తెన్నేటి సూరిగారి చెంఘిజ్ ఖాన్ తొలిగా ఆంధ్రపత్రికలో, 1950 సెప్టెంబరు నుంచి ధారావాహికంగా ప్రచురింపబడిన నాటినుండి ఎంత ప్రాచుర్యం పొందిందో మాటల్లో చెప్పలేం. ఈ రచనకి దాసోహులమని చెప్పుకునే వీరాభిమానులు నాకు ఎందరో తెలుసు. వ్యక్తిగతంగా ఈ పుస్తకాన్ని నేను చాలాసార్లు చదివాను. 1976-1981 మధ్య కాలంలో మేమున్న ఒక పల్లెటూరి లోని లైబ్రరీ నుంచి ఈ పుస్తకం అరువు తెచ్చుకోవాలంటే 6-7 నెలలు వేచి వుండవలసి వచ్చేదంటే అతిశయోక్తి కాదు.
1998 నవంబరులో ఇండియా వెళ్ళినప్పుడు ఈ రచనని అంతకు కొద్ది వారాల ముందే (సెప్టెంబరు 1998) రేడియో నాటకంగా శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు అనుసరించి ప్రసారం చేశారని తెలియడం, ఆ ప్రసారం రికార్డు చేసుకున్న వారొకరు ఆడియో టేపును అందివ్వడం జరిగాయి. ఆ టేపు డిజిటైజ్ కావడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఆ పుస్తకంలో వున్న వేగం, చదివేటప్పుడు కలిగే అనుభూతి ఈ నాటకం వినడంలో కూడా ఉన్నాయో లేదో మీరే చెప్పండి.
– పరుచూరి శ్రీనివాస్