త్యాగయ్యగారి నాదసుధారసం

[సాహిత్యమును వెనుకకు నెట్టి నూతనసృష్టి చేసిన త్యాగయ్య గాన ప్రతిభ అంటూ త్యాగరాజు సంగీతసాహిత్యాలను విశ్లేషిస్తూ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి మరొక వ్యాసం ఈమాట జనవరి 2019 సంచికలో చదవండి. – సం.]

శ్రీ త్యాగయ్యగారు ప్రపంచానికి ప్రసాదించిన వరం గంగానదివలె మూడు మార్గాలతో ప్రవహించింది. శ్రీరామభక్తి, కవిత, గానం. ఈ మూడు తత్త్వాలున్ను పూర్వజన్మార్జితమైన పుణ్యం చేతనే తప్ప మనుష్య ప్రయత్నంతో గాని, ఆకస్మికంగా గాని లభించేవి కానంత గొప్పతనంతో ఇంచుమించుగా ఉన్నవి. అయినా వంశపరంపరగా ఇంటిసొత్తుగా కూడా ఆయన పాలికి దొరకినవని చెప్పడానికి కావలసినంత సాక్ష్యం ఉన్నది.

త్యాగయ్యగారి ప్రియశిష్యుఁడైన సౌరాష్ట్ర వేంకటరమణ భాగవతులు తన గురువుగారి జీవిత చరిత్రను కొంతవరకూ సంగ్రహంగా వ్రాసి పెట్టినాడు[1]దీనిని వ్యయసంవత్సరాది సంచికలో ‘ఆంధ్రపత్రిక’ వారు ప్రకటించిరి. మూలం మధుర సౌరాష్ట్ర సభవారివద్ద గల తాటాకుల ప్రతి.. దానిలో త్యాగయ్య తండ్రి రామబ్రహ్మంగారిని గూర్చి ఈ మాటలున్నవి: ‘వీరు శ్రీమద్రామాయణ, భాగవత, భారతాది ప్రసంగాదులయందు ప్రవీణులును, తంజావూరు తులసింగమహాప్రభువుల వారి సంస్థానంలో శ్రీమద్రామాయణ ప్రసంగం చేసి శ్రీరామనవమి గర్భోత్సవము సలిపి అనేక సన్మానములనొందిరి, ఆ ద్రవ్యాల చేత తన యింట్లో శ్రీరామనవమి జననోత్సవమును అతి విమర్శగా చేయుచునుండును.’

త్యాగయ్యగారి తాతగారైన గిరిరాజ బ్రహ్మంగారిని గురించి ‘వీరు సకలవిద్యలయందును సమర్థులు’ అని మాత్రం పై చరిత్రలో గలదు. కాని ఎట్టయాపురం సుబ్బరామ దీక్షితులు గిరిరాజకవిని గూర్చి ‘ఇతడు సంస్కృతాంధ్ర భాషలలో మిక్కిలి ప్రజ్ఞగలవాడు. సంగీత విద్యాసంపన్నుడు. ఇతడు తెలుగున భక్తి రసముగాను, వేదాంతవిషయముగాను బహుకీర్తనముల జేసి ప్రఖ్యాతిని బొందినవాడు’ అని వ్రాసినారు[2]సంగీత సంప్రదాయ ప్రదర్శిని పూర్వభాగం. వాగ్గేయకారుల చర్రిత, పుట 17.. ఐతే, ‘మాయా నీ వంచన నడువదు| మాటాడక పోవే’ అనే కాంభోజి రాగం వేదాంత కీర్తన ఒకటే సుబ్బరామదీక్షితుల పుణ్యాన చిట్టతోపాటు మనకు లభించింది[3]అదే. ఉత్తరభాగం. అనుబంధం (B) ఫుట ౬౦..

