‘అభిరామి అంతాది శతకం’లోని ‘శతక పఠన ఫలశ్రుతి’ పేజీలో ఆరాటంగా వెతికాడు రామచంద్రం. మంచి విద్య, జ్ఞానం లభించడానికి, విడిపోయిన దంపతులు కలుసుకోవడానికి, అకాల మరణం, దుర్మరణం సంభవించకుండా ఉండడానికి అని వంద ఫలితాలు రాసి ఉన్నా, కొడుక్కి ఉద్యోగం రావడానికి సరిపడే ఒక్క పద్యం కూడా అందులో లేదు.
‘అభిరామి భట్టర్ కాలంలో ఉద్యోగం దొరకడం అంత కష్టం కాదేమో’ అనుకున్నాడు. మరుక్షణమే, అలా అనుకోవడమే మహా పాపం, తప్పు అనిపించి, సందేహించినందుకు ‘నీ దివ్య రూపముదప్ప మదిన్ నిలుపన్ వేఱొక్క మూర్తిన్…’ అని పదే పదే జపించుకుంటూ పూజగది నుంచి బయటకు వచ్చినప్పుడు, టేబుల్ మీద అడ్డాకులో ఇడ్లీ, చట్నీ పొట్లం ఎదురుచూస్తూ ఉంది.
భార్య మహాలక్ష్మి పక్కింట్లో స్టార్ టీవీ చూడడానికి వెళ్ళింది. బాలాజీ అప్పుడే లేచి బ్రష్ చేసుకుంటున్నాడు. ఇలా బాధ్యత లేకుండా ఉంటున్నందుకు కోపం వచ్చినా, ప్రేమా-గీమా అని పనికిమాలిన వ్యవహారాల్లో పడకుండా, పద్ధతిగా లైబ్రరీకి వెళ్ళి పార్ట్-టైమ్ జాబ్ చేసుకుని ఇంటికి వస్తున్నాడు, అదే పదివేలు అని మనసుకు నిమ్మళంగా అనిపించింది రామచంద్రానికి. వీడికి పెళ్ళి చెయ్యాలి. దానికి అభిరామి అంతాదిలో ఒక పద్యం ఉంది.
‘నెలవంక పరిమళంబు వెదజల్లు నీదు సుకుమార పాదముల్ నా తలమీద మోపన్, ఎట్టి పుణ్యము చేసికొంటినో…’ కానీ రెండేళ్ళుగా, కొడుక్కి ఉద్యోగయోగం మాత్రం కలిసిరావడం లేదు. పోయిన ఏడాది ఎన్నో కంపెనీలకు దరఖాస్తు పెట్టుకున్నాడు, ప్రవేశ పరీక్షలూ రాశాడు. ఎందులోనూ రాలేదు. శ్రద్ధపెట్టి చదవలేదేమో అనిపించింది. కానీ ఆ మాట అడగడానికి జంకు. అసలే కోపిష్ఠి పిల్లాడు, అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోతే? ఒక్కగానొక్క కొడుకు.
“ఈ సంవత్సరం, ఎలాగైనా కొంచెం కష్టపడి చదువు బాలాజీ” అన్నాడు. వాడు ‘ఎంప్లాయ్మెంట్ న్యూస్’ పేజీని విరక్తిగా చూస్తూ, “ఏంటో నాన్నా. ఇన్నేళ్ళు చదివి పరీక్షలు రాసి, పాస్ అయ్యాక, ఉద్యోగం కోసం మళ్ళీ పరీక్షలు రాయాలంటే చాలా బోర్‌గా అనిపిస్తోంది!” అన్నాడు. హాంకాంగ్ కోటీశ్వరుల కుటుంబాల గొడవలను స్టార్ టీవీలోనే వదిలేసి మహాలక్ష్మి అప్పుడే లోపలికి వచ్చింది.
“అయితే ఏం చేద్దామని?”
