మీరు కొయ్యగుర్రం చదివారా?
పోనీ, ఒక దళారీ పశ్చాత్తాపం?
మరి, ది ఆల్కెమిస్ట్?
ఏనిమల్ ఫార్మ్? నీలిమేఘాలు? ముల్కి?
రక్తాశ్రువులు? రాధికా సాంత్వనం? రిచ్ డాడ్ పూర్ డాడ్?
అన్నీ మనసూరించే పుస్తకాలే కదూ!
ప్రపంచం ప్రేమగా అక్కున చేర్చుకున్న అక్షరనిధులే కదూ!
అవి ఎంత గొప్ప పుస్తకాలైనా కావచ్చు. కానీ, అన్నీ చదవటం ఎవరికైనా అసాధ్యమే.
దిగులు పడకండి. ఆ కొరత తీర్చేందుకు కొంతమంది తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
వారిలో దుప్పల రవికుమార్ ఒకరు.
ఆయన ‘సిక్కోలు బుక్స్’ తరఫున ప్రచురించిన ‘‘మీరు చదివారా?’’ (పరిచయాలు, సమీక్షలు) పుస్తకం… పైన ఉదహరించిన అపురూప గ్రంథాల సారాన్ని సంక్షిప్త వ్యాసాల రూపంలో ఆవిష్కరిస్తుంది.
రవికుమార్ గొప్ప పాఠకుడు. సాహిత్య ప్రేమికుడు. ఓ దినపత్రికలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తన ప్రేమనే ఆలంబనగా చేసుకున్నాడు. తాను చదివిన మంచి పుస్తకాల గురించి నేటి/రేపటి తరానికి చెప్పటానికి నడుం బిగించాడు. అట్లా పాతిక పుస్తకాలపై రాసిన పరిచయ వ్యాసాలను గుదిగుచ్చి పుస్తకంగా వెలువరించారు. దానికి హాయిగా ‘‘మీరు చదివారా?’’ అనే పేరు పెట్టి మనకు మహోపకారం చేశారు.
సి.కె.జాను అసంపూర్తి ఆత్మకథ ‘‘అడవితల్లి’’తో మొదలై హార్పర్ లీ ‘‘టు కిల్ ఏ మాకింగ్ బర్డ్’’తో ముగిసే ఈ పుస్తకం మనల్ని సాహిత్యాకాశంలో విహరింపజేస్తుంది. ఈ రెండు పేర్లు చూసి, మిగతావన్నీ కూడా అనువాదాలే అనుకోవద్దు. నగ్నముని, కాశీభట్ల వేణుగోపాల్, చినవీరభద్రుడు, వరవరరావు, ముద్దుపళని, వల్లంపాటి వెంకటసుబ్బయ్యవంటి ప్రముఖుల తెలుగు పుస్తకాల పరిచయాలూ ఉన్నాయి.
రవికుమార్ ఈ వ్యాసాల రచనకు కొన్ని నియమాలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా ఆ పుస్తకం తాలూకు కథాంశం, అందులోని ఆసక్తికర అంశాలు, రచయిత నేపథ్యం, ఇతరత్రా బలాబలాలను బేరీజు వేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అది కూడా వీలైనంత క్లుప్తంగా, ఆసక్తి ఇనుమడించేలా.
1991 నుంచి 1998 వరకూ వెలువడిన రచనలతో యాళ్ల అచ్యుతరామయ్య వెలువరించిన ‘‘ఆమె నవ్వు’’ కథాసంపుటిలోని ‘రావణకాష్టం’ కథను విశ్లేషిస్తూ ‘‘స్త్రీల సమస్యలపట్ల రచయితకున్న సానుభూతి మొదటి విషయం కాగా, జీవితాన్ని తన పాత్రలు ఎదిరించేలా రచయిత రాయకపోవడంలో ఆనాటికి అతని అవగాహనకున్న పరిమితి రెండో విషయం’’ అంటారు. ‘సామాజిక సమస్యలను వ్యక్తిగత శిక్షల ద్వారా పరిష్కరించలే’మని ‘‘ఒక అడుగు ముందుకు’’ కథానాయికతో చెప్పించిన అంశాన్ని రవికుమార్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ‘‘అభిమాన భంగం’’ కథానాయికను పరామర్శిస్తూ ‘ఆమెకు ముందు జరిగింది మానభంగం, అదీ ఒక్కసారే. కానీ తరవాత ఇంట్లో ప్రతి క్షణం జరుగుతున్నది అభిమాన భంగం’ అని విశ్లేషించి, ‘ఆ పరిస్థితిని ఎదిరిస్తూ ఆత్మవిశ్వాసంతో కూడిన ఆమె ప్రవర్తన ఆదర్శప్రాయమైనది’ అంటారు. స్త్రీవాద, వ్యంగ్య, హాస్య కథల తరువాత మానవీయ విలువలను ప్రతిపాదించే కథలకు ఈ సంపుటిలో స్థానమిచ్చారంటూ ప్రశంసించారు.
