దండెం మీద దడి కట్టిన
రామచిలుకల ఆకుపచ్చ వాక్యం
బొద్దు ఆరుద్ర పురుగుల ముద్దు పరుగుల
హరిద్రావర్ణపు పుప్పొడుల నేల
తెలివెలుగు మంచులో పూల చుట్టూ
పద్యాలు చుడుతున్న గండుతుమ్మెదలు
చంద్రవంక వంకీకి చిక్కక ఎన్నెలరాకెట్లయి
ఆకాశమంతా ఎగుర్తున్న దువ్వెనలు
పుస్తకాల గనిలో మధురాక్షరాలను
నముల్తున్న సిల్వర్ ఫిష్‌లు
అగ్గిపెట్టెల్లోంచి ఎగిరిపోయి
బంతాకులు నెమరేస్తూ
కలల్ని వెదజల్లుతున్న బంగారిపురుగులు
హరివిల్లు లోంచి రంగులను తెచ్చి
పూలతోట కద్దుతున్న సీతాకోకలు
తేనెబొట్లతో అమృతపు గూడు కట్టి
మరిచి వెళ్ళిపోయిన కందిరీగలు
చేర బిల్చుకొని కూడ బలుక్కొని
ఐక్యతతో బాట నిర్మిస్తున్న ఎర్రచీమలు
మట్టిని సుగంధంగా మార్చటానికి
మల్లగుల్లాలు పడుతున్న నత్తగుల్లలు
సిల్కు దారాలతో ఇళ్ళను
రంగవల్లికలుగా దిద్దుకొంటున్న సాలీడు
గట్లమీద గొల్లభామలై
గంతులేస్తున్న గడ్డిచిలుకలునేను కూడా
ప్రక్రుతి గీసిన ఛాయాచిత్రంలో
కనబడుతూనే వుంటా
చెట్టు కొడుతూనో
ఎంగిలిచేత్తో కాకిని తోలుతూనో
కుండీలో నాటిన మనీప్లాంట్ చిగురుకు
మురిసిపోతూనో …