ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1

కాంటర్‌బరీ – డోవర్

“ఇది చూడండి… కెంట్‌ యూనివర్సిటీ కాంపస్‌లో ఎకామడేషన్‌ కనబడుతోంది” పిలిచారు నిమ్మగడ్డ శేషగిరి. నాలానే ఆయన కూడా యాత్రాపిపాసి. సెప్టెంబరు 23 ఆరంభంలో మొదలయిన మా యూకే యాత్రలో ప్రథమపాదం ఆయన న్యూబెరీ ఇంటి నుంచే సాగింది.

వెళ్ళి లాప్‌టాప్‌లో వివరాలు చూశాను. బావున్నాయి. ఊళ్ళ మధ్యన ఉండే హోటళ్ళూ యూత్‌ హాస్టళ్ళకు భిన్నమైన అనుభవం నాకా యూనివర్సిటీ కాంపస్‌లో దొరుకుతుందనిపించింది. రెండు రోజులకు బుక్‌ చేశాం. అదే ఊపులో ససెక్స్‌ కౌంటీలోని ఈస్ట్‌బర్న్‌లో సముద్రానికి ఆనుకొని ఉన్న ఓ హోటల్లోనూ మరో రెండు రోజులకు బుక్‌ చేశాం.


సెప్టెంబరు మొదటి వారంలో సతీసమేతంగా యూకే చేరుకొని, లండన్‌కు చేరువలో శేషగిరిగారు ఉంటోన్న న్యూబెరీ పట్నాన్ని కేంద్రంగా చేసుకొని ఆయనతోపాటు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు నాలుగు రోజులపాటు తిరుగాడాను. మళ్ళా ఆ నెల మూడోవారం నుంచీ లండన్‌ నగరం కేంద్రంగా చేసుకొని మరో ముగ్గురు క్లాస్‌మేట్‌ల కుటుంబాలతో కలసి ఇరవై రోజులపాటు యూకే, ఐర్లండ్‌లలో రోడ్‌ ట్రిప్‌ వెయ్యాలన్నది మా ప్రణాళిక. ఈ రెండు ప్రయాణాలకూ నడుమన ఐదారు రోజులపాటు యూకే గ్రామ సీమల్లో సోలో ప్రయాణం చెయ్యాలన్నది నా అభిలాష.

ఒంటరి ప్రయాణాలను నేను బాగా ఇష్టపడతాను. ఈ మధ్యన ఆ ఇష్టం మరీ మరీ పెరిగింది.

ఎవరూ తెలియని దేశాల్లో ఒక్కణ్ణే తిరగడం, ఆయా ప్రదేశాల్లో నా బాణీ మనుషుల్ని కలుసుకొని క్షణమో ఘడియో వారితో గడపడం అంటే నాకు ఆసక్తి. అలాంటి సంపర్కాల సాయంతో ఆయా ప్రదేశాలను ‘దర్శించి’ ఆ పరిసరాల్లో ఇమిడిపోయి నా ఉనికిని కోల్పోవడమన్నది నాకు ఇష్టమైన విషయం. ఇదంతా సాధ్యపడాలంటే ఒంటరి ప్రయాణమే సరి అయిన మార్గం. అందుకే లండన్‌ చేరుకోగానే – ఆ మాటకొస్తే చేరుకోకముందు నుంచీ – సోలో ప్రయాణం కోసం తహతహలాడాను. నాలానే సోలో ప్రయాణాలు ఇష్టపడే శేషగిరి నా తపనను గ్రహించి, హర్షించి, నాకు అనుకూలమైన ప్రయాణానికి రూపకల్పన చేశారు. కెంట్‌ కౌంటీలోని కాంటర్‌బరీ, ససెక్స్‌ లోని ఈస్ట్‌బర్న్‌ పట్టణాలను కేంద్రంగా చేసుకొని ఐదు రోజులపాటు అక్కడి పల్లెలూ పట్నాల్లో సాగేలా ఒక ఏకాంత యాత్రకు ప్రణాళిక రచించారు శేషగిరి. పాతికేళ్ళుగా  యూకేలో ఉంటోన్న శేషగిరిగారికి నేను వెళుతోన్న ప్రదేశాల గురించి చక్కని అవగాహన ఉంది. నేను ఏ ఒడిదుడుకులూ లేకుండా అవన్నీ తిరిగి రాగలనన్న నమ్మకముంది. ఇండియాలోనూ విదేశాల్లోనూ ఇలాంటి సోలో ప్రయాణాలు చేసిన అనుభవం నాకు ఉండనే ఉంది.


ఆ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో మా 70ల నాటి క్లాస్‌మేట్‌ రామశర్మవాళ్ళ లండన్‌ నగరపు ఇంట్లోంచి బయటపడ్డాను. వాళ్ళిల్లు హైగేట్ అన్న ట్యూబ్‌ స్టేషన్‌ని ఆనుకొనే ఉంది. అక్కడ్నించి విక్టోరియా స్టేషనుకు గంటన్నరలోపు వెళ్ళిపోవచ్చు. ఒకచోట రైలు మారాలి. ‘తికమక పడకుండా వెళ్ళగలవా?’ అడిగాడు రామశర్మ. నిబ్బరంగా ‘ఓ’ అన్నాను.

అన్నానే గానీ తికమక పడనేపడి ఒక స్టేషను ముందుకు వెళ్ళిపోయాను. తిరిగి విక్టోరియా చేరడానికి మరో పావుగంట మూల్యం చెల్లించాల్సి వచ్చింది. బయటకొచ్చి బస్సులు వెళ్ళే ప్రదేశమెక్కడా అని గూగుల్‌ను అడిగాను. మ్యాపు చెప్పిన ప్రకారం బస్‌ (కోచ్‌) స్టేషన్‌ వైపు వడిగా నడిచాను. అంత హడావిడిలోనూ ఒక విషయం నా దృష్టి నుంచి తప్పిపోలేదు. రైల్లోనూ, రైలు బయటా – ఏ న్యూయార్కులోనో కనిపించేలా అనేక రంగులవాళ్ళు… జాతులవాళ్ళు… దేశాలవాళ్ళు… ముప్పై నాలుగేళ్ళ క్రితం 1989లో మొదటిసారి లండన్‌ వచ్చినపుడు ఇంత వైవిధ్యం కనిపించలేదని గుర్తు. మరి ఈ మూడున్నర దశాబ్దాలలో ఇంగ్లండులో వర్ణ సమ్మేళనం గణనీయంగా పెరిగిందా? మంచిదే!

