వాసన

ప్రేరణ

చదువరుల నుండి ఎప్పుడు, ఎటువంటి స్పందన వస్తుందో ఊహించి చెప్పడం కష్టం. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం, ఊరూ పేరూ లేని ఒక ప్రాంతీయ వ్యాపార జాలపత్రికలో (commercial webzine) ఓడర్ (Odor) అనే అంశం మీద సరదాగా రాసిన ఒక పేజీ పొడుగు ఇంగ్లీషు వ్యాసం మీద వచ్చిన స్పందన వర్ణనాతీతం అంటే నమ్ముతారా? ‘అయ్యా! నా నోటి దుర్వాసన ఎలా పోగొట్టుకోవాలి?’ ‘సార్! నా శరీరం ఎక్కువగా చెమట కంపు కొడుతూ ఉంటుంది. ఈ సమస్యకి తరుణోపాయం ఏమిటి?’ ‘అయ్యా! నా రవిక చంకల దగ్గర తడిసిపోయి వాసన వేస్తా ఉంది. నేనేమి చెయ్యాలి?’ ఇలాంటి ప్రశ్నలు ఒకటి కాదు, రెండు కాదు. ‘నేను వైద్యుడిని కాను మొర్రో, మీ వైద్యుడిని సంప్రదించండి’ అని అందరికీ సమాధానాలు రాసుకుంటూ వచ్చేను.

ఈ మధ్య నా కంప్యూటర్ మారుమూలలలో నక్కి ఉండి, బూజు పట్టిపోతూన్న పాత దస్త్రాల దుమ్ము దులుపుతూ ఉంటే పైన చెప్పిన వ్యాసం యొక్క చిత్తు ప్రతి నా కళ్ళ పడింది. అదే ఈ వ్యాసానికి ప్రేరణ అయింది.

వాసన, షాడబం

ముందు వాసన అన్న పదం తీసుకుందాం (odor, smell). ఇది సువాసన కావచ్చు, దుర్వాసన కావచ్చు, ఘాటు వాసన కావచ్చు. ఈ తేడాని వ్యక్తపరచడానికి కంపు, దుర్వాసన, దుర్గంధం (malodorous, foul smell) వంటి మాటలని, ఘాటు వాసన (pungent odor) వంటి మాటలని వాడతాం. ఎటువంటి దుర్వాసనో తెలియజేయడానికి గబ్బు కంపు, రొచ్చు కంపు వంటి మాటలు వాడతాం. మంచి వాసన అయితే సువాసన, సుగంధం, పరిమళం, సౌరభం, తావి (sweet smell, fragrance) అని అంటాం! (ఇంగ్లిషులో sweet odor అని అనం.) పోతే, అరోమా (aroma) అన్నా దరిదాపు ఇదే అర్థం. మరొక విధంగా చెప్పాలంటే కప్పులో ఉన్న కాఫీ ఘుమఘుమ అరోమా అని, డబ్బా మూత తెరవగానే వచ్చే కాఫీ ఘుమఘుమ ఫ్రాగ్రన్స్ అనీ అని ఒకరన్నారు. నన్ను అడిగితే అరోమా అనే మాట తినుబండారాలు వెదజల్లే ఆహ్లాదకరమైన సౌరభం, ఫ్రాగ్రన్స్ అనే మాట పువ్వులు, అత్తరులు, వగైరాలు వెదజల్లే సౌరభం. ఇక షాడబం (flavor) అంటే ఏమిటో విచారిద్దాం.

నాలుక గ్రహించేది రుచి, ముక్కు గ్రహించేది వాసన అని అనుకుంటే నాలుక, ముక్కు కలిసి ఉమ్మడిగా రుచి, వాసనలని గ్రహించగా మన మెదడులో కలిగే రసానుభూతిని (chemical sensation) షాడబం (flavor) అని; కమ్మదనము, స్వాదు అనీ అంటారు.

రుచులు ఆరు అనిన్నీ వాటిని షడ్రుచులు అంటారనిన్నీ చిన్నప్పుడు చదువుకున్నాం. అవి వగరు (astringent), ఉప్పు (salty), పులుపు (sour), కారం (spicy), తీపి (sweet), చేదు (bitter). కానీ ఆధునిక శాస్త్రం ప్రాథమిక రుచులు అయిదే అని తీర్మానించింది. అవి ఉప్పదనం, పులుపు, తీపి, ఉమామి (umami), చేదు. ఉమామీ అనేది మనకి పరిచయం లేని రుచి. జపానీ భాషలో ఉమామి అంటే ‘రుచి’ అని అర్థం! తెలుగువారి అభిమాన రుచి అయిన కారం ‘రుచి’ కానేకాదుట! అదొక తరహా నొప్పి! అలాగే వగరు కూడా ఒక రుచి కాదు; అదొక అనుభూతి (sensation). ఈ వ్యాసం అవసరాలకి రుచులు అయిదే అని ఒప్పేసుకుందాం.

వాసన దగ్గరకి వచ్చేసరికి పరిస్థితి కొంచెం క్లిష్టం అవుతుంది. మానవుల ముక్కులలో 400 రకాల ‘వాసన కేంద్రాలు’ ఉన్నాయిట. ముక్కు పసికట్టగలిగే 400 రకాల వాసనలని, పైన చెప్పిన అయిదు రుచులతో అనేక క్రమవర్తన, క్రమసంచయాలతో (permutations and combinations) మిళితం చెయ్యగా వచ్చేవే షాడబాలు. ఈ కోణంలో ఆలోచించి అనుభవంలో ఆరితేరిన వారు చెప్పేదేమిటంటే: 1. వాసన లాగనే షాడబం కూడా ఒక రసాయన బణువు (chemical molecule); దానికి రూపురేఖలు (molecular structures) ఉంటాయి కనుక దాని లక్షణాలని మన నేర్పరితనంతో మన అవసరాలకి అనుకూలంగా మలుచుకోవచ్చు; 2. షాడబం = రుచి + వాసన; 3. షాడబాన్ని నిర్ణయించడానికి రుచి కంటే వాసనకి ప్రాధాన్యం ఎక్కువ.

