నేను నిన్ను ప్రేమిస్తున్నాను

నా ప్రియతమా!

అని ఈ ఉత్తరం మొదలుపెట్టాలని ఎంతగానో మనసు ఆశపడుతోంది. అది నీకంగీకారమవుతుందో కాదో అని అనుమానం. నిన్నలా పిలిచేందుకు నా అర్హతలేమిటీ అని ప్రశ్నించుకుంటే సమాధానం రాదు. నిన్ను ఎందుకైనా నొప్పించడం నాకు సుతరామూ ఇష్టం లేదు.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతో గొప్పగా, ఉద్వేగం నిండిన గొంతుతో నీకు చెప్పాలనుకున్న మాటలు. ఎంత పాతవి! మరెంత చవుకబారువి! ఇది మొదటిసారి కాదు, అనేక మంది ఇవే పదాల్ని తమ నుదుట చెమటలు పడుతుండగా, వణికే పెదవులతో పలికి ఉంటారు. నిజంగానో, భ్రమలోనో, బొంకుతూనో. కడదాకా నిలవని ప్రేమలే అవన్నీ! కానీ మరేం చేయటం? నీపై ప్రేమ కోసమే కొత్తమాటల్ని సృజించాలని ఉంటుంది. మరెవరూ కలనైనా తలవలేని మాటలు, కేవలమూ నీకోసమే రూపు దాల్చిన ప్రత్యేకమైన మాటలు, నా మనసులో వెలిగే నీపై ప్రేమను పూర్తిగా శబ్దాలలోకి అనువదించగల మాటలు. అశక్తుణ్ణి అయిపోతాను, ఒక కొత్త భాషను పుట్టించలేని నేను. ఉన్న భాషల్లోని ఏ శబ్దాలలోకీ నా ప్రేమను వొదిగించలేని నేను. చివరికి పేలవమైన ఈ మాటల్లోనే, తేలిపోయే ఈ తేలికపాటి మాటల్లోనే నా ప్రేమను తెలుపుకోవలసి వస్తుంది.

క్షమించు.

ఏ చలువరాతి మేడ మీదో కొబ్బరాకులు వీచే చల్లటిగాలిలో సముద్రపుటలల నేపథ్య సంగీతంలో, వెన్నెల పాలిపోయే నీ చెంపల్ని తాకుతూ మైమరుపుతో చెప్పవలసిన మాటల్ని ఇట్లా రాస్తున్నందుకు. ఇరుకు బజార్లలో చెమటలు కక్కుకుంటూనో, చుట్టూ రణగొణ ధ్వనుల మధ్యనో మొహమ్మీద పేరుకుపోయిన దుమ్మును తుడుచుకుంటూ చెప్పలేక రాస్తున్నా.ఆకాశం మీద నక్షత్రాలతో రాయవలసిన మాటల్ని ఇట్లా ఈ పిచ్చికాగితమ్మీద రాయటం నేరమే. ముందే చెప్పాను కదా, ప్రేమించే అర్హతలేమీ లేని వాణ్ణి.

నీకోసం ఎప్పటినుంచీ వెతుకుతున్నానో చెప్పలేను. ఏ గాజుల గలగల విన్నా, కిల కిల నవ్వులు విన్నా తల తిప్పి చూచేవాడిని నువ్వేమోనని. అలలా లేచిన ఆశ చప్పున చల్లారేది. నువ్విక ఎప్పటికీ దొరకవేమోనని భయం. నా బతుక్కిక అర్థం ఎప్పటికీ అవగతమవ్వదేమోనని అనుమానం. ఉభయ సంధ్యల్లో ఉబికే రంగులసొబగుల్లో, విరిసే రంగురంగుల పువ్వుల మీద చిరుగాలి నర్తనాలలో, పిట్టలపాటల్లో ఎక్కడెక్కడ వెతికానో! చివరికి వొంటిగా నేనూ, సముద్రమూ ఒకరి గోడును ఒకరికి వెళ్ళబోసుకుంటూ ఉండిపోయేవారం!