కోచ్‌ స్టేషన్‌ రిసెప్షన్‌లో కనుక్కుంటే పదిన్నరకు కాంటర్‌బరీ వెళ్ళే బస్సుందని తెలిసింది. ఇంకా పది నిమిషాలుందన్న మాట… గబగబా ఆ బస్సు బయల్దేరే గేటు వెతుక్కుంటూ వెళ్ళాను. రెడీగా ఉంది. గేటు దగ్గర సెక్యూరిటీ మనిషి ‘టికెట్‌’ అని ఆపాడు. ‘బస్సులో ఇవ్వరా?’ బేలగా అడిగాను. ఇవ్వరట. చూస్తూ చూస్తూ ఉండగానే బస్సు కదిలిపోయింది. మరో గంటకు తర్వాతి బస్సట. తీరిగ్గా టికెట్లిచ్చే కౌంటర్లు చేరుకుని, వ్యవహార సరళి తెలుసుకొని, వెండింగ్‌ మెషీన్‌ వాడి టికెట్ తీసుకున్నాను. బస్సు మిస్సయితే మిస్సయాను గానీ ఈ విక్టోరియా కోచ్‌ స్టేషన్‌తో చనువు ఏర్పడిపోయింది.


లండన్‌ నుంచి కాంటర్‌బరీకి అరవై మైళ్ళు – సుమారు వంద కిలోమీటర్లు. రెండున్నర గంటలు. బయల్దేరిన కాస్సేపటిలోనే బస్సు ఠెమ్స్‌ (Thames) నది పక్కగా పరుగందుకొంది. ‘మళ్ళీ వచ్చావా’ అని ఠెమ్స్‌ పలకరించిన భావన. 1989 నాటి యాత్రలో గంటల తరబడి ఆ నది ఒడ్డున నడిచాను. అందుకే ఆ చనువు… నగరపు వీధుల్లో రాజహంసలా సాగిపోయే బస్సులో సుఖంగా కూర్చుని పక్కగా సాగిపోతున్నపుడు నదితో ఎన్ని కబుర్లయినా చెప్పవచ్చు, ఎన్ని గారాలయినా పోవచ్చు.

మధ్యాహ్నం రెండింటికల్లా బస్సు కాంటర్‌బరీ చేర్చింది. ఊళ్ళోకి చేరడానికి ముందే కెంట్‌ యూనివర్సిటీ ప్రాంగణం కనిపించింది. అక్కడే నే ఉండబోతోన్న హాస్టలు అని మనసు హెచ్చరించింది. అవును. నేను దిగవలసిందక్కడే. బస్టాపు చిన్నపాటి గుట్టమీద ఉంది. దూరాన కాంటర్‌బరీ పట్టణం లీలగా కనిపిస్తోంది. నిడుపాటి కథెడ్రల్ గోపురాలు నా దృష్టిని దాటిపోలేదు.

హాస్టల్‌ రిసెప్షన్‌లో ఎన్నెన్ని వివరాలు చెప్పి ఎన్నెన్ని ఐడీ కార్డులు చూపించాలో అనుకొన్నాను. పాస్‌పోర్ట్‌ రెడీగా పట్టుకొన్నాను. వాటి అవసరం లేకపోయింది. పేరు చెప్పగానే అక్కడున్న యువతి గబగబా తాళం కార్డు, సూచనలున్న పేపరు అందించింది. ‘స్టూడెంటువా? ఇండియా నుంచా?’ అనడిగాను. ‘అవును. పూణే’ అన్నదావిడ. ప్రాణం లేచొచ్చింది – మూడేళ్ళు పూణేలో పని చేశా గదా… ఆ కబుర్లు. ఏడెనిమిది నెలల క్రితమే యూకే వచ్చిందట, పీజీ కోసం. ఆత్మీయంగా మాట్లాడింది. పీజీ అయ్యాక యూకేలోనే ఉండిపోతావా అని అడిగాను. ‘ఉద్యోగం రావాలి గదా’ అన్న సందేహపు జవాబు. దేశపు ఎకానమీ బాగోలేదట. ఉద్యోగాలు అంత సులభంగా దొరకటం లేదట. ‘ఉద్యోగం వస్తే మంచిదే. కానీ ఇలా ఇండియా నుంచి బయటకు వచ్చి ఒకటి రెండేళ్ళు కొత్త దేశంలో కొత్త సంస్కృతిలో గడపడం కూడా చక్కని అవకాశం. మనిషిగా నీ ఎదుగుదలకు ఈ అనుభవం సాయపడుతుంది’ అని అనునయించాను. ఊరికే చెప్పడం కాదు, అది నా స్వానుభవం కూడానూ. శ్రద్ధగా వింది ఆ అమ్మాయి.


మూడంచెల సెక్యూరిటీని నాకున్నదని తెలియని సమయస్ఫూర్తితో ఛేదించి నా రూమ్‌ చేరుకోగలిగాను. ముచ్చటగా ఉంది. చిన్నగదే గానీ అన్ని సదుపాయాలూ ఉన్నాయి. గది దాటి నడవాలోంచి వెళితే వంటగది కనిపించింది. స్టవ్, మైక్రోవేవ్, ఫ్రిజ్‌ – స్వంత ఇంటికి చేరిన భావన. గబగబా ఆ అన్వేషణ కట్టిపెట్టి ఫ్రెషప్‌ అయ్యి బస్టాపుకు చేరాను. ఒకరిద్దరు విద్యార్థులు, అడగ్గానే సమాచారం అందించారు. ప్రతి పావుగంటకూ ఊళ్ళోకి బస్సుందట. అంతా కలసి ఏడెనిమిది నిమిషాల ప్రయాణం. ఓ కొరియా కుర్రాడితో మాటలు మరికాస్త ముందుకు సాగాయి. కాంపస్‌ బయట రూమ్‌ తీసుకుని ఉంటున్నాడట. యూకే అతనికి బాగా నచ్చిందట… కాంటర్‌బరీ అంటే ఇంకా ఇష్టమట. ‘చిన్న ఊరేగానీ ఏ పెద్ద నగరానికీ తీసిపోదు. మూడు యూనివర్సిటీలున్నాయి. ఊర్లో మీకు అనేకానేక దేశాలవాళ్ళు కనిపిస్తారు. స్థానికులు కూడా ఎంతో స్నేహంగా ఉంటారు.’ చెప్పుకొచ్చాడతను.