“మీకు నేను భారంగా ఉన్నాను. అంతేనా?”
“అబ్బే అదేం లేదు. చదువు పూర్తయి రెండేళ్ళు దాటింది కదా అనీ…” సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు రామచంద్రం.
“ఉద్యోగం, పెళ్ళి, పిల్లల్ని కనడం… జీవితానికి లక్ష్యం ఇదేనా నాన్నా?”
“ఇంకేదైనా ఉంటే చెప్పు.”
“సన్యాసి అయిపోతానంటావా?” అంది మహాలక్ష్మి.
“చెప్తాను,” అన్నాడు వాడు కోపంగా.
“నువ్వు కాసేపు ఊరుకో,” భార్యను గదమాయించాడు రామచంద్రం. “నువ్వు భారత్ పరీక్ష రాస్తున్నావు కదా?” కొడుకును అడిగాడు.
ఈ సంవత్సరం వాడిని భారత్ పరీక్ష రాయమని ఒప్పించడమం పెద్ద గగనంగా అనిపించింది.
“నాకు ఆ పరీక్షలు పాస్ అయ్యే ఓపిక లేదు నాన్నా. చాలా టఫ్‌గా ఉంది. పోయిన ఏడాది రాశాను కదా, ఒకేలాంటి ఆప్షన్స్ నాలుగు ఇచ్చాడు; అందులో అన్నీ కరెక్టే అన్నట్టుగా ఉన్నాయి. ఆ పేపర్ సెట్ చేసేవాళ్ళందరూ అంతకుముందు యమలోకంలో చిత్రహింసల డిపార్ట్మెంట్లో పనిచేసినవాళ్ళయుంటారు.”
“ఇంకొక్కసారి రాసి చూడరా, కొంచెం శ్రద్ధగా చదివి.”
“ఏదో, నువ్వు చెప్తున్నావని రాస్తున్నాను,” అన్నాడు బాలాజీ.
“మంచి ఉద్యోగం కదా… వస్తే సెటిల్ అయిపోతావని…”
“మంచి ఉద్యోగమే, ఇండియాలోనే బెస్ట్. కానీ పదివేలమంది రాస్తున్నారు…”
“దాని గురించి నీకెందుకు?”
“నాకు ఎలా దొరుకుతుంది?”
“కొంచెం చదివి చూడరా, కొంచెం ఎఫర్ట్…”
“రమేష్ రాసి పాస్ అవ్వలేదూ?” అని మహాలక్ష్మి మధ్యలో దూరింది. రమేష్ మహాలక్ష్మి తమ్ముడి కొడుకు.
“అమ్మా! నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రమేష్ వేరు, నేను వేరు అని!”
రామచంద్రం చూపుడు వేలితో వంటగది వైపు చూపిస్తూ, “లోపలికి వెళ్తావా లేదా?” అని భార్యని కసిరాడు.
“అవును, అందరూ నన్నే గదమాయించండి,” అంటూ ఆమె విసుక్కుంటూ వెళ్ళిపోయింది.
“ట్రై చేస్తాను నాన్నా. నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి,” అన్నాడు బాలాజీ.
వాడిని చూస్తే జాలేసింది. ఎనిమిది సెమిస్టర్లు, దాదాపు ఎనభై పేపర్లు రాసి అలసిపోయిన వాడికి, మళ్ళీ పరీక్ష అంటే విసుగ్గా ఉండదూ! ఎంత పోటీ! ఒక్క ఉద్యోగానికి ఎన్ని దరఖాస్తులు!
“ఈ ప్రపంచం మీద విరక్తి రాకుండా నేను ఇంకా తిరుగుతున్నానంటే అదే ఆశ్చర్యం,” అని బనియన్ వేసుకుని బయటకు బయలుదేరాడు బాలాజీ.
“ఎక్కడికి వెళ్తున్నాడు?”
“వీధి చివరికి. సిగరెట్ తాగడానికి!”
