పాట-మాట – 2: చెమటబిందువులోని సుడిగుండాలను చూపినకవి వంగపండు

వ్యక్తిని నడిపించేది అతడి ఆలోచన. ఆ ఆలోచనకు ప్రేరణ సమాజం. సమాజం ఒకటే అయినా ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. ఎందుచేత? అంటే ఆయా వ్యక్తులు చూసే దృష్టి కోణాన్నిబట్టి అని చెప్పాల్సి ఉంటుంది. ఒకే సమాజంలో ఉన్న వ్యక్తులలో భిన్న దృష్టి కోణాలకు కారణం? ఆయా వ్యక్తులలో అంతర్గతంగా ఉన్న భావజాలమే కారణం అని తెలుస్తుంది. తనలోపలి భావజాలమే ఆ వ్యక్తియొక్క ఆలోచనలను, ప్రవర్తనను నిర్దేశిస్తుందని అర్థమవుతుంది. కొంతమంది అంటారు, మరి ఏ భావజాలమూ లేని వారి మాటేమిటి? నిజానికి అటువంటి వ్యక్తులు అనగా ఏ భావజాలమూ లేని వ్యక్తులంటూ ఎవరూ ఉండరు. ప్రతి వ్యక్తి తనకు తెలిసిగాని, తెలియక గాని ఏదో ఒక భావజాలాన్ని కలిగే ఉంటాడు. దానికి లోబడే ఉంటాడు. తాను పుట్టి పెరిగిన వాతావరణం వలనగానీ, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, స్నేహితుల ప్రభావాల వలన గానీ, తాను చదువుకున్న చదువు వలనగానీ.. ఇలా ఎవరో ఒకరి వలన, ఏదో ఒక కారణంచేత, కొన్ని ప్రభావాలకు గురికావడం జరుగుతుంది. వాటి వలన తనలో ఒక భావజాలం ఏర్పడుతుంది.

వంగపండు పాత శ్రీకాకులం జిల్లాలోని పెదబొడపల్లి గ్రామంలో పుట్టి పెరిగాడు. ఐ.టి.ఐ. లో ఫిట్టర్ ట్రేడులో శిక్షణ పొంది, ఆపై బతుకు పోరాటంలో విశాఖపట్నం చేరి అక్కడ పారిశ్రామిక ప్రాంతంలో ఒక కార్మికుడిగా జీవన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఒక కార్మిక నాయకుడి తోడ్పాటుతో దినసరి వేతన కార్మికునిగా హిందూస్థాన్ షిప్‌యార్డులో చేరి పనిచేశాడు. అక్కడ ఆ కార్మికనాయకుని ఆలోచనలచేత ప్రభావితమయ్యాడు. అతనితో ఉన్న సాన్నిహిత్యము వలన అతని భావజాల ప్రభావంతో వంగపండులో వామపక్ష భావాలు ఏర్పడ్డాయి. ఆపైన విశాఖపట్నంలోని వామపక్ష భావాలు కలిగిన రావిశాస్త్రిగారు, కాళీపట్నం రామారావుగారు వంటి కొంతమంది రచయితల, మేధావుల పరిచయాలు అతన్ని నిర్దిష్టంగా ప్రజాపక్షం వహించేలా నిలబెట్టాయి.

కార్మికుల సమస్యలు/హక్కులు గురించిన పాటలు

వంగపండు తనచుట్టూ ఉన్న కార్మిక సమూహాలను పరిశీలించటం మూలంగా సరికొత్త ఆలోచనలు చేయగలిగాడు. పారిశ్రామిక ప్రాంతంలో ఉండడం వలన, కార్మికుల శ్రమను, కుటుంబాలలోని దీనస్థితులను గమనించాడు. దాంతో ఆ ప్రాంతపు కార్మికుల జీవితాలపై ఒక అవగాహన ఏర్పడింది. కార్మిక, శ్రామిక గీతాలు రాయగలిగాడు.

ఇక్కడొక ప్రశ్న వస్తుంది. అసలు పారిశ్రామిక కార్మికులంటే ఎవరు? అని. ఎవరైతే భారీ పరిశ్రమలు, కర్మాగారాలలో పనిచేస్తూ పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తారో వారే పారిశ్రామిక కార్మికులుగా చెప్పబడతారు.

