చాలా ఏళ్ళుగా తిరువేంగడం వీధిలో బాగా నెమ్మదిగా నడుస్తున్నాడు. నేల ఎక్కడ జారిపోతుందోనన్న భయం ఉన్నవాడిలా అడుగులు గట్టిగా అదిమి పెట్టి నడుస్తాడు. అప్పుడప్పుడు నేలను తట్టి తట్టి చూడటం కూడా కద్దు. భూమినుండి ఏమి ఆశిస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ నిరాశ చెందినవాడిలా అప్పుడప్పుడు నిట్టూరుస్తుంటాడు. నగరం ఎప్పటిలాగే తన హడావిడిలో, అతివేగంతో దూసుకుపోతూనే ఉంది. ఆ నగరపు రోడ్లు ఏ మార్పుకీ నోచుకోకుండా ఏటా పేరుకుపోతున్న మురికితో, ఉమ్మి మరకలతో నిండి ఉన్నాయి.
తలవంచుకుని నడిచేవాళ్ళ కళ్ళకు రోడ్లు వేరేలా కనిపిస్తాయేమో. తిరువేంగడం తన కూతురి ఇంట్లో నివసిస్తుంటాడు. ఆఱేడేళ్ళుగా అదే దార్లో నడుస్తున్నాడు. ఇంటినుండి బయలుదేరితే హిందీ ప్రచార్ సభ వైపు వెళ్ళే దారి. దారి చివర్లో పాండీబజార్ పూల దుకాణాలు. అక్కడినుండి ఉత్తరం వైపుకు నడిచి జి.ఎన్.శెట్టి రోడ్డు మీదుగా హబీబుల్లా రోడ్డులో, తను పని చేసే టైర్ కంపెనీకి చేరుకుంటాడు.
సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం జి.ఎన్.శెట్టి రోడ్డులో ఉన్న పార్కులో అరగంటసేపు కూర్చుంటాడు. అది కూడా రోజూ అదే బెంచీ మీద. అది పబ్లిక్ పార్క్ అయినప్పటికీ, అక్కడి ప్రతి బెంచీకి నిర్ణీతమైన అతిథులు ఉంటారు. ఎంతోకాలంగా అలవాటు అయిపోయినందువల్ల పార్కులో ఆకులు కదలని చెట్లు కూడా ప్లాస్టిక్‌తో చేసినవేమో అన్న సందేహం కలుగుతోంది. ఆ చెట్లు ఎప్పుడు ఆకులు రాలుస్తాయో, ఎప్పుడు పూస్తాయో అస్సలు తెలియదు. దుమ్ము పేరుకుపోయిన ఆకులు, వాహనాల పొగతో మసి కమ్మేసిన చిన్న మొక్కలు ఆ పార్కు సహజత్వాన్ని కొంచెం కొంచెంగా చెరిపేస్తున్నాయి.
తిరువేంగడం వయస్సు యాభై అయిదేళ్ళు. కొన్నేళ్ళుగా తన స్నేహితుడి కార్ టైర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను జీవితంలో మరచిపోలేని సంఘటనలు రెండున్నాయి. ఆ సంఘటనల కొనసాగింపులేంటని కనుక్కోడానికే నేటికీ ఇలా నడుస్తూనే ఉన్నాడు.
తిరువేంగడానికి జీవితం గురించిన కలలు ఎప్పుడూ లేవు. కయత్తాఱులో ఉన్న మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లో కొన్నిసార్లు తనూ ఏమవుతానోన్న చిన్న కల ఉండేది. అలాంటి సమయాల్లో కూడా తనను తాను ఒక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఊహించుకోవడానికి మించి ఏమీ ఆలోచించలేదతను.
స్కూల్ చదువు పూర్తవగానే తిరువేంగడాన్ని, వాళ్ళ మామ తన బట్టల దుకాణంలో పనిలో చేర్చుకున్నాడు. అప్పుడే అతనికి వీధిని వేడుకగా చూసే అలవాటు మొదలైంది. బస్టాండ్‌కు దగ్గరగా ఉన్న చిన్న బట్టల దుకాణం కావడంతో మధ్యాహ్నం వేళల్లో ఎవరూ వచ్చేవాళ్ళు కారు. మామ కూడా కునుకుతీయడానికి వెళ్ళిపోయేవాడు. తిరువేంగడం దుకాణం బెంచీకి ఆనుకుని కూర్చుని రోడ్డును చూస్తూ ఉండేవాడు.
రోడ్డు పక్కన కీరదోసకాయలు అమ్మేవాడు కూడా గంపను అక్కడే వదిలేసి చెట్టు కింద తువ్వాలు పరుచుకుని నిద్రపోతుండేవాడు. వీధిలో సుడిగాలి తిరిగినట్లు నెమ్మదిగా శూన్యం తిరగడం మొదలుపెట్టి కొంచెం కొంచెంగా విస్తరించి అతడ్ని కూడా చుట్టేసుకునేది. అలాంటి సమయాల్లో బల్ల మీదున్న నీళ్ళ చెంబు తీసుకుని తాగడం కూడా అలసట కలిగించే పనిగా అనిపించేది.