వాసనని ఎలా గుర్తుపడతాం?

మనకి ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలలోనూ దృగింద్రియం వల్ల చూడగలుగుతున్నాం, ఘ్రాణేంద్రియం వల్ల వాసన ‘చూడ’గలుగుతున్నాం, రసేంద్రియం వల్ల రుచులు ‘చూడ’గలుగుతున్నాం, శ్రవణేంద్రియం వల్ల శబ్దాలు వినగలుగుతున్నాం, స్పర్శేంద్రియం వల్ల తాకిడిని అనుభవించగలుగుతున్నాం. తగినంత వెలుగు ఉన్నప్పుడే చూడగలం, నోట్లో పెట్టుకున్నప్పుడే రుచి చూడగలం, ముట్టుకున్నప్పుడే స్పర్శ అనుభవంలోకి వస్తుంది, శబ్దం బిగ్గరగా ఉన్నప్పుడే వినిపిస్తుంది. కానీ వాసన చూడడం అనేది ఎల్లప్పుడూ, సర్వకాల సర్వావస్థలలోనూ జరుగుతూనే ఉంటుంది – మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా! కళ్ళు మూసుకుంటే చూడలేము, చెవులు మూసుకుంటే వినలేము, నోరు మూసుకుంటే రుచి తెలియదు, ముక్కు మూసుకుంటే మాత్రం ఊపిరి తిరగక చచ్చిపోతాం కదా!

మన మొట్టమొదటి శ్వాస పుట్టిన వెంటనే గాలిని లోపలి పీల్చుకోవడంతో (ఉచ్ఛ్వసనము) మొదలవుతుంది, చిట్టచివరి శ్వాస గాలిని బయటకి వదలడంతో (నిశ్వసనము) అంతం అవుతుంది. ఈ మధ్య కాలంలో, ప్రతి రోజూ, సగటున, 22,000 సార్లు ఊపిరి పీల్చి వదలుతామని ఒక పనిలేని దివాకీర్తి లెక్క కట్టేడు; ప్రతిసారీ 2 క్షణాలు (seconds) పీల్చడానికి, 3 క్షణాలు గాలి బయటకి వదలడానికి. అనగా, మనం బ్రతికున్న ప్రతి క్షణమూ గాలి లోని వాసనలని – రసాయన భాషలో చెప్పాలంటే, వాసన బణువులని (odor molecules) అలా ఆస్వాదిస్తూనే ఉంటాం.


గూగుల్ సౌజన్యంతో

ఒక గులాబీని వాసన చూసినప్పుడు, వాసన బణువులు నాసికా రంధ్రాల నుండి లోపలికి ప్రవహించగా, లోపల తేమగా ఉన్న చర్మపు పొరలలో ఉన్న కేసికలు (cilia) వాటిని పీల్చుకుంటాయి. ఈ చర్యకి ప్రతి స్పందనగా ఐదు మిలియనుల నాడీకణాలు (neurons) ఒక్కుమ్మడి స్పందించి ఒక వార్తా సంకేతాన్ని (వాకేతం లేదా signal) మెదడులోని ఘ్రాణకేంద్రానికి (olfactory node) పంపుతాయి. ముక్కులో ఉన్న ఈ రకం నాడీకణాలు అపూర్వం, ఏకైకం అయిన ప్రత్యేక కణాలు. మెదడులో ఉన్న నాడీకణాలు ఒకసారి దెబ్బ తింటే మరింక కోలుకోలేవు; వాటి బ్రతుకు మూడినట్లే! కంటిలోని నాడీకణాలు, చెవిలోని నాడీకణాలు కూడా ఒకసారి దెబ్బ తింటే అంతే సంగతులు. కానీ ముక్కులో ఉన్న నాడీకణాలు ముప్ఫయి రోజులకొకసారి పునఃస్థాపించబడుతూ ఉంటాయి! వాసనని గుర్తుపట్టగలగడం మన మనుగడకి అంత ముఖ్యం అన్నమాట!

మెదడులు వాసనలని ఎలా గుర్తు పడతాయిట? వాసన వేసే పదార్థాలు వాసన బణువులని వెదజల్లుతూ ఉంటాయి. బణువులు అంటే అణువుల సమూహాలు కనుక అణువుల అమరికని బట్టి వీటి రూపురేఖలు నిర్దేశించబడతాయి. ఉదాహరణకి కస్తూరి (musk) వాసన వేసే పదార్థాలు వెలువరించే బణువులు చిన్నచిన్న పళ్ళేల మాదిరి ఉంటాయి. ముక్కులో ఉన్న నాడీకణాల అమరిక గిన్నె మాదిరి ఉంటే ఈ పళ్ళెం ఆ గిన్నె మీద ‘కప్పలో తాళంచెవి’ అమరినట్లుగా ఏర్పడి (lock and key manner) ఒక విద్యుత్ వాకేతం (electrical signal) పుట్టి, అది మెదడుకి వెళుతుంది. అప్పుడు మెదడు ఆ వాసనని ‘కస్తూరి వాసన’గా గుర్తు పెట్టుకుంటుంది. ఇదే విధంగా పుదీనా (mint) వెలువరించే వాసన బణువులు చీల (wedge) ఆకారంలో ఉంటాయి. వాటిని గుర్తు పట్టడానికి నాడీకణాల అమరిక చీలిక (V-shaped) మాదిరి ఉంటాయి. ఈ చీల ఆ చీలికలో అమరినప్పుడు మనకి పుదీనా వాసన అని తెలుస్తోంది. కర్పూరాన్ని గుర్తు పట్టే నాడీకణాల అమరిక కోలగా (elliptical shape) ఉంటుంది.


