వ్యభిచారం

[మనకున్న జ్ఞాపకశక్తికి కనుక కొంత పని పెట్టగలిగితే చాలా కొద్దికాలం క్రిందట ఏం కొనాలన్నా పర్సు తీయడమో, చేతులు జేబుల్లోని చిల్లర తడమడమో జరుగుతుండేదని, క్లింట్ ఈస్ట్‌వుడ్ మాదిరిగా చటుక్కున పిస్తోలు తీసి గురి చూసి కాల్చినట్లు ఊ! అంటే చాలు మొబైల్ తీసి క్యూ.ఆర్. కోడ్ కేసి సూటిగా చూపి పావలా, ముప్పావలా వస్తువుకి కూడా అనాయాస సునాయాస పద్దతిలో ఏదయితే ఇప్పుడు చెల్లింపు జరుగుతుందో అది భూమి పుట్టిన వెంటే జరగడం మొదలు కాలేదని నమ్మాలంటే కొంచెం మనసుకు కష్టంగానే ఉంటుంది.

ఒకానొక 2016 నవంబరు 8 అర్ధరాత్రి ఉన్నట్టుండి పెద్ద నోట్ల రద్దు అని ఒక వార్త వచ్చింది. దేనికైనా కూడా ముందు జాగ్రత్తతో ఉండి అడుగుగడుగు చూసుకుంటూ వేయాలని నేర్చుకోని బ్రతుకులో అలవాటు లేనివిధంగా డబ్బుల కోసం, చిల్లర కోసం, నిత్యావసరాల ఖర్చుల కోసం ప్రతి ఒక్కరు ఎన్ని తంటాలు పడాలో అన్ని తంటాలూ పడాల్సివచ్చింది. కొనుగోలుకు సంబంధించిన ప్రతి లావాదేవిలోనూ కష్టమే, ఏటీఎంల ముందు క్యూలు, కిరాణా షాపు ముందు క్యూలు, ప్రయాణానికి క్యూలు, హోటళ్ళ ముందు క్యూలు. ఆ క్యూల నాటి బతుకుని ఏ పుస్తకంలో నమోదు చేసుకోలేదు కానీ రికార్డ్ చేసి పెట్టుకుని ఉంటే బావుండేది. ఆ రోజుల్లోని ఒక సంఘటన: చిల్లర కావాలి. ఎవరూ ఇవ్వడం లేదు. సరేనని పోతేపోనీ అనుకుని ఒక హోటలు దగ్గరికి వెళ్ళి వేయి రూపాయల నోటు ఇచ్చి బిరియాని అడిగితే రెండు బిరియానీలను కొంటేనే చిల్లర ఇస్తాను అన్నాడు కౌంటర్లో మనిషి. మా ఇంట్లో ఉన్నది ముగ్గురం. ఒక బిరియాని ప్యాకెట్ పట్టుకుపోతే చివరలో కూడా కాస్త అన్నం మిగిలే జీర్ణపుష్టి మాది. రెండో ప్యాకెట్ ఏమి చేసుకునేది? అయినా సరే, రెండు బిరియానీలని కొని చిల్లర డబ్బులని కళ్ళకద్దుకున్నాము. ఇది ఒక ముచ్చట మాత్రమే. ఇందులో కష్టం ఏమాత్రము లేదు. కానీ ఈ నోట్ల రద్దు వలన చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. మనుష్యుల గుండెలు ఆగిపోయాయి, జరగవలసిన వైద్యాలు, అనేక శుభకార్యాలు ఆగిపోయాయి. సకలం అనుకోదగ్గ చాలా పనులు ఆగిపోయాయి, జీవితాలు చాలా నాశనమయ్యాయి.

నేను నా వృత్తిలో భాగంగా కథలను చదువుతాను, వాటికి బొమ్మలు వేస్తాను. కానీ నోట్ల కష్టకాలంలో నా కంటికి ఒక్కటంటే ఒక్కటి కూడా నోట్ల రద్దు కథ తాకలేదు, అటువంటి కథకు బొమ్మ వేయాల్సిన పని తగలలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మరీ బొత్తిగా ఆ విషయం మీద ఎక్కడా కూడా కథలు రాలేదు అని కొట్టిపడేసే మాట చెప్పలేను కానీ ఖచ్చితంగా నేను బొమ్మలేసే పత్రికలో మాత్రం అటువంటి ఒక్క కథను కూడా ఏ రచయితా రాయలేదు. బయటి ఒకటీ రెండు నిత్యం చదివే పత్రికల్లో సైతం ఈ సమస్య ఊసు కథారూపంగా కనపడలేదు. ఊరికే దీని సంగతి ఏమో చూద్దామని నోట్ల రద్దు గురించి కథలను గురించి వెదుక్కునే ప్రయత్నంలో 1979 నాటి సాహిత్య అకాడమీ వారి కన్నడ కథానికలు అనే పుస్తకంలో అశ్వత్థ అనే రచయిత వ్రాసిన వ్యభిచారం అనే కథ దొరికింది. వాస్తవానికి ఈ కథాసంకలనంలో ఉన్న కథలన్నీ చాలా బావున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనే వ్యవహారం ఒకటి కనుక నా అనుభవంలోకి రాకుండా ఉండి ఉంటే ఈ వ్యభిచారం అనే కథను గురించి నేను ప్రత్యేకంగా బుర్రలో పెట్టుకుని ఉండేవాడిని కాను. దేశ చరిత్రలో, 1946 నుండి 2016 వరకు మొత్తం ఐదుసార్లు భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగిందిట. ఈ కథా ఏ సంవత్సరపు రద్దు సంవత్సరంలో రాసినదో నాకు తెలియదు కాని, ఈ కథను చదివినప్పటినుండి, కథాసక్తి గల ఇతర పాఠకులకు ఈ కథను అందించాలి అనే కోరిక కొద్దీ దీనిని ఇప్పుడు అందుబాటులోకి తేవడమే కానీ మరే విశేషము లేదని మనవి, గమనిక. – అన్వర్.]


‘పిలానీ’ జయపూరు కోమటి. బక్క పలుచని శరీరం. మూడునాళ్ళ ఉపవాసము చేసిన ముఖము. చిన్న పరుపు చుట్టను చంకలో ఇరికించుకొని ఒక లోటా చేతబట్టుకొని తన ఊరినుండి బొంబాయికి వచ్చినాడు. వచ్చి కూడా అప్పుడే ఏండ్లు గడిచిపోయినవి. ఇప్పుడు అతని అంగడి మా ఇంటి ఎదురుగా ఎత్తైన అరుగుమీద ఉన్నది. పేరుకు చిల్లరంగడి. దానిలో దొరకని సామాను లేదు. ‘యుద్ధం’ మొదలైన తరువాత అతని వ్యాపారం బలే జోరుగా సాగింది. ధరల కంట్రోలు అమలు జరిగిన తరువాత అతని లాభము హద్దులు దాటెను. మితమైన వెలకు వస్తువు అమ్మితే అతని కులానికే అతియైన హాని కలుగుతుందని వాని నీతి.