తెలుగు సాహిత్యంలో వ్యవసాయ కార్మికులు, రైతు, రైతుకూలీల పై విస్తృతంగా సాహిత్యం వెలువడింది. కానీ పారిశ్రామిక రంగాలలో పనిచేసే కార్మిక జీవితాలపై వచ్చిన సాహిత్యానికి చాలా తక్కువ పేజీలే ఉన్నాయి. 80వ దశాబ్దం తర్వాత స్త్రీవాద, దళితవాద సాహిత్య ఉద్యమాలతో ఆయా సాహిత్యాలు బలంగా వచ్చాయి. ఆపైన వివిధ కులవృత్తుల శ్రమను వివరిస్తూ బహుజన జీవితాలపై బహుజన సాహిత్యం కూడా విస్తృతంగానే వచ్చింది. కానీ ఇప్పటికీ పారిశ్రామిక కార్మికుల జీవితాలపై తెలుగులో వచ్చిన సాహిత్యం చాలా తక్కువనే చెప్పుకోవాలి. వంగపండు మాత్రం తన తొలి రోజుల నుంచే, అనగా 80వ దశాబ్దానికి పూర్వమే, తన రచనల ద్వారా కార్మిక సాహిత్యానికి ఒక స్థానం కల్పించాడు.

నిజానికి కార్మికులపై మొదటిగా దృష్టిసారించి కార్మికుడిని సాహిత్యములోకి తీసుకువచ్చినది మహాకవి శ్రీశ్రీ. తన మహాప్రస్థానములోని ప్రతిజ్ఞ గేయములో,

“గనిలో
వనిలో
కార్ఖానాలో
పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ
ధనికస్వామికి దాస్యం చేసే
యంత్రభూతముల కోరలుతోమే
కార్మికవీరుల కన్నులనిండా
కణకణ మండే
గలగల తొణికే విలాపాగ్నులకు
విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబులేడోయ్”

అన్నాడు. అప్పుడే శ్రీశ్రీ కార్మికుల జీవితాల్లోని విలాపాగ్నులు, విషాదాశ్రువులు వారిని దహించివేయడం చూశాడు. ఎందుకని విషాదమంటే ధనికస్వాముల దాస్యముచేయక తప్పనిస్థితి, వారి శ్రమకు సరైన ఖరీదు లేకపోవటం కారణాలుగా చెప్పాడు. తరువాత కాలములో కవి చెరబండరాజు తన “కొండలు పగలేసినాం” పాటలో:

“యంత్రాలను తిప్పినాం
ఉత్పత్తులు పెంచినాం
మా శక్తే విద్యుత్తుగా
ఫ్యాక్టరీలు నడిపినాం
మేడెవడిదిరో
గుడిసెవడిదిరో”

అని కార్మికుల శ్రమ, దోపిడీకి గురై తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని వారు పొందలేకపోవటాన్ని ప్రశ్నించాడు. శ్రీశ్రీది సానుభూతి, చెరబండరాజు దగ్గరకొచ్చేసరికి అది ప్రశ్నరూపం సంతరించుకుంది.

వీరి తరువాత మళ్లీ కార్మికులపై కవిత్వం/పాట రాసినవారిలో వంగపండే కనిపిస్తాడు. వంగపండు రాసిన పాటలలో కార్మికుల జీవితాలను నిశితంగా పరిశీలించి ప్రతి విషయాన్ని విపులంగా అక్షరబద్ధం చేసాడు. వారి జీవితాలు మారాలంటే ఏమి చేయాలో చెబుతూ పాటలను వినిపించాడు. అంటే చెరబండరాజు ప్రశ్నను మరికొంచెం ముందుకు తీసుకెళ్లి ఆచరణరూపం చెప్పినవాడు వంగపండు. సంఘ నిర్మాణం గురించి చెబుతాడు. యంత్రము తయారు చేయటం దగ్గరనుంచి, యంత్రాన్ని నడపడం, అలా నడిపే వారి జీవితాలలోని బాధలను ఎత్తి చూపడం, సంఘ నిర్మాణ ఆవశ్యకతను చెప్పడం మొత్తం ఒక క్రమం కనపడుతుంది తనలో.

ఉదాహరణకు “యంత్రమెట్టా నడుస్త ఉందంటే” పాటలో కర్మాగారాలలోని యంత్రాలెలా తయారవుతాయో, తయారయిన యంత్రాలు ఎలా పనిచేస్తాయో, అవి పని చేయడానికి కార్మికులు ఎంతలా కష్టపడతారో, తమ చెమటే ఇంధనంగా మారి యంత్రమెలా తిరుగుతుందో విపులంగా కళ్ల ముందు దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ అద్భుతంగా చెప్పాడు.

