ఆరోజు నాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు — సాదా బట్టల్లో.
“నీతో చిన్న పనుంది” అన్నాడు.
“ఎవర్నువ్వు?”
“దేవుడిని. నీతో చిన్న పనుంది.”
“ఓహో… నేను అమితాబ్ బచ్చన్‌ని! నాకు నీతో పనేం లేదు. పోయి ఇంకెక్కడైనా పని చూసుకో.”
చిన్నగా నవ్వి, క్షణంలో మా ఇంట్లో గోడకి వేలాడే క్యాలెండర్‌లోని రూపంగా మారిపోయాడు దేవుడు.
తెల్లబోయాను. తేరుకుని, “వరం కోరుకోమనాల్సింది పోయి, పనుందంటావేం?” చేతులు ఆటోమేటిగ్గా జోడించాను.
“నువ్వు చెయ్యగలిగే పనే.”
“చెప్పు… చెప్పండి.”
“నువ్వు నన్ను వెతకాలి.”
“ఎదురుగా ఉన్నప్పుడు, ఇంకా వెతకడమేంటి?”
“ఆ లాజిక్ నాకూ తెలుసు. నేను వెతకమంటున్నది – నన్ను ‘నీ’ ప్రపంచంలో వెతికి పట్టుకోమని.”
“కొత్తగా ఉందే. ఎవరెవరో ఎన్నో రకాలుగా అంతటా మీరే నిండి ఉంటారని చెప్పారు. మళ్ళీ వెతకమంటారా?”
“మరి నన్నిప్పుడు గుర్తుపట్టలేకపోయావేం?”
“ద్యావుడ! విగ్రహాలకి బంగారపు కిరీటాలూ వగైరా ఉంటాయి. ఇలా ఇంత మామూలుగా కనిపిస్తే ఎలా గుర్తుపడతాం?”
“… జంతువులకంటే మనుషులకే ఎక్కువ జ్ఞానం ఇచ్చాను. కానీ వాళ్కేళ ఇప్పుడు నన్ను చూసే శక్తి నశించింది!” బాధవల్లనేమో, దేవుడి గొంతు బరువుగా అనిపించింది.
“అంటే అదీ… మీరింత సాదాసీదాగా ప్రత్యక్షమవుతారనుకోలేంగా…”
“పాయింటుకొద్దాం. నీకో శక్తినిస్తాను. దాంతో ఎక్కడికైనా క్షణంలో వెళ్ళగలవు. నన్ను వెతకడానికి.”
“ఈ శక్తి ఎంతకాలం ఉంటుంది?”
“నెల. నన్ను పట్టుకోగలిగితే నీకు మళ్ళీ జన్మ ఉండదు.”
“అంత పెద్ద గిఫ్టు వాడుకోలేనేమోనండి. ఈ జన్మలోనే పనికొచ్చే వరమేదైనా ఇవ్వొచ్చుగా?”
“సరే! నూట ఇరవై యేళ్ళ ఆయుర్దాయం ఇస్తాను.”
“ఇది బాగుంది. అయితే ఎప్పటికీ మిడ్-థర్టీస్‌లో ఉంచండి!”
“జనరల్‌గా ఎవరికీ ఇంత చనువివ్వను. ఇంతసేపు వాదించనివ్వను. నిన్ను ఎంచుకున్నానుగాబట్టే ఇంత స్వేచ్ఛ ఇస్తున్నాను.”
“సంతోషం. ఇంతకీ మిమ్మల్ని వెతికి ఏం చేయాలి?”
“ముందు వెతికి పట్టుకో. తర్వాత చెప్తాను.”
“షరతులేమైనా?” యాడ్ల చివర యమస్పీడుగా వినిపించేది గుర్తొచ్చింది.
“ఒకటే — నాకోసం స్వయంగా నువ్వే వెతకాలి. ఎవరినీ అడగకుండా. నువ్వే కళ్ళారా చూసి, విని, అవసరమైతే తాకి నన్ను నిర్ధారించుకోవాలి.”
“ఎప్పుడు మొదలెట్టాలి?”
“ఈ క్షణమే” అంటూ నా చేతిలో టీవీ రిమోట్ లాంటి ఓ వస్తువు పెట్టాడు. “వెళ్ళదలచిన చోటి పేరును తల్చుకుని ఈ మీట నొక్కు.”
“దేవుడిని చూడాలని ఉందా? ఆ చిరునామా మా దగ్గరుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి ఇప్పుడే ఫోన్ చెయ్యండి. మీ దేవుడి ఆశీస్సులని పొందండి”.
