“ఒరేయ్! అన్నయ్యా! భయం!!”
“గిరీ! ఇంకా సాయంకాలం ఏడు దాట లేదు. ఇప్పుడే కదా చీకటి పడింది! నాన్న గారు కాసేపట్లో వచ్చేస్తారు. అంతవరకు కుదురుగా కూర్చో. భయమేసే ఆలోచనలు బుర్రలోకి రానీయకు.”
“మాట్లాడకుండా కూర్చుంటే భయమేసే ఆలోచనలే వస్తున్నాయిరా!”
“పోనీ, వర్డ్ బిల్డింగ్ ఆడుకుందాం. నేను దేవుడితో మొదలు పెడతాను … గాడ్”
“డాగ్”
“గోట్”
ఇలా ఒక అరగంట ఆట ఆడేసరికి గిరికి వచ్చిన ఇంగ్లీషు మాటలు అయిపోయాయి. అందుకని ఆట ఆపేసేం.
“భయం!”
“ఊరికే భయం, భయం అంటూ నన్ను కూడ భయపెట్టెయ్యకు! పోనీ మరొక ఆట ఆడదాం. నేను తమాషాగా మాటలోని అక్షరాలని కలగా పులగం చేసి అంటాను, నువ్వూ అలాంటిదే మరొకటి అనాలి.”
“సరే!”
“సిరం, కలాబుడ్డి” అని ఆట మొదలుపెట్టేను.
“చొక్కరు, నిక్కా”
“చెక్క, అల్లెలు”
“పుహం, సింలి”
“…”
“అయ్య బాబోయ్” అంటు గిరి నా పీక ఒక్క సారి పట్టేసుకున్నాడు.
అదేవిట్రా? ఇప్పుడేమొచ్చింది?”
“పు..పు..ప్పు..లి”
“నువ్వే కదురా అన్నావ్. మరి భయమేసే మాట ఎందుకు అన్నావ్?”
ఇలా పట్టుకున్న నా పీకని నాన్నగారి కిర్రు చెప్పుల చప్పుడు వినిపించే వరకు వదల లేదు, వాడు. ఇంకొక రెండు క్షణాలలో ఒక చేత గొడుగు కర్ర, మరొక చేత హరికేన్ లాంతరుతో నాన్నగారు పాక లోకి రానే వచ్చేరు. వచ్చి కర్ర, లాంతరు మాకిచ్చి మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమన్నారు.
“చీకట్లో పురుగూ పుట్రా ఉంటాయి. కర్రతో రోడ్డూ మీద గట్టిగా కొడుతూ, దీపం వెలుగు ఎక్కడ పడుతోందో అక్కడే అడుగు వేస్తూ జాగ్రత్తగా వెళ్ళండి.”
గిరి భయపడ్డట్టు నాన్నగారికి చెప్పలేదు. చెప్పుంటే “హోరి! వెర్రి కక్కగట్టా!” అనుండేవారు.
* * * * * * *
అది 1955 వేసంగిలో సంగతి. నాన్నగారు ఇల్లు కట్టిస్తున్నారు. ఇంటికి కావలసిన కలప, ఇటిక, గునపాలు, పారలు, మొదలైన సరంజామా అంతా స్థలంలోనే ఉన్నయ్. పగలల్లా పని వాళ్ళు ఉంటారు గనుక పరవా లేదు కాని రాత్రి మాత్రం మనిషి కాపలా లేకపోతే సరుకులు మాయం అయిపోతాయి.
కనుక నూతికి ఎదురుగా చిన్న ఒంటిదూలం పాక వేసి, అందులో ఈ సామాను పెట్టి దానికి రోజూ కాపలాకని నాన్నగారు ఆ పాకలోనే ఒక మడత మంచం వేసుకుని పడుక్కునేవారు. సాయంకాలం ఏడింటికి ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళా ఒక గంటలో తిరిగి వెళ్ళిపోయేవారు. ఆ గంటసేపూ కాపలా పని ఇంట్లో పిల్లల మీద పడేది. ఇంటి దగ్గర ఉన్న మగ పిల్లలలో నేనే పెద్దవాడిని కనుక ఆ బాధ్యత తరచు నా మీద పడేది.
నేనేమీ చిన్న వాణ్ణీ చితక వాణ్ణీ కాదు. అయినా సరే నాకు కూడ ఆ దయ్యాల తోటకి ఎదురుగా ఉన్న స్థలంలో ఒంటరిగా కూర్చుందికి బెదురుగానే ఉండేది. ఈ భయానికి కారణం లేకపోలేదు.
నేను అప్పటికే కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో చేరి ఒక ఏడు అయింది.హాస్టల్ లో ఉండే వాడిని. హాస్టల్ అంటే వాల్తేరులో సద్ధర్మ సదనం లాంటి భవనం కాదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న రోజులలో యుద్ధంలో దెబ్బలు తగిలిన సైనికులకి వాడిన హాస్పిటల్ వార్డులు. అక్కడ ఉన్న మామిడి తోటని నరికి, మధ్యలో తెరిపి చేసి, అక్కడ తాత్కాలికంగా కట్టడానికి ఎనిమిదేసి గదుల చొప్పున ఎనిమిది కట్టడాలు పొడుగ్గా, గుర్రాల సాలల్లా కట్టేరు. అక్కడ పుకారు ఏమంటే ఆసుపత్రిలో చచ్చిపోయిన సైనికులు దయ్యాలయి ఆ తోటల్లో తిరుగుతున్నాయని. కాలేజీకి వెళితే దయ్యాలు. మా ఊరొస్తే దయ్యాలు. ఈ దయ్యాల సంసారం కాదు కాని భయపడి చస్తున్నాం.
అందుకని గిరిని నాకు సాయం ఇచ్చి పంపేవారు. వాడు నా కంటె భయస్తుడు. పెళ్ళికెళుతూ పిల్లిని చంకనెట్టుకు వెళ్ళడం అంటే ఇదే!
నాన్నగారు ఇల్లు కట్టడం అంటే ఇప్పుడు మొదలు పెట్టేరు కాని, అసలు అమ్మకీ నాన్నగారికీ తమదంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుందనే కోరిక చాల ఏళ్ళబట్టి ఉంది. కోరికలుండడంలో తప్పు లేదు. తీరే అవకాశాలు రావద్దూ?