గూగుల్ సౌజన్యంతో

మన మెదడులో ఉన్న ఘ్రాణకేంద్రానికి (olfactory node), భాషాకేంద్రానికీ మధ్య ఉండే లంకె అంత బలమైనది కాదు. కానీ ఘ్రాణకేంద్రానికీ ధారణకేంద్రానికీ (memory node) మధ్య ఉండే లంకె బలమైనది. అందుకనే ఘ్రాణశక్తి అనేది జ్ఞాపక శక్తికి, మానసోద్వేగానికి (emotion) ప్రతీక. నిజానికి ఘ్రాణకేంద్రం మెదడు యొక్క ఎదుటి దక్షిణ భాగం (bottom of the front) నుండి మన నాసికా రంధ్రాల ఉత్తర భాగానికి (upper part of the nasal cavity) ఎదురుగా ఉంటుంది. ఇది వాసన బణువుల నుండి సేకరించిన సమాచారాన్ని మెదడులోని అమిగ్డలా (amygdala), హిపోకేంపస్ (hippocampus) అనే భాగాలకి పంపుతుంది. ఈ రెండు భాగాలు విద్యాభ్యాసానికి (learning), మానసోద్వేగానికి (emotion), ధారణకి (memory) కేంద్ర స్థానాలు. మన జ్ఞానేంద్రియాలలో ఒక్క ఘ్రాణవ్యవస్థకే మెదడులోని ధారణకేంద్రం చేరుకోడానికి నేరుగా, అంతరాయం లేని, మార్గం ఉంది. అందుకనే వాసన చూడగలిగే శక్తికి, జ్ఞాపకశక్తికి అవినాభావ సంబంధం ఉందని పరిశోధకుల భావన!

ఉపనిషత్తులలో కూడా ఈ లంకె గురించి ప్రస్తావన చూచాయగా కనిపిస్తుంది. పూర్వజన్మ వాసనల వల్ల మనం ప్రభావితం అవుతామని ఉపనిషత్తులలో చెబుతారు. ఇక్కడ ‘వాసన’ అంటే ఏమిటి? జ్ఞాపకాల వల్ల సాధించిన జ్ఞానం (knowledge derived from memory). అనగా, గత అనుభవాల, కర్మల ఫలితాలు అంతర్గత చేతనలో ముద్ర వేసుకోగా సంతరించిన జ్ఞానం (subconscious impressions which are stored up as a result of past experiences or actions). ఇక్కడ ఉపనిషత్తులు చెబుతూన్న ‘గత’ అనుభవాలు పూర్వ జన్మలో అనుభవాలు. పూర్వజన్మ ఉందో లేదో తెలియదు కనుక మనం ‘గత’ అంటే పూర్వకాలం అని అన్వయం చెప్పుకుంటే ఆధునిక శాస్త్రంతో పేచీ ఉండదు.

బొమ్మ, బొరుసులు

వినికిడి లేని వారిని ‘చెవిటివారు’ అంటాం. చూపు లేని వారిని ‘గుడ్డివారు’ అంటాం. వాసన చూడలేని వారిని ఏమంటాం? ఈ వైకల్యానికి పేరు లేకపోతే దాని తరఫున ఎలా పోరాడుతాం?

అందుకని ఈ వైకల్యానికి గ్రీకు, లేటిన్ మాటలతో దుష్టసంధి చేసి, ఇంగ్లీషులో ఎనాస్మియా (anosmia = without smell) అని పేరు పెట్టేరు. వాసన చూడగలగడానికి, రుచి చూడగలగడానికీ అవినాభావ సంబంధం ఉంది కనుక ఎనాస్మియా అంటే రుచి, వాసన చూడలేని స్థితి అని అన్వయం చెప్పుకోవచ్చు. వాసన చూడలేని పరిస్థితి ప్రమాదకరం: పొగ వాసన పసికట్టలేకపోతే అగ్నిప్రమాదంలో బలి కావచ్చు, వాసన తెలియకుండా కుళ్ళిన ఆహారం తినేస్తే ప్రాణానికే ముప్పు రావచ్చు కదా!

దీనికి విపర్యం కూడా ఉంది. కొందరికి నిరంతరం వికారమైన వాసన వేస్తూ ఉంటుంది; ముక్కుకి ఎదురుగా ఏమీ లేకపోయినా సరే! అది దుర్వాసన కావచ్చు, సువాసన కావచ్చు. ఇది ఒక రకం అస్వస్థత! దీనిని వైద్య పరిభాషలో ఫాంటాస్మియా (phantosmia) అంటారు. మరి కొందరికి గులాబీ పువ్వుని వాసన చూస్తే గంధకం కాలుతూన్న వాసన వేస్తుంది, ఘుమఘుమలాడే బిరియానీని వడ్డిస్తే కుళ్ళు కంపు కొడుతుంది. దీనిని డైసోస్మియా (dysosmia) అంటారు!

వయస్సు పెరుగుతూన్నకొద్దీ దృష్టి మందగించినట్లే, వినికిడి తగ్గినట్లే, వాసన చూడగలిగే శక్తి కూడా తరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వయస్సుతోపాటు పర్యావరణంలో కల్మషాలు, పొగ తాగడం వంటి దురలవాట్లు, కోవిడ్ వంటి రోగాల బారిని పడడం కూడా దీనికి కారణాలు కావచ్చు. మన ఘ్రాణశక్తి ఏభై దాటేసరికి 10 శాతం, ఎనభై దాటేసరికి 40 శాతం పడిపోతాయిట. ఎప్పుడైతే మన ఘ్రాణశక్తి నశించడం మొదలవుతుందో అప్పటినుండి మన జ్ఞాపకశక్తి (memory), గ్రహణశక్తి (cognition) కూడా నశించడంతో పాటు మన దైనందిన శ్రేయస్సు (well being) కూడా దెబ్బతిని బుద్ధిమాంద్యత (dementia), మనోవ్యాకులత (depression) వంటి పరిస్థితులకి దారి తీయవచ్చని అంటున్నారు. మన మెదడులో ఘ్రాణ నాడీకేంద్రము (వాసనని పసికట్టే కేంద్రము, olfactory node), హిపోకేంపస్‌లో ఉన్న స్వల్పకాలిక జ్ఞాపక కేంద్రానికి (short-term memory) దగ్గరగా ఉండడమే ఈ పరిస్థితికి కారణం అయి ఉండవచ్చు. ఆల్‌సైమర్స్ (Alzheimer’s) వ్యాధి ఉన్నవారికి మరుపు పెరగడంతో పాటు వాసన చూడగలిగే శక్తి నశిస్తుంది. అందుకనే ఆల్‌సైమర్స్, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు ముదిరిపోయేలోగా పట్టుకోడానికి గాను వైద్యులు ‘గోకి-వాసన చూడు’ (scratch and sniff smell test) అనే పరీక్ష ప్రవేశ పెట్టారు. ఈ పరీక్షలో లిట్మస్ కాగితాల వంటి రంగురంగుల కాగితాల కట్ట ఉంటుంది. ఈ కాగితాలని గోకితే రకరకాల వాసనలు వేస్తాయి. ఆ వాసనలని మనం గుర్తు పట్టగలగాలి.

