2-2. సంయమనం ఈమాటకేనా?

ఆఁ, ఏమంటున్నానూ… కడుపుమంటతో రగిలినంత మాత్రాన – దీని అర్థం వారు ఏం చేసినా సహించమని కాదు. దళితులు, ముస్లిములు, స్త్రీలు అందరికందరూ స్వచ్ఛస్వభావులు, ఆదర్శమూర్తులేనా? వారిలో క్రూరులు, మోసగాళ్ళు, నేరస్తులు ఉండరా? ఈర్ష్యాసూయలు, వివక్ష వారు మాత్రం చూపరా? అలాంటివారిని, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా విమర్శించకూడదా? బుద్ధిమాంద్యం కాకుంటే మానవస్వభావానికి, మంచికైనా చెడుకైనా, కులాలు మతాలు భాష ప్రాంతాలు దేశాలు వంటి నియమాల గోడలు ఉంటాయా? అందరిలానే తప్పు చేయడం, చట్టం వారిని పట్టుకున్నప్పుడో, సమాజం వారిని వేలెత్తి చూపినప్పుడో, మేము నిమ్న/దళిత/ముస్లిం/స్త్రీ కాబట్టే మమ్మల్ని ఇలా… అని ‘సమయానికి తగు కార్డు’ వాడిన రాజకీయ నాయకులు, ఉన్నత ప్రభుత్వోద్యోగులు, క్రీడాకారులు, రచయితలు, నటులు ఎందరు లేరు వీరిలో? వీరిని విమర్శించినంత ‘మాత్రాన’ అగ్రవర్ణ, మతదురహంకారులు అని ముద్ర వేసేయచ్చా ఎవరినైనా? (నేను ఇక్కడ కొద్దిమంది గురించే అంటున్నాను. సందర్భం, పరిమితి గుర్తు పెట్టుకోవాలి. ఇలా సంజాయిషీ ఇవ్వవలసి రావడం చిరాకుగా ఉంది. కాని, చెప్పానుగా మనవారి రీడింగు స్కిల్సు గురించి!)

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకా? కొద్దికాలం క్రితం ఒక వ్యక్తి ఏదో దారుణమైన మెజారిటీ మార్కు నేరం చేశాడు. సాధారణంగా ఇలా జరిగినప్పుడు కలకలం రేగుతుంది. అందరూ ఆ నేరస్తుణ్ణి నిందిస్తారు. సహజం. వివరాలు గుర్తు లేకున్నా నాకు స్పష్టంగా గుర్తు ఉన్నది, అభ్యుదయవాదుల మౌనం. ఎ వెరీ మ్యూటెడ్ రెస్పాన్స్, ఇఫ్ ఎనీ. ఎందుకంటే ఆ నేరస్తుడు ముస్లిమ్. ఈ మౌనం వెనుక ఉన్న కారణం? నేరస్తుడు మైనారిటీ కాబట్టి, మనమూ విమర్శిస్తే మెజారిటీని సమర్ధించినట్టు ఉంటుంది కాబట్టి – మౌనం. వ్యూహాత్మక మౌనం. ఇది ప్రతివివక్ష కాదా? నిష్పక్షపాత వైఖరి, తప్పు ఎవరు చేసినా తప్పే వంటి నియమాలు లేవా? ఇలా శత్రువుకు మేలు చేస్తుందన్న భావనతో ఒక నేరాన్ని సమర్ధించడంలో, లేదా దానిని చూసీ చూడనట్టు ఉండటంలో ఏ కర్ణమితృత్వం, ఏ నైతికత ఉంది? ప్రత్యేకించి అదే నైతికతను ఇతరులనుండి ఆశిస్తున్నపుడు. ముందొకసారి నేను మైనారిటీలకు కొంత అదనపు జాగా ఇవ్వాలి అన్నాను. ఈ మౌనం ఆ జాగాలో భాగం కాదు.

ఒక కుర్రవాడిని ముస్లిమ్ అన్న అనుమానంతో హిందూత్వమృగాలు దారుణంగా చంపినప్పుడు హిందూత్వవాదులనుంచి మౌనం గమనించారా? ఎందుకూ? నేరం చేసింది హిందువు కాబట్టి. కారణం వారి ప్రయోజనాలకు తగినది కాబట్టి. రుష్దీ మీద దాడి జరిగినప్పుడు ఈ అభ్యుదయవాదుల మౌనం గమనించారా? ఎందుకూ? ఆ దాడి చేసింది ముస్లిమ్ కాబట్టి. అంతే కాదు, రుష్దీ ఆ మైనారిటీల మనోభావాలు గాయపరిచాడు కూడా కాబట్టి. (రుష్దీని సమర్ధిస్తే…) నిదానంగా ఒకటీ ఒకటీ కలుపుకుంటూ ఆలోచించండి.