అలాగని మాట అనుకున్నంత మాత్రాన వచ్చిన నష్టం ఏమిటి? అందుకనే “ఇల్లు కట్టుకుంటే బాగుండును” అని అనుకునేవారు అప్పుడప్పుడు. ఇలా మసకగా ఉన్న ఊహ ఘనీభవించి ఒక స్ఫటికాకారం దాల్చడానికి ఆ వేళ పోష్టు జవాను పట్టుకొచ్చిన ఉత్తరం నాంది పలికించింది.
ఉత్తరం చదివి నాన్నగారు చిందులు తొక్కడం మొదలు పెట్టేరు. వీలు చూసుకుని త్వరలో ఇల్లు ఖాళీ చేసెయ్యమని మా ఇంటి కొత్త యజమాని ఉత్తరం రాసేడు. ఖాళీ చెయ్యమని అతను అడిగినందుకు నాన్నగారికి కోపం రాలేదు. అతను ఇల్లు కొనుక్కున్నప్పుడు, “ఏమయ్యా! నువ్వు ఉండడం కోసం కొనుక్కుంటే చెప్పు, ఖాళీ చేసేస్తాను,” అని నాన్నగారే అన్నారు.
“పంతులు గారూ! పిల్లలతో ఉన్నారు. మీరు కోటయ్యకి ఎంత అద్దె ఇచ్చేవారో నాకూ అదే ఇవ్వండి. నేనెక్కడో ఖరగ్‌పూర్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాను. నాకీ ఇల్లు ఇప్పట్లో అక్కర లేదు,” అని తన ఇద్దరి పెళ్ళాల సమక్షంలోనూ చెప్పేడు. చెప్పి, మా ఇంట ముగ్గురూ భోజనం చేసి మరీ వెళ్ళేరు. అటువంటి ఆసామీ ఖరగ్‌పూర్ వెళ్ళిన వెంటనే మనస్సు మార్చుకుని ఇల్లు ఖాళీ చేసెయ్యమంటూ ఉత్తరం రాసేడు.
ఏమనుకున్నాడో ఏమో, తనెందుకు మనస్సు మార్చుకున్నాడో సంజాయిషీ కూడ రాసేడు.
ఈ సంజాయిషీ చదివిన తర్వాతే నాన్నగారికి కోపం వచ్చింది.
“పంతులుగారూ! మీకిచ్చిన మాట నిజమే. మీరు ఆ ఇంట్లో గత పదిహేను ఏళ్ళబట్టీ ఉంటున్నారు కనుక ఇల్లు మీదే అని మీరు అనే ప్రమాదం ఉందని అక్కడ మీ ఇరుగు పొరుగులు నాకు పిరికి మందు పోసేరు. అందుకనే మిమ్మల్ని ఖాళీ చెయ్యమని అడుగుతున్నాను,” అంటూ మర్మం లేకుండా మనసులో మాట రాసేడు.
ఆ ఇల్లు అధర్మంగా కొట్టేద్దామన్న ఊహ నాన్నగారికి ఏ కోశాన్నా లేదు.
నిప్పు లాంటి తనని రైలు ఇంజనులో ఫైర్‌మన్‌గా పనిచేసే ఒక అనామకుడు అనుమానిస్తాడా? అదీ నాన్నగారి కోపానికి కారణం.
ఈ వెధవ పని ఆ కొవ్వూరి వెంకయ్యప్పే చేసుంటుందని ఒకరు, లేదు షరాయి మేస్టరు చేసుంటాడని మరొకరు పత్తేదారీ మొదలు పెట్టేరు.
చెప్పుడు మాటలు ఎవ్వరు చెప్పేరో మనకి తెలియదు. తెలియనప్పుడు మరొకరిని మాట అనడం ఏమి భావ్యం? “అమ్మన్న గారూ, అమ్మన్న గారూ” అంటూ ఇంట్లో పెట్టిన ఇంగువ చారు పట్టుకు పోయేది ఒకరైతే “పంతులు గారూ, పంతులు గారూ” అంటూ అవసరం అయినప్పుడల్లా ఇంటి పంచని వేల్లాడి హొమియోపతీ మాత్రలు పట్టికెళ్ళేది మరొకరు. వీళ్ళేనా వెనక్కి తిరగ్గానే చెప్పుడు మాటలు చెప్పేది? చెప్పుడు మాటలు చెప్పినవాడిది కాదు తప్పు; విన్న వాడిది. అందుకని నాన్నగారికి ఇంటి ఓనరు మీదే కోపం వచ్చింది. అదే ఊపులో ఇరుగు పొరుగులందరిమీదా విరక్తి పుట్టింది.
ఆ కోపంతో ఉత్తరం వచ్చిన ఉత్తరక్షణం ఇల్లు ఖాళీ చెయ్యడానికి ఉద్యమించేరు. అనుకున్నంతలో అద్దె ఇళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఆఖరికి పక్క వీధిలో, పెత్తెలుగు మేష్టారి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంద్రగంటి రత్తమ్మ గారింట్లో ముందు భాగం ఖాళీగా ఉందని తెలిసి అమ్మతో చెప్పకుండా ఒక నెల అద్దె బయానాగా ఇచ్చి చక్కా వచ్చేరు.
“చెరువు మీద అలిగి, నీలాంటి వాడే, ముడ్డి కడుక్కోవడం మానేసేడుట. అలా ఉంది నువ్వు చేసిన యావ్వారం,” అని మామ్మ నాన్న గారిని మందలించింది. “ఆ రత్తమ్మ పరమ గయ్యాళి. గోడ మీద మేకులు కొడితే తన గుండెల మీద కొట్టినట్లు ఉందని ఆ ఇంట్లో ఇంతకు పూర్వం అద్దెకి ఉన్న వాళ్ళని తరిమి తగిలేసింది. మనింటి నిండా ఇంటిడు పిల్లలు. గంటల పంచాగం వేల్లాడదీసుకుందికైనా గోడకి మేకు కొట్టాలి కదరా! ఇహ ఇంట్లో ఆడ పిల్లలు ఉన్న తర్వాత కాటుక వేళ్ళని అద్దం పక్క గోడకి రాసి తుడుచుకున్నా తుడుచుకుంటారు. ఒక పూత వెల్ల వేస్తే పోయేదానికి బదులు అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటే మళ్ళా ఎక్కడికి పోతాంరా?”
