త్యాగరాజు – సాహిత్యము

త్యాగరాజస్వామి సిద్ధిపొంది, నూరేళ్ళు దాటిపోయింది. చెన్నపట్నమూ, బెజవాడా, రాజమహేంద్రవరమూ వంటి పట్టణాలలో శతవార్షికోత్సవాలు వైభవంగా జరిగినవి. కాని ఈయుత్సవాల ఫలితంగా త్యాగరాజు సంగీతరచనకన్న సాహిత్యరచనకే ఎక్కువ ప్రచారము జరిగినది. చెన్నపట్నములో రసికరంజనీ సభలో వినబడిన ఉపన్యాసాలూ, రాజమహేంద్ర వరపు గౌతమీవిద్యాపీఠమువారు ప్రచురించిన త్యాగరాజ శతవార్షికోత్సవ సంచికలోని వ్యాసాలూ, ములకనాటి సభవారి సంచికా, బెజవాడ కార్యక్రమమూ, అన్నీ కూడా త్యాగరాజు సాహిత్యవిభూతినే ఎక్కువగా ప్రచారము చేసినవి. రాజమహేంద్రవరపు ఆంధ్రగానకళా పరిషత్తువారు ‘త్యాగరాజ కీర్తనలు’ సవ్యాఖ్యానముగా ప్రచురించి త్యాగరాజు సాహిత్యానికి పరిషన్ముద్ర వేశారు. టి.వి. సుబ్బారావు పంతులుగారు త్యాగరాజు కవిత్వము కబీరు కవనాన్ని మించిపోయిందనేశారు. వీరభద్ర శాస్త్రిగారు త్యాగరాజుని మహాకవి అన్నారు.

శతవార్షికోత్సవోత్సాహంలో ఈరీతిగా ఎందరో ఉస్తాదులు ‘బస్తీమే సవాల్’ చేశారు. త్యాగరాజస్వామిని ఇంతవరకూ గుర్తించుకోలేకపోయిన తెలుగుజాతికి ఆయన ఘనతను చూపించేయత్నంలో పైపండితుల యుత్సాహశకటము సంగీతరస్తా తప్పి సాహిత్యరస్తాలో సుదూరము సాగిపోయినది. ఇన్ని సంస్థలలో ఏ ఒక్కటీకూడా త్యాగరాజు కీర్తనలను మొత్తంగా స్వరసహితంగా ప్రచురించలేదు. రాజమహేంద్రవరము వారు ‘త్యాగరాజశతవార్షికోత్సవ కార్యక్రమమూ’ ‘8వ వార్షికోత్సవ సంచికా’, ‘త్యాగరాజ కీర్తనలు—సవ్యాఖ్యానమూ’, మొత్తము వేయిపుటల్ని మించిపోయిన గ్రంథము ప్రచురించారు. స్వరపరచిన ‘అపురూప’ కీర్తనలు నూరు అచ్చై ఎట్టకేలకు వచ్చినవి. నూరు కీర్తనలు! దానితో కథ కంచికి పోయింది! తక్కిన ఐదువందల కీర్తనలూ అందరికీ అందుబాటులో ఉన్నట్లే పై పరిషన్నిర్వాహకుల నమ్మకమన్న మాట.

ఏతావతా శతవార్షికోత్సవానికి ఆంధ్రులు వెలువరించినది — కబుర్లుతీసి వేరే పెట్టినట్లైతే – నూరు కీర్తనలు! త్యాగరాజస్వామి మహా గాయకుడూ, వాగ్గేయకారుడూ అయివుండగా మనము ఆయన నొసటికి సాహిత్యకుంకము పెట్టి ఊరేగించుకోడము మనకు రసికమండలిలో గౌరవాపాదకము కాదు. సంగీతకళకు ఔన్నత్యము చేకూర్చిన కారణము చేతనే త్యాగరాజునకు గౌరవము వచ్చినది కాని అందమైన సాహిత్యభావములను వెలిబుచ్చినందుకు కాదు. ఆయన జన్మము ద్రావిడభూమిలో. ఆయన రచించినది సమకాలికులకు ఎందరికో తెలియని తెలుగు భాషలో. ఈనాటికీ తెలుగు తెలియని దాక్షిణాత్య విద్వాంసులు ఆయన కీర్తనలు వినిపిస్తున్నారంటే, ఆ కీర్తనలలోని భావాలకు తన్మయులై కాదు, వాటిలోని సంగీతకళావిన్యాసమునకు ముగ్ధులై ముగ్ధులను చేయుటకే. సాహిత్యభావాలు ఎలాగున్నా సంగీత రచన గొప్పగానున్న కారణము చేతనే దక్షిణదేశమందంతటా ఆయన పేరు మారుమ్రోగినది. ఆయన కీర్తనలలోని వాక్కులు చేలమాత్రములే. సంగీతమే వాటికి జీవము. అలాంటప్పుడు త్యాగరాజు సంగీతాన్ని వెనుకకు నెట్టి సాహిత్యాన్ని తీసుకొచ్చి ప్రదర్శించడము బిరుదైన కార్యమా?