తక్కినవి నాకు దొరకలేదు. ఐతే తంజావూరు సరస్వతీ మహలు భండారంలో శాహమహారాజును, శరభోజిమహారాజును నాయకులనుగా జేసి, గిరిరాజకవి రచించిన శృంగారపదాలు కొన్ని నూర్లకైనా తక్కువ కాక, దిక్కూ దశా విచారించేవారు లేక మూల్గుతూ ఉన్నవి. ఆయన రచించిన తెలుగు యక్షగానాలు గూడా కొన్ని అక్కడ కలవు. గిరిరాజకవి తండ్రి పంచనద బ్రహ్మంగారు కూడా ‘వేద శాస్త్ర పురాణాదులయందు నిపుణుడు’ అని పై త్యాగరాజ చరిత్రలో ఉన్నది. కనుక త్యాగయ్యగారి పూర్వీకులలో కనీసం మూడు తరాలవారు సంగీత, సాహిత్య భగవద్భక్తులకు పేరుపొందిన వారనిన్నీ, అందుచేత ఆయనకా మూడు విషయాలున్నూ వద్దన్నా వదలక, ఉగ్గుపాలతో వచ్చినవనిన్నీ చెప్పడానికి సందేహం లేదు. మరి అనిర్వచనీయమైన ఆయన ప్రతిభాశక్తి చేత ఆమూడూ చాలా ప్రబలించినవి. మూడూ ఒకదానికొకటి వర్చస్సునిస్తూ పెరిగినవి. ఒకదానితో మరి రెండూ ఎప్పుడుగాని విడిపోక ఏక కుటుంబంగా నడచినవి. సంగీతానికి ఉల్లాసం ఎక్కువైన సమయంలో భక్తి సాహిత్యాలూ భక్తి ఉద్రేకించిన వేళలో సంగీత సాహిత్యాలూ కావ్యకళ మెరసినప్పుడు భక్తి సంగీతాలూ వెనుక నిలచి మేళం నడిపించినవి. ఈ త్రివేణీ సంగమాన్ని ఇంత స్పష్టంగా మనం త్యాగయ్య జీవితమందే చూడవచ్చును. ఈ మూటినీ ఆయన ఆత్మోత్తారణకై సాధించి ఉపాసించినాడు. కీర్తి, ద్రవ్యం, ప్రతిష్ఠ మొదలైన యే ఇతర ఫలాలనూ ఆశించక, ఇతర జీవులూ తరించవలెననే ప్రపంచానికి మూటినీ వెదజల్లినాడు.

ఐతే, ఆయన ధారాళంగా ఇచ్చిన ఈ తత్త్వత్రయాన్ని మనమెంతవరకు గ్రహింపగలము? ఎంత జీర్ణించుకోగలము? మనకీ మూటిలో ఏది ముఖ్యం? ఏది గౌణం? ఈ విషయంలో నా దృష్టిని మాత్రం ఇక్కడ మనవి చేస్తాను.

త్యాగయ్యగారి భగవద్భక్తి నావంటివాని యోగ్యతకు చాల దూరం మించిన మహాతత్త్వం. ఆయన భక్తి సంస్కారం గొప్పది. కనీసం నాల్గుతరాలది. ఇంక ఆయన సాధన అతిమానుషమైనది. పుట్టినది నిర్గుణైక బ్రహ్మవాదులైన స్మార్తబ్రాహ్మణుల కులంలో, పెరిగింది శివుడు, విష్ణువు, స్కందుడు, పార్వతి, లక్ష్మి, సరస్వతి, తులసి, విఘ్నేశ్వరుడు మొదలైన అన్ని దేవతలకు సమానంగా మొక్కులు చెల్లించవలసిన సంప్రదాయంలో. ఈ పద్ధతిలో ఏ దేవతావ్యక్తి యందుగాని ఆత్మీయత అనే భావాన్ని దృఢంగా అనుభవించే అవకాశం చాలదు. కాబట్టి భజన సంప్రదాయముండినా భక్తి సాధన ఈ సన్నివేశంలో మహాకష్టం. భక్తిజ్ఞానాలు రెంటికీ ఏకాగ్రత ముఖ్యసాధనమే. కాని, అన్వయంలో రెంటికీ ఎంతో భేదమున్నది. మనోమార్గాలను సంకోచపరచి నిర్గుణతత్వాన్ని సాధించే ‘సోహం’ సిద్ధాంతం జ్ఞానమార్గం. వాటిని వికాసపరచి అనంత కల్యాణగుణపరిపూర్ణతత్వం ప్రత్యక్షీకరించుకొనేది భక్తి పంథ.