“ఆ రత్తమ్మ చండశాసనురాలుట. ఏడాది క్రితం మొగుడు చచ్చిపోయినప్పుడు శవాన్ని సావిట్లో పడుకోబెట్టి, అటకెక్కి ఆస్తులకి సంబంధించిన రాతకోతల కాగితాలన్నీ కొంగులో దోపుకుని, అటక దిగొచ్చి అప్పుడు ఘొల్లు మందిట! మనని బతకనిస్తుందా?” అంటూ చిన్నక్క తనకి తెలిసిన మసాలాని తను అందించింది.
నోరు మంచిదైతే ఊరుమంచిదౌతుందనే తత్వం అమ్మది. రత్తమ్మ గారితో వరస కలిపింది. ఆవిడ కొడుకునీ, కోడలునీ మచ్చిక చేసుకుంది. అయినా సరే రత్తమ్మామ్మ గారికి మా ఇంట్లో పిల్లలు చేసే రొద కిట్టలేదుట. కోడలా కోడలా అని వరసలు కలుపుతూనే ఇల్లు ఖాళీ చేసెయ్య మన్నారు. సంవత్సరం తిరగకుండా మళ్ళా మా పాత ఇల్లు ఉన్న వీధిలోనే అనకాపల్లి మేస్టారి ఇంట్లోకి మారేం.
ఈ ఇంట్లో సదుపాయం తక్కువ. వాస్తు కోసమనో మరెందువల్లో వీధి గుమ్మంలో, గేటు పక్కనే పాయిఖానా కట్టేరు. దాని పక్కనే నుయ్యి. నూతికెదురుగా ప్రహారీ గోడని ఆనుకుని నేలమట్టంగా దింపిన పంచపాళీయే వంట గది. మిగిలిన ఇల్లంతా పది మెట్లు ఎగువ. పప్పు కావాలన్నా, ఉప్పు కావాలన్న కొండెక్కినట్లు ఈ మెట్లన్నీఎక్క వలసిందే. పెద్దవాళ్ళందరికీ కీళ్ళ నొప్పులో, వాతపు నొప్పులో ఉండబట్టి ఈ ఎగుడూ, దిగుడూ ఇబ్బందే పెట్టింది. మరేవిధంగా చూసినా ఇల్లు వాసయోగ్యంగా లేదనే చెప్పాలి. కనుక మళ్ళా ఇల్లు మారవలసి వచ్చింది. ఆ సందర్భంలో ప్రసాదరావు మావయ్య గారూ, రామం అత్తయ్య ఊళ్ళో అద్దెకిచ్చిన వారిల్లు ఒక సారి చూసి పోదామని వచ్చి మమ్మల్ని పలకరించడానికి వచ్చేరు.
ప్రసాదరావు మావయ్య గారికి అమ్మన్నా, నాన్నగారన్నా మంచి భక్తి. ఆయన చదువుకునే రోజులలో ఆయన జాతకం చూసి, “ప్రసాదరావూ! నువ్వు మేజస్ట్రేటు ఉద్యోగం చేస్తావు” అని చెప్పేరుట. ఇప్పుడు ఆయన పెద్దాపురంలో ఆర్. డి. ఒ. గా పనిచేస్తున్నారు. అందుకని ఆయనకి నాన్నగారంటే అపరిమితమైన గురి. రామం అత్తయ్య కి అమ్మ దేవతే. ఇంటిని అద్దెకి ఇచ్చేసి పెద్దాపురం వెళ్ళిపోయినా తుని వచ్చినప్పుడు మమ్మల్ని పలకరించకుండా వెళ్ళేవారు కాదు.
మా పరిస్థితి చూసి ఎవరో పరాయి వాళ్ళు ఉండే కంటె మేముంటే బాగుంటుందని మమ్మల్ని వారింట ఉండమని అడిగేరు. “సొంత ఇల్లే అనుకుని ఉండండి. మీరు ఇల్లు కట్టుకునే వరకు ఇల్లు ఖాళీ చెయ్యమని అడగం,” అని హామీ ఇచ్చేరు. కనుక నేను స్కూలు ఫైనలు పూర్తి చేసి ఇంటరులో జేరే వేళకి మేము ప్రసాదరావు మామయ్య గారి ఇంట్లోకి మారేం.
ఆ ఇంట్లో ఉన్న రోజులలో అమ్మ చిట్టన్నయ్యతో అనేది, “చిట్టిపంతులూ, ఇలా పిల్లి పిల్లల్ని మార్చినట్లు సంసారాన్ని ఎన్ని సార్లురా మార్చడం? మీ నాన్న గారు రిటైరయే రోజులు వచ్చేయి. ఆయన ప్రోవిడెంట్ ఫండు పెట్టి చిన్న స్థలం కొనుక్కుని మనదంటూ ఒక చిన్న ఇల్లు కనీసం ఒక పాక ఉంటే బాగుంటుందిరా అబ్బాయ్.”
అప్పుడు చిట్టన్నయ్య ప్రోద్బలంతో నాన్నగారు స్థలం కోసం వెతకడం మొదలు పెట్టేరు.
తునిలో మేముండే కొత్తపేట ఊరుకి ఓ చివర ఉంది. కంది చేలు నరికి, రోడ్లు వేసి కట్టగా వెలిసిన శివారు. బజారులో బయలుదేరి పోలీసు నుయ్యి దాటిన తర్వాత సూరవరం రోడ్డు వెంబడి లక్షిందేవి చెరువు వైపు వస్తూ ఉంటే ముందుగా “సెంటుజార్జి కోట” తగులుతుంది. ముక్కు మూసుకుని పదడుగులు జోరుగా వేసి ముందుకి వస్తే ఎడం పక్క రాజు గారి తోట. దీనినే ఏనుగు తోట అనేవారు. ఈ తోటలో ఒక మూల రాజుగారి ఏనుగు ఉండేది. అక్కడ కంపు భరించలేకనో ఏమో దరిమిలా ఆ ఏనుగుకి పిచ్చెక్కింది. తుపాకితో కాల్చేసి అక్కడే పాతి పెట్టేసేరు. తర్వాత సెంటు జార్జి కోటని పడగొట్టేసి ఏనుగు దిబ్బ మీద ఒక పార్కు కట్టేరనుకోండి.