భరతుని కాలమునాటికి గాంధర్వకళ స్వరతాళ పదాశ్రయము. జాతక కథలలోగాని, బౌద్ధశిల్పములలో గాని తాళమూ, జంత్రమూ లేని గాంధర్వము కానరాదు. హీనయాన బౌద్ధులు గాంధర్వమును ఇంద్రియలోలత్వము కలిగించు కళగా పరిగణించి బహిష్కరించినా, బ్రాహ్మణ మతాభిమానులైన గుప్తరాజులు జంత్రగానమును స్వయముగా సాధకము చేయుచు పోషించిరి. హర్షుని కాలమునాటికి నాటకాలలో తాళాశ్రయములే అయిన పదములు పాడు పద్ధతి ప్రారంభించినా పదకొండో శతాబ్దమువరకూ పదములలో సూత్రప్రాయముగా మెలగిన రాగము ప్రత్యేకముగా గుర్తించబడినట్లు కనబడదు. నృత్య గీత వాద్యముల చేరికయే సంగీతము (సభ్యకళ) అనే పరిగణన అదృశ్యమై పద రాగతాళముల చేరిక కూడా సంగీతమే అనే అభిప్రాయము అప్పుడు ప్రబలినది. సేనరాజుల కాలములో రాగము సాహిత్యపు ఛాయలోనే ఒదిగియుండినట్లు జయదేవుని అష్టపదులు సాక్ష్యమిస్తాయి. పురందరదాసు రచనలలో రాగానికి కొంచెము సంకెళ్ళు సడలినట్లు కనబడినా రామదాసు కీర్తనలలో అక్షరస్వరాలే మామూలైనాయి. తాళ్ళపాకవారు పల్లవి అనుపల్లవీ చరణమూ అనే రచనలతో కీర్తనా శిల్పాన్ని పెంచారు. క్షేత్రయ్యా, జావళీకర్తలూ, కీర్తనలను చౌక కాలానికి దింపుటతో కీర్తనలలోని సంగీతానికి కాస్త ఊపిరి తిరిగింది. దీక్షితులవారి సంస్కృత కీర్తనలలో కావ్యభాషే అధికారము చలాయించినా, రాగము సెలయేరులాగ మెలికలు తిరిగి ప్రవహించి తన చైతన్యాన్ని స్ఫురింపజేసింది. చైతన్యమయుడైన త్యాగరాజు చేతిలో రాగానికి అధికారము వచ్చింది. ఒకే చరణమును మూడేసి సంగతులు చేర్చి పాడే ఆచారము ఆయన కల్పించారు. ఉమాకాన్తవిద్యాశేఖరులన్నట్లు ఒక్కమారువింటే సాహిత్యభావము బోధపడిపోతుందే రెండు మూడు మార్లు వినిపించడము దేనికి? సంగీతానికి వైశాల్యం కలిగించడానికే. దీనికి తోడు త్యాగరాజ కీర్తనల హ్రస్వరూపము ఒకటి బాగా తోడ్పడింది సంగీత విస్తృతికి. పదిపన్నెండు చరణాలలో బండ్లవరుసవలె కనపడే రచనలముందు, ఒకటి, రెండు చరణాలతో సొంతమైపోయే త్యాగయ్యకీర్తన చంచలచైతన్యమూర్తియైన హరిణశాబకమువలె ముగ్ధమనోహరంగా విహరించింది. సంగీతరచనకీ చైతన్యమలవర్చినది త్యాగయ్యయే. ఆయన కీర్తనలు రసజ్ఞుల నాకర్షించుటకిది ముఖ్య కారణము.

