చిత్రం – ‘బాపు’రే విచిత్రం!

పాశ్చాత్య దేశాల్లో, యూనివర్శిటీలలో చిత్రలేఖనం లేదా పెయింటింగ్ నేర్చుకునే ప్రతీ విద్యార్థికీ పాఠం మొదలుపెట్టే ముందు ఒక వాక్యం చెప్పి మరీ ప్రారంభించడం ఒక ఆనవాయితీ: ‘నాకు నచ్చింది నువ్వు గీసిన చిత్రం కాదు; నీ చిత్రలేఖనం!’ (It is not your paintings I like, it is your painting.) చదవడానికి మామూలుగా కనిపించిన వాక్యమయినా అంతర్లీనంగా చాలా అర్థం వుంది. ఇంకా వివరిస్తే దీని అర్థం – ఒక చిత్రం కాదు ప్రథానం; అది వేయడానికి చిత్రకారుడు పడే అంతర్మధనం. అనుసరించే పద్ధతీ, దాని వెనుక శ్రమా ముఖ్యం. ఈ వాక్యం అన్నది ఏ ప్రసిద్ధ చిత్రకారుడో కాదు. ఒక రచయిత చిన్న కథలో చెప్పిన వాక్యం.

ఆ కథ పేరు – ఆర్టిస్ట్ ఎట్ వర్క్ (Artist at Work). రాసింది ఆల్బేర్ కామూ (Albert Camus.)

ఏ చిత్రకారుడికీ అంతర్మధనం పుట్టుకతో వచ్చేయదు. పరిశ్రమతో కూడిన పరిణామక్రమంలోనే అది సాధ్యమవుతుంది. నాకు ఈ వాక్యాలు ఒక చిత్రకారుడి చిత్తరువు చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటాయి. ఆయన పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ.

ఒక అన్నమయ్య, ఒక త్యాగయ్య, ఒక వేమన గురించి తెలుగువారికి పరిచయం చెయ్యనవసరం లేదు. ఈయనా అంతే. కాకపోతే ఈ పేరు – అంటే సత్తిరాజు లక్ష్మీ నారాయణ అని చెబితే మనకేసి అయోమయంగా చూస్తారు. కానీ బాపు అని చెబితే కళ్ళు పెద్దవి చేసి మరీ ఆనందిస్తారు. ఎందుకంటే ఆయన వేసిన బొమ్మలు తోరణాల్లా ప్రతీ ఇంటా వేలాడతాయి. పెళ్ళి చూపుల్లో అమ్మాయిల్ని వర్ణించాలంటే రంభ, ఊర్వశి పోలికలు వెతుక్కోరు. ఒక్క ముక్కలో తేల్చేస్తారు, బాపు బొమ్మలా ఉంటుందని. తెలుగునాట ప్రతీ రచయిత తాను అచ్చు వేసే పుస్తకానికి బాపు బొమ్మ ఉంటే దాని విలువ పెరుగుతుందనుకునే స్థాయికి ఎదిగిన గీత అది. ఆ గీతని చూడగానే అలవోకగా బాపు పేరు నోట వచ్చేస్తుది. ఒక్క వాక్యంలో సంక్షిప్తంగా చెప్పాలంటే – బాపు పేరు తెలుగుదేశీయం; హౌస్‌హోల్డ్ నేమ్!

తెలుగునాట ఎంతో మంది చిత్రకారులు గతంలోనూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. దామెర్ల రామారావు మొదలుకొని అడవి బాపిరాజు, అంట్యాకుల పైడిరాజు, సంజీవ్ దేవ్, మాధవపెద్ది గోఖలే, వడ్డాది పాపయ్య, గంగాధర, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎస్వీ రామారావు దాకా ఎంతో మంది ప్రసిద్ధ తెలుగు చిత్రకారులు ఉన్నారు. కానీ అందరి నోటా బాపు పేరు నానినట్లుగా ఎవరిదీ కాలేదు. పాత తరానికి వడ్డాది పాపయ్య పేరు బాగానే పరిచయం వున్నా, ప్రస్తుత తరానికి మాత్రం తెలుసున్న పెద్ద అతి ఆర్టిస్ట్ బాపుయే!