బస్సు ఊరి శివార్లలోని ఇళ్ళ వరుసలగుండా సాగింది. మరికాసేపట్లో ఊళ్ళోకి ప్రవేశించగానే పురాతన కట్టడాలు, శిథిలాలు, సోయగాలు, పచ్చదనాలు – కళకళలాడుతూ కాంటర్‌బరీ స్వాగతం చెప్పింది. బస్టాపు చేరగానే తిన్నగా కథెడ్రల్‌ వైపుగా సాగాను. అంతా కలసి రెండు ఫర్లాంగులు. ఆకట్టుకొనే ముఖద్వారం. కంచుతో చేసినది కాబోలు క్రీస్తు విగ్రహం…

లోపలికి వెళ్ళాను. చాలా పెద్ద ప్రాంగణం. వివరాలు చూస్తే మూలరూపంలో క్రీస్తు శకం 597 నుంచీ ఇక్కడ ప్రార్థనా మందిరం ఉందట. పన్నెండో శతాబ్దంలో ఇప్పటి విరాట్‌ కట్టడానికి రూపకల్పన జరిగిందట. మతానికీ రాజ్యానికీ మధ్య జరిగిన అధికారపు పెనుగులాటలో ఆనాటి అక్కడి మతాధిపతి థామస్‌ బెకెట్‌ వధింపబడ్డాడు. అప్పట్నించీ ఈ కథెడ్రల్ మతపరంగానే గాకుండా ఒక స్మృతి చిహ్నంగా, తీర్థయాత్రా స్థలంగా మారిందట. యూకేలోకల్లా – బహుశా ఐరోపా అంతటికీ – అతి ముఖ్యమైన ప్రార్థనాస్థలంగా ఈ కథెడ్రల్ పరిగణింపబడుతోంది. ఆర్చ్‌బిషప్‌ స్థాయి మతాధికారి ఇక్కడి అధిపతి.

లోపలికి వెళ్ళగానే నన్ను మొట్టమొదట ఆకర్షించింది అక్కడి గోపుర శిఖరాలు – స్పైర్‌లు. అంతా కలసి పది పన్నెండు స్పైర్‌లు ఆకాశాన్ని ప్రశ్నిస్తూ కనిపించాయి. వాటి ఎత్తెంతో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అన్నిటికన్న నిడుపాటిది 72 మీటర్లట! ఢిల్లీ కుతుబ్‌మినార్‌తో సమానమన్నమాట. ఆ సమాచారం అందించిన అక్కడి వలంటీరుతో ‘బహుశా ఇవి ప్రపంచంలోకెల్లా ఎత్తైన చర్చి శిఖరాలు గావచ్చు’ అంటే అతను నవ్వేసి ‘దీనికి రెట్టింపు ఎత్తు ఉన్నవి మనకు యూరప్‌లో కనిపిస్తాయి’ అని నా అబ్బురాన్ని ద్విగుణీకృతం చేశాడు.

కథెడ్రల్‌ల గురించి నాకున్నది కుతూహలమే తప్ప లోతుపాతులు తెలుసుకొనే ఆసక్తీ శక్తీ నాకు అంతంత మాత్రమే. గైడ్‌ను పెట్టుకుని ఆ వివరాల్లోకి వెళ్ళవచ్చునేమో గానీ అది నా ఎజెండాలో లేని విషయం. అంచేత ఒక బొమ్మల పుస్తకాన్ని చూస్తోన్న రీతిలో అక్కడి వాతావరణాన్ని నాలోకి ఇంకించుకొనే ప్రయత్నం చేశాను. ఆ ప్రక్రియలో నేను ఎన్నుకొన్న మార్గం ఆ కథెడ్రల్‌ చుట్టూ నింపాదిగా తిరిగి రావడం. చుట్టు దారి అంటూ ఉందా? తెలియదు. అయినా అడుగులు సాగించాను. కుడిచేతివైపుగా సాగి భవనపు శిఖరబిందువు చేరాను. దాన్ని చుట్టుకొని వెళితే కాస్తంత లతలూ పొదలూ శిథిలాలూ. ఇంకా ముందుకు వెళితే అలనాటి కోశాగారం – ట్రెజరీ. ఐమూలగా ఓ గ్రంథాలయం. వాటిముందు చరిత్ర చెప్పే ఫలకాలు. మరికాస్త ముందుకు సాగగా ఒక విశాల ప్రదేశం. చుట్టూ నడవడానికి అనుకూలంగా ఉన్న వరండా. ఆకర్షించే మధ్యయుగపు వాస్తురీతి. ఆ ప్రాంగణం కాసేపు నన్నక్కడ కట్టిపడేసింది. వివిధ కోణాలలోంచి ఫొటోలు… చుట్టూ ఉన్న ‘గదులు’ అప్పటి యాత్రికుల వసతి గృహాలా? తెలియలేదు.

ప్రదక్షిణ ముగిసి మళ్ళీ కథెడ్రల్ ప్రాంగణపు ప్రవేశ ద్వారం దగ్గరికి చేరాను. చుట్టూ తిరిగిన మాట నిజమే గానీ భవనం లోపలికి వెళ్ళనేలేదు గదా! వెళ్ళాలి గదా… మరెంచేతనో భవనానికంటూ ప్రవేశ ద్వారమేదీ స్పష్టంగా కనిపించలేదు. ఓ పక్కన సన్నపాటి కాలిబాటలోంచి ఒకరొకరుగా లోపలికి మనుషులు వెళ్ళడం కనిపించింది. పరీక్షగా చూస్తే వాళ్ళు ఊరికే చూసి వెళ్ళడానికి వచ్చిన విజిటర్లు అనిపించలేదు, ఏదో కార్యక్రమం కోసం వారంతా వెళుతున్నట్టనిపించింది. మరి నేను వెళ్ళవచ్చా? ‘వెళ్ళి చూద్దాం… ఆపితే వచ్చేద్దాం’ అనుకొని లోపలికి వెళ్ళాను. అక్కడి వలంటీర్లు కాస్తంత ఆశ్చర్యంగా చూశారే తప్ప అభ్యంతరం పెట్టలేదు. ఒక హాలు, మరో మెట్ల వరసా దాటుకొని ఆ మందిరపు లోపలి భాగం చేరాను.

అటూ ఇటూ అలనాటి – ఏనాటివో?! – అందమైన చెక్క కుర్చీల వరుసలు. మధ్యలో ఇరవై అడుగుల నడకబాట. కాస్తంత చూపుసారిస్తే కుడి ఎడమల వున్న చిన్నపాటి వేదికల మీద మైకులూ వాద్య విశేషాలతో గాయకులూ వాద్యకారులూ… ఎస్! ఇది కొన్ని కొన్ని చర్చుల్లో నేను చూసిన, విన్న క్వాయర్‌ (Choir) అన్నమాట! ఆసక్తి కలిగింది. అయినా అది ఎంతసేపు సాగుతుందో తెలియదు. సాగినంతసేపూ ఉండాల్సి వచ్చేట్టు అనిపించింది. అక్కడి గంభీర వాతావరణం, భక్తి శ్రద్ధలతో వచ్చి కుర్చీలలో చేరుతున్న శ్రోతలు – బయటకు వెళ్ళడమన్న ప్రసక్తే లేదు. మెల్లగా అది ఆద్యంతం చూద్దాం అన్న ఆసక్తి కలిగింది.

