సతిదానశూరము — ఇదొక యక్షగానం. అంటే నాటకం లాటిది. రాసినవాడు శాహజీ అనే మరాఠా రాజు. తంజావూరులో నాయకరాజుల పాలన ముగిశాక మొదలైన మరాఠా పాలకుల వరసలో వాడు; విజయరాఘవనాయకుడి మరణానికి పదకొండేళ్ల తర్వాత పన్నెండేళ్ల వయసులో ఇతను రాజయ్యాడు, నలభైయేళ్ల వయసులో మరణించాడు.
కథలోకి వెళ్లేముందు అప్పటి తంజావూరు చరిత్ర కూడా టూకీగా ఇప్పుడు చూద్దాం: కృష్ణదేవరాయలు తన రాజ్యం బాగా విస్తరించటంతో దూరప్రాంతాల్లో తనకు సామంతులుగా రాజ్యాన్ని చక్కబెట్టటానికి అప్పటికే తన దగ్గర పనిచేస్తున్న నమ్మకస్తులైన బలిజ వీరుల్ని పంపించాడు. ఉదాహరణకు విశ్వనాథనాయకుడు మధురలో తొలి నాయకరాజుగా ఎలా వెళ్లాడో అతని పేరుతో ఒకప్పుడు వచ్చిన తెలుగు సినిమా కూడా నాటకీయంగా చూపించింది. ఇప్పటి తమిళనాడులో వున్న మధుర, తంజావూరు, సెంజి అనేచోట్ల నాయకరాజుల పాలనలు అలా మొదలైనయ్ (తంజావూరుకు వెళ్లిన శివప్ప లేదా సెవప్ప నాయకుడు కృష్ణరాయల దగ్గర పనిచేసినా, అతని తమ్ముడు అచ్యుతరాయల కాలంలో తంజావూరుకు పాలకుడిగా వెళ్లాడు). 1565లో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత మధుర, సెంజి నాయకరాజులు పైకి విజయనగర సామంతులుగా చెప్పుకుంటూ నిజానికి స్వతంత్రరాజులుగా నిలదొక్కుకున్నారు కానీ, ఒక్క తంజావూరు నాయకులు మాత్రం రాజభక్తిని వదలకుండా చేతనైనంత సాయం చేశారు. ఇదే ఆ తర్వాత తంజావూరు నాయక పాలన అంతం కావటానికి ఒక కారణమైంది కూడా.
ఈ నాయకరాజులంతా తెలుగువాళ్లు కావటంతో వాళ్లతోపాటు చాలామంది తెలుగువాళ్లు ఆ ప్రాంతాలకు వెళ్లారు. ఆ ప్రభావంతో తమిళప్రాంతమైనా తెలుగు అధికార, సాంస్కృతిక భాషగా మూడొందల ఏళ్లకు పైగా నిలబడింది.
తంజావూరు, మధురల సంబంధాల గురించి ప్రచారంలో వున్న ఓ వింతకథ చూద్దాం. ఐతే దీనికి రాతపూర్వకమైన ఆధారాలేవీ లేవు. ఆ కథేమిటంటే — తంజావూరు రాజ్యం కళలకీ సంస్కృతికీ, మధుర సైనికబలానికీ ప్రతీకలుగా వుండటంతో మధుర నాయకులు కళలూ కట్టడాలలో తంజావూరుతో పోటీ పడేవారు. తంజావూరు నాయకరాజుల్లో ప్రముఖుడైన రఘునాథనాయకుడు తన సోదరిని మధుర రాజైన తిరుమల నాయకుడికిచ్చి వివాహం చేశాడు. తిరుమలనాయకుడు ఒక పెద్ద రాజభవనం కట్టించి గర్వంగా తన భార్యకు చూపించటానికి తీసుకెళ్తే ఆమె అది చూసి పెదవి విరిచి ‘మా పుట్టింటి భవనాల ముందు ఇది దిగదుడుపే’నని వెక్కిరించిందట. దాంతో మండిపోయిన తిరుమల నాయకుడు అక్కడికక్కడే ఆమెని పొడిచి చంపాట్ట.