ఐనా ఈ భక్తి మార్గానికి భిన్న రూపగుణచరిత్రాదులు గల బహుదేవతల పూజాపురస్కారాలు సాధకములు కాజాలవు. ఏదో ఒకవ్యక్తిని పరదేవతగా భావించి, సమీపించి, అనుభవించి, ఉపాసించవలసి ఉంటుంది. తక్కిన దేవతలు, మునులు మొదలైవారెంత గొప్పవారైనా ఆ మూల దేవత కనుచరులుగానే గమనింపవలసి ఉంటుంది. ఇట్టి పరమైకాంత భక్తికి పునాది చాలా చిన్నతనమందే త్యాగయ్యకు వేసినారు. ‘గోలిగుండ్లాడే’ ప్రాయమందే తండ్రి రామబ్రహ్మం కొడుకుకు రామనామోపదేశం చేసినాడు. తరువాత ‘ఐదారు దినములకే’ రామకృష్ణానంద స్వాములనే యతీశ్వరుడు శ్రీరామషడక్షరీమంత్రాన్ని అంగన్యాస కరన్యాసాలతో ఉపదేశించినాడు. ఆ మంత్రాన్ని అది మొదలు దినమొకటింటికి లక్షయిరువదియైదువేల నామముల ప్రకారంగా జపిస్తూ త్యాగయ్య తమ ముప్పది యెనిమిదవ ప్రాయమున తొంభైయారుకోట్ల నామములను పూర్తి చేసిరి[4]కె. వి. శ్రీనివాసయ్యంగారి త్యాగరాజకీర్తనలు, పీఠిక, పుట 17 అని ఒక కథ. మూడుమార్లయినా కోటిజపం ముగించినాడని వేంకటరమణ భాగవతుల వ్రాతవల్ల తెలుస్తుంది. ఎట్లయినా త్యాగయ్య తన ఆయుష్కాలంలో చాలాభాగం శ్రీరామమంత్ర జపానికి వినియోగించినాడనే మాట సత్యం. దానికితోడు త్రికాల పూజ; మిగిలిన కాలం కీర్తనల రచనకు. భక్తిరసం ప్రవహించే తొమ్మిది మార్గాలలో త్యాగయ్య దేనినీ విడువక అన్నిటినీ సాధించినాడు. కనుకనే ఆయన జీవితమంతా ప్రధానంగా రామమయమైనది. ఇతర దేవతలపైన శ్రద్ధ సళ్ళింది. తుదకు సీతాదేవిమీద గూడా ఎక్కువగా చిత్తసమాధి కలిగించుకొనే అవకాశం ఆయనకు లేకపోయింది. అభిమానంలో తారతమ్యాన్ని విచారిస్తే శ్రీరాముని తరువాత తక్కిన అన్ని దేవతలకంటె పార్వతీదేవిమీద ఆయనకు ప్రతిపత్తి ఎక్కువగా ఉన్నట్టు కానవస్తుంది. ఈ రామభక్తి వికాసమార్గంలో పెరిగి పెరిగి తుదకు శ్రీరాముడు కూడా త్యాగయ్య పాలికి తన మేరలన్నీ దాటి సర్వాత్మకుడైన పరమాత్మగా ప్రత్యక్షమైనాడు. ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట’ మొదలైన కీర్తనలలో ఈ పరిణామం స్పష్టంగా కానవస్తుంది.

తక్కిన పెద్దలంతా భక్తికిఫలంగా భుక్తిముక్తులు రెండూ కావలెనని కోరుతూ ఉండే కాలంలో త్యాగయ్య ముక్తి ఒక్క దానికే వేకారినాడు.

‘రామా నీపై తనకు ప్రేమపోదు
భోగానుభవంబులందు బాగుగా బుద్ధినీయదు’

అని తన మనోగతిని ఆయన ఘోషించినాడు. దేశమంతా చిన్న చిన్న రాజులు, జమీందార్లు, పాళేగార్లు, దోపిడికాండ్లు మొదలైనవారి చేతులలో నలిగి ఛిన్నాభిన్నంగా చెడి చెటాకులగలుస్తూ ఉన్న కాలంలో, కుంపిణీ తెల్లదొరలు వారినీ వీరినీ తగలబెట్టి తమాషా చూస్తూ ఉన్న సమయంలో, రాజులనీ అధికారులనీ పేరు పెట్టుకొన్నవారి అడుగులకు మడుగులొత్తకపోతే, వారిమీద పదాలో పద్యాలో కట్టి పొగడి పైకెత్తకపోతే, బ్రతుకేలేని సన్నివేశాలలో,

‘దుర్మార్గచరాధముల దొర నీవనజాలరా’
‘జేనెడుదరమునింప నే నరుల పొగడితినా’

అని రామునితోనే మొరబెట్టుకునే విరక్తి, హఠం, శ్రద్ధ, నిర్లక్ష్యం అలవరచుకొని ఎనభై యేండ్లు దినగండం దీర్ఘాయుస్సుగా జీవిత సూత్రాన్ని బిగబట్టి నడిపినాడు! ఇటువంటి సంస్కారబలం, సంప్రదాయశుద్ధి, సంకల్పదార్ఢ్యం, సాధన తీవ్రత లేకపోతే భక్తి వట్టి బహిర్లేపమో, వేషమో అవుతుంది. ఈ కాలంలో ఎంతమందికీ గుణాలు ఎంతమట్టుకున్నవో నాకు తెలియదు. నామట్టుకు నాకు లేవనేది సత్యం.