ఈ రకం బొమ్మకి బొరుసు కూడా ఉంది. ఘ్రాణశక్తి ప్రదర్శనలో ఉత్పాతపిండాలు (prodigies) కూడా ఉంటారు. పసితనంలోనే జబ్బు పడ్డ కారణంగా గుడ్డి, చెవిటి అయిన, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్, ‘కొద్ది గంటలలో తుఫాను రాబోతూ ఉంటే, మరే సమాచారం లేకుండానే దాని వాసన నాకు వేసేది’ అన్నారు. (The sense of smell has told me of a coming storm hours before there was any sign of it visible.) భూకంపాలు వచ్చే ముందు మన చుట్టూ ఉన్న పెంపుడు జంతువులు అలజడి చెందడం మన అనుభవ పరిధిలో ఉన్న విషయమే! ఆ సంగతి ఆ జంతువులకి ఎలా తెలిసింది? వాటికి ఏదయినా వాసన వేసి ఉంటుందా? లేక వాటికి ఏదయినా వినిపిస్తుందా?

నరవాసన

మానవజాతి పరిణతి చెందిన క్రమంలో తిండిని వేటాడడానికి వాసన ముఖ్యమైన ఆయుధంగా ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికీ కొన్ని సముద్రపు జీవులు తిండి వేటలో కదలవు; అవి ఉన్న చోటనే ఉండి ఆహారం తమ (ముక్కు) దగ్గరకి వచ్చినప్పుడు నోరు తెరచి కబళిస్తాయి! ఇలా మనుగడ సాగించే జలచరాలు తినబోయేది తినదగినదా కాదా అన్న సంగతిని వాసనతోటే పసిగడతాయిట. మనం సముద్ర జలాలనుండి గట్టెక్కి, రెండు కాళ్ళపై నిలబడడం నేర్చిన తరువాత సుదూరంలో ఉన్న శత్రుగణాలని చూడగలిగే, వినగలిగే శక్తి పెరగడంతో ఆహార సేకరణకి, శత్రువులనుండి తప్పించుకోడానికి వాసన మీద ఆధారపడవలసిన అవసరం తగ్గిందని వాదించేవారున్నారు. ఇప్పటికీ ఘ్రాణశక్తి తీక్షణంగా ఉన్న భూచరాలలో తిర్యక్-జంతువులు ఎక్కువగా ఉండడం గమనార్హం. వీటి వెన్ను క్షితిజసమాంతరంగా ఉండడం వల్ల, వీటి ముట్టె భూమట్టానికి దగ్గరగా ఉండి మట్టి నుండి వెలువడే వాసనలని సులభంగా గ్రహించగలవు. భూమట్టానికి ఆరంగుళాల లోతులో పెరిగే ఒక రకం అపురూపమైన పుట్టగొడుగుల (truffles) వాసనని పందులు పసిగట్టగలవు కనుక వాటిని పందుల సహాయంతో వెలికి తీస్తారు. ఎప్పుడో నెలల క్రితం బొరియలలో దాచిపెట్టిన పిక్కలని ఉడతలు వాటి వాసనని బట్టి గుర్తు పడతాయి. బ్లడ్‌హౌండ్ (bloodhound) అనే ఒక జాతి వేటకుక్క ఒక గది నుండి గంటల క్రితం వెళ్ళిపోయిన మనిషి యొక్క నరవాసనని పసికట్టి, ఆ వ్యక్తి వదలిన పాదధూళిలో మిగిలివున్న వాసన బణువుల సహాయంతో వేటాడి ఆ వ్యక్తిని పట్టుకోగలదు! మనుష్యుల ఘ్రాణకేంద్రంలో 5 మిలియన్ న్యూరానులు ఉంటే వేటకుక్కల ఘ్రాణకేంద్రంలో 220 మిలియన్ న్యూరానులు ఉంటాయి. కనుక వేటకుక్కల గ్రహణ శక్తి మన కంటే 44 రెట్లు ఎక్కువ! మన అవగాహనలోకి రాని, కుక్కల అవగాహనలోకి వచ్చే ఎక్కువ సమాచారం ఏమిటో? మేలుజాతి వేటకుక్కలు వాసన ఆధారంగా సమరూపయుతులైన కవలలలో (identical twins) ఒకరిని వేరు చేసి పట్టుకోగలవు.

నరవాసన అంటే గుర్తుకి వస్తున్నది. మనుష్యులు కూడా వాసన వేస్తారు. ఈ వాసన కొందరికి ఇంపయితే మరికొందరికి కంపు! నెపోలియన్ తాను యుద్ధరంగం నుండి తిరిగి వచ్చే ముందు జోసఫీన్‌ని రెండు వారాల పాటు స్నానం చెయ్యకుండా ఉండమని అడిగేవాడట! ఆమెని తన సందిట బందీ చేసినప్పుడు ఆమె శరీరం వెదజల్లే వాసనలకి బందీ అవుతాడట! అనాదికాలంలో, మానవులు అడవులలో తిరిగిన రోజుల్లో ఈ నరవాసనకి భయపడి అడవి మృగాలు పారిపోయేవేమో! నిజమో, కాదో పెద్దపులిని అడిగి చూడాలి! ఆ రోజుల్లో మనుష్యుల శరీరం మీద ఎక్కువ రోమాలు ఉండడం వల్ల ఎక్కువ చెమట పట్టి ఎక్కువ వాసన వేసేవారేమో.