ఆ తర్వాత రఘునాథనాయకుడి కొడుకు విజయరాఘవనాయకుడు రాజయాడు. అతనికి ఓ కూతురు; చాలా అందంగా వుంటుందని విని మధుర నాయకుడు చొక్కనాథుడు ఆమెని పెళ్లిచేసుకుంటానని విజయరాఘవుడికి దూతల్ని పంపాడు. విజయరాఘవుడు ఉద్రేకంతో వాళ్లని తిట్టిపోసి, ‘తన కూతురే కాదు ఇకముందు కూడా తంజావూరు నాయకులెవరూ వాళ్ల ఆడపడుచుల్ని మధుర వాళ్లకి ఇచ్చేది లేద’ని ఖచ్చితంగా చెప్పాట్ట. దాంతో చొక్కనాథ నాయకుడు తంజావూరి మీదికి తన సైన్యాన్ని పంపాడు. విజయరాఘవుడు యుద్ధంలో మరణించాడు (ఇంత చిన్న వ్యవహారానికి యుద్ధందాకా వెళ్లటం తమకు ఇష్టం లేదని అతని సైన్యంలో ఎవరూ అతనితో నిలబడలేదని, చివరకు తనూ, తన కొడుకూ మాత్రమే యుద్ధానికి వెళ్లి చనిపోయారని ఓ పిట్టకథ; కాదూ, విజయరాఘవుడు తన సైన్యాధికారుల భార్యల్తో సంబంధాలు పెట్టుకున్నాడని, అందువల్ల యుద్ధసమయానికి వాళ్లెవరూ అతనికి తోడుగా నిలబడలేదనీ మరో కథ; ఏదెంత నిజమో మనకు తెలీదు). ఈ మొత్తం వ్యవహారంలో యుద్ధం జరగటం, తంజావురు నాయక వంశం నాశనం కావటం, విజయరాఘవుడి అంతఃపురంలో వాళ్లు మంటల్లో పడి మరణించటం మాత్రం చారిత్రక సత్యాలు. అందుకు కారణాలు అస్పష్టం. (ఒకప్పటి తెలుగు సినిమా మహాకవి క్షేత్రయ్యలో ఈ ఘట్టాల్ని టూకీగా చూపించారు.)
అలా గెలిచిన చొక్కనాథుడు తన సవతి తమ్ముడు అలిగిరిని తన సామంతుడిగా పాలించమని తంజావూరికి పంపాడు. ఐతే అలిగిరి అక్కడికి వెళ్లటంతోనే తనకు తను స్వతంత్రరాజుగా ప్రకటించుకున్నాడు. అన్నదమ్ముల మధ్య గొడవ మొదలయ్యింది. ఇంతలో తంజావూరు నాయక వంశంలో ఒక పిల్లవాడు చెంగమలదాసుని, దాదులు బయటకు తరలించి బతికించారని బయటపడింది. దాంతో వాళ్ల అభిమానులు అలిగిరిని వెళ్లగొట్టి, చెంగమలదాసుకి రాజ్యం ఇప్పించమని బహమనీ సుల్తాను దగ్గరకు వెళ్లారు. (ఇక్కడా ఓ పిట్టకథ ఉంది — రాయసం వెంకన్న అనే అతను అలిగిరి తనకు ఇవ్వవలసినంత మర్యాద ఇవ్వలేదని అలిగి, చెంగమలదాసుని రాజుని చెయ్యటానికి పూనుకున్నాడు; ఆ తర్వాత అతను చెంగమలదాసు మీద కూడా అలిగి మరాఠాల దగ్గరికి పరిగెత్తాడు; చివరికి ఇలాటి వరస నమ్మకద్రోహిని దగ్గర ఉండనివ్వకూడదని, అతణ్ణి చంపటానికి వాళ్లు సిద్ధపడుతుంటే తెలుసుకుని ప్రాణాల్తో పారిపోయాడు.) బహమనీ సుల్తాను తన దగ్గర ఉన్న ఒక సైన్యాధికారి ఏకోజీని (ఇతను ఛత్రపతి శివాజీ సవతితమ్ముడు) ఆ పని మీద పంపించాడు. ఏకోజీ వెళ్లి అలిగిరిని ఓడించి యథాప్రకారంగానే తంజావూరికి తనే రాజునని ప్రకటించుకున్నాడు. అతని వంశం వాడు శాహజీ. నాయకరాజులు తంజావూరుని 140 ఏళ్లు పాలిస్తే మరాఠాలు మరో 170 ఏళ్లు పాలించారు.