“యంత్రమెట్టా నడుత్తు వుందంటే
ఓరన్నో.. లమ్మీ..
లారీ.. బస్సూ.. మిల్లూ.. మిషనూ..
మోటారు సైకిలు..”

అని మొదలుపెట్టి, ముందుగా ఆ యంత్రాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పాడు.

“కూడు లేనిరా-మన కూలోలల్లా
ఆల కండబలముతో-ఆలు కొండలెక్కిరా
ఆకొండలమీదా-బండలు గుద్దీ
రాళ్ళ ఇరుకునా-సేతులుబెట్టీ
బాంబులు పెట్టీ-అవి బద్దలు కొట్టీ
వంటతాయిలో- ఆముక్కలు బెట్టీ
మంటలు బెట్టి-మరిగించి నాయానా
కరిగించి నాయనా-కాల్చేసినాయినా
మన్నూగిన్నూ-ఇనుముని జేసి
ఆ ఇనుప దుక్కలే-బండి ఇరుసులు జేసే.”

మట్టిలోనున్న ముడిలోహాలను తెచ్చిన దగ్గరనుంచి యంత్రాన్ని చేసే క్రమాన్ని చెప్పాడు. అంతేనా ఇంకా ఇలా చెప్పాడు:

“ఆకలేసినా అన్నలందరూ
ఏలుకోసినా ఇనుపరేకులూ
గూలు పీకినా-గుండెలారినా
కత్తెర బట్టీ కత్తిరించిరా
సుత్తులు బట్టి కొట్టి కొట్టిరా
సాగదీసిరా సానబట్టినా
సాపు జేసినా రేకులమీదా
ఆల రక్తమంతరా రంగురాసిరా
ఆ కారు మీదరా సోకు కప్పజేసెరా”

అన్నాడు. ఇక్కడ ఒక యంత్రాన్ని తయారు చేయడానికి కార్మికులు ఎన్ని విధాలుగా శ్రమ చేయాల్సివుంటుందో చెప్పాడు. గమనించాల్సిన మరో విషయం ప్రజల భాషలో చెప్పటం. ప్రజల భాషలో చెప్పటమంటే ఎలా? అంటే చెరబండరాజు పాటల పుస్తకానికి ముందుమాట రాస్తూ చేకూరి రామారావు గారు ప్రజల పాటలు ఎలావుండాలో చెబుతూ ఇలా అన్నారు:

“ప్రజలకు చేరువగా వెళ్ళాలంటే కవిత్వం ప్రజల భాషలోనే ఉండాలని అందరూ అంగీకరిస్తారు. ప్రజల భాషలో రాయటమంటే కేవలం తేలిక మాటలతో రాయటం మాత్రమే కాదు. సామాన్య ప్రజల బ్రతుకును, ఆలోచనా సరళిని, భావనా రీతిని ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేసినపుడే అది సాధ్యమవుతుంది. ప్రజల భాషలో ఉండే పదాలు, నుడికారాలు, వారికి పరిచయమైన భావచిత్రాలు వాడినపుడే అది ప్రజాకవిత్వమవుతుంది.”

ఈ దృష్టి వంగపండులో ఉంది. సాంకేతికపరమైన పదాలను అవసరమైనప్పుడు ప్రజల భాషలోకి మార్చి చెప్పాడు. బ్లాస్ట్ ఫర్నేసును వంటరాయిగా చెప్పడం అందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే అందంగా తయారు చేయడాన్ని ‘సోకు’ చేయడం అంటారు. ఉన్న అందము కంటే ఇంకా మెరుగ్గా చేయడాన్ని, ఉన్నదాని కంటే దానికి ‘అప్ప’గా తయారు చేశాను అనడం జనంలో ఉన్న నానుడి. ఆ నానుడిని ఉపయోగించి సోకుకు అప్పను చేశారు అంటాడు. అంటే చాలా అందంగా తయారు చేశారు అని అర్థం. ఇలా తన సాహిత్యమంతా ప్రజల భాషలో వారికి సులువుగా అర్థమయ్యే విధంగా రాయటమే కాక, రాసిన ప్రతి చరణమూ కవితాత్మకంగా రాసి గొప్ప స్ఫూర్తిని కలిగించాడు.