వారణాసి నాగలక్ష్మి కథాసంపుటి ‘‘ఆలంబన’’పై రాసిన వ్యాసంలో జి.కళ్యాణరావు ‘అంటరాని వసంతం’ గురించి ప్రస్తావిస్తూ ‘ఎలెక్స్ హేలీ రాసిన ఏడు తరాలు కంటే ఎంతో గొప్పగా సాగిన నవల’గా అభివర్ణిస్తారు. తెలుగు రచయితలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని బాధ పడతారు. వారణాసి నాగలక్ష్మి ‘ఆలంబన’తోపాటు ‘గెలుపు’, ‘ముసురు’, ‘తులసమ్మ కొడుకు’ వంటి కథల ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు. ‘వర్షిణి’ కథను విశ్లేషిస్తూ ‘గిజుభాయి రాసిన మేనిఫెస్టో చిన్నారి’ని ప్రస్తావించటం రవికుమార్ విస్తృతాధ్యయనానికి నిదర్శనం.
సోవియట్ రష్యాలో జరిగిన తతంగాన్ని జార్జి ఆర్వెల్ వ్యంగ్యభరితంగా చిత్రించిన నవల ‘‘ఏనిమల్ ఫార్మ్’’పై రాసిన వ్యాసంలో సందర్భానుసారంగా అనేక విషయాలు ప్రస్తావించారు. ఆర్వెల్ అసలు పేరు ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్. బెంగాల్లోనే పుట్టిన ఆర్థర్ పోలీసుగా, జర్నలిస్టుగా పనిచేశాడు. స్పెయిన్ అంతర్యుద్ధంలో పాల్గొని గాయాలపాలయ్యాడు. రెండు ప్రపంచయుద్ధాలనూ ప్రత్యక్షంగా పరిశీలించాడు. రెండుమూడు పుస్తకాలు రాసినా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రాసిన ఏనిమల్ ఫార్మ్ చిరస్థాయిగా నిలిచిపోయింది. మన పంచతంత్రంలా జంతువుల ప్రతీకలతో నడుస్తున్న చరిత్రను రికార్డ్ చేసిన కథ. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వాక్యం ‘‘అన్ని జంతువులూ సమానమే. కానీ కొన్ని జంతువులు మాత్రం కొంచెం ఎక్కువ సమానం’’ అనేది ఆర్వెల్ సృజనే. ఈ నవలలోని ‘మేజర్ పంది లెనిన్‌ను, స్నోబాల్ ట్రాట్స్కీని, నెపోలియన్ స్టాలిన్‌ను గుర్తు తెప్పిస్తా’యన్న అంశాన్ని రవికుమార్ సందర్భానుసారంగా ప్రస్తావించటం ప్రశంసనీయం. విప్లవాదర్శాల కార్యాచరణను ఎద్దేవా చేయటం గమనిస్తామన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తారు.
తెలుగు కవిత్వచరిత్రలో చెరిగిపోని అధ్యాయం ‘‘కొయ్యగుర్రం’’. 1977లో విరుచుకుపడిన దివిసీమ తుపాను నేపథ్యంతో నగ్నముని రాసిన ఈ దీర్ఘకవిత ఓ సంచలనం. ‘డిజాస్టర్ మేనేజ్మెంట్’లో ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రస్వరంతో ఎండగట్టిన ఈ కవిత ‘‘జీవితం మిథ్యంటారు వేదాంతులు. అది అబద్ధమని పొలికేక పెడుతూ కొయ్యగుర్రం ప్రారంభమవుతుంది’’ అంటూ రవికుమార్ గొప్పగా విశ్లేషించారు. ‘భావకవిత్వాన్ని తొలిసారి రాసిన ఎస్.టి.కోల్రెడ్డి తన ‘లిరికల్ బాలాడ్స్’కు వివర పీఠిక రాసుకోవాల్సి వచ్చిన సంగతి మొదలు కొత్త ఎడిషన్‌లో చేకూరి రామారావు రాసిన పీఠిక, నికీతా గూరోవ్ రాసిన పరిచయం, మో రాసిన ‘జార్జ్ మాండెల్/నగ్నమునీ’ అనే ఇంటీరియర్ డైలాగ్ దాకా అనేక విషయాల వెలుగులో కొయ్యగుర్రాన్ని సుదీర్ఘంగా సమీక్షించారు.