ఐతే నాయకరాజుల సంప్రదాయాన్ననుసరించి, మరాఠా రాజులు కూడా తెలుగునే రాజభాషగా కొనసాగించారు. అలాగే అంతకు మునుపటి నాయకరాజుల్లాగే వాళ్లూ తెలుగులో రచనలు చేశారు. మరాఠా రాజపరంపరలో అందర్లోనూ గొప్ప రచనలు చేసినవాడు శాహజీ. తంజావూరులోనే పుట్టి పెరగటం చేత శాహజీకి మరాఠీతోపాటు తెలుగు కూడా చాలా సమగ్రంగా వంటబట్టింది. తెలుగులో యక్షగానాల్ని పుంఖానుపుంఖాలుగా రాశాడతను. ఇప్పటికీ మనకు ఇతని యక్షగానాలు ఇరవైకి పైగానే దొరుకుతున్నయ్. అలాగే, మరాఠీ యక్షగాన సంప్రదాయానికి అతన్ని ఆద్యుడుగా లెక్కిస్తారు. ఇతను చేసిన మరో గొప్పపని, సరస్వతీ మహల్ గ్రంథాలయానికి అంకురార్పణ చెయ్యటం. ఆ తర్వాత వాళ్లు దాన్ని బాగా విస్తరించి అపురూపసంపదగా తీర్చిదిద్దారు.
ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అతను రాజుగా ఉన్న సమయంలో తంజావూరు రాజ్యం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఒక వంక మొఘల్ చక్రవర్తికి ఏడాదికి నాలుగు లక్షల రూపాయల కప్పం కట్టాలి, మరో వంక చుట్టుపక్కల రాజ్యాలన్నీ తంజావూరు మీద కన్నేయటంతో ఎప్పుడూ యుద్ధాలే, ఇంకో పక్క రైతుల మీద విపరీతంగా పన్నుల భారం పడటంతో వాళ్ల అలజడులు. వీటన్నిటి మధ్య ఇంత సాహిత్యసృష్టి చెయ్యగలగటం సామాన్యమైన విషయం కాదు.
ఇక సతిదానశూరం విషయానికి వస్తే — కథని మూడుముక్కల్లో చెప్పాలంటే: మన్నారుగుడిలో మహావిష్ణు తిరునాళ్లు జరుగుతున్నయ్; దానికి ఓ మతంగ స్త్రీ, ఆమె భర్త వస్తారు; అలాగే మోరోభట్టు అనే వేదపండితుడు కూడా ఆర్భాటంగా వస్తాడు; ఆమెను చూట్టంతోనే మోరోభట్టు మహామోహితుడౌతాడు; పక్కనే వున్న అతని శిష్యుడు ఎంత వాదించినా వారించినా, ఆమె, ఆమె భర్త కూడా ఎంత చెప్పినా వినడు; చివరకు ఆమె భర్త ఆమెని మోరోభట్టుకి దానంగా ఇస్తాడు; ఐతే ఇక్కడే ఓ మెలిక పడుతుంది — హఠాత్తుగా జ్ఞానోదయమై మోరోభట్టు ఆ దానం తీసుకోవటానికి ఒప్పుకోడు; ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకోనని ఒకడు, ఇచ్చిన దానాన్ని తీసుకోనని మరొకడు — ఈ చిక్కుముడిని విప్పటం ఎవరివల్లా కాకపోతే చివరికి శివుడు ప్రత్యక్షమై అందరికీ మోక్షం ఇచ్చేస్తాడు.