భక్తిపూరితములైననూ మీరాబాయి కీర్తనలు మధురభావపూరితములై శృంగారమునే ధ్వనించినవి. కబీరు ప్రబోధగీతములలో సాహిత్యమే గరీయసి. సంగీతము ఆయన ఉపదేశములకు వాహనము మాత్రమే. జయదేవుని అష్టపదులకు రాధామాధవుల శృంగారమే వస్తువు. పురందరదాసు శ్రీకృష్ణుని లీలావిలాసమును కీర్తించెను. విజయనగర పతనానంతరము ఆ రాజసభలలో పూజలందిన రాసిక్యము దక్షిణదేశానికి వలసపోయింది. రాధికాసాంత్వనమూ, విజయ విలాసమూ బట్టి ఆనాటి పరిస్థితుల పరిమళము కొంత తెలుస్తుంది మనకి. క్షేత్రయ పదములూ, జావళీలూ ఆనాటి రచనలే. ఈరీతిగా తొలిరోజులనుంచీ సంగీతముతో హద్దూపద్దూ లేని శృంగారము చేరి వుండడాన్ని బట్టి నటవిటగాయకులు క్షుద్రులుగా గణించబడేవారు. ఆ కారణము చేతనే కాబోలు త్యాగరాజు తండ్రి రామబ్రహ్మముగారు త్యాగరాజు గొంతులో పరవళ్ళు తొక్కే సంగీత సరస్వతి అందెల మ్రోత వినీకూడా త్యాగరాజుని సంస్కృత పాఠశాలలో ప్రవేశపెట్టారు. కీర్తనలు ఆశువుగా రచించే ఉత్సాహంలో కూడా త్యాగరాజు ‘నటబిట క్షుద్రుల’ ‘కామమోహదాసత్వా’న్ని ఈసడించి, సంగీతజ్ఞానము భక్తివినా సన్మార్గము కాదని కీర్తించి, తొలిసారి ఉజ్వలమైన స్వరరాగ సుధారసమును భక్తితో చేర్చి ఇచ్చినాడు. ఆయన కాలమువరకూ జగన్మోహనమైన సంగీతము రమణీతారుణ్యానికే అంకితము. తన కీర్తనలన్నిటా రామనామమును ధ్వనింపజేసి, నరహరిస్తుతినేగాని నరస్తుతి చేయక, శిష్టాచార సంప్రదాయమును తొలగనీయని పద్ధతిని ఉంఛవృత్తివల్ల జీవనముచేసి, త్యాగరాజస్వామి గాయకులకు గౌరవము సంపాదించి పెట్టి వారిని నటవిట వర్గమునుంచి తప్పించినాడు. పరమేశ్వరునికి అంకితమైన సుందర సంగీతమును నాయన్నారులకు తర్వాత దక్షిణదేశము, త్యాగరాజు కాలములోనే విన్నది. సమకాలిక జనసామాన్యమునకు అర్థయుతముగా బోధపడకున్ననూ, భక్తిపునీతమైన ఆయన కీర్తనావళి దూరదేశములకు కూడ వ్యాపించుటకిది రెండవ కారణము.