ఆహ్! మౌనం. ఈమాటపై కాషాయవాదుల దాడి జరిగినప్పుడు, ఆ రచయితకు కాని, ఈమాటకు కాని అరలనుంచి, అరసబ్బులనుంచి, వారి నాయకులనుంచి వచ్చిన వత్తాసు చాలా తక్కువ సోషల్ మీడియాలోను, ఇతరత్రానూ. ఎ వెరీ మెజర్‌డ్ అండ్ మ్యూటెడ్ రెస్పాన్స్, ఇఫ్ ఎనీ. నాకు ఎందుకో అప్పుడు అర్థం కాలేదు. కొంతకాలానికి తెలిసింది. ఈ మౌనానికి కారణం రచ్చ జరుగుతున్నది ఈమాటకు, హిందూత్వవాదులకూ మధ్య కావడం. (టి. కృష్ణ వివాదంపై ఏప్రిల్ 2024 ముందుమాటలో నేను వ్రాసిన ఈ అభ్యుదయవాదుల ధోరణి చూడండి.) ఇది ‘పిక్ యువర్ బ్యాటిల్స్’ వ్యూహం కాదు. వ్యూహాత్మక మౌనం పేరున ఇది తమను తాము మోసం చేసుకోవడం. ఈ వ్యూహాలు, మౌనాలు రాజకీయాలలో కదా ఉండాల్సింది, సాహిత్యంలో ఎందుకున్నాయి?

రచయిత ఎవరయినా, ఎటువంటి వారయినా సాటి రచయిత. ఈమాట ఒక పత్రిక. కేవలం ఆ ఒక్క కారణం సరిపోవాలి రచయితలకి, ఇతర పత్రికలకీ తోడు నిలవడానికి, వత్తాసు పలకడానికి. ఆ ఒక్క కారణం కేవలం సాహిత్యస్వేచ్ఛ, భావస్వాతంత్ర్యం కావాలి. కాని, కాలేదు. అంటే ఏమని? వోల్తేర్‍కు ఆపాదించిన ‘ఐ డిసగ్రీ విత్ యువర్…’ కోట్ అందరికీ తెలుసు. మన తెలుగు అరలకు ఇది తెలియకనా? కాదు. ఇదీ వీరి సాహిత్య నిబద్ధత. ఇదీ వీరి అభ్యుదయ ధోరణి. ఊఁ?

అవునూ, నేను ఖదీర్‍బాబుగారికి సమాధానం ఇచ్చాక అప్పుడు ఫేస్‍బుక్‌లో కూడా ఎంత చిక్కటి మౌనం పేరుకుందో గమనించారా? ఎందుకూ? ఒక రాయి వేయడం, లేచి అరవడం అయిపోయినందుకు. నవంబర్ 2020 ముందుమాట అప్పటికెవరూ చదవనందుకు. లేకుంటే నన్ను విమర్శిస్తూ ఒక మంచి వ్యాసం$ రావాల్సింది కదూ? ఈసారయినా వస్తుందా? (నాది అత్యాశే. తెలుసు.)


ఇండియాలో బ్రతికిన రోజుల్లో ఒక జనసామాన్యతత్త్వం (ఎ సోషియలాజికల్ బిహేవియర్) గమనించాను. ట్రాఫిక్ ఆక్సిడెంట్ అయినప్పుడు చుట్టూ గుమిగూడిన వారి సానుభూతి వాహనం సైజుమీద ఆధారపడి ఉంటుంది. చిన్న వాహనదారుపట్లే వత్తాసు సహజంగా వచ్చేస్తుంది. నడక-సైకిల్, సైకిల్-మోపెడ్, మోపెడ్-మోటర్ సైకిల్, మోటర్ సైకిల్-కార్… ఒక స్థాయి దాకా ఏది చిన్నదైతే, అది పీడిత వర్గానిది. అందుకని అది అయ్యో పాపం. నిజంతో సంబంధం లేకుండా పెద్దవాడిది ఎప్పుడూ తప్పే. సామ్యవాదపు నీడ నుంచి స్త్రీ, దళిత, నిమ్న, మైనారిటీ వాదాలు విడిపోయి దేనికవే అయిపోయినాక ఇప్పుడు ఉన్నది రైట్-నాన్‍రైట్ (కుడి-కుడి కానిది అని. తప్పు-తప్పుకానిది అని కాదు) మాత్రమే. స్పష్టమైన ఆశయాలు, ప్రణాళికలు, ఆచరణలూ లెఫ్ట్‌కు ఉన్నంత కూడా ఈ నాన్-రైట్‍ అరసబ్బులకు లేవు. ఇప్పుడు ఉన్న ఒకే ఒక పెద్దవాహనం రైట్‍. దానిని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉండాలి, ఒక అనియంత్రిత చర్య లాగా (నీ జెర్క్) అన్న ఒక తెలివిడి తప్ప. వీరికి సమాజం ఎలా ఉండాలో, దానినుంచి ఏం ఆశించాలో, అది ఎలా సాధ్యమో కలలు తప్ప వాస్తవాలు తెలియవు. తెలుసుకోరు.

