(కన్నెగంటి చంద్ర తెలుసా, “ఈమాట”, తానా పత్రికల ద్వారా అమెరికా పాఠకులకు పరిచితులు. కవిత్వంలోనూ, కథనంలోనూ తనవైన శైలి, భావాలు, ప్రతీకలు చూపిస్తున్న చంద్ర కలం నుంచి మరో కొత్త కవిత.)
గెలుపూ వోటముల సంగతి అటుంచి
జరిగిన యుధ్ధంలో ఇద్దరమూ క్షతగాత్రులమే
ఇల్లంతా శత్రుదేశాల సరిహద్దురేఖ మీది
ఉద్రిక్తవాతావరణం నింపుకుంటుంది
అప్పట్నుంచీ
ఒక ఊపిరాడని వేసవి మధ్యాహ్నం
మన మధ్య బిగుసుకుంటుంది
మంత్రమేదో వేసినట్టు మొహాలు తుడిచేసిన black boards అవుతాయి
అవసరార్థపు పొడి పలుకులు
గాల్లో తేలుతుంటాయి ఎటు చేరాలో తెలియని తికమకతో
నేరారోపణలూ, దోషనిరూపణలూ అవతల పెట్టేసి
తగిలించుకున్న విషాద గాంభీర్యపు ముసుగులు విప్పేసి
అహంభావపు మిగిలిన బెట్టును
ఆఖరిమెట్టుకు దించేసి
మూసిన గుప్పిళ్ళయిన పెదాలను దోసిలిలా విప్పార్చి
శాంతి కపోతాల్లాంటి చిరునవ్వులు ఎగరేద్దాం
యుద్ధవిరమణకు సూచనగా
కమ్ముకున్న మబ్బుల్ని కళ్ళచివరి మెరుపులతో తరిమేద్దాం
ఒక్కో అక్షరమూ పేర్చుకుని గుండెకూ గుండెకూ మధ్య వంతెన వేద్దాం
గుచ్చుకున్న ఒక్కో వంకర మాటా పెరుక్కుని
మనమే పూసుకోవాలి మందేదో
మెత్తటి చల్లటి వెన్నముద్దల చేతులతో
పగిలిన గాజుబొమ్మ ముక్కలొక్కటొక్కటే ఏరుకుని
మళ్ళీ అతుక్కుందాం
మరిక ఇద్దరి మధ్యా దేనికీ చోటివ్వరాదన్న
అంగీకారపత్రం పై ముద్దులతోటే ఆమోదముద్రలు వేద్దాం
మళ్ళీ ఇంకోసారి!