విష్కంభకంలో బీభత్సమూ, రౌద్రమూ ప్రధానరసాలైతే, నాటకంలోని ఈ భాగంలో కరుణరసం ఎక్కువగా ప్రవహిస్తుంది; ఆ తరువాతి ప్రాధాన్యం వీరరసానికి.
ఈ ఘట్టంలో పాండవులూ కృష్ణుడూ కనిపించరు. ఇందులో వచ్చే దుర్యోధనుడి భార్యలూ, కుమారుడూ మహాభారతంలోని పాత్రలు కారు.
నాటకం విషాదాంతమవడం, రంగస్థలంపై మరణాన్ని ప్రదర్శించడం భారతీయనాటకసంప్రదాయానికి ఎదురీతే అని చెప్పాలి.
భాసకృతాలైన దూతవాక్యం, దూతఘటోత్కచం నాటకాలకు భిన్నంగా ఈ నాటకంలో కనబడే దుర్యోధనుడు దుష్టుడు కాడు. అతడి దౌష్ట్యం అతడి పశ్చాత్తాపప్రకటనలోనే ఉంటుంది. పాత్ర చిత్రణలో, ఇతర పాత్రలు తనతో వ్యవహరించే తీరులో దుర్యోధనుడిపట్ల నాటకరచయిత స్పష్టమైన సానుభూతిని ప్రదర్శిస్తాడు. ఈ చిన్న నాటకం పరిధిలో దుర్యోధనుడి యుద్ధవైముఖ్యాన్ని, తల్లిదండ్రులపట్ల భక్తిని, స్వాభిమానాన్ని, కౌటుంబికప్రీతినీ చక్కగా ఆవిష్కరిస్తాడు, భాసుడు. ముఖ్యంగా తన కుమారుడితో మాట్లాడుతున్న సందర్భంలో, ఆ దుఃఖాన్ని అంటుకొని ఒక లాలిత్యం ఉంటుంది.
దర్పాన్ని, కోపాన్ని, వీరత్వాన్ని ప్రకటించాల్సిన సందర్భాలలో ప్రధానంగా శార్దూలవిక్రీడితవృత్తాన్ని ఎంచుకున్నాడు, నాటకరచయిత. కరుణరసాన్ని ఒలికించాల్సిన చోట అనుష్టుప్, ఉపజాతివంటి చిన్న వృత్తాలను ఎంచుకున్నాడు. పసివాడైన దుర్జయుడితో ఇతర పాత్రలు మాట్లాడే సందర్భాలలో వాక్యాలు చాలా చిన్నగా ఉండడం ఇంకో విశేషం.
తాను పోయాక తర్పణజలాలనివ్వడం కోసమైనా పాండవులు బ్రతికి ఉండాలంటాడు, దుర్యోధనుడు. యుధిష్ఠిరుడు జలప్రదానం చేస్తున్నప్పుడు, దుర్జయుడు తన భుజాన్ని తాకుతూ కూర్చోవాలని చెబుతాడు. తర్పణం ఇచ్చేందుకు తన నూరుగురు కొడుకుల్లో ఎవరూ మిగలలేదని వాపోతాడు దుర్యోధనుడు. మరణానంతరజీవితాన్ని మనవారు ఎంతగా పట్టించుకునేవారో తెలియజేస్తాయి ఈ ప్రస్తావనలు.
దుర్యోధనుడితో తాను సహగమనం చేస్తానని మాలవి చెప్పినప్పుడు, ఎవ్వరూ హాహాకారాలూ, ఆహాకారాలూ చేయరు. అదేదో అంత చిన్న విషయమైనట్లు దాటుకొని పోతారు.
దుర్యోధనుడి అంతిమక్షణాలలో తన పితరులు, కర్ణుడు, సోదరశతమూ, ఐరావతపు శిరోభాగాన కూర్చున్న బాలాభిమన్యుడూ తన కళ్ళ ముందు కదలాడుతారు. ఆ వెంటనే, వీరస్వర్గం పాకేజీలో భాగమైన ఊర్వశి మొదలైన అప్సరసలూ కనబడడం Déjà Vu భావాన్ని కలిగిస్తుంది.
