! నీకు తెలుసుగా వదినా? ఎవర్తో అనకు గానీ వాళ్ళు ముందే నెట్లో చూసుకున్నారు. ఏదో గుట్టుగా కానివ్వడమే, కన్నవాళ్ళకి తప్పదుగా. ఎంతైనా మనం చూసిన పిల్లయితే ఒద్దికా అదీ చూసుకోమా?”
“మా…మీ… నా… నా…”
“పోదాం రా. పోదామని చెప్పాగా. ఇక పడుకో కాసేపు.”
ఐఐటీ ఫలితాల్లో మొదటి మూడు రాంకులే కాక వందలోపు పది రాంకులతో దూసుకెళ్తున్న …
“కొత్త వెంచర్సున్నయ్. సండే కలుద్దాం, ఫ్రీయేగా. ఇంకా బయటివాళ్ళకి తెలీదు. మనోడివని చెప్పటమే. రేపు పేపర్లో వచ్చాకా నీకీ రేటుకి దొరికితే నీ చెప్పుచ్చుకుని…”
“మరి ఇంట్లో చెప్పావా?”
“అమ్మో, డాడీ చంపేస్తారు. ఇంటర్ కాస్ట్ అంటే అసలొప్పుకోరు.”
“మరి వదిలెయ్యవే, చెప్పనా వాడికి ఇంట్లో ప్రోబ్లెమ్ అని?”
“మోనీ, ఒకటి చెప్తా, ప్రామిస్ చెయ్, ఎవరికీ చెప్పకూడదు.”
“ప్రామిస్, చెప్పవే ఏంటో?”
“లాస్ట్ మంత్ అరకు వెళ్ళాంగా, ఆ ట్రిప్‌లో సత్య ప్రపోజ్ చేశాడు. ఏం చెప్పనే? ఏంటో, టెన్షన్‌గా ఉంది.”
“ఓ! సత్యా?! ఆరోజు బస్ వెనక చీకట్లో తనతో… అది నువ్వేనా?”
“ఏంటీ? కాలేజ్‌లో తెలిసిపోయిందా? వద్దన్నాను. నైట్ కదా! చీకట్లో ఎవరూ చూడరని… చున్నీ కప్పేసుకుని…”
“…సినిమా పేరు కరక్ట్‌గా గెస్ చేసి బిగ్ బజార్ నుంచి టెన్ థౌజండ్ రుపీస్ గిఫ్ట్ వోచర్ గెల్చుకున్న….”
“హ్మ్… సరే… చూద్దాం, మిసెస్‌తో ఒకసారి చెప్తాను, ఆదివారం రండి అలాగే.” (కళ్ళజోడు తుడుచుకుంటూ)
“ఊఁ.. అంతా ఉత్తిదే. ఊఁ… నానా నువ్వూ కొట్టుకునీ… ప్లే..టులు.. ఇసిరే..సీ.. బజ్జునీ… చూశాగా… (ఎక్కిళ్ళు)
“వీప్పగలకొడతా, నోర్మూస్కోని పడుకో కాసేపు. పీక పిసికి చంపేయండ్రా నువ్వూ నీ నాన్నా నన్ను. నా ప్రాణానికి తగులుకున్నారు. దిక్కుమాలిన సంత. చచ్చినా బాగుణ్ణు.” (చేతుల్లో మొహం, మొహంలో ఏడుపు)
“ఆ ఇంగితం వాడికుండొద్దొదినా? పిల్లల్ని కంటాం కానీ, రాతల్ని… (చీరచెంగుతో మొహం ఒత్తుకుంటూ)
“ఊరుకో వదినా. నువ్వెంత కష్టపడి పెంచావో నాకు తెలీదా. మీ అన్నయ్య ఎప్పుడూ అంటారు, రాజిలాగా పెంచాలి పిల్లల్నీ అనీ.” (భుజం మీద చెయ్యేస్తూ)
“అమ్మో, ఇంట్లో తెలిసిపోతే? డ్యాడీ ఇరగదీస్తారు.” (సెల్లో టెక్స్ట్ చూసుకుంటూ)
రామకృష్ణ గారూ, కంగ్రాట్స్! … రోజూ వింటారా మా ప్రోగ్రామ్? వావ్, థాంక్సండీ. మీ ఫామిలీకి, ఫ్రెండ్స్‌కీ, రేడియో మిర్చి నుంచీ నానుంచీ…
“టెన్ కాదండీ, ట్వెంటీ ఇచ్చా, మీరు చూళ్ళేదు. ఈ పాప కూడా అప్పుడే ఎక్కింది, అడగండి.”
“మాస్టారూ! నా స్టాపొచ్చింది. పేపరిస్తారా?”
“అంటే… మీరూ ఇంకోలా కూడా చెయ్యొచ్చు. ఆబిడ్స్ దాకా వెళ్ళిపోయి ఇంకో బస్ తీసుకుని తిన్నగా స్టేషన్‌కి…”