నాకు ఊహ తెలిశాకా బాపు బొమ్మలు మొదటి సారి చూసింది వారపత్రికల్లోనే. పత్రికల ముఖ చిత్రాలకీ, కథలకి, కవితలకీ వేసిన బొమ్మలు చూశాకనే బాపు గురించి తెలిసింది. చిన్నతనంలో నాకూ చిత్రకళలో ప్రవేశం ఉండడం వలన, బాపు బొమ్మలు శ్రద్ధగా గమనించేవాణ్ణి. చాలా కాలం వరకూ పత్రికల్లో చిత్రాలు వేసే బాపు, సినిమాలు తీసే బాపు ఒకరని తెలీదు. ఏడో తరగతిలో ఉండగా సంపూర్ణ రామాయణం రెండో రిలీజు వచ్చింది. అందులో కైక దశరధుణ్ణి వరాలు కోరే సన్నివేశంలో ఎప్పుడో యుద్ధంలో సాయం చేసిన ప్రతిఫలంగా కొన్ని వరాలు ఇచ్చావు, అవి తీర్చమని అడుగుతుంది. ఆ సన్నివేశంలో రాజమందిరం గోడ మీద ఒక చిత్ర పటం ఉంటుంది. అది కైక యుద్ధంలో దశరధుడికి సాయం చేసిన సన్నివేశం. అది నా మనసుకి బాగా ఆకట్టుకుంది. అప్పుడే తెలిసింది పత్రికల్లో బొమ్మలు వేసే ఆయనా సినిమాలు తీసే ఆయనా ఒకరేనని. అప్పటినుండి బాపు బొమ్మల్ని చాలా శ్రద్ధగా గమనిస్తూనే వచ్చాను.

బాపు రాత్రికి రాత్రే పెద్ద చిత్రకారుడైపోలేదు. ఎంతో కృషీ, పట్టుదలా, పరిణితీ, ఇవన్నీ తోడైతేనే సాధ్యమయ్యింది. ఇంతై, వటుడింతై అన్నట్లుగా చిన్న చిన్న బొమ్మలతో చిత్రకారుడిగా వృత్తి చేపట్టిన బాపు, తనదంటూ ఒక ప్రత్యేక శైలినీ, చిత్ర విధానాన్నీ ఏర్పరుచుకున్నాడు. మామూలు గీతని బాపు గీతగా మార్చడం వెనుక ఎన్నో ఏళ్ళ పరిశ్రమ ఉంది. అది ఒక్కరోజులో జరిగిపోలేదు. మామూలు జనాన్నే కాదు, చిత్రకారులనీ మెప్పించాడు. ఆయన గీత మోహంలో పడ్డ ఎంతో మంది చిత్రకారులకి మార్గదర్శకుడు అయ్యాడు కూడా!

పాశ్చాత్య దేశాల్లో ప్రతీ చిత్రకారుడికీ ఒక ప్రత్యేక శైలీ, పద్ధతీ ఉంటాయి. కొంతమంది మూర్తిచిత్రాలు (portraits) గీయడంలో నిష్ణాతులయితే, మరికొంతమంది అనుభూతి చిత్రలేఖనంలో (impressionism) ఉద్దండులు. చిత్రకళలో మనకి విభాగాలు అంతగా తెలీవు. మనమయితే అందర్నీ ఆర్టిస్టనే పిలుస్తాం. అది తప్పని కాదు. ఎం.ఎఫ్. హుస్సేనూ మనకి ఆర్టిస్టే, వడ్డాది పాపయ్యా మనకి ఆర్టిస్టే! అలాగే ఆర్కే లక్ష్మణ్ కూడా! దీనిక్కారణం మనందరికీ చిత్రకారులు పరిచయం అయ్యింది పత్రికల ద్వారానే! అందరూ పత్రికల్లో కథలకీ, నవలలకీ బొమ్మలు వేసేవారు. లేదంటే పత్రికలకి ముఖ చిత్రం వేసేవారు. మనకున్న ఆయిల్ పెయింటింగ్ చిత్రకారులు చాలా తక్కువ కావడమూ, వారిగురించి పత్రికల్లో గానీ ఇతరత్రా కానీ తెలీయకపోవడం ఒక కారణం. ఇంకో బలమైన కారణం ఏవిటంటే చిత్రకళని పోషించే వాళ్ళూ, ఆరాధించే వాళ్ళ సంఖ్య తెలుగువారిలో చాలా తక్కువ కావడం, లలితకళలకి అంతగా ప్రోత్సాహం ఇవ్వకపోవడం.

