మనసును దోచే మనస్లు– 6

గత రాత్రి పదకొండింటివరకూ సామాగావ్‌లోని టీ హౌస్ నిర్వాహకుడు ఫుర్బూతో కబుర్లలో గడిపానుగదా, ఆ కబుర్ల మధ్య ఆయన అన్న ఒక మాట నా మనసులో నాటుకుపోయింది. ‘మీరు శ్యాలాలో ఎలాంటి ఉషోదయం చూసారో దాదాపు అంతే అద్భుతమైన సూర్యోదయదృశ్యాలు మా సామాగావ్‌లోనూ కనిపిస్తాయి – ఆకాశం కాస్తంత నిర్మలంగా ఉంటే చాలు,’ అన్నాడతను. ఆ మాట అంతఃచేతనలో నిలిచిపోయి మనసుకు అలారం బెల్స్ వినిపించి ఉండాలి – తెల్లవారటానికి బాగా ముందే మెలకువ వచ్చేసింది. ‘అదృష్టం ఎలా ఉందో చూద్దాం,’ అని కిటికీ పరదా పక్కకు తప్పించగానే చంద్రకాంతిలో మిలమిలలాడుతోన్న మనస్లు శిఖరం హలో చెప్పింది. అంతే – క్షణాల్లో రెండు మూడు పొరల ఉన్ని బట్టలు వేసేసుకుని నేనూ గిరీషూ మేడమీదికి చేరిపోయాం.

స్థలం మారిందిగదా – ఈసారి మనస్లు శిఖరం కొత్త కోణంలోంచి కనిపించసాగింది. శ్యాలాలో చూసిన దానికన్నా భిన్నమైన వర్ణహేల మమ్మల్ని పలకరించింది. మొదట్లో అలుముకుంటూ వచ్చిన ముదురు ఎరుపురంగు మెల్లమెల్లగా బంగారువర్ణంగా పరిణమించింది. పువ్వుకు తావిలాగా ఆ బంగారు శిఖరం నడికొప్పున పల్చని మబ్బు తెర జయకేతనంలా నిలచి, శిఖరంతోపాటు తానూ రంగులు మార్చుకోసాగింది – శిఖరమంటే ఎప్పుడూ కనిపించేదే – మబ్బుతెర మళ్ళా మళ్ళా మనం అనుకున్నపుడు వచ్చి పలకరించదుగదా – మా శ్రద్ధకు మెచ్చి మనస్లు శిఖరం ప్రసాదించిన అదనపు సంబరంగా దాన్ని మేము భావించుకున్నాం. ఏదేమైనా అదొక అనూహ్యమైన అపురూప దృశ్యం.

ఆ ఆదివారం ఉదయం, ట్రెకింగ్‌లో తొమ్మిదవ రోజు, ఎనిమిదింటికల్లా సామాగావ్ వదిలాం. ఆరోజు అంతా కలసి ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే నడిస్తే చాలనీ, లంచ్ సమయానికల్లా మా గమ్యం సమదో చేరుకుంటామనీ చెప్పాడు గురుంగ్. అంతా కలసి 300 మీటర్లు మాత్రమే ఎగువకు వెళతామట… పెద్దగా శ్రమ ఉండదన్న మాట.


మనస్లు

నులివెచ్చని ఉదయం… మబ్బుల్లేని నిర్మలాకాశం… నడక ఒక సంబరంలా, ఉత్సవంలా సాగింది. అన్నీ అనుకూలమైన అంశాలున్న ఆ సమయంలో మనస్లు పర్వతం పాదాలనుంచి శిఖరం దాకా తన సంపూర్ణరూపం ప్రదర్శించింది. ‘ఇక్కడితో మనకూ మనస్లు పర్వతానికీ చెల్లు… ఈ ప్రదేశం దాటాక మనకు మనస్లు పెద్దగా కనపడదు,’ అన్నాడు గురుంగ్. అది విన్నాక ఎవరో ఆత్మబంధువును విడిచి వెళుతున్నంత ఆర్తితో అందరం మనస్లు శిఖరాన్ని గుండెల్లో నింపుకున్నాం. అన్నట్టు అప్పుడు మేమున్న ప్రాంతంనుంచి మనస్లు పూర్ణరూపమే కాకుండా ఆ పక్కనే ఉన్న 7871 మీటర్ల గాడీఛులీ పర్వత శిఖరం కూడా జంటగా కనిపించింది. ప్రపంచంలో 20వ ఎత్తైన శిఖరమట ఆ గాడీఛులీ.

ఆ రోజు చేరవలసిన గమ్యం ఆట్టే దూరాన లేదు కాబట్టి అందరం ఏ ఒత్తిడీ పెట్టుకోకుండా పరిసరాలను నింపాదిగా చూసుకుంటూ ముందుకు సాగాం. మాతోపాటు బుధీగండకి నది సరేసరి. మొదటి వారంరోజులూ దిగువ హిమాలయాల్లో ఈ గండకి నదిలో మేము గమనించిన దుడుకుతనం ఈ మధ్యహిమాలయాల్లో కనిపించలేదు. శాంతంగా నింపాదిగా మా పక్కనే సాగుతూ వచ్చింది. వృక్షాలు పలచబారాయి… ఎదుగుదల మందగించిన జూనిపర్ మొక్కలు తప్ప అసలు పెద్దగా వృక్షాలంటూ లేవు. భూర్జవృక్షాలు కూడా పొదల స్థాయికి కుదించుకుపోయి కనిపించాయి… పచ్చికబయళ్ళు, వాటిల్లో ప్రశాంతంగా మేస్తోన్న జడలబర్రెలు మాత్రం, ‘మీరు ఇప్పుడు నడుస్తున్నది మీకు అంతగా పరిచయం లేని మరో ప్రపంచంలో’ అని పదేపదే గుర్తు చేసాయి.


హిమాలయాలు, ముఖ్యంగా ఉన్నతశ్రేణి హిమాలయాలు, మంచు కిరీటాలు పెట్టుకుని వివిధవర్ణాలలో మెరిసిపోతూ చూసేవారికి అబ్బురం కలిగించే మాట నిజమేగానీ ఆ అబ్బురాల వెనుక అంతులేని విషాదగాథలు కూడా ఉన్నాయి. ఈ సంగతి మాకు కొత్తగా తెలిసినదేమీ కాదు. హిమాలయ యాత్రల గురించి చదివినప్పుడూ, ఈబీసీ ఏసీటీ మార్గాలలో వెళ్ళినపుడూ ఆయా సంగతులు మాకు బాగా తెలిసాయి. ఇపుడు మేము వెళుతున్న దారిలో కనిపించిన నల్లని శిలాఫలకం మీద చెక్కి కనిపించిన నలుగురు వ్యక్తుల పేర్లు మరోసారి ఆ విషాదాన్ని మా ముందు నిలబెట్టాయి. ఆ నలుగురూ కజకస్తాన్ కు చెందిన పర్వతారోహకులు. 1990లో మనస్లు శిఖరారోహణ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. ఈ నలుగురి మరణం వెనుక నేపాల్ ప్రభుత్వం హిమాలయాలలో యాత్రికులూ పర్వతారోహకులూ తిరుగాడడానికి 1950 లో అనుమతించిన తర్వాత, ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న వందలాదిమంది కథలు ముడిపడి ఉన్నాయి.

హిమాలయాలు పర్వతారోహణకు అందుబాటులోకి రాగానే బ్రిటిషర్లూ స్విట్జర్లాండువాళ్ళూ ఎవరెస్టు శిఖరం మీద తమ దృషి పెట్టారు. ఫ్రెంచివాళ్ళు అన్నపూర్ణను ఇష్టపడితే, జపనీయులు మనస్లును ఎన్నుకున్నారు.