తిరువేంగడం అప్పట్లో ఒంటి పొర పంచె, చేతులు మడత పెట్టిన తెల్ల చొక్కా మాత్రమే వేసుకునేవాడు. ఇరవై ఏళ్ళకే అతనిలో ఉన్న ఆకర్షణ కొంచెం కొంచెంగా ఆవిరైపోసాగింది. పగటిని చూసి చూసి అలవాటైపోయి, మధ్యాహ్నం వేళల్లో తనను తాను పూర్తిగా శూన్యానికి అప్పగించేశాడా అన్నట్లుగా నిర్మానుష్యమైన రోడ్డుకేసి తదేకంగా కళ్ళప్పగించి చూస్తూ ఉండేవాడతను. అతనిలో చిన్న చలనం కూడా ఉండేది కాదు. కొన్నిసార్లు కాకులు రోడ్డును పొడుస్తూ తిరుగుతున్నా అతని ముఖంలో ఏ కదలికా ఉండేది కాదు.
పగటిపూట శూన్యం, సగం చీకటి, గాలి ఆడని ఉక్కపోతా ఇవన్నీ కలిసి వ్యాపారుల ముఖాల్లో ఎప్పటికీ చెరిగిపోని మచ్చలా పేరుకుపోతాయనడానికి అతనే సాక్ష్యంలా ఉన్నాడు. రోజులు గడిచేకొద్దీ అతని ప్రవర్తనలో అది ప్రతిబింబించసాగింది. ఇంటినుండి తెచ్చుకునే చెంబుడు నీళ్ళల్లో సగమైనా తాగేవాడు కాదు. ప్రతిరోజూ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మిగిలిన నీటిని మర్చిపోకుండా పట్టుకుని వెళ్ళిపోయేవాడు.
బట్టల కొనుగోలుకు వచ్చే ఆడవాళ్ళు కొందరు అతనికి అనుకోకుండా రాసుకున్నప్పుడు, లేదా అతని ముందే జాకెట్ హుక్కులు విప్పి బిడ్డలకు పాలిచ్చినప్పుడు కూడా అతనిలో ఎలాంటి చలనమూ ఉండేది కాదు. ఆడవాళ్ళు అతడ్ని ఎప్పుడూ స్థిరంగా ఉండే తక్కెడ రాళ్ళలాగే భావించేవాళ్ళు. అతను లేని సమయాల్లో మామ అతని ఈ గుణం గురించి మురిసిపోయి ఎన్నోసార్లు మెచ్చుకున్నాడని దుకాణం కుర్రాడు తిరువేంగడానికి చెప్పాడు.
ఈ గుణం కారణంగానేమో స్కూల్లో చదువుకుంటున్న తన కూతురు మనోన్మణిని తిరువేంగడానికి ఇచ్చి పెళ్ళి చేసి, ఆ దుకాణాన్ని పూర్తిగా అప్పగించేశాడు మామ. పెళ్ళిరోజున కూడా తిరువేంగడం ముఖంలో అలసట, విసుగు మాత్రమే ఉన్నాయి. అతను ఆ రోజు కూడా మధ్యాహ్నానికల్లా దుకాణం తెరిచాడని చాలామంది ఎగతాళి చేశారు, కానీ పెళ్ళి అయిపోయింది కదా, ఇంకో సగం రోజు అనవసరంగా ఖాళీగా ఎందుకు కూర్చోవాలి అనిపించింది తిరువేంగడానికి.
ఆ రాత్రి మనోన్మణిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం కూడా ఒక బాధ్యత అన్నట్లుగానే చేశాడు. కొత్త పెళ్ళాన్ని తీసుకుని మొదటిసారి మదురై మీనాక్షమ్మ ఆలయానికి వెళ్ళిరమ్మని మామ పంపినప్పుడు కూడా మదురై వీధుల్లోని చిల్లర వ్యాపారులను నిశితంగా చూస్తూ నడిచాడు. నిమ్మకాయలు అమ్మే వ్యక్తితో చాలాసేపు ఏదో అడుగుతూనే నిల్చున్నాడు. మనోన్మణికి భర్త ముఖం చూస్తుంటే భయం కలిగింది.
తెల్లవారినప్పటినుండీ మదురైలో తిరిగినప్పటికీ వాళ్ళు ఏ హోటల్లోనూ భోంచేయలేదు. కనీసం ఒక షర్బతైనా తాగలేదు. మనోన్మణికి కోపం వచ్చింది. ఆమె ఎండ తట్టుకోలేక బస్టాండ్‌లో తాటి ముంజలు అమ్మేవాడి దగ్గర రూపాయిచ్చి ముంజలు కొని తిన్నది. ఎండలో నురగలు కక్కుతున్న నీరా కుండను చూస్తూ ఉండిపోయాడు తిరువేంగడం. మూతకు తెల్లటి గుడ్డ కట్టి ఉన్న ఆ కుండపైన ఈగలు ముసురుతున్నాయి. మనోన్మణి ఇంటికి తిరిగి వచ్చి, ఆ రాత్రి చాలాసేపు ఏడ్చింది. కానీ తిరువేంగడం నిద్రపోయాడు. ఆ తర్వాత రెండు రోజులు ఆమె అతనితో మాట్లాడలేదు. కానీ ఆ విషయం అతను గమనించాడో లేదో కూడా ఆమెకు అర్థంకాలేదు.