ఇదో విచిత్రమైన, ఆలోచనాత్మకమైన కథ అనేది స్పష్టం. పైగా దీన్ని ప్రతి యేడూ మన్నారుగుడి తిరునాళ్లలో ప్రదర్శించేవారట కూడా. కనుక కవి — అప్పుడా రాజ్యాన్ని పాలిస్తున్న రాజు — దీని ద్వారా ఏం చెప్పదల్చుకున్నాడు?
నాటకం ప్రథమార్ధం హాస్యస్ఫోరకంగా వుంటుంది. మోరోభట్టు మతంగ స్త్రీ మీది మోహాన్ని శాస్త్రపరిజ్ఞానంతో సమర్థించుకోవటం, దాన్ని అతని శిష్యుడు వెంటనే అదే శాస్త్రసహాయంతో ఖండించటం తమాషాగా సాగుతుంది. ఉదాహరణకు –
గురువు: వినరా శిష్య, మనకిల్లేల వాకిలేల సంసారమేల పెండ్లామేల బిడ్డలేల? చెప్పేది వినరా!
శిష్యుడు: వినవయ్య గురుస్వామి, సన్యాసివలె తలగొరిగించుకొని కావివస్త్రాలు గట్టుకొని దండపుగోల కమండలము పట్టుకొని సన్యాసం తీసుకోబోవుచున్నారా?
గురువు: సన్యాసం గాదురా చెప్పేది వినరా
ఇల్లాలి గొడవయేల యింటిగొడవ యేల
మొల్లసుగంధిపై మోహమిచ్చె నీవేళ
మగువ నెడబాయ నా మనసు రాదురా
వేలిమి యికనేల వేదశాస్త్రములేల
బాలతో నొకసారి పలికితే చాలుబోర
పసలేని బ్రహ్మానంద పదము నేనొల్లర
సశరీర స్వర్గఫలము సమకూడు దీనివల్ల
శిష్యుడు: వినవయ్య గురుస్వామి, మావంటి బుద్ధిలేని వారికి మీవంటి పెద్దలు గద బుద్ధిజెప్పవలెను. మీరే యిట్లా స్త్రీని జూచి మోహిస్తే మీ పెద్దతనానకు మాట వచ్చునే…
గురువు: వినరా వెర్రి చిన్నవాడా! మా పెద్దతనానికి కొదవ యేంది? మాకంటే పెద్దలైనషువంటి వారికి స్త్రీని జూస్తే యింద్రియనిగ్రహంసేయ గూడలేదె! మాకనంగానేమి? యింద్రియనిగ్రహమయ్యేదేందిరా?…
ఇద్దరూ పాత గ్రంథాల్లోంచి శ్లోకాలు ఉదహరిస్తూ ఎవరికి వారే తమ వాదాన్ని సమర్థించుకుంటారు. చివరకు ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్తారు. ఆమె మోరోభట్టుని వారిస్తూ -..