రామచంద్రాన్ని వెతుక్కుంటూ ఆఫీసుకు విష్ణుమూర్తి వచ్చాడు. తన టేబుల్ మీద ఆపిల్ పండ్లు, పెన్సిల్ సెట్ పెట్టగానే రామచంద్రం అప్రమత్తమయ్యాడు. “ఏంటిది? ఎందుకివన్నీ?” పరిచయం చేసుకోకుండా ఒక నవ్వు నవ్వి, ఆ నవ్వును అలాగే పెదవుల మీద ఉంచి వివరాలు చెప్పాడు విష్ణుమూర్తి. అతని పై అధికారికి కోరమంగళాలో ఒక ‘స్థలం’ అలాట్ అయింది. అది ఇంకా ఆర్డర్ రూపంలోకి ఎక్కలేదు; కనుక్కుంటే, ఏదో పేమెంట్ డీఫాల్ట్ కావడంవల్ల అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోగా, కమిషనర్‌కు అప్పీల్ చేసి ఉందని, ఆ అప్పీల్ ఫైల్ రామచంద్రం టేబుల్ మీదికి వచ్చిందని చెప్పాడు.
“అవును, నేను ఏం చేయాలి?” అన్నాడు.
“మీరు తల్చుకుంటే, అలాట్మెంట్ ఇవ్వమని రికమండ్ చెయ్యొచ్చు,” అంటూ తల తిప్పి గదంతా చూసి, “కావాలంటే మిమ్మల్ని విడిగా కలుసుకుంటాను,” అన్నాడు విష్ణుమూర్తి.
రామచంద్రం అతని కళ్ళల్లోకి నేరుగా చూసి అన్నాడు “లంచమా?”
“అలా అని కాదు. ఒక కన్సిడరేషన్…”
“వెళ్ళవయ్యా. నేను ఈ డిపార్ట్మెంట్లో పాతికేళ్ళుగా పని చేస్తున్నాను; ఒక్క గుండుసూదైనా ఇంటికి తీసుకుపోను, తెలుసా?”
“చెప్పారు సార్.”
“మరి ఏ ధైర్యంతో నాకు లంచం ఇవ్వడానికి వచ్చావు? పోలీసులకు ఫోన్ చేశానంటే నిన్ను అరెస్ట్ చేస్తారు, తెలుసా?” అన్నాడు.
“మెల్లగా… మెల్లగా మాట్లాడండి సార్; ఇప్పుడు నేను ఏమన్నానని?”
“నన్ను లంచం తీసుకునేవాడని ఎలా అనుకున్నావు?”
ఆ వ్యక్తి రామచంద్రాన్ని సూటిగా చూసి, “మిస్టర్ రామచంద్రం, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను లంచం ఇవ్వడానికి రాలేదు. ఒక పరస్పర సహాయం కోసం వచ్చాను. నా పై అధికారి ‘భారత్ కంపెనీలో పెద్ద ఆఫీసర్.”
“…”
“అవును, మీ పిల్లాడు ఆ భారత్ కంపెనీలోనే ఇంజినీర్ ఉద్యోగానికి ప్రవేశపరీక్ష రాస్తున్నాడు కదా?”
“సో?”
విష్ణుమూర్తి మళ్ళీ రాడార్ లాగా తల చకచకా ఇటూ అటూ తిప్పి చూసి, “మీరు ఈ అలాట్మెంట్ చేసి ఇస్తానంటే, పరీక్ష పేపర్ నేను తీసుకొచ్చి మీ టేబిల్ మీద పెడతాను; ఇక్కడొద్దంటే ఇంటికి తెచ్చిస్తాను.”
మచంద్రం చేయి మెల్లగా వణకడం గమనించి, “పరీక్ష అయ్యాక అలాట్మెంట్ ఇచ్చినా సరే,” అని మరింత ఆశ పెట్టాడు.