కూతురు పుట్టినప్పుడు తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడటానికి బయలుదేరిన రోజు మాత్రం దుకాణం కట్టేసి వెళ్ళాడు తిరువేంగడం. ఆ రోజుకూడా ఉదయం దుకాణం తెరిచి మధ్యాహ్నం రెండుదాకా వ్యాపారం చూసి ఆ తర్వాతే వెళ్ళాడు. బస్సులో తిరునెల్వేలికి వెళ్ళి ఆసుపత్రిలో బిడ్డను చూసినప్పుడు, అప్పుడే బిడ్డకు స్నానం చేయించి ఒడిలో వేసుకుని తడి తుడుస్తోంది అతని అత్తగారు. బిడ్డ కళ్ళు స్పటికంలా మెఱుస్తున్నాయి. పుట్టిన బిడ్డ వాసన అంటూ ఒకటి ఉంటుందని అతను అప్పుడే గ్రహించాడు.
‘ఆయన బిడ్డను కాసేపు ప్రేమగా ఎత్తుకుంటాడు, చూస్తాడు’ అనుకుంది మనోన్మణి. కానీ బిడ్డను చేతిలోకి ఇచ్చినప్పుడు రెండు నిమిషాలు మౌనంగా చూసి తిరిగి అత్తగారి చేతుల్లో పెట్టేశాడు. మనోన్మణి దానికి కూడా ఏడ్చింది. ఆ తర్వాత అరగంటసేపు ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న చెట్టు కింద నిల్చుని గడిపాడు తిరువేంగడం. కాఫీ తాగే సమయానికి అతని కోసం చూసినప్పుడు ఊరికి వెళ్ళిపోయాడని చెప్పిన మనోన్మణి తండ్రి, ‘వాడు అంతే. అలానే ఉంటాడు, వదిలేయ్’ అన్నాడు.
పదిహేను రోజుల తర్వాత ఒక రాత్రి బిడ్డ విపరీతంగా ఏడవటం మొదలుపెట్టింది. నిద్రపోతున్న తిరువేంగడం విసుక్కుంటూ ఆమెతో, ‘పిల్ల ఏడుపుని ఆపలేవా?’ అని గట్టిగా అరిచాడు. ఆమె, ‘పాలు తాగితే వాంతి చేసుకుంటోంది. నేనేం చేయను’ అంది. అతను చిరాకుతో పక్కకు తిరిగి పడుకున్నాడు. ఏడుపు శబ్దం వినపడుతూనే ఉంది. అతను కోపంతో పక్కన ఉన్న బిడ్డ గిలకను తీసి విసిరాడు.
మనోన్మణి బిడ్డను ఎత్తుకుని వంటగదిలోకి వెళ్ళింది. మనోన్మణి, వాళ్ళ అమ్మ ఇద్దరూ బిడ్డను సముదాయించడానికి ప్రయత్నిస్తున్న శబ్దం వినబడింది. కానీ ఏడుపు ఆగలేదు. మనోన్మణి తండ్రి పక్కింట్లో వసకొమ్ము తేవడానికి తలుపు తీసుకుని బయటకు వెళ్ళాడు. ఇంతలో మనోన్మణి తల్లి రోటిబండ మీద ఏదో నూరుతున్న శబ్దం వస్తోంది. చీకట్లో మనోన్మణి గట్టిగా అరవడం వినిపించింది.
అప్పుడు అతను లేచి వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి బిడ్డ మెడ వాలిపోయి ఉంది. మనోన్మణి, ఆమె తల్లి బిడ్డను ఒడిలో పెట్టుకుని ఏడుస్తున్నారు. అతను ఇత్తడి బిందెను ఆనుకుని ఆ బిడ్డను చూస్తూ నిలబడ్డాడు. బిడ్డ కాళ్ళలో, చేతుల్లో కదలికలు లేవు. మనోన్మణి తలా గుండెలూ బాదుకుంటూ ఏడుస్తోంది. తల్లి ఆమె దగ్గరనుండి బిడ్డను తీసుకుని ఛాతీ మీద నిమురుతూ, నోటిలో ఊదుతూ ఉంది. గాలికి బిడ్డ తల వెంట్రుకలు మాత్రమే కదులుతున్నాయి.
తెరిచి వున్న తలుపును తోసుకుంటూ ఎవరో లోపలికి రావడం కనిపించింది. పక్కింట్లో ఉండే ముత్తుస్వామి భార్య, ‘ఏంటక్కా.. ఏమైంది…’ అంటూ లోపలికి వచ్చిన మరుక్షణమే బిడ్డను చూసి విలవిలలాడుతూ ఏడవటం మొదలుపెట్టింది. “అయ్యో.. దేవుడా.. ఎంత పని జరిగిపోయిందక్కా” అన్న ఏడుపు కేకలు వినబడుతున్నాయి. అతను ఆ బిడ్డను తాకనైనా లేదు. భయంతో, వణుకుతో గోడకు ఆనుకుని నిలబడిపోయాడు. బయటకు వెళ్ళిపోవాలా లేక అక్కడే నిలబడాలా అని కూడా తోచని అయోమయంలో ఉన్నాడు.