పరికింపవేలయ్య బాపనయ్య
కలుద్రాగుదుమయ్య కడజాతివారమయ్య
పలుమాటాడకువయ్య బాపనయ్య…
అంటే, దానికి మోరోభట్టు-
దరువు|| కాంభోజి|| ఆది||
అంటరాని వారంటి వగ్నివైతి నీ
యంటే కావలెనని యాశించినానె…
వాదేల తోలుగట్టే వారంటివికాగా
భేదమేడనే గౌరీప్రియునకు నీకు
పశులపొలసు దినే వారంటివి దాని
పాలు జనులు ద్రాగి పావనులౌదురు
తసుకక దాని సమూలము దిని
మీరు ధన్యులు గారటె దయసేయవేమె —
అంటుంటే అందుకుని శిష్యుడు, “భళభళా! మహాలెస్సాయెనయ్య తల్లి చంటిపాలు త్రాగేవారు తల్లినిగూడా తినుచున్నారా? నీవు తేలు పుట్టుక పుట్టినావా? తేలు పుట్టగానే తల్లినిగూడ దినుచువచ్చును. పాలున్ను మాంసమున్ను సరియా?” అని వాదిస్తాడు.
ఈ వాదోపవాదాలిలా సాగుతుండగా ఆమె భర్త అక్కడికి వస్తాడు. దంపతులిద్దరూ, శిష్యుడూ కలిసి ఎంత చెప్పినా మోరోభట్టు మారాం వదలడు. చివరకు మాతంగుడు తన భార్యను మోరోభట్టుకు దానం ఇస్తాడు. ఐతే ఆ దానం స్వీకరించబోతుండగా మోరోభట్టు హఠాత్తుగా తన స్థితిని తలుచుకుని పశ్చాత్తాపపడతాడు. దానం తీసుకోనంటాడు.
ఐతే తను దానం ఇచ్చేశాను కనక దాన్ని తిరిగి తీసుకోనంటాడు ఇచ్చిన వాడు. పుచ్చుకోవలసిన వాడు పుచ్చుకోనంటాడు. ఇలా ఈ దానకార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఈ చిక్కుని ఎలా విప్పాలో అక్కడి పాత్రలెవరికీ అర్థం కాదు.
ఈ యక్షగానాన్ని పరిశోధకలోకానికి పరిచయం చేసింది వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యంల ప్రఖ్యాతగ్రంథం “Symbols of Substance”. ఆ తర్వాత వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్‌లు వారి “Classical Telugu Poetry”లో దీన్ని పూర్తిగా ఆంగ్లంలోకి అనువదించారు. ఆ తర్వాత మను ఎస్. పిళ్ళై ఇటీవల వచ్చిన ఒక పుస్తకంలో “Symbols of Substance”లో ఉన్నవిషయాన్ని జనబాహుళ్యానికి దగ్గరగా తెస్తూ సతిదానశూరం గురించి ఒక వ్యాసం రాశాడు. ఐతే వీళ్లందరూ దీన్నొక అత్యంత సాహసోపేతమైన, రెచ్చగొట్టే అద్భుత సృష్టిగా (masterpiece of outrageous provocation) వర్ణించారు. కాని దీన్నింకా లోతుగా చూడాల్సిన అవసరం వుంది.
ముందుగా, ఇక్కడి నాలుగు ముఖ్యపాత్రలు ఎలాటి భాషను, ఎలా, ఎందుకు వాడుతాయో చూద్దాం. మోరోభట్టు ముందు చాలా ఆర్భాటంగా వేదపఠనం చేస్తూ ప్రవేశిస్తాడు. మతంగ స్త్రీని చూసిన వెంటనే వేదాలు కాస్తా కామశాస్త్రానికి రూపాంతరం చెందుతాయి. అతని కావ్యజ్ఞానం ఆమెని వర్ణించటానికి, అదివరకు అల్లసాని పెద్దన వరూధిని చెప్పిన
జెందుమన్ గుంభగత ప్రదీపకళికాశ్రీ దోఁప నెందెందు పో
కెందే నింద్రియముల్ సుఖంబుఁ గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాఁజదువు నంతర్బుద్ధి నూహింపుమా
అన్న మాటని అనుసరించి –
జ్జడమతి రిహ కశ్చిన్మోక్ష యిత్యాచచక్షే
మమ తు మత మనంగస్మేరతారుణ్యపూర్ణ
స్తనభర మధురాక్ష్యా నీవి మోక్షోహి మోక్షః — అని సమర్థించుకోవటానికి పనికొస్తుంది.
