దొంగముద్దు

రాజారామ్‌కు కల పడుతోంది. అదే నిద్రలో తను కల కంటున్నానని కూడా తెలుస్తోంది. మళ్ళీ ఆ కలనే కలలోంచి బయటికి వచ్చి అదే నిద్రలో భార్యకు చెబుతున్నాడు. పిల్లాడి తల పూర్తిగా పలుచబడింది. పలుచబడటం అంటే దాదాపు వెనక పక్క వెంట్రుకలే లేవు. దాన్ని మరీ బండగా బట్టతల అనాలనిపించలేదు. ‘నేనంటే నలభైల్లోకి వచ్చాను; కానీ మరీ పద్నాలుగు పదిహేనేళ్ళకే ఇలాగా?’ మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, తింటున్న తిండి, కడుపులోకి పోతున్న విష రసాయనాలు – ఇవన్నీ గిర్రున తిరిగాయి. కొద్దిసేపు ఆ తలనే తేరిపార చూశాక, ఇదొక అంగీకరించాల్సిన కఠిన వాస్తవమని మనసును స్థిమితం చేసుకున్నాడు. తలను ప్రేమగా నిమరడానికి కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. ఆశ్చర్యం! ఇప్పుడు చూస్తే వాడి తల మామూలుగానే ఉంది. బహుశా అంతకుముందు సాయంత్రమే కొడుకు గొంతు మారినట్టుగా తొలిసారి గుర్తించడం ఇలాంటి కల పడటానికి కారణమైందేమో అనుకున్నాడు. వాడు పెద్దాడవుతున్న విషయం ఇలా కలగా మారి చూపిందేమో! ‘నీ గొంతు మారిందిరా’ అని చెబితే వాడు సిగ్గుపడ్డాడు. అంతకుముందటి సన్న నూగు మీసకట్టు ఇప్పుడు మరింత స్ఫుటంగా తెలుస్తోంది. ‘ఇక్కడ నాకు వెంట్రుకలు మొలుస్తున్నయి చూడు నానా’ అని చెడ్డీని ముందుకు జార్చి చూపించిన పసివాడు వాడు! రెండు మూడు నెలల తర్వాత ఇంటికి వెళ్ళిన నాన్నను వచ్చి గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడే వాడి భుజాల్లోకి కొత్తబలం వచ్చి చేరిందని రాజారామ్‌ గుర్తించాడు. ‘కనీ వాన్ని అట్ల అరగుండుతో చూసేసరికి దడుగ్గుమందే; వాడు నా కొడుకేనా అనిపించింది’ అని భార్యకు ఉద్వేగంతో చెబుతున్నాడు. ఆ చెబుతున్నప్పుడే తను కల కంటున్నానని అర్థమై, ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టయింది. కానీ ఆ కల కలిగించిన ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్పుడే కల, వాస్తవం కలగలిసినట్టుగా కొడుకు నిద్రలో రాజారామ్‌కు మరింత దగ్గరగా జరిగినట్టనిపించింది. ఆ చేరువ కొంత అసాధారణంగా అనిపించి, రాజారామ్‌ తన నిద్రలోంచి అర మెలకువ స్థితిలోకి వచ్చాడు. పిల్లాడు తనలో ఇంతకుముందు ముడుచుకుని పడుకోలేదని కాదుగానీ ఈ సామీప్యత భిన్నంగా ఉంది. రాత్రి పడుకున్నప్పుడు మంచాలను ఎత్తి, అందరూ కిందే చాపలు పరుచుకుని పడుకున్నారు. ఉన్న ఒంటి పరుపును మాత్రం ఒకవైపు వేశారు. ఆ సాకుగా బుజ్జిదీ, పిల్లాడూ అందులో పడుకునేట్టుగా; తనూ, భార్యా పక్కపక్కనే ఉండేట్టుగా ఎత్తువేశాడు రాజారామ్‌. తల్లి ముందటింట్లో మంచం వేసుకుంది. చాలా రోజుల దూరం కాబట్టి, అతడికి ఆత్రంగానే ఉంది. కానీ భార్య పడనియ్యలేదు. బుజ్జిదాన్ని పక్కలో వేసుకుని పరుపుమీద పడుకుంది. పిల్లాడూ, తనూ ఒకవైపయ్యారు. ఊరి నుంచి వచ్చాక పిల్లలనూ, తల్లినీ మనసారా దగ్గరికి తీసుకున్నాడు రాజారామ్‌. బుజ్జిదైతే కాసేపటిదాగా ఒడి దిగలేదు. కానీ భార్య మాత్రం అలా రాలేదు. ఇంకొకరి సమక్షంలో అలాంటి చనువును ఇష్టపడదు. మరీ ముఖ్యంగా అత్త ఉన్నప్పుడు. అది తెలిసినవాడు కావడంతో చెంప మీద మాత్రం సుతారంగా చేత్తో తట్టి, తన పనుల్లో