చివరి శ్లోకంలోని తొలి రెండు పాదాలను తనవిగా చేసుకొని ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళిపోతాడు. ధనుర్బాణాలతో బాటు మూడో పంక్తిని పట్టుకొని అశ్వత్థామ సౌప్తికపర్వం కథలోకి వెళ్ళిపోతాడు. మిగిలిపోయిన చివరివాక్యాన్ని బలరాముడు భరతవాక్యంగా మలిచి నాటకాన్ని ముగిస్తాడు.
ఈ నాటకానికి చిలకమర్తి లక్క్ష్మీనరసింహంగారి అనువాదం ఇక్కడ లభిస్తుంది. దీపాల పిచ్చయ్యశాస్త్రిగారూ అనువదించారట. ఆ అనువాదం ఆన్లైన్లో దొరకలేదు.
శత్రువుల సైన్యానికి యమసమానమైన నాగలిని లెక్కచేయకుండా, గర్వం కొద్దీ, యుద్ధనియమాలు అతిక్రమించి, నన్నూ నిర్లక్ష్యం చేసి, రణరంగంలో దుర్యోధనుడిని తొడలపై గదాప్రహారం చేసి, కుల-వినయ-సమృద్ధులతో సహా నేలకూల్చాడు.
ఓ దుర్యోధనా, కొద్దిసేపు ప్రాణాలను నిలిపి ఉంచుకో.
సాల్వుడి సౌభపురాన్ని రుచి చూసిన మొన కలిగినది, మహా-అసురుల నగరాల ప్రాకారద్వారాలకు అంకుశం వంటిది, యమునానది ప్రవాహగతిని మరల్చినది, శత్రుబలాల ప్రాణాల కానుకచేత పూజించబడ్డది అయిన ఈ నాగలితో, నేడు, రక్తమూ, చెమటల బురదతోనున్న భీముడి విశాలమైన వక్షస్థలాన్ని పంటపొలంవలె దున్నివేస్తాను.
అయ్యో! ఈ దశలోనూ నన్ను అనుసరిస్తున్నాడు, దీనుడైన దుర్యోధనుడు. ఇతడు –
రక్తమనే యుద్ధచందనపు మైపూత తడితో మెరుస్తూ ఉన్నాడు. భూమిపై పాకుతూ దుమ్ము అంటి ఎరుపు చాయకు తిరిగిన తెల్లని భుజాలతో బాల్యదశను పొందినవాడు, అమృతమథనం పూర్తయ్యాక, సురాసురులు మందరపర్వతంనుంచి విడిపించాక, అలసటతో తన శరీరాన్ని సముద్రజలాలలోనికి ఈడ్చుకుపోతున్న వాసుకిలా ఉన్నాడు.
యుద్ధనియమాన్ని ఉల్లంఘించిన భీముడి గదాప్రహారం వలన గాయపడి శిథిలమైన తొడలతో ఉన్న నేను సగం చచ్చి ఉన్న నా దేహాన్ని భుజాలతో ఈడుస్తున్నాను.
పూజ్యులైన బలరాముడు శాంతించు గాక.
నేల కూలి ఉన్న నేను నా ఈ శిరస్సును మీ పాదాల మ్రోల వాలుస్తున్నాను. వెంటనే మీ కోపాన్ని విడిచిపెట్టండి. శత్రుత్వమూ, కలహపు కథా, మేమూ నశించిపోయాము. కురువంశానికి తర్పణజలం ప్రదానం చేయగల మేఘాలవంటి ఈ పాండవులు సజీవంగా ఉండెదరుగాక.