ఉదాహరణకు చక్కెరను తీసుకోండి. దీని మీద సర్కారు కంట్రోలు మొదలైనప్పటినుండి ఇతని దగ్గర పెరగడం మొదలైంది. కంట్రోలులో దొరికిన చక్కెర చాలనివారికి (ఎవరికీ చాలదు) చుట్టుపక్కలవారికి పిలానీ దగ్గర కరువు ఉండదని తెలుసు. మీరు పోయి అడుగుతూనే అతడు ‘లేదు’ అంటాడు. ‘చక్కెర సర్కారీ దుకాణంలో ఉంటుంది, వేరే ఎక్కడ దొరుకుతుంది’ అంటాడు. మీరు కొంచెము నిలిచి ‘దయచేసి చూడండి నాకు చాలా అవసరమున్నది, ధర ఎంతైనా పరవాలేదు, అంతో ఇంతో మిగిలి ఉందేమో చూడండి’ అని అంటే పిలానీకి మీరు తుంటరులు కాదనీ, మీరు మంచివాళ్ళనీ అనిపిస్తే ‘సరే చూస్తాను, ఏమైనా ఉంటే మీకిస్తాను. కానీ వెల మాత్రం పౌనుకు పదణాలు అవుతుంది’ అంటాడు. మీరు ఆశ్చర్యంతో ‘ఆరణాలకు…’ అని అంటూ ఉండగానే అతడు మధ్యలో కల్పించుకొని, “కంట్రోలు మాట విడవండి, సరుకు జమ చేసుకోవాలంటే, పదణాలు నేనే ఈవలసి ఉంటుంది భాయి, అమ్మితే నాకు ఒక పైసా కూడ లాభం ఉండదు” అంటాడు. మీరు కొంచెం ధుమధుమలాడితే అతడు శాంతముగా కూర్చుని చివరకు, మీకు విసుగెత్తి, ఓడిపోయి నిట్టూర్పు విడుస్తూ ‘సరే కాని ఇయ్యండి, ఒక పౌను’ అంటే అతడు మీ మాటల ఉత్తరార్థాన్ని గమనించకుండా లోపలికి పోయి ఒక పొట్లము తెచ్చి, ‘ఇవిగో నా దగ్గర ఉండేదే ఇంత, విదిలించి తెచ్చినాను’ అని ఇచ్చిన రూపాయి నోటు తీసుకొని మీరేమైనా వెల తగ్గిస్తాడేమోనని ఆశపడుతూ ఉంటే హతాశులను చేసి సరిగ్గా ఆరణాలు ఎంచి కటిక మనస్సుతో ఇస్తాడు.

ఒకనాడు ఉన్నది ఉన్నట్లుగా కొబ్బెరనూనె వెలకు కంట్రోలు వచ్చెను. సరి, అప్పటినుండి అంగడిలో నూనె అదృశ్యము. దినాలు గడవగా ఇంట్లో ఉన్న నూనె ముగిసింది. తలకు మంచినూనె పూసుకొనే గతి పట్టింది. ముందు రోజు నేను పోయి పిలానీ దగ్గర మొరపెట్టుకున్నాను. మాటా మంచీ అయిన తరువాత అతని దగ్గర కొద్దిగా నాకు కావలసినంత నూనె ఉన్నట్లు, వెల కంట్రోలుకు ముందునాడు ఉన్న ధరకు రెట్టింపు అయినట్లు తెలిసెను. ఈ మాట వింటూనే వచ్చిన కోపాన్ని దిగమ్రింగి రెండు రూపాయలకు ఒక పౌను కొనుక్కొని అంగడి దాటుతూనే మనసులో పిలానీని శపించుకుంటూ కొంప చేరితిని. మా ఆవిడ దాన్ని తలకు రుద్దుకుంటూ ‘ఏమండీ! మీరు తెచ్చింది కొబ్బెర నూనా? మంచి నూనా? మంచినూనె మనింట్లోనే ఉంది’ అనెను. అప్పుడు నాలో అణగి ఉన్న కోపాన్ని ఎక్కడ చూపవలెనో తెలియక “అవన్నీ నాకు తెలియవు. తెచ్చిందాన్ని ఊరికే నెత్తికి రుద్దుకో” అని గదిరించితిని.

ఇట్లాంటి చీకటి వ్యాపారముతో అతడు ఎంత డబ్బు కూడబెట్టెనో ఊహించవచ్చు. ఆ విధంగానే తప్పుడు లెక్కలతో ఆదాయపు పన్నులు ఎగవేస్తూనూ ఉండవచ్చు. తెలివైనవాడు కావడంవల్ల అతడు చీకటి డబ్బు బ్యాంకులో పెట్టలేదని కూడ తెలుస్తుంది. అంతేకాక ఇతనికి దినదినమూ ఎక్కుతూ తగ్గుతూ ఉన్న వెండిని బంగారును రాసి బోసుకునే ధైర్యము చాలలేదు. ఆర్జన అంతా నమ్మిన సర్కారు నోట్ల రూపంలోనే ఉండెనని వేరే చెప్పనక్కరలేదు. ఇంకా స్పష్టంగా చెప్పవలెనంటే అతడు కూడబెట్టిన డబ్బు 25 వెయ్యి రూపాయల నోట్లుగా ఉండెను.

ఇట్లా ఉండగా జనవరి 12వ తేదీనాడు తెల్లవారి గుజరాతి పత్రికను తెరచినపుడు Demonetization శాననపు పిడుగు దొంగ వ్యాపారులు, లంచగొండులు అందరికీ సోకినట్లే అతనికి హఠాత్తుగా సోకెను. ‘500 రూ॥లకు పైన విలువగల నోట్లన్నీ రద్దు’ అనే పెద్ద అక్షరాల శీర్షిక కండ్లలో పడగానే పిలానీకి తల తిరిగి కన్నులు చీకట్లు క్రమ్మెను. గుండెలు దడదడలాడెను. శ్వాస నిలిచిపోయెను. చేతులు వణికి పత్రిక పడిపోయెను. నుదుటి మీద చెమటలు ధారలుగట్టెను. ‘అయ్యో చెడితి- చెడితి’ అని వాపోయినాడు పేద పిలానీ. వణుకుతున్న రెండు చేతులతో తల కొట్టుకున్నాడు. మళ్ళీ పత్రికను తీసుకొని బుద్దిని స్థిమితము చేసుకొని చూడడానికి కొంతకాలం పట్టెను. ఆ వివరాలు పూర్తిగా చదివిన తరువాత కొద్దిగా ఊపిరి ఆడెను. తల వ్రాత అంత పూర్తిగా చెడలేదు. పెద్ద నోట్లను మార్చుకోవడానికి కొంత గడువు ఇచ్చినారు. అయితే అవి మార్చవలెనంటే వాటి సంపాదనకు తగిన కారణాలు చూపవలెను. ఇందుకేమి చేయవలె? ఏమి చెప్పవలె? ఇంక పన్నుల గొడవ వేరే. శివశివ! వీటన్నిటికీ ఏమి ఉపాయం? చివరకు డబ్బంతా పోయినట్లేనా? దీనిని రక్షించుకోవడానికి పోయి జైలుపాలు కావలెనా? ఈ కష్టం గడిచి గట్టెక్కడం ఎట్లా?

