ఉడుత

క్రీక్ క్రీక్
శబ్దం
ఒకటే అక్కడ

ఆ శబ్దాన్ని
మోస్తూ
ఊరికే తిరుగుతో
వేడి గాలి

కళ్ళు
విప్పార్చుకుని
బరువుగా తూగే
సీతాఫలాలతో

కులాసాగా
ఊసులాడుతో
​చెట్ల నీడలు

గడ్డిపూల నదిలో
చిత్తరువులా
నిలబడి
కుంచె తోక
ఉడుత

అంతలోనే
కంగారు పండొకటి
ఎండ మీదకు విసిరి
గుబురు కొమ్మల్లోకి
గెంతి పోతోంటే

దాని
నిడుపు చా​ఱ​ల
వీపుని రాసుకుంటూ
వెనకాలే
వెర్రి పరుగుల
​రికామీ గాలి.