ఇంతేకాదు. శివభక్తులు, దేవీభక్తులు, స్కందభక్తులు మొదలైనవారి మాట అట్లుండనియ్యండి. వైష్ణవులలోనే కొందరికీ రామునికంటే కృష్ణునిమీదా నృసింహునిమీదా భక్తిభావం ఎక్కువగా ప్రసరిస్తుంది. ఇది వ్యక్తులందు ఎన్నో కారణాల చేత కలిగే చిత్త దౌర్బల్యం. త్యాగయ్య కూడా దీనికి తప్పలేదు. పై కృష్ణాది మూర్తులమీదా శాస్త్రానికి రెండు మూడు కీర్తనలు మాత్రం ఆయన రచించినాడంతే. కాని, ఆయన లక్ష్యమంతా, నమ్మకమంతా

‘కోదండపాణి రూపముతో వెలసినవాడేరా దైవము’

అనే వ్యాపించింది. కనుక ఆయన భక్తిమార్గం వైష్ణవ హిందువులలోనే ఎక్కువ వ్యాపింపజాలదు. మరిన్నీ ఏ భక్తిగాని కొన్ని సంకేతాలకూ, సంప్రదాయాలకూ లోగి ఉండక తప్పదు. విష్ణుభక్తికి రామానుజ, మధ్వాది సంప్రదాయాలు, సంకేతాలు ఎన్నో ఉన్నవి. త్యాగయ్యగారిది స్మార్త సంప్రదాయం; అందులోనూ స్వంత మార్గాలెక్కువ. వారికందరికీ ఇది అంటడం సులభం కాదు. ఇక హిందువులు కానివారిమాట చెప్పనక్కర లేదుగదా. కనుక వ్యక్తి, సంఘం, జాతి, మతం మొదలైన కట్లు కంచెలు అన్నీ విచ్చుకొని తోసుకొని పోగల్గిన యే ఒకరిద్దరు మహానుభావులకో తప్ప సామాన్యులకు త్యాగయ్యగారి భక్తిమార్గం అందరాని పండు. అందినా తినలేము. తిన్నా జీర్ణించుకోలేము.

త్యాగయ్య గారి రెండవ వరం కవిత్వ కళ. మహాకవుల కుండవలసిన గుణాలెన్నో ఆయనయందు స్వతస్సిద్ధంగా ఉన్నవి. చిన్నతనంనుంచీ పద్యాలూ, పాటలూ అంతులేక విన్నాడు. వల్లించినాడు. స్వాభావికంగా రచనోత్సాహం కలవాడుగాబట్టి ఛందస్సు, యతిప్రాసలు మొదలైనవానిని సులభంగా వశీకరించుకోగల్గినాడు, భావాలలో ఆర్జవం నిండి ఏమాట చెప్పినా వర్చస్సుతో చెప్పగలిగినాడు. కృత్రిమంగా మీద వేసుకొన్న భావాలు ఆయన రచనల్లో లేనేలేవనవచ్చును. కొన్ని సాంప్రదాయికపు మాటలు తప్ప అన్నీ నిండుగా బ్రతికిన భావాలే. దీనికి తోడు తన యిష్టమెట్లు వస్తే అట్లు వర్తించి వ్యవహరించే ధైర్యమూ, స్వాతంత్ర్యమూ ప్రబలంగా ఉండినది. దీనితో రచనకు ఒక నవ్యత ఏర్పడి, భావాలకొక విలాసమూ, భాషకు ధారాళతా వచ్చి వినేవారి నాకర్షించగలదు. రామభక్తి, తనకు ముక్తి ఇవి రెండే భావనావిషయాలై కవితాకళకు వలయం సంకుచితమైనా, దానిలోనే కొత్తకొత్త త్రోవలు త్రొక్కి ఆడే ప్రతిభా బలమున్నది. కనుకనే ఈతని చేతికి దొరకిన శ్రీరామమూర్తి, దీక్షితులు మొదలగువారి దేవతలవలె, కేవల ధ్యానోపయోగిమూర్తి మాత్రం కాక, మనతో చేరి, మనవాడై కానవచ్చుచున్నాడు. దివ్యమూర్తి మనుష్యుల అంతస్తుకు దిగినాడు. ‘ఆత్మానం మానుషం మన్యే’ అని ఆయన చెప్పిన అసత్యవాక్యం సత్యంగా, త్యాగయ్యగారి కవిత పుణ్యాన, మనపాలికి పరిణమించినది. తెలుగు కవులలో పలువురికి ఈ శక్తి లేదు.