పిలానీ తల పగిలేట్టు ఆలోచించెను. ప్రయోజనం కనబడలేదు. ఆనాడు రిజర్వు బ్యాంకు సెలవైనందువల్ల తొందరలేదు. పిలానీ దుకాణము మూసి పరుపు మీద పండుకొని నిప్పులో పడిన పురుగు వలె కొట్టుకున్నాడు. భోజనం ఒక ముద్ద కూడా లోపలికి దిగలేదు. పగలూ రాత్రీ జ్వరము వచ్చినట్లు బాధపడెను. అతని భార్య శాంతాబాయి ఇంక ఓర్పలేనట్లు కారణమడిగినది. కానీ అతడు ఏమీ చెప్పలేదు. ఊరికే కుములుతున్నాడు. ఊరికే ఉండలేడు. ఏమీ చేయడు. మరునాడు అతని స్థితి చెప్పడానికి లేదు. ఆ దినం బ్యాంకులో డబ్బు మార్చుకోవచ్చు. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వీలులేదు. దిక్కు తోచక విలవిలలాడెను. ఆనాడు ఉపవాసమే. నిద్రలేక కండ్లు లోతుకు పోయినవి.

ఈ స్థితిలో పిలానీ ఉండడం శాంతాబాయి ఎన్నడూ చూడలేదు. ఆమె భయపడెను. మరునాటి రాత్రి ఆమె మనస్సు దృఢం చేసుకొని “మీకు ఏదో పెద్ద జబ్బు పట్టుకొన్నది. వైద్యుణ్ణి పిలిపిస్తాను” అని భర్తకు చెప్పెను. అతడు వద్దనెను. ఆమె పట్టు విడవలేదు. అతడు సంగతి బయట పెట్టలేదు. చివరకు ఆమె బాధ పడలేక పిలానీ “నా రోగానికి వైద్యుల దగ్గర మందు లేదు” అని క్షీణన్వరముతో అనెను. ఆమె కోపంతో “రోగాన్ని వైద్యులుగాక వకీళ్ళు బాగు చేస్తారా” అని అడిగెను. పిలానీ “ఆఁ! ఏమంటివి వకీలా?” అనెను. అతనికి మనస్సుకు పట్టిన కారుమబ్బులో ఒక మెరుపు తళుక్కున మెరిసెను. ‘ఊఁ. తన వ్యాపార బుద్ధి పని చేయనప్పుడు వకీలు బుద్ధి ఉపయోగపడవచ్చు. ఇది పరీక్షింప వలసినదే’ అనుకొనెను.

పిలానీ కొంచెము సమాధానము తెచ్చుకొని భార్యతో “నీవు చెప్పడం మంచిదైంది. రేపే వకీలును చూస్తాను” అనెను. శాంతాబాయి “మీకు పిచ్చి పట్టి ఉండవచ్చు. రోగానికి లాయరేం చేస్తాడు? ఆయన దగ్గర జ్వరం మాత్రలు ఉంటాయా?” అనెను. “ఊఁ నా రోగానికి ఆయన దగ్గరనే మాత్ర ఉంటుంది” అని పిలానీ శాంతాబాయికి సంగతిని పూర్తిగా చెప్పెను. ఇద్దరూ కలసి ఆలోచించిరి. ఎంత ఎంత మథించినా నిరాశా హాలాహలమే పుట్టుతుండెను. ఆనాడు భర్తతో బాటు భార్యకూ నిద్ర పట్టలేదు. చివరకు వకీలు దగ్గరకు పోవడమే నిర్ధారణమైనది. కాని వకీలు డబ్బు చాలా గుంజునేమో అని పిలానీ చింత. అంతకంటే మార్గము లేదని శాంతాబాయి. కట్టకడకు తమ ఊర్లో ఉండే వకీలు శ్రీ ఇచ్ఛాపురిగారి దగ్గరకు పోతే అయినంత తక్కువ ఖర్చులో పని జరగవచ్చని నిశ్చయించుకొనిరి. తెల్లవారలేదని తహతహపడిరి. పిలానీ ఇచ్ఛాపురిని చూట్టానికి పోయినపుడు ఆ స్థూలకాయుడు లాయరు తన గదిలో బల్లమీద లావు లావు పుస్తకాలు పెట్టుకొని లావైన కళ్ళద్దాలతో పరిశీలిస్తూ ఉండిరి. పూర్వ పరిచయము ఉన్నందువల్ల వకీలు పిలానీని చూడగానే ‘కూర్చోండి’ అనిరి. కుశల ప్రశ్నలయిన తరువాత పిలానీ ‘అంతా తమ దయ’ అనగానే వకీలు పెదవులు సవరించుకుంటూ చిరునవ్వుతో పిలానీని చూచి:

“చాలా కాలానికి దయచేసినారు. సెలవియ్యండి” అనిరి.

“కొన్ని కష్టాలలో చిక్కుకున్నాను.”

“ఓఁ, ఈ డబ్బు చట్టం వల్లనా?” వకీలుగారు గట్టిగా నవ్విరి.

“తమకెట్లా తెలిసింది?”

“అహఁహఁహ! మబ్బులు పడితే వానరాదా?”

“”మీరు సరిగా ఊహించినారు.”

“పన్నెండో తారీకు నుండీ నాకు ఇది ఆరవకేసు. తెలిసిందా? అన్నీ ఇవే. నేను అందుకే ఈ గ్రంథాలన్నీ తిరగేస్తున్నాను. ఒకరి తరఫున సర్కారు మీదనే కేసుపెట్టినాను. అంతకంటే సులభమైన దారి ఇంకొకటి కనబడుతున్నది.”

