తెలుగుసాహిత్యాన్ని ద్విపద, ప్రబంధము, శతకము, యక్షగానము మొదలైన ప్రక్రియల్లాగే అనేకార్థ కావ్యాలు కూడ అలరింపజేసాయి. రెండర్థాలు వచ్చే కావ్యాలు ద్వ్యర్థి కావ్యాలు. మూడర్థాలు వచ్చేవి త్య్రర్థి కావ్యాలు. నాలుగర్థాలు వచ్చేవి చతురర్థి కావ్యాలు. వీటిలో ద్వ్యర్థి కావ్యాలే తెలుగులో ఎక్కువగా వచ్చాయి.
శ్లేష, ద్వ్యర్థికి కొన్ని గుణాలు సమానంగా వున్నా వాటిలో భేదముంది. శ్లేషకావ్యంలో ఏ పద్యానికి ఆ పద్యమే. ద్వ్యర్థికావ్యంలో రెండర్థాలు సమాంతరంగా కావ్యమంతటా ఉంటాయి. వసుచరిత్ర, విజయవిలాసం ప్రఖ్యాత శ్లేష కావ్యాలైతే రాఘవపాండవీయం, హరిశ్చంద్రనలోపాఖ్యానం ప్రసిద్ధమైన ద్వ్యర్థికావ్యాలు.
పఠనపద్ధతి
పింగళి సూరన రాఘవపాండవీయంలో అనేకార్థ కావ్యాలను చదివే పద్దతి ప్రత్యేకంగా వివరించాడు.
ఒక కథ వినియెడు తరి వే
రొక కథపై దృష్టి యిడిన నొక యర్థము తో
పక పోవు గాన నేకా
ర్థ కావ్య మెట్లట్ల వినగదగు నొకటొకటిన్
ఒక కథను చదివేటప్పుడు వేరొకకథపై దృష్టి వుంచితే ఏ ఒక్క అర్థమూ స్పష్టం కాదు. అందుకని ఏకార్థకావ్యం లాగా చదవాలి. అంటే ముందు ఒక కథను దృష్టిలో ఉంచుకుని పద్యం మొత్తం అన్వయించుకోవాలి. తర్వాత రెండో కథను దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్టు అన్వయించుకోవాలి.
అనేకార్థసాధన
అనేకార్థ కావ్యరచనలో కథాసంయోజనకు సూరన కావ్యాదిని కొన్ని నియమాల్ని ప్రకటించాడు.
ఆంధ్రభాషా సంస్కృతాభిభాషా శ్లేష
యొక్కొకచోట, నొక్కొక్కచోట
నుచిత శబ్దశ్లేష, యొక్కొక్కచోటన
ర్థశ్లేష, యొక్కొక్కతరిని ముఖ్య
గౌణవృత్తిని శ్లేషఘటన, యొక్కొకతరి
నర్థాన్వయము వేరె యగుచు నునికి
శబ్దాన్వయ విభేద సంగతి యొక్కొక
తరి నివి యొక్కొక్క తరిని రెండు
మూడు గూడుట యన సముజ్వ్జలముగాగ
నాకు తోచిన గతి పెక్కుపోకలమర
రామభారత కథలు పర్యాయదృష్టి
జూచు సుమతుల కేర్పడ నాచరింతు
రామభారత కథలు పర్యాయదృష్టితో చూసే సుమతులకు స్పష్టమయ్యే విధంగా ప్రధానంగా ఆరు మార్గాలను ప్రదర్శించాడు. అవి
1. ఒక అర్థంలో ఆంధ్రభాషా పదాలుగా మరో అర్థంలో సంస్కృతభాషా పదాలుగా సమన్వయం. దీన్ని ఉభయభాషాశ్లేష అంటారు.
2. శబ్దాలు శ్లేషించి కథాద్వయ సంయోజన. ఇది ఆంధ్ర శబ్దశ్లేష కావొచ్చు, సంస్కృత శబ్దశ్లేష కావొచ్చు. దీన్ని సభంగ శ్లేష అని కూడా అంటారు.
3. నానార్థాలున్న శబ్దప్రయోగంతో శ్లేష. అభంగశ్లేష అంటారు దీన్ని.