త్యాగరాజస్వామి చేతుల్లో సంగీతము సౌందర్యాన్నీ సౌశీల్యాన్నీ అలవర్చుకుంది. ఈ కారణాల చేత ఆయన రచనలకి వ్యాప్తి వచ్చింది కాని ఆ కీర్తనలలోని సాహిత్యభావాలవల్ల కాదు. ఇప్పుడు కదా ఆయన కీర్తనలు తెలుగుదేశంలో వినపడుతున్నాయి? దేశమంతటా తిరిగి వింటే నూటికెక్కువ కీర్తనలు వినబడతాయంటారా? సాహిత్యభావం అర్థం చేసుకోగల మనవంటి రసికులకే అక్కరలేక పోతున్నాయే, మరి దక్షిణాదివారికి సాహిత్యాన్ని బట్టి కావలిసి వచ్చాయంటారా త్యాగరాజు కీర్తనలూ? మన తెలుగువారికి త్యాగరాజు తెలుగుదనముతోనేగాని ఆయన కీర్తనా సంగీతంతో నిమిత్తం లేదు. త్యాగరాజు తన కీర్తనలను సంగీతంలో మూర్తీభవించినాడుగాని తెలుగులో మూర్తీభవించలేదు. దక్షిణాదివారు పాపం తెలుగు ఏమీ రాకపోయినా, కీర్తనల సంగీతం కోసం వాటిని వల్లించుకున్నారు. వారితో సంగీతవిద్యలో పోటీ చెయ్యలేక, త్యాగరాజు కీర్తనాసాహిత్యాన్ని అరవలు పాడుచేస్తున్నారూ, మేముద్ధరిస్తున్నామని మనము బోరవిరచి ఉపన్యాసాలిస్తున్నాము.

కీర్తన చెఱకుగడ అయితే సాహిత్యము పిప్పీ సంగీతము రసమూను. కీర్తన ఒక వర్ణ చిత్రమునుకుంటే సాహిత్యము వర్ణలేపనాని కాధారమైన పటము మాత్రమే.

తొలిరోజులనుంచీ నేటివరకూ సంగీతము పొందిన వికాసాన్ని పరిశీలించుకుంటే, సంగీతకళ క్రమక్రమముగా సాహిత్యశృంఖలాల్ని తెంచుకుని తన స్వత్వాన్ని నిరూపించుకున్నట్లు తెలుస్తుంది. త్యాగరాజు, సంగతుల పద్ధతివల్ల కీర్తనకి ప్రాణము సంగీతమే అని నిరూపించడమే కాకుండా సాహిత్యాన్ని ఇష్టమువచ్చినట్టు విరిచి పారేశాడు. ఆయన కాలమువరకూ కీర్తనలలోని పాదములు మధ్యన ఆపకుండా పూర్తిగా పాడడము పరిపాటి. త్యాగరాజు కీర్తనలలో సంగతులు పాడే అలవాటువల్ల సాహిత్యాన్ని అడ్డదిడ్డముగా విరవవలసి వస్తోంది. కీర్తనలో సంగీతమే ప్రధానము గనుక సాహిత్యానికి జరిగే ఈ ‘అపచారాన్ని’ గురించి నేటి కాలపు ఆంధ్రాభిమానులు తప్ప త్యాగరాజుగాని, ఆయన శిష్యులుగాని బాధపడియుండినట్టు లేదు.

నేటి ఆంధ్ర గాయకులు త్యాగరాజుకంటె సాహిత్యాభిమానం బలిసినవారు కనుక, అడ్డదిడ్డపు విరుపు వచ్చినప్పుడు వెనకటి చరణంలోని అక్షరాల్ని ఎరువు తెచ్చుకుని, ‘గో-పురద్వారమున’ ‘శివమనో-విధ మెరుగరు’ అని పాడుతూ, — వ్యాకరణసూత్రాభిమానులు పూర్వకవుల వ్యావహారిక భాషాప్రయోగాల్ని దిద్దేసి సమర్థించినట్లే — త్యాగరాజు ‘యేమరిపాటును’ సమర్థిస్తున్నారు. కాని ఆ పండితులకు యతిస్థానాలలోని ప్రయోగాల్లానే, ఈ భాషాగాయకులకు, ‘బాగాయెనయ్య’, ‘చక్కని రాజమార్గము’, ‘రామ నీ సమానము’, ‘ఎంతని నే వర్ణింతును’ ‘నీవాడ నేగాన’ వంటి కీర్తనలు చిక్కు తెస్తాయి. వీటిలో పైపద్ధతిని సర్దుబాటు వీలుకాదు. అసలీరకంగా సర్దుకోవాలని త్యాగరాజు అభిప్రాయము కానేకాదు. ఏమంటారా? గురుశిష్య న్యాయముగా దిగివచ్చిన గానపద్ధతిలో ఈ సర్దుబాటు కనబడదు. ఈ విరుపువచ్చినచోట్లలో, యతి, విరిగిన ముక్కలోని మొదటి అక్షరానికే గాని ఆ ముక్కని పూర్తిచేసే మాటయొక్క మొదటి అక్షరానికి లేదు చూడండి, ‘(రా)జీవాక్ష, సాధుజన జీవన సనాతని’, ‘(సం)త్రాణగానలోల త్యాగరాజనుత’, ‘ఫలము నీకు తనకు లేదనుచు పాలింపలేదా’. పద్యంలోకన్న పాటలో యతియొక్క సౌందర్యము హెచ్చు. రెండక్షరాలూ వివరంగా వినబడినప్పుడే ఆ అందము తట్టుతుంది. ఈ రెండక్షరాల్నీ ఒత్తిపలకాలని త్యాగరాజు యతిస్థానంలో వేస్తే వెనక పదాల్ని ఈడ్చుకువచ్చి, సాహిత్యం పాడవకుండా రక్షించాలని కంకణము కట్టుకొని సంగీతంలోని అందం చెడగొట్టడానికి మనకేమి హక్కున్నది?