తొలిసారి నిన్ను చూడగానే చనిపోయి మళ్ళీ బతికినట్లయింది. ఆ క్షణంలో ఇక మరణించినా మరి బాధ లేదన్న తృప్తి మనసంతా నిండింది. చూపులకే మాసిపోతావనే జంకుతో ఒక వైపు సతమతమవుతూనే రెప్పలార్చడం మరిచి చూస్తూ ఉండిపోయాను. ఒక లిప్తపాటులో నువు తలతిప్పి నావైపు చూసి చిరునవ్వుతో అటు తిరగటం నాకెంతో ఇష్టమైన జ్ఞాపకం.నీలి చందమామల్లాంటి కనుపాపల్లో కదిలిన వెన్నెల నవ్వు ముక్కు మీదగా జారి పెదాల మీదికి చేరడం అంతకుముందెన్నడూ చూడని అద్భుతం. అందుకోసమే అన్నాళ్ళూ బతికినట్టూ, ఇకముందుకూడా ఆ ఆసరాతోటే బతకబోతున్నట్టూ అనిపించింది నాకప్పుడు. దాని ముందు మరేవీ గుడ్డిగవ్వకు కూడా కొరకానివనీ అనిపించింది.

‘అబ్బ ఎంత అందం!’ అనుకునే ఉంటాను అందమనే మాటే వెలవెల పోతుందని తెలియక. ‘ఇదుగో ఇక్కడుంది అందమంతా!’ అని నిర్ణయించుకోలేని తికమక. చూడడానికి చాలని రెండు కళ్ళనూ పొడుచుకోవాలన్న నిస్పృహ. వొళ్ళంతా తొణికిసలాడే సూర్యకాంతికి కళ్ళు చెదిరి దిక్కు తోచని స్థితి.

అప్పటినుంచీ నిన్నే చూస్తున్నట్టుంది నాకు. కలలోనూ, మెలకువలోనూ అదే రూపు. నిన్నే తింటూ, నిన్నే తాగుతూ, నిన్నే పీలుస్తూ బతుకుతున్న స్పృహ. నన్ను ఒక ప్రపంచంలా కప్పేసి, నా రక్త నాళాల్లో ప్రవహించి,నా ఆత్మలోకి ఇంకిపోయిన భావన. రాత్రులూ, పగళ్ళూ, మిత్రులూ, పలకరింపులూ, పుస్తకాలూ ఇక అర్థం లేనివి.ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి చందనపు కొమ్మ అందగా వొడ్డుజేరి సేదతీరినట్టూ, ఒక మాయలోంచి బయటపడి వాస్తవాన్ని కని అచ్చెరువుతో నిలబడిపోయినట్టూ ఉండిపోయాను.

ఎన్ని కలలు కన్నానో, పగటివీ, రాత్రివీ, వెన్నెలవీ, చల్లటి జలపాతాలవీ, సాగర తీరాలవీ, రోదసీ విహారాలవీ. గత జన్మలు మరిచి ఒక దేహమూ, ఒక ఊపిరీ అయినట్టూ అంతలోనే విడివడి మళ్ళీ ఒకటవడంలో పరమానందాన్ని పొందుతున్నట్టూ.

నా నిస్సహాయత తెలిసిపోతూనే ఉంటుంది. ఎంత కౌగిలించీ నాలో కలిపేసుకోలేక, ఎన్ని ముద్దులకూ నిన్ను పూర్తిగా తాగలేక, తాకే చేతుల దాహం తీరక అలమటించటం తెలుస్తూనే ఉంటుంది. నీ సౌందర్యం అట్లాగే ఉండిపోతుంది. ఒడ్డున రాళ్ళకేసి నెత్తి బాదుకునే సముద్రం మల్లే అనంతకాలపు శిక్ష పడినవాడిలానే ఉంటాను. ఫలితం లేదని తెలిసీ తిరిగి తిరిగి ప్రయత్నించేవాడి ఖేదం నన్నలుముకుంటుంది.

ఈ ప్రేమ కథనంతా నీకు విప్పి చెప్పేద్దామనే ఉంటుంది. ఏం లాభం? నీకిష్టం లేదనుకో, ఎంత బాధ నీకు! వానకి తడిసి వణికే పిట్టల్లాంటి కళ్ళు ఒక్క రాత్రి అయినా నిద్రకి దూరం కావటం సహించలేను. నా మూలంగా నీకు అణుమాత్రం కష్టం కలిగినా నన్ను నేను క్షమించుకోలేను.

నీకూ ఇష్టమేననుకో, పెద్దల్ని ఒప్పించో ఎదిరించో పెళ్ళి చేసుకున్నామనుకో! ఎంత ఆనందం ఊహించుకోవడంలో కూడా. కానీ నా ప్రాణమా, అతికొద్ది కాలంలోనే అంతా పాతబడుతుంది. అన్నీ మామూలవుతాయి. ఒక మామూలు భర్త వలే నేనూ, ఒక మామూలు భార్య వలే నువ్వూ మారిపోతాము.