మెలమెల్లగా ఆ ప్రాంగణం నిండింది. చేరిన వ్యక్తుల్ని పరిశీలించడం ఆరంభించాను. ఎక్కువగా పెద్ద వయసువారు. ఆశ్చర్యం లేదు. దాదాపు అందరూ మధ్య తరగతి మనుషుల్లా అనిపించారు. ఆశ్చర్యం కలిగించింది. మందిర ప్రభావం గావచ్చు. దాదాపు అందరిలోనూ నమ్రత కనిపించింది. అతిశయ ప్రదర్శన హావభావాలలో గాని, శరీర భాషలోగానీ మచ్చుకైనా కనిపించలేదు. సంతోషమనిపించిది. వీరంతా మనవాళ్ళే అన్న భావన ఎప్పుడు ఎలా మనసులోకి ప్రవేశించిందో తెలియదు, ఏ మూలనన్నా బెరుకూ సంకోచాలు ఏమైనా ఉండి ఉంటే అవి చెల్లాచెదురయ్యాయి. గీతాలాపన మొదలయింది. దానికన్నా ముందు ఆ కథెడ్రల్‌ పెద్దలయి ఉండాలి. ఒక పురుషుడూ మరో మహిళా వచ్చి ప్రవేశద్వారానికి అటూ ఇటూ ఉన్న చెక్క ఛాంబర్లలో ఎంతో సంప్రదాయబద్ధంగా ఆచితూచి అడుగులు వేసి ఆసీనులయ్యారు. ఆరంభ వాక్యాలు వాళ్ళు చెప్పారా? గుర్తు లేదు.

గంటసేపు సాగిందా గానహేల. ఆ గీతాలు, వాటి ప్రాముఖ్యం, అవి పాడవలసిన వరుసక్రమం – ఇవేమీ తెలియకపోయినా శ్రుతి అయిన మనసు పుణ్యమా అని ఆ కార్యక్రమంలో భాగమవగలిగాను. ముందున్న గీతాల పుస్తకం సాయంతో వాళ్ళు ప్రకటించిన ప్రకారం ఏయే గీతాలు పాడుతున్నారో ఆ పాఠ్యాన్ని అనుసరించగలిగాను. గంటన్నర తర్వాత తెలియని సంతృప్తితో బయటకొచ్చాను.

సాయంత్రం ఏడున్నర దాటేసింది. ఇంకా సంధ్య వెలుగులు సమసిపోలేదు. అసలే పసుపురంగులో ఉన్న ఆ కట్టడం సంధ్య వెలుగుల్లో బంగారు వర్ణంతో మరింత తళతళలాడుతూ కనిపించింది. కథెడ్రల్ ప్రాంగణం దాటి ఊళ్ళోకి నడిచాను. ఆకాశం వివిధ వర్ణాల సమ్మేళనంగా కనిపించింది. రంగుల రాగాలాపన వినిపించింది. ఆ వర్ణ వైభవాన్ని మరింత ఆస్వాదించడానికి గబగబా వెదికి కాస్తంత విశాలంగా ఉన్న బాటలోకి వెళ్ళాను. నా ప్రయత్నం ఫలించింది. ఆకాశపు రంగులు దిగువన ఉన్న పలకల బాట మీద కూడా ప్రతిఫలిస్తూ జగమే ఒక సవర్ణహేల అన్న భావన కలిగించాయి.

అందమైన రోజుకు రంగులీనే ముగింపు.


మర్నాటి ఉదయం ఊళ్ళో వాళ్ళకన్నా ముందే నాకు తెల్లారింది. కాఫీ మేకర్‌ పదపద కాఫీ తాగుదాం అంది. చేతిలోని కాఫీ మగ్గు ‘ఇలా గది నాలుగు గోడల మధ్య కాదోయ్‌, అలా కాస్త బయటకు వెళ్ళి తాగితే మరింత రుచి’ అని హితవు పలికింది.

అంతగా పరిచయం లేని ప్రాంగణం. ఇంకా విడివడని చీకట్లు…

నిన్న నేను దిగిన బస్‌స్టాపూ ఆ గుట్టా దగ్గర్లోనే ఉన్నాయన్న గ్రహింపు కలిగింది. కాస్తంత వెదుకులాడి అక్కడికి చేరుకున్నాను. ఆ గుట్ట మీద ఒకే ఒక్క చెక్క బెంచి. అక్కడ్నించి చూస్తే దిగంతాన కానవస్తోన్న వెలుగురేఖలు… బెంచి మీద కూర్చోబోతోంటే దానికి తాపడం చేసి ఉన్న చిన్నపాటి ఇత్తడి ఫలకం కనిపించింది. ‘పామ్‌ అండ్‌ స్టాన్‌ హటన్‌ ఈ ప్రదేశాన్ని అమితంగా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ జ్ఞాపకార్థం…’ అంటూ కబురు చెప్పిందా ఇత్తడి ఫలకం.

సందేహం లేదు. వాళ్ళిద్దరూ నాకు సన్నిహితులు.

ఒక్కనాటి మురిపానికే నేనింత సంబరపడుతోంటే ఈ ప్రదేశాన నివసించి ఈ చోటును ప్రేమించిన ఆ ఇద్దరి మనసూ నాకు తెలియడం లేదూ?

బెంచీ మీద చేరగలబడి చుట్టూ చూశాను. వెనకపక్కన ఉదయపు వెలుగులు ఇముడ్చుకుని మెరిసిపోతోన్న హంస రెక్కల్లాంటి రెల్లుపొద. కుడివేపున స్టోన్‌హెంజ్‌ స్ఫూర్తితో కాబోలు నిలబెట్టి ఉన్న రాతి దిమ్మలు. కాస్తంత పక్కకు వెళ్ళి చూస్తే కనిపిస్తోన్న కథెడ్రల్ గోపుర శిఖరాలు. మర్చిపోలేని క్షణాలవి. ఇలాంటి క్షణాల కోసమే కదా ఏ యాత్రికుడైనా వెదుకులాడేదీ!

ఏడున్నరకు రెస్టరెంటు తెరుస్తారని నిన్న గది తాళాలందించినపుడు, పూణే స్టూడెంటు చెప్పింది. ఎలా ఉంటుందో, ఏం పదార్థాలు దొరుకుతాయో అనుకొంటూ వెళ్ళాను. ఊహించిన దానికన్నా పెద్ద హాలు, ఆహ్లాదకరమైన అలంకరణ.

ఆ ఉదయం నేనే మొట్టమొదటి మనిషిని. ఒక మహిళా ఇద్దరు చిన్నారులూ బ్రేక్‌పాస్ట్‌ సరంజామా సిద్ధం చేస్తూ కనిపించారు.

“ఏమేమున్నాయీ?” మాటకలుపుతూ అడిగాను.