4. ఒక పదానికున్న ముఖ్యార్థం, గౌణార్థం అనే వాటితో సమన్వయం.
5. పదము యొక్క ఒకే అర్థాన్ని వేరువేరుగా అన్వయించటం.
6. శబ్దాల అన్వయం విభేదించటం.
ద్వ్యర్థి కావ్యాలు.
రాఘవపాండవీయం ఇలాటి కావ్యాన్ని మొదటగా వేములవాడ భీమకవి చెప్పాడని విన్నట్లు పింగళి సూరన అన్నాడు.
భీమన తొల్లి చెప్పెనను పెద్దల మాటయె కాని యందు నొం
డేమియు నేయెడన్నిలుచు టెవ్వరు గాన; రటుండనిమ్ము; నా
నామహిత ప్రబంధ రచనా ఘనవిశ్రుతి నీకు గల్గుటన్
నామది తద్వ్దయార్థకృతి నైపునియుం గలదంచు నెంచెదన్
లభిస్తున్న ద్వ్యర్థి కావ్యాల్లో పింగళి సూరన రాఘవపాండవీయమే ప్రథమం. అతను 1550వ ప్రాంతంలో దీన్ని రచించాడు. ఇది ఆకువీటి పెదవేంకటాద్రి ప్రోత్సాహంతో విరూపాక్షునికి అంకితం ఇవ్వబడింది. అనేకార్థ కావ్యరచన చాల కష్టంతో కూడిన పని అని ఇలా ప్రకటించాడు
రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ సక్యంబు గా
కుండుం తద్గతి కావ్యమెల్ల నగునే నోహో యనం జేయదే
పాండిత్యంబున నందునుం దెనుగు కబ్బం బద్భుతం బండ్రు ద
క్షుండెవ్వాడిల రామభారత కథల్ జోడింప భాషాకృతిన్
సూరన నాటికే కవిరాజు సంస్కృతంలో రాఘవపాండవీయం రచించాడు. సూరన ఆ సంస్కృతకావ్యాన్ని ప్రస్తావించలేదు. సూరన నేరుగా వాల్మీకి రామాయణం, వ్యాసభారతాల నుంచి కథల్ని తీసుకుని సమన్వయం చేసాడు. ఇతని ప్రతిభకు రెండు ఉదాహరణలు
ఏనుంగని కరమరయక
పూనితి గాకిట్టిపనికి పొసగునె యేయన్
కానమె కాలనియమగతి
తో నావేట మునియుగము ద్రుంగించె తుదన్
రామాయణార్థం దశరథుడు మునిబాలుని మరణానంతరం చింతిస్తున్నాడు. ఏనుంగు, అని, కరము, అరయక ఏనుగని వేరే ఆలోచన లేకుండా, పూనితిగాక, ఇట్టిపనికి, యేయన్, పొసగునె, కాలనియమ గతితో, కానమె, తుదన్, నావేట, మునియుగము ముని యొక్క ఆయువు, ద్రుంగించె.
భారతార్థం పాండురాజు అడవిమృగాలనుకుని మునిదంపతులను చంపి బాధపడుతున్నాడు. ఏనున్, కనికరము, అరయక, కాన, మెకాలు, అని, యమగతితో, పూనితిగాక, ఇట్టిపనికి, యేయన్, పొసగునె, నా వేట, తుదన్, మునియుగము మునిదంపతులను, ద్రుంగించె.
ఇక్కడ “ఏనుంగని కరమరయక” అనే చోట రెండర్థాల్లోను తెలుగు శబ్దాల్తో సభంగశ్లేష సాధిస్తే, “కానమె కాలనియమగతి” అనేచోట కాల అనే సంస్కృతశబ్దం రామాయణార్థంలోనూ, కానమెకాలు అనే తెలుగు శబ్దం భారతార్థంలోనూ వాడి ఉభయభాషాశ్లేష సాధించాడు.