నా నాగలి అంచుతో ఈ పాండవుల దేహాలపై చారికలను ఏర్పరిచి, నా రోకలి దెబ్బలతో మూపులను, రొమ్ములను చీల్చి, యుద్ధంలో చంపివేయబడ్డ రథాశ్వాలతో, గజాలతో సహా వారిని నీ వెంట స్వర్గయాత్రకు పంపుతాను.
అలా కాదు, ఆర్యా. నా ప్రాణాలకు సరైన మూల్యమే చెల్లించబడింది. ఎలాగంటే –
దారుణమైన అగ్నిలో దగ్ధమవుతున్న లక్క ఇంటినుండి బుద్ధికుశలతతో ప్రాణరక్షణ చేసుకున్నవాడూ, కుబేరుడి అలకాపురిలో జరిగిన యుద్ధంలో వేగంగా కొండరాళ్ళను విసిరినవాడూ, రాక్షసరాజైన హిడింబుడి ప్రాణాలను కొల్లగొన్నవాడూ అయిన భీముడు నన్ను ఈనాడు ఈవిధంగా వంచనతో ఓడించాడంటే, బలరామా, నేను ఓడిపోలేదనే అర్థం చేసుకోవాలి నీవు.
బలదేవః:
భీమసేన ఇదానీం తవ యుద్ధవఞ్చనాముత్పాద్య స్థాస్యతి।
బలరాముడు:
యుద్ధంలో నిన్ను వంచించిన భీమసేనుడు ఇప్పుడు జీవించి ఉండగలడా?
(అటువైపు చూసి) అరె! పూజ్యుడైన ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి దుర్జయుడు దారిచూపుతూ ఉండగా, అంతఃపురపరిజనం వెంబడించి రాగా శోకావిష్టుడై తడబడుతున్న అడుగులతో ఇటే వస్తున్నాడు. ఈయన –
పరాక్రమానికి నివాసస్థానమైనవాడు; తన నూరుగురు కుమారులను కన్నులుగా చేసుకున్నవాడు; అభిమానధనుడై నిలిచినవాడు; బంగారు యూపస్తంభాలవంటి చేతులు కలవాడు; సందేహం లేదు, స్వర్గాన్ని కాపాడుకోలేమేమోనన్న భయంతో దేవతలు తమ శత్రుత్వమనే చీకటితో ఇతడి కళ్ళపై దెబ్బ కొట్టినందున ఈయన అంధుడై జన్మించాడు.
నేటి యుద్ధంలో నా కొడుకు వంచనతో చంపబడ్డాడని విని కన్నీటితో నిండిన నా కన్నులు మరింత గుడ్డివైపోయాయి.
గాంధారీ, ఉన్నావా?
గాన్ధారీ:
జీవావిదమ్హి మన్దభాఆ। జీవితాస్మి మన్దభాగా।
గాంధారి:
జీవించే ఉన్నాను, దురదృష్టవంతురాలిని.
దేవ్యౌ:
మహారాఅ! మహారాఅ! మహారాజ! మహారాజ!
రాణులిద్దరూ:
మహారాజా! మహారాజా!
రాజా:
భోః! కష్టమ్। యన్మమాపి స్త్రియో రుదన్తి।
పూర్వం న జానామి గదాభిఘాత-
రుజామిదానీం తు సమర్థయామి।
యన్మే ప్రకాశీకృతమూర్ధజాని
రణం ప్రవిష్టాన్యవరోధనాని ।। 38 ।।
దుర్యోధనుడు:
అయ్యో, ఎంత కష్టం. నా భార్యలు సైతం విలపిస్తున్నారు!
ఇంతకు ముందెన్నడూ, గదాఘాతపు బాధను ఎరుగను నేను. ఇప్పుడు, తమ తలలపై మేలిముసుగులు తొలిగిపోయి శిరోజాలు అందరికీ కనబడుతుండగా నా అంతఃపురస్త్రీలు యుద్ధరంగాన ప్రవేశించడంతో ఆ బాధ నా అనుభవంలోకి వస్తున్నది.