“అంతమాత్రం మీరు ఉపకారం చేసినారంటే…”

“ఇందులో ఉపకారమేమి? మా సలహాను ఊరికే తీసుకుంటారా?”

“అట్లా కాదు. నేనేమో బీదవాణ్ణి.”

“ఊఁ! ఎవరు కాదు. ఇప్పుడు యుద్ధంవల్ల పదార్థాల ధరలు ఆకాశమంటుతూంటే.”

“నిజం.”

“సరే మీ డబ్బు ఎంత ఇరుక్కున్నది.”

“25 పెద్ద నోట్లు”

“ఊఁ” వకీలు ఆలోచించెను. అయిదు నిమిషాల తరువాత వకీలు పిలానీని చూచి ‘నా ఫీజు నూటికి పది రూపాయలు’ అనెను. పిలాని గుండెలు పగిలెను. ‘అబ్బబ్బ! 2500 రూపాయలా! అయ్యో! ఈ మాత్రానికి ఆ పాడు ట్యాక్సు కట్టడమే మంచిదేమో! ఇతడు తమ ఊరివాడని వస్తే ఇంత పీడిస్తాడేమి? ఇంకేమీ దారే లేదా?’ ఈసారి పిలానీ తన ధోరణిలో చింతాసక్తుడయ్యెను. అది చూచి వకీలు తన పుస్తకాల వైపు తిరిగెను. మనస్సులో గుంజాటన పడి పిలానీ వకీలు వైపు దీనంగా చూచి ఫలం కనబడక –

“ఇది నేను చాలా కష్టపడి సంపాదించిన ధనం.”

“ఎవరు కాదన్నారు?”

“అన్యాయార్జితం కాదు.”

“నాకు తెలీదా? మీరు చెప్పవలెనా?”

“ఏదో కూడబెట్టే రీతిలో పొరపాటు జరిగింది. అంతే.”

“అవును, పాపం అంతే కావచ్చు.”

“మీరు కొంచెం దయచేసి…”

“క్షమించండి. అది మాత్రం జరగదు. నియమానికి వ్యతిరేకంగా నడవను. అందులోనూ మీరు మా ఊరివాళ్ళని తక్కువే చెప్పినాను.”

ఒకటి రెండు నిమిషాలు నిశ్శబ్దం. పిలానీ సాధ్యమయినంత పట్టి చూచెను. వకీలు పాత రాయివలె కదలలేదు. ఇతడు తన గుట్టు తెలిసినవాడని, అందువల్ల తన పట్టు వదలడని, లాయర్లందరూ ఒకే గోత్రానికి చెందినవాళ్ళని ఆలోచించి పిలానీ గుండె రాయి చేసుకొని కండ్లు మూసుకొని ‘కానీయండి’ అనెను. వకీలు ముందు డబ్బు ఇమ్మనెను. అతడు బెదరి

“ఏమీ! ముందేనా?”

“అవును. – అది మా నియమం.”

“నా దగ్గర ఆ నోట్లు తప్ప వేరే పైసా కూడా లేదు.”

“ఊఁ.”

“ఖండితంగా. పది ఇరవై రూపాయల చిల్లరుంటే ఏమవుతుంది?”

వకీలుగారు వ్రేళ్ళతో పుస్తకము మీద తబలా వాయిస్తూ ఆలోచించిరి. ఆయన ఇది ఆరవ కేసు అన్నప్పటికీ నిజానికి ఇదే మొదటిది. కక్షిదారునికి నమ్మకము కలిగించడానికి అట్లా అన్నారు. వకీలు కదా! చేతికి అందిన పిట్టను విడవడానికి ఆయన మనస్సు ఒప్పలేదు. అందులోనూ తృప్తి అయిన ఫీజు దొరుకుతున్నది. అంత డబ్బు ఇచ్చే స్థితిలో లేడని గ్రహించినారు. అందువల్ల ఆయన “పోనీ! ఇందులో సగమైనా…” అని అంటూ ఉండగానే పిలానీ పరిస్థితి తనకు అనుకూలమగుతున్నట్లు గ్రహించి

“దేవుని సాక్షిగా చెప్పుతున్నాను. నా దగ్గర డబ్బేమీ లేదు. చేతికి వస్తే మీకు ఖండితంగా ఇచ్చుకుంటాను.”

వకీలుగారు ఎందుకో “ఊఁ” అనిరి. అన్న తరువాత ఆయనకే ఆశ్చర్యము కలిగెను. అన్నమాటను వెనక్కు తీసుకోలేక తరువాతి విషయాలు మాట్లాడిరి.

“మీకు పరాసు రోడ్డులో ఉన్నవాళ్ళ పరిచయం ఉందా?” వకీలు నవ్వుతూ అడిగెను. పిలానీకి ఆశ్చర్యము కలిగెను. అతనికి బొంబాయిలో పరాసు రోడ్డు వేశ్యలకు ప్రసిద్ది అని తెలుసు. వకీలుగారి ప్రశ్న అర్థమైనది. కాని అతడు ఈ గొడవలకు దూరముగా బ్రతికిన ప్రాణి అయినందున భయపడుతూ

“ఎందుకూ”

“ఏంలేదు. ఊరికే అడిగితిని.”

“అక్కడికీ నాకూ చాలా దూరము.”

“తెలుసు. అయినా ఇప్పుడు దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది.”

“అదెందుకూ?”

“అది నా రహస్యము ఉండనీ! అయితే నేనే దారి చూపించవలె అనండి.”

“హూఁ.”

“సరి. మీరు 11 గంటలప్పుడు ఆ లోకల్ రైలు నిలిచే స్టేషను దగ్గర నన్ను కలవండి. 11:23 నిమిషాలకు ఒక ఫాస్ట్ ప్యాసింజరు బండి ఉంది. మీ నోట్లన్నీ తీసుకురాండి.”

“సరే” అంటూ పిలానీ లేచెను.

“అట్లే రెండు సెకండు క్లాస్ టికెట్లు తీసుకోండి. కొద్దిగా డబ్బు చేతులో ఉండడం అవసరం” అని వకీలుగారు చివరి దెబ్బ కొట్టిరి. పిలానీ మొగము మాడ్చుకొని వెళ్ళెను.