ఆ పార్కు వెనక గుర్రాల సాలలు. నా చిన్నతనం నుండీ ఈ సాలలు శిధిలావస్థలోనే ఉన్నాయి తప్ప నాకు గుర్రాలెప్పుడూ కనిపించ లేదు. ఈ ఏనుగు దిబ్బ, గుర్రాల సాలలు మొదలుకొని, ఇటు సూరవరం రోడ్డు వెంబడి ఒక అర మైలు పైగా విస్తరించి ఉండేది, రాజుగారి తోట. నేను ఎనిమిదో తరగతి చదివే రోజులలో కూడ ఆ తోటలో అపురూపమైన రకరకాల ఫలవృక్షాలు ఉండేవి. దక్షత లేక క్రమేపీ పాడయి పోయింది. ఈ తోటకి ఎదురుగా, సూరవరం రోడ్డుకి కుడివైపున శ్రీ రాజా ఉన్నత పాఠశాల వారి బంతుల బీడు. ఓ ఇరవై ఎకరాలు ఉంటుంది. ఆ బీడు పక్కనే రాణీ సుభద్రయ్యమ్మ వారి పేర కట్టించిన ఘోషాసుపత్రి. ఆసుపత్రి చిన్నదే అయినా ప్రాంగణం పెద్దది. ముప్ఫై ఎకరాలు పైగానే ఉంటుందేమో. అదీ దాటుకు వస్తే దయ్యాల తోట, దాని తర్వాతే కొత్తపేట మొదలవుతుంది.
ఈ కొత్తపేటలో మేముండే వాళ్ళం. బజారుకి వెళ్ళాలన్నా, రైలు స్టేషన్ కి వెళ్ళాలన్నా, ఊళ్ళో మరెక్కడికి వెళ్ళాలన్నా ఈ పేట దాటి, ఆ దయ్యాల తోట దాటి, బంతుల బీడు గేటు దాటి వెళ్ళేవాళ్ళం.
నిజానికి ఈ దయ్యాలతోట ఒక మామిడి తోట. కుర్ర కుంకలు తోటలో చొరబడి కాయలు కోసేయకుండా ఆ మామిడి చెట్ల మీద దయ్యాలు ఉన్నాయని ఒక వదంతి పుట్టించేరేమోనని ఈమధ్య నాకొక అనుమానం పుట్టుకొచ్చింది. కాని అప్పట్లో మాత్రం నేను కూడ ఆ చెట్ల మీద దయ్యాలున్నాయని నమ్మిన వాడినే. నమ్మక చస్తానా? ఘోషాసుపత్రి ప్రాంగణంలోనే శవాలని కోసే గది ఉండేది. ఆ శవాలకి సంబధించిన దయ్యాలే ఘోషాసుపత్రి గేటు ముందున్న తాటిచెట్టు మీద ఒకటి, ఆ పక్కనున్న మామిడి తోటలో మరికొన్ని ఉండేవి.
“ఉండేవి” అని తెలుసున్నట్లు ఎందుకు చెబుతున్నానంటే దేవరకొండ వెంకటేశ్వర్లు స్వయంగా చెప్పేడు కనుక.
వాడికి ఎలా తెలుసంటారా?
వాడు ఒక రాత్రి సైకిలేసుకుని ఆ దారి వెంబడి వెళుతూ ఉంటే ఆ సైకిలు వెనక సీటు మీద వచ్చి కూర్చుందిట ఒక దయ్యం. వాడు ఇలా వర్ణించి చెబుతూ ఉంటే నమ్మకుండా ఎలా ఉండడం? అయినా లాయరు గారి మేనల్లుడ్ని కనుక వాడిని కొంచెం క్రాసు పరీక్ష చేసేను.
“నువ్వు దెయ్యాన్ని నీ కళ్ళతో చేసేవా? కోతలు కోసేస్తున్నావా?”
“నా కళ్ళతో చూడలేదు. వెనక్కి తిరిగి చూడడానికి భయం వేసింది.”
“చూడకపోతే దయ్యం సైకిలెక్కిందని ఎలా తెలిసింది?”
“వెనక సీట్లో ఏదో ఎక్కింది. ఆ బరువుకు హేండిల్బారు ఇటూ అటూ విసిరేయడం మొదలు పెట్టింది.”
“ఏదో ఏమిటి. నా బొంద! ఎవరో ఎక్కి ఉంటారు.”
“అది ఎవరో అయితే నేను తొక్కుతున్నకొద్దీ ఎందుకు ఎక్కువ బరువవుతుంది? కనుక అది ఖచ్చితంగా దయ్యమే.”
దయ్యాలకి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయనీ, అవి మన వెంట పడ్డప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తే వెంటనే మటుమాయం అయి పోతాయనీ, దేవగణంలో పుట్టినవాళ్ళకి దయ్యాలు అస్సలు కనిపించనే కనిపించవనీ, ఇలా చెలామణీ అవుతూ వున్న రకరకాల సిద్ధాంతాలతో పాటు దేవరకొండాడు పైన చెప్పిన సమాధానంతో మరొక కొత్త సిద్ధాంతం లేవదీస్తున్నాడన్న మాట. సైకిళ్ళు ఎక్కిన దయ్యాలు క్రమేపీ బరువెక్కుతాయని.
“నీతో ఎంత దూరం వచ్చిందేమిటి?”
“దయ్యాల తోట చివరికంటా వచ్చింది తర్వాత దిగిపోయింది.”
“దిగి ఎక్కడికి వెళ్ళిందంటావ్?”
“మళ్ళా మామిడితోటలోకి వెళ్ళిపోయి ఉంటుంది.”