ధృతరాష్ట్రః:
గాన్ధారి! కిం దృశ్యతే దుర్యోధననామధేయః కులమానీ।
ధృతరాష్ట్రుడు:
గాంధారీ! కురుకులంలో జన్మించినందునకు గర్వించేవాడైన దుర్యోధనుడు నీకు కనబడుతున్నాడా?
గాన్ధారీ:
మహారాఅ! ణ దిస్సది। మహారాజ! న దృశ్యతే।
గాంధారి:
లేదు, మహారాజా!
ధృతరాష్ట్రః:
కథం న దృశ్యతే। హన్తభో! అద్యాస్మ్యహమన్ధో యోఽహమన్వేష్టవ్యే కాలే పుత్రం న పశ్యామి। భోః కృతాన్తహతక!
రిపుసమరవిమర్దం మానవీర్యప్రదీప్తం
సుతశతమతిధీరం వీరముత్పాద్య మానీ।
ధరణితలవికీర్ణం కిం స యోగ్యో న భోక్తుం
సకృదపి ధృతరాష్ట్రః పుత్రదత్తం నివాపమ్ ।। 39 ।।
ధృతరాష్ట్రుడు:
ఎందుకు కనబడడం లేదు? అయ్యో! నా కుమారుణ్ణి వెదికి చూడవలసిన సమయంలో చూడలేకపోతున్న నేను ఈనాడు నిజంగా గుడ్డివాడినయ్యాను. ఆహ్, యమాధమా!
సమరంలో శత్రువులను నశింపజేయగలిగినవారు, అభిమానంతో, శౌర్యంతో విరాజిల్లేవారు, మహావీరులూ, నేడు భూమిపై చెల్లాచెదురుగా పడిపోయినవారూ అయిన నూరుగురు కొడుకులకు జన్మనిచ్చినందున గర్విస్తూ ఉన్న ఈ ధృతరాష్ట్రుడు తన పుత్రులు అర్పించే తర్పణజలాలను కొద్దిగానైనా స్వీకరించేందుకు అర్హుడు కాడా?
గాన్ధారీ:
జాద సుయోధణ! దేహి మే పడివఅణం। పుత్తసదవిణాస దుత్థిదం సమస్సాసేహి మహారాఅం। జాత సుయోధన। దేహి మే ప్రతివచనమ్। పుత్రశతవినాశదుఃస్థితం సమాశ్వాసయ మహారాజమ్।
గాంధారి:
నాయనా దుర్యోధనా! నాకు సమాధానం చెప్పు. నూరుగురు పుత్రులు నశించి దురవస్థలోనున్న మహారాజును ఊరడించు.
కొడుకుల, మనుమళ్ళ ముఖాలను చూడాలనే కుతూహలం లేనిది; దుర్యోధనుడి అస్తమయం కారణంగా కలిగిన దుఃఖం ఆమె ధైర్యాన్ని యావత్తూ తాగివేసింది; పాతివ్రత్యసూచకంగా ఆమె ధరించిన నేత్రబంధం ఇప్పుడు ఎడతెగని కన్నీళ్ళతో తడిసిపోయింది.
యుద్ధంలో వెనుతిరగకుండా హతుడయ్యాడని. ఓ తండ్రీ, దుఃఖాన్ని చిక్కబట్టుకోవడం ద్వారా నన్ను అనుగ్రహించండి.
మీ ఒక్కరి పాదాల మ్రోలనే శిరస్సు వంచి నమస్కరించిన నేను, మండే అగ్నిని సైతం లెక్కచేయకుండా, ఏ స్వాభిమానంతోనైతే పుట్టానో ఆ స్వాభిమానంతో స్వర్గానికి వెళుతున్నాను.