రైలులో ఈ విషయమై మాటలు సాగలేదు. దొరల డ్రస్సులో ఉన్న వకీలుగారు సెకండ్ క్లాసు మెత్తల మీద సుఖంగా కూర్చుని ఎదుటి బెంచీ మీద రెండు కాళ్ళూ చాచి తమ పైపును ముట్టించి పీల్చ మొదలుపెట్టిరి. పిలానీకి విలువైన చుట్టల అలవాటు లేదు. అప్పుడప్పుడు మాట్లాడ్డానికి ప్రయత్నించి సరియైన జవాబు రానందున ఆయాసపడుతూ తాను తెచ్చిన పత్రికను చదువుతున్నట్లు నటిస్తూండెను. రైలు దిగి బయటికి రాగానే వకీలుగారు “టాక్సీని తీసికొని రా” అని పిలానీకి చెప్పెను. పైసా పైసా ముడివేసి ట్రాముకు ఖర్చవుతుందని నడిచిపోయే మార్వాడి తనలోనే గొణుక్కుంటూ వకీలు ఆజ్ఞ పాలించెను. లోపల కూర్చుంటూనే డ్రైవరు “ఎక్కడికి” అనెను. వకీలుగారు పిలానీని చూచి “చెప్పండి” అనిరి. దీన పిలానీ “పరాసు రోడ్డు” అనెను.

ఆ రోడ్డు రాగానే డ్రైవరు తిరిగి చూచెను. “ఇక్కడే ఆపమనండి” అన్న వకీలు మాటప్రకారము పిలానీ “చాలు. నిలుపు” అనెను. డ్రైవరు ముసిముసి నవ్వులు నవ్వుతూ బ్రేకు వేసెను. కారు ఒక పెద్ద మేడముందు నిలిచినది. మనవాళ్ళు దిగిరి. మీటరు మూడు రూపాయలు చూపిస్తూన్నా డ్రైవరు తృప్తిపడక ఇనాం అడిగెను. పిలానీ ఒక్కపైసా కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. డ్రైవరు పండ్లు కొరికెను. వకీలుగారు మధ్యవర్తిత్వం చేసి నాలుగు రూపాయిలు ఇప్పించిరి. మార్వాడి చాలా సంకటపడెను.

వకీలుగారు తలుపు తట్టగానే అవి తెరుచుకొనెను. ఆయన హుషారుగా ఈలవేసుకుంటూ లోపలికి జొరబడిరి. అనుయాయి వెంబడించెను. అతిథులకొరకై అలంకరించిన గదిలో వాళ్ళు కూర్చోగానే ఒక ముసలిది వచ్చి వకీలుగారిని గుర్తించి “స్వామిగారు దయచేసి చాలాకాలమైంది” అనెను. ఆయన “అవునవును” అంటూ చిరునవ్వు నవ్విరి. ఆమె “ఇప్పుడే సంగీతానికి ఏర్పాటు చేస్తాను. తమకు…” అంటూ ఉండగానే వకీలు మధ్యలో కలుగ జేసుకొని

“మాకిప్పుడు సంగీతం అవసరం లేదు. మీ అమ్మాయిలలో చురుకైన ఒక పిల్ల మా వెంట కొంతసేపు రావలసి ఉంటుంది. వీలవుతుందా?” అనిరి.

ముసలిది అనుమానించి “ఎందుకు వీలు కాదు. అయితే…”

“నీవేమీ ఆలోచించనక్కరలేదు. 2, 3 గంటలలోనే తెచ్చి విడుస్తాం” అని వకీలుగారు హామీ ఇచ్చిరి.

“ఆఁ, మీకు చెప్పవలెనా?” వకీలుగారు పాత గిరాకీ అయినందున ముసలిది ఒప్పకపోవడానికి కారణము లేదు. కాని ఆమె ఇదేదో విశేష సందర్భమని ఊహించుకొని తగిన ప్రతిఫలం రాబట్ట దలచి

“మంచి చురుకైన పిల్ల కావలెనంటే చార్జి ఎక్కువవుతుంది” అని నవ్వెను.

“ఏమాత్రం?”

“మూడువందలు.”

పిలానీకి మిన్ను విరిగి మీద బడినట్లయింది. వకీలు మాత్రం “కానీ దానికేం. ఈ స్నేహితులు యిస్తారు. పెద్ద శ్రీమంతులు. వారికేం” అని ముగించిరి. పిలానీకి వాత బెట్టినట్లయింది. కాని గత్యంతరమేముంది. ఎంత బాధయినా సహించక తప్పదు. ముసలిది పిలానీకి నమస్కారముచేసి మందహాసము చేస్తూ, దాసిని పిలిచి “పో, తొందరగా తాంబూలము తీసుకురా” అని పంపి “ఇప్పుడే అమ్మాయిని పంపుతాను” అంటూ వెళ్ళిపోయెను.

తాంబూలము వచ్చెను. దానితోపాటు బ్రాందీ సీసాలు, గ్లాసులు ఉండెను. వకీలుగారు ఒక సీసా మూత తీసి రెండు గ్లాసులు నింపి పిలానీకి ఒకదానిని ఇవ్వబోయిరి. ఈసారి మాత్రం పిలానీ వకీలు సలహా వినలేదు. తనకది సరిపోదని తల ఆడించెను. వకీలుగారు నవ్వి “మీరెందుకూ పనికిరారు” అని ఇద్దరి గ్లాసులూ తామే ముగించి మరీ మరీ పోయించుకొని త్రాగిరి. వారి మొగము పూర్తిగా ఎరుపెక్కెను. సీసాలు ఖాలీ అయ్యేవేళకు గాజుల చప్పుడూ, జరీ చీర ఫళా పళలూ వినవచ్చెను. సెంటు వాసన గుప్పుమనెను. చిరునవ్వులు నవ్వుతూ ఒక సుందరి గదిలో కాలుబెట్టెను. ఆమె రూపు, ఠీవి, బింకము, చురుకుదనము, వేషభాషలు చూచి పాత చుట్టమైన వకీలు కూడా ఆశ్చర్యపడిరి. ఆయన కనులు విరిసి మెరిసినవి. పిలానీకి గుండెలు నోటికి వచ్చెను. ఎద దడదడలాడెను. ఇంకా ఆ సుందరి కులుకుతూ వచ్చి అతిథుల మధ్య కూర్చోగానే పిలానీకి ప్రాణవాయువులు జారినట్లయ్యెను. తనకు తెలియకుండానే దూరంగా జరిగెను. వకీలుగారు ఉబ్బిపోయి ఆమెకు దగ్గరగా జరిగి సీసామూత తీసి బ్రాంది వంచిరి. వకీలు తన పని మరచిపోయినట్లే పిలానీకి తోచెను. ధైర్యము తెచ్చుకొని “వకీలుగారూ! మనకు ప్రొద్దు కాలేదా?” అనెను. వకీలు “అవును కాని టాక్సీ రావద్దూ! ఎవరికైనా చెబుదాం. అంతవరకూ” అంటూనే ఇక్కడి నుంచి బయటపడే అవకాశానికి చూస్తున్న పిలానీ “నేనే తీసుకవస్తాను” అంటూ లేచెను. టాక్సీ బాడుగ కూడ తగ్గించవచ్చు అనేది కూడా ఒక కారణము. “అట్లే కానీ!” అని వకీలు సంతోషముతో చెప్పి “మీరు వచ్చేవేళకు మేము సిద్ధంగా వుంటాం” అని అమ్మాయిని చూస్తూ ముగించిరి. అతడు వెళ్ళిపోయెను. వకీలుగారు వెంటనే ఆ సుందరిని కరచుకొని ముద్దు పెట్టుకొనిరి. ఆమె అతని జారిన చెక్కులను మృదువుగా నిమిరెను.