కనుక చీకటి పడ్డ తర్వాత మాకు అటువేపు వెళ్ళడానికి భయం వేసేది. దేవరకొండాడి మాటలొక్కటే కాదు అందుకు కారణం. ఆ తోటలో ఎప్పుడూ చిన్న చిన్న దీపాలు మినుకు మినుకు మంటూ, వెలుగుతూ, ఆరుతూ, గాలిలో ఎగురుతూ కనిపించేవి. దయ్యాలే చిన్న చిన్న బుడ్డి దీపాలు పట్టుకుని ఎగురుతున్నాయని అనుకునేవాళ్ళం. పైపెచ్చు చీకటి పడే సమయానికి అవి వంటలు వండుకునేవి కాబోలు ఎప్పుడూ బంగాళా దుంపల వంటకాలలా ఘుమఘుమ వాసనలు వచ్చేవి.
ఘోషాసుపత్రి పక్కన ఉన్న మామిడి తోటలోనే దయ్యాలు ఉండేవి. ఆ ఎదురుగా ఉన్న ఏనుగు తోటలో దయ్యాలు ఉండేవి కాదు. అక్కడ వెదురు పొదలలో పాములు ఉండేవి.
దరిమిలా 1952 నాటికి రాజు గారు వెదురుపొదలతో పాటు తోటంతటినీ కొట్టించేసి, రోడ్లు వేయించి ఇళ్ళ స్థలాలుగా అమ్మకానికి పెట్టేరు. రిజిస్ట్రీ చేయించుకునేటప్పుడు ఇటు అమ్మేవాళ్ళూ, అటు కొనేవాళ్ళూ కూడ నాన్నగారి సలహా కోసం వచ్చేవారు. కనుక ఊళ్ళో ఎక్కడెక్కడ ఏయే స్థలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ధరలు ఎలా పలుకుతున్నాయో ఈ వివరాలన్నీ నాన్నగారికి బాగా తెలిసేవి.
ఏనుగు తోటలో స్థలాలు వేడి వేడి పకోడీలలా అమ్ముడు పోయాయి కాని, ఘోషాసుపత్రి కి ఎదురుగా ఉన్న వీధిలో మంగలి మాన్యపు స్థలాలు గభీమని అమ్ముడు పోలేదు. అక్కడ గజం రెండు రూపాయలు పలుకుతోంది అప్పట్లో. అందులో వెయ్యి గజాల స్థలం రిజిస్ట్రేషన్ విషయాలలో సహాయం చేసినందుకు గాను రూపాయిన్నర చొప్పున బేరం కుదుర్చుకున్నారు. తనకి వచ్చిన రెండు వేల ప్రోవిడెంటు ఫండులోనూ పదిహేను వందలు పెట్టి ఆ స్థలం కొనేసేరు.
ఆ స్థలంలో ఒక తోట వేసి, ఆ తోట మధ్యలో అప్పారావు డాక్టరు గారి ఇల్లు మాదిరి ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని అమ్మ, చిట్టన్నయ్య ఏవేవో పథకాలు వేస్తున్నారు. స్థలం మధ్యలో మంచి మేడ, చుట్టూ ప్రహారీ గోడ, గోడ మీదనుంది బయటకి ఒరుగుతూ బోగన్విలియా మొక్కలు, వీధి వాకట్లో పువ్వుల మొక్కలు, క్రోటన్లు, పెరట్లో అరటి బోదెలు, మామిడి చెట్లు ఇలా ఏదో పెద్ద పథకమే ఉంది అమ్మ బుర్రలో.
స్థలం కొనేయడం కొనేసేరు కాని, నన్ను కాకినాడలో చదివిస్తూ ఇల్లు కట్టడానికి నాన్నగారికి దమ్ములు చాలలేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు.
వెధవ డబ్బు అదే వస్తుంది. అంతకీ అవసరమైతే తన ఒంటి మీద బంగారం అమ్మేస్తానంటూ అలవాటుగా అమ్మ మెడ తడుముకుంది. అప్పటికి కాని ఆమెకి గుర్తుకి రాలేదు. కూతురి పెళ్ళికి కాసుల పేరూ, కొడుకుల చదువులకి ఎనిమిది పేటల చంద్రహారాలు వెళ్ళిపోయాయని.
ఈ సందర్భంలో దాసు మావయ్య గారు ఈయన నాన్నగారి స్నేహబృందంలో ఒకరు ఒక సలహా ఇచ్చేరు. మా ఊళ్ళో సలహాలు ఇచ్చే వాళ్ళు చాలమందే ఉండేవారు. అది కూడ డబ్బు పుచ్చుకోకుండా ఫ్రీ గా ఇచ్చేవారు.
“వెయ్యి గజాలు ఏమిటి చేసుకుంటారండీ? అయిదు వందల గజం అమ్మేసి ఆ డబ్బుతో మిగిలిన జాగాలో ఒక పాక వేసుకుని ఉండండి. మీదంటూ ఒక ఇల్లు ఉన్న తర్వాత అందులో మీరు కల్లే తాగేరో, గంజే తాగేరో ఎవరు చూడొచ్చారు.”
దస్తావేజు మీద సిరా ఇంకా ఆరకుండానే స్థలాన్ని రెండు ముక్కలు చేసి ఒక ముక్కని అమ్మేయడానికి అమ్మ ఇష్టపడ లేదు. చిట్టన్నయ్య ససేమిరా అన్నాడు.
“చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇల్లెలా కడతావోయ్. కాలేజీ చదువులు చదివేవు కాని, కానీ లంచం పుచ్చుకోవడం చేతకాలేదు నీకు. మేడ కడతాడుట! ఇల్లు కట్టి చూడు, పెళ్ళిచేసి చూడు అన్నారు,” అంటూ దాసు మావయ్య గారు అన్నయ్య మీద ఒక వెటకారపు విసురు విసిరేరు.
“అమ్మా, నేను అప్పో సొప్పో చేసి ఎలాగో డబ్బు పట్టుకొస్తాను. అంతవరకు దాసు మావయ్య గారి మాట వినేసి తొందరపడి ఏమీ చేసెయ్యకండి,” అని పదే పదే చెప్పి అన్నయ్య తన ఉద్యోగపు ఊరు వెళ్ళిపోయేడు.