పడ్డాడు. ఊరికి బయలుదేరడానికి రెండు మూడు రోజుల ముందునుంచీ భార్య తలపుతో అతడి ఒళ్ళు మరీ వేడెక్కింది. కానీ దాన్ని బాత్రూములో చల్లబరుచుకునే ప్రయత్నం చెయ్యలేదు. కౌమారంలో ఏదో సరేగానీ, ఇంత వయసుకొస్తూ ఇంకా ఇలా తీర్చుకోవాలా అనిపించి, నిగ్రహం పాటించాడు. ఆ నిగ్రహం రావడానికి తగిన మానసిక స్థితి కోసం కొంత సాధన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు భార్య అటువైపు పడుకోవడంతో, మూతి ముడుచుకున్నాడు. ఏం చేసినా భార్య అంగీకారం లేకుండా ఏమీ జరగదని ఇన్నేళ్ళ సంసారంలో అతడికి తెలుసు. జరిగినప్పుడే జరుగుతుంది లెమ్మని మళ్ళీ శరీరాన్ని తప్పక స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఉన్నట్టుండి తండ్రి చేయిని తన మీద వేసుకుని, కొడుకు మరింత దగ్గరగా జరిగినట్టు అనిపించింది. రాజారామ్‌ కలవరపడ్డాడు. దగ్గరికి జరుగుతూనే, తండ్రిగా ఒకింత దూరం కూడా ఉంచుకుని పడుకున్నాడు. కానీ రకరకాల ఆలోచనలు అతడి మనసులో తిరుగుతున్నాయి. పిల్లాడు పెద్దాడైపోతున్నాడని నిశ్చయమైపోయింది. వాడిలో కూడా ఆత్రం పుట్టిందా? పుడితే ఏమిటి దారి? వాడికి కూడా బాత్రూమ్‌ వ్యవహారం చెప్పాలా? చెప్పొచ్చా? వాడే తెలుసుకుంటాడా? మరీ ఇప్పటినుంచే మొదలా? ఏమాత్రం జీవితం మొదలైందని? కొడుకు శరీరం బరువు కూడా తనే మోస్తున్నట్టుగా రాజారామ్‌ శరీరం మీద బరువు పెరిగింది. ఉన్నట్టుండి ఒక చిన్న ముద్దు! రాజారామ్‌ ఒళ్ళు జల్లుమంది. నిద్రమత్తు పూర్తిగా వదిలింది. కళ్ళు తెరిచేందుకు ప్రయత్నించాడు. ఏవో లోకాల నుంచి రెప్పల మీదుగా మెలకువలోకి జారుతున్నట్టుగా కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. అర్ధరాత్రి అవుతున్నట్టుంది. లోపలి చీకటి, బయటి వెన్నెల కలగలిసిపోయాయి. కప్పలు, కీచురాళ్ళ శబ్దాలు కిటికీలోంచి తెలుస్తున్నాయి. కళ్ళు, ఒళ్ళు పూర్తిగా తెరుచుకునేసరికి భార్య రాజారామ్‌ పక్కలోంచి లేచివెళ్ళి, యథాస్థానంలో పడుకుంటోంది. అంత మసకలోనూ భార్య చెంపల్లో దొర్లిన కొంటె నవ్వును పట్టుకోగలిగాడు. రాజారామ్‌ మనసు, శరీరం ఒక్కసారిగా తేలికైనాయి. ఒకసారి ఒళ్ళు విరుచుకుని మళ్ళీ తృప్తిగా పడుకున్నాడు. అంతకుముందు అనుభవించినప్పుడు, అది తను అనుభవించాల్సిన అనుభవం కాదనుకుని ముడుచుకున్న శరీరం ఇప్పుడు విప్పుకుంది. అది సంపూర్ణంగా తను అనుభవించాల్సిన అనుభవమే అని అర్థమయ్యాక, జరిగినదాన్ని అణువణువూ తనివితీరా నెమరు వేసుకుంటూ పడుకున్నాడు. ఎప్పుడో గాఢంగా నిద్ర పట్టింది.

రాజారామ్‌ లేచేసరికి పూర్తిగా తెల్లవారింది. భార్య కనబడలేదు. లేచి ఇంటి పనుల్లో పడినట్టుంది. పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు. విప్పిపెట్టినా, కప్పుకునే అవసరం రాని తన చెద్దరును దగ్గరికి మడతపెట్టాడు. కాళ్ళ మీదికి చెదిరిన బుజ్జిదాని గౌనును సరిచేశాడు. వెళ్ళి, కిటికీ దగ్గర కాసేపు నిలుచున్నాడు. ఏ రాత్రో చిరుజల్లు కురిసినట్టుంది, వాతావరణం బాగుంది. మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చాడు. పిల్లాడు బోర్లా పడుకున్న పసిగుడ్డులా తోచాడు. వాడి తలను ప్రేమగా నిమురుతూ కాసేపు అక్కడే కూర్చున్నాడు.