పిలానీ కారుతో వచ్చేవేళకు ఆ అమ్మాయితో వకీలు ఆటపాటలు ముగించి ఉండిరి. ముగ్గురూ టాక్సీ వెనుక సీట్లో కూర్చుంటున్నపుడు వకీలుగారు “రిజర్వు బ్యాంకికి అని చెప్పండి” అనిరి. కారు బయలుదేరి పోయెను.

ఆ దినం రిజర్వుబ్యాంకు భవనంలోనూ, చుట్టూ ఆవరణంలోనూ ఉన్న హడావుడి చెప్పనలవి కాదు. రోడ్డుకు రెండు ప్రక్కలా నూర్ల కొద్ది కార్లు, వాహనాలు వరుసలుకట్టి నిల్చి ఉన్నాయి. జనులు నిలిచిన వరుస లోపల ఎక్కడ నుండో మొదలై బయట వీధిలో వరకూ ఉంది. ఆ వరుసలో ఇంకా జనులు వచ్చి చేరుతూనే ఉన్నారు. ఎందరో అర్ధరాత్రి – తెల్లవారుజాముల నుంచీ కౌంటరు దగ్గరగా కాచుకొని ఉన్నారు. ఎందరో రౌడీలు డబ్బు లేకపోయినా గడిచిన సాయంకాలం నుంచీ అక్కడే పండుకొని ముందరి చోటు ఆక్రమించుకొని ఉండిరి. వాళ్ళ మనిషి ఒకడు అక్కడక్కడ తిరుగుతూ కౌంటరు దగ్గర చేరవలెనని తొందరపడేవారితో 10 రూపాయల వరకూ ఇప్పిస్తూ ఉండెను. ఈ డబ్బు చెల్లటం వల్ల అవతరించిన ఎన్నో దొంగ వ్యాపారాలలో ఇదీ ఒకటి.

క్యూలోని వాళ్ళు ఒకరినొకరు త్రోసుకుంటున్నారు. వారి మొగాలలో భయమూ, ఆతురత ఎత్తి కానవస్తూండెను. వాగ్వాదాలూ జరుగుతుండెను. చేతికి చేయి కలవకుండా, వరుసక్రమం పాడు కాకుండా, జనుల నడవడి చెడకుండా చూడ్డానికి పెద్ద నీలం అంగీ, పచ్చ రుమాల పోలీసు దళం కాచుకొని ఉన్నది. ఈ అధికారులు అప్పుడప్పుడు కేకలు వేస్తూ జనాన్ని అటూ ఇటూ త్రోస్తూ వరుసకు చేరుస్తూ తమ విధి నిర్వహిస్తూండిరి. తమ మాటను లెక్క పెట్టనివారిని పట్టుకొనిపోయి అక్కడే తిరుగుతున్న తెల్ల సూటు ఆంగ్లోఇండియన్ అధికారి ముందుబెట్టి ఆయన తీర్పునకు గురి చేస్తూండిరి. ఇప్పటికే ఎన్నో కేసులు దాఖలై ఉండెను. అవుతూ ఉండెను. అంతో ఇంతో పోలీసులకు సమర్పించుకొన్న తరువాత అక్కడికక్కడే కేసులు కొట్టివేయడమూ జరుగుతుండెను.

ఈ రంగస్థలానికి మనవారి టాక్సీ వచ్చి చేరింది. వకీలుగారు అమ్మాయికి ఒక కాగితము చేతికిచ్చి పిలానీతో “మీ నోట్ల కట్లను ఈమె చేతికివ్వండి” అనిరి. వకీలు ఆలోచన పిలానీ ఊహించినదే. అయినా 25 వేల రూపాయల నోట్ల కట్టను ఒక వేశ్య చేతికి ఇవ్వడానికి మనస్సు సంకోచించెను. అనుమానించెను. దీనిని చూచి వకీలు “ఏమి అనుమానిస్తున్నారా? ఇంతకంటే మార్గం లేదు. మీ డబ్బు మిగల వలెనంటే ఈమే గతి. మీరూ నేనూ ఇంత ధనం ఎట్లా సంపాదించినారంటే ఏం చెప్పగలం?” అని చిన్న ధ్వనితో అనిరి. పిలానీ నీళ్ళు మ్రింగుతూ నోట్ల కట్ట ఆమె చేతిలో ఉంచుతూ ప్రపంచాన్నే పోగొట్టుకున్న వానివలె చూచెను. ఇంక ఆమె ప్రపంచ పట్టాన్ని పొందినట్లు పొంగిపోతూ నోట్ల కట్టను తన తోలు సంచిలో పెట్టుకొనెను. ఆమె కారు నుండి దిగుతుండగా వకీలుగారు “నేను చెప్పింది తెలిసిందా?” అని అడిగిరి. ఆమె “ఓహో! అంతా తెలిసింది. జయించుకొని వస్తాను. చూస్తూ ఉండండి” అనెను. వకీలు పిలానీని చూచి “చూచినారా? ఎట్లా ఉంది” అనిరి. అతడు మాట్లాడలేక దిగులుతో ఏడ్వలేక నవ్వెను.

ఆడవాళ్ళ వరుస కురుచబడిందున ఆమె బ్యాంకి లోపలికి పోయెను. వకీలూ, కక్షిదారుడూ వెంటపోయిరి. ఆమె వంతు వచ్చేప్పటికి కొంత ఆలస్యమయెను. అంతవరకూ పిలానీ కలవరపడుతుండెను. ఆమె పూరించిన ఫారమును క్లార్కు చేతిలో పెట్టినపుడు అతడు మునివ్రేళ్ళతో నిలిచి చూచెను. గుమస్తా ఆ ఫారము చదివి ఆశ్చర్యముతో తలయెత్తి ఆమెను చూచి నవ్వుకొనెను. ఆలోచించి బంట్రోతును పిలిచి ఆ కాగితమును వాని చేతిలో పెట్టి “ఈమెను మేనేజరుగారి దగ్గరకు తీసుకొనిపో” అనెను. ఆమె వాని వెంట లోనికి పోగా చూచి పిలానీకి నోరెండిపోయెను.