రామచంద్రం “కుదరదు, నథింగ్ డూయింగ్” అన్నాడు కానీ, ఈసారి ఆ మాటలో ఇదివరకటి కాఠిన్యం లేదు.
“చూడండి సార్, మీవల్ల అయిందా సరి, కాకపోతే మీకన్నా పై అధికార్ల దగ్గరకు వెళ్తాం.”
“నేనేం ప్రామిస్ చేయలేను, ముందు కేస్ షీట్ చూడాలి.”
“బాగా చూడండి రామచంద్రంగారూ. మై ఆఫర్ ఈజ్ ఓపెన్. ఒక్క పేపర్ మాత్రమే బయటకు వస్తుంది. ఇంకెవరికీ దొరకదు. ఏజ్-ఎ-స్పెషల్ కేస్!”
రామచంద్రం పెన్సిల్‌తో టేబుల్ మీద ఆలోచిస్తూ పిచ్చి గీతలు గీస్తుండగా, “సోమవారంలోగా ఆలోచించి చెప్పండి; సండే ఇంట్లోనే ఉంటాను, ఫోన్ చేయొచ్చు,” అని విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు విష్ణుమూర్తి. “పరీక్ష పదో తేదీ, కనీసం నాలుగు రోజులైనా టైం కావాలి కదా?” అని వెళ్తూ వెళ్తూ కూడా “ఇది లంచం కాదులెండి,” అని చెప్పే వెళ్ళాడు. అతను వెళ్ళినా, రామచంద్రం మనసు కుదుటపడలేదు. ఆ ఫైల్ తీసి చూశాడు. కొంచెం చిక్కులతో కూడిన కేసే. పేమెంట్ డీఫాల్ట్ అయింది. ‘కావాలని డీఫాల్ట్ చేయలే’దని రామచంద్రం సర్టిఫికెట్ ఇస్తే పని అయిపోతుంది, లెటర్ ఇచ్చేయొచ్చు.
మొదటి ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కట్టేశారు. మధ్యలో మూడు మాత్రం కట్టకపోవడంతో అలాట్మెంట్ క్యాన్సిల్ అయి, వేలానికి వెళ్ళింది. ఇంకా ‘వేలం’ జరగలేదు; ‘విదేశాలకు వెళ్ళా’ననే నెపంతో పాత కేసు ఒకదానికి పోయిన ఏడాది ఇచ్చిన మినహాయింపు గుర్తుకు వచ్చింది. అయినా…
‘నేనేమన్నా డబ్బులు తీసుకుంటున్నానా? లంచం తీసుకోవట్లేదు కదా… ఒక ‘ప్రిసిడెంట్’ ప్రకారం మినహాయింపు ఇచ్చి అలాట్ చేస్తున్నాను,’ అని రకరకాలుగా మనసుకు సర్దిచెప్పుకున్నా, ‘ఇది తప్పు’ అనే భావన మాత్రం లోలోపల తొలిచేస్తూనే ఉంది. ఏ విధంగా తప్పు?
ఈ రోజు రేటు ప్రకారం ఆ సైట్ విలువ చాలా ఎక్కువ. వేలంలోనే ఎనిమిది లక్షలకు పోతుంది.
ఈ శాఖకు ఇరవై ఐదేళ్ళు సేవ చేసినందుకు ఒక చిన్న రాయితీ తీసుకున్నట్టు అనుకోవచ్చు. ఎంతమంది దోచుకోవట్లేదు; ఒక్కొక్కళ్ళయితే వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు మింగేశారంటున్నారు. స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని, బ్యాంకుల్లో పై స్థాయి ఆఫీసర్లను చూళ్ళేదూ?! వాటితో పోలిస్తే ఇదేం పెద్ద తప్పని? ఏదో ఒక చిన్న మినహాయింపు ఇచ్చి, వడ్డీతో కలిపి కట్టేయమని ఆర్డరు వేసి, స్థలం ఇవ్వబోతున్నాను. దానికి ప్రతిఫలంగా వాడు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాడు!