8163 మీటర్ల మనస్లు శిఖరాన్ని మొట్టమొదటిసారిగా 1956 లో జపాను బృందానికి చెందిన తోషి ఇమానిషి, గ్యాల్జెన్ నోర్బులు అధిరోహించారు. అంతకు మూడేళ్ళక్రితం 1953 లో 15మందితో కూడిన జపాను బృందమొకటి సామాగావ్‌లో బేస్ క్యాంప్ నెలకొల్పి శిఖరారోహణ ప్రయత్నం చేసింది. వారిలో ముగ్గురు మాత్రం 7750 మీటర్లవరకూ వెళ్ళగలిగారు. ఆ ప్రయత్నం జరిగిన కొద్ది నెలలకే మంచు నిండిన కొండచరియ ఒకటి విరుచుకు పడి ఫుంగ్యెన్ గొంపాను ధ్వంసం చేసింది. ఆ దుర్ఘటనలో 18మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా పవిత్ర మనస్లు మాతకు తన శిఖరం మీద మానవుడు అడుగు పెట్టాలని చేసిన ప్రయత్నంవల్ల కలిగిన ఆగ్రహం ఫలితమే అని స్థానికులు భావించారు. 1954 లో జపనీయుల మరో బృందం మనస్లు శిఖరారోహణకు వచ్చినపుడు ఆ బృందం స్థానికులనుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంది. ఆ ప్రయత్నం విరమించుకుంది. ఫుంగ్యెన్ గొంపా పునర్నిర్మాణానికి జపనీయులు ఉదారంగా విరాళాలు అందించినా స్థానికుల ప్రతిఘటన సడలలేదు.

1956 లో జపనీయుల మరో బృందం మనస్లు శిఖరారోహణ కోసం వచ్చినపుడు వారికి స్థానికులనుంచి ముందుగా ఎదురైనది ప్రతిఘటనే. ఈసారి వచ్చిన బృందం ఆ ప్రతిఘటనను నేర్పుగా అధిగమించగలిగింది. స్థానికులకు మెల్లగా నచ్చచెప్పడమే కాకుండా బేస్ క్యాంపులో బౌద్ధ భిక్షువులతో మనస్లు అనుగ్రహం వేడుతూ ప్రార్థనా కార్యక్రమం నిర్వహించింది. మొత్తానికి శిఖరారోహణ సఫలమయింది.

ఇంత జరిగినా, 1956 లో అధిరోహణ జరిగిన తర్వాత కూడా, ఈ విషయంలో స్థానికుల వ్యతిరేకత కొనసాగింది. 1956-1971ల మధ్య మనస్లు అధిరోహణ విషయంలో మరే ప్రయత్నమూ జరగలేదు. 1971లో మరో జపాన్ బృందం రెండవసారి మనస్లు శిఖరారోహణ చేసాక పరిస్థితిలో మెల్లమెల్లగా మార్పు వచ్చింది. అందుకు తరాలు మారడం కూడా ఒక కారణమయి ఉండాలి. ఈ వచ్చే బృందాలవల్ల ఉపాధి అవకాశాలూ, ఇతర ఆర్థిక ప్రయోజనాలూ కలుగుతున్నాయన్న ఎరుక స్థానికుల్లో కలిగాక, ఇరుపక్షాల మధ్యా సామరస్యం పెరిగింది. వస్తోన్న బృందాలవాళ్ళు బౌద్ధమఠాలకు విరాళాలు అందించడం, బౌద్ధభిక్షువుల సహాయసహకారాలు పొందడం, పర్వత దేవతలను ప్రసన్నం చేసుకొనే ప్రార్థనా ప్రక్రియను ఆ భిక్షువుల ద్వారా జరిపించడం – వీటన్నిటివల్లా పూర్వపు అనుమానాలు, అభ్యంతరాలు, ప్రతిఘటనలు – అవన్నీ క్రమక్రమంగా తొలగిపోయాయి.

మళ్ళా హిమాలయాల విషాదగాథల దగ్గరికి వస్తే నేను 2022 అక్టోబర్‌లో ఈబీసీ ట్రెక్‌లో నిమగ్నమై ఉన్నపుడు వినిపించిన దుర్వార్త నన్ను ఇప్పటికీ వెంటాడుతూ ఉంటోంది. హిల్లరీ అన్న అమెరికన్ మౌంటెన్ స్కీయరు, మనస్లు శిఖరాన్ని అధిరోహించాక అక్కడినుంచి స్కీయింగ్ చేస్తూ దిగివచ్చే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిందన్నది ఆ వార్త.

ఆమె సాధించిన హిమాలయం స్కీయింగ్ విజయగాథలు విని నేను అప్పటికే ఆమెకు అభిమానిగా మారి ఉన్నాను. ఈ స్కీ మౌంటెనీరింగ్ అన్నది మామూలు శిఖరారోహణలకన్నా అనేక రెట్లు సాహసోపేతమైనది. ప్రమాదం నిండినది. ఆ క్రీడలో అప్పటిదాకా అగ్రగామిగా నిలచిన వ్యక్తి ఆ హిల్లరీ.

2012 లో 8000 మీటర్ల ఎత్తును దాటిన రెండు శిఖరాలను కేవలం 24 గంటలలో ఎక్కి దిగిన మొట్టమొదటి మహిళగా ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆ రెండు శిఖరాలూ ఎవరెస్టూ లోత్సేలు అవడం ఒక విశేషమయితే అదే వ్యక్తి 2018లో మరోసారి లోత్సే శిఖరారోహణ చేసి, ఆ శిఖరం మీదనుంచి స్కీయింగ్ చేసుకుంటూ దిగి రావడం ఇంకా పెద్ద విశేషం. 8000 మీటర్లు పైబడిన శిఖరంనుంచి స్కీయింగ్ చేసుకుంటూ దిగిన మొట్టమొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అదే సాహసాన్ని ఆమె ఆ తర్వాత ఛో ఓయు అన్న మరో 8000 మీటర్ల శిఖరంనుంచీ చేసారు. దానితోబాటు 8000 మీటర్లకు దిగువన ఉన్న ఎన్నో శిఖరాలనుంచి స్కీ చేసుకుంటూ దిగారు. ఈ సాహసాలన్నిటిలోనూ ఆమె భర్త జిమ్ మోరిసన్ ఆమెకు తోడుగా నిలచాడు.

ఆ నేపథ్యంలో 2022 సెప్టెంబర్లో హిల్లరీ నెల్సన్ – జిమ్ మోరిసన్ దంపతులు మనస్లు శిఖరారోహణకూ, అక్కడినుంచి స్కీయింగ్ చేస్తూ దిగి రావడానికీ నడుం కట్టారు. సెప్టెంబర్ నెల శిఖరారోహణలకు అనువైన నెలే అయినా ఆ ఏడాది హిమపాతపు తాకిడి ఎక్కువగా ఉంది. అది చూసి కొన్ని బృందాలు శిఖరారోహణ ప్రయత్నాన్ని విరమించుకుని వెనక్కి మళ్ళాయి. హిల్లరీ-జిమ్‌లు మాత్రం ఓపిగ్గా అదనుకోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయారు.

వారి ఓపిక ఫలించి సెప్టెంబర్ 26 వ తేదీన వాళ్ళిద్దరూ మనస్లు శిఖరాగ్రం చేరుకోగలిగారు. శిఖరం చేరాక స్కీ చేసుకుంటూ దిగి రావడానికి ఉపక్రమించారు. ముందు జిమ్, అతని వెనుక హిల్లరీ. పది నిముషాలు గడిచాయో లేదో – మంచు నిండిన కొండచరియలు విరిగిపడినపుడు ఆ మంచు దొంతరలలో చిక్కుకుని హిల్లరీ అదృశ్యమయింది. మరో మార్గం లేక జిమ్ బేస్ క్యాంప్‌వరకూ స్కీయింగ్ చేసుకుంటూ వచ్చి హిల్లరీని వెతికి కాపాడటానికి హెలికాప్టర్లను నియోగించాడు. ఫలితం లేకపోయింది. రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 28 న మంచుపలకల నడుమ ఘనీభవించిపోయిన హిల్లరీ మృతదేహం లభించింది. గుండెలు పగిలిన జిమ్ ఆ మృతదేహాన్ని వెంటబెట్టుకుని ఖాట్మండూ చేరాడు.

చనిపోయినపుడు హిల్లరీ వయసు 49. ఇద్దరు టీనేజి ఆడపిల్లల్ని వదిలి వెళిపోయిందావిడ. ఆమెను ఖాట్మండూలోనే బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఖననం చేసారు…


మాకు మరోసారి ఇజ్రాయెల్ కుటుంబం తటస్థపడింది. ఆపాటికి వాళ్ళు మాకు మంచి మిత్రులైపోయారు. రాజ్‌కు దారిలో ఓ మర్మోట్ల జంట కనిపించిందట. తన ఎస్సెల్లార్ కెమెరాతో చక్కని క్లోజప్ చిత్రాలు తీసాడు. చూడడానికి పెద్ద సైజు కుందేళ్లలా ఉన్నా వాస్తవానికి మర్మోట్లు ఉడతల జాతికి చెందిన జీవులు.