మేనేజరు అమ్మాయిని “కూర్చోండి” అని ఫారమును చదివెను. ఆమె దిట్టంగా కుర్చీలో కూర్చొని ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండెను. అధికారి చదువుతూ ఆమెను చూచి నవ్వుకుంటూ పూర్తిచేసెను. తరువాత ఏదో ఆలోచిస్తూ తల ఆడిస్తూ బల్లమీద వ్రేళ్ళతో తబలా వాయిస్తూ రెండు నిముషాలు గడిపి తల గోక్కొనిరి. బొమలు ముడివేస్తూ అమ్మాయిని ప్రశ్నించిరి. “మీకు ఇంగ్లీషు వ్రాయడానికి రాదు కదూ?”

“ఔను.”

“దీన్ని ఎవరు రాసినారు?”

“తెలిసినవాళ్ళతో వ్రాయించినా.”

“ఎన్నాళ్ళ నుంచి ఇట్లా…”

“నాలుగేండ్ల నుంచి.”

“సరాసరి దినానికి ఎంత సంపాదిస్తారు?”

“అది చెప్పడం కష్టం. అదంతా వచ్చే గిరాకీని బట్టి ఉంటుంది. గొప్పవాళ్ళు వచ్చినట్లూ – ఇచ్చినట్లు పది నుంచీ వెయ్యికి మించి ఇచ్చేవాళ్ళుంటారు.”

“అహాఁ. – సరే. సరే.” అధికారి మౌనంతో కొంచెంసేవుండి మళ్ళీ యోచించి “అట్లయితే మీ దగ్గర ఇప్పుడు మీరు తెచ్చిన దానికంటే చాలా ఉండవలె గదా?”

“మీరనేది నిజమే. అయితే మా దగ్గర డబ్బు చేరినట్లంతా ఖర్చులూ పెరుగుతుంటాయి.”

“ఈ మాత్రమైనా ఎట్లా మిగిలిందీ?”

“ఇంత మాత్రం ఎన్నిసార్లో కూడింది – ఖర్చూ అయింది. ఇప్పుడు మాత్రం మార్చుకోవలసి వచ్చింది.”

“ఓహెూ! అట్లనా.” మరల కొంత సేపు మౌనం. “మరి ఇంకోప్రశ్న. “మీరు ఈ ఆదాయానికంతా లెక్క…?”

“మేము తీసుకొనే డబ్బుకు రసీదులిస్తామా? ఈవలెనా? మాకు లెక్క పక్కా ఎక్కడుంటుంది?”

“ఔను. ఔను.”

అధికారి మళ్ళీ ఆలోచనలో పడెను. ఏమి తోచలేదు. అసహాయతో, దాక్షిణ్యమో, సాహసమో, దౌర్బల్యమో, కాని ఆఫీసరు ఏదో చివరకు ఒక చీటిమీద వ్రాసి బంట్రోతును పిలిచి వాని చేతికిచ్చి ఆమెతో “మీరింక పోయి డబ్బు మార్చుకోవచ్చు” అనిరి.

అమ్మాయి సంభ్రమముతో వేయి రూపాయల నోట్లను నూరు రూపాయలుగా మార్చుకుంటూ ఉంటే పిలానీకి పట్టరాని సంతోషం కలిగెను. వకీలుగారు ఉబ్బిపోతూ “చూచినారా? నా తెలివి” అని మెల్లగా అనిరి. ఆమె నోట్లన్నీ జోడించుకొని చేతి సంచిలో పెట్టుకుని దగ్గరకు రాగానే ఆతురపాటు అణుచుకోలేక పిలానీ పరుగెత్తి పోయి ఆమె చెయ్యి పట్టుకొనెను. వాని కోసం విధి నిర్ణయించిన దెబ్బ ఆ సమయంలో తగిలెను. అమ్మాయి అతనికి డబ్బు యివ్వడానికి బదులు గంభీరంగా గొంతెత్తి “మీరెవరు? నా వల్ల ఏమి కావాలె” అని అడిగెను.

ఈ మాట చెవిలో పడగానే పిలానీ గుండెలు జారెను. వకీలుగారికి కూడా ఆశ్చర్యం కలిగెను. ‘ఓహెూ కథ అడ్డం తిరిగిందే’ అనుకొనిరి. దానికి తగిన ఉపాయం కనుకోవడానికి ఆయన మెదడులో అలజడి రేగి ముగిసే లోపలనే పిలానీ తట్టుకోలేక దిగులుతో “నా డబ్బు – నా డబ్బు” అంటూ పిచ్చివానివలె అరుస్తూ అమ్మాయి చేయి పట్టి నిలవేసెను. ఆమె “అయ్యో అయ్యో” అని కేకలు వేసెను. అక్కడున్న జనులు చుట్టూ మూగిరి, పోలీసులు వచ్చి “బద్మాష్” అంటూ పిలానీ మెడమీద చెయివేసి వెనక్కు త్రోసిరి. ఆమెను పట్టుకున్న చేయి విడిపోయెను. పోలీసులను చూచి “చూడండి వీడు నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చినాడు” అనెను. పిలానీ “లేదు – లేదు. నా డబ్బు” అనెను. ఆమె “కాదు. ఇది నా డబ్బు” అని గద్దించెను. పిలానీ “దీని మాటలు నమ్మకండి. ఇది బోగముది” అనెను. ఈ రభసలో ఆమె చమత్కారముగా వెనుకనుండి పోలీసువాని చేతిలో ఏమో పెట్టెను. వాడు ఆమెను చూచి నవ్వుతూ పిలానీ వైపు తిరిగి “కావచ్చు. ఆమెకు నీవేమి పుగుపాటుగా ఇచ్చినావా?” అనెను. చేరిన జనాలలో ఒకడు “సుఖపడలేదా?” అనెను. అందరూ గొల్లుమనిరి. “లంజి కిచ్చిన కాసు ఏట్లో వేసినట్లే. అదెక్కడి నీ డబ్బు” అని మరొక్కడు అనగా జనులు మళ్ళీ నవ్విరి.

పిలానీకి దీనితో మతి పోయెను. అతనికి ఏమి చేయవలెనో తోచలేదు. పోలీసువాడు దగ్గరకు వచ్చి “ఊఁ నడు, ఆఫీసరు దగ్గరకి” అని చెయ్యి పట్టుకొనెను. పిలానీ ఏదో చెప్పడానికి ప్రయత్నించెను. కాని అతడు వినకుండా “ఏదైనా చెప్పుకోవలసి ఉంటే వారికే చెప్పుకో” అని ముందుకు ఈడ్చెను. పిలానీ వెనక్కు చూస్తూ “ఆమె – ఆమె” అనెను. పోలీసు “ఆమె ఏమి చేసింది. అల్లరికి కారణం నీవు. నీవు ఆమె మీద దౌర్జన్యం చేయడం నా కండ్లతో చూచినాను” అనెను, గుంపులో నుంచి ఎవరో “సేటుగారూ! ఆమె దగ్గరకు తరువాత పోదురు లేండి. పాత పరిచయమే కదా. ఇప్పుడు పోలీసు ఠాణాలో హాజరుకాండి” అనెను. అందరూ నవ్విరి. మెల్లగా జారుకుంటున్న పిలానీని పట్టుకొని పోలీసు బలవంతముగా తీసుకొనిపోయెను.