తానన్నమాట ఇంద్రున
కైన నలంఘ్యమయి పేర్చునట్లుగ నెంతే
బూనిక చెల్లింపుచు జగ
తీనుత విక్రముడొనర్చె దిగ్విజయంబున్
ఈపద్యంలో ఒక్క పదమే రెండర్థాలు ఇచ్చింది. మిగిలిన పద్యమంతా రెంటికీ సామాన్యమే. ఆ పదం “అన్నమాట” అనేది. రామాయణార్థంలో అది అనినమాట అని, భారతార్థంలో అన్నయొక్క మాట అని అన్వయించుకుంటే సరిపోతుంది.
హరిశ్చంద్రనలోపాఖ్యానం దీన్ని మూర్తి, భట్టుమూర్తి, రామరాజభూషణుడు అని పిలవబడే కవి 1580 ప్రాంతంలో రచించాడు. ఇది శ్రీరామ చంద్రునికి అంకితం ఇవ్వబడింది. భారతరామాయణాల్లో దిగ్విజయం, వేట, మునిశాపం, సంతతికై యత్నం, వివాహం, వనవాసం, యుద్ధం మొదలైనవి సామాన్యంగా ఉంటే హరిశ్చంద్ర, నల కథల్లో ఇలాటి సామ్యాలు చాలా తక్కువ.
క్షితిభర్తకుమారుడు లో
హితుడన విలసిల్లె జేర్చి హృదయంబున సం
తతముదమునను జనాదర
మతి సాంద్రముగా బహుశ్రుతానందితుడై
హరిశ్చంద్రకథాపరం క్షితిభర్త, కుమారుడు, లోహితుడన, హృదయంబున, చేర్చి, సంతత, ముదమునను, జనాదరమతి, బహుశ్రుత, ఆనందితుడై, సాంద్రముగా, విలసిల్లె.
నలకథాపరం క్షితిభర్తకు, మారుడు, లో, హితుడన, విలసిల్లె, బహుశ్రుత, ఆనందితుడై, సంతతము, దము ననుజను, హృదయంబున, చేర్చి, ఆదరము, అతి సాంద్రముగాన్
మనుజపతియును నాగాశ్వమణి సువర్ణ
పూర్ణ సామ్రాజ్య దాన విస్ఫురణ ననుప
మామ రమణీ జయశ్రీ సమన్వితుడయి
యాత్మపురి జెంది సుఖలీల నలరె నంత
హరిశ్చంద్ర కథలో ఇది విశ్వామిత్రునికి రాజ్యదానం చేసే సందర్భం. నల కథలో దమయంతితో నలుడు తన రాజ్యానికి వెళ్ళటం. ఐతే, ఒక పదమే రెంటికీ తేడా. అది “అనుపమామరమణీ” అనేది. హరిశ్చంద్రుడి అర్థంలో దీన్ని అనుపమ, అమర, మణీ అని విడదీస్తే, నల కథలో అనుప, మామ, రమణీ అని విడదియ్యాలి. అలా హరిశ్చంద్రుడి కథలో సంస్కృత పదాలుగా, నలుడి కథలో తెలుగు పదాలుగా వాడబడింది.
నైషధపారిజాతీయం దీన్ని కృష్ణాధ్వరి రచించాడు. రఘునాథరాయలకి అంకితం. 1620 ప్రాంతంలో రచింపబడింది. దీన్లో పారిజాతకథతో వివాహపర్యంతం నలకథ జోడించబడింది.
బలభద్రస్థితి వైరివర్గము నడంపన్ సత్యభామాదులు
జ్వ్జల సామ్రాజ్య భరార్హతం దెలుపగా శౌర్యాఖ్యచే మాగధా
దులు దీర్ణానత వర్ణతం జెలగ సంతోషశ్రిత శ్రీకుడౌ
నల భూమీపతి గారవించె మహిని న్నాయంబునన్ రుక్మిణిన్
దీన్లో బలభద్రస్థితి, సత్యభామాదులు, శౌర్యాఖ్య, నల భూమీపతి, రుక్మిణిన్ అనే పదాల్లో శ్లేష ప్రయోగించబడింది.