ఇంతలో మనోన్మణి తండ్రి వసకొమ్ము తీసుకుని వచ్చాడు, ఏడుపులు వినగానే తల బాదుకుంటూ తానూ ఏడవడం మొదలుపెట్టాడు. తిరువేంగడం చీకట్లోనే నిలబడి ఉన్నాడు. ఏడుపు, వేదనతో వచ్చి తిరువేంగడంను పట్టుకుని “పిల్లని అన్యాయంగా చంపేశావు కదరా…” అని అరుస్తూ విచక్షణారహితంగా కొట్టాడు మామ. తిరువేంగడం అతన్ని అడ్డుకోలేదు. తెల్లవారేవరకు ఇంట్లో ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ చీకట్లోనే నడిచి తన బట్టల దుకాణానికి చేరుకున్నాడు తిరువేంగడం. మూసి ఉన్న దుకాణం ముందు కూర్చుని చీకట్లో మెలికలు తిరుగుతున్న రోడ్డును చూస్తూ ఉండిపోయాడు.
తెల్లారాక బిడ్డను ఒక ఉయ్యాల కట్టి తీసుకువెళ్ళి పూడ్చి వచ్చారు. ఆ రోజు అతను దుకాణం తెరవలేదు. ఇది జరిగి పది రోజులవుతున్నా మనోన్మణి వంటగదిలో నేల మీదే పడుకుని ఉంది. ఆమె ముఖం వడిలిపోయింది. రొమ్ముల్లో పాలు గడ్డకట్టాయని పగటిపూట ఆమె తల్లి ఆమెను తీసుకుని ఇంటి వెనుక సందులోకి తీసుకువెళ్ళేది. రొమ్ముల్ని పిండి పాలను గోడకు చిమ్మినప్పుడు నొప్పికంటే, ఆమెకు బిడ్డ చనిపోయిన దుఃఖం ఎక్కువగా ఉండేది. కుమిలి కుమిలి ఏడ్చేది.
కొన్ని రోజులు తన గదిలో బిడ్డ ఏడుపు వినిపిస్తోందేమో అనుకునేవాడు తిరువేంగడం. అది నిజమే అన్నట్లు అతని చెవి దగ్గర ఆ శబ్దం నిద్రలో కూడా వినిపిస్తూనే ఉండేది. ఉలిక్కిపడి లేచి చూస్తే పక్క ఖాళీగా ఉండేది. ఆ సంఘటన అతని స్వభావంలో ఏవో మార్పులు తీసుకురాసాగింది.
ఇంటినుండి బయలుదేరి దుకాణానికి వెళ్ళే ముందు రోజూ శ్మశానానికి వెళ్ళడం ప్రారంభించాడతను. బిడ్డను పూడ్చిన చోటుకు వెళ్ళి కొన్ని నిమిషాలు ఆ మట్టి కుప్పను నిశితంగా చూస్తూ ఉండేవాడు. తను ఎందుకు ఏడవలేకపోతున్నానా అని అతనికి ఆత్రం వచ్చేది; అలాగే నడిచి పూదోటల పొలాల దారుల్లో వెళ్ళి కొన్ని గన్నేరు పూలను కోసి చేతిలో పట్టుకుని దుకాణానికి చేరుకునేవాడు. దుకాణం తాళంచెవిని చేతిలో పట్టుకుని, తెరవకుండా, మూసిన తలుపులనే చూస్తూ చాలాసేపు నిల్చుని ఉండిపోయేవాడు.
కొన్నిసార్లు దుకాణం తెరిచాక కూడా ధ్యాస దుకాణం మీద లేకుండా పరధ్యానంగా ఉండేవాడు. ఎవరో ఏడుస్తున్న శబ్దం అతనికి వినిపిస్తూనే ఉండేది. కొన్నిసార్లు పగటిపూట వీధిలో తాటాకుల బుట్టలు గాలికి కొట్టుకుపోవడం చూసినప్పుడు అతనికి ఆవేశం వచ్చేది. పరిగెత్తుకుంటూ దుకాణం విడిచి వెళ్ళి ఆ తాటాకుల బుట్టల్ని పట్టుకు వచ్చి దుకాణంలో వేసేవాడు. అతని ముఖంలో, ప్రవర్తనలో, అన్నింటిలోనూ కోపం ఆవహించడం మొదలైంది. తన మీద తానే కోపగించుకుంటూ ఉండేవాడు.