మరొక సంగతి. కీర్తనకి పల్లవీ అనుపల్లవీ చరణమూ అనేవి అంగములు. పల్లవి రాగస్వరూపాన్ని సూచిస్తుందీ, అనుపల్లవి ఆరోహణావసానాన్ని సూచిస్తుంది. చరణము రాగానికి చెందిన ఇతర ప్రస్తారాల్ని సూచిస్తుంది. పల్లవీ అనుపల్లవీ చేరి రాగముయొక్క పూర్తిరూపాన్ని చూపిస్తాయి. అలానే చరణాలు పూర్తిగా పాడితే రాగము యొక్క పూర్తిరూపాన్ని చూపిస్తాయి. చరణపు మొదటి అక్షరంతో ఆ రాగానికి చెందే ప్రస్తారము ప్రారంభించి చివరిభాగంలో అంతమౌతుంది. సాహిత్యం అడ్డదిడ్డముగా విరిచే చోట, విరిగిన ముక్క మొదటి అక్షరముతోనే చరణముయొక్క సంగీతము మొదలుపెడుతుంది. ఒకే గీతమీది బిందువులతో ప్రారంభమై సమాంతరముగా సాగిపోయే రేఖలలాంటివి ఒక కీర్తన చరణాలు. వీటి మొదళ్ళని స్థానభ్రష్టము చెయ్యకూడదు. కీర్తనా శిల్పాన్ని గుర్తించుకుంటే ఈ నియమము యొక్క ప్రాముఖ్యము తెలుస్తుంది. కీర్తనను సాహిత్యపు విరుపులు సర్దుబాటుచేసి పాడబోయేవారు సంగీతముమీద అభిమానమున్న వారు మాత్రము కారు.

అనుప్రాసాన్ని ధారాళంగా కావాలని కోరి త్యాగరాజు వాడినట్లు ఎన్నో కీర్తనలు సాక్ష్యమిస్తాయి. వీటిలోని అనుప్రాసము పాడుతుంటే చక్కగా వుంటుంది. సాహిత్యదృష్టితో చూస్తే అసహ్యంగా కనబడుతుంది. ‘తరాన దొరకని, పరాకు నాయెడ, నురామ జేసితే, సురాసురలు మె, త్తురా యిపుడు యీ, హరామి తనమే, లరా భక్త త్యాగరాజనుత’ అన్న ఒక ఉదాహరణము, ఇలాటివి చాలా ఉన్నాయి. వీటి అందము పాడినప్పుడే గాని మాటలు విన్నప్పుడు కాదు. ఇక త్యాగరాజును ‘మహాకవి, విప్లవకవి’ అని గొప్పలు చెప్పుకున్నవారు ‘మహాకవి’ శబ్దార్థాన్ని గాని, త్యాగరాజు మాటకారీతనాన్ని గాని పరిశీలించినవారు కారంటాను. ఆయన వాక్యాలలో ముక్కలు మింగేస్తారు! స్వాధీనము కాని చోట భాష ఎలా నడిస్తే అలా నడిపిస్తారు! అన్వయానికి తిలోదకాలిస్తారు. కావలిస్తే, మాటలకి శుద్ధ క్షౌరము చేసి ప్రయోగిస్తారు! పులగపు సమాసాలు పాడతారు! అరవపు జాతీయము వాడతారు! మాటలు తుంచేస్తారు! ప్రాసలు తప్పుతారు, పడికట్టు రాళ్ళుపయోగిస్తారు, కవిత్వపు జిత్తులు ప్రయోగించబోయి కాలుజారతారు! ఇక మహాకవి అనగా యేమిటి! అయితే ఆరువందల కీర్తనలు రాసినప్పుడు, ‘విదులకు మ్రొక్కెద’ ‘ఉండేది రాముడొకడు’ ‘అలకలల్ల లాడగ’ వంటి చక్కని భావాల అందపురచనలేవో కొన్ని రాకపోతాయా? వీటినీ, మనకి వచ్చిన భాషలో కీర్తనలు రాశారనీ పట్టకుని మహాకవి పట్టాన్ని కట్టిన వారేపాటి రసికులూ?