నీ దైవత్వం నీ నుంచి జారిపోతుంది. మానవ సహజమైన ఆకలిదప్పులూ, అసూయలూ, కోపాలూ, కన్నీళ్ళూ, రోగాలూ రొష్టులూ, చీరలూ, నగలమీద వ్యామోహాలూ నిన్ను కమ్మేస్తాయి. ఇచ్చిన యవ్వనాన్ని కాలం వడ్డీతో సహా తీసుకుపోతుంది. నిన్నట్లా చూడగలనా? ఇప్పుడెన్ని చెప్పినా, మరెన్ని వాగ్దానాలు చేసినా నిన్ను ఈ నానోటి తోటే విసుక్కుంటాను. ఏడుస్తూ బతిమలాడే నిన్నుపక్కకు నెట్టేసి బయటికి పోతాను. పిల్లలమీద కేకలేస్తూ, తీరని అవసరాల గురించి విసుక్కునే నీకూ మరొకరికీ తేడా ఉండదు. కనుక్కున్న జన్మ రహస్యం మాయ చాటున మాసిపోతుంది. ప్రేమ పక్షి మళ్ళీ ఏ లేతగుండెల్నో వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఎంత దుర్భరమో ఊహించు.

అందుకే ఈ ప్రేమలేఖ నీకందదు. అసలు ప్రేమకూ, సొంతం చేసుకోవడానికీ సంబంధమేమిటి? నిజమే, నువ్వెప్పుడూ నా ఎదురుగా ఉండాలనీ, నా చేతిలో నీ చేయుంచుకుని తిరగాలనీ, నిన్ను తాకాలనీ,నీ ఒడిలో తల ఉంచి నువు చెప్పే కబుర్లు వింటూ ఉండాలనీ ఎంత కోరికో! అయినా అదంతా నా స్వార్థం,

నన్ను ఆనందంగా ఉంచుకునే ఊహలే అన్నీ! ఎంత అసహ్యకరం! స్వార్థపూరితమయింది కారాదు నా ప్రేమ. నీకోసం నేనేమయినా చేయలేనా అనిపిస్తుంది. లోకాలన్నీ జయించి నీ కాళ్ళ ముందు పోయాలనీ,అడుగడుక్కీ పువ్వులబాట పరవాలనీ, ప్రతి మేఘం నీకోసఏ వర్షించాలనీ, మెరుపు మెరవాలనీ, సమస్త ప్రకృతీ నీ కనుసన్నల్లోనే నీ ఆజ్ఞానువర్తియై మెలిగేలా చేయాలనీ ఉంటుంది.మరుక్షణమే నా అల్పతవం, నా బలహీనతలూ గుర్తుకి వస్తాయి. నిజంగా నాక్కావలసింది నీ సంతోషమే; అయితే దానికి నువు నాదానివే కానక్కరలేదు. నీతో నిజంగా గడపగల జీవితం ఒకటే గానీ కలలలో అయితే ఎన్నో! నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియవలసిన అవసరమేముంది? తెలియకపోతే మాత్రం వచ్చే నష్టమేమిటి? నా ప్రేమ లోని స్వచ్ఛతని గుర్తిస్తావని నమ్మకమేముంది? ఈ ప్రేమ భావన వేధించేదీ, వెలిగించేదీ నన్ను! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పటికీ ఈ ప్రేమలేఖ రాస్తూనే ఉంటాను.

ఎన్ని నిట్టూర్పులై బయటికి వచ్చినా నువు నాలోనే ఉండిపోతావు. గజిబిజి గతుకుల బతుకులో ఏ కుదుపుకో మెలకువ కలిగినప్పుడు నువ్వో చల్లటి తెమ్మెరై వీస్తావు. నిన్నింకా ప్రేమిస్తున్న స్పృహ చెట్టంత చేవనిస్తుంది. ఇందులో విషాదమేమీ లేదు. కళ్ళు చెమరించినా అది ఈ ఎడారి మొక్కకి ఒక వసంతమేనా దాకిందన్న తృప్తి తోటీ, ఆనందం తోటీ.మళ్ళీ మళ్ళీ నాలో నేనే అనుకుంటూ ఉంటాను పెదవుల మీద చిరునవ్వుతో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.