ధరాత్మజాపరిణయం ఈ కావ్యాన్ని క్రొత్తలంక మృత్యుంజయకవి 18వ శతాబ్ది తొలిభాగంలో రచించాడు. కావ్యం పేరులోనే శ్లేష వాడటం ఇక్కడ ఒక విశేషం. ధర, ఆత్మజ సీత ఐతే, ధరా, ఆత్మజ పార్వతి. ఆ యిద్దరి వివాహగాధలు కలిసిన నాలుగాశ్వాసాల కావ్యం ఇది.
వెలయు నిలయందు భూ భృ
త్కుల వర్యుడు సుగుణరత్నఖని జనకుం
డలఘు సమున్నతిచే ను
జ్వ్జలిత యశోభార మహిమవంతుండనగన్
దీన్లో జనకుడు జనకుడనే పేరుగా, తండ్రి అనే అర్థంలో వాడితే, యశోభారమహిమవంతుడు అనే పదాన్ని యశోభారమహిమ, వంతుడు గానూ, యశో,భా,రమ, హిమవంతుడు గాను విడగొట్టాలి.
అచలాత్మజాపరిణయం దీన్ని తిరుమల బుక్కపట్టణం వెంకటాచార్యులు రచించాడు. ఈతను 1730 ప్రాంతం వాడు. దీన్లో కూడ సీతాపరిణయం, గిరిజాకళ్యాణం వర్ణితాలు. ధర శబ్దానికి వ్యతిరేకంగా, అచల శబ్దం హ్రస్వాంతమైతే పర్వతమనీ, దీర్ఘాంతమైతే భూమి అని అర్థాలు.
అనుగత సదర్థపర మహి
మనగరి సకల భువనాగ్ర మహిత గజౌఘం
బున దనరు సదాగతి కృత
ఘన సంగతి మిథిల యనగ గరిమాస్పదమై
లంకావిజయం దీన్ని పిండిప్రోలు లక్ష్మణకవి 1797లో రచించాడు. దక్షారామ సమీపాన ఉన్న కుయ్యేరు గ్రామంలోని గోపాలస్వామికి అంకితం చేసాడు. ఇది రెండశ్వాసాల కావ్యం. కవి తండ్రి ఆనతితో తమ లంకమాన్యాన్ని లాక్కున్న దమ్మన్నను రావణునితో పోల్చి రాసిన కావ్యం ఇది. రావణదమ్మీయం అని కూడ పేరున్నది దీనికి. కవి మాత్రం లంకావిజయమనే పిలిచాడు.
అమరు సకలలోక సమితి కుయ్యేరీతి
రహితముగను సిరి కిరవును విబుధ
విలసితంబు నగుచు విపులంబయోధ్య య
ను నగరము సురపురి ననుకరించి
కృష్ణార్జున చరిత్రం దీన్ని మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి 1850 ప్రాంతంలో రచించాడు. దీన్లో పారిజాతాపహరణం, విజయవిలాసం కలిసి ఉన్నాయి. ఇదీ రెండాశ్వాసాల కావ్యం.
అవనిలోన మిగుల నలరారు ద్వారక
వాట రమ్య హేమకూట కనక
విద్రుమాది వస్తువితతి యింద్రప్రస్థ
పురములీల విబుధపూజ్యమగుచు
రామకృష్ణోపాఖ్యానం దీన్ని శ్రీపాద వెంకటాచలకవి రచించి, పూసపాటి విజయరామ గజపతికి అంకితమిచ్చాడు. ఇది మూడాశ్వాసాల కావ్యం. భాగవతంలోని దశమస్కంధంనుంచి కృష్ణకథ, భాస్కర రామాయణం నుంచి రామకథ తీసుకుని రాసిన కావ్యం ఇది. అముద్రితం.
శివరామాభ్యుదయం దీన్ని పోడూరి పెదరామామాత్యుడు 18వ శతాబ్దంలో రచించాడు.