“ఇవిగో ఇక్కడ జ్యూస్‌లూ వేడిపాలూ కార్న్‌ఫ్లేక్సూ ఉన్నాయి. ఆ పక్కన బ్రెడ్డూ టోస్టరూ. ఆ చివరి టేబులు మీద పళ్ళూ చాక్లెట్లూ. ఎదురుగా అటు చివర కాఫీ, టీలూ… ఆమ్లెట్‌ కావాలంటే చెప్పు వేడి వేడిగా చేయించి ఇస్తాను.” ఎంతో స్నేహంగా చెప్పిందా యువతి.

బ్రేక్‌పాస్ట్‌ పరిధిని దాటి మాటలు సాగాయి. నా సోలో ప్రయాణం వివరాలు ఆసక్తిగా చెప్పించుకొని విన్నదామె. ఆమె సహాయకులిద్దరూ వచ్చి మాట కలిపారు. మాటల్లోనే బ్రెడ్డూ జామూ పళ్ళరసమూ అందించారు. మరికాసేపటికి ఆమ్లెట్ వచ్చి చేరింది.

కాఫీ ముగించి వెళుతోంటే ‘పళ్ళేమీ తీసుకోలేదు, చక్కని తాజాపళ్ళు’ అని గుర్తు చేసిందామె. ‘ఖాళీ లేదు’ ప్రకటించేశాను. ‘మరేం పర్లేదు, రోజంతా తిరగబోతున్నావు. ఇవిగో ఇవి బ్యాక్‌పాక్‌లో పెట్టుకో’ అంటూ నాలుగు రకాల పళ్ళతో నా సంచి నింపింది.


ఆనాటి నా గమ్యం డోవర్‌ పట్టణం.

కాంటర్‌బరీ నుంచి ఇరవై మైళ్ళు, గంట ప్రయాణం.

టికెట్టు తీసుకున్నాను. రెండు పౌండ్లు!

అడగగా తెలిసింది, అక్కడి బస్సుల్లో దూరంతో ప్రమేయం లేకుండా ఒకటే టికెట్టట. రెండు మైళ్ళయినా ఇరవై మైళ్ళయినా రెండే పౌండ్లు!

మెల్లగా ఊరు దాటుకుని, మైదానాలు, పొలాలు, అలలు అలలుగా సాగే గుట్టల శ్రేణులు, దారిలో తటస్థపడిన రెండు మూడు గ్రామాలు దాటుకుని ఉదయం పదిన్నరకల్లా డోవర్‌ చేరాను. ఈ డోవర్‌తో నాకు కాస్తంత పూర్వ పరిచయం ఉంది. 1989లో పారిస్‌ నుంచి లండన్‌ వచ్చినపుడు డోవర్‌ రేవులో పడవదిగి రైల్వేస్టేషను దాకా నడిచి వచ్చాను. అప్పట్లో ఆ పట్టణం నా దృష్టిని ఏ మాత్రం ఆకట్టుకోలేదు – బహుశా ఆనాడు నా ధ్యాసంతా వెళ్ళబోయే లండన్‌ మీదే ఉండి ఉండాలి.

ఈసారి మాత్రం లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ లాంటి భావన కలిగింది.

బస్సు నన్ను దింపినది ఎడమ వేపున పెద్దపాటి పార్క్ ఉన్న ప్రదేశంలో. బహుశా అదే ఆ ఊరి బస్‌ టెర్మినల్‌ అనుకొంటాను. వాకబు చెయ్యగా ఆ పచ్చదనం పేరు విన్‌చెస్టర్ గార్డెన్ అని తెలిసింది. ఊర్లో తిరగడానికి ఒక ఎజెండా అంటూ నాకు లేదు కదా, ముందీ గార్డెన్‌ సంగతి చూద్దాం అని అటు వెళ్ళాను. వందా నూటయాభై మీటర్ల నలుచదరమా పార్కు. ఎడమ పక్కన వరుస తీరిన వృక్షాలు. మరికాస్త పచ్చదనం. సహజంగానే కాళ్ళు అటు దారి తీశాయి.

నిజమే! అక్కడో చిన్న సెలయేరు పారుతోంది, స్వచ్ఛంగా నిర్మలంగా నింపాదిగా. నాలుగయిదు నిమిషాలు ఆ సెలయేటి గలగలలు వినేసరికి ఆ పక్కనే ఉన్న సైన్‌బోర్డ్‌ ‘ఇదిగో డోవర్‌ కాసిల్‌కు ఇదే దారి’ అని చెప్పింది.

కాళ్ళు పదపదలెమ్మన్నాయి. పరికించి చూస్తే దూరాన కొండ కొమ్మున నిలచి ఉన్న కోట ఆనవాళ్ళు లీలగా కనిపించాయి.

డోవర్‌కు ఇపుడంటే ఇంగ్లీషు ఛానెల్‌ ముఖద్వారమన్న గుర్తింపు ప్రముఖంగా ఉంది కానీ మధ్యయుగాలలో ఆ నేల రక్తంతో తడిసినదే అన్న విషయం గుర్తొచ్చింది. రోమన్‌ల కాలం నుంచి నార్మన్‌ల దాడులదాకా ఎన్నెన్ని సమరాలకు వేదిక అయిందో ఆ ప్రదేశం!

యుద్ధాల ఆలోచనలు మనసును ఆక్రమించక ముందే కాసిల్‌కు వెళ్ళే దారి మనసును దోచేయడం మొదలయింది. ముందుగా అది ఇళ్ళూ వాకిళ్ళ మధ్యన సాగింది. నాలుగడుగులు వేసేసరికి అటూ ఇటూ నిడుపాటి గోడలున్న ఆరేడడుగుల బాటగుండా సాగింది. అది దాటీ దాటగానే అటూ ఇటూ అడవి! కాస్త ఎత్తు ఎక్కేసరికి ఆ చెట్ల మధ్య నుంచి కనిపిస్తోన్న డోవర్‌ పట్టణం. భళిభళీ! ఆశించని ఆనందం అంటూ ఎలుగెత్తి చాటాలన్న సంబరం. అంతా కలసి అరగంట గడిచేసరికి డోవర్‌ కోట గోడలు…

ఆ క్షణాన అక్కడ నేనొక్కడినే విజిటర్‌ని – మరో మనిషి జాడ లేదు, టికెట్‌ బూత్‌లోని మహిళ తప్ప. పాతిక పౌండ్లట టికెట్టు! లోపల తిరుగాడాలన్న కుతూహలమూ లేదు, అంత ఖర్చుపెట్టే ఉత్సాహమూ లేదు. ‘కాస్త ఆ చివరిదాకా వెళ్ళి సముద్రం చూసి వస్తాను, వెళ్ళనిస్తావా?’ అని అడిగాను. క్షణకాలం సందేహించినా సరే వెళ్ళమంది. వెళ్ళానే కానీ ఎంతో దూరాన ఉన్న సముద్రం నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు.