శ్రీకాకుళ సాహితి ప్రచురించిన సంకలనం ‘జంఝావతి కథలు’పై రాసిన వ్యాసంలో ఆణిముత్యాల్లాంటి కథలున్నాయంటూ అభినందించారు. కారా మేస్టారు ‘అన్నెమ్మ నాయురాలు’, పంతుల కమలకుమారి ‘భస్మ సింహాసనం’, చింతా అప్పలనాయుడు ‘భూతాల సొర్గం’ కథలు మానవ జీవనం తాలూకు వర్ణచ్ఛాయల్ని ఎంత ప్రతిభావంతంగా ప్రతిబింబించాయో వివరించారు. పడాల జోగారావు రాసిన ‘చేదు ఫలం’ కథను విశ్లేషించటానికి ప్రముఖ విలేఖరి పాలగుమ్మి సాయినాథ్ రాసిన ‘మంచి కరువును అంతా ప్రేమిస్తారు’ పుస్తకాన్ని రిఫర్ చేయటం రవికుమార్ ప్రతిభకు నిదర్శనం. అదే సమయంలో ఈ సంకలనంలో కొన్ని కథల్లోని లోపాలను సోదాహరణంగా వివరించారు. ‘సాటింపు’, ‘వేరుపాట్లు’, ‘ఆటుపోటు’ కథలు సాహిత్య ప్రయోజనం కలిగించవని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పాలో కొయెల్హొ (పాల్ ఖెలో) ‘‘ది ఆల్కెమిస్ట్’’పై రాసిన వ్యాసం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ‘మొత్తం ఈ విశ్వమంతా మనుషులుగా మనం చేసే ప్రయత్నాలన్నింటికీ సహకారంగా కుట్ర పన్నుతూ ఉంటుంది’ అన్న సారాంశాన్ని మనకు తాయిలంలా అందిస్తారు. ఈ నవల చదువుతున్నప్పుడు ‘13వ శతాబ్దిలో పర్షియన్ కవి, నోబెల్ బహుమతి పొందిన హెర్మన్ హెస్ స్విస్’లను గుర్తు చేసుకుంటారు రవికుమార్. ఇన్ని అంశాలను తన వ్యాసాలకు సమాంతర సమాచార సామగ్రిగా వాడుకోవటం వల్లనే ఈ పుస్తకం విలువైందిగా రూపొందింది.
‘‘పినలగర్ర’’ కవితాసంపుటిపై రాసిన సమీక్షలో ‘కళింగాంధ్ర కవిత్వతీరాన మన గుండెను, గుండెలోతులను, మనసును, అందులో సుడులు తిరుగుతున్న ఆవేదనలను ప్రతిభావంతంగా అక్షరీకరించా’రంటూ ఆర్.రామకృష్ణకు కితాబునిచ్చారు. అదే సమయంలో, ఈ కవి భావ వ్యక్తీకరణలో మరింత రాటుదేలాలని సూచించారు. ‘ఐర్లండులో ఒక మత్స్యకార గ్రామంలో నివసించే జె.ఎం.సింగ్ (JM Synge)తాను రాసిన నాటకాలను ఓసారి డబ్ల్యు.బి.ఈట్స్ మహాశయుడు చదివి, పెదవి విరిచి, గట్టిగా మందలించాడట. జె.ఎం.సింగ్ సిగ్గుపడి, విపరీతంగా సాధన చేసి, తన సొంతూరులో మకాం పెట్టి, ఆ మూడ్లోకెళ్లి అదే భాషలో నాటకాలు రాశాడట. ఫలితంగా జె.ఎం.సింగ్‌ను నోబెల్ బహుమానం వరించింది’ అని వివరించటం ద్వారా కవికి మరింత సాధనసంపత్తి అవసరం అని నర్మగర్భంగా సూచించారు.