త్యాగరాజు కీర్తనలు కబీరు కవిత్వాన్ని మించి పోయాయని రాసిన సంగీత సుధానిధులు సంగీతాన్ని గురించిన తమ అభిప్రాయాన్ని సాహిత్య వీధుల్లోకి తోలేరంటాను. కబీరు కవనాన్ని అర్థము చేసుకోగలిగిన వారనవలసిన మాట కాదిది. వీరే మరొక చోట ‘ఎందుదాగినాడో’లో గంభీరమగు తోడి రాగముచేతనే తన ‘చింత వెలిబుచ్చినాడ’న్నారు. అంటే ‘కీర్తనాసాహిత్యభావములకు అనుకూలముగా నీతను రాగమును’ వాడినాడని వారి అభిప్రాయము. వీరికే కాదు, పెక్కురు సాహిత్య మనస్కులకు ఈ అభిప్రాయము ఉన్నది. ఇది విన్నవారికి కూడా యిష్టముగా తియ్యతియ్యగా వుంటుంది. కాని కొంచెము పరిశీలన చేస్తే ఈ డబాయింపు ఎంత అసందర్భమైనదో బోధపడుతుంది.

కీర్తనకి చాలా చరణాలుంటాయి. రెండుమూడు చరణాలున్నవీ కలవు. కీర్తనలోని పల్లవీ, అనుపల్లవీ చరణమూ మూడింటినీ, ఒక్కొక్కటి మూడేసి సంగతులువేసి పాడుట మామూలు. చరణాలన్నిటికీ సాధారణముగా సంగీత రచన ఒకలాగే వుంటుంది. అందుకే ఒక కీర్తనని స్వరయుక్తంగా రాసుకునే విద్యార్థులు ఒక చరణానికి మాత్రమే స్వరము రాసుకుంటారు. నాలుగు చరణాలున్న కీర్తనని దేనినైనా తీసుకోండి ఈ చరణాల సాహిత్యభావాలు వేరుగా వుంటాయికదా? (లేకపోతే నాలుగు చరణాలు కల్పించడమెందుకూ?) ఈ భావాలన్నిటికీ సంగీతరచన ఒక్కటే! అంటే, ఒకేరీతిని నడిచే సంగీతము మూడు వేర్వేరు భావాలని ఆవేశిస్తుందన్న మాట. ఇది ప్రతి కీర్తనలోనూ జరిగే సంగతి. ఇక ‘రసానుకూల’ ‘సాహిత్యానుకూల’ రచన అనగా ఏమిటీ? అనుపల్లవికీ, చరణాల చివరిభాగాలకీ సంగీతమొక్కటే. ఇందుకు బాగా పనికొస్తాయి. త్యాగరాజ కీర్తనల కట్టలు పరిశీలించి చూడండి వీటికి ‘భావానుకూల్యత’ ఉన్నదేమో? కీర్తనయొక్క నిర్మాణంలోనే లేనిదాన్ని ‘గిరిపై నెలకొన్న’ లోంచి ఒకపుల్లా, ‘ఎందు దాగినాడో’ లోంచి ఒక గడ్డిపోచా తెచ్చి కాకిళ్ళు నిర్మించి నిరూపించటము సాధ్యమా?