మరొక పాట – “ఓడ” పాటను చూద్దాం. కవి వంగపండు విశాఖపట్నంలోని షిప్‌యార్డు కంపెనీలో పనిచేశాడు. అక్కడ రకరకాల ఓడ (షిప్పు) లను తయారు చేస్తారు. ఒక ఓడను తయారు చేయడానికి నెలలు, సంవత్సరాలు కూడా పడతాయి. అతి ఎక్కువ కాలం పనిచేసి తయారుచేసిన కార్మికులకు అవి పూర్తయ్యేసరికి ఆ ఓడలపై కొంత మమకారం ఏర్పడుతుంది. చివరగా ఆ ఓడ యార్డును వదిలి వెళ్లిపోతుంటే వారు బాధపడుతుంటారు. చిన్ననాటి నుంచి పెంచి పెద్దచేసిన అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తూ తల్లిదండ్రులు పడే బాధ లాంటిదే వారి బాధ కూడా. ఆ బాధను పాటగా మలిచాడు కవి:

“ఓడా నువ్వెళ్లిపోకే
మా కండలన్నీ పిండిచేసి
నీటిలోన కోటలాగ ఎముకలోంచి కట్టినాము..”

అంటూ ఓడను వెళ్లవద్దని వేడుకుంటాడు. బాధపడతాడు, ఆ బాధలో ఆ ఓడను తయారుచేసినప్పటి జ్ఞాపకాలను తలపోస్తాడు. ఆ తలపోతలో ఎవరెవరు ఏయే పనులు చేశారో, ఎంతగా శ్రమించి దానిని తయారుచేశారో చెబుతాడు.

“వెల్డింగూ వెంకట్రావు హైలేసా
ఎకాఎకీ ఎల్లాడు
కరెంటుపుల్ల తీశాడు
కరెంటులోన ముంచాడు
ఆకాసం అంతేసి ఇనపరేకులే ఏసి
అవి తీసినట్టు కాసినట్టు టాకాలే ఏశాడు
తన ఒళ్ళు మీది చర్మాన్ని తోలు గ్లౌసు చేసాడు”

అని వెల్డింగు చేసే కార్మికుని శ్రమను గురించి చెప్పాడు. మరొక చరణములో గేసు కట్టర్ సూరిబాబు కట్టరుతో ఎలా కటింగ్ చేశాడో చెబుతాడు.

“గేసు నిండి వుండినా
సిలిండ్రలను తీశాడు
హోసుపైపులేశాడు
కటింగు కట్రు పట్టాడు
తన అగ్గిలైటు తీశాడు
భగ్గుమనే అగ్గినీ
మంటలు రాజేశాడు
ఇటుపక్కకు తిరిగాడు
ఇనుపముక్కకోశాడు
నువు మారు మాటాడకుండ
యారాడ కొండదాటి
ఏడకో పోతుంటే
ఏడిసి కూకున్నాడు”

అంటూ మానవీయ కోణాన్ని చూపెడతాడు. మనిషి సహజంగా తనతోటి మనుషులపైనే కాదు, తను ఎక్కువకాలం తిరిగిన ప్రదేశాలతోటి, పెంచిన పెంపుడు జంతువులతోటి, తాను వాడిన వస్తువులతోటి ఒక అనుబంధాన్ని, ప్రేమను ఏర్పరుచుకుంటాడు. అవి తమకు దూరమైతే చాలా బాధపడతాడు. అటువంటిది తాము తయారు చేసిన తమ సృష్టి అయిన ఓడ వెళ్లిపోతుంటే ఆ కార్మికుడు బాధపడడం, వ్యధ చెందడం అత్యంత సహజము కదా! ఆ వ్యధను, బాధను పాఠకుల్లో / శ్రోతల్లో కలిగించాడు వంగపండు.

అంతగా శ్రమపడ్డా కార్మికుల జీవితాలేమైనా బాగున్నాయా? అవి అర్ధాకలి బతుకులు. తనకు తెలియనిదేముంది? తను ఆ జీవితాన్నే అనుభవిస్తున్నాడు కనుక వారి జీవితాల్లోని ఆటుపోట్లను గమనించి చెప్పాడు.