బాగా ఎండలు ముదిరిన ఒక వేసవి రోజు ఉదయం అతను, దుకాణం తెరవకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్నట్లు నడక మొదలుపెట్టాడు. ఎంతసేపు నడిచాడో తెలియదు. కానీ ఒక గొర్రెల సంతకు చేరుకునేటప్పటికి ఎండ ఉధృతంగా ఉంది. అక్కడక్కడా గొర్రెల్ని పెట్టుకుని గ్రామస్తులు నిలబడి ఉన్నారు. గొర్రెలకోసం తెచ్చుకున్న అవిశాకులు, కుళ్ళిన కూరగాయలు ఒక చోట కుప్పగా పడి ఉన్నాయి. ఒక గొర్రెపిల్ల నోట్లో గరాటు పెట్టి నీళ్ళు తాగిస్తున్నాడు ఒక దళారి. ఎక్కడ చూసినా గొర్రెల అరుపులు. తిరువేంగడం ఒక చింతచెట్టు కింద కూర్చున్నాడు.
దళారుల అరుపులు, గొర్రెపిల్లల అరుపులు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. అతను నిశ్చలంగా దాన్ని చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం ఎండ తగ్గాక అమ్ముడుపోని ఒకటి రెండు గొర్రెలను తీసుకుని వ్యాపారులు వెళ్ళిపోతున్నారు. తిరువేంగడానికి గొంతు ఎండిపోయింది. అయినా అతను నీళ్ళు తాగకూడదు అన్న పట్టుదలతో కూర్చున్నాడు.
ఆ రాత్రంతా గొర్రెల సంతలోనే ఉన్నాడు. గొర్రెల పేడ వాసనా, కుళ్ళిపోయిన కూరగాయల చెత్త వాసనా నిండిన ఆ చోటుని చీకటి కమ్ముకుంది. భూమిలోకి పూడిపోయామేమో అన్నట్లుగా ఒక రకమైన ఒత్తిడి అనిపించింది అక్కడ. తెల్లవారుజాము వెలుగులో అక్కడి చింతచెట్లు అందంగా కనిపించాయి. వెలుగు రావడంతో అతను లేచి సంతనుండి బయటకు వచ్చినప్పుడు రోడ్ల మీద ఇంకా సన్నటి చీకటి పొంచి ఉంది.
కాలికి ఒక రాయి తగిలినట్లు కాలు విదిలించుకుంటూ గట్టిగా భూమ్మీదకు తన్ని అడుగేశాడు. అప్పుడు అతని కుడి కాలు నేలను తాకిన చోటునుండి ఒక నీటి ఊట పైకి చిమ్మడం మొదలైంది. అతను నమ్మలేకపోయాడు. ఆ ఊట ఆరడుగుల ఎత్తుకు పైకి చిమ్ముతోంది. తన కాలు తగిలి నీళ్ళు అలా ఎలా పొంగాయో అతనికే అర్థం కాలేదు. అతను ఆ ఊటను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. నీళ్ళు అన్ని వైపులా పొంగి ప్రవహిస్తున్నాయి. అతను ఆశగా ఆ సెలయేటినుండి దోసిళ్ళతో నీళ్ళు పట్టి తన ముఖం కడుక్కున్నాడు. అది ఎంతో ప్రశాంతతను ఇస్తున్నట్టు అనిపించింది. దోసిలి పట్టి నీళ్ళను దాహం తీరేంతగా తాగాడు. ఒళ్ళు బాగా చల్లబడింది.
తెల్లారగానే వీధిలో జనసంచారం మొదలైంది. ఎవరైనా ఆ నీటి ఊటను చూస్తున్నారా అని గమనించాడు. రోడ్డు మధ్యలో ఏర్పడిన ఇంత పెద్ద నీటి ఊటను ఎవరూ చూడకపోవడం ఆశ్చర్యంగా ఉంది… అతను తనను దాటుకుని వెళ్తున్న వాళ్ళను చూస్తూ ఉన్నాడు. వాళ్ళలో ఎవరూ ఆ నీటి ఊటను చూడటంలేదు. ఒకవేళ అది తన కంటికి మాత్రమే కనపడుతుందా? ఈ నీళ్ళు నిజం కాదా? అతను చుట్టూ తిరిగి చూశాడు. ఒక చిన్న పిల్లాడు మాత్రం అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఎదురుగా నిలబడి ఉన్నాడు.
పిల్లాడ్ని పిలిచి ఆ నీటి ఊటను చూపిద్దామని చప్పట్లు కొట్టి పిలిచినప్పుడు ఆ పిల్లాడు రావడానికి నిరాకరించి మఱో దిశలో పరిగెత్తాడు. తిరువేంగడం తిరిగి చూసినప్పుడు ఆ నీటి ఊట అట్టే మాయమైపోయింది. తిరువేంగడం ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటిదాకా అక్కడ ఒక నీటి ఊట ఉన్నదన్న ఆనవాలు కూడా లేదు.