అన్నయ్య ఎక్కిన రైలు బండి ఔటర్ సిగ్నల్ దాటే వరకు ఆగి, దాసు మావయ్య గారు నాన్న గారి మీద పనికి ఉపక్రమించేరు. ” మీ వాడికి ఆవేశం తప్ప అనుభవం లేదు. కరువు కాలం. సిమెంటు దొరకడం లేదు. కలప దొరకడం లేదు. మీ వాడికి రైల్వేలో ఉద్యోగమా ఏమన్నానా, అక్కడ ఉన్న కలప సరుకులు హోల్‌సేల్‌గా పట్టుకొచ్చేసి ఎవరోయ్ ! ఈ పక్క వీధిలో ఉన్నాడు, వాడపల్లి వారి అల్లుడు. రైల్వేలో గార్డ్ గా పనిచేస్తున్నాడు, అని అక్కడ ఉన్న నన్ను సంబోధిస్తూ మేడ కట్టేయడానికి! పునాదులేసి డబ్బు లేక పదేళ్ళ పాటు ఒదిలేసేరు ఆ దేవరకొండ వారు. చూస్తున్నాం కదా! పరిగెత్తి పాలు తాగే కంటె నిలబడి నీళ్ళు తాగడం మేలు. మీరు అందని వాటికి అర్రులు చాచి తూగ లేరు. నా మాట వినండి,” అంటూ అక్కడ ఉన్న నాన్నగారిని ఉద్దేశిస్తూ కొంచెం ఘాటుగా ఉపన్యాసం ఇచ్చేరు.
అప్పట్లో నా దగ్గర తంతే దమ్మిడీ లేదు కనుక ఇంటి విషయంలో నాకు ఓటు హక్కు లేదని నాకూ తెలుసు, ఆయనకీ తెలుసు. కుర్రాడినని నన్ను పూర్తిగా కొట్టిపారెయ్యడానికా వీలు లేదు. ఎందుకంటే మా వూళ్ళో మొదటివాడిగా నాకు ఇంజనీరింగు కాలేజీలో సీటు వచ్చింది. ఆయనేమో బట్టల కొట్లో గుమస్తా. అందుకని నన్ను మాటలలో కలిపీ కలపనట్లు మాటవరసకి కలిపేరు.
ఇలా తర్జనభర్జనలు జరుగుతున్న తరుణంలో కరైకుడీలో అలగప్ప చెట్టియార్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగు వెలగబెడుతూన్న శాస్త్రి బావ సెలవులకని చోడవరం వెళుతూ దారిలో అమ్మని చూసిపోదామని తునిలో దిగేడు. చోడవరం వెళితే, “ఏమిరా! పరిక్షలు ఎలా రాసేవురా?” అని పెద్ద మామయ్య గారు అడుగుతారు. తునిలో అలాంటి ప్రశ్నలు వేసి అత్తయ్య ఇబ్బంది పెట్టదు. తునిలో దిగడానికి అది కూడ ఒక కారణమే.
అత్తయ్య ఇల్లు కట్టుకుంటున్నాదంటే వాడికి మాత్రం సరదా కాదూ! వసారాలో ఉన్న ఉయ్యాల బల్లని డ్రాయింగు బోర్డులా వాడేసి, వాడు రెండ్రోజుల్లో ఒక ప్లేను గీసేసి, “అత్తయ్యా! ఇహ ఇంటి ప్లేను గీయించడానికి నువ్వేమీ ఖర్చు పెట్టక్కర లేదు. ఇదిగో మన కొత్తిల్లు,” అంటూ డ్రాయింగు కాగితం చుట్టని అమ్మ ముందు పరచి ఏవేవో చెబుతున్నాడు.
తన అన్న కొడుకు ఇంత ప్రయోజకుడైపోయినందుకు అమ్మ ఎంతగానో సంతోషించింది. నాకు ఐన్‌స్టయిన్ అంటే ఎంత గౌరవమో అమ్మకి వాళ్ళ అన్నయ్య అంటే అంత ఇది. ఆ అన్న కొడుకు వీడు. ఇన్ని క్వాలిఫికేషన్లు ఉండడంతో చిట్టన్నయ్య ఇంటికి వచ్చే వరకూ వాడు అమ్మకి కన్సల్టెంటుగా చెలామణీ అయిపోయేడు.
“ఏమిరా, శాస్త్రీ! దీనికి కాస్ట్ ఎస్టిమాటు వేసేవా?” ఇంటికొచ్చిన చిట్టన్నయ్య అడిగేడు.
“లేదు, బావా.”
“ఇక్కడ నల్లరేగడి మట్టి. పునాదుల దగ్గర కక్కూర్తి పడితే ఇల్లు కట్టిన మర్నాడే గోడలు బీటలు వేసేస్తాయి. ఏదీ, పునాదులు ఎలా డిజైన్ చేసేవో చూపించు.”
“పునాదుల గురించి ఇంకా ఆలోచించలేదు బావా.”
“పోనీలే. ఎలివేషన్ ఏదీ? రూఫ్ ఏదీ? ఆ రెండు వేసి పట్రా చూద్దాం.”
రెండు గంటల తర్వాత వాడు బిక్క ముఖం పెట్టుకుని వచ్చేడు.
“డాబా వేసెద్దాం.”
“రూఫ్ ఏదోయ్”
“రూఫ్ వెయ్యడం తెలియలేదు.”
“హోరి నీ ఇల్లు బంగారం గానూ. ఇదిట్రా నువ్వు వెలగబెడుతూన్న ఇంజనీరింగు” అని నాన్న గారు అందుకున్నారు.
అత్తయ్య దగ్గర వేసిన కుప్పి గంతులు మావయ్య గారి దగ్గర పారవని తెలిసి తెలివిగా అక్కడ నుండి తప్పుకున్నాడు, శాస్త్రి బావ.
ఈ సంభాషణ అంతా దాసు మావయ్య గారు విన్నారు. విని, అమ్మ దగ్గరకి వచ్చి,
“చెల్లమ్మా, చూడండి. స్థలం కొని చాల రోజులు అయిపోతోంది. ధరలా పెరిగి పోతున్నాయి. మీరు ఈ వేసంగిలో ఏదో విధంగా ఇల్లు కట్టేయ్యాలి. మీ చిట్టిపంతులు డబ్బు గణించి మేడ కడతానంటే నేను వద్దంటానా! పోనీ, అందాకా స్థలంలో ఓ మూలకి చిన్న పంచ దింపుదాం. డబ్బు సర్దుబాటు అయినప్పుడు ముందుకి మేడ కట్టుకుందాం. చిట్టిపంతులుకీ, శాస్త్రికీ ఈ పని అప్పజెబితే వాళ్ళు గాలిలో అలా మేడలు కడుతూనే ఉంటారు.”