వీరిలో చాలామందికి నిజంగానే సామాజిక సమస్యలపట్ల ఆందోళన, వివక్ష పట్ల కోపం, వ్యతిరేకత ఉంటాయి. వీరి మనసులు, ఆలోచనలు మంచివి. కాని, వీరు ఇలానే ప్రవర్తించాలి, ఇలానే మాట్లాడాలి అని కండిషన్ అయిపోయారు. అన్యాయాన్ని అరికట్టాలన్న ఆవేశంతో నాన్-రైట్ అని వీరు నమ్మినవారు ఏం చేసినా సమర్ధించేస్తారు గుడ్డిగా. కాని, నిజాన్ని చూపితే వీరిలో చాలామంది చూడగలరు. (రంగు కళ్ళద్దాల గంతలు కట్టుకున్న రకం వేరే. ఆ గంతలు కట్టుకున్న వారికి తప్పు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తుంది. గుడ్డిగా ఒకే పిడివాదం ప్రకటిస్తుంటారు, నిజం ఎదురుగా ఎలా కనిపించినా వీరికి పట్టదు. ప్లేటో కథలో గుహలో నీడలు చూసే పాత్రలు వీరే.)

గతం, వర్తమానం అంతా రక్తచరిత్రతో నిండిన మధ్యప్రాచ్య ఆసియా దేశాల రాజకీయాలు ఎంతో క్లిష్టమైనవి. అక్కడ మంచీ చెడూ అన్నిసార్లూ విడదీయలేకుండా ఉంటాయి. నేను ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరికి బద్ధ వ్యతిరేకిని. ప్రత్యేకించి పాలస్తీనా ఆక్రమణదారుల దౌర్జన్యాన్ని నేను ఏవిధంగానూ సమర్ధించను. అలా అని, నేను హమాస్‌ను సమర్ధించేంత దూరం పోను. ఇజ్రాయెల్ ఎంత దారుణానికి వొడికట్టినా, హమాస్ కిరాతకాలూ తక్కువేం కాదు.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకా? ఇజ్రాయెల్‍ వైఖరి పట్ల కోపంతో హమాస్‍ను సమర్ధించేవారికి (పాలస్తీనాను సమర్ధించడం కాదిది. తేడా ఉంది.) ఇంకెలా తమ కోపాన్ని ప్రకటించాలో తెలియదు. అందుకని హమాస్ ఆశయం పాలస్తీనా సంక్షేమం అనుకుంటారు, అలా తమను తాము నమ్మించుకుంటారు. నిజం ఏమిటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంతో, శాంతిభద్రతలతో సుస్థిరంగా ఉండే పాలస్తీనా ఈ రెంటి ప్రయోజనాలకు వ్యతిరేకమే. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ కొరకు అంటుంది, అది కనిపించే శత్రువు. హమాస్ పాలస్తీనా కొరకు అంటుంది, ఇది కనిపించని శత్రువు. పాలస్తీనా ప్రజలు చచ్చినా బ్రతికినా ఈ రెంటికీ పట్టదు. ఈ నిజం హమాస్‍ను సమర్ధించే మన అరసబ్బులకు పట్టదు. వీరికి మహమ్మద్ బక్ష్‌ను గుర్తు చేయాలనుంటుంది నాకు: దుష్‍మన్ మరే తె ఖుషీన కరియే, సజనా వీ మర్ జానా వే… దే గర్‍దే దిన్ గయా మొహమ్మద్ ఓరుక్ నూ డుబ్ జానా వే…

అర్థమవుతోందా?


ఈమధ్య టి.వి.లో ఏదో పాత సిట్‌కామ్ నుంచి ఒక డయలాగ్ వినపడింది.

“Hey! I never did anything wrong. I was always good to others.”

“Oh, George! You are a middle aged straight white man. You must’ve done something wrong. Only, you don’t know it yet!”

ఈమాట అమెరికానుంచి వస్తున్న పత్రిక. కుడియెడమల ఏ ఒక్కరి వాదాలకు/ఇష్టాయిష్టాలకూ లొంగని పత్రిక. ఎవరేది వ్రాసినా కళ్ళకద్దుకొని ప్రచురించని పత్రిక. సమాజం-సాహిత్యం ఈ రెంటి గురించి, ఈ రెంటి మధ్య సంబంధం గురించి, భ్రమలు లేని/పెట్టుకోని పత్రిక, వీటిపట్ల స్పష్టమైన అభిప్రాయాలున్న పత్రిక. ఇక నడిపేవారెవరో మీకు చెప్పక్కర్లేదు. ఇలా అ.సా.వాదులకు కానీయండి, ఇతరవాదులకు కానీయండి, మతవాదులకు కానీయండి, ఇంకే వకాలత్వాదులకైనా కానీయండి, ఈమాటపై ఒక ముద్రవేసి, వేలెత్తి వేరుగా చూపటానికి* అన్ని కారణాలూ ఉన్నాయి. అజాతమిత్రుత్వం అని ఒక పదం వాడాను మునుపెక్కడో. కాని, ఒక సాహిత్య పత్రికగా, ఇది మన అందరి పత్రికగా చూడటానికి ఒక్క కారణం కూడా లేదు. సాహిత్యాన్ని అలా అందరిదిగా చూడవలసిన అవసరం వీరెవరికీ లేదు. అది వీరి ప్రయోజనాలకు వ్యతిరేకం. సాహిత్యం వీరి హక్కుభుక్తం. ప్రతివివక్ష అన్న పదం ఒకటి వాడేను. గుర్తుందా? అది పట్టుకొని సాగతీయను లేండి.