వడివడిగా ఇంటికి వచ్చిన తిరువేంగడం మరుసటి రోజునుండి తన దుఃఖాన్ని మర్చిపోయి దుకాణం తెరవడం మొదలుపెట్టాడు. రెండు నెల్ల తర్వాత భార్యను తీసుకుని వేరే ఇల్లు చూసుకుని వెళ్తానని మామగారితో చెప్పాడు. మనోన్మణికి భర్తలోని ఈ మార్పు అర్థం కాలేదు. తిరువేంగడం ఎవరు ఏం చెప్పినా సరే రాత్రి ఎనిమిది గంటలకు దుకాణం కట్టేసి ఇంటికి వచ్చేసేవాడు. ఉదయం తొమ్మిది గంటలకే దుకాణం తెరిచేవాడు. గురువారం దుకాణం సెలవు. మనోన్మణికి మళ్ళీ గర్భం వచ్చింది. ఈసారి కూడా ఆడపిల్ల పుట్టింది.
తిరువేంగడం ఆ బిడ్డను రాత్రి వేళల్లో తన పక్కలోనే పడుకోబెట్టుకుని జోకొట్టి నిద్రపుచ్చేవాడు. కొన్నిసార్లు చంటి బిడ్డను దుకాణానికి కూడా తీసుకువెళ్ళిపోయేవాడు. మనోన్మణి విసుక్కుంటూ, ‘ఇంట్లో ఆడమనిషిని లేనా? ఎందుకిలా చేస్తారు? అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు’ అని చెప్పినా అతను వినేవాడు కాదు.
పాప – ‘చిత్ర’కు తనే స్వయంగా స్నానం చేయించేవాడు. తిరువేంగడం జీవితం మళ్ళీ పాత గాడిలో పడటం మొదలైంది. నాలుగేళ్ళవరకు చిత్రను భుజంమీదనుండి కిందకు దింపేవాడే కాదు. దుకాణంలో కూడా చిత్ర అతని ఒడిలో కూర్చునే ఉండేది. స్కూల్లో చేర్పించిన మొదటి రోజు తిరువేంగడం ఒకటికాదు నాలుగుసార్లు స్కూల్లో ఇంటర్వెల్ ఇచ్చారా? మధ్యాహ్నం భోజనానికి వదిలారా అని దుకాణానికి స్కూల్‌కు మధ్య తిరిగాడు.
అతని స్వభావాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం అనిపించేది మనోన్మణికి. రాత్రి నిద్రలో కూడా అతనికి ఒక వింత అలవాటు ఉండేది. సగం నిద్రలో లేచి చిత్ర బాగా నిద్రపోతోందా అని చూసుకునేవాడు. దీని కోసం నాలుగుసార్లు అయినా మెలుకునేవాడు. కొన్నిసార్లు లేచి వెళ్ళి కిటికీ తలుపులు మూసేసి రావడం, పక్కకు జరిగిన చిత్ర పరికిణీని సరి చేసి దుప్పటి కప్పడంవంటివి చూసినప్పుడు మనోన్మణికి ఆశ్చర్యంగా ఉండేది.
దుకాణంలో అతని ఉనికి మునుపటిలాగే క్రమశిక్షణతో ఉండేది. శుక్రవారం మాత్రం భిక్షగాళ్ళకు డబ్బులు వేయడానికని విడిగా పది రూపాయల చిల్లర మార్చి పెట్టుకునేవాడు. ఆ రోజు దుకాణం దగ్గరకు వచ్చిన భిక్షగాళ్ళందరికీ చేతికి దొరికిన నాణెం ఇచ్చేసేవాడు. చిత్ర కాలేజీ చదువుకోసం మదురై వెళ్ళే రోజువరకు అతని ఈ ప్రవర్తనలో పెద్ద మార్పు ఏమీ రాలేదు.
పై చదువులు చదివించడంకంటే బంధువర్గంలోనే ఎవరికైనా ఇచ్చి పెళ్ళి చేసేయడం మంచిదని, మదురైలో ఉన్న తన బంధువుల ఇంటికి కబురు పంపాడు. ఊరంతా చెప్పుకునేది అతని ఆస్తిపాస్తులన్నీ చిత్రకేనని. దాన్ని నిరూపిస్తున్నట్లే చిత్ర పెళ్ళి కూడా ఘనంగా జరిగింది. అబ్బాయి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్‌గా పని చేస్తుండటంతో పెద్ద పెద్ద అధికారులందరూ ఆ పెళ్ళికి వచ్చారు.
అతను ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ‘ఒక బిడ్డను బాధ్యతాయుతంగా పెంచి పెద్దచేసి సరైన వాడి చేత పెట్టేశాను, తండ్రిగా నేను నా బాధ్యతలు సరిగ్గానే నిర్వహించాను’ అని మనసులో సంతృప్తిపడ్డాడు. తాను అనుభవిస్తున్న ఇంత గొప్ప ఆనందాన్ని ఇతరులకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అర్థం కాలేదతనికి.
ఆ రోజు కూడా ఇంటినుండి బయలుదేరి శివాలయం మీదుగా చింతచెట్ల బాటలో నడిచి వెళ్ళాడు. పట్టలేని సంతోషంతో దారిలో ఉన్న మద్దిచెట్టు ఆకులు కోసి విసిరేస్తూ నడిచాడు. అలా గాల్లో ఊరు దాటుకుని చాలా దూరం వెళ్ళాక తిరిగి చూశాడు. దూరంనుండి తన ఊరిని చూస్తూనే ఉండాలి అనిపించింది. రాత్రివరకూ అక్కడే ఉన్నాడు.