జీవితేచ్ఛ నశించినవాడినీ, పుట్టుకతో కళ్ళు మూసుకుపోయి ఉన్నవాడినీ అయిన నా హృదయంలో జన్మించిన తీవ్రమైన పుత్రశోకం నన్ను నిలువెల్లా ఆక్రమించి నా ధైర్యాన్ని నశింపజేస్తున్నది.
బలదేవః:
భోః! కష్టమ్।
దుర్యోధననిరాశస్య నిత్యాస్తమితచక్షుషః।
న శక్నోమ్యత్రభవతః కర్తుమాత్మనివేదనమ్ ।। 49 ।।
బలరాముడు:
అయ్యో, కష్టం!
దుర్యోధనుడిగురించి ఆశను కోల్పోయి, శాశ్వతంగా కన్నులు మూతబడిపోయి ఉన్న ఈ పూజ్యుడికి నేను ఇక్కడే ఉన్నానని చెప్పలేనిప్పుడు.
ద్వంద్వయుద్ధంలో గదాఘాతాలవల్ల నా నుదురు చిట్లిపోయింది. రొమ్మున తాకిన దెబ్బలనుంచి చిందిన నెత్తుటి కారణంగా హారాలను ధరించగల అవకాశం హరించుకుపోయింది. చూడు, ఈ గాయాలు – దండకీర్తుల్లా నా భుజాలను అలంకరించి ఉన్నాయి. నీ భర్త యుద్ధంలో వెన్ను తిప్పకుండా మరణిస్తున్నాడు. ఓ క్షత్రియవనితా, ఎందుకు ఏడుస్తున్నావు?
మూర్ఖురాలిని. మీ సహధర్మచారిణిని. అందుకే ఏడుస్తున్నాను.
రాజా:
పౌరవి! త్వమపి శ్రృణు।
వేదోక్తైర్వివిధైర్మఖైరభిమతైరిష్టం ధృతా బాన్ధవాః
శత్రూణాముపరి స్థితం ప్రియశతం న వ్యంసితాః సంశ్రితాః।
యుద్ధేఽష్టాదశవాహినీనృపతయః సంతాపితా నిగ్రహే
మానం మానిని! వీక్ష్య మే న హి రుదన్త్యేవంవిధానాం స్త్రియః ।। 52 ।।
దుర్యోధనుడు:
పౌరవీ! నువ్వూ విను.
వేదవిహితమైనవీ, చేయాలని కోరుకున్నవీ అయిన వివిధయజ్ఞాలను చేసాను. బంధువులకు ఆలంబనగా నిలిచాను. శత్రువులను గెలిచాను. ఆశ్రయించినవారిని వంచించకుండా వారికి వంద ప్రియాలను కలిగించాను. యుద్ధంలో పద్దెనిమిది సేనావాహినుల రాజులను అడ్డగించి బాధించాను. అభిమానధనురాలా, నా దర్పాన్ని చూసాక కూడా నీవంటి స్త్రీలు ఈ విధంగా రోదించరు కదా.
పౌరవీ:
ఏక్కకిదప్పవేసణిచ్చఈ ణ రోదామి। ఏకకృతప్రవేశనిశ్చయా న రోదిమి।
నన్ను సేవించినట్లే పాండవులను సేవించు. పూజ్యురాలైన గాంధారి ఆజ్ఞలవలెనే, కుంతీదేవి ఆజ్ఞలనూ నెరవేర్చు. సుభద్రా ద్రౌపదులు నీ తల్లులవలె పూజించదగ్గవారు. కుమారా, చూడు –
‘ప్రశంసనీయమైన సంపదలను కలిగినవాడు, స్వాభిమానంతో ప్రకాశించే హృదయం కలిగినవాడు అయిన నా తండ్రి తనకు సమవుజ్జీ అయినవాడిని యుద్ధంలో ఎదుర్కొని హతు’డయ్యాడన్న శోకాన్ని విడిచిపెట్టు. వెడల్పైన వస్త్రంతో కప్పబడ్డ యుధిష్ఠిరుడి కుడిభుజాన్ని తాకుతూ, పాండవులతో కలిసి నాకు నీవు తర్పణజలాలను సమర్పించాలి.