చిత్రలేఖనంలో రెండు ముఖ్యమైన విభాగాలున్నాయి. ఒకటి తైలవర్ణ చిత్ర లేఖనం. రెండోది వ్యాఖ్యా చిత్రం, లేదా లక్ష్య చిత్రం. మొదటి దానికి ఉదాహరణ మైసూరు రాజమందిరంలో రవివర్మ వేసిన చిత్రాలు. రెండవది – ఒక ప్రత్యేక సందర్భానికి కానీ, సన్నివేశాన్ని కానీ ప్రతిబింబిస్తూ వేసే చిత్ర లేఖనం. రెండో కోవకి చెందిన వ్యాఖ్యా చిత్రలేఖనానికి ఉదాహరణగా బాపు వేసిన చిత్రాలు చెప్పుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఫైన్ ఆర్ట్ అనే పద్ధతిలో ఒక పరిచయమున్న చిత్రమో, దృశ్యమో తీసుకొని దానికి సృజనాత్మకత జోడించి ఆ చిత్రాన్ని గీయడం వుంది. అజంతా, ఎల్లోరా గుహల్లో చిత్రాలు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా నైరూప్య చిత్రాల వంటి అధునాతన పద్ధతులు ఇంకా చాలా ఉన్నాయి.

వ్యాఖ్యా చిత్రంలో బొమ్మ ఒక క్రియా పదానికి సమతూకంగా ఉండే చిత్రంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక క్రియకి సంబంధించిన లక్షణాలని బొమ్మగా గీసి చూపడం. ఉదాహరణకి వైద్యుడు అన్నామనుకోండి. వేంటనే మనకి తట్టేవి స్టెతస్కోపు, ఆసుపత్రి వగైరా! ఈ లక్షణాలు బొమ్మలో ప్రతిబింబిస్తూ చిత్రం గీస్తే, చూడగానే వైద్యుడు గుర్తుకొస్తాడు. మిగతా చిత్రలేఖనాల్లో కూడా ఇవే ఊహలూ, ఆలోచనలూ ఉంటాయి. ఉండవని కాదు. మూల చిత్రం లేదా దృశ్యానికి అతి దగ్గరగా చిత్రకారుల ఊహ ఉంటుంది. వ్యాఖ్యా చిత్రలేఖనంలో లక్షణాలని బట్టి మూల చిత్రాన్ని ఊహించుకోవడం ఉంటుంది. స్థూలంగా ఇదీ తేడా! వడ్డది పాపయ్య ఫైన్ ఆర్టునీ, వ్యాఖ్యాచిత్రాన్నీ కలగలిపి తైల వర్ణ చిత్రాలు వేసేవాడు. అందువల్ల ఆయన చిత్రాలు ప్రత్యేకంగానూ, విభిన్నంగానూ కనిపిస్తాయి. ఇంతవరకూ బాపు వేసిన చిత్రాలు పరిశీలనగా గమనిస్తే ఆయన పై మూడింటిలో వ్యాఖ్యాచిత్ర విభాగానికే చెందుతాడు. అంటే బాపు ఒక వ్యాఖ్యా చిత్రకారుడు (illustrator) మాత్రమే! బాపు గీసిన బొమ్మలను ఆ పద్దతిలోనే పరిశీలించాలి, విమర్శించాలి కూడా.