తిరిగి సెలయేరు ప్రాంతం చేరేసరికి అంత నిర్మలమైన నీటిలోంచి కూడా ఆకులూ కొమ్మలూ నాచూ తొలగిస్తూ ముగ్గురు మనుషులు కనిపించారు. వలంటీర్లయి ఉండొచ్చు, మునిసిపల్‌ ఉద్యోగులూ కావచ్చు. మాట కలిపాను. వలంటీర్లే.

“ఏ దేశం వాడివీ?” పలకరించిందామె.

పండు వయసు. చేతికర్ర సాయంతో అడుగు తీసి అడుగు వేస్తోంది. ప్రసన్నవదనం. ఎదురు పడినపుడు అసలు నేనే పలకరిద్దామనుకొన్నాను. ఆమె చొరవ చేసింది.

“మీరు ఇలాంటి సెలయేళ్ళను ఊరిమధ్యన ఇంకా ఉండనివ్వడం, ఉండనిచ్చి పసిపాపణ్ణి సాకినట్టు సాకడం ఎంతో ముచ్చటగా ఉంది” చెట్ల మీది పక్షుల సందడి వింటూ అన్నాను. నవ్వింది. చెప్పుకొచ్చింది.

“నేను పుట్టి పెరిగింది ఈ ఊరే. ఎనభై ఏళ్ళుగా చూస్తున్నాను. తరాలు మారాయి. ఊరు మారింది. అప్పుడున్న పచ్చదనం ఇపుడు సగమయింది. ఇదిగో ఈ పార్క్‌ ఉన్నచోట అడవిలాంటి తోట ఉండేది. పేరుకు మాత్రం ఆ గార్డెన్‌ అన్నమాట మిగిలింది.” ఆమె గొంతులో సానుకూలధ్వనితో కూడిన ఆవేదన.

మాటలు సాగాయి. నేను దేశదేశాల్లో అభివృద్ధి పేరిట జరుగుతోన్న విచక్షణ లేని విధ్వంసం గురించి ప్రస్తావించాను. గత కొద్దిరోజులుగా ఈ దేశంలో గమనించిన సరళ జీవన సరళి గురించి ప్రస్తావించాను. నా పరిశీలన నిజమేనా అని అడిగాను.

“నిజమే. మా ప్రభుత్వాలూ అధినేతలూ ప్రపంచాన్ని పాలించిన మాట నిజమే. కానీ నేను చూసిన జీవితం ఆధారంగా చెప్పాలంటే సగటు బ్రిటిషర్లలో సంపాదించాలన్న యావ లేదు. మాదంతా మధ్యతరగతి మనస్తత్వం. చెకచెకా ఎదిగిపోయి శిఖరాలు చేరుకోవాలన్న తపన లేదు. ఆ ప్రయాసంతా మా ప్రభువులే పడ్డారు. ఒక వెలుగు వెలిగారు. ఇపుడు చతికిలపడ్డారు” నిర్వికారంగా చెప్పుకొచ్చిందావిడ. ‘మా ఊళ్ళోని మ్యూజియమ్ చూడు, అలాగే ఇక్కడి తెల్ల కొండచరియలు తప్పకుండా చూడు’ అని నొక్కి చెప్పింది.

ఆమె చెప్పిన గుర్తుల ప్రకారం డోవర్‌ పట్టణంలోకి ప్రవేశించాను. ఆకట్టుకొనే చర్చి భవంతులు, ట్రాఫిక్‌ ఒత్తిడి లేని వీధులు, లేలేతరంగుల భవనాలు, బొమ్మలు అమ్ముతోన్న వీధి దుకాణదారుడు, ఊరి సెంటర్లో ఇనుప గొట్టాలు అమర్చి చేసిన ఓ కళాకృతి. ఆ పక్కనే మ్యూజియమ్.

ప్రాంగణం చిన్నదే గానీ అది నాకు అందించిన సమాచారం విలువైనది. రోమన్ల ఆక్రమణను గుర్తుచేసే నిలువెత్తు మానవాకృతులు, అంతకన్నా ఎంతో ముందటి కాలపు – కంచు యుగపు – గృహ నమూనా, శిలాజాలా అనిపించే అప్పటి నౌకల విడిభాగాలు, ఏనుగులూ గుర్రాల మీద యోధులు(!) – అక్కడ గడిపిన అరగంట సమయంలోనే అలనాటి డోవర్ ప్రాంతాన్ని కాస్తంత పరిచయం చెయ్యగలిగిందా సంగ్రహశాల.

ఆ పెద్దావిడ చెప్పకముందే వైట్‌ క్లిఫ్స్‌ ఆఫ్ డోవర్‌ గురించి విని ఉన్నాను. అలాంటి వింతలూ విశేషాలకు అంతగా లొంగనితనం నాలో పేరుకుపోయివున్నా ఆమె చెప్పింది కదా అని, డోవర్ సాగరతీరం ఎలానూ చూడాలి కదా అనీ అటు అడుగు వేశాను. దారిలో ఏదో స్మృతి చిహ్నం కనిపించింది. వెళ్ళి చూస్తే అది 1861లో 60వ రాయల్‌ రైఫిల్స్‌కు చెందిన ఫస్ట్‌ బెటాలియన్‌, 1857 ప్రాంతాల్లో భారతదేశంలో జరిగిన ఆందోళనలూ సమరాలలో ప్రాణాలు కోల్పోయిన తమ ‘కామ్రేడ్స్‌’ జ్ఞాపకార్థం నెలకొల్పిన స్మృతి స్తంభం అని తెలిసింది. చిన్నప్పుడు హిస్టరీ పుస్తకాల్లో చదువుకొన్న ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామపు చిహ్నాలు – అవతలి పక్షం వారివే అయినా – ఈ ఆంగ్ల సీమలో 166 సంవత్సరాల తర్వాత చూస్తున్నానన్నమాట.

పక్కనే సముద్రతీరం. ఎడమవేపున నీలంగా కనిపిస్తోన్న డోవర్‌ రేవు. ఇంకా పైకి దృష్టి సారిస్తే కనిపించీ కనిపించని తెల్లసున్నపు చరియలు. చకచకా అటు అడుగులు వేశాను. వేశానేగానీ రాబోయే రెండు గంటల సమయంలో నన్ను వరించి ఊరించబోయే సంతోషాలూ సౌందర్యాల గురించి ఏ మాత్రం అవగాహన లేని అడుగులవి. మనిషి జాడలేని ప్రదేశమది. దారి అడుగుదామన్నా పలికేవాళ్ళు లేరు. దూరాన ఎలానూ కొండలు కనబడుతున్నాయి. పక్కనే అటువేపే సాగుతున్న పెద్దపాటి రహదారి. దాని అంచు వెంబడే పదీ పదిహేను నిమిషాలు. మెల్లగా కొండచరియ పైకి సాగుతోన్న కాలిబాట. ఇదే తెల్ల చరియలు చేరుకొనే దారి అన్న సైన్‌బోర్డు. ఒక్కసారిగా మారిపోయిన పరిసరాలు. కొండచరియల్లో పరచుకొన్న పచ్చిక తివాచీలు, గడ్డిపూలు, పూపొదలు. రారమ్మని పిలుస్తోన్న కొండబాటలు. చివరిదాకా వెళ్ళి వెనక్కి వస్తోన్న ట్రెకర్లు!