తూర్పు ఆసియా ఖండంలో ఉండే ప్రజలు (ప్రత్యేకించి కొరియా, జపాన్ దేశీయులు) చెమట వాసన వెయ్యరుట. వారికి శరీరం మీద తక్కువ రోమాలు ఉండడం ఒక కారణం అయి ఉండవచ్చు. శరీరం మీద రోమాలు బొత్తిగా లేని వారు అస్సలు వాసన వెయ్యరుట. రోమాల సంగతి అటుంచి, ఈ పరిస్థితికి జన్యుసంబంధమైన కారణం ఉంది. వారి డిఎన్‌ఎ (DNA) లోని 16వ వారసవాహికలో (chromosome 16) 538G స్థానంలో ఉన్న ABCC11 అనే జన్యువులో గ్లైసీన్ (glycine) అనే నవామ్లం ఉండడానికి బదులు అర్జినైన్ (argenine) అనేది ఉండడమే ఈ జన్యు ‘లోపానికి’ కారణం. కనుక వారికి చెమట పట్టదు, వారు వాసన వెయ్యరు. దీని పర్యవసానమేమిటి? వారి ముక్కులు ‘నరవాసన’కి అలవాటు పడలేదు కనుక పరాయి దేశాల వ్యక్తులు వారికి వాసన వేస్తారు. ఆ వాసన వారికి నచ్చదు. కనుక వారు పరాయి దేశాలవారిని, శుచి, శుభ్రత లేనివారుగా అసహ్యించుకునే (xenophobia) అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు. మనం ఆయా దేశాలకి వెళ్ళినప్పుడు వాసనని అరికట్టే మేనిపూతలని కొనుక్కుందామంటే అవి అక్కడ బజారులలో దొరకకపోవచ్చు!

చెమట కంపు రహస్యం తెలిసింది కనుక మనం మన ABCC11 జన్యువుని మరమ్మత్తు చేసి చెమట వాసనకి భరతవాక్యం పలకబూనుకుంటే? అమ్మో! వ్యాపారపరంగా ఎంత నష్టమో ఆలోచించండి! ఎన్ని ఉద్యోగాలు పోతాయో చూసుకొండి!

ఒకటి మాత్రం నిజం. వెల్లుల్లి తిన్నవారు, ఎవ్వరైనా సరే, వాసన వేస్తారు. అందుకనే కాబోలు శాకాహారులు ఒక రకంగాను, మాంసాహారులు వేరొక రకంగానూ వాసన వేస్తారు! భారతీయులు ధరించిన బట్టలు కూడా కర్రీ వాసన వేస్తాయని విదేశీయులు అనడం నేను విన్నాను. అందుకనే కాబోలు ఇంట్లో వంటలు, బయట ఉద్యోగాలు చేసే మన ఆడవాళ్ళు స్నానం చేసి, మడిగట్టుకుని వంట వండడానికి బదులు వంట వండి, అప్పుడు స్నానం చేసి, మడి బట్టలతో ఉద్యోగాలకి వెళతారు!

మన ఉద్యోగధర్మాన్ని బట్టి మన వాసన మారుతూ ఉంటుందిట. మన ఆరోగ్యం, మన వయస్సు, మనం తినే ఆహారం, మన మానసిక స్థితి, వగైరాల వల్ల మన వాసన మారుతూ ఉంటుందిట. ఏది ఏమయినా మన శరీరం నుండి వెలువడే వాసన మన వేలిముద్రలలా స్వకీయం. ఉదాహరణకి మనోవిదళనం (schizophrenia) అనే ఒక రకమైన మానసిక వ్యాధితో బాధ పడే వారి వాసన ఆరోగ్యవంతుల వాసన కంటే భిన్నంగా ఉంటుందిట. మొదటి రకం మధుమేహం ఉన్నవారు కీటోఅసిడోసిస్ (diabetic ketoacidosis) అనే ప్రాణాపాయస్థితిలోకి దిగజారినప్పుడు వారి ఊపిరి తియ్యటి వాసన వేస్తుంది. పుట్టుగుడ్డి అయిన హెలన్ కెల్లర్ తన ఎదురుగా నడచిన వ్యక్తి తోటమాలో, వంటవాడో, వైద్యుడో వాసననిబట్టి చెప్పగలిగేదిట.

ఘ్రాణ గ్రహణ ఆత్మాశ్రయం; ఒకరికి ఆహ్లాదకరమైన వాసన వేరొకరికి వెగటుగా అనిపించవచ్చు. ఒక సందర్భంలో సువాసన మరొక సందర్భంలో అసహ్యం అనిపించవచ్చు. భావేణ (virtually) ఏ వాసనైనా ఎక్కువ మోతాదులో వెగటు పుట్టిస్తుంది.

తొలకరి జల్లు పడగానే ఒక రకమైన మట్టి వాసన వేస్తుంది. పొడి నేలపై వర్షపు నీరు పడ్డప్పుడు నేలలో ఉన్న ఆక్టినోమెసీట్స్ (Actinomycetes) అనే సూక్ష్మజీవులు, శైవలాలు (a kind of aquatic plants), జియోస్మిన్ (geosmin = geo + osmi = మట్టి వాసన), పెట్రికోర్ (petrichor = petra + ikhor = రాతి రక్తం) అనే రసాయనాలని విడుదల చేస్తాయి. ఇది ఒక రకమైన ఆహ్లాదకరమైన, మరపురాని వాసనే!