ఐతే, త్యాగయ్యగారి జీవితంలో ఆ శక్తికి భాషలోగాని, భావాలలోగాని తగినంత యేర్పులూ, తీర్పులూ చేసే అవకాశమూ, సంస్కారమూ చాలక, ఆయన కవిత పల్లెటూరి పడుచువలె అకృత్రిమంగా నిలిచింది. ఆయన తెలుగుభాష నాలుగైదు తరాలుగా తమిళదేశంలో నిలబడి సహజమైన పెరుగులూ మెరుగులూ చాలావరకు కోలుపోయింది; జడ్డుగట్టింది. ‘మూడు రెండు నది నాథుడు’ ‘నిద్దురజితుడు’[5]చూ. కీర్తనలు ‘సారివెడలిన యీ కావేరి’; ‘యుక్తము గాదు.’ వంటి కృత్రిమరూపాలతో, అందదుకులైన వాక్యాలతో నడచింది. ఆయన సంస్కృతం కూడా ఎక్కువ వ్యాసంగాని కవకాశం చాలలేదనిపిస్తూ, నేర్చినదానికంటే విని గ్రహించిందే ఎక్కువ అని పదేపదే సూచిస్తుంది. ‘కేచన నిజభక్త నిచయ’ ‘ముఖజిత భార్యే’[6]చూ. కీర్తనలు: ‘యోచనా కమలలోచన’; ‘మానస సంచరరే’ ఇత్యాదు లుదాహరింపవచ్చును. త్యాగయ్య వ్యాకరణ నియమాలు ఉల్లంఘించినాడనే కాదు నా మనవి. ఆ ఉల్లంఘన సహజమైన సరళమార్గంలో నడవలేదనే. తాళ్ళపాకవారు, క్షేత్రయ్య మొదలైన పదకవులందరూ, ఎందరో పద్యగద్యకవులూ, వైయాకరణుల అధికారానికి మితిని కలిగించినవారే. శబ్దశాస్త్ర నియమాలను ఎదిరించే దొమ్మగలవారు, అప్పుడప్పుడుండబట్టే ఏ భాషగాని ప్రవాహినిగా నడుస్తుంది. లేకపోతే పడియ నీళ్ళవలె మలిచిపోక తప్పదు. కాని ఆ ఉద్యమం ఆయా భాషల ఆవరణంలోనే జరగవలసి ఉంటుంది. త్యాగయ్యగారి ప్రయత్నమో ఆ వలయానికి బైట అవిమర్శగా జరిగింది.