[*మీరు చెప్తే నమ్మరు, ఈమాట అనే ఒక పత్రిక ఉంది అని కనీసం గుర్తించడానికి కూడా ఇష్టపడని అ.సా.వాద రచయితలున్నారు, తెలుసా? ప్రపంచపు ఎల్లలు చెరిగిపోయాక మా ఉనికి ఇక గుర్తించక తప్పలేదు వీరిలో కొందరికి. మరికొందరు ఇప్పటికీ, ఈ రోజుకీ, అవసరమైతే నాలుక కోసుకుంటారు తప్ప కాని దానిని ఈమాట అనిమాత్రం పలకనియ్యరు. మొదట్లో చెప్పాను కదా కొందరు ఈమాటకు ఎందుకు వ్రాయరో. అది అర్థం చేసుకోవచ్చు. కాని, ఇంత ద్వేషం ఎందుకా అని నాకూ బోలెడంత ఆశ్చర్యం.]

ఇది తమ సల్తనత్ కోసం వీరు చేసే యుద్ధం. మాగురించి మాట్లాడటానికి మీరెవరు? ఇది వీరి ఉడుకుమోతు ధోరణి. ఇది సాహిత్యం గురించి కాదు. అభ్యుదయం, ఆదర్శం గురించి అసలే కాదు. ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందా. ‘విధేయత తప్ప విమర్శ అవసరం లేని మా జాగా ఇది. మీరెవరు అడుగు పెట్టడానికి?’ ఈమాట ఏమాటన్నా వీరిలా ఉడికిపోడానికి వేరే కారణం ఏమైనా ఉందా? చెప్పండి మీకు తెలిస్తే. ఇలా ఉడికిపోయేవారిని చూస్తే మరికాస్త గిల్లాలనిపిస్తుంది కదూ. ఆలోచిస్తాను. కొత్త సంవత్సరం రాబోతోంది కదా. ఒక వెటకారపు ముందుమాట కోసం ఆలోచిస్తాను. మహమ్మద్ మహేశ్ ఖదీర్‌బాబుగారిని కూడా కలుపుకుంటూ. (చూశారా, నాకు ఇది ఎంత సులువో!) ఈ బుర్రలకు అర్థం కాదు కాని, ఇలా కలిసి ఎంతో కాసేపు ఒకరినొకరు గిల్లుకోవచ్చు, నవ్వుకోవచ్చు, ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, కథలు వ్యాసాలూ బోలెడు పండించుకోవచ్చు – ‘ఇది మనం, ఇది మన సాహిత్యం’ అన్న స్పృహ ఉంటే ఎన్నో సాధ్యం, ఆత్మవిమర్శతో సహా, ఈ ‘మీరెవరు?’తో సాధ్యం కానివి.


మొదలు పెట్టిన కొత్తల్లో ఈమాటను, అప్పటి టెక్నాలజీ పరిమితుల వల్ల, కొన్నివందలమంది చదివేవారు, అందులో 90% ప్రవాసులు. షుమారు గత పది పదిహేనేళ్ళుగా ఈమాటను ప్రతినెలా కొన్నివేలమంది చదువుతున్నారు (వెబ్ స్టాట్స్ ప్రకారం). ఇందులో 90% భారతదేశంలో నివసిస్తున్నవారు. ఈమాటకు ఎక్కువగా వ్రాస్తున్నవారూ అక్కడివారే. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం అప్పటిది కాదు. మీరు-మేము, ప్రవాసులు-స్థానికులు వంటి బేధం సమసిపోయి, ఆ విభజనలకు విలువపోయి సంవత్సరాలయింది. అవే పట్టుకుని ఇంకా వేలాడేవాళ్ళని ఏమనాలి? ఇప్పుడు (లిటరల్లీ స్పీకింగ్) హైదరాబాదుకు, విజయవాడకూ మధ్య ఉన్న దూరం కంటే వాటికీ అమెరికాకూ ఉన్న దూరం చాలా తక్కువ. ఈమాట ఎన్.ఆర్.ఐ. పత్రిక అని కేవలం పేరుకే. మనం ఉన్నది నిజంగా ఎల్లలు లేని ప్రపంచమే. ‘మీరెవరు?’కు కాలం చెల్లి సంవత్సరాలయింది. ఇప్పుడు అ.తె.వా.లు తె.తె.వా.లూ లేరు. ప్రపంచమంతా ఉన్నది ఒకటే ‘తెలుగుతెగులు’.