కట్టాల్సిన బకాయి పదివేలే. కానీ ఈ రోజు కోరమంగళాలో ఆ సైట్ విలువ ఎనిమిది లక్షలు పలుకుతుందనే విషయాన్ని ఆయన ఆలోచించడానికి ఇష్టపడలేదు.
ఇంటికి రాగానే జరిగిందంతా మహాలక్ష్మికి చెప్పాడు.
“మాట్లాడకుండా ఆ పని చేసేయండి. మనమేమన్నా డబ్బిస్తున్నామా? మన వాడికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది. ఉద్యోగం వస్తే పిల్లనివ్వడానికి లైన్లు కడతారు. మన కష్టాలు, కన్నీళ్ళన్నీ తీరిపోతాయి. వీడి గురించిన దిగులుతో రోజు రోజుకీ నా ఆరోగ్యం పాడైపోతోంది. ప్రతిదానికీ నాతో గొడవ పెడుతున్నాడు.”
“నీతో గొడవ పడుతున్నాడా?”
“ఏం అడిగినా ఎదురు తిరుగుతున్నాడు మీ కొడుకు. ఈ రోజు నా మీద చెయ్యెత్తబోయాడు కూడా!”
“ఎక్కడ వాడు?”
“లైబ్రరీకి వెళ్ళాడు. మీ మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తున్నాడు.”
“నేనేం చేశానట?”
“ఉద్యోగం ఇప్పించలేదని లోపల్లోపల బాధేమో… ఇంకేం చెయ్యక్కర్లేదు, ఆ పేపర్ ఏదో అన్నారు కదా, అది తెచ్చి వీడికిచ్చి పాస్ చేయించండి. మన బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత పెళ్ళి చేసుకుంటే చేసుకుంటాడు, లేకపోతే లేదు. ఏమైపోతే నాకెందుకు! అది తెచ్చిపెట్టండి. వాడు ఖాళీగా ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. రోజుకు ఇరవై రూపాయలు అడుగుతున్నాడు. ఎందుకురా అంటే, ‘అడగడానికి నువ్వెవరు? మా నాన్న సంపాదిస్తున్నాడు’ అంటున్నాడు మొరటుగా. నాకు ఈ ఇంట్లో ఏ హక్కు, మర్యాదల్లేవు…”
“ముందా ఏడుపాపు. అయ్యాయా, నీ కొడుకు మీది కంప్లైంట్లు?”
“మీకు తమాషాగానే ఉంటుంది లెండి. నేను ఇంట్లో ఇరవై నాలుగు గంటలూ నరకం చూస్తున్నాను. వాడు నన్ను ఎలా ఎగర్తిస్తున్నాడో తెలుసా?”
వాడి గురించి వినేకొద్దీ, వాడి మీద కాదు; వాడిని ఇదంతా నేరుగా అడగలేని, లేదా అడగడానికి ఇష్టపడని తన అశక్తత మీదే రామచంద్రానికి కోపం వచ్చింది.
“సరే సరే. సాయంత్రం రాగానే అడుగుతాన్లే,” అన్నాడు.
“అడగరు. అంత ధైర్యం ఎక్కడుంది మీకు? ఇంకేం ఆలోచించకుండా ఆ పేపరో, కాయితం ముక్కో తీసుకొచ్చి ఇవ్వండి.”
రాత్రి బాలాజీ ఇంటికి వచ్చినప్పుడు, బలంగా సిగరెట్ వాసన వచ్చింది. అడగాలనిపించలేదు; ‘సిగరెట్టేగా, డ్రగ్స్ కాదుగా’ అని సరిపెట్టుకున్నాడు. కోపం అయితే వచ్చింది… బాధ్యత లేనివాడు అని తిట్టుకున్నాడు. జేబులో స్పష్టంగా కనిపిస్తున్న విల్స్ ప్యాకెట్ చిరాకు తెప్పించింది.