‘‘భారతదేశ పతనానికి పదకొండు కారణాలు’’ పుస్తకం గురించి తక్కువమంది విని ఉంటారు. బళ్లారి రాఘవ రాసిన వ్యాసమిది. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి చొరవతో బళ్లారి రాఘవ ఇంట్లోనే లభించిన ఈ వ్యాసాన్ని ఆవంత్స సోమసుందర్ తెలుగులోకి అనువదించారు. దీని వెనక కన్యాశుల్కం దాగి ఉందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కన్యాశుల్కంలో వెంకటేశానికి జ్ఞానబోధ చేసే క్రమంలో గిరీశం తానెంత గొప్పవాడో వివరిస్తూ ‘‘డామిట్! ఇలాంటి మాటలంటేనే నాకు కోపం వస్తుంది. పూనా డెక్కన్ కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు – ‘ది ఎలెవన్ కాజెస్ ఫర్ ది డిజెనరేషన్ ఆఫ్ ఇండియా’ను గూర్చి మూడు గంటలు ఒక్కబిగిన లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు’’ అంటాడు. ‘ఇంతకీ ఆ ఎలెవన్ కాజెస్ ఏమిటి? పూనా డెక్కన్ కాలేజీలో ఎవరు, ఎప్పుడు, ఏ విధమైన లెక్చర్ ఇచ్చారు? గురజాడ మాటలను తేలిగ్గా తీసి పారెయ్యలేం’ వంటి ఆలోచనలతో సతమతమైన వారిలో కట్టమంచి రామలింగారెడ్డీ ఒకరు. ఈ అసైన్మెంటును ఆయన బళ్లారి రాఘవకు అప్పగించారట… ఇట్లా ఈ వ్యాసం వెనక ఉన్న ఆసక్తికరమైన అంశాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తారు. ‘అనేక ఉత్తమ జీవశక్తులను విధ్వంసం చేసుకుంటున్నాం’, ‘ఆలోచనల ఆవరణానికీ ఆచరణల జీవకాంతికీ నడుమ ఎంతో అఖాతం ఏర్పడుతోంది’ వంటి సుకుమారమైన వాక్యాలతో ఈ వ్యాసం ఆకట్టుకుంటుంది.
టెడ్ అలెన్, సిడ్నీ గోర్డన్‌లు రాసిన డాక్టర్ నార్మన్ బెతూన్ జీవిత కథ ‘‘రక్తాశ్రువులు’’పై రాసిన వ్యాసం పాఠకుల్ని ఉద్వేగానికి గురి చేస్తుంది.
1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసింహుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని రాసిన ‘‘రాధికా సాంత్వనం’’ తాటాకుల ప్రతిని బెంగుళూరుకు చెందిన నాగరత్నంగారు సంపాదించి, ఆ పాఠాన్ని పరిష్కరించిన విషయం విస్మయం గొలుపుతుంది.
2005లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక ‘‘ముల్కి’’; వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకులుగా కథాసాహితి ప్రచురించిన సంకలనం ‘‘కథ-2000’’, వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారి ‘‘రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ’’, ఎం.వి.ఆర్. శాస్త్రి ‘‘వీక్ పాయింట్’’, జాన్ పెర్కిన్స్ ‘‘ఒక దళారీ పశ్చాత్తాపం’’ తదితర పుస్తకాలపై రాసిన సమీక్షల్లో విలువైన విషయాలు ప్రస్తావించారు.
తాను చదివిన, తనకు నచ్చిన పాతిక పుస్తకాల్లోని బలాలను బత్తాయిల్లా ఒలిచి, పాఠకులకు రుచి చూపించటంతోపాటు నిర్మొహమాటంగా బలహీనతలనూ ప్రస్తావించటం విశేషం. మానవీయ సంబంధాల్లోని లోతులను తడుముతూ సాగిన కథలు కొన్ని హఠాత్తుగా సినిమాటిక్‌గా మారిపోయిన సందర్భాలు, అన్యాయంగా పాత్రల ప్రాణాలు తీసిన ముగింపులు, శిల్పపరమైన లోపాలు, మాండలిక భాషాదోషాలవంటి అంశాలను సున్నితంగా చెప్పారు.
అయితే, విషయసూచికలో వ్యాసాల పేజీ నంబర్లు మారిపోవటం చిన్న అసౌకర్యం.
యువతతో పుస్తకాలు చదివింపజేస్తే ప్రపంచానికి గొప్ప మేలు జరుగుతుందని బలంగా నమ్మే దుప్పల రవికుమార్ నిశ్చితాభిప్రాయానికి నీరాజనాలు పట్టడానికి తప్పనిసరిగా ‘‘మీరు చదివారా?’’ పుస్తకం చదవాల్సిందే.
(ప్రతులకు: sikkolubooks@gmail.com)