అందుకే, ఈమాటలో అక్కిరాజుగారు వ్రాసిన అభిప్రాయం నన్ను ఈరకంగా నిరాశ పరిచింది. ఆయన ఇంకా ఆ సాహిత్య కబ్జా రోజులనుండి బైటకు రాలేదు. “వెలివేతలూ, బ్రాహ్మణులూ, హిందూ కారికేచర్ విలన్లూ… ఇక్కడున్న పరిస్థితుల్లో there are very many connotations and baggage that cannot be avoided.” అన్న రాజకీయ వాక్యాలు కొద్దిగా తప్ప (రోలాన్ బార్త్ ఎక్కడ ఉన్నా స్టేజి మీదకు రావలెను!) – సందర్భోచితమూ అవసరమూ ఐన విమర్శ, ప్రస్తావన ఇంకేమీ కనపడలేదు వారి అభిప్రాయంలో. గోడను, గోడమీద బురద జల్లేవారిని ఇరుపక్షాలు అనలేం. అందరినీ అన్నిసార్లూ మంచి చేసుకుంటూనే బ్రతకలేం. ఆ అభిప్రాయం వారికోసం వ్రాసుకున్నది కాని, నిక్కచ్చిగా ప్రస్తుత ఉదంతాన్ని, వాతావరణాన్ని విశ్లేషిస్తున్నది కాదు. రెండు ఖండాల మధ్య వారధిగా వారి శ్రమ గురించి చెప్పుకున్న ఆ అభిప్రాయం నుంచి ఎలానూ వెంకట్‍గారి అనుచిత స్పందన పట్ల ఏ విమర్శనూ ఆశించలేదు కాబట్టి, నన్ను ఆ అభిప్రాయం ఆరకంగా నిరాశ పరచలేదు.


తప్పు ఎవరు చేసినా తప్పే అనడం నా తప్పే కావచ్చు. మనలో ఎవరూ ప్రవక్తలు, సంస్కర్తలు కారు. ఎవరి అవసరాలు, కారణాలు వారివి. ఇవి అర్థం చేసుకోగలను. తెలుగునాట సాహిత్య ఉద్దండులు అందరూ వీరికి ఆప్తమిత్రులే అయినా ఖదీర్‍బాబుగారికి కాని, వెంకట్‍గారికి కానీ ఎందుకు ఇలా స్పందించకూడదని చెప్పలేదు? అని అడిగాను మొదట్లో. ఇప్పుడర్థమయింది. అది కారణం కాదనుకుంటే వీరికీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాను. ఒకేచోట ఉంటారు. తరచూ కలుస్తూ ఉంటారు. కలిసి ఒకే ధ్యేయంతో పని చేస్తుంటారు. విమర్శ ఎంత మంచికైనా, నొప్పించవచ్చు. మౌనంతో వారు మరింత సాధించవచ్చు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు పోకతప్పదు. కర్ణుడి స్నేహం చేయకతప్పదు. కాని, వీరెవరికీ నాతో ఆ అవసరం లేదు. నన్ను ఎంతమాటయినా అనవచ్చు. పైపెచ్చు నన్ను అనడం ద్వారా వారి సంబంధబాంధవ్యాలు మరికొంత బలపడచ్చు కూడా.

ఒక స్నేహితుడన్న మాట: “నువ్వు అక్కడెక్కడో ఉంటావు. ఇక్కడ ఎవరినీ కలవవు, స్నేహాలు చేయవు. ఇక్కడికి తరచుగా వచ్చి ఈ రచయితలందరితోటీ కలిసి మాట్లాడుతూ ఉంటే వారికి నీమీద అపోహలు పోతాయి. నువ్వెలాంటివాడివో తెలుస్తుంది.” ఆ అపోహ నాకు లేదని జవాబిచ్చాను. నేను వచ్చి, వీరందరితో కలిసి, ప్రేమాభిమానాలలో తడిసి, వాటేసుకొని ఫోటోలు దిగి, ఫేస్బుక్లో లైకులూ లవ్వులూ కొట్టుకుంటే నాకున్న కీర్తికండూతి, గుర్తింపు జాడ్యం కొంత గీరబడుతుందేమో కాని (తీటగల భాగ్యశాలికి…), సాహిత్యానికి, ఈమాటకూ పిసరంత కూడా ఒరగదు. రచయితలకూ పత్రికకూ మధ్య ఉండవలసింది ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్. ప్రేమలు, చుట్టరికాలు కాదు. అవీ ఇవీ కలవకూడదు. అలా కలుపుకుంటే విమర్శ, నిష్పక్షపాతంగా రచన నాణ్యతను బేరీజు వెయ్యడం వంటివి జరగవు. తెలుగురాష్ట్రాల్లో విమర్శ పూర్తిగా చచ్చిపోయింది ఎందుకు? ఒకప్పటి పుస్తక విమర్శలు పోయి, సమీక్షలు కూడా ఇప్పుడు కేవలం పరిచయాలుగా మాత్రమే ఎందుకు ఉన్నాయి? సాహిత్యస్నేహాలు సామాజిక స్నేహాలుగా, పరస్పరవసరాలుగా మారడం వల్ల. నేను ఆ మర్దన చికిత్సలో భాగం కాలేను. చెప్పానుగా గౌరవం ఇవ్వాల్సింది రచనకని. మన సమాజంలో ‘రచయితలను ప్రోత్సహించాలి’ అనే ఒక ప్లాటిట్యూడ్ ప్రబలంగా ఉంది (అది ఇవ్వట్లేదనే కదా నా మీద రభస). మొన్నెవరితోనో అన్నాను: ‘మీరు రచయిత అయితే మీకు ప్రోత్సాహం అక్కర్లేదు. రచయిత కాకుంటే మీకు ప్రోత్సాహం ఇవ్వకూడదు.’ మన శక్తి మనకు తెలియాలి.