ఇవికాక చెన్న కృష్ణకవి యాదవభారతీయం, కొత్తపల్లి సింగరాచార్యుని రాఘవవాసుదేవీయం, విక్రాల శ్రీనివాసాచార్యకవి సౌగంధికాపారిజాతీయం మొదలైన ద్వ్యర్థికావ్యాలున్నాయి. ఇంకా కొత్తపల్లి సుందరరామయ్య వసుస్వారోచిష మనుసంభవం, గౌరీభట్ల రామకృష్ణశాస్త్రి ఏకవీరకుమారీయం, రావూరి దొరస్వామి ఆంధ్ర రాఘవపాండవీయం, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు ఏసుకృష్ణేయం ఆధునిక ద్వ్యర్థి కావ్యాలు.
త్య్రర్థి కావ్యాలు
రాఘవయాదవపాండవీయం దీన్ని బాలసరస్వతి రచించాడు. ఇతను 17వ శతాబ్దికి చెందిన వాడు. ఇది నాలుగాశ్వాసాల కావ్యం. వేంకటేశ్వరునికి అంకితమివ్వబడింది.
యాదవరాఘవపాండవీయం దీన్ని నెల్లూరి వీరరాఘవకవి 1717 ప్రాంతంలో రాసాడు. ఇది నాలుగాశ్వాసాల గ్రంధం.
శ్రీలకిరవు బహుళ సిత భానుకులులకు
నాటపట్టు సజ్జనాస్పదంబు
మహినయోధ్య కాంతి మధురసాలోజ్వ్జల
నాగపురి దనర్చు నవ్యలీల
ఈపద్యంలో అయోధ్య, మధుర, హస్తినాపురం మూడు పట్టణాలు వచ్చాయి.
రాఘవపాండవయాదవీయం దీన్ని అయ్యగారి వీరభద్రకవి మూడాశ్వాసాల కావ్యంగా రాసాడు.
వర సంపద్గుణ కరిపురి
తరళమణీనాథ రాజిత రుచి మధురనా
గరమాతులిత స్వర్గజ
యరయు మహోద్భట యయోధ్య యనదగు ధరణిన్
రామకృష్ణార్జున రూపనారాయణీయం దీన్ని ఓరుగంటి సోమశేఖరకవి 1877లో పూసపాటి నారాయణరాజుకు అంకితం ఇచ్చాడు.
సారంగధరీయం దీన్ని పోకూరి కాశీపతి కవి 1930లో రచించి గద్వాల రాణి ఆదిలక్ష్మిదేవమ్మగారి భర్తకు అంకితమిచ్చాడు. సారంగం అంటే లేడి. దాన్ని ధరించినవాడు శివుడు. లేడి గుర్తుగా ఉన్నవాడు చంద్రుడు. అలా శివుడు, చంద్రుడు, సారంగధరుడు ఈ ముగ్గురి కథల్ని కలిపింది ఈ నాలుగాశ్వాసాల కావ్యం.
చతురర్థ కావ్యాలు
నలయాదవరాఘవపాండవీయం దీన్ని మరింగంటి సింగరాచార్యులు రచించాడు.
ఇదే పేరున్న కావ్యాన్ని గునుగుటూరి వెంకటకృష్ణకవి 1650లో రాసినట్లు తెలుస్తోంది.
ఇవన్నీ కాక శతకాల్లో కూడ రెండర్థాలు వచ్చేవి కొన్ని ఉన్నాయి.
ముగింపు
అనేకార్థ కావ్యాలలో భీమన రాఘవపాండవీయం నామమాత్రావశిష్టం. భీమన తర్వాత ఐదు శతాబ్దాల పాటు ఇలాటి కావ్యాలు తెలుగులో రాలేదు. అలా, సూరన్నే ఈ ప్రక్రియకు పునఃశ్రీకారం చుట్టాడు. సూరనని అనుసరించి రామరాజభూషణుడు, కృష్ణాధ్వరి మొదలైన వారు తర్వాత ఎన్నో కావ్యాలు రాసారు. దక్షిణాంధ్రయుగంలోని కవులు ఈప్రక్రియలో మూడుపూలు ఆరుకాయలు కాయించారు. ఆధునికకాలంలో కూడ కొన్ని కావ్యాలు వచ్చాయి. వీటన్నిటి బట్టి ఆంధ్రులకు అనేకార్థకావ్యాలంటే ప్రత్యేకాభిమానం ఉన్నట్లు తోస్తోంది.