“ఏంటి బాలాజీ, పరీక్షకోసం ఎలా చదువుతున్నావు?” అని అడిగాడు.
“ఇక మొదలుపెట్టాలి. ఈ సంవత్సరం ప్యాటర్న్ మార్చారట. నాకైతే అస్సలు ఛాన్స్ లేనట్టే అనిపిస్తుంది నాన్నా.”
“నాకు తెలిసిన ఒకాయన భారత్ కంపెనీలో పని చేస్తున్నారు. కొన్ని నోట్స్ లాంటివి ఇస్తానన్నారు.”
“అవునా!” అన్నాడు బాలాజీ. “పర్లేదు, ఆయన అడ్రస్ ఇవ్వండి నాన్నా. నేను వెళ్ళి కలిసి వస్తాను.”
“ఆయనే కలవడానికి వస్తాడు నన్ను.”
“ఏదైనా హింట్ దొరికి, అదృష్టం కలిసి వచ్చి పాస్ అయితే కావచ్చేమో గానీ, చాలా కష్టమైన పరీక్ష” అన్నాడు బాలాజీ.
“ఈసారి పాస్ అయిపోతావులే, బాలాజీ.”
“ఏం? మీరు అభిరామి అంతాది పఠనం రోజుకు రెండుసార్లు చెయ్యడం మొదలుపెట్టారు కదా, అందుకనా?”
“అమ్మతో నీకు గొడవేంటి? ఎదురు మాట్లాడావట?”
“అమ్మ నేను అన్నవే మీకు చెప్తుంది; కానీ తను నన్ను ఏమన్నదో చెప్తుందా? చెప్పదు. అమ్మ ఒక్కొక్కసారి నన్ను ఎలాంటి మాటలు అంటుందో తెలుసా? తిండిబోతునట. నాకు తిండి దండగట. ఆ మాటలు విన్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా?”
“అంటే మాత్రం? మీ అమ్మే కదరా.”
మహాలక్ష్మి అప్పుడే లోపలికి వస్తూ, “అదే చెప్పండి, గుర్తు చేయండి! వీడికి చిన్నప్పుడు జబ్బు చేసినప్పుడు నేను ఎంత కష్టపడ్డానో చెప్పండి!” అంది.
“అన్నింటికీ ఒక లిమిట్ ఉంటుంది కదా, నాన్నా. డబ్బులు ఇస్తున్నప్పుడల్లా నన్ను బిచ్చగాడిలా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎప్పుడూ రమేష్‌తో అడ్డమైన పోలికొకటి.”
“ఇకమీద వీడికి డబ్బులు ఇచ్చే పని నాకు అప్పగించొద్దు, చెప్పేస్తున్నాను” అంది మహాలక్ష్మి.
“చెప్పావులే!” అన్నాడు బాలాజీ.
“చూశారా? మీరు వింటున్నారన్న భయమే లేదు!”
“ఏం చేసేది? చెట్టల్లే ఎదిగిన కొడుకు మీద చెయ్యి చేసుకోమంటావా?” అన్నాడు రామచంద్రం.
“అదొక్కటే తక్కువ.”
‘అసలు వీడిని ఎందుకు కన్నామా?’ అన్నంత కోపం వచ్చింది రామచంద్రానికి. ఒక్కటి పీకుదాం అనుకున్న కోపం, విష్ణుమూర్తి రావడంవల్ల అణిగిపోయింది.
బాలాజీ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
“ఏంటి సార్, చూశారా? నమస్కారం అమ్మా” అంటూ ఆపిల్ పళ్ళ బుట్టను టేబుల్ మీద పెట్టాడు విష్ణుమూర్తి.
“కేస్ షీట్ చూశాను; ఒక సంవత్సరం విదేశాలకు వెళ్ళడంవల్ల డబ్బు కట్టలేకపోయాను అని అప్లికేషన్ మార్చి ఇవ్వండి. అలాట్మెంట్ను రీస్టోర్ చేస్తాను.”
