మరపుకు ముందే

ఇప్పుడు చెప్పకపోతే మర్చిపోయే అవకాశముంది బహుశా…

రైల్లో వెళ్తూ మీ ఉత్తరం తెరవడాన్ని మొదలుపెట్టాను. ఎంతో శ్రద్ధగా కలిగ్రఫీ కుంచెతో మనసుమీద ఎవరో ఏదో రూపొందించే అలికిడి. పక్కనే సమాంతరంగా పరుగెడుతున్న పట్టాలమీద నాట్యమాడే గాలి పలకరింపు స్పర్శ. మరచిపోయిన ఎండుటాకుల జ్ఞాపకాలని కాలం తనలో కలిపేసుకున్న వైనం కళ్ళకి కట్టి, ఎన్నో శిశిరాలు ఒక్కసారి ముసిరిన దిగులు. చూడటం ఎప్పుడో మానుకొన్న కళ్ళమీద, మళ్ళీ వర్ణవిహంగాలు గాల్లో ఈతలు కొడుతూ కలలని తొలకరించిన సందడి.

కలగాపులగంగా చెప్తున్నానా?

కవితలు కురవడం ఆగిపోయిన తీగ మీద సుతిమెత్తని కిరణం వాలితే ఇలాంటి సవ్వడే అవుతుందేమో! భుజం మీదినుంచి కోయిల ఎగిరిపోయినా ఇదే చుక్క జారుతుందేమో! లోపలి చూపులనుంచి వొలికే నిశ్వాసల వొరవడీ వొరిపిడీ ఇంతేనేమో. దిండ్లుగా మారిన బండల స్పృహ ఛెళ్ళుమనడం ఇలాగే తెలుస్తుందేమో!

ఇవన్నీ మీరు వినాలనే అనుకుంటాను కాని, కత్తులే మొద్దుబారాయో, గుండే గడ్డకట్టిందో కాని, మీ సమక్షంలో ద్రవహించడానికి ఎన్ని ఆనకట్టలో ఈ గుప్పెడు యంత్రానికి!

ఎప్పుడన్నా కలిస్తే, లౌక్యం దూరకముందే లోతులని తాకి వద్దాం. చంద్రుడు నవ్వాపుకోబోయేంతలోనే చిరునవ్వులతో చెణుకులు వేసుకుందాం. చెప్పడానికీ వినడానికీ ఏమీ లేనట్లే నిర్లిప్తతలని పూసుకుని ఆఘ్రాణిద్దాం. ప్రెజెన్స్‌లో ఆబ్సెన్స్‌నీ ఆబ్జెక్ట్స్‌ లోని శూన్యాలనీ ఆస్వాదిద్దాం.

అయినా నా పిచ్చిగానీ ఇదంతా రేడియో చందాన పలుకుతున్నది నేనేగా! మీరు కావాలని ట్యూన్ చేసుకోవాలని ఎక్కడుందీ?!

అలవాటుగా స్వస్తి.