అహో, శత్రుత్వం పశ్చాత్తాపంగా పరిణమించింది. ఏదో శబ్దం వినబడుతున్నది…
యుద్ధసన్నాహసూచకాలైన దుందుభులు మ్రోగకుండా నిశ్శబ్దంగా ఉన్న ఈ సమయంలో, బాణాలు, కవచాలు, వింజామరలు, ఛత్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటిదీ, యోధులూ, సారథులూ హతులై పడిపోయినటువంటిదీ ఈ యుద్ధభూమిలో ఎవరిదో ఈ ధనుష్టంకారం కలవరపడిపోయిన కాకులను ఆకాశంలోకి ఎగిరేలా చేస్తున్నది.
(తెర వెనుకనుంచి)
పూర్వం, వింటిని ఎక్కుపెట్టిన దుర్యోధనుడితో సహా ఈ యుద్ధమనే యజ్ఞానికి వచ్చాను. నేడు, అధ్వర్యువుచేత అశ్వమేధక్రతువు పూర్తి చేయబడ్డాక జనశూన్యమైన ఆ యజ్ఞస్థలంలో తిరిగి ప్రవేశిస్తున్నాను.
ఓహ్! గురుపుత్రుడైన అశ్వత్థామ ఇతడు. ఇటే వస్తున్నాడు.
విప్పారిన తామరల రేకులవలె నిర్మలంగా పెద్దగా ఉన్న కళ్ళు, ప్రకాశిస్తున్న బంగారు యూపస్తంభాలలా పొడవుగా, బలిష్టంగా ఉన్న చేతులు, వేగంతో భయంకరమైన తన ధనువును సారిస్తూ, కొండకొమ్ముపై ఇంద్రధనుస్సుతో నిప్పంటుకొని ఉన్న మేరుపర్వతంలా ఉన్నాడు.
(ఇంతకు ముందు చెప్పిన మాటలనే – “పూర్వం, వింటిని ఎక్కుపెట్టిన…” – మళ్ళీ పలికాక) యుద్ధపు సంరంభంలో ఇరువైపులా ఉన్న సైన్యసముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్న సమయంలో పైకి లేచిన ఆయుధాలనే మొసళ్ళచేత అవయవాలు ఖండితమై అవశిష్టమైన దేహాలతో, కొద్దిపాటి శ్వాసతో సజీవులై, సమరరంగాన కీర్తిని సాధించుకొని ఉన్న ఓ రాజులారా! వినండి, వినండి మీరంతా.
శత్రువు మోసపు బలిమితో తొడలు విరిగిపడిన కౌరవేంద్రుడను కాను నేను. బిగువు సడలి, వమ్మయిపోయిన ఆయుధాల కర్ణుడిని కాను. నేడు, ఈ విజయభూమిలో సమరోత్సాహంతో, అస్త్రాలను పైకెత్తి ఏకాకినై ద్రోణపుత్రుడనైన నేను నిలిచి ఉన్నాను.
ఏ లాభమూ కలిగించని యుద్ధపు ఘనతా, విజయపు ప్రశంసా నాకెందుకు? (రంగస్థలంపై తిరుగుతూ) కాదు, కాదు. నేను నా తండ్రికి తర్పణవిధులలో వ్యగ్రుడనై ఉన్న సమయంలో కురుకులతిలకుడైన దుర్యోధనుడు వంచనకు లోనైనాడు. ఎవరికి మాత్రం నమ్మకం కలుగుతుంది ఈ మాట వింటే –
రథికులతో, గజారూఢులతో, ధనుర్ధారులతోనున్న పదకొండు అక్షౌహిణుల రాజులు మోడ్చిన చేతులను పైకెత్తి ఎవరి ఆజ్ఞకై ఎదురుచూస్తూ ఉంటారో, పరశురాముడి బాణాల తాకిడికి దెబ్బతిన్న కవచాన్ని కలిగిన భీష్ముడూ, నా తండ్రీ మొదలైన యోధులు ఎవరి పక్షాన యుద్ధంలో పోరాడారో, ఆ అతిరథయోధుడైన దుర్యోధనుడు నేడు కాలప్రభావంచేత ఓడించబడ్డాడని స్పష్టంగా తెలుస్తున్నది.