వేడిగా ఉన్న ఇనప కడ్డీ మీద సమ్మెటతో దెబ్బ వేసినట్లు, ఏమీ పాలు పోని స్థితిలో అమ్మకీ, నాన్నగారికీ దాసు మావయ్యగారి బోధ నచ్చింది.
దీర్ఘ చతురంగా ఉత్తరముఖంగా ఉన్న స్థలంలో నైరృతి మూల చిన్న పంచ దింపడానికి నిశ్చయం చేసేరు. ఉన్న స్థలంలో సగానికి పైగా తూర్పుకీ ఈశాన్యానికీ ఒదిలేయడం మంచిదే అని దాసు మావయ్య గారు చెప్పగానే “సరే” అన్నారు నాన్న గారు.
“ఇల్లు మరీ మూలకి వచ్చినట్లుంది. అప్పారావు డాక్టరు గారి ఇల్లులా స్థలంలో మధ్యకి ఇల్లు ఉంటే బాగుంటుందని అన్నయ్య అంటున్నాడు కదా” అన్నాను.
“అనడానికేమి! అంటాడోయ్. ఇల్లు ఇలా ఒక మూలకి ఉంటే, రేప్పొద్దున్న డబ్బు అవసరం వస్తే ఆ తూర్పు భాగాన్ని మరొక స్థలంగా అమ్మేసుకోవచ్చు. అంతే కాకుండా తూర్పు వైపు ఎక్కువ జాగా వదిలెయ్యడం వాస్తు ప్రకారం మంచిదోయ్.”
నాన్న గారు స్థలం కొనడం చూసి మరికొంత మంది ముందుకి వచ్చి ఇటూ అటూ ఉన్న స్థలాలని కొనేసేరు. కాని ఆ నిర్జన ప్రదేశంలో మొట్టమొదట శంఖు స్థాపన జరిగిందీ, గృహప్రవేశం జరిగిందీ మా ఇంట్లోనే.
ఇల్లు కట్టాలంటే నీళ్ళు కావాలి కదా. అందుకని ముందస్తుగా నుయ్యి తవ్వించేరు. శాస్త్రం మాట ఎలా ఉన్నా ఇంటిని నైరృతి మూలలో ఇరికించడానికి నిర్ణయం అయింది కనుక, నుయ్యి వీధి గుమ్మంలోకి వచ్చింది. అంటే ఇంటికి ఎవ్వరు వచ్చినా ముందు వాళ్ళకి కనబడేది నూతి దగ్గర స్నానాలు చేస్తూన్న ఆడవాళ్ళు. ఈ విషయం ఇల్లు కట్టడం పూర్తి అయేవరకు అవగాహన కాలేదు.
నుయ్యి తవ్వడం మొదలు పెట్టేరు. లంకెల బిందెలేమైనా దొరుకుతాయనుకున్నారో ఏమిటో, నాన్నగారు తవ్వకం అవుతూన్నంత సేపు నన్ను అక్కడ కాపలా పెట్టేరు. నూతిలో నీళ్ళకి బదులు పెట్రోలియం పడితే బాగుండునని నేను కోరుకున్నాను. లంకెల బిందెలూ దొరకలేదు, ఖనిజపు నూనే పడలేదు, కాని కొబ్బరి నీళ్ళల్లాంటి తియ్యటి నీళ్ళు పడ్డాయి.
ఇల్లు కట్టడానికి కావలసిన ఇటికలు, సున్నం, కలప వగైరాలన్నీ సమకూర్చడం మొదలు పెట్టేరు నాన్నగారు. అన్నీ ఒక్క సారి కొనలేరు కనుక ఒకటీ, ఒకటీ కొనడం మొదలు పెట్టేరు. ఇలా కొన్న సరుకంతా ఎక్కడ దాచుతారు? మా స్థలంలోనే నిల్వ చెయ్యడానికి నిశ్చయించేరు.
ఇలా నిల్వ చేసిన సరుకులకి ఆ రోజు సాయంకాలం నేను, గిరి కాపలా కాసేం.
పునాదులు తవ్వడం మొదలు పెట్టేరు. తవ్వకం సగం అయేసరికి పక్క స్థలం కొనుక్కున్న బెహరా డాక్టరు గారు ముగ్గు, పురికొస తాడుతో ఒక సర్వే చేసే మనిషితో తన స్థలం సరిహద్దులు గీసుకుందికి వచ్చేరు. ఆ కొలతలు అయేసరికి మా పునాదులు ఒక అడుగు ప్రాప్తికి వాళ్ళ స్థలంలోకి వెళ్ళినట్లు తేలింది.
నిజానికి తప్పు మాది. సూరవరం రోడ్డు మొగలో ఉన్న మాటేటారి స్థలం మరీ రోడ్డు మీదకి వెళ్ళిపోయిందని పంచాయితీ బోర్డు వారు వారి స్థలం పడమటి సరిహద్దు నుండి ఒక అడుగు కోసేసి, వారి తూర్పు సరిహద్దుని ఒకడుగు తూర్పుకి జరిపేరు. దాంతో బెహరా వారి స్థలం ఒకడుగు తూర్పుకి జరిగింది. ఈ విషయం మా వాళ్ళు చూసుకోలేదు. మా ఇల్లు స్థలం మధ్యలో ఉండుంటే ఈ మాత్రపు సరిహద్దులలో సర్దుబాటు వల్ల ఎవ్వరికీ నష్టం రాకపోను ఇంకా ఎవ్వరూ ప్రహారీ గోడలు కట్టలేదు కనుక. కాని మా వాళ్ళు మేడ, మేడ నుండి మిద్దె, మిద్దె నుండి పంచపాళీ, పంచపాళీ నుండి పాక అనుకుంటూ ఇంటి పునాదులని నైరృతి మూలకి తోసెయ్యడంతో మా పునాదులు ఒక అడుగు మేరకి బెహరావారి స్థలంలోకి వెళ్ళేయి.