బాగా చీకటి పడిన తర్వాత, ఆ చీకట్లోనే నడుచుకుంటూ ఇంటి వైపు వచ్చినప్పుడు తన ఇంటినుండి రికార్డు ప్లే అవుతూ పాటలు వినిపిస్తున్నాయి. వీధిలో అరటి చెట్లు నారలు నారలుగా చీలి పడి ఉన్నాయి. ఇంటి దగ్గరకు వస్తుంటే కాలికి ఏదో మెత్తగా తగిలినట్లు అనిపించింది.
గబగబా అడుగులు ముందుకు వేసినప్పుడు అతని కాలు తగిలి ఒక నీటి ఊట అతని ఎత్తుకు సమానంగా పొంగుతూ పైకి చిమ్మింది. అతను దాన్ని నిశితంగా చూస్తూ ఉండిపోయాడు. నీటి ఊటే. గతంలో ఎప్పుడో చూసినంత ఎత్తుకే ఇప్పుడూ ఎగసింది. కొంచెం సంకోచిస్తూ చేతులు చాచాడు. నిజమైన నీళ్ళే. చేతుల్నుండి జారిపోతున్నాయి. ఈ రోజు కూడా దోసిలితో ఆ నీటిని పట్టుకుని తాగాడు. అప్పుడు తాగిన అదే రుచి. ఏంటిది! ఈ ఊట ఎలా పొంగుతోంది? కొన్ని నిమిషాలు దాన్ని చూస్తూ ఉండిపోయాడు. కూతుర్నయినా పిలిచి చూపించాలి అనిపించింది. గబగబా నడిచాడు.
రెండు అడుగులు వేయగానే ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ ఈ ఊట కూడా మాయమైపోతే? తిరిగి చూశాడు. ఊట పైకి పొంగి కిందకు దూకి నేల మీద పారుతోంది. గబగబా ముందుకు నడిచి వాకిట్లోనే నిలబడి ‘చిత్రా.. చిత్రా..’ అని కేకలు వేశాడు. బయటకు వచ్చిన మనోన్మణి కొంచెం కోపంగా, ‘ఏం మనిషి? ఇప్పుడే అమ్మాయి నిద్రపోవడానికి వెళ్ళింది. ఇప్పుడెందుకిలా కేకలేస్తున్నారూ?’ అంది. భార్య చేయిపట్టి లాక్కుని వెళ్ళాడు.
వీధిలో ఇప్పుడు ఆ ఊట లేదు. అంతేకాదు; ఇందాక అక్కడ నీళ్ళు పారిన ఆనవాలు కూడా లేదు. మనోన్మణి తనని ఎందుకు తీసుకువచ్చారని అడుగుతూనే ఉంది. సమాధానం చెప్పలేకపోయాడు. మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతనే కూతురికి తిరునెల్వేలిలో ఒక ఇల్లు ఇప్పించి, అల్లుడిని ఉద్యోగ బదిలీ తీసుకుని రమ్మన్నాడు. రోజూ మధ్యాహ్నం దుకాణం కట్టేసి బస్సెక్కి కూతురి ఇంటికి వెళ్ళిపోయేవాడు.
ఆ రోజుల్లోనే తిరువేంగడానికి నేలకేసి చూస్తూ నడిచే అలవాటు మొదలైంది. కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది, తన కాలిలో ఏదో ఒక శక్తి ఉందని, లేకపోతే నీటి ఊట ఎలా పైకి చిమ్ముకు వస్తుంది? ఏంటా శక్తి? అది ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తూ ఉండేవాడు. నాలుగేళ్ళ తర్వాత మనవరాలు పుట్టింది. చిత్ర తన భర్తతో చెన్నైకి బదిలీ అయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఊరిలో ఉండలేకపోయాడు. దుకాణాన్ని గణపతికి అమ్మేసి చెన్నైకి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు.
కూతురి ఇంట్లోనే ఉంటున్నారు. అయినా ఏదోరకంగా కాలయాపన చెయ్యాలి కదా అని కడైయత్తూరుకు చెందిన ఒకాయన నడిపే టైర్ కంపెనీకి వెళ్ళి కూర్చుని ఏదో ఒక పని చేసేవాడు.
చెన్నైకి వచ్చిన రోజునుండి ఇంకొకసారి ఆ నీటి ఊటను చూడాలన్న ఆశ కలిగింది. అందుకనే ఆయన ప్రతిరోజూ దార్లో నడుచుకుంటూ వెళ్తాడు. రోజూ అదే సమయానికి నడుస్తాడు. చెన్నైకి వచ్చి ఆఱేళ్ళు గడిచినా ఆ నీటి ఊటను మళ్ళీ సృష్టించలేకపోయాడు. తొలి రోజుల్లోలాగే అలసట, చిరాకు ఆయన్ని ఆవహించడం మొదలైంది. అయినా దాన్ని మునుపటిలా బయటకు చూపించట్లేదు.