సంగీతజ్ఞులు చేయదగిన పని మరొకటి సూచిస్తాను. తోడిరాగములోని కీర్తనలన్నీ కూర్చి, వాటి సంగీత రచనను పరిశీలించి, సంగీత రచనా సామరస్యమున్నచోట్ల సాహిత్య రచనలను పట్టిక వెయ్యండి. ఇప్పుడు చెప్పండి వీటి సామరస్యపు కబుర్లు. లేదా సాహిత్యరచనా సామరస్యమున్న కీర్తనల భాగాల్ని కూర్చి, వాటి సంగీత రచనలకి సామరస్యమున్నదేమో చూడండి.

ఇంతకూ చెప్పబోయేదేమిటంటే త్యాగరాజుని సాహిత్యపుటద్దాలతో కాదు చూడవలసినది. ఇంతవరకూ మన దురదృష్టమువల్ల సాహితీపరులే త్యాగరాజుని పట్టుకున్నారు. వీరి లేఖినులు చెయ్యగలిగినదేదో చేసినవి, చెయ్యవలసిన పనిమాత్రము జరగలేదు. శరభోజీ మహారాజూ, స్వాతి తిరుణాళ్ ప్రభువూ విన నువ్విళ్ళూరినది, గణేశభావే, గోవింద మారార్, సుందరేశ మొదలియార్, శ్రీరామమూర్తీ, తిరుపతి వెంకటేశ్వరుడూ, విని సంతోషించిన పాలసముద్ర తరంగ ఘోషము తెలుగునాటికి వినిపించే యత్నము జరగాలి. అదీ బిరుదైన పని.

అయితే త్యాగరాజు సాహిత్యానికి ఏమీ ప్రయోజనము లేదా? అని అడుగుతారు కొందరు. లేకేమి? త్యాగరాజు మహాభక్తుడు. ఎరిగిన భగవద్రూపాలన్నిటినీ భక్తితో కొలిచినవాడు. ద్వైతాద్వైత మతాల బోధలు అనుభవమువల్ల పరీక్షించిన సాధకుడు. పరమ భక్తుని ఆధ్యాత్మిక వికాసాన్ని చూపించ నెంచేవారికి కీర్తనల సాహిత్యము సాయపడవచ్చును. కాని కీర్తనారచనా కాలముల వరుస తెలియదు కనక రచయితకు ఆధ్యాత్మిక వికాసమంటే వుండే అభిప్రాయాలనుబట్టియే కీర్తనాసాహిత్యాలను రచయితే పేర్చుకుని వేదాంతచర్చ చేయవలసివస్తుంది. త్రిలింగరజతోత్సవ సంపుటంలోని ‘త్యాగరాజ స్వామి ప్రశస్తి’ అనే వ్యాసం ఇలాటి యత్నమే. స్వంతంగా వేదాంతచర్చ చెయ్యక త్యాగరాజు మాటలనే పరమపదసోపానములాగ అమర్చేయత్నము కూడా ‘త్యాగరాజు ఆత్మవిచారం’ అనే పుస్తకంలో భమిటిపాటి కామేశ్వరరావుగారు చేశారు. అయితే దీనిలో అక్కడక్కడ త్యాగరాజు రచనలోని తియ్యందనాలు ఇమిడ్చినప్పటికీ, ‘భాష మొత్తంమీద భమిడిపాటివారిదే’. అసలు త్యాగరాజు ఏమన్నాడో తెలుసుకోవాలంటే త్యాగరాజు కీర్తనల్ని చూసుకోవలసివస్తుంది ఒకటీ, త్యాగరాజు భక్తి రసానికి వీరి హాస్యరసము చేరుకుంది రెండూ ప్రయోజనాలు. త్యాగరాజు సంగీతమూ వద్దూ, ఆయనగారి సాహిత్యమూ వద్దూ మనకి! మరేమిటి కావాలీ?

(మొదటి ప్రచురణ: భారతి, ఆగస్టు 1952, భాద్రపదము, నందన నామ సంవత్సరము.)