టిబెటన్ ఆభరణాలు

టిబెటన్ ఆభరణాలు అమ్ముతోన్న కొంతమంది మహిళలు దారిలో కనిపించారు. పూసలు, చెవి రింగులు, నెక్లెసులు చిన్న తివాచీమీద అమర్చి ఉన్నాయి. స్థానికుల ఆభరణాలలో నీలాలూ కోరల్ బీడ్సూ విరివిగా ఉండటం గమనించాను. ‘ఈ టిబెటన్ ఆభరణాలకు పాశ్చాత్యదేశాలలో మంచి ఆదరణ ఉంది,’ అని వ్యాఖ్యానించింది అనిత. అక్కడ ఉన్నవాటిని పరిశీలించి, ‘ఇవన్నీ నాణ్యమైనవి. ఖాట్మండూ ధరలతో పోలిస్తే బాగా చవగ్గా ఉన్నాయి’ అని కూడా అనిత నిర్ధారించింది. అలా అనడమే కాకుండా ఆమె కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేసింది. ఆమెను చూసి మాలో కొందరం ఇంట్లోవాళ్ళకి ఇవ్వడంకోసం మరిన్ని కొన్నాం. మొత్తానికి అందరం కలసి అక్కడి చిరువ్యాపారులకు కొంత అయినా ఊతమివ్వగలిగామన్న సంతోషం కలిగింది.

బాగా ఏటవాలుగా ఉన్న కొండ మూపురం మీదుగా దిగి ముందుకు చూసేసరికి కాస్తంత దూరాన సమదో గ్రామం కనిపించింది. ఓ మణికుడ్యం పక్కనుంచి ముందుకు సాగి గ్రామంలోకి ప్రవేశించాం. ఊరి మొగలో నాలుగు అంతస్తుల భారీ ప్రవేశద్వారం స్వాగతం పలికింది. చక్కని తెలుపు రంగులో ఉన్న ఆ ద్వారంమీద బుద్ధుని విశాల నేత్రాలు చిత్రించబడి ఉన్నాయి. వాటికి తోడు ప్రతి అంతస్తు అంచులలోనూ సరిగె బుట్టా నేసిన పట్టు బట్టలు చుట్టి ఉన్నాయి. ఇవన్నీ సరిపాళ్లలో అమరడంవల్ల ఆ ప్రవేశద్వారం ఎంతో మనోహరంగా కనిపించింది.


కణి

సమదో గ్రామం సముద్రతలానికి 3875 మీటర్లు ఎత్తున ఉంది. 5177 మీటర్ల సమదో హిమశిఖరం ఆ గ్రామానికి నేపథ్య యవనికలా నిలచి ఉంది. ఆరోజు అంతా కలసి తొమ్మిది కిలోమీటర్లు నడిచాం. ముందే చెప్పుకున్నట్టు ఎంతో సరళమైన మార్గమది. అలసట అన్నది సోకకుండా అందరం నాలుగుగంటలపాటు ఆడుతూ పాడుతూ భోజనం సమయానికి గమ్యం చేరాం. సామాగావ్‌తో పోలిస్తే సమదో గ్రామం 300 మీటర్లు ఎగువన ఉంది.

సమదో గ్రామానికి ఆ ప్రాంతాలతో ముఖ్యమైన విపణిబిందువుగా వ్యవహరించిన చరిత్ర ఉంది. రోజులు మారి వ్యాపారం మందగించినా ఈమధ్యకాలంలో మనస్లు మార్గం యాత్రికులకూ సాహసికులకూ ప్రీతిపాత్రం అయ్యేసరికి సమదో గ్రామం మళ్ళా ఆర్థికంగా పుంజుకోగలిగింది. ప్రస్తుతం ఊళ్ళో 50వరకు రాతితో కట్టిన ఇళ్ళు ఉన్నాయి. 200 మంది జనాభా – అంతా టిబెటన్ మూలాల వాళ్ళే.

మొత్తం మనస్లు సర్క్యూట్ అంతటిలోనూ టిబెట్ సరిహద్దులకు అతి సమీపాన ఉన్న గ్రామం సమదో – తిన్నగా వెళితే నాలుగే నాలుగు కిలోమీటర్లు. లార్కే పాస్ చేరుకునే ముందు చెప్పుకోదగ్గ చిట్టచివరి గ్రామం ఈ సమదో.

మేమారోజు మజిలీ చేసిన ‘లిటిల్ టిబెట్’ అన్న టీ హౌస్ ఊరి మొగలోనే ఉంది. అందరం దాల్‌భాత్ భోజనం ముగించాక ఊరు చూడడానికి బయల్దేరాం. మేము అప్పటిదాకా నడచి వచ్చిన మార్గానికి సరిగ్గా లంబకోణంలో ఉన్న ఓ మట్టిబాట మమ్మల్ని ఊళ్ళోకి నడిపించింది. అక్కడి రాతి ఇళ్ళన్నీ చదునైన పై కప్పులు కలిగి ఉన్నాయి. ఓ ఇంటి దిగువ అంతస్తులోని పశువుల కొట్టంలో ఆ ఇంటి వాళ్ళు పొడవాటి గడ్డి మోపులను ఒకదానిపైన ఒకటి అమర్చుతూ కనిపించారు. ఈలోగా చక్కని ఇంగ్లీషు మాట్లాడుతోన్న ఒక స్థానిక యువకుడు మాట కలిపి, ‘ఆ పశుగ్రాసం అమరిక రాబోయే చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న పని,’ అని వివరించాడు. ఆ మాట మేము ఊహించినదే అయినా చొరవ చేసి చెపుతోన్న ఆ యువకుని తీరు ముచ్చటగా అనిపించి అతని మాటలు శ్రద్ధగా విన్నాం.

ఆ యువకుని పేరు తాషీ దలక్ ఫండో. ఖాట్మండూ యూనివర్శిటీ విద్యార్ధి. సెలవల్లో ఇంట్లోవాళ్ళకి సాయం చేద్దామని వచ్చాడట. ఊర్లో ఉన్న బౌద్ధమందిరం తాళాలు తన దగ్గర ఉన్నాయనీ, మేము కాసేపు ఆగినట్టయితే వెళ్ళి ఆ తాళాలు తెస్తాననీ చెప్పాడు. సరేనన్నాం. మమ్మల్ని అక్కడే వదిలి తాళం చెవులు తేవడానికి వెళ్ళాడు తాషీ. వెళ్లాడేగానీ పావుగంటసేపు ఎదురుచూసినా అయిపులేడా యువకుడు!

ఈలోగా ఫిన్, లియోనీ అన్న జర్మన్ యువజంట కనిపించి మాట కలిపారు. కొలోన్‌నుంచి వచ్చారట. లియోనీ కనస్ట్రక్షన్ ఇంజనీరట. నేపాల్ రావడం తమకిదే మొదటిసారనీ, ఇక్కడి నైసర్గిక సౌందర్యం, స్థానిక సంస్కృతి అద్వితీయమనీ సంబరంగా చెప్పారు. మనస్లు ట్రెక్‌నే ఎందుకు ఎన్నుకున్నారూ అని అడిగితే నేపాల్‌తో బాగా పరిచయం ఉన్న తమ స్నేహితులు గట్టిగా సిఫార్సు చెయ్యడంవల్ల అని జవాబిచ్చారు.

లియోనీ ఇళ్ళు కట్టే ఇంజనీరు కదా – ‘భూకంపాలు తరచూ వచ్చే ఈ హిమాలయాల్లో ఇలా సిమెంటు లేని రాతి ఇళ్ళూ, చదును పై కప్పులూ కట్టడం ప్రమాదకరం కాదా,’ అని అడిగాను. ‘ప్రమాదకరమన్న మాట నిజమే కానీ ఒకవేళ ఆ భూకంపాలే వచ్చి ఇళ్ళు కూలిపోతే తిరిగి నిర్మించుకోవడం బాగా సులభం’ అని వివరించింది లియోని. నేపాల్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ భవనాల నిర్మాణం విషయంలో నియమాలనూ ప్రమాణాలనూ రూపొందించిందికానీ ఆ నియమాలు ప్రైవేట్ భవనాలకు వర్తించవని కూడా చెప్పుకొచ్చింది లియోని.