దాని భావం కూడా మోరోభట్ల చేతనే చెప్పిస్తాడు కవి — “మోక్షము మోక్షమనే భ్రాంతి నీకేలరా? తెలియని వారట్లా చెప్పుదురు. ఎట్లా అంటే సుఖదుఃఖములు తెలియని నిర్గుణమైన బ్రహ్మమే మోక్షమని బుద్ధిలేని వాడు చెప్పును. మాయొక్క మతము వినవోయి, మన్మథునియొక్క సర్వోత్కర్షాపరిపూర్ణమైన యౌవనము గలిగినటువంటి, గొప్ప స్తనాలు గలిగినటువంటి మదిరాక్షి యొక్క కోకముడి విడుచుటే మోక్షముగాక మరి వేరే మోక్షము గలదటరా?
ఈ నాటకాన్ని మన్నారుగుడి తిరునాళ్లలో ప్రదర్శించేవారంటే ఆశ్చర్యం కలక్కమానదు. ఐతే మనం గుర్తించాల్సింది ఇది 1715 ప్రాంతాల్లో విషయమని, అప్పటి సాహిత్యంలో శృంగారం, అందునా ప్రత్యక్షశృంగారం అభ్యంతరకరాలుగా అప్పటి శ్రోతలు, ప్రేక్షకులు భావించలేదని. ఈ వ్యాసపరంపరలో ముందుగానే వివరించినట్టు సాహిత్యంలో శృంగారం పట్ల అభ్యంతరాలు, అసహ్యాలు మనం విక్టోరియన్ విలువల్ని శిరసావహించటం మొదలెట్టాక మొదలైన జాడ్యాలు, అంతకు ముందువి కావు.
పైగా మొన్నమొన్నటి వరకు వీధినాటకాలు, తోలుబొమ్మలాటలులాంటి ప్రదర్శనా ప్రక్రియల్లో హాస్యానికి, ముఖ్యంగా శృంగారపూరిత హాస్యానికి ప్రత్యేకమైన గుర్తింపు, ఆదరణ వుండేవి. కేతిగాడు, బంగారక్కలాటి పాత్రల పేర్లు కొందరైనా వినే వుంటారు. పల్లెటూళ్లలో ఆ ప్రదర్శనలకు వచ్చే వాళ్లలో చాలామంది కేవలం వారి హాస్యం చూట్టానికే వచ్చి అది ఐపోవటంతోనే ఇళ్లకు పోతుండేవారు.
ఒక విధంగా చూస్తే, శాహజీ తను రాసిన మిగిలిన యక్షగానాలన్నీ పౌరాణిక సంఘటనల గురించినవి కావటంతో ఇలాటి శృంగారపూరిత హాస్యాన్ని రాయటానికి అవకాశం కలక్క, కావాలని ఈ యక్షగానాన్ని రాసి వుంటాడేమోనని ఊహించటం తప్పుకాదు.
శిష్యుడు కూడా శాస్త్రసమ్మతమైన వాదనలు చేస్తూ గురువుని పెడదారిన పడకుండా చెయ్యటానికి చాలా శ్రమపడతాడు. అలా అతని పాత్ర రెండు విధాలుగా ఉపయోగపడ్తుంది — ఒకటి, కవి సమకాలీన సమాజంలోని ఆడంబరాల్ని, ఆభిజాత్యాల్ని మోరోభట్టు పాత్ర ద్వారా విమర్శించొచ్చు; ఆ వెంటనే శిష్యుడి ద్వారా ఆ వాదనల్ని ఖండించనూ వచ్చు — ఇది అర్థశాస్త్రం కాలంనుంచీ కవులు వాడిన ఒక అద్భుతమైన ప్రక్రియ. తనకు నచ్చని విషయాలన్నీ ఒక పాత్ర చేత చెప్పించి మరో పాత్ర చేత వాడిని ఖండింపజేస్తే అప్పుడు కవికి ఎలాటి ముప్పూ ఉండదు. రెండవది, శిష్యుడు, మోరోభట్టు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలుగా అనుకోవచ్చు; లేదా ఒక వేదపండితుడిలోని రెండు రకాల భావాలకి ప్రతినిధులుగానూ అనుకోవచ్చు.