ఇంక ఆయన భావాలుగూడా ఎన్నోచోట్ల పై అపక్వతనే సూచిస్తున్నవి. శక్తికితోడు లోక శాస్త్ర కావ్యాదుల పరిశీలన వల్ల కలిగే జాణతనం, కావ్యజ్ఞుల శిక్షతోడి అభ్యాసం—అనే రెండు గుణాలు కవితారచనకు ఆవశ్యకమన్నారు పెద్దలు[7]‘శక్తిర్నిపుణతా లోక శాస్త్ర కావ్యాద్యవేక్షణాత్, కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతి హేతు సదుద్భవే (కావ్యప్రకాశం, ఉల్లాసం’1). త్యాగయ్యకు శక్తి, అభ్యాసమూ సమృద్ధిగా ఉన్నవి. కాని తక్కినవి సంపాదించే విరామమూ, అక్కరా ఎక్కువగా ఆయనకుండినట్లు కానరాదు. కాబట్టే ‘నీ తండ్రిసొమ్ము వెరవక పోనేరదు’, ‘ఈ హరామితనమేల’, ‘రంగడా విభీషణునకు పంగనామ మిడినరీతి’[8]చూ. కీర్తనలు: కరుణాజలధీ’ (కేదారగౌళ), ‘ఎదుట నిలచితే’, ‘రామ దైవమా’ ఇత్యాది బాల భావాలు ఆయన రచనలో పడి నిలిచినవి. చెప్పవలసిన భావాలు స్పష్టంగా, సరళంగా చెప్పగల ఓర్పో, శక్తియో లేక వాక్యమూ ఛందస్సూ ముగిస్తే చాలునని ముందుకుపోయిన రచన యెంతో ఉన్నది. కాబట్టి ఎన్నో కీర్తనలలో అర్థమిప్పటికీ అస్పష్టంగానే నిలబడింది. ఇదంతా ఆయన శిష్యప్రశిష్యులు తెలుగు తెలియక చేసిన అపరాధమని చెప్పేది ఒక సంప్రదాయం. కొంత నిజం కావచ్చును. కాని, త్యాగయ్యగారికి కూడా ఇందులో భాగం ఎక్కువగానే ఉండిందని చెప్పకపోవడం సాధ్యంకాదు. ఆయనది తోచిన వెంటనే కూర్చిపెట్టిన ఆశుకవిత; మన సంగీత రచన వంటిది. రాగం, తానం, పల్లవి, స్వరకల్పన ఇత్యాది కర్ణాటక సంగీత స్వతంత్ర రచనలలో గాయకుడు వల్లించినదానిని వదలి తన-సభ్యుల-అదృష్టాన్ని నమ్మి ‘నీవేగతిరా దేవుడా’ అని సాహసించి కల్పనకు దూకుతాడు. ఆ తెగుదారి చొరవలో ప్రతిభావంతుడయి సుశిక్షితుడైన గాయకుని నుండి అతడు గాని, మనం గాని కలలోనైనా ఊహించి ఉండని అపూర్వాద్భుత రచనలు ఆవిర్భవించగలవు. ఆ ప్రయత్నంలో అపస్వరాలూ, అవలయలూ చొచ్చుకొన్నా మనం ఓర్చుకొందుము. ఓర్చుకోవలెనుగూడ. ఆ కళ స్వరూపమది గనుక పట్టుకు సులభంగా దొరకని నాదకాలాలతో అర్థములేని భావాలను రచించే విద్య అది. కాని సంకేతబద్ధమైన వాగర్థాలతో చేయవలసిన కవితాకళ ఆ దారిలో నడపవలసిన అక్కరలేదు. స్ఫురించిన రచనను మళ్ళీ నిదానంగా నెమరువేసి ఏర్పులూ తీర్పులూ చేసే అవకాశమూ, చేయవలసిన ధర్మమూ ఇందులో ఉంది. దానిని ఉపయోగించుకోకపోతే ఆ కళ అఖండంగా సిద్ధించదు. కాబట్టే ‘నిలకడ వలయుఁ గృతికి’ అన్నారు విమర్శకులు. ఆశురచనలో గూడా అప్పుడప్పుడు అద్భుత రచనలు మించవచ్చును. కాని, కవికి ఆ సాకు పనికిరాదు; రాగూడదు. త్యాగయ్యగారి కవిత ఈ ఆశు తరగతిది. ఆశ్చర్యము కలిగించే ముక్కలెన్ని ఉన్నా అఖండత చాలనిది. కనుక తెలుగు సాహిత్యంలో ఇతర మహాకవుల రచనలు చవిచూచిన నాలుకకు త్యాగయ్య కవితలోని రసం చాలదు. మాట సాహసమైతే మన్నించండి.

ఇంక నిజంగా నావంటివారి పాలికి మిగిలింది ఆయన అనుగ్రహించిన గానం. అది మహాప్రసాదం. దాని వైశాల్యం, గాంభీర్యం, విలాసం, వైదగ్ధ్యం, వైవిధ్యం – అనిర్వచనీయమైనవి. దానికదే సాటి. నిజమాలోచిస్తే త్యాగయ్యగారు ఆజీవమానం అఖండంగా అంతరంగంలో సాధించింది రామభక్తి యోగం; బహిరంగంలో అట్లే సాధించింది నాదయోగం. కవిత్వం ఈ రెంటికీ పొత్తుకలిపే కొండివంటిది. అది యీరెండు మహాద్రవ్యాల ఒత్తిడిలో సన్నగిల్లి మసక మసకయిపోయింది, వంశపరంపరతో వచ్చిన త్యాగయ్య గానాభిరుచికి శొంఠి వేంకటరమణయ్యగారి దోహదం లభించింది. ఆ మహావిద్వాంసుడు వాగ్గేయ కారకుడు — తంజావూరు సంస్థానం దర్బారులో ఉగాది పండుగనాడు మొదటి పాటకచ్చేరీ చేసే అధికారాన్ని సంపాదించుకొన్నవాడు. ఇంతేకాదు. ‘మహారాజువారి కొలువు మంటపములో రాజువారి ప్రక్కన అర్ధసింహాసనారూఢు’డట. అంతటి మహావిద్వాంసుని శిక్ష గూడా ఈ శిష్యమహత్తరునికి చాలలేదు. మళ్ళీ రామకృష్ణానందస్వామే వచ్చి నారద మంత్రోపదేశం చేసి ఉపాసన చేయించినాడు. దాని ఫలంగా ‘నాదసరసీరుహభృంగుడు’ నారదుడు ప్రత్యక్షమై అనుగ్రహించినాడు. కనుక త్యాగయ్య సంగీతం మనుష్యుల మట్టాన్ని దాటి దివ్యతకెక్కింది. కొన్నాళ్ళకు తరువాత శొంఠి వేంకటరమణయ్యగారే శిష్యుణ్ణి పిలిపించి తన యింట్లో పాటకచ్చేరీ చేయించి, ఆనందం పట్టజాలక, తనకు మహారాజావారు బహుమానంగా ఇచ్చిన తోడా, మకరకంటి మొదలైన సొమ్ములతో ఆయనను అలంకరించి చూచి కన్నులు చల్లజేసుకొన్నాడట.[9]వెంకటరమణ భాగవతుల గురుచరిత్ర. ‘శిష్యాదిచ్ఛేత్పరాజయం’ అన్న పరమాచార్య న్యాయాన్ని సంతోషంగా ఆచరించి చూపిన ఆ గురువు ఆ శిష్యునకే అన్ని విధాలా తగిన మహనీయుడు.