ఇహ తాషీ రాడని నిర్ధారించుకుని అందరం ముందుకు సాగాం. ఊళ్ళో నడుస్తున్నప్పుడు స్థానిక దుస్తులు వేసుకున్న ఓ మధ్యవయసు మహిళ మగ్గం మీద బట్టలు నేస్తూ కనిపించింది. పక్కనే ఓ పెద్దాయన ఆ నేతపనిని గమనిస్తూ కూర్చుని ఉన్నాడు. అక్కడ మరో ఇద్దరు టీనేజి ఆడపిల్లలు కూడా నేతపనిలో నిమగ్నమై ఉండటం గమనించాం. వాళ్ళల్లో ఒకమ్మాయి చక్కగా ఇంగ్లీషు మాట్లాడుతోంది. ఆ మగ్గం నేసే మధ్యవయసు మహిళ తమ తల్లి అనీ, ఆమె నేతపనిలో నేర్పరి అనీ, తనూ చెల్లెలూ అమ్మ దగ్గర ఆ పని నేర్చుకుంటున్నామనీ చెప్పుకొచ్చింది. ఈ ఆడపిల్లలిద్దరూ ఖాట్మండూలో బోర్డింగ్ స్కూలు విద్యార్థినులట. అక్కడ ఉన్న పెద్దాయన వాళ్ళ తాతగారట. గ్రామాల్లోని పిల్లలు ఇలా ఖాట్మండూలాంటి చోట్లకు వెళ్ళి పై చదువులు చదువుకోడానికి ప్రభుత్వంనుంచీ, బౌద్ధమఠాలనుంచీ సహాయం అందుతూ ఉంటుందని చెప్పిందా అమ్మాయి. కబుర్లు ముగిసాక ఆ సన్నపాటి మట్టిబాట వెంటే ఊరి చివరి దాకా వెళ్ళాం.

లార్కే పాస్‌లోని హిమఖండాలలో మునిగితేలే ముందు విలాసంగా వేడినీటి స్నానం చేసే సౌకర్యం ఉన్న ప్రదేశం సమదో. ఆ సంగతి తెలిసాక చలి అన్నది లెక్క చెయ్యకుండా అక్కడ ఉన్న రెండే రెండు స్నానశాలల దగ్గర క్యూలో నిలబడ్డాను. బకెట్టు వేడి నీళ్లకు 500 ఖర్చు… అయినా ఆ మారుమూల ఉన్నతశ్రేణి మంచుకొండల మధ్య అది ఒక ఖర్చే కాదనిపించింది… చక్కని స్నానం… మనసుకూ శరీరానికీ ఆహ్లాదమే ఆహ్లాదం…

చీకటి పడింది. చలి తీవ్రత పెరిగింది. వెచ్చదనంకోసం అందరం డైనింగ్ రూమ్‌లో చేరాం. కొంతమంది చతుర్ముఖ పారాయణంలో మునిగిపోయారు. గోపీ యథాప్రకారం వంట పెద్దాయనతో మాట్లాడి మా అందరికీ ఉల్లిపాయ పకోడీలూ మసాలా టీ అందేలా చూసాడు.

మరి కాసేపట్లో ఆ డైనింగ్ రూమ్‌లోకి ఓ ఇజ్రాయెల్‌కు చెందిన యువకుల బృందం వచ్చి చేరింది. అంతా మహా హుషారుగా ఉన్నారు. కబుర్లు, చెణుకులు, చిరునవ్వులు, అట్టహాసాలు – సందడే సందడి. ఎంచేతనో ఇజ్రాయెల్ వారికి హిమాలయాలంటే మక్కువ ఎక్కువ. వాళ్ళల్లో చాలామంది కనీసం ఒక్కసారైనా భారతదేశం చూసారని వారి మాటల్లో తెలిసింది. నేపాల్ ఇండియాల్లోని హిమాలయ పర్వతాలకు ఇజ్రాయెల్‌నుంచి పర్యాటకులు విరివిగా వస్తూ ఉంటారు.


మేమున్న ‘లిటిల్ టిబెట్’ టీ హౌస్ వాస్తవానికి మూడు అంతస్తుల భవనం. దాన్ని టీ హౌస్ అనడంకన్నా పట్నాల్లో ఉండేలాంటి హోటల్ అనడం సబబు. సమదోలాంటి చిన్న ఊర్లో అంత పెద్ద వసతి గృహం ఉండటం ఆశ్చర్యమనిపించింది. ఆ టీ హౌల్‌నుంచి నడుపుతోన్న దావా సాంగ్పో అన్న పాతికేళ్ళ యువకునితో మాట కలిసింది. సంభాషణ సాగింది. స్నేహశీలి. సహాయపడే గుణం. డిన్నరు ముగిసాక కాసేపు మాతో కూర్చుని ముచ్చట్లు చెప్పాడు. ఈమధ్యే హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మానేజ్‌మెంట్ కోర్స్ ముగించి సమదో వచ్చాడట. అన్నట్టు ఈ ధర్మశాల అన్న పేరుతో రెండు ఊళ్ళు ఉన్నాయి: దావా సాంగ్పో చదువుకుని వచ్చిన ధర్మశాల భారతదేశంలో ఉంది – దలైలామా బృందానికి ప్రవాస రాజధాని అది. ఇపుడు మేమున్న సమదో గ్రామానికీ, మా అంతిమగమ్యం లార్కే కనుమకూ మధ్య ధర్మశాల అన్న చిన్న శిబిరం మరొకటి ఉంది – ఇది నేపాల్ ధర్మశాల.

వాళ్ళ నాన్న 2013 లో ఈ లిటిల్ టిబెట్ టీ హౌస్ ఆరంభించాడని చెప్పుకొచ్చాడు సాంగ్పో. ఆయన సౌత్ కొరియాలో ఎనిమిదేళ్లు పని చేసి వచ్చాడట. సమదో గ్రామంనుంచి విదేశాలకు వెళ్ళి పనిచేసిన మొట్టమొదటి మనిషి ఆయన. అలా ఎనిమిదేళ్లు కొరియాలో గడిపాక స్వంత ఊళ్ళో జబ్బుపడి ఉన్న అక్కయ్య బాగోగులు చూసుకోవడం కోసం తిరిగి వచ్చేసాడట. తాను కొరియాలో సంపాదించిన డబ్బులతో ఖాట్మండూలోగానీ సమదోలోగానీ చిన్నపాటి హోటలు పెట్టాలని సంకల్పించాడు. వాకబు చేస్తే ఖాట్మండూలో భూమి బాగా ఖరీదనీ, తన దగ్గర ఉన్న వనరుల్లో సగంవరకూ భూమి మీదే పెట్టవలసి వస్తుందనీ తెలిసింది… వద్దనుకుని సమదోలో ఇదిగో, ఈ లిటిల్ టిబెట్ ఆరంభించాడు. ముందు చిన్నపాటి టీ హౌస్‌గా మొదలెట్టినా కాలక్రమేణా అది మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసించి ఇపుడు మూడంతస్తుల భవనమయింది. ఊళ్ళోకెల్లా పెద్ద వసతిగృహమయింది. కుటుంబానికి చక్కని ఆదాయం అందించే వనరు అయింది. ‘మా నాన్న మా ఊళ్లోనే హోటలు తెరవాలన్నది మంచి నిర్ణయమని రుజువయింది. మాకు ఆదాయం అందించడమే కాకుండా మా కుటుంబమంతటికీ ఉపాధి కూడా కల్పించింది. ముందు ముందు ఈ హోటలు మరింత వృద్ధిలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి,’ అన్నాడు సాంగ్పో. ‘ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. వసంతం, వేసవికాలాల్లో మీలాంటి ట్రెకర్లు రావడం, ఊళ్ళన్నీ ఆర్థికంగా లాభపడటం ఎలానూ జరుగుతోంది. ఆ కాలాలు మా వ్యవసాయప్పనులూ విరివిగా సాగే సమయం. బయట ఊళ్ళకి వెళ్ళి చదువుకుంటోన్న పిల్లలకు సెలవలిచ్చే సమయం. వాళ్ళంతా బాధ్యతగా స్వంత ఊళ్ళకి వచ్చి పెద్దాళ్ళకి పనీపాటల్లో చేయూత అందిస్తున్నారు. వెరసి ఊళ్ళన్నీ కళకళలాడే సమయాలివి. ఈ పిల్లలే చదువులు ముగిసాక ఎక్కడెక్కడికో ఎగిరిపోతారు. తిరిగి ఊళ్ళకు వచ్చి స్థిరపడటమన్న ప్రసక్తే లేదు. మరి ముందు ముందు మా గ్రామాల పరిస్థితి ఎలా ఉండబోతోందో కాలమే చెప్పాలి,’ సాంగ్పో మాటల్లో చిన్నపాటి ఆందోళన, ఆవేదన.