తవ్విన గోతులన్నీ కప్పేసి మళ్ళా కొత్త పునాదులు తియ్యాలంటే తడిపి మోపెడవుతుంది. అపసంతికి పనెక్కువ, లోభికి ఖర్చు ఎక్కువ అని ఊరకనే అనలేదు.
స్థలాన్ని మధ్యకి కోసి రెండు స్థలాలు చేస్తే గీస్తే నుయ్యి మనకి ఉండాలని నూతిని స్థలం మధ్యలోకి వచ్చేటట్లు తవ్వించేసేరేమో, ఇప్పుడు పునాదులని తూర్పుకి జరిపితే ముందుముందు ముంగిటి వాకిలిలో మేడ కట్టుకోవాలంటే నుయ్యి అడ్డొస్తుంది. కనుక పునాదులని మరీ ఎక్కువగా తూర్పుకి జరపడానికి వీలు లేకపోయింది. ఎలాగైతేనేమి అతి కష్టం మీద పునాదులని రెండడుగులు జరిపి పని తిరిగి ప్రారంభించేరు. దీని పర్యవసానం ఏమిటయ్యా అంటే పక్కింటి వారింటికి మా ఇంటికి మధ్య అనుకున్న ప్రహారీ గోడ కాస్తా హరీమనిపోయింది. వాళ్ళింటి గోడకీ మా ఇంటి గోడకీ మధ్య గోచీ అంత గంత మిగిలింది.
అన్నయ్య సెలవు పెట్టి ఇంటికి వచ్చేసరికి పునాదుల పని పూర్తి అయిపోయింది. అనుకున్నది ఒకటి, అయింది మరొకటీ అయేసరికి అగ్గిరాముడై పోయేడు.
ఎలాగైతేనేమి వాడిని సముదాయించేరు.తెల్లారి లేచి పునాది గోడలు చూడడానికి వెళ్ళేడు. చూసి చకితుడయేడు. నేలమట్టానికి సమాంతరంగా, చదునుగా ఉండవలసిన పునాదిమట్టం, కుంభాకారంగా ఉబ్బెత్తుగా కనిపించింది.
మేస్త్రీని పిలిచేడు.
“అది అలాగే ఉంటది బాబూ! మేం పద్దినవూ ఇళ్ళు కడతనాం గందా,” అంటూ పెద్ద మేస్త్రి సూరన్న అన్న మాటలు అగ్గి మీద గుగ్గిలమే అయాయి. దీనిని ఇప్పుడు గోటితో మీటక పోతే తర్వాత గొడ్డలి కావలిసి వస్తుందని అన్నయ్య ఆ పునాది గోడని పడగొట్టించి మళ్ళా చదునుగా వచ్చేటట్లు కట్టించేడు. తను కట్టిన గోడని పడగొట్టించేడని అన్నయ్య మీద సూరన్న వారం రోజుల పాటు అలిగేడు.
ఏమైతేనేం గోడలు లేచే వేళకి పెద్ద బావ రెండు తాటిచెట్లు కొట్టించి పట్టుకొచ్చేడు. అప్పల్నాయుడు వాటిని అతి చాకచక్యంతో దూలాలగానూ వాసాలగానూ కోసి ఇంటికి కొప్పు వేసేడు. ఇంట్లో చల్లగా ఉంటుందని ముందు బిళ్ళ పెంకు వేసి దాని మీద బంగాళా పెంకు అమర్చి కొప్పుని ఇలా కప్పేరో లేదో అలా గృహప్రవేశం అన్నారు.
ఇంకా గోడలకి గిలాబీలు అవలేదు. గదులలో నేలకి ఇంకా గచ్చు పడ లేదు. ఇల్లు పూర్తయేవరకు ఆగడం వాస్తుకి మంచిది కాదన్నారు. గృహప్రవేశానికి నేను కాకినాడ నుండి ఇంటికి వచ్చేసరికి వాకట్లోనూ, ఇంట్లోనూ అంతా బురద బురద.
ఇంట్లో అడుగు పెట్టి చూద్దును కదా. సొంత ఇంటి కోసం కలలు కని కలవరించిన అమ్మ గృహప్రవేశం హడావిడిలో పందిట్లో ఎక్కడో ఉంది; కనబడనే లేదు. రిటైరైన తర్వాతనైనా ఇల్లు కట్టుకో గలిగిన నాన్నగారు కనిపించ లేదు; ఆయన వడ్రంగులతోటీ, తాపీ మేస్త్రీలతోటీ కుస్తీ పడుతున్నట్లున్నారు, బయటెక్కడో. ఇల్లు తననుకున్నట్లు కట్టలేదని అలిగేడో ఏమో దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీగారిలా చిట్టన్నయ్య గృహప్రవేశానికి రానేలేదు.
కాని, మడిగట్టుకుని ఎప్పుడు పెట్టేసిందో గదిలో దేవుడి మందిరం ఒక మూల, ఆవకాయ జాడీలు మరొక మూల సర్దేసి, గుమ్మానికి అడ్డుగానిలబడి చాటంత మొహంతో మామ్మ కనిపించింది.
నన్ను చూడగానే,
“నా వరాల తండ్రే, నా ధనాల కుప్పే, ఏడు కొండలవాడా వచ్చావా, నాయనా. ఈ రోజు కోసం అరవై ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్నానురా!”
నేను మామ్మ దగ్గరగా వెళ్ళబోయేను.
“ముట్టుకోకు. ఇంకా మడే. భలారం చేసిన తర్వాత నీకూ, గిరికీ తోట చిన్నాడిని పులి కరిచిన కథ చెబుతాను” అంది.
“వాడు పులి అంటే భయపడతాడు. పోనీ పిడత కథ చెప్పు.”
ఆ వేళ మామ్మ పిడత కథ చెబుతూ ఉంటే నేనూ గిరీ ఊకొడుతూ ఊకొడుతూ పూర్తిగా వినకుండానే మొదటిసారిగా మా ఇంట్లో నిద్రపోయేం.