కనుకనే త్యాగయ్య నాదరచన భాషారచనను చాలా దూరం మీరిపోయింది. ఆయన నాదజీవానికి భాష శరీరంగానూ, ఎన్నో చోట్ల వట్టి వేషంగానూ పరిణమించి ఒదిగి నిలిచింది. ఇంతే కాదు. పరదేవతగా శ్రీరామమూర్తిని ఉపాసించే సాధనంగా త్యాగయ్య ఉపయోగించుకొన్న యీ నాదకళ తుదకు శ్రీరాముడే ఐపోయింది. అథవా రాముడే నాదకళారూపముగా మారిపోయినాడు. అంటే రామమూర్తియందారోపించి ధ్యానించిన అఖండత, అమేయత, అనిర్వచనీయత — ఈ నాద ప్రపంచమందే త్యాగయ్యకు అనుభవానికి వచ్చింది. ఇంకొకవిధంగా ఈమాట చెప్పితే పాట భక్తి యెల్లలనుగూడా దాటిందన్నమాట. ఆయన రచించిన అమోఘమైన కృతులలో ఒకటైన ఈ కృతి ఈ విషయానికి సాక్షి:

‘నీ దయచే రామ – నిత్యానందుడైతి,
నాదబ్రహ్మానంద రసాకృతిగల – నీదయచే.
వరమృదుభాష – సుస్వరమయభూష
వర త్యాగరాజ వాక్చేలావృత’

కాబట్టే, ‘నాదోపాసనచే శంకర నారాయణ విధులు వెలసిరి ఓ మనసా’ అని చాటేదాకా ఆయన ధైర్యం పాకింది.

ఈ అనుభవమే ముఖ్యంగా ఆయన పాటలలో ఎక్కువగా ఉన్మీలితమైంది. సంకేతాలతో బ్రతికేది భాష. కాబట్టి దాని వ్యాప్తి మితమైనది; భాషనుబట్టి మాత్రమే చూస్తే ‘ఆరగింపవే పాలు’ అన్న పాట రామునికే పూజచేస్తూ పాలే నైవేద్యమిచ్చే సమయంలో మాత్రం సార్థకమౌతుంది. అప్పుడుగూడా ఒకమాటు ఆ మాట చెప్పితే చాలును. కాని దాన్ని నాల్గుప్రక్కలా పట్టుకొని ఆడించే పాటమెట్టుకు త్యాగయ్యగారు ఐదారు సంగతులు చేర్చినాడు. ఎందుకు? ఈ రాముడు, పాలు, ఆరగింపు మొదలైన ఖండభావాల కంటే వాటికి ప్రేరకమైన ఉల్లాసం, అలౌకికత, తృప్తి మొదలైన అనుభవాలలో తన్మయత్వాన్ని పొందడానికి, అఖండమార్గంలో నడవడానికి, ఆ నాదరచనలు సోపానాలు కాగలవు. సంగతులైదారు అనేది మచ్చుకే కాని శక్తిగలవారు ఐదునూర్లూ, ఐదువేలూ కల్పించుకోవచ్చును; కల్పించుకోవలెను. కీర్తనలకు సంగతులు వేసి పాడే పద్ధతికి త్యాగయ్యే ప్రథమాచార్యుడంటారు. అదే నిజమైతే ఆయనకింతకంటే వేరే ఉద్దేశం కానరాదు. ఆయన తన కీర్తనలను భాషాభావాలు మాత్రమే ధ్యానిస్తూ, చల్లగా, ముద్దుగా, స్పష్టంగా ముత్తయిదువుల పెండ్లి పాటలవలె, ఒకమాటు పఠించి వదిలేవాడనీ, ఈ సంగతులు, నెరవళ్ళు, స్వరకల్పనలూ అన్నీ తరువాతి ‘విద్వాంసుల’ విపరీత కల్పనలని కొందఱు ఊహించేట్టున్నది. కాని, అది న్యాయం కాదు. త్యాగయ్య గురువుగారింట్లో కచ్చేరి చేసినప్పుడు ‘దొరకునా ఇటువంటి సేవా’ అనే కీర్తన పాడి, దాని మూడవ చరణంలోని ‘కామిత ఫలదాయకియౌసీత’ అనేచోట ‘పల్లవి సాహిత్య స్వరములు’ పాడి చూపినప్పుడే గురువుగారు ‘దొరకునా ఇటువంటి శిష్యుడు?’ అని మెచ్చుకొని తన బహుమాన భూషణాలు ఇచ్చి గౌరవించినాడని వేంకటరమణ భాగవతుల చరిత్రలో గలదు. ఇదిగాక ఎన్నో కీర్తనల సంగతులు అన్ని శిష్యపరంపరలలోనూ ఒకేవిధంగా నేటికీ పాడే వాడుకలో ఉన్నవి. ఇంకా ‘నాద సుధారసంబిలను సరాకృత్యాయరా’ అనే కీర్తనలో సంగతులు ఆ నాదసుధారసమూర్తి రాముడు ఆడే మాటలైనవని త్యాగయ్యే ధ్యానించినాడు.