విపణివీధిలో వాసనలు

వాసనకి వ్యాపారపరమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి. అమెరికాలో పాత కార్లు అమ్మే వ్యాపారులు ‘కొత్త కారు వాసన’ విరజిమ్మే అత్తరులని పాతబడ్డ కార్లలో జల్లుతారు. ఇళ్ళు అమ్మడానికి సహాయం చేసే దళారులు ఇల్లు చూపించే ముందు బిస్కట్లు కాల్చినప్పుడు వేసే ఆహ్లాదకరమైన వాసన గల అత్తరులని వంటగదిలో జల్లుతారు. పెద్దయెత్తు బట్టల దుకాణాలలో అడుగు పెట్టగానే పువ్వుల వాసనలు ఘుమఘుమలాడుతాయి. ఒకటేమిటి? అన్ని రకాల షాపులలోనూ, లోపల అడుగు పెట్టేసరికల్లా, రకరకాల సువాసనలు వేస్తాయి. కొన్ని సందర్భాలలో అమ్మకానికి పెట్టిన వస్తువుకి సహజంగా సువాసన లేకపోయినా అమ్మకం పెరగడానికి సువాసనలు అద్దుతారు. కాకపోతే, గృహోపకారణాలని శుభ్రపరచి, మెరుగులు దిద్దే పదార్థానికి (furniture polish) నిమ్మ వాసనలు ఎందుకు చెప్పండి? నా చిన్నతనంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దీపావళి ప్రత్యేక సంచికలకి ‘కునేగా మరికుళందు’ అనే సెంటు రాసి అమ్మేవారు! ఆ మాటకొస్తే సెంట్ల వ్యాపారంలో శరీరానికి రాసుకునే పరిమళ ద్రవ్యాల వల్ల వచ్చే రాబడి కేవలం 20 శాతం మాత్రమే! మిగిలిన 80 శాతం వ్యాపారం పుంజుకునేందుకు చేసే ప్రయత్నాలకే!

వంట వాసనలు, ఒంటి వాసనలు

ఇంటి వాసనలు, వంట వాసనలు, ఒంటి వాసనల ప్రస్తావన వచ్చింది కనుక ఈ వాసనలని పోగొట్టే మార్గాలని అన్వేషిద్దాం. ఈ సందర్భంలో అందరికీ అందుబాటులో ఉండే ఆయుధాలు రెండు ఉన్నాయి: వంట సోడా, బొగ్గు. ఈ రెండూ వాసనని పీల్చుకోవడంలో ఘనాపాఠీలు. రిఫ్రిజిరేటర్‌లో దాచి పెట్టిన ఆహార పదార్థాలన్నిటికి గట్టిగా మూతలు పెట్టకపోతే ఒకదాని వాసనలు మరొకదానికి అంటుకునే సావకాశాలు ఉన్నాయి. ఈ రకం వాసన కల్తీలని అదుపులో పెట్టడానికి ఒక వంటసోడా (baking soda) బంగీ మూత తెరచి రిఫ్రిజిరేటర్‌లో ఒక మూల పెడతారు. వంటసోడా కంటే బాగా పని చేసేది, బాగా చవక అయినది – కట్టె బొగ్గు (charcoal). ఈ బొగ్గుని చిన్నచిన్న ముక్కలుగా చిదిమి, వెడల్పయిన మూతి ఉన్న సీసాలో పెట్టి, ఆ పాత్రని రిఫ్రిజిరేటర్‌లో, పిల్లలకి అందకుండా, ఒక మూల పెడితే వాసనలన్నీ పోతాయి. ఇంట్లో సిగరెట్టు వాసనలు, ఉల్లిపాయలు తరిగిన వాసనలు, కేబేజీ ఉడకబెట్టిన వాసనలు, తదితర వంట వాసనలు కూడా ఈ పద్ధతితో అరికట్టవచ్చు.

శరీరం నుండి వెలువడే దుర్వాసనల సంగతి చూద్దాం. సాధారణంగా ఈ రకం దుర్వాసనలు నోటి నుండి కాని, చంకల నుండి కాని, గజ్జల నుండి కాని, పాదాల నుండి కానీ వస్తాయి. నోటి నుండి వచ్చే దుర్వాసనని ఇంగ్లీషులో హాలిటోసిస్ (halitosis) అంటారు. ఈ వాసనకి ముఖ్యకారణం నోటి మారుమూలలలోను, పళ్ళ సందులలోనూ మిగిలిపోయిన ఆహారంతో లాలాజలం సంయోగం చెందడం. తిన్న తరువాత నోరు బాగా పుక్కిలించి కడుక్కోవడం, రోజుకి రెండు సార్లు కుంచెతో పళ్ళు తోముకోవడం, పళ్ళ సందులలో చిక్కుకున్న ఆహారాన్ని కుట్టుడుపుల్లతో పీకడం వంటి ప్రక్రియలతో ఈ సమస్యని తేలికగా పరిష్కరించవచ్చు. వెల్లుల్లి, నీరుల్లి, పొగాకు, ఆల్కహాలు వాడకం వల్ల సంక్రమించిన వాసనలు పైన సూచించిన ప్రక్రియలకి లొంగవు. దీర్ఘకాలికంగా నోటి దుర్వాసనలు ఇబ్బంది పెడుతున్నాయంటే మొదట దంతవైద్యుడిని, తరువాత చెవి-ముక్కు-గొంతు వైద్యుడిని సంప్రదించాలి. ఇగుళ్ళ వ్యాధులు కాని, నాసబీటికల (sinuses) వ్యాధులు కానీ కారణం కావచ్చు. ఇవేమీ కాకపొతే మూడొంతులు గళగ్రంథి (thyroid – గొంతుకలో ఉండే ఒక వినాళ గ్రంథి) వ్యాధిగ్రస్తం కావడం కారణం కావచ్చు.

