నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? ఇది ఆథెన్స్ నగరవీధులలో తిరుగుతూ ప్రజానీకాన్ని జవాబుల కోసం తడుముకునేలా చేసిన గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ అడిగిన ప్రశ్నల లాంటి ప్రశ్న. ప్రతీవారికీ ఇబ్బంది కలిగించే ప్రశ్న. ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవలసిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏ విలువలకు లోబడి జీవించాలి? ఏ ఆదర్శాలకు నిలబడుతూ జీవించాలి? ఎలాంటి వ్యక్తిగా జీవించాలి? దేని కోసం పాటుపడాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ప్రతి మనిషికీ భిన్నంగా ఉంటాయి. ఆ జవాబులు ఏ మనిషికైనా వాళ్ళ మనసుల లోతులలోనుండే దొరకాలి, దొరుకుతాయి. ఈ రకమైన ఆత్మపరిశీలన చేసుకోని వ్యక్తి, సమాధానాలకై సంఘర్షణకు లోను కాని వ్యక్తి తనను తాను స్పష్టంగా, సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. తన పట్ల తనకే స్పష్టత లేని వ్యక్తికి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా స్పష్టత ఉండదు. అటువంటి వ్యక్తిత్వంతో తన పట్ల తనకే లేని నిజాయితీ ప్రపంచం పట్ల చూపగల అవకాశమూ లేదు. ఎన్నో కోణాలనుంచి తనను తాను అర్థం చేసుకొని తన బలాలు, బలహీనతలు విచారించుకోలేని వ్యక్తి, ప్రపంచాన్ని కూడా అదే కురచ చూపుతో కొలిచే ప్రయత్నం చేస్తాడు. ఎంతో సంక్లిష్టమైన మానవజీవితాన్ని, సామాజిక చలనాన్ని కేవలం కామెర్ల ఒంటికంటితోటే చూస్తాడు. తన చూపే నిజమని బుకాయించుకుంటాడు. మంచి చెడు అన్న ఒక అత్యంత బలహీనమైన కొలమానం మాత్రమే ఇటువంటి మనిషికి వాడటం తెలిసిన పనిముట్టు అవుతుంది, ఆ మంచి చెడు అన్నవాటి నిర్వచనాల పట్ల ఏమాత్రం స్పష్టత లేకున్నా, అవి స్వార్ధాన్ని, సందర్భాన్ని పట్టి మారుతునే ఉన్నా. వీటిని దాటిన ఆలోచన, ఆ ఆలోచనకు కావలసిన పరిశ్రమ, ఆ పరిశ్రమకు తోడు కావల్సిన సహానుభూతి, జీవితానుభవం ఇవేమీ ఈ తరహా మనుషుల నుండి ఆశించలేము. అందుకే, నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? అన్న ప్రశ్న జోలికి ఈ సమాజంలో అత్యధికులు ఎప్పుడూ పోరు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజం నిర్ణయించిన నడతకు, నిర్దేశించిన విలువలకూ కట్టుబడి ఉండటంలో తృప్తిగా వుంటారు. సమూహంలో ఒకరుగా జీవిస్తారు. తోలుబొమ్మలలాగా సమాజం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. వారి వలన మార్పు, అభ్యుదయం ఉండదు. సమాజచైతన్యం ఉండదు. కానీ ఇవి లేనిదే మనిషికి మనుగడ లేదు, ముందడుగు లేదు. తార్కికమైన వివేచన విచక్షణలు ఒక సంపూర్ణజీవితానికి అవసరమని, ఆత్మపరిశీలన చేసుకోని బ్రతుకు బ్రతుకే కాదని ఎన్నో శతాబ్దాల మునుపే ప్రతిపాదించిన ఆ సోక్రటీస్ ప్రశ్నలు ఇప్పటికీ మనమధ్య సజీవంగా, ఒక అవసరంగా ఉండటానికి కారణం ఇదే. ఈ రకమైన పరిశీలన సమాజపు నడతకు లోబడినవారికి అనవసరం అనిపించవచ్చు. కాని, సమాజంలో మార్పు కోరేవారికి, అభ్యుదయాన్ని ఆశించేవారికి, ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టం కావడం అవసరం. సంగీతసాహిత్య చిత్రలేఖనాది కళలను అభ్యసించే కళాకారులకు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అవసరం. తమకు సామాజిక బాధ్యత ఉన్నది అని నమ్మే తెలుగు రచయితలు ఈ రకమైన ప్రశ్నలతో తమను తాము పరిశీలించుకోవడం, తమ సాహిత్యాన్ని ఆ వివేచనతో సమీపించడం అత్యవసరం.