కిరీటం పడిపోయినందున గాలికి కదులుతున్న వెంట్రుకలు కిరణాలుగా, గదాఘాతాల వల్ల కలిగిన గాయాల నెత్తుటితో తడిసిన అవయవాలతో, అస్తాద్రి శిలల మధ్య సంధ్యారుణిమను పులుముకున్న సాయంకాలసూర్యుడిలా ఉన్నాడు.
(సమీపించి) ఓ కురురాజా, ఏమిటిది?
రాజా:
గురుపుత్ర! ఫలమపరితోషస్య ।
దుర్యోధనుడు:
సంతోషరాహిత్యానికి ఫలితం, గురుపుత్రా!
అశ్వత్థామా:
భోః కురురాజ! సత్కారమూలమావర్జయిష్యామి।
అశ్వత్థామ:
ఓ కురురాజా! మీ సత్కారానికి కావలసిన సామగ్రిని సమకూరుస్తాను.
పట్టాభిషిక్తులైన రాజులందరూ భూమి ఒడిలోకి చేరుకున్నారు. కర్ణుడు స్వర్గస్థుడయ్యాడు. భీష్ముడు పడిపోయాడు. నా ఎదుటనే, ఈ యుద్ధభూమిలో నా సోదరశతం నశించిపోయింది. నేనూ అదే స్థితిలో ఉన్నాను. మీరు ధనుస్సును విడిచిపెట్టండి.
కాదు, కాదు. రాజులకు దర్పమే దేహము. ఈ దర్పం కోసమే కదా ఈ యుద్ధాన్ని తెచ్చిపెట్టుకున్నది? చూడు, గురుపుత్రా –
ఆనాడు – జూదమాడినప్పుడు – కొప్పు పట్టుకొని ద్రౌపదిని సభలోనికి ఈడ్పించాను. యుద్ధభూమిలో, బాలుడని చూడకుండా అభిమన్యుడిని హతమార్పించాను. పాచికల మిషతో ఓడించి పాండవులను వన్యమృగాలతో తోడుగా అడవులలో నివసించేలా చేసాను. సమరమనే యజ్ఞదీక్షను స్వీకరించిన పాండవులు నా దర్పంలో చాలా కొద్ది భాగాన్ని మాత్రమే హరించారు కదా.
ఆహా! నా మనసులోని కోరిక నెరవేరింది. నా ప్రాణాలు నన్ను వదిలివెళ్ళనున్నాయి. ఇదుగో, శంతనుడు మొదలైన పూజనీయులైన నా పూర్వీకులు. కర్ణుడిని ముందుంచుకొని లేచి నిలబడిన నా నూరుగురు సోదరులు. వీడు – ఐరావతపు శిరోభాగాన ఆసీనుడై, ఇంద్రుడి చేతిని పట్టుకొని ఉన్న కూకటి జుట్టు చిన్నవాడు అభిమన్యుడు, నన్ను ఉద్దేశించి కోపంగా మాట్లాడుతున్నాడు. ఊర్వశి మొదలైన అప్సరసలు నన్ను చేరుకుంటున్నారు. ఇదుగో, ఆకృతి దాల్చిన మహాసముద్రాలు! ఇక్కడేమో, గంగ మొదలైన మహానదులు. వేయి హంసలను పూన్చిన విమానం – వీరులు అధిరోహించదగ్గది – యముడే పంపించాడు. ఇదిగిదిగో, వచ్చేస్తున్నాను.