రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అష్టవిధనాయికలు

ముత్యాల సరాలలో

రచన: మల్లిక మొసలికంటి
ఆగస్ట్ 2025

స్వాధీనపతిక

లలన మీగడ బుగ్గలదుముచు
వలపుతో నెలవంక నుదుటన
తిలక మలదిన ప్రియుని ప్రేమకు
మురిసెనే! స్వాధీనపతిక

చంద్రకాంతులు ప్రతిఫలించే
సౌధమున తన ప్రియుడు ముదముగ
ముద్దు పదముల దిద్ద లత్తుక
కులికెనే! స్వాధీనపతిక.

అనుగు చెలువుని అన్యకాంతల
కందనంతటి దవులనుంచుచు
వలపు సేవలనంది తనరెడి
గడుసరే! స్వాధీనపతిక.

వాసక సజ్జిక

చెలియరో! ప్రియవిభుడు చేరెడి
తరుణమాయెను తడవు సేయక
కురులు దిద్దుము విరులు ముడువగ
అనెను వాసకసజ్జిక

వెలది అందము పరిమళించగ
అలది గంధపు పూత మేనికి
అలరువిల్తుని సతిని మించగ
మెరిసె వాసకసజ్జిక

పడకటింటిని మరుని విడిదిగ
సరిది చెంపకు చేయి చేరిచి
కలల పందిరి లోన పతికై
వేచె వాసకసజ్జిక

విరహోత్కంఠిత

సందె వాలెను, అందగాడిని
తనను వలచిన వన్నెకానిని
చేర రమ్మని, జాడ లేదని!
వెదకె విరహోత్కంఠిత

జాము రాతిరి గడిచిపోయెను
జాజి పూవులు వెక్కిరించెను
రాతి గంధము ఇగిరిపోయెను
కుందె విరహోత్కంఠిత

వెలదికన్నులు వేడి బాష్పపు
జలదముల తలపింప దిగులుగ
తనువు గడపకు ధారపోయుచు
వేచె విరహోత్కంఠిత

విప్రలబ్ధ

మూడు జాములు దాటిపోయెను
ముగుద హృదయము సెగలు గ్రక్కెను
విరహబాధకు స్రుక్కి సోలిన
విప్రలబ్ధను చూడరే!

మోసులెత్తిన పొలతి ప్రేమను
మోసగించిన ప్రియునితలచగ
వాడిపోయిన పూలసరమౌ
విప్రలబ్ధను చూడరే!

ఆశలన్నీ ఆవిరాయెను
రోషనాగము వోలె కనలుచు
భూషలన్నీ విసరికొట్టిన
విప్రలబ్ధను చూడరే!

ఖండిత

మాపు గడిచెను రేయి గడిచెను
ముచ్చు రీతిగ వచ్చితివి నీ
ఇచ్చకములను నమ్మబోనని
తేల్చి చెప్పెను ఖండిత

గోటి గుర్తులు కావికన్నులు
చాటు కథలను చాటిచెప్పెను
మాటలేటికి మరలిపొమ్మని
కేరడించెను ఖండిత

మేని గంధము మారిపోయెను
ఉత్తరీయమునంటె తిలకము
దేని పొందున అలసినావని
పతిని దూరెను ఖండిత

కలహాంతరిత

వేచి విసిగిన భగ్నహృదయము
భగ్గుమనెను నిరాశ వేచగ
ప్రాణవల్లభు గాంచి కోమలి
మారె కలహాంతరితగా

తననుమరచిన తామసమ్మున
అనునయించెడి విభుని సముఖము
తాళజాలక వెడలిపొమ్మని
తరిమె కలహాంతరితయై

వెర్రికోపపు చేటు నొంటిగ
విభుని తలచుచు విధిని దూరుచు
ఎదురుతెన్నులె ఎదర బ్రతుకై
కుమిలె కలహాంతరితయై

ప్రోషితభర్తృక

దూరసీమల కరిగె పతి, దరి
చేరుటెపుడని క్షణము యుగమై
భారముగ బ్రతుకీడ్చుచున్నది
పొలతి ప్రోషితభర్తృక

చక్కనొత్తదు చెదరు కురులను
చెలుల సాంత్వన చెవులకెక్కదు
చంద్రునొంటిగ చూడనొల్లదు
తలరి ప్రోషితభర్తృక

మరల మురిపెపు గడియలెపుడని
వేయి కన్నుల ఎదురు తెన్నుల
విభుని ప్రేముడి వివరముల జడి
తడిసె ప్రోషితభర్తృక

రాముడట్టుల రహిని గూర్చగ
కృష్ణుడై మురిపాలు తీర్చగ
మరల పతి నన్నేలుటెపుడని
వగచె ప్రోషితభర్త్రుక

అభిసారిక

పొట్ట విచ్చిన పుచ్చపూలను
రివ్వు రివ్వున రువ్వినట్టుగ
నవ్వుజల్లులు కురియు వెన్నెల
నీడలో అభిసారిక!

పడగలెత్తిన అలలనురగలు
చెడుగుడాడుచు విరుగు వంపుల
పాలవెన్నెల ప్రతిఫలించే
తీరమున అభిసారిక!

నిండుచంద్రుని కోరి సాయము
ఒంటిగా పూపొదల మాటున
ప్రియుని రాకకు వేయికన్నుల
వేచినది అభిసారిక.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అష్టవిధనాయికలు

ఇటువంటివే…

  1. ఈ-మెయిలు
  2. అంతరం
  3. సులువైన పని
  4. కొన్ని జెన్ పద్యాలు – 1
  5. శరీరమిదం కామ్య సాధనం

ఆగస్ట్ 2025 సంచికలో ...

  • అదే ఆకాశం — ఒక సమీక్ష
  • అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 2
  • అభిప్రాయాలు అనుమానాలు
  • అష్టవిధనాయికలు
  • అస్తిత్వవాద సాహిత్యం: 3ఆ. నీచ
  • ఆ ఎండని ఏడో చేపే మైరావుడు!
  • ఆగస్ట్ 2025
  • ఆలూరి బైరాగి ప్రత్యేక సంచికకు రచనల ఆహ్వానం
  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పురస్కారం, 2025
  • ఎంత కష్టం
  • కంప్యూటర్ చిప్ కథ – 5: గల్వాని – వోల్టా పోట్లాటలో పుట్టిన బ్యాటరీ
  • కొన్ని జెన్ పద్యాలు – 1
  • గెలుపు
  • ఛందస్సులో గణితాంశములు – 7 – ఆవృత్త వృత్తములు
  • జీవాజీవ భావం
  • టాస్
  • తథాస్తు
  • తెలుగువారి సాంస్కృతిక విస్మృతి
  • తోటలో
  • నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి
  • పోతన భాగవతంలో దృశ్యీకరణం – 1
  • యూట్యూబ్‍లో ఈమాట: జూలై 2025
  • శరీరమిదం కామ్య సాధనం
  • సరిహద్దులు కలవరపరచని కవి
  • సీసపు ముద్ద
  • సులువైన పని
  • ‘తెల్ల ఏనుగు’ అనువాద నవల గురించి రచయిత జయమోహన్‌తో సంభాషణ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శరీరమిదం కామ్య సాధనం
కొన్ని జెన్ పద్యాలు – 1

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.