ఇది అసలు సిసలు ట్రెకింగ్‌ బాట అన్నమాట. ‘ఎంత సమయం పడుతుందీ?’ అడిగాను ఒక ట్రెకర్‌ని. రెండు గంటలన్నాడు. టైమ్‌ చూసుకున్నాను. లంచ్‌ గురించి పట్టించుకోకపోతే సమయం సమస్యగాదు. పొద్దున్న మంచిమనసుతో ముందుచూపుతో యూనివర్సిటీ క్యాంటిన్లో పళ్ళతో నా బ్యాక్‌పాక్‌ నింపిన మహిళ పుణ్యమా అని ఆకలి సమస్యే కాదు. ముందుకు సాగాను.

దిగువున ఉన్న రేవు ప్రాంతం, చీమల్లా సాగుతోన్న కంటైనర్ల వాహనాలు, అంతకన్నా నింపాదిగా నడుస్తోన్న  పడవలు. ఆ దృశ్యాలు దాటుకొని బాటకు అటూ ఇటూ సౌందర్యం తప్ప మరేమీ లేని సీమకు చేరాను. అక్కడక్కడ సౌందర్య వీక్షణం కోసం ఎవరో ఉదారులు వేయించిన సిమెంటు బెంచీలు, మళ్ళా మేమున్నాం అంటూ ‘దిగువన’ పలకరిస్తోన్న వైట్ క్లిఫ్స్, సముద్రం లోంచి వందలాది అడుగులు నిట్టనిలువుగా ఎదిగి కనిపిస్తోన్న తెల్లని కొండ. అదో అద్భుత సీమ, నాదో స్వప్నయానం.

అందరూ స్వప్నఫలాల వెదుకులాటలో ఉన్నపుడు భాషా పరిమితులు లేకుండా మాటలు కలుస్తాయి. అదే జరిగిందా మధ్యాహ్నం. ఓ ఇటలీ జంట, మరో ముగ్గురు జర్మన్‌ మహిళల బృందం, ఇంకో ఇద్దరు లండన్‌ కుర్రాళ్ళు, ఉన్నట్టుండి ఓ కేరళ కుర్రాళ్ళ బృందం. అందరిదీ ఒకేమాట ఒకే బాట ఒకే ఆనందం. వర్ణనాతీతమని తెలిసినా, ఒకరి భాష మరొకరికి తెలియదని తెలిసినా, సంతోష సంబరాలను పరస్పరం పంచుకొనే సఫల ప్రయత్నాలు. సందట్లో సడేమియా అన్నట్లు ‘వెల్‌కమ్‌ టు ఫ్రాన్స్‌’ అంటూ ఫోన్లో మెసేజి! రేడియో తరంగాలను సరిహద్దులు అడ్డుకోలేవు గదా!

గంట గడిచింది. నిజానికి నేను చేరింది సగం దూరమే. వెళ్ళాలంటే మరో రెండు మైళ్ళ సుందర మార్గం కళ్ళముందు కనబడుతూనే ఉంది. అయినా దేనికైనా, ఏ సంతోషానికైనా అవధి అంటూ ఉండాలి గదా. దూరాన ఉన్న కాంటర్‌బరీ నగరం, ఈ దారిలోనే గబగబా నడుస్తూ వదిలి వచ్చిన పొదలూ పూలూ పిలుస్తున్నాయి గదా! వెనక్కి మళ్ళాను. హడావుడి లేకుండా తిరుగుబాటను మరింత తీరిగ్గా ఆస్వాదిస్తూ మూడుగంటల ప్రాంతంలో డోవర్‌ బస్టాండు చేరుకున్నాను. మరో గంటలో కాంటర్‌బరీ.


మర్నాడు ఉదయం కాంటర్‌బరీ వదిలి ససెక్స్‌ కౌంటీలో వున్న ఈస్ట్‌బర్న్‌ నగరం చేరుకోవాలన్నది నా ప్రణాళిక. రెండు ఊళ్ళ మధ్య దూరం 65 మైళ్ళని గూగుల్‌ చెపుతోంది. బస్సుల సంగతి అడిగితే ‘తిన్నగా వెళ్ళే బస్సులు లేవు’ అని చేతులు ఎత్తేస్తోంది. బస్‌ స్టేషన్లో ఒకరిద్దర్ని అడిగినా సరైన సమాచారం దొరకలేదు. ఒకాయన మాత్రం ‘అదిగో ఆ బిల్డింగులో బస్సులకు సంబంధించిన సమాచార కేంద్రం ఉంది. అక్కడ అడుగు’ అని సలహా ఇచ్చాడు.

వెళ్ళి అడిగాను. ‘తిన్నగా వెళ్ళే బస్సులు లేవు’ అని నాకు తెలిసిన విషయమే చెప్పింది అక్కడి మనిషి. ‘అయినా బస్సులెందుకూ రైళ్ళున్నాయి. రెండుగంటల్లో తీసుకువెళతాయి. అదే నీకు బెస్టు’ అని కూడా చెప్పింది. అయినా పట్టు వదలకుండా “బస్సులు పట్టుకొని ఈస్ట్‌బర్న్‌ చేరుకొనే మార్గమే లేదా?” అని మరోసారి అడిగాను. వింతగా చూసింది. “ఎందుకు లేదూ, నాలుగు బస్సులు మారాలి. ఆరుగంటలు ప్రయాణం. ఎందుకయ్యా అదంతా? తిన్నగా రైలు పట్టుకో” అన్నదావిడ మృదువుగానే!

నాలుగు బస్సులు, ఆరు గంటలూ అన్నమాట అమృతంలా నా చెవిని సోకింది. “అదే అదే, నాకు కావలసిందదే. వివరాలు చెప్పు తల్లీ!” అని ప్రాధేయపడ్డాను. వింతగా చూసింది. నా భావన అర్థం చేసుకొంది. అయితే కాసేపు ఆగు అంటూ కంప్యూటరు ముందుకు చేరింది. టకటకా మీటలు నొక్కింది. అయిదు నిమిషాల తర్వాత మూడు పేజీల కంప్యూటరు ప్రింటవుట్‌ అందించింది. మర్నాటి ఉదయం తొమ్మిదింటికి కాంటర్‌బరీలో బయలుదేరితే మధ్యలో ఎక్కడెక్కడ ఆగి బస్సులు మారాలో, ఆయా ప్రదేశాల్లో ఏయే సమయాల్లో కనెక్టింగ్‌ బస్సులు దొరుకుతాయో ఎంతో వివరంగా చెప్పే ప్రింటవుటది. ఆ క్షణాన ఆమె వరాలిచ్చే వరలక్ష్మిలా కనిపించింది.