బాపు మొదట సారి వేసిన చిత్రాలనీ, ఈ మధ్య కాలంలో అంటే గత ఇరవయ్యేళ్ళుగా వేసిన చిత్రాలనీ గమనిస్తే బాపు గీతలోనూ, చిత్రంలోనూ పరిణితీ, స్పష్టతా, ఒక ప్రత్యేకమైన శైలీ కొట్టచ్చినట్లు కనిపిస్తాయి. ఏ కళాకారుడికయినా తనదంటూ ఒక శైలి ఉంటేనే అది కలకాలం నిలుస్తుంది. ముఖ్యంగా చిత్రలేఖనంలో ఉన్న కళాకారులకి ప్రత్యేకమైన శైలి ఉండి తీరాలి. లేకపోతే రాణించడం కష్టం. వస్తూనే పత్రికల్లో ప్రవేశించడంతో బాపూ తనకొచ్చిన విద్యని సానపెట్టడానికి సాహిత్య పత్రికలు మరింత దోహదం చేశాయి. వేలంత బొమ్మ వెయ్యి మాటలకి సమానం అంటారు. పత్రికల్లో కథలకీ, వ్యాసాలకీ బొమ్మవేయడం అంటే ఆయా సందర్భాలకి తగ్గట్టుగా ఉండాలి. చెప్పేవాటికి అంటే వస్తువుకి అతి దగ్గరగా ఉండాలి. చిన్న ఊహకి కొండంత సృజన జోడించాలి. బాపు ఎదగడానికి పత్రికలు చాలా ఉపయోగపడ్డాయి.

బొమ్మలు గీసే కళలో ప్రావీణ్యం సంపాదించాలంటే కొన్ని ప్రత్యేకమయిన లక్షణాలు ఉండాలి. అవి – నిర్మాణ సౌష్టవం (anatomy), దృష్టికోణం (perspective), విక్షేపం (projection), రంగుల పొందిక (color harmony.) ఏ చిత్రకారుడికైనా వీటి మీద మంచి అవగాహన ఉండాలి. అలా ఉంటేనే గీసిన బొమ్మ పదిమంది మెప్పూ పొందుతుంది. బొమ్మలు వేయడం రాని వాళ్ళు కూడా బొమ్మని చూసి అదే ఏ స్థాయిలో ఉందో గ్రహించగలరు. చూసే కన్ను తేడాలని ఇట్టే పసిగట్టేస్తుంది. అప్రయత్నంగానే దాని బాగోగులు లెక్కవేసేస్తుంది. మన కంటికి ఇంకో ప్రత్యేక గుణం కూడా ఉంది. అనురూపంలో (symmetrical) తేడా అని చిటెకలో పసిగట్టేస్తుంది. చిత్రకళలో ఏ మాత్రం ప్రవేశం లేకపోయినా బాగుందీ, బాగోలేదని చెప్పడానికి ఇది కూడా ఒక కారణం. ఏం బాగోలేదని అడిగితే జవాబు దొరకకపోవచ్చు గాక.

బాపు కొత్తలో, అంటే 1950ల్లో వేసిన చిత్రాలూ, గత పదిహేనేళ్ళల్లో వచ్చినవీ పోల్చి చూస్తే మనకి బాపు పరిణామక్రమం బాగా తెలుస్తుంది. ఒక దశలో బాపు గీతకి మామూలు ప్రజలే కాదు, తోటి చిత్రకారులూ కూడా ఆయన గీత వ్యామోహంలో పడి అనుకరించేవారు. తన సొంత గీతని ఏర్పరుచుకోవడానికి బాపుకి చాలా కాలమే పట్టింది. బాపుకి మొదట్లో బాగా పేరు తెచ్చినవి కథలకీ, వ్యాసాలకీ వేసిన బొమ్మలే!