అతని మాటలు వింటోంటే నాకు మా ఊరు, రాణంపల్లి గుర్తొచ్చింది. మా తాతల కాలంలో మార్పు అన్నది లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేది మా ఊరు. చదువు అన్నది ప్రాథమిక అక్షరజ్ఞానం దగ్గరే నిలిచిపోయేది. మా నాన్నల తరం వచ్చేసరికి పరిస్థితి మారింది. చదువులు పీయూసీ స్థాయికి చేరాయి. అయినా గ్రామాలు స్థిరంగానే ఉండేవి. మా తరం దగ్గరికి వచ్చేసరికి యూనివర్సిటీ చదువులు అందుబాటులోకి వచ్చాయి. వృత్తివిద్యలు చేతికందాయి. దానితో యువతరం ఊరు వదిలి పట్నాలకూ, నగరాలకూ, విదేశాలకూ వెళ్ళడం మొదలయింది. ఊళ్ళో జనాభా తగ్గసాగింది. చైతన్యం తగ్గుమొహం పట్టింది. ఇపుడు వెళితే ఊళ్ళన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. పై చదువులు చదివే అవకాశంవల్ల ఆ చదివినవాళ్ళు జీవితంలో మునుముందుకు సాగిపోగలుగుతున్నారు అన్న మాట వాస్తవం. అదే సమయంలో శతాబ్దాలుగా సాగి వస్తోన్న వ్యవసాయాధారిత జీవనవిధానం సమూలంగా పెకలించబడుతోంది. తరతరాలుగా చిన్న చిన్న కమతాల మీద ఆధారపడి జీవిస్తున్న బడుగు జీవులకు బ్రతుకు గాలిలో దీపం అవుతోంది. ఏదేమైనా శరవేగంతో అనునిత్యం మార్పుకు గురవుతున్న ఆధునికయుగంలో ఇలాంటి ఆందోళనలూ, నిస్సహాయతలూ భాగమేనేమో… వీటికి పరిష్కారం వ్యక్తిగత స్థాయిలో ఆశించడం సబబు కాదేమో… దూరదృష్టిగల అధినేతలు బాధ్యతతో పుంజుకుంటే తప్ప ఈ గతుకుల బతుకులకు ఉపశమనం లభించదు.

ఉన్నతశ్రేణి హిమాలయాల గ్రామాల్లో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం గురించి సాంగ్పో ఓ కొత్త విషయం చెప్పాడు. జూన్ జూలై నెలలలో ఆ ప్రాంతాల్లో యార్సాగుంబా (Yarsagumba) అన్న ‘పురుగు’ శిలీంధ్రాన్ని ‘సేకరిస్తూ’ ఉంటారట. ఈ కాటర్ పిల్లర్ ఫంగస్‌ 3500 మీటర్ల ఎత్తును దాటిన ప్రదేశాల్లోనే దొరుకుతుందట. ఆయుర్వేదంలోనూ చైనీస్ వైద్యవిధానాల్లోనూ ఈ ఫంగస్‌ను ఎంతో విలువైనవిగా పరిగణిస్తారట. తలనొప్పి గ్లానిలాంటి రుగ్మతల విషయంలో అది దివ్యౌషధమట. ఇపుడీ ఫంగస్ దిగుబడి కూడా బాగా తగ్గుమొహం పడుతోందట. బహుశా వాతావరణంలో వస్తోన్న మార్పులు అందుకు కారణమై ఉండవచ్చనీ అన్నాడు సాంగ్పో. అతను చెప్పిన ఈ పురుగు శిలీంధ్రం విషయం నాలో ఆసక్తి రేకెత్తించింది. మరిన్ని వివరాల్లోకి వెళ్ళాను.

ఈ ‘పురుగు’ శిలీంధ్రానికి మూలకారకులైన కీటకాలు లార్వా దశలోనే ఉన్నపుడు సదరు ఫంగస్‌కు చెందిన సిద్ధబీజాలు – స్పోర్స్, ఆ లార్వాతో చేరి వాటికి ఇన్ఫెక్షన్ సోకేలా చేస్తాయట. అలా ఇన్ఫెక్షన్ సోకిన లార్వా తన ప్రాణాలు పోగొట్టుకునేలోగా భూమి లోపలికి నెట్టబడుతుందట. అలా ‘మరణించిన’ లార్వా దళసరి పై పొరనుంచి ముదురు గోధుమరంగు ఫంగస్ కొమ్మలు మొలుచుకు వస్తాయట. ఆ కొమ్మలు కొన్ని సెంటీమీటర్ల పొడవు ఉంటాయట.

పైన చెప్పిన ప్రక్రియలో అలా సహజంగా పుట్టుకువచ్చిన ఫంగస్‌ను అక్కడివాళ్ళు స్వహస్తాలతో సేకరించి మార్కెట్‌కు పంపుతారట. కిలో ఫంగస్ ధర 30వేలనుంచి 50వేల డాలర్లవరకూ ఉంటుందట. అంచేత దాన్ని ‘హిమాలయన్ గోల్డ్’ అని కూడా వ్యవహరిస్తారట.

ఏదేమైనా సాంగ్పోలాంటి చదువుకున్న యువకులు గ్రామాలకు తిరిగివచ్చి తమ కుటుంబాలు నడిపే వ్యాపారవ్యవహారాలలో పాలుపంచుకోవడమన్నది నాబోటి వాళ్ళకు సంతోషం కలిగించే విషయం. నేను కూడా ఇలా ట్రెకింగ్‌లూ ఇతర ప్రయాణాలూ చెయ్యడంవల్లనే వాళ్ళనూ వాళ్ళ జీవనశైలినీ దగ్గరనుంచి చూడగలుగుతున్నాను. అర్థం చేసుకోగలుగుతున్నాను. అక్కడి పర్వతాలు, నదులు, హిమానీనదాలలానే ఈ ప్రజలు, వారి బ్రతుకులు ఆ ప్రాంతపు సంస్కృతిలో అంతర్భాగాలు.


అక్టోబర్ 13. సోమవారం. ట్రెకింగ్‌లో పదకొండవ రోజు. ఆనాటి మా గమ్యం ధర్మశాల శిబిరం.

ఉదయం ఎనిమిదిన్నరకు సమదో గ్రామం విడిచిపెట్టాం. తన ఉద్యోగులతోపాటు వచ్చి సాంగ్పో మా అందరికీ చక్కని వీడ్కోలు పలికాడు. లార్కే పాస్ దారంతా మాకు అనుకూలమైన వాతావరణం అమరాలని శుభాకాంక్షలు అందించాడు. మెల్లగా ముందుకు సాగాం. కాసేపట్లో సమదో గ్రామం, సమదో హిమనగం కనుమరుగయ్యాయి. మరి కాసేపట్లో 4000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాం. ఈ మనస్లు యాత్రలో ఈ 4000 మీటర్ల ఎత్తుకు చేరడం ఇది మూడోసారి: మొదట ఫుంగ్యెన్ గొంపా, ఆ తర్వాత బీరేంద్ర తాల్, మూడోసారి ఇదిగో, ఈ ధర్మశాల వెళ్ళే దారిలో. ఈసారి లార్కే కనుమ దాటేదాకా 4000 మీటర్లకన్నా దిగువకు చేరడం అన్నమాటే ఉండదు. పలచబడే వృక్షాలు, చుట్టూ గ్లేషియర్లు, ఆల్పైన్ పచ్చికబయళ్ళు, గ్లేషియర్లు మోసుకువచ్చి వదిలిన రాళ్ళకుప్పలు – షరా మామూలే! మాకు కాస్తంత ఉత్తేజం కలిగించడానికా అన్నట్లు కాస్తంత దూరాన మర్మోట్ల బృందం ఒకటి కనిపించింది. అవి అసలే సిగ్గరి ప్రాణులు… మా ఉనికిని పసిగట్టగానే పరుగుపరుగున మరుగు వెతుక్కుని అదృశ్యమయాయి. ఏదేమైనా ఆ చీమలు దూరని హిమాలయాలలో మర్మోట్లలాంటి స్వేచ్ఛాజీవులను చూడడమన్నదే సంబరం కలిగించే విషయం.

ఆ పూట నడకలో మాకు మనస్లు ప్రాంతపు ఉత్తరభాగంతో పరిచయమయింది. 6211 మీటర్ల నైకే శిఖరం, 6219 మీటర్ల లార్కే శిఖరం కనిపించాయి. పై భాగంలో వెండిలా అందంగా మెరిసే నైకే గ్లేషియర్ క్రింద భాగాన్ని చూస్తే మట్టీ రాళ్ళూ కలగలసి, అందం తరిగి కనిపించింది. ఈబీసీ ట్రెక్‌లో మేమంతా స్నేహం చేసిన ఖుంబూ గ్లేషియర్ కూడా ఇలాగే రాళ్ళూ మట్టితో నిండి ఉండడం గుర్తొచ్చింది.