“యంత్రాలోడా కూలి జీతగాడా
మరలు దిప్పి మండిపోయినోడా…”

అంటూ మొదలైన ఈ పాటలో,

కడుపాకలికి నీవు కంపెనీలొ పనికెల్తే
కంపెని యజమానులు అమ్ముకోని నీరక్తం
తేరగ దొరికావని తారులాగ జూస్తర్రో

నెలల్లా పనిచేసి నెక్కలేసినజీతం
గోసికి పొడుగురా గుండారకు పొట్టిరా
ఈదిల సోకులురా ఇంటిలోన ఆకలిరా.”

నెలల్లా పనిచేయగా వచ్చిన జీతం నెలకు ఎటూ చాలదు. కానీ కంపెనీ ఉద్యోగిగా సంఘములో గౌరవాన్ని పొందాలని తాపత్రయపడతాడు. వీధిలో ఉన్నపుడు కాస్తా శుభ్రంగా కనపడాలని తన పేదరికాన్ని కప్పిపెట్టుకోజూస్తాడు. ఆ విధంగా కనీస అవసరాలు కూడా తీరక సంఘర్షణకు లోనవుతాడు. ఓటీలు చేస్తాడు.

“ఓటీలు చేసి నువ్వు
ఒళ్లు మండబెడతావు
అంతబతుకంతావు
అద్దింటిలో వుంతావు
ఇంత బతుకంతావు
ఈదిల తొంగుంతావు
బియ్యాని కొంతావు
బీడీ అప్పంతవురో..”

ఇలా ఆ జీవితాలలోని కష్టాలను కవిత్వీకరించి వారి జీవితాలను అద్దములో వారికే చూపెడతాడు. వీటన్నింటికి కారణం శ్రమకు తగ్గ ఫలితం లేకపోవటమే అని తాను గ్రహించి, తనవారికి చెబుతాడు. అందరు ఒకటై సంఘాన్ని నిర్మించుకొని సంఘటితంగా హక్కులు సాధించుకోవచ్చంటాడు.

ఈ సమాజము వర్గసమాజమని, అది రెండు వర్గాలుగా ఉందని, అవి ఒకటి శ్రామిక వర్గం రెండవది పెట్టుబడిదారుల ధనిక వర్గమని చెబుతూ, వారిలో నమ్మకాన్ని కలిగించే విధంగా రెండు వర్గాల జీవితాలు ఎలా ఉన్నాయో “సంఘ నిర్మాణం” అన్న ఈ పాటలో చూపిస్తాడు. శ్రామిక వర్గం సంపద సృష్టించకపోతే పెట్టుబడిదారీ వర్గం జీవించలేదని చెబుతాడు.

“రండిరో రండిరో
రండిరో కూలన్నా
సంఘం పెడదాము ఆల
సంగతేందో చూద్దాము

నువు బురదకుమ్మకుండా
అలు బువ్వబుక్కలేరు
నువు తారు పొయ్యకుండా
ఆలు కారు నడపలేరు
నువు తలుపు సెయ్యకుండా
తాలాలు తిప్పలేరు
[…]
పండించి నువ్వు పెడితే
దండించి బతుకు తున్రు
ఆ బతుకులు పెట్టిన మనమూ
బతకాలిక లెండిరో…”.

అని చెప్పి పంటలు పండించిన మనకు, తిండి లేకుండా చేస్తున్న ఆ భూస్వాముల దోపిడీని, సకల సంపదలు సృష్టించే మనకు అవి అందుబాటులోకి రాకుండా చేస్తున్న బూర్జువాల దోపిడీని ఎదిరించాలంటే కర్షక కార్మికులంతా ఒక్కటయ్యి సంఘటితంగా పోరాడాలని, దానికై సంఘాలని నిర్మించుకోవాలని సంఘ నిర్మాణ ఆవశ్యకతను చెబుతాడు.

మన సంఘానికి అండగా ఎర్రజెండా ఉందని, అది పీడిత ప్రజలకు అండగా ఉంటుందని చెబుతూ..

“సుత్తీ కొడవలి గురుతుగ వున్న
ఎర్రని జెండా ఎగురుతున్నది
ఆకాశములో అరుణబింబమై
పీడిత జనానికండదండగా
[…]
అభాగ్య జీవుల
భాగ్య యుగానికి
పిలుస్తోందిరన్నా
జెండా నిలుస్తోందిరన్నా.”

అని ధైర్యాన్నిస్తాడు. ఇలా పారిశ్రామిక కార్మికులలో చైతన్యాన్ని, ఆలోచనను పెంచే గొప్ప సాహిత్యాన్ని సృష్టించాడు వంగపండు.

(ఇంకా ఉంది)