శక్తి అంటే గుర్తొచ్చింది. రిగార్డింగ్ రామా అన్న నావెల్‍లో సుగ్రీవ్ అనే కారక్టర్‍కు వలీ అనే బ్రదర్ ఒకడుంటాడు. (దిస్ సుగ్రీవ్ ఆల్వేస్ గ్రీవ్స్ యూ నో. సచ్ ఎ వైనర్, యార్!) వలీకి ఎదుటివారినుంచి వారి శక్తి లాగేసే శక్తి ఉండేదట. అందుకే ది ఆల్మైటీ, ఆల్ మైటీ రామా కూడా చెట్టు వెనకాలనుండి స్నైపర్‍లా వలీని కేన్సిల్ చేయాల్సివచ్చింది. చాలా హంబుల్‍గా నాగురించి నేను వలీలా అనేసుకుంటుంటాను. ఈమాటను ఈమాటలా నడపడం మాటలా!

నాకు అస్తిత్వన్యూనత లేదు. ఈమాట వల్ల నాకు, నావల్ల ఈమాటకూ అదనంగా వచ్చే గుర్తింపు ఏమీ లేదు. నిజానికి, ఎడిటింగ్ రాకున్నా పర్లేదు, అచ్చుతప్పులు శ్రద్ధగా దిద్ది, కొంచెం ముస్తాబు చేసి, ఠంచనుగా 1వ తారీఖున పత్రిక విడుదల చేస్తే చాలని, అలా చేయగలిగిన వారికోసం ఎంతోకాలంగా వెతుకుతున్నాను. ఒక్కరు దొరికితే చాలు, ఈమాట వారి చేతుల్లో పెట్టి నత్త గుల్లలోకి ముడుచుకున్నట్టు నా లోకంలోకి నేను పూర్తిగా పోతాను. చిరంజీవిని పొందలేని విజయశాంతిలా ఎర్రబీడు పొలాల మధ్యనుంచి దుమ్ము లేపుకుంటూ అస్తమిస్తున్న సూర్యుడిలోకి నడిచిపోతాను. (స్లోమోషన్‍లో కాదు, అంత సమయం లేదు.) కనీసం కుటుంబంతో మరికొంత సమయం గడపగలనేమో మరీ ఆలస్యం కాకముందే, మా గూడు ఖాళీ కాకముందే.

కుటుంబం అంటే గుర్తొచ్చింది. బరాక్ ఒబామా ఒకసారి నల్ల తండ్రుల బాధ్యతారాహిత్యం గురించి కొద్దిగా విమర్శించాడు. అది నల్లవారికి, ప్రోగ్రెసివ్స్‌కూ కూడా అందరు నల్లతండ్రులనూ నిందించినట్టు వినిపించింది. విమర్శను తీసుకోలేనితనం ఐడెంటిటీ పాలిటిక్స్‌ డిఎన్‌ఎ లోనే ఉందేమో. మరి అదేమాట తెల్లవాడు అనివుంటే? ఊహకు కూడా అందదు. ఆత్మవిమర్శ. ఆత్మవిమర్శ. ఆత్మవిమర్శ.


ఈమాటను (పోనీ నన్ను) ఇలా విడదీసి చూపటం, చూడటం వల్ల; ఇలా దూషించటం వల్ల; ఖదీర్‍బాబుగారు ఇంకో పదిమంది రచయితలను పదును పెట్టానని, వెంకట్‍గారు ఇంకో వంద పుస్తకాలు అమ్మామని, తెలుగు సాహిత్యానికి, కనీసం నిమ్నవర్గాలవారి సాహిత్యానికి ఎంతో కొంత మేలు జరిగిందనీ చెప్పమనండి. నేను కూడా వారికి తిట్టడంలో సహాయం చేస్తాను. ఇప్పటికే నన్ను ఒక దశాబ్దం పాటు తూర్పారపట్టడానికి బోలెడన్ని ఈస్టర్ ఎగ్స్ ఇక్కడ ఒదిలిపెట్టాను.

ఒక్క మేలు జరిగింది. అది కేవలం ఖదీర్‌బాబుగారికి జరిగింది. చిన్న జార్జి బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను ది వరస్ట్ ప్రెసిడెంట్ అనుకున్నారు అందరూ, ట్రంప్ వచ్చేదాకా. ఇప్పుడు ఆయన కాస్త మంచిగానే కనపడుతున్నారు. వెంకట్ తన స్పందనతో ఇలాంటి మేలే చేశారు, ఖదీర్‌బాబుగారికి.