‘వంటయింటి కస్తూరిపువ్వులు’ (Lilies of the kitchen) అని పేరు పొందిన నీరుల్లి, వెల్లుల్లి కస్తూరిపువ్వుల జాతికి చెందినవే అయినా అవి కస్తూరిపువ్వులలా మల్లెల వాసన వెయ్యవు సరికదా వెల్లుల్లిని ‘కంపు కొట్టే గులాబీ’ (stinking rose) అని అభివర్ణిస్తారు. అంతే కాదు. వెల్లుల్లి వేసే కంపుకి విషాణువులు (viruses), సూక్ష్మజీవులు, రక్తాన్ని తాగే గబ్బిలాలు (vampires), చిట్టచివరికి ఇరుగుపొరుగులు పారిపోతారని ప్రతీతి! వెల్లుల్లికి ఈ అపఖ్యాతి రావడానికి కారణం? ఇది శరీరంలోకి నోటి ద్వారా వెళ్ళినా దీని కంపు చర్మం ద్వారా పైకి వస్తుంది. అందుకనే వెల్లుల్లి తిన్నవాళ్ళు పక్కకి చేరితే చాలు పారిపోవాలనిపిస్తుంది. “ఆఁ మీరు మరీను!” అని చదువరులు నన్ను ఆడిపోసుకోవద్దని మనవి. ‘Eat no onions nor garlic, for we are to utter sweet breath’ అని షేక్‌స్పియర్ అంతటివాడు నోటినుండి వచ్చే దుర్వాసనకి మందు చెప్పేడు. ‘Lest your kissing should be spoiled, Your onions must be thoroughly boiled’ అని ప్రసిద్ధ ఆక్షేప-హాస్య రచయిత జోనథన్ స్విఫ్ట్ శిష్ట సహృదయంతో సలహా ఇచ్చేడు.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యలేదు’ అన్నారు తెలుగువాళ్ళు. ఆధునిక వైద్యశాస్త్రం కూడా తెలుగువాళ్ళతో ఏకీభవిస్తున్నాది. వెల్లుల్లి రక్తపు పోటుని అదుపులో పెట్టడమే కాకుండా, రక్తంలోని కొలెస్టెరోల్ మట్టాన్ని కూడా అదుపులో పెడుతుందిట. అనగా, ఆరోగ్యంగా ఉండాలంటే కంపు కొట్టాలన్నమాట! ఈ సమస్యని పరిష్కరించడానికి జరిగిన ప్రయత్నాలలో చెప్పుకోదగ్గది వెల్లుల్లిలోని కంపుకొట్టే రసాయనాలని ‘వడగట్ట’గా మిగిలినదాంట్లో వెల్లుల్లి రుచి, ఔషధ లక్షణాలు మిగిలేలా చూడడం. లేదా రుచి కోసం తాపత్రయ పడకుండా కంపు లేని వెల్లుల్లిని తయారు చెయ్యడం. ఈ దిశలో ఆలోచించి కయోలిక్ వెల్లుల్లి (Kyolic garlic) అనే వెల్లుల్లిని ఔషధగుళికలలో పోసి (in capsules) అమ్ముతున్నారు. దీనిని తెలుగులో ‘ముదిమి వెల్లుల్లి’ (aged garlic) అని అనొచ్చు. ఇది ఉల్లి చేసే మేలు చేస్తుంది, ఉల్లి వాసన వెయ్యదు. దీనిని తయారుచేసే పద్ధతి వ్యాపార రహస్యంట! మరొక మార్గం ఏమిటంటే కంపుకొట్టే వస్తువులు తిన్న తరువాత పత్రహరితం (chlorophyll) ఉన్న ఆకులని నమలడం. మనం భోజనం చేసిన తరువాత తాంబూలం వేసుకోవడంలో ఉన్న సూక్ష్మం ఇదే!

మెడ కింది భాగం నుండి పుట్టే కంపుకి ముఖ్య కారణం చెమట. నిజానికి చెమట వాసన వెయ్యదు; ఘర్మజలంలో 99 శాతం నీరు, 1 శాతం ఉప్పు. గాలి తగలగానే చెమట ఇగిరిపోయి ఆరిపోతుంది. కానీ గాలిలో తేమ ఉన్నా, ఒంటి మీద బట్ట ఉన్నా ఈ ఇగరడం అనేది సమర్ధవంతంగా జరగదు. అప్పుడు మన శరీరం మీద ఎల్లప్పుడూ నివసించే సూక్ష్మజీవులు ఈ తేమ వాతావరణంలో వర్ధిల్లి, వ్యర్ధాలని విసర్జిస్తాయి. అవి కంపు కొడతాయి!

ఈ రకం దుర్వాసనని అధిగమించడం అనేది అలంకరణ సామాగ్రిని, పరిమళద్రవ్యాలని తయారుచేసి అమ్మేవారికి ఒక సవాలు! ఇది సవాలు ఎందుకంటే అన్ని దేశాల ప్రజలూ ఒకేలా వాసన వెయ్యరు అని చెప్పుకున్నాం కదా! ఉదాహరణకి తూర్పు ఆసియా వాసుల చంకలు వాసన వెయ్యవు; వేస్తే అది రోగ లక్షణంట! అంతే కాదు. స్త్రీ, పురుషుల చంకలనుండి వచ్చే వాసనలు ఒకేలా ఉండవు; మగవారి వాసనలో కస్తూరి వాసన ఒక్క పాలు ఎక్కువట! (లలాటఫలకం మీద పెట్టుకున్న కస్తూరీతిలకం వాసన అయి ఉంటుంది!) చంకల నుండి, మర్మ స్థానాల నుండి వెలువడే చెమటలో పెరిగే సూక్ష్మజీవులు విసర్జించే వ్యర్ధాలలో కంపు కొట్టే రసాయన పదార్థాలు మూడు డజన్ల వరకు ఉన్నాయిట! వీటన్నిటిలోనూ అగ్రస్థానంలో ఉన్న రసాయనం పేరు: 3-methyl-2-hexenoic acid (లేదా క్లుప్తంగా, ముద్దుగా, TMHA or C7H12O2). మేక కంపు కొట్టే ఈ రసాయనం తెల్లవాళ్ళ స్వేద గ్రంథులలో ఎక్కువగా ఉంటుందిట. ఇలాంటి రసాయన బణువులలోని అణువుల అమరిక అర్థం అయితే, ఆ వాసనలని నొక్కి పెట్టి, కప్పెట్టగల అత్తరులు, సుగంధ ద్రవ్యాలు ప్రతిభావంతంగా చెయ్యవచ్చు. అయినా సరే మా వ్యాయామశాలలో (gymnasium) అడుగు పెట్టగానే గుప్పుమని చెమట కంపు కొడుతున్నాదని ఇటీవల ఒకరు అభియోగం మోపేరు!