ఇది వినగానే విష్ణుమూర్తి ముఖం కరెంట్ బల్బులా వెలిగిపోయింది.
“బ్రిల్లియంట్! వెరీ గుడ్! ఇక పని పూర్తయినట్టే.”
“అవును. మరి ఆ…”
“పరీక్ష పేపర్ కదా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను సార్,” అంటూ తన బ్యాగ్ లోంచి ఒక కవరు బయటికి తీశాడు.
“ఇది మీ వాడికిచ్చి, ఇలాంటివే పరీక్షలో వస్తాయని చెప్పండి. ఇంకేం చెప్పొద్దు.”
“అదేం ప్రాబ్లం లేదులెండి.”
అప్పుడే బాలాజీ వచ్చాడు. “బాలాజీ, నేను చెప్పాను కదా, భారత్ కంపెనీలో ఫ్రెండ్ అని, ఈయనే…”
“నమస్కారం సార్. మీ కంపెనీ పరీక్ష చాలా టఫ్‌గా ఉంటుంది.”
“ఏం చేస్తాం! పదివేలమందిని వడపోయాల్సుంటుంది మరి.”
“పరీక్ష గురించి కొన్ని నోట్స్ ఇస్తున్నారు ఈయన,” అన్నాడు రామచంద్రం.
బాలాజీ ఆ కవర్ ని చూశాడు.
“ఇలాంటి పేటర్న్ లో ఉండే ప్రశ్నలే వస్తాయి. ఇదొక మోడల్ పేపర్ లాంటిది…” అన్నాడు విష్ణుమూర్తి.
“అవునా! థాంక్స్ సార్. ఈసారి శ్రద్ధగా చదివి ప్రయత్నిస్తాను” అని కవర్ అందుకున్నాడు.
“సెలవు తీసుకుంటాను, సార్. గురువారం నాటికి అలాట్మెంట్ లెటర్ రెడీ అయిపోతుందా?” విష్ణుమూర్తి అడిగాడు.
“మధ్యాహ్నం రండి. అప్పుడు చైర్మన్ ఆఫీసులో ఉంటారు; సంతకం పెట్టించవచ్చు.”
“పని అయిపోతుంది కదా సార్?”
“అయిపోతుంది.”
“మీ పని కూడా అయిపోతుంది, మీరు లెటర్ ఇచ్చేది ఆ తర్వాతేగా,” నవ్వుకుంటూ వెళ్ళాడు.
ఆ బుధవారం బాలాజీ పరీక్ష. విష్ణుమూర్తి ఇచ్చిన ప్రశ్నలతో పాటు సబ్జెక్ట్స్ మొత్తం చదువుతున్నట్టు, విష్ణుమూర్తి ఇచ్చిన ప్రశ్నలకు అందులోనే జవాబులు కూడా ఉన్నాయన్నట్టు చెప్పాడు బాలాజీ. రామచంద్రం పెద్దగా పట్టించుకోలేదు.
“దాన్ని పూర్తిగా చదువుకున్నావు కదా?”
“చదివాను నాన్నా. ఇలాంటి పేటర్న్లోనే వస్తే రాయగలను అనిపిస్తోంది. చూద్దాం” అన్నాడు. రామచంద్రానికి మనసులో చాలా సంతోషంగా ఉంది. ‘కొడుకు పాస్ అయిపోతాడు… ఉద్యోగం వచ్చేస్తుంది; ఆ తర్వాత హిందూ మ్యాట్రిమోనియల్లో యాడ్ ఇవ్వచ్చు!’.
Non-Bharadwaja Match for handsome boy, age 27, employed in premier Public…
బుధవారం ఆఫీస్‌కి వెళ్ళడంవల్ల సాయంత్రందాకా కొడుకు పరీక్ష విషయం కనుక్కోలేకపోయాడు. సాయంత్రం ఇంటికి రాగానే “బాలాజీ వచ్చాడా?” అని భార్యను అడిగాడు.