నీలాల సరోవరం

దూరాన ఓ నీలాల రాశి కనిపించింది. గ్లేషియర్ల మానసపుత్రిక ఆ సరోవరం. హిమాలయాల్లో, ఉన్నత శ్రేణుల్లో ట్రెకింగ్ చేయడంలో ఒక గణనీయమైన ఆకర్షణ ఏమిటంటే ఘడియ ఘడియకూ (ఘడియ అంటే 24 నిముషాలు) సరికొత్త అందాలు, ఊహించని సౌందర్యాలు మనకు తటస్థపడతాయి. మనసుమీద ముద్ర వేస్తాయి. దానివల్ల, ‘ఎప్పుడూ ఒకటే నడక’ అన్న విసుగు దగ్గరకు చేరదు. ముందు ముందు ఏం కనిపించబోతోందో అన్న ఉత్సుకత శ్రమ తెలియకుండా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక ఎత్తులు ఎక్కడం, దిగటం కూడా తోడయ్యాయంటే అడవుల దగ్గర్నుంచి మంచు మైదానాలవరకూ దృశ్యాలే దృశ్యాలు.

మరోసారి – చిట్టచివరిసారి అనాలి, బుధిగండకి నదిని వంతెన మీదుగా దాటాం. నది అంటున్నానేగానీ మేమున్న చోట అది గ్లేషియర్‌నుంచి కరిగి వస్తోన్న చిన్నపాటి సెలయేరు అనడం సబబు. ఆ ప్రదేశమే బుధిగండకి జన్మస్థానమట. పాపం, మచ్ఛాఖోలానుంచి మాతోపాటు ఉంటూ వచ్చింది ఈ బుధిగండకి. పర్వతదశలో ఒక నది ఎన్ని వయ్యారాలు పోతుందో, ఎంత రాలుగాయిలా పరుగులు పెడుతుందో మాకు ప్రత్యక్షంగా చూపించింది. ఎన్ని పోకడలు పోయినా బుధిగండకి మాతో బాగా స్నేహం కలిపింది అన్నమాట వాస్తవం. అంతా కొద్ది క్షణాలు అక్కడే నిలబడి, నదికేసి ప్రేమగా చూసి, మనస్ఫూర్తిగా వీడ్కోలు చెప్పాం. ఇలాంటి వీడ్కోళ్ళే ఈబీసీ ట్రెక్‌లో దూధ్‌కోసీ నదికి చెప్పడం గుర్తొచ్చింది. అన్నపూర్ణ ట్రెక్‌లో మర్శియాంగ్దీ నది మా ప్రేమకు పాత్రురాలయింది. ఈ మూడు నదులూ నామీద గాఢమైన ముద్ర వేసాయి. కొద్ది రోజుల అనుబంధానికే నదులను అంతగా ప్రేమిస్తున్నామంటే మరి సహస్రాబ్దాల క్రితం గంగ, డాన్యూబ్, నైలు నదీతీరాలలో నాగరికతలు నెలకొల్పిన మానవుడు ఆయా నదులను ఇప్పటికీ పూజిస్తున్నాడంటే ఆశ్చర్యమేముందీ?!

ఆనాటి మా ట్రెక్‌లో రెండవభాగం మాకు కఠిన పరీక్షలు పెట్టింది. గ్లేషియర్లు తెచ్చి వదిలిన రాళ్ళూ మంచు మిశ్రమాల మీద ఏర్పడిన సన్నటి బాట మీదుగా చాలా దూరం ఎగువకు ఎక్కవలసి వచ్చింది. ఏడెనిమిది కిలోమీటర్ల నడక. 585 మీటర్లు ఎగువకు చేరాం. అలసటే అలసట.


హిమనదాలు

మొత్తానికి నైకే గ్లేషియర్ని బాగా దగ్గర్నించి చూసుకుంటూ ధర్మశాల చేరుకున్నాం. అక్కడ ఇళ్ళంటూ ఏవీ లేవు… స్థిరనివాసులు లేనేలేరు. లార్కే కనుమ దాటే సాహసికులకు బేస్ క్యాంప్‌గా ఉపకరించే సమతల ప్రదేశమది. 4460 మీటర్ల ఎత్తు. లవణవ్యాపారం ఉధృతంగా సాగిన రోజుల్లో ఈ ప్రదేశంలో నిజమైన గ్రామమే ఉండేదట. ఇపుడా వ్యాపారమూ లేదు, గ్రామమూ లేదు.

అంతా కలసి అక్కడ మూడు వసతి సౌకర్యాలున్నాయి. అతి ప్రాధమిక సౌకర్యాలవి. చూస్తేనేమో లార్కే పాస్‌కు వెళుతూ ఆగిన యాత్రికులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అందరం ఆ కాస్తంత వసతిలోనే సర్దుకున్నాం. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో దాల్‌భాత్ భోజనం ముగించాం. సాయంత్రం గదిలోంచి కాసేపు బయటకు వచ్చినపుడు ఎక్కడ చూసినా మేఘాలే… ఏదో మేఘాలసీమలో తేలిపోతున్న భావన…

రాత్రి భోజనం కూడా పెందరాళే ముగించాం. డైనింగ్ హాలంతా క్రిక్కిరిసి ఉంది. నేను కూర్చున్న టేబుల్ దగ్గర స్పెయిన్‌కు చెందిన 70 ఏళ్ల తండ్రి, అతని 40 ఏళ్ల కొడుకు పరిచయమయ్యారు. ఇద్దరూ కాకలు తీరిన ట్రెకింగ్ యోధులు. ఎన్నో ఏళ్ల క్రితమే ఈసీబీ, అన్నపూర్ణ ట్రెక్‌లు చేసినవాళ్ళు. మరింకేం – కబుర్లే కబుర్లు. కబుర్లయితే సాగాయి కానీ పెద్దాయన్ని పరీక్షగా చూస్తే నలతగా ఉన్నట్టనిపించింది. ‘ఏమన్నా ఇబ్బందా?’ అని అడిగాను. ‘ఇబ్బందిగానే ఉందిగానీ లార్కే పాస్ తప్పకుండా దాటగలుగుతాను,’ అని నమ్మకంగా చెప్పాడాయన. అపారమైన అనుభవంలోంచి వచ్చిన నమ్మకమది.

కొద్ది నిముషాల మౌనం తర్వాత ఆ పెద్దాయన చెప్పడం మొదలుపెట్టాడు. “ఎన్నో ఏళ్లు ఎన్నోచోట్ల ట్రెకింగ్ చేసాను. ఇపుడు నా శరీరం ‘ఇక చాలు’ అని చెపుతోంది. ఇప్పటిదాకా నా శరీరం నేను చెప్పినట్టు వింది. శరీరం చెప్పినట్టు వినడం ఇపుడు నా వంతు. బహుశా ఇదే నా చిట్టచివరి ట్రెక్ అవుతుంది. ఈ యాత్ర మా అబ్బాయితో కలసి చెయ్యాలన్నది నా చిరకాల ఆకాంక్ష. నా చిన్నపుడు మా నాన్నతో కలసి ట్రెకింగ్‌లు మొదలెట్టాను. ఇపుడు మా అబ్బాయి ఆ పరంపర కొనసాగించాలని నా కోరిక. అందుకే ఈ యాత్రలో ప్రతి క్షణాన్నీ మనసులో నింపుకొంటున్నాను” – పెద్దాయన మనసు విప్పాడు.

వాళ్ళబ్బాయికేసి చూసాను. అతను కన్నీళ్ళు ఆపుకుంటున్నాడు. నిజమే – ప్రతి ఒక్కరికీ తమదంటూ ఒక గాథ ఉంటుంది. ఇలాంటి యాత్రలు చెయ్యడం వెనుక తమదే అయిన ప్రేరణ ఉంటుంది – వారికి శుభాకాంక్షలు అందించి సెలవు తీసుకున్నాను.