బాపు వేసిన మొదటి బొమ్మ ‘సంసారం’ చూడండి. బొమ్మ ముందు భాగంలో తల్లీ కొడుకూ ఉంటే, భార్యా పిల్లాడు వెనక్కి నెట్టేయబడ్డారు. ఈ చిత్రంలో దృష్టికోణం కొడుకు మీదుగా తల్లినుండి మిగతా వారికి చేరేట్లా వేశారు. అప్పట్లో ఇది కొత్తగా అనిపించి ఉండవచ్చు. తెలుపు-నలుపు చిత్రం కాబట్టి రంగుల ప్రసక్తి లేదు. ఇదే బొమ్మ ఇప్పుడు వేసుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవడం అంత కష్టం కాదు. ఇలా మాత్రం ఖచ్చితంగా వేసుండేవారు కారు.

పూర్వకాలంలో చాలా కుటుంబ విషయాలు భోజనాలదగ్గరే ప్రస్తావనకొచ్చేవి. ఆడవాళ్ళకి ఇంటి మగాళ్ళు కుదురుగా అందుబాటు లోకి వచ్చే సమయం అదొక్కటే! తల్లి భోజనం వడ్డిస్తూ కొడుకుతో ఏదో చెబుతోంది. దూరంగా కోడలూ, ఒళ్ళో చిన్న పిల్లాడూ, ఇవన్నీ చూడగానే మనకి ఏదో చర్చిస్తున్నారన్న ఊహ వచ్చేస్తుంది. చర్చా విషయం ఏవిటన్నది కథ చదివితే ఎలాగూ అర్థమవుతుంది. కానీ కథ పేరూ, బొమ్మా చూడగానే పాఠకులకి మరింత కుతూహలం పెరుగుతుంది. వ్యాఖ్యా చిత్రకారుల ముఖ్య లక్షణం ఇదే! బాపు ఇది ముందే గ్రహించినట్లుంది.

ఏ బొమ్మైనా వేయడానికి ముందు – ఏం వెయ్యాలి? ఎంత నిడివిలో వెయ్యాలి? అన్నవి ప్రతీ చిత్రకారుడూ ఆలోచించుకుంటాడు. గీయబోయే బొమ్మలో ప్రధాన అంశాలు ఏవిటీ అన్నది ఒక స్పష్టత రావాలంటే నిర్మాణ సౌష్టవం మీద శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా గీసే బొమ్మ ప్రత్యేకంగా ఉండాలనుకుంటే! దీనికి సారూప్యంగా లేదా అతి దగ్గరగా ఉండేది విక్షేపం. ఈ రెండూ ఒకదాన్ని పెనవేసుకొని మరోటి ఉంటాయి కనక అంత గొడవ ఉండదు. అసలు కష్టం అల్లా దృష్టికోణం దగ్గరే మొదలవుతుంది. మొదటి రెంటినీ ఏ దృష్టికోణంలో చూపించాలి? అన్నదే పెద్ద ప్రశ్న. ఇక్కడే చాలా మంది చిత్రకారులు ఫెయిల్ అయ్యేది. ఏ కోణంల్లోంచి బొమ్మ వేయాలి అన్నది ప్రతీ చిత్రకారుడికీ వారి వారి అభిరుచి, సృజనని బట్టి ఉంటాయి. పత్రికల్లో వేసే బొమ్మలకి దృష్టి కోణం జతపరచడం అలవాటు చేసింది బాపునే!

అప్పట్లో ఒక కథకి వేసిన ఈ చిత్రం చూడండి. విక్షేపం ఉంది కానీ, దృష్టికోణంలో స్పష్టత లేదు. చిత్రంలో వైవిధ్యం ఉంది కానీ, అందం లేదు. ఈ దృష్టికోణం విభిన్నంగా, కొత్తగా చూపించాలంటే చిత్రకారులకి ‘జాగా’ (space) వాడుకోవడం మీద మంచి అవగాహన ఉండాలి. అంటే వారికిచ్చిన జాగాలో బొమ్మని ఎంత నిడివితో వెయ్యాలి అన్నది చాలా ముఖ్యం. దీన్నే జాగా వాడుకోవడం అంటారు. మొదట్లో వేసిన బొమ్మల్లో ఈ జాగా వాడుకోవడం అంత గొప్పగా లేకపోయినా రాను రానూ ఆయన బొమ్మకి అదే కొత్త అందాలు తెచ్చి పెట్టింది.