“వచ్చాడు; పైన పడుకున్నాడు.”
“పరీక్ష ఎలా రాశాడట?”
“వాణ్ణే అడగండి; పరీక్షకు ఇలా వెళ్ళి అలా వచ్చేశాడు. ఎలా రాశావురా అని అడిగితే, ‘నీ పని నువ్వు చూసుకో పో’ అన్నాడు.”
‘జవాబులన్నీ తెలిసినవే కాబట్టి తొందరగా రాసేసి వచ్చేడేమోలే… పిచ్చిదానా,’ అని మనసులో నవ్వుకున్నాడు రామచంద్రం.
సాయంత్రం ఆరు గంటలకు, పగటి నిద్ర వల్ల ఉబ్బిన బుగ్గలతో కిందకు వచ్చాడు బాలాజీ.
“ఏంటి బాలాజీ, ఎలా ఉంది పేపర్?” అడిగాడు రామచంద్రం.
తండ్రికి ఎదురుగా వచ్చి కూర్చుని, “నాన్నా, అదో పెద్ద సర్ప్రైజ్. అది మోడల్ పేపర్ కాదు. ఒరిజినల్ పేపరే. ఆ రోజు ఆయన తెచ్చిచ్చిందే. ఒక్క ప్రశ్న కూడా మారకుండా, వంద ప్రశ్నలూ ఏజ్ ఇటీజ్‌గా వచ్చాయి.”
“అవునా!? దట్స్ లక్కీ! మరి రాసేశావుగా? అంత త్వరగా వచ్చేసింది అందుకేగా?”
“లేదు నాన్నా, రాయకుండానే వచ్చేసాను.”
రామచంద్రం “ఏంటీ?!” అన్నాడు దిగ్భ్రాంతి చెంది.
“అవును, ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చేసాను.”
“అదేం మాటరా పిచ్చోడా! ఎందుకూ?!”
“నాకెందుకో ఇది న్యాయం కాదనిపించింది నాన్నా. పదివేలమంది ఈ పరీక్ష రాస్తున్నారు. ఎంతో కష్టపడి, నిజాయితీగా చదువుకుని మరీ వచ్చి రాస్తున్నారు. నేను మాత్రం దొంగిలించుకొచ్చిన, లీక్ అయిన పేపర్ చదువుకుని రాయడం… ఇట్స్ నాట్ ఫెయిర్. నాన్నా, ఆ రోజు మీరు ఆ మనిషితో మాట్లాడుతున్నది విన్నప్పుడు, మీరా ముసలాడికేదో పని చేసిపెట్టినందుకు లంచంలాగా ఈ పేపర్ ఇచ్చాడని నాకు అర్థమైంది. నాకు ఇది నచ్చలేదు నాన్నా!”
“ఏం నచ్చలేదురా?!”
“నాన్నా, మీరు ఎంత స్వచ్ఛమైనవారో, నిజాయితీపరులో నాకు తెలుసు. మీరు మీ స్వచ్ఛమైన చేతుల్ని నా కోసం కలుషితం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇలాంటి పరీక్షలన్నీ నా స్వయంకృషితో పాస్ అవ్వాలనుకుంటున్నాను. ఇక మీ మీద ఆధారపడింది చాలు నాకు!”
మహాలక్ష్మి కుప్పకూలినట్టు, బుగ్గ మీద చేయి పెట్టుకుని నేల మీద కూర్చుండిపోయింది. “ఎంత పిచ్చివాడిని కన్నాం! వాడి వీపు మీద బాదండి. మీ కోపం తీరేలా గట్టిగా నాలుగు తగిలించండి,” అంది ఏడుస్తూ.
మెల్లగా కొడుకును సమీపించాడు రామచంద్రం. అతన్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు.
