చిన్న చిన్నవి

కొన్ని పెదవులు
రాళ్ళు రువ్వుతాయి
కొన్ని మౌనపు ముళ్ళు గుచ్చి
చంపుతుంటాయి

పూలకు తెలుసా
పరిమళం గురించి
కొందరు మనుషులూ అంతే


కొలనులో జాబిలిని
అందుకుందామని
కొమ్మ వంగుతుంది

ఆశల నది పారుతూనే ఉంటుంది
ఎక్కడ ఆనకట్ట వేయాలో
తెలుసుకోవడంలోనే ఉంది
కిటుకంతా


వేసవి ఎండ
కాల్చుకు తింటోంది
మల్లెల సౌరభం
మలాము రాస్తోంది

ఎగిరొచ్చే మాయ మాటలను
అరిగించుకోలేక
గాలి మూలన కూలబడింది
అందుకే ఇంత ఉక్కపోత


మామూలు అక్షరాలే
కొన్ని వజ్రాలు పొదిగితే చాలు
కవిత్వపు మెరుపులే

వెన్నెల ఎప్పట్లాగే
తలుపు తడుతోంది
మనిషే తన లోకంలో పడి
తీయడం మరచాడు

సముద్రాన్ని చేరాలని
నది తొందరపడుతుంది
చేరాక అదృశ్యమవుతుంది
జీవితపు పరుగూ
అంతే