ఈ పక్క బొమ్మలు జాగ్రత్తగా గమనిస్తే బాపు బొమ్మలో గీతకి ప్రత్యేకత ఇంకా అప్పటికి ఏర్పడలేదని తెలుస్తూ ఉంది. అలాగే ఆయన టాగోర్ గీతాంజలి తెలుగు అనువాదానికి వేసిన బొమ్మల్లో గీత కోసం అన్వేషణ గోచరిస్తుంది. ఈ బొమ్మల్లో విక్షేపమూ, నిర్మాణ సౌష్టవమూ వున్నాయి. జాగా వాడుకోవడమూ కనిపిస్తుంది. గీత మీద పట్టు కనిపించదు. కానీ ఆ తరువాత వేసిన దాశరథి గాలిబ్ గీతల దగ్గరకొచ్చేసరికి గీత మీద పట్టు తెచ్చుకునే కృషి మరింత తేటతెల్లం అయ్యిందని తెలుస్తోంది.

ఈ గాలిబ్ గీతాల్లో కూడా కొన్ని బొమ్మల దగ్గర కొచ్చేసరికి గీతల గజిబిజి మరీ మరీ ఎక్కువగా ఉంది. అప్పట్లో ఇవి ఖచ్చితంగా విబిన్నతతో గీసిన చిత్రాలు అనడానికి సందేహించనవసరం లేదు. ఈ గాలిబ్ గీతాల బొమ్మల్లో గీతలు బావున్నాయి కానీ కొన్ని చిత్రాల్లో దృష్టికోణం సరిగా లేదు. పైన ఉదహరించిన గాలిబ్ గీతాల్లో అద్దం ముందు కూర్చున్న స్త్రీ చిత్రం గమనిస్తే అందులో దృష్టికోణం ఎక్కడ తప్పిందో తెలుస్తుంది. కాకపోతే బాపు బొమ్మలు వేయడంలో ఒక నిర్ధిష్టమైన గమ్యం ఏర్పరుచుకున్నాడని అర్థమవుతుంది. రంగుల్లో వారపత్రికలు రావడం మొదలెట్టాక బాపు బొమ్మకీ అందం పెరిగింది. బొమ్మ వేసేటప్పుడు జాగాని వాడుకోవడంలో నిష్ణాతుడైపోయాడు. అదొక్కటే కాదు సినిమాల ప్రభావం వలన వేసే బొమ్మలు ఫొటోగ్రఫిక్ దృష్టికోణంలో వేయడంతో మరింత కొత్తగా వుండేవి.

తెలుగుదనం ఒడిసిపట్టిన బొమ్మ: తెలుగు వాకిటిని అందమైన బొమ్మలతో నింపేయడమే కాదు, ఆ తెలుగు సంస్కృతినీ తనబొమ్మల్లో నిక్షిప్తం చేయడం బాపు ప్రత్యేకత. ముఖ్యంగా పండుగలూ, పెళ్ళిళ్ళ బొమ్మలు చూస్తే తెలుస్తుంది. ఇంటి ముందు ముగ్గులేసే ఆడవాళ్ళూ, తోరణాలు కట్టే మగవాళ్ళూ, తలుపు చాటునుండి చూసే అమ్మాయిలూ, ఇలాంటివి కోకొల్లలు. ముఖ్యంగా తన బొమ్మలకి వెనుక నేపథ్యానికి ముగ్గులు, పువ్వులూ, చెట్లూ వాడడం చాలా చిత్రాల్లో కనిపిస్తుంది.