మతంగ భార్యాభర్తల భాషాప్రయోగంలో కవి ఎంతో ప్రయోజనాన్ని సాధించాడు — రెండు పాత్రలూ మొదటగా మాట్లాడేటప్పుడు వాటినుంచి ఎలాటి భాషని అలవాటు కొద్దీ ఆశిస్తామో సరిగా అలాగే, అంటే నిరక్షరాస్యులుగా, మొరటు పదజాలంతో, ఒత్తులు లేకుండా మాట్లాడతాయి. ఉదాహరణకి –
బమ్మనయ్య వారీలాగు బ్రతిమాలుదురా
ఇమ్మాలెత వేసము ఈనము గాదా
బిసబిస మెట్లనుగూర్చి పిసికిన సేతులు సూసి
పసరులనంజుల మెసవి పసగల నామేను సూసి…
ఎంత చెప్పినా మోరోభట్టు వినకపోయేసరికి ఆమె భాష మారుతుంది. అతన్ని వాదనలో ఓడించాలంటే అతను వాడే భాషలోనే తనూ వాదించాలని నిశ్చయించుకుంటుంది. ఉదాహరణకి –
తను వస్థిరము చూడ ధర్మమే స్థిరము
పాయక ధరనైన బ్రహ్మాండమైన
మోయవచ్చును ఇదె మోయరాదెందు…
అంతే కాదు, పతివ్రతాధర్మం గురించి అతనికి ఉపదేశం చేస్తుంది –
సతులకిది ధర్మముగాదయ్య
పతిని వంచింప నిహపరమింతైన లేదయ్య
కులహీనుడైననుగాని యోబాపనయ్య
గుణహీనుడైననుగాని…
ఇక ఆమె భర్త సంగతి చెప్పే పని లేదు; ఆమెలాగే అతనూ గ్రామ్యభాషతో ప్రారంభించి చివరకు ఇక లాభంలేదని సంస్కృతంలో మోరోభట్టుకు పాఠాలు చెప్పటం మొదలుపెడతాడు. అతని దెబ్బకు మోరోభట్టు తికమకపడిపోయి అతను చెప్పే శ్లోకాలకు అర్థం అడుగుతాడు. ఉదాహరణకి అతనిలా అంటాడు –
గుణప్రకర్షో వినయాదవాప్యతే
గుణాధికే పుంసి జనోనురంజతే
జనానురాగప్రభవా హి సంపదః
దాని అర్థం అడక్కతప్పదు మోరోభట్లుకి.
అలాగే, ఇంతకుముందున్న పరిశోధకులు గమనించని ఒక విషయం ఈ కథలో ఉన్న న్యాయశాస్త్ర సంకటాలు. క్లుప్తంగా చెప్పి వ్యాసం ముగిస్తాను.