కాబట్టే ఆయన రచనలు భాష, మతం, జాతి మొదలైన ఎల్లలన్నీ దాటి కర్ణాటక సంగీత రసికులందరికీ ఈ నూటయేబదేండ్లకు పైబడి పరమానందదాయకమైన ఆస్తిగా పరిణమించినవి. ఆయన తెలుగువాడనీ, రామభక్తుడనీ, బ్రాహ్మణుడనీ, ములకనాటి స్మార్తుడనీ ఎక్కువ అభిమానమో, అసహ్యమో ఆయన పాటల విషయంలో ఆధునికులు కొందరు చూపడం కేవలం బాలిశమని – ఆత్మాపరాధమని – చెప్పక తీరదు. అవి అలౌకికంగా అనుభవించవలసినవి.

కనుక రామభక్తి ఉన్నా లేకపోయినా, తెలుగు సంస్కృతాలు రుచించినా రుచింపకపోయినా, అయ్యగారి కీర్తనలు దొరకినన్ని సంగ్రహించడమూ, వాటి వర్ణమట్టులను స్వరూపనాశం చేయక భద్రపరచి శిష్యవరంపరలో వ్యాప్తికి తేవడమూ, గాన గాంభీర్యాన్ని ఆ అంతస్తులో తామనుభవించి ఇతరులనుభవించేట్టు చేయడమూ – ఇవి ఇప్పటి కర్ణాటక నాదకళారసికుల ధర్మమని నా ప్రార్థన. ఇది మతధర్మము, కుల ధర్మము, జాతి ధర్మము కాని కాదు. మఱి మానవధర్మం. వివిధ భేదాలతో అడ్డగోడలతో ఉద్రేకాలు పెరిగి అనాహుతాలపాలై పోతూవుండే మన దేశంలో త్యాగయ్యగారి యీ గానకళను పరస్పరస్నేహ సౌహార్దాలకు సాధనంగా ఉపయోగించి మనం ధన్యులం కావలసి ఉన్నాము. భక్తి లభిస్తే వ్యక్తులు కృతకృత్యులౌతారు. కవిత్వం రసింపగలిగితే తెలుగు తెలిసినవారానందిస్తారు. కాని త్యాగయ్యగారి నాదసుధ దొరకితే – హిందువులే కాదు, మనుష్యజాతే తరించిపోతుంది. ఆయన కళ నారాయణాస్త్రం, దానికి సమస్కారం తప్ప వేరే ఎదురేమీ లేదు.

[1946 డిసెంబరు మాసాంతాన మద్రాసు మ్యూజిక్ ఎకాడమీవారు జరిపిన శ్రీత్యాగరాజ శతవార్షికోత్సవ సందర్భంలో చదివిన ప్రసంగం. వ్యయ సంవత్సర పుష్య ‘భారతి’లో ప్రకటితము.]

అధస్సూచికలు[+]