ఇంతవరకూ మర్యాదకు కట్టుబడి, నాటకంలో భాగం వహించి జనుల దృష్టిలో పడడం ఇష్టంలేక వెనుక ఉన్న వకీలుగారు ఇప్పుడు తమ అపాయము గుర్తించిరి. మార్వాడీ పోలీసు అధికారి ముందు నిజం వెల్లడిస్తే తాను గూడ చిక్కుకుంటామని తెలుసుకొని పిలానీ వెంటపోయిరి.

వకీలుగారు అటు వెళ్ళగానే ఆ అమ్మాయి బయటికి వచ్చి టాక్సీని పిలిచి “బోరీ బందరు” అనెను. కారు వేగంగా విక్టోరియా టర్మినస్ చేరెను. అక్కడ మధ్యాహ్నం ఒకటీముప్పావు గంటకు బయలుదేరే మద్రాసు మెయిల్ సిద్ధముగా నిలిచి ఉండెను. ఇంక 15 నిమిషాలే వ్యవధి ఉన్నది. ఆమె 1-2 తరగతుల బుకింగు దగ్గరకు పోయి “నాకు మదరాసుకు ఒక టిక్కెట్టు కావాలె. త్వరగా ఇవ్వండి” అనెను. క్లార్కు ఆమెను ఆపాద మస్తకము చూచి “ఏ రోజుకు” అనెను.

“ఈ రైలుకే.”

“దీనికి ఒక్క టికెట్టు గూడా లేదు. అన్నీ బుక్ అయిపోయినాయి, ఖాలీ లేదు – కాలమూ లేదు. వారం రోజుల ముందు రిజర్వు చేసుకోవాలె.”

“ఉండవచ్చు. నాకు చాలా అవసరముంది. పోయి తీరవలె. ఏమైనా చేసి నాకు స్థలము ఇప్పిస్తే మీ ఋణము ఉంచుకోను” అంటూ ఆమె నూరు రూపాయల నోటు చూపెను. దానిని చూడగానే గుమాస్తా వర్తన మారెను. చురుకుతనముతో “మీరు ఇక్కడే ఉండండి. ప్రయత్నిస్తాను. నా చేతనైనంతా చేస్తాను” అని బయటికి పోయి వారితో వీరితో మాట్లాడి ఏర్పాటు చేసి వచ్చి “చూడండి ఫస్టు క్లాసులో ఒక సీటు మాత్రం సాధించినాను. చాల కష్టమైంది” అనెను. ఆమె “సంతోషం మీరు చాలా ఉపకారం చేసినారు” అంటూ టికెట్టు వెలతో బాటు అదనంగా నూరు రూపాయలు చేర్చి ఇచ్చెను. టికెట్టు దొరికెను. ఒక రైల్వే నౌకరు ఆమెను పిలుచుకొని పోయి మొదటి తరగతి పెట్టిలో కూర్చుండబెట్టెను. రిజర్వు చీటిలో ఆమె పేరు వ్రాయబడినది. రెండు నిమిషాలకు రైలు బయలుదేరెను. ఆమె మెత్తని పట్టుమీద విశ్రాంతిగా పండుకొని తనలో తాను ‘ఇది శివుని ప్రసాదమే. ఆయనను వంచించను. ఇప్పటికైనా మర్యాదగా బ్రతకడానికి స్వామి సహాయము చేసినాడు. పాడు లంజ బ్రతుకు చాలు. ఈ చెడ్డచోటు నుంచీ అయినంత దూరం దూరం పోవడం మేలు’ అనుకొనెను. ఆమె ఇష్టం పూర్తి చేయడానికా అన్నట్లు రైలు మహా వేగముగా పోయెను.

ఇక్కడ వకీలుగారు పిలానీ నోరు మూయించి ముఖ్య విషయాన్ని కప్పిపెట్టి, పోలీసు అధికారికి ఘనంగా చేతిలో పెట్టించి, అతన్ని విడిపించి, తమకూ మూడిన గండాన్ని తప్పించుకొని బైట పడేవేళకు అమ్మాయి జాడ లేదు. పిలానీ తాను దివాలా తీసినానని మొత్తుకొనెను. వకీలు ఓదారుస్తూ “అదెక్కడికి పోతుంది దాని కొంప విడిచి. రాండి అక్కడికే పోదాం” అనిరి. టాక్సీ చేసుకొని పరాసు రోడ్డుకు పోయిరి.

అక్కడికి అమ్మాయి రాలేదని తెలుసుకొని వకీలుగారు దిగ్భ్రాంతులైరి. పిలానీకి ప్రాణమే పోయినట్లయింది. యజమానురాలికి పిల్ల తప్పించుకున్నట్లు తెలిసి “అయ్యో దాని మీద రెండువేల రూపాయలు పోసినానే” అని గోడాడెను. వకీలును చూచి “మీ తెలివితక్కువ వల్ల అంతా నష్టమైంది. మీ వల్ల మోసపోతి. చాలాకీ పిల్లతో వ్యవహరించేప్పుడు చాలా చురుకుగా ఉండవద్దా?” అని చీవాట్లు పెట్టెను. పిలానీ వకీలును చూస్తూ

“దానికై నేను 20 వేలు ముండ మోసినాను. మిమ్ములను నమ్మి నేనూ పాడైనాను.”

వకీలుగారికి కోపం వచ్చింది. “నాదేమో మంచి ఉపాయమే. నీ పిచ్చితనానికి, దురదృష్టానికి ఎవరేం చేస్తారు. వ్యాపార వ్యభిచారంలో సంపాదించింది ఇంకో వ్యభిచారిణికే చేరిపోయింది. అంతే” అని తిరస్కార భావంతో చెప్పినారు.

పిలానీ తిరగబడి “మీ ఆధిక్యం మాత్రం ఏముంది. మీదీ బుద్ధి వ్యభిచారమే. అందుకే మీకూ సున్నా అయింది” అని కసి తీర్చుకొనెను. తన దుర్గతికి ఏడ్చెను.

వేశ్యమాత “మీ సావాసం చాలు. దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి” అని గద్దించెను.