ఈసీబీ అన్నపూర్ణలతో పోలిస్తే మనస్లు సర్క్యూట్లో తక్కువమంది ట్రెకర్లు ఉండటం ఒక రకంగా వరం. తక్కువమంది ఉన్నపుడు ఒకరికొకరు సులభంగా పరిచయమవుతారు. మనసులు విప్పి మాట్లాడుకొనే అవకాశం ఉంటుంది. పరిచయాలు స్నేహాలుగా మారతాయి. పది రోజులు మనస్లు బాటల్లో నడిచేసరికి మేరీ కుటుంబంతో స్నేహం పండింది. జర్మన్లు, స్పానిష్ వాళ్ళు, సింగపూరియన్లు, నెదర్లాండ్స్ వాళ్ళు, ఇజ్రాయెల్‌కు చెందిన యువబృందం – ఎన్నో పరిచయాలు… ఎన్నో దేశాలు… ఎన్నో సంస్కృతులు… స్థానిక టిబెటన్లు సరేసరి. ధర్మశాలలో, ఆ ఇరుకు డైనింగ్ రూమ్‌లో, పరకాయించి చూస్తే అందరమూ ఒకే జాతికి చెందినవాళ్ళమనీ, ఒక ఉమ్మడి లక్ష్యంకేసి రోజుల తరబడి కలసి పయనిస్తున్నామనీ అనిపించింది. ట్రెకింగే మా సంస్కృతి, లార్కే కనుమ మా ఉమ్మడి లక్ష్యం అనిపించింది.

ఇలాంటి ప్రయాణాల్లో డైనింగ్ రూమంతా అక్కడి వాతావరణానికి సంబంధించిన కబుర్లతో నిండిపోవడం పరిపాటి. ట్రెకింగ్ లో అంతిమఘట్టం చేరుకొనే కొద్దీ విజయమా – వెనుకంజా అన్న విషయంలో వాతావరణం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. మాకు అందిన వాతావరణసూచనలలో వానా మంచుల ప్రస్తావన లేదు. ‘రేపంతా ఎండ కాస్తూ ఉంటుంది,’ అన్న సందేశం సూర్యనుంచి అందినట్టు బాబు చెప్పాడు. కానీ ఈ మధ్యకాలంలో కురిసిన వానా మంచూ బాగా గడ్డకట్టి ఉన్నాయనీ, వెళ్ళే దారిలో టన్నులకొద్దీ మంచు పోగుపడి ఉందనీ తెలిసింది. అయినా నిన్నా మొన్నా లార్కే పాస్‌కేసి వెళ్ళిన బృందాలన్నీ ఏ ఇబ్బందీ లేకుండా ఆ కనుమను దాటాయని మా టీ హౌస్‌లో పనిచేసే ఒకతను చెప్పాడు.

రేపటి కార్యక్రమం గురించి విపులంగా చెప్పుకొచ్చాడు బాబు గురుంగ్. ఉదయమే మూడున్నరకల్లా బయల్దేరడం, పదిగంటలకల్లా కనుమ దగ్గర 5416 మీటర్ల అత్యున్నత బిందువు చేరుకుని అటువేపుకు దిగటం ఆరంభించడం – సాయంత్రానికి భీమ్‌తాంగ్ అన్న ఊరు చేరుకోవడం – స్థూలంగా ఇదీ కార్యక్రమం. అంతా కలసి 25 కిలోమీటర్ల నడక. గడ్డకట్టిపోయిన మంచుమీద నడవాలిగాబట్టి ‘అందరూ బూట్లకు క్రాంపాన్స్ అమర్చుకోండి’ అని హెచ్చరించాడు గురుంగ్. మా పదహారు రోజుల యాత్రకు శిఖరబిందువు మరో ఐదారు గంటల నడక దూరంలో ఉందన్న విషయం అందరినీ ఉత్సాహపరచింది. ఉత్తేజపరచింది. పరస్పరం అభినందించుకున్నాం. ఇప్పటిదాకా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, మేము సాధించిన పురోగతిని గుర్తు చేసుకున్నాం. రేపటి రోజు ఎంతో విజయవంతంగా, సంతృప్తికరంగా ఉండబోతోందన్న నమ్మకాన్ని పంచుకున్నాం.

ఆ నమ్మకంతోనే అందరం ఎనిమిదింటికల్లా నిద్రకు ఉపక్రమించాం. మర్నాడు బాగా పొద్దున్నే లేవాలి కదా… అయినా ఎనిమిదింటికే పడుకోవడమన్నది అంత సులభం కాదు… నాకు రెండేళ్ల క్రితం అన్నపూర్ణ ట్రెక్‌లో థోరాంగ్ లా కనుమ చేరుకున్న రోజు గుర్తొచ్చింది. ఆ కనుమ లార్కేతో పోలిస్తే మరో 250 మీటర్లు ఎగువన ఉన్నా, ఆ చివరి రోజున నడిచింది 16 కిలోమీటర్లే. ఆ పదహారు కిలోమీటర్లే ఆ రోజు మా అందర్నీ బాగా కష్టపెట్టింది. మరి ఈసారి ఈ లార్కే కనుమ 25 కిలోమీటర్లు నడవమంటోంది… చిన్న విషయం కాదు… అదనపు తొమ్మిది కిలోమీటర్లు నన్ను కలవరపెట్టేలోగానే నన్ను నేను కూడదీసుకుని, బేల భావాలను తరిమివేసాను. ‘దూరం ఎంతా అన్నది కాదు ముఖ్యం – మనం ఎంత నమ్మకంగా ధైర్యంగా ఉన్నాం అన్నదే విజయం సాధించిపెడుతుంది,’ అని ధైర్యం చెప్పుకున్నాను. అనుకూల వాతావరణం, అనుభవజ్ఞులైన గైడ్లు, నాణ్యమైన దుస్తులు-పరికరాలు, ఈసీబీ అన్నపూర్ణలు సాధించిన చరిత్ర, చిన్న పొందికైన బృందం – ఇవి చాలుగదా విజయం చవి చూడటానికి, గమ్యం చేరుకోవడానికి…

నన్ను నేనే ఉత్సాహపరచుకుంటూ నిద్రను ఆహ్వానించాను.

తెలియకుండానే నిద్రపట్టేసింది.


ఉదయం మూడింటికే లేచాను. వెంటనే హెడ్‌లాంప్ తగిలించుకుని బయటకు వెళ్ళాను. చీకటి పలకరించింది. మసక వెన్నెలలో కొండలన్నీ మెరిసీ మెరవకుండా కనిపించాయి. ఆకాశంలోకి చూసాను. ఆకాశం నిండా క్రిక్కిరిసిన నక్షత్రాలు! ఏ క్షణానయినా ఆ తారలన్నీ బరువును ఓపలేక నేలన రాలతాయా అనిపించింది.

అంతా మూడున్నరకు డైనింగ్ రూమ్ చేరాం. అప్పటికే ఆ గది నిండిపోయి కనిపించింది. ఎటు చూసినా కోలాహలం. ఒకరికొకరం బెస్ట్ విషెస్ చెప్పుకున్నాం. వాతావరణ నివేదికలు పంచుకున్నాం. ‘అంతా సవ్యంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాయి ఆ నివేదికలు. తలా కాస్త బక్‌వీట్ జావ తాగి, రెండు మూడు ఉడికించిన గుడ్లు తిని నాలుగు గంటలకు నడక ఆరంభించాం.

సూర్యనుంచి మరోసారి మెసేజీ వచ్చిందనీ, వాతావరణపరంగా అంతా సవ్యంగా ఉందనే నిర్ధారించాడనీ చెప్పాడు బాబు గురుంగ్. అయినా సరిగ్గా ఏడాది క్రితమే చిలీదేశపు పెటగోనియా ప్రాంతంలోని టోరెస్ డెల్ పైనె నేషనల్ పార్క్‌లో మంచు తుఫానులో చిక్కడిపోయిన ఉదంతం జ్ఞాపకమొచ్చింది.. అక్కడి జాన్ గార్డెనర్స్ పాస్ దాటే సమయంలో జరిగిన ఘటన అది. సమాచారవ్యవస్థ సక్రమంగా లేకపోవడంవల్ల మాకు కానీ మా గైడ్‌లకు కానీ రానున్న మంచుతుఫానుగురించి అవగాహన లేకపోయింది. ఆ సంగతి ముందుగా తెలిసి ఉంటే ఆ రోజు ఆ దుస్సాహసానికి పూనుకుని ఉండేవాళ్ళమే కాదు. అష్టకష్టాలు పడి ఏ నష్టమూ జరగకుండా కనుమను దాటామన్నది నిజమే కానీ ఆ ప్రక్రియలో అతి ముఖ్యమైన గుణపాఠం నేర్చుకున్నాం. సరైన వాతావరణసమాచారం లేకుండా ఉన్నతశ్రేణి పర్వత కనుమలను దాటే ప్రయత్నం ఏనాడూ చెయ్యవద్దు అన్న ఆ పాఠం జీవితాంతం మర్చిపోలేనిది. దురదృష్టవశాత్తూ అదే కనుమ దగ్గర 2025 నాటి ఆకురాలుకాలంలో మేము చిక్కడిపోయిన మంచుతుఫానులాంటి తుఫాను బారిన పడి ఐదుగురు ట్రెకర్లు ప్రాణాలు కోల్పోయారట…