ఒకరోజు ఆఫీసునుండి పార్కుకు వచ్చినప్పుడు తనకు తెలిసిన పోలికల్లో ఉన్న ఒక పెద్దాయనను చూశాడు. దగ్గరకు వెళ్ళి పిలుద్దాం అనుకున్నప్పుడు ఆయన వేరే ఎవరో అనిపించింది. సిమెంట్ బెంచీ మీద ఉన్న ఆ పెద్దాయన చేతిలో గొడుగు పట్టుకుని ఉన్నాడు. ఇంకో చేతిలో ఒక స్టీలు క్యారియర్ ఉంది. ఏదో వ్యాపారం చేసేవాడు అని అర్థమైంది.
పెద్దాయన ముఖం చూస్తే రోజంతా బాగా తిరిగి అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఆయన తన క్యారియర్ తెరిచి, అందులో ఉన్న చిల్లరనంతా కుమ్మరించి ఒక్కొక్కటిగా లెక్కపెడుతున్నాడు. తిరువేంగడం ఆయన్నే చూస్తూ ఉన్నాడు. ఆయన చిల్లరను విడివిడిగా ప్లాస్టిక్ కవర్లలో వేసి కట్టి మొత్తంగా అన్నింటినీ క్యారియర్‌లో వేసి మూతపెట్టాడు.
ఆయన ఏం వ్యాపారం చేస్తాడో అడగాలి అనిపించింది తిరువేంగడానికి. ఆ పెద్దాయన బాగా నలిగిపోయిన ఒక వాటర్ బాటిల్లో కొంచెం మిగిలివున్న నీళ్ళను పైకెత్తి ఒంపుకుని తాగి, ఆ బాటిల్‌ను పక్కన పెట్టుకున్నాడు. ఆయనను ఈ రోజే మొదటిసారి చూస్తున్నాడని అర్థమైంది. పార్కు పక్కనున్న ఎవరింటి టీవీలోనో ఎనిమిది గంటల వార్తలు మొదలయ్యాయి. ఆయన లేచి బయటకు నడవసాగాడు.
తిరువేంగడంకూడా ఇంటికి వెళ్ళడానికి పార్కు గేటు వైపుకు నడిచాడు. సరిగ్గా పార్కు గేటు దగ్గర ఆ పెద్దాయన తన గొడుగుతో గట్టిగా నేల మీద ఒక్క పోటు పొడిచాడు, అంతే… నీటి ఊట చిమ్ముకుంటూ పైకి పొంగింది. ఆయనంత ఎత్తుకు చిమ్ముతోందా ఊట. పెద్దాయన ఆ ఊటనుండి నీళ్ళను దోసిట్లో తీసుకుని ముఖం కడుక్కుని కొంచెం తాగాడు కూడా.
తిరువేంగడం నమ్మలేకపోయాడు. నీటి ఊటను తను మాత్రమే కాదు, ఇతరులు కూడా సృష్టించగలరా? ఇంకొకరు సృష్టించిన సెలయేరు తన కంటికి కనిపిస్తోంది! అది నిజమైతే మనుషులందరూ తాము నడిచే బాటలో నీటి చెలమలను సృష్టించుకోగలిగినవారేనా?
వేగంగా ఆ నీళ్ళు చిమ్ముతున్న చోటుకు దగ్గరగా వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఊట లేదు. కానీ కొంచెం తడి ఉంది. దూరంగా ఆ పెద్దాయన చేతిలో క్యారియర్ పట్టుకుని నెమ్మదిగా నేలను చూస్తూ నడిచేవాడిలా వెళ్తున్నాడు.
తిరువేంగడానికి కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించింది. అతని చూపునుండి తప్పించుకుని రోడ్డు మాయమైపోతున్నట్టు అనిపించింది. కళ్ళు నలుపుకుని చూసేసరికి ఆ పెద్దాయన దూరాన వెళ్తున్నాడు. ఆయనను పిలిచి మాట్లాడాలి అనిపించింది. కానీ ఇంతలో ఆయన చీకట్లో మాయమైపోయాడు. తాను చూసింది నిజమేనా అన్న సందేహం తిరువేంగడాన్ని చుట్టుముట్టింది. అయోమయంతో చీకటిని చూస్తూ ఉండిపోయాడు.
హఠాత్తుగా తాను పాత పద్ధతిలోనే ఊరికి వెళ్ళి మళ్ళీ బట్టల వ్యాపారం మొదలుపెట్టేయాలి అన్న ఆలోచన కలగడం మొదలైంది. ఆ ఆలోచన నిముషనిముషానికీ పెరిగి బలంగా అతన్ని చుట్టుకుంది. ఎందుకో తిరువేంగడానికి చాలా కాలం తర్వాత విపరీతమైన దుఃఖం కలిగింది. ఏం చేయాలో తెలియక చీకటి వైపు నడవడం మొదలుపెట్టాడు.
***
మూలం: నడందు సెల్లుం నీరూట్రు, 2006