“విజ్ఞానానికి అందని ఒడుపు మా సొంతం. మన దేవుడు మొదటిసారి ప్రత్యక్షమైంది మా ఆశ్రమంలోనే. రండి, తనివిదీరా దర్శనం చేసుకోండి…”
“పూజలు అక్కర్లేదు. వ్రతాలు, ఉపవాసాలు అవసరం లేదు. పవిత్ర హిమాలయాలనుంచి సేకరించిన దైవమూలికలతో తయారైన మా ఉత్పత్తిని దిండు క్రింద పెట్టుకుని పడుకుంటే చాలు. పదకొండో రోజున మీకు దేవుడు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. వెంటనే సంప్రదించండి… నెంబర్…”
“దేవుడిని వెతుకుతున్నారా? వద్దు. మేం చెప్పే సమయానికి చెప్పే దిక్కుకి తిరిగి కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని స్మరిస్తూ కూర్చోండి. దైవం మీ ముందు నిలవడం తథ్యం. ఎంతోమందికి ఆ అదృష్టం మా ద్వారా దక్కింది. వివరాలకోసం ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి”.
“ప్రతి రోజూ వేలాదిమంది మన చానెల్ ద్వారా స్వామివారి ‘లైవ్’ దర్శనాన్ని పొందుతున్నారు. మీరూ సబ్‌స్క్రైబ్ చేయండి – పుణ్యం గ్యారంటీ!”
ప్రతి మాధ్యమంలోనూ ఇలాంటి సందేశాలే.
“స్వామీ…”
“…”
“స్వామీ… ఎక్కడున్నారు… వెంటనే దర్శనం ఇవ్వండి స్వామీ…”
మళ్ళీ ఎలుగెత్తాను. మరింత నిస్సహాయంగా.
“చెప్పు…”
“అమ్మయ్య! కరుణించారా… ఓడిపోయాను స్వామీ. మిమ్మల్ని వెదకలేకపోయాను. నన్ను శపించకండి…”
“పాయింటుకి రా.”
“అదే స్వామీ… మీరెక్కడ?”
“నీకిచ్చిన పనే అది”.
“స్వామీ, చాలా క్షేత్రాల్లో వెతికాను. ఎన్నో ఆశ్రమాల్లో మరెన్నో పూజా పునస్కారాల్లో పాల్గొన్నాను. పవిత్రమన్న ప్రతి ప్రవాహంలోనూ మునిగాను. మీకోసం చూడని కోణం లేదు. తొక్కని మార్గం లేదు. ఎక్కని శిఖరం లేదు. దిగని లోతు లేదు.”
క్షణం నిశ్శబ్దం. నాకు యుగంలా తోచింది.
“చూడూ, నేను నిన్నే ఎంచుకున్నది ఎందుకో ఆలోచించు.”
“…”
“మీరంతా బొమ్మల్లోనూ, మీరు తెచ్చిపెట్టుకున్న సమస్యలకి మీరే సృష్టించుకున్న పరిష్కారాల్లోనూ నన్ను వెతుక్కుంటున్నారు. అపార్థం చేసుకుంటున్నారు…”
“స్వామీ…”
“అసలు నేనంటూ ఉన్నానని మీకు నికరంగా నిక్కచ్చిగా తెలుసా?”
ఇదేం ప్రశ్న?
“నేనున్నానో లేనో నాకు తెలుసు. మీకు ఎప్పుడైనా కనపడ్డానా? ఉన్నానని చెప్పానా? ఎక్కడుంటానో ఏం చేస్తుంటానో చెప్పానా?”
“…”
“చెప్పలేవు. చూడు, నన్ను చూపిస్తామంటూ ఎన్నో వాగ్దానాలు, ప్రకటనలు వచ్చాయి. ఎన్నో కాసులమూటలు చేతులు మారేయి. ఎందరో తమ నమ్మకాల కేంద్రాలని మార్చుకున్నారు… నేనో వ్యాపారవస్తువునయాను, ఎన్నెన్నో రూపాల్లో, పద్ధతుల్లో…”
“…”
“నేనున్నానన్న నమ్మకాన్ని అమ్మి, సొమ్ము చేసుకోవడం పెరిగిపోయింది. అందుకే నేను కనపడంది… నిజంగా నన్ను చూడాలీ అంటే…”
మళ్ళీ చెవులు రిక్కించాను.
“…”
“చెప్పు స్వామీ…”
“…”
“చెప్పండి స్వామీ… ఉన్నారా… ?”
“చూడూ….” క్షణం ఆగాడు దేవుడు. “ఓటమి తప్పదని తెలుస్తున్నా నిజాయితీగా ప్రయత్నించావే తప్ప, నేను నీకిచ్చిన శక్తిని దుర్వినియోగం చెయ్యలేదు నువ్వు. అందుకే, నీకు సంపూర్ణాయుర్దాయమే కాదు, నన్ను చూసిన ఒకే ఒక్క మనిషిగా చరిత్రలో నిలిచిపోయే వరం కూడా ఇస్తున్నాను.”
“…”
“మాట్లాడవేం?”
“…వద్దులెండి స్వామీ.”
“ఏం?”
“…”
“చెప్పు పరవాలేదు”.
“…అమ్ముడుపోవడం ఇష్టం లేదు స్వామీ…”