ఇలాంటివి జరిగినపుడు ‘అసలిలాంటి రిస్కుతో కూడిన సాహసాలు అవసరమేనా?’ అన్న ప్రశ్న పదేపదే తల ఎత్తుతుంది. ఈ రిస్కనేది జీవితపర్యంతం నీడలా మనల్ని వెన్నంటే ఫ్యాక్టరు. ఆ మాటకొస్తే ట్రెకింగనే కాదు, కారు నడపటంకూడా రిస్కుతో కూడుకున్న వ్యవహారమే. రిస్కును పూర్తిగా పరిహరించుకోవడం దాదాపు అసాధ్యమే కానీ, దాన్ని బాగా తగ్గించుకోవడం అన్నది మన చేతుల్లోని పని. అనుభవమున్న గైడ్లను పెట్టుకోవడం, వారి సలహాలూ సూచనలూ పాటించడం, వాతావరణసూచనలను సేకరించి అనుసరించడం – ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనస్లు ట్రెక్కుల్లాంటివి ఏ ప్రమాదమూ లేకుండా చెయ్యవచ్చు.


ఉదయం నాలుగు గంటలు అంటే చలి గడ్డకట్టించే చీకటి సమయం. రెండు పొరల సాక్స్, కాళ్ళకు వెచ్చదనమిచ్చే పరికరాలు, చేతులకు గ్లవ్స్, క్రాంపాన్లు, గైటర్లు – ఇలా ఎన్ని వేసుకుని బయల్దేరినా మెల్లగా వీస్తోన్న చల్లగాలికి ఒళ్ళంతా గడ్డకట్టేస్తోందా అనిపించసాగింది. చేతివేళ్లు స్పర్శ కోల్పోవడం గమనించాం. కాలివేళ్లు ఆ విషయంలో కాస్తంత మెరుగు. మరో గంటా గంటన్నరలో సూర్యకిరణాలు వచ్చి చలిని జయిస్తాయని తెలుసు. కానీ అప్పటిదాకా ఆ చలిని భరించాలి కదా! భరించక చేసేదేముందీ? పళ్ల బిగువున భరించాం. అనుకున్నట్టే ఉదయం ఆరు అయ్యేసరికి సూర్యోదయమయింది – పరిసరాలు వెచ్చదనం పుంజుకోసాగాయి.


లార్కే దారిలో

లార్కే కనుమ వెనకనున్న హిమశిఖరాలమీదుగా సాగి వచ్చిన సూర్యోదయం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంది. త్వరత్వరగా మారిపోతోన్న వర్ణాల వైభవాన్ని పూర్తిగా ఆస్వాదించే సమయమే దొరకలేదు. ‘ఈ సూర్యోదయం మరికాస్త నింపాదిగా జరిగితే ఎంత బావుణ్ణు,’ అనిపించింది. ముఖ్యంగా ఆ సమయంలో అంతటా పరుచుకున్న సువర్ణకాంతుల్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవనిపించింది.

మరోసారి అప్రయత్నంగా థోరోంగ్ లా పాస్ గుర్తొచ్చింది. ఈ రెండు కనుమలు దాటడానికీ బాగా చీకట్లు ఉన్న ఉదయాన్నే బయల్దేరాం. రోజంతా నడుస్తూనే గడిపాం. రెండూ చారిత్రక వాణిజ్య ప్రాముఖ్యత ఉన్న కనుమలు. టిబెట్-నేపాల్ దేశాల మధ్య వ్యాపారాలు సాగడానికి దోహదం చేసిన కనుమలు. రెండు దేశాల ప్రజలూ అనాదికాలంనుంచీ ఉపయోగించిన ప్రయాణమార్గాలు…

ముందుకు సాగే కొద్దీ మార్గంలో మంచు ఉనికి పెరగసాగింది. నడక ఆరంభించిన మొదట్లో మంచు అన్నది లేకపోయినా క్రమక్రమంగా దారంతా మంచు నిండి కనిపించింది. ఎంత జాగ్రత్తగా నడిచినా కొంతమంది ఆ గడ్డకట్టిన మంచులో కాలు జారి పడనే పడ్డారు. దాంతో అప్పటిదాకా బూట్లకు క్రాంపాన్లు పెట్టుకోని వాళ్ళంతా గబగబా అవి తగిలించుకున్నారు. దాని పుణ్యమా అని మా బృందపు నడక వేగం కాస్తంత మెరుగయింది.


మంచు కోడి

దారిలో మరో నీలాల చిరుసరోవరం కనిపించింది. దానిలో కొంత భాగం గడ్డకట్టి ఉంది. అందరం కాసేపు అక్కడ ఆగి సేదదీర్చుకున్నాం. దూరాన బండల మధ్య తిండి వెతుక్కుంటోన్న మంచుకోళ్ళు కనిపించాయి. మన మామూలు కోడిపెట్టలకన్నా పెద్ద పక్షులివి. బాగా ఎత్తున్న ప్రదేశాలలో మాత్రమే కనిపించే పక్షులవి. రాళ్ళ మధ్య వాటి ఉనికిని కనిపెట్టడం కష్టమే కానీ అవి చేస్తోన్న శబ్దాలు విని మా గైడ్ సమీఛ అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి మాకు చూపించింది.

ఉదయం పదకొండు గంటల సమయంలో అందరం లార్కే కనుమ చేరుకున్నాం. 4460 మీటర్ల ధర్మశాలలో నడక మొదలెట్టి 5160 మీటర్ల లార్కే పాస్‌కు చేరడమంటే మొత్తం 700 మీటర్లు ఎక్కామన్నమాట. అత్యున్నత బిందువు చేరుకున్నాం అని సూచిస్తూ అక్కడ ఒక ప్రార్థనా పతాకాలతో నిండిన రాళ్ళ దిబ్బ కనిపించింది. అలాగే మీరు 5160 మీటర్ల ఎత్తున ఉన్నారు అని ప్రకటించే సైన్ బోర్డ్ కూడా పలకరించింది. విజయోత్సాహం, ఒత్తిడి తొలగిన ఉపశమనం ఒకేసారి మా మనసుల్లో చొరబడ్డాయి. కేకలు, కేరింతలు, కౌగలింతలు, అభినందనలు – ఆ ప్రదేశమంతా కోలాహాలమే కోలాహలం. మా బృందపు సభ్యులనే కాకుండా మాతోపాటు కనుమ చేరిన ఇతర ట్రెకర్లకూ అభినందనలు అందించాం.

360 డిగ్రీల ఏ అడ్డూ లేని అపురూపదృశ్యమది. ఊపిరి మరచిపోయే క్షణాలవి. నాలుగు వేపులా హిమశిఖరాలు, నడుమన నీలాల సరోవరం, ఎటు చూసినా తెల్లగా పరచుకుని ఉన్న మంచు, అక్కడక్కడా పొడుచుకుని వచ్చిన నల్లని రాళ్ళు – నేను చూసిన విశాలహిమాలయదృశ్యాలన్నిటిలోకీ ఎన్నదగినదా లార్కే పాస్ ప్రాంగణం.

బాబు మా అందరికీ అక్కణ్ణించి కనిపిస్తోన్న పర్వతాలను పరిచయం చేసాడు. హిమ్లంగ్ హిమల్, హిమల్ ఛూలి, కాంగ్‌గురు శిఖరాలు స్పష్టంగా కనిపించాయి. దూరాన కనిపిస్తోన్న అన్నపూర్ణ II శిఖరభాగం కూడా చూపించాడు గురుంగ్. అన్నపూర్ణ ట్రెక్‌లో పదేపదే చూసి ఆనందించిన శిఖరం ఆ అన్నపూర్ణ II. మళ్ళా ఎవరో పాత స్నేహితుణ్ణి చూసిన భావన.

లార్కే పాస్ ఇటు బుధిగండకి లోయనూ అటు మర్శియాంగ్దీ లోయనూ అనుసంధించే భూమార్గం. మేమున్న చోటునుంచి మెల్లగా అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియాలోని భీమ్‌తాంగ్ వేపు వాలు నిండిన దారిలో దిగి వెళతామన్న మాట…