బూటు జోళ్ళనుండి వెలువడే దుర్గంధం భరించడం కష్టం! ఈ కంపుని అరికట్టడానికి ఒక చవకైన పద్ధతి ఏమిటంటే బూట్లు విడిచిన తరువాత మేజోళ్ళని విడదీసి, దినమూ ఉతికి ఆరవెయ్యడంతో పాటు, ఖాళీగా ఉన్న బూటులో ఇందాకా చెప్పిన బొగ్గు పొట్లాలు దోపి ఉంచడం. కొంచెం ఖరీదైన ఉపాయం ఏమిటంటే జియొలైట్ (zeolite) జాతి ఖనిజాలతో నింపిన (odor zappers) సంచులు అమ్ముతారు. వాటిని బూటులో జొనిపి ఉంచడం. ఈ సంచులు ఆ దుర్వాసనని పీల్చుకుంటాయి. అప్పుడు వాటిని ఎండలో పడేసి తిరిగి వాడుకోవచ్చు.

ఒంటి వాసనలని అరికట్టడానికి దివ్యౌషధం ప్రతి రోజూ స్నానం చెయ్యడం, మేజోళ్ళని, బనీన్లని, లోపలి చెడ్డీలని ప్రతి రోజూ మార్చడం. బిగుతుగా ఉన్న బట్టలని వాడకపోవడం. నైలాన్, టెరిలీన్ బట్టలకి బదులు నూలు వస్త్రాలు ధరించడం. బజారులో దొరికే నిర్గంధకారిణులలో (deodorant) ఉండే రసాయనాలు (aluminum chloro-hydrates, isopropyl palmitates, cyclomethicones) సూక్ష్మజీవుల పెరుగుదలని అదుపులో పెట్టగలవు. ప్రతిస్వేదకాలు (antiperspirants) స్వేద గ్రంథుల రోమకూపాలని బంధించి చెమట పట్టకుండా చేస్తాయి. ఆమధ్య ఫ్రాన్స్ దేశం నుండి ఒక ఖనిజపు రాయిని (Le Crystal Natureal) సబ్బు బిళ్ళ ఆకారంలో కత్తిరించి, 6 ఔన్సుల రాయిని 15 డాలర్లకి అమ్మేరు. ఆ రాయిలో ఉన్న ఖనిజ లవణాలు చెమటలో సూక్ష్మజీవులు పెరగకుండా ఆపుచేస్తాయి. ఈ రహస్యం తెలిసే కాబోలు, పూర్వకాలంలో మనవాళ్ళు నదిలో స్నానం చేసినప్పుడు ఒండు మన్నుతో ఒంటిని రుద్దుకునేవారట! స్నానం చేసినప్పుడు కొబ్బరి పీచుతో శరీరాన్ని రుద్దుకుంటే ఆ నాచురల్ క్రిస్టల్ చేసిన పనినే మరింత చవకగా చేస్తుంది. వారానికొకసారి ఒంటి నిండా నూనె రాసుకుని, ఎండలో పది నిమిషాలు నిలబడి, తరువాత సున్నిపిండితో ఒళ్ళంతా నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో కాని, శీకాయ రసంతో కానీ తలంటుకుంటే దాని ముందు మిగతావన్నీ బలాదూర్! సాంబ్రాణి పొగతో జుట్టు ఆరబెట్టుకుంటే ఖరీదైన సౌగంధికాలు, అత్తరులు వాడవలసిన అవసరం రాదు.

ఒక్కటి మాత్రం మరచిపోకూడదు. శరీరం నుండి వెలువడే వాసనలన్నిటినీ వెడలగొట్టడానికి ప్రయత్నం చెయ్యడం కూడా శ్రేయస్కరం కాదేమో! మన శరీరం మీద నివసించే సూక్ష్మజీవులన్నీ మనకి అపకారం చెయ్యవు; కొన్ని ఉపకారం చేసేవి కూడా ఉంటాయి. ఉదాహరణకి ఘర్మజలంలో ఉండే ఆస్మోన్ (Osmone) అనే రసాయనం బాధల నుండి ఉపశమనం పొందడానికి, నరాలను ప్రశాంతంగా ఉంచేందుకు ఉపయోగించే పదార్థాల జాబితాలో ఉందట! చివరాఖరుగా, చెమటలో ఫెరెమోన్స్ (pheromones: pherein + hormone = ప్రసరించు + ఉత్తేజితం) అనే వాజీకరణ రసాయనాలు ఉంటాయిట. ఇవి స్త్రీ పురుషులను పరస్పరం కామోద్రేకానికి గురి చేసే రసాయనాలు. అందుకేనేమో నెపోలియన్ తాను యుద్ధభూమి నుండి ఇంటికి వచ్చేవరకు జోసఫీన్‌ని స్నానం చెయ్యకుండా ఉండమని అభ్యర్థించేడు!


సంప్రదించిన మూలాలు

  1. Diane Ackerman, A Natural History of the Senses, Vintage Books, Random House, NY, 1990.
  2. V. Vemuri, “Oust the Odour,” Science Reporter, A CSIR Publication, Vol. 30, No. 11, Nov. 1993.
  3. Jason B. Castro, Arvind Ramanathan, Chakra S. Chennubhotla, “Categorical Dimensions of Human Odor Descriptor Space Revealed by Non-Negative Matrix Factorization,” PLoS ONE, Vol. 8, No 9, 2013. e73289 DOI: 10.1371/journal.pone.0073289
  4. Public Library of Science, “What’s that smell? Ten basic odor categories sniffed out with math,” ScienceDaily, 18 September 2013.
  5. Brian Resnick, “Let’s obliterate the myth that humans have a bad sense of smell,” Nov 23, 2017.
  6. University of Cincinnati. “Research examines coping mechanisms for loss of smell from COVID-19,” ScienceDaily, 25 October 2021.
  7. Ariella Johnson, Flavarama: A guide to unlocking the art and science of flavor, Harvest, HarperCollins Publishers, 2024.
  8. Karen Kown, “A chemist offers a scientific approach to deliciousness,” Science News, p 29, April 20, 2024.
  9. “These Chemicals give teens strong body odor,” Science News, p 5, April 20, 2024.
  10. Kushagra Saini, Venkatnarayan Ramanathan, “Predicting odor from molecular structure: a multi-label classification approach,” Science Reports, 16 Aug 2022