మీరందరూ మరొక్కసారి వెంకట్‍గారు వ్రాసిన అభిప్రాయం చూడండి. నాకిచ్చిన విశేషణాలను పక్కన పెట్టండి. వాక్యం తరువాత వాక్యంలో అర్థం, ఆలోచనలో స్పష్టత కనిపిస్తోందా? పంటినెప్పితో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రసంగంలా లేదూ? అందుకే, ఆయనకు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దామని, ఎవరిమీది కోపమో నామీద చూపించి ఉంటారని, అదే నిజమని నమ్ముదామనుకుంటాను… కానీ అది నిజం కాదు. అందుకని ఆయననే నేరుగా ఒక ప్రశ్న అడుగుదామనుకుంటాను: “ఒక అభిప్రాయం నుంచి సందర్భశుద్ధి లేకుండా ఒక వాక్యాన్ని విడతీసి దానికి లేని అర్థాలు కల్పించి నన్ను అవమానించి స్థాయీ ఔన్నత్యాలను ఉచితానుచితాలనూ మరిచిపోయి సాహిత్యకుసంస్కారంతో ఇలా ప్రవర్తించి వెంకట్‍గారూ! వ్యక్తిగతంగా కాని, రచనాప్రచురణారంగాలకు కానీ ఏమిటి మీరు సాధించిన ప్రయోజనం? ఏ వెలుగులకీ ప్రస్థానం?” …కానీ అడగను.


ఇక్కడ ప్రస్తావించినవారే కాదు, ఇంకా ఎందరో, ఇలా సామాజిక చైతన్యం ఉన్నవారందరూ… వీరు అలికిడి కాగానే అరిచే కాషాయమూకలు కారు. ఒక రాయి విసిరి తమాషా చూసే చాపల్యం వీరికి లేదు. కాని, ఇలా ఎందుకు ట్రిగర్ వర్డ్స్‌తో ఉలికిపడుతున్నారు? ఆలోచన లేని ఆవేశం గుడ్డివాడి చేతిలో దీపం లాంటిదని తెలీదా? సమాజం-సాహిత్యం ఈ రెంటి పట్ల, ఈ రెంటి సంబంధం పట్ల, ఒకదానిపై వేరొకదాని ప్రభావం పట్ల స్పష్టత లేకపోవడం వల్లనా? ఒకదానిలో ప్రగతి రెండవదానిలోనూ అని పొరబడుతుండటం వల్లనా? వకాలత్‍గిరీ ధోరణా? వీరి సామాజిక చైతన్యానికి, అభ్యుదయ దృక్పథానికి కొంత వివేచన కూడా జోడయితే ఎంత బాగుండు.

సాహిత్యసమాజంలో ఒక స్థానం ఉన్న పాత్రికేయులు, రచయితలు, పెద్దలు… ఈ తరానికి, ముందుతరాలకీ కూడా సాహిత్య సంస్కారం – విమర్శను పద్ధతిగా ఇవ్వడం తీసుకోవడం – నేర్పగలిగిందీ నేర్పవలసిందీ వీరే. ఒకటి రెండు మాటల అభిప్రాయాలు, స్నైడ్ రిమార్క్స్, ఇలాంటివారు వ్రాయకూడదు. ఇది వీరి స్థాయి కాదు. రచయితల మధ్య మాటలు, సాహిత్యచర్చలు జరగవలసింది కలంతో, పత్రికలలో. సాహిత్యవివేచనకు తగినంత సమయం, స్థలం కేవలం పత్రికలే ఈయగలవు. బోలు శబ్దాల రణగొణధ్వని నుంచి ఆలోచనను పెంపొందించే భాషగా తెలుగును మార్చుకోవడం సాధ్యమే. మన సాహిత్య వాతావరణాన్ని మెరుగు పరచడం కూడా సాధ్యమే. (ఒక మంచి ఆధునికసాహిత్య విమర్శావ్యాసం మనం చదివి ఎన్నాళ్ళయింది? ఒక చక్కటి సాహిత్యచర్చ ఏ పత్రికలోనయినా జరిగి ఎన్నేళ్ళయింది? రచయితలు ఎదగగలిగిన, ఎదగవలసిన ఆ సాహిత్యవాతావరణం అసలేదీ?)

ఏది చేసినా చేయకున్నా జూన్ 2022 ముందుమాట మాత్రం ఒక్కసారి చదవమని చెప్తాను. కరుణామయుడు అన్నట్టు ‘నాకోసం చదవకండి, మీకోసం మీ అరసబ్బులకోసమే చదవండి.’

ఇంత చెప్పాక కూడా నేను చెప్తున్నదానిలో వేరే అర్థం వినిపిస్తే, ఒక ‘తోలు కప్పుకున్న’ వాదజాలం కనిపిస్తే ‘ఏం బతుకులండీ మీవి’ అనుకుంటాను అంతే. నాకు నా అభిప్రాయాలతో బ్రతికే హక్కు ఎంతవుందో, మీకు మీ అభిప్రాయాలతో బ్రతికే హక్కు అంతే ఉంది. బహుశా అక్టోబర్ 2025లో మళ్ళీ వీరిని పలకరిస్తాను. ఇదేదో ఈమాట సంప్రదాయం అయేలా ఉంది.