ముందే అనుకున్నట్టు ఎన్ని రకాలుగా చెప్పినా మోరోభట్లు వినకపోయేసరికి అతనికి తన భార్యని దానం చెయ్యాలని నిశ్చయించుకుంటాడు మాతంగుడు. ఐతే, ధర్మశాస్త్రాల ప్రకారం భార్యాబిడ్డల్ని దానం ఇవ్వటం శాస్త్రవిరుద్ధం (నారద స్మృతి ‘దానం’ గురించి చాలా విపులమైన, సుదీర్ఘమైన చర్చచేసి అన్ని పార్శ్వాలని విస్పష్టంగా సూత్రీకరించింది; మనుస్మృతిలో కూడా కొంత చర్చ వుంది). ఐతే, మానవప్రవర్తనని నిర్దేశించే వాటిలో మూలసూత్రాలు కొన్ని, వాటిమీద నిర్మించినవి మరికొన్ని. మూలసూత్రాల్లో ముఖ్యమైంది ‘సత్యం’. అంటే సత్యాన్ని నిలబెట్టటానికి మూలసూత్రాలు కానివాటిని అతిక్రమించొచ్చు. మరో మూలసూత్రం పూర్వాచారాల్ని పాటించటం. అంటే మన పూర్వులు ఒక పని చేసివుంటే, అది మనమూ చెయ్యొచ్చు. వీటిని ఆధారంగా చేసుకుని మాతంగుడు తన భార్యని దానం ఇవ్వటానికి సిద్ధమౌతాడు. తన పూర్వుడైన వీరదాసు (పూర్వాశ్రమంలో హరిశ్చంద్రుడు) భార్యని అమ్మి, తనని తను కూడా అమ్ముకున్నాడు గనక ఆ మార్గాన్ని అనుసరించి తను సతిదానం చేస్తానంటాడు. అలాగని నీటిధారతో ఆమెని దానం చేస్తాడు.
ఐతే ఇంతలో మోరోభట్లుకి జ్ఞానోదయమై అతను ఆ దానాన్ని స్వీకరించటానికి నిరాకరిస్తాడు. మాతంగుడేమో మళ్లీ ఆమెను తిరిగి తీసుకోవటం తన సత్యవాక్పరిపాలనకి భంగం కనక అలా చెయ్యలేనంటాడు. మధ్యలో మాతంగి అటూఇటూ కాకుండా నిలబడిపోతుంది.
దానం ఇచ్చేవాళ్లు ఇస్తే, దాన్ని తీసుకునే వాళ్లు తీసుకుంటేనే దానం పూర్తయినట్లు — ధర్మశాస్త్రాల ప్రకారం (ఇప్పటి కాంట్రాక్ట్లా కూడా ఇదే సూత్రం మీద నడుస్తుంది — ఒక కాంట్రాక్ట్ చెల్లాలంటే రెండు పక్షాల వాళ్లూ ఒక అంగీకారానికి వచ్చితీరాలి). కనక ఇక్కడ ‘దానం’ పూర్తి కాలేదు. కాని దాన్ని పూర్తిచేసే మార్గం లేదు. అలాగే దాన్ని రద్దు చేసి పూర్వస్థితికి తీసుకెళ్లటానికి కూడా మార్గం లేదు.
నాయకరాజుల కాలంలో ఎలాటి న్యాయవివాదాలైనా చివరకు పరిష్కరించేది రాజే. రాజుకి పైన అలాటి అధికారం వున్నవారు ఇంకెవరూ లేరు. ఇక్కడ కథలో రాజు అక్కడికి వచ్చి పరిష్కారం చూపించడు — శివుణ్ణి ప్రత్యక్షం చేయిస్తాడు. అలా శాహజీ అంతకుముందున్న రాచరికానికి కొంత భిన్నమైన న్యాయవ్యవస్థని ఈ నాటకం ద్వారా ప్రతిపాదించాడు.
శివుడు కూడా ఇక్కడున్న న్యాయపరమైన చిక్కుని పరిష్కరించడు — అందరికీ మోక్షం ఇచ్చేస్తాను పొమ్మంటాడు!
సతిదానశూరంలో ఇంకా ఎన్నో విశేషాలున్నయ్ కాని ఇప్పటికివి చాలుననుకుంటాను. ఉత్సుకత ఉన్నవాళ్లు మూలాన్నే చదువుకోవచ్చు — ఆర్కైవ్ డాట్ ఆర్గ్‌లో ఉచితంగానే దొరుకుతుంది.