ఇక నాకు చెప్పడానికేమీ లేదు. ఇది ఎవరెలా చదువుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారో అది వారి ఇష్టం. కాని, ఈ యథాతథస్థితి మారుతుంది ఇప్పట్లో అని నాకు ఆశ లేదు. కేవలం గుడ్డిగా పొగుడుతూ ఉంటేనే తప్ప, ఎప్పటికప్పుడు వేలెత్తిచూపడానికి ఒకరు అవసరం అయిన ఈ ఆటను వారి నియమాల ప్రకారం ఆడితే తప్ప, ఆడుతున్నంత సేపే తప్ప, నేను వారిలో ఒకడిని కాలేను. నేనే కాదు ఎవరైనా ఇంతే. ముందు చెప్పినట్టు పొగడ్త ఆపినా, ఒక మాట పెడగా అన్నా, పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది.

సూటిగా చెప్పవలసి వచ్చినా కూడా, నా భాష కటువుగా ఉండకూడదనే ప్రయత్నిస్తున్నాను. భిన్నాభిప్రాయాలను గౌరవించలేనివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోయినా, ప్రయత్నపూర్వకంగా విపరీతార్థాలు, పెడర్థాలు తీసి స్పందించేవారికి ఇలా ఓపిగ్గా వివరణతో ప్రతిస్పందించడం ఇప్పుడు సరయిన పద్ధతి అనుకుంటున్నాను. ఇంకేమైనా పద్ధతి ఉందేమో ఆలోచిస్తున్నాను. ఈమాటకు ఎప్పుడూ ఒక్క రచనయినా పంపకుండా, ఏ ప్రోత్సాహమూ ఇవ్వకుండా, అపోహలతో దూరంనుంచి కేవలం రాళ్ళు విసిరేవారి అభిప్రాయాలకు అసలు విలువ ఎందుకూ ఇవ్వడం అని కూడా.

నాకూ ఒకప్పుడు కోపం చాలా ఉండేది. మాట ఇంకా ఎంతో దురుసుగానూ ఉండేది. మారుతున్నాను. కొందరు వయసుతోపాటు పెరుగుతారు. కొందరికి వయసు మాత్రమే పెరుగుతుంది. నేను మొండిగా నేనింతే అనుండవచ్చు. వచ్చిన ఏ అభిప్రాయానికీ స్పందించకుండా ఉండివుండచ్చు. కానీ లేను. ఇలా ఇంత వివరంగా వ్రాయవలసిన అవసరం నిజంగా నాకుందా? నాకు చాతనైనంతగా ఈమాటపైనున్న అపోహలు తొలగించడానికి, ఇది నిజంగా సాహిత్య పత్రిక అని చెప్పడానికే ఇలా. (కొంత హాస్యాన్నీ ప్రయత్నించాను. పండిందో? కుళ్ళిందో! నవ్వుతున్నంత మాత్రాన తగిలిన దెబ్బలు బాధ పెట్టవని కాదు.) తెలుగు సాహిత్యసమాజం చాలా చిన్నది. మీదీ మాదీ కాదు, ఇది మనది. ఇది బాగుండాలనే, బాగుపడాలనే ఈ ప్రయత్నం. సాహిత్యసమూహంగా మన ప్రవర్తనను బైట ప్రపంచం నుంచి నేర్చుకుందామా లేదూ బైట ప్రపంచానికి నేర్పుదామా?

తెలుగుసాహిత్యసమాజంలో ప్రస్తుతం అత్యంత అవసరమైనవి, పూర్తిగా మృగ్యమైనవి – విమర్శ, సంస్కారం, సంస్కృతి.

నన్ను ఇలా అవమానించారనో, అలా దురుసుగా అన్నారనో, నాకు వీరెవరి మీదా కోపం లేదు. ఇది వ్యక్తుల పట్ల ఆవేశకావేశాలతో స్పందించే సందర్భం కాదు. ఇది రాజకీయ వేదిక కాదు. ఇక్కడ వ్యక్తినిందకు చోటు లేదు. ఇది ప్రయాణం. సాహిత్యవిమర్శ, సంస్కారం ఒకటి మన సమూహంలో ఏర్పడుతుంది అన్న ఆశతో, నా వంతుగా నేను ఇలానే చూసినది చూసినట్టు, అనుకున్నది అనుకున్నట్టు వ్రాస్తూంటాను. కావ్ కావ్‌-ఎ సఖ్త్-జానీ…


ఎండ్ టైటిల్స్: క్షమాపణలు

  1. నేను పేరు పెట్టి ప్రస్తావించిన సోషల్ మీడియా పరిచయస్తులు అందరికి, నేను కొంచెం గిల్లిన ఖదీర్‌బాబుగారికీ. నాకు తెలిసిన పేర్లు కావడంతో ప్రస్తావించాను తప్ప కేవలం ఆ కొందరినే ఉద్దేశించి వ్రాయలేదు.
  2. అమరేంద్రగారూ – ఇక్కడ మీ పేరు తరచుగానే వచ్చింది. ఇది మీకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించండి. కాని, మీరు మీ అభిప్రాయం ద్వారా, అది వెలువరించిన తీరు ద్వారా కొంత చర్చకు, నా వ్రాతకూ దారి తీశారు. కృతజ్ఞతలు ఈ సందర్భంలో చిన్నమాట.