చీకటి పడటానికి, రోజు ముగియడానికీ ఇంకా మూడు నాలుగు గంటల సమయముంది. ఆ సమయంలో ఊరు ముఖ్య కూడళ్ళలోనే గాకుండా పరిసరాల్లో ఉన్న పురాతన కట్టడాలూ చూద్దామనుకున్నా గానీ రారమ్మని మళ్ళీ పిలుస్తోన్న కథెడ్రల్ ఆ ఆలోచనలకు కాస్తంత గండికొట్టింది.

లోపలికి వెళ్ళగానే విద్యార్థుల వెల్లువ. విద్యార్థులే కాదు, వాళ్ళతోపాటు తలిదండ్రులూ స్నేహితులూ కూడానూ. ఏదో యూనివర్సిటీకి చెందిన కాన్వొకేషన్‌ జరిగిందట అక్కడ. డిగ్రీలందుకొన్న సంబరంలో మునిగి తేలుతున్నారంతా. నిన్నటి నిశ్శబ్దానికి విరుగుడా అన్నట్టుగా కథెడ్రల్ ప్రాంగణమంతా సంబరాలూ కేరింతలూ. ఆ క్షణాలను ఫొటోల్లో భద్రపరచుకోవాలన్న ప్రయత్నాలు. కొన్ని కొన్ని కుటుంబాలకు అలా నేను ఫొటోలు తీసి సాయం చెయ్యడం.

సిటీ సెంటరు చేరాను. సెంట్రల్‌ ప్లాజా అంతా డిగ్రీలు పుచ్చుకొన్న విద్యార్థులతో కళకళలాడుతూ కనిపించింది. వాహనాలకు ప్రవేశం లేని ఆ కూడలి అంతటా చేరగిలబడటానికి, కాఫీలు టీలూ త్రాగడానికీ కుర్చీలూ టేబుళ్ళూ అమర్చి కనిపించాయి. ఎన్నో వందల సంవత్సరాల నుంచీ నిరవధికంగా కార్యకలాపాలు జరుపుకొంటున్నామని సూచించే దుకాణాలూ రెస్టారెంట్లు ఉన్నాయక్కడ. నాకు ‘పరిచయం’ ఉన్న స్టార్‌బక్స్‌ నుంచి ఓ పెద్దకప్పు నిండా బ్లాక్‌ కాఫీ అడిగి తీసుకుని ఆ కూడలిలో చేరి సాగిపోతోన్న ఆ ప్రాంతపు జీవన స్రవంతిని జ్ఞాపకాల్లో నింపుకొనే ప్రయత్నం చేశాను. అదో అరగంట.

కాంటర్‌బరీ లాంటి పట్టణాలు అలా చూసి ఇలా వచ్చేసే ప్రదేశాలు కావు. తీరిగ్గా గంటలూ రోజుల తరబడి ఆస్వాదించవలసిన ఊళ్ళవి. గంటలూ రోజుల సంగతి ఎలా ఉన్నా మరో గంటా గంటన్నర సమయం ఉంది గదా, మరో వీధిలో తిరుగాడుదాం అని తోచిన మార్గం పట్టుకొన్నాను. ఆ మార్గం పేరు హై స్ట్రీట్‌ అని సైన్‌ బోర్డులు చెప్పాయి. హఠాత్తుగా ఎదురుగా కొట్టొచ్చినట్లుగా ఒక ట్యుడోర్‌ శైలి రెండంతస్తుల భవనం కనిపించింది. తెల్లని గోడలు, వాటిమీద నల్లని వెడల్పాటి గీతలు. ఆ షేక్స్‌పియర్‌ కాలపు ట్యుడోర్‌ వాస్తురీతి గురించి మిత్రులు శేషగిరి అప్పటికే నాకు చెప్పి ఉన్నారు. నిలబడి పరీక్షగా ఆ భవనాన్ని చూశాను.  క్రీస్తు శకం 1500 నాటి భవనమట. ఓల్డ్‌ వీవర్స్‌ హౌస్‌ అన్న పేరు ఆ భవనం మీద మూడు నాలుగుచోట్ల ప్రస్ఫుటంగా కనిపించింది.

ఆ ట్యుడోర్ భవనాన్ని దాటుకొని వెళితే కాంటర్‌బరీ పిల్‌గ్రిమ్స్‌ హాస్పిటల్‌ అంటూ మరో పురాతన భవనం కనిపించింది. అమరుడైన థామస్‌ బెకెట్‌ గౌరవార్థం ఆయన్ని చూడటం కోసం వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం 1170ల లోనే ఈ భవనం కట్టారట. అన్నట్టు, పాత పద్ధతుల ప్రకారం ఈ హాస్పిటల్‌ అన్న పదం హాస్పిటాలిటీ అన్నమాటకు హ్రస్వరూపమట. అంచేత ఆ కట్టడం వసతి గృహమే కానీ ఆసుపత్రి కాదు అని వివరాల్లోకి వెళితే బోధపడింది.

మరో పది అడుగులు. రోడ్డు నడుమన, గంట ఆకారపు నాలుగు అడుగుల వేదిక మీద, ఏదో ప్రసంగిస్తోన్న భంగిమలో ఎవరిదో విగ్రహం. ఎవరీయనా, మరీ నట్టనడుమున నిలబడి ప్రసంగిస్తున్నాడూ అని వెళ్ళి చూస్తే ఇంకెవరూ – మహాకవి ఛాసర్‌! ఆంగ్ల సాహిత్యపు ఆదికవి. పధ్నాలుగో శతాబ్దంలో జీవించిన మనిషి. కాంటర్‌బరీ టేల్స్‌ అన్న కథల ద్వారా దేశదేశాల సాహిత్యాభిమానులకు చిరపరిచితమైన మనిషి.

థామస్‌ బెకెట్‌ అమరత్వం తర్వాత ఇందాకే చెప్పుకున్నట్టు కాంటర్‌బరీ కథెడ్రల్ ఒక తీర్థయాత్రా స్థలంగా మారింది. అలా లండన్‌ నగరం నుంచి వచ్చే ముప్పైమంది ఊహా యాత్రికుల బృందాన్ని ఆసరాగా చేసుకొని, అందులోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కథ చెప్పేలా ప్రణాళిక రచించి ఈ కాంటర్‌బరీ టేల్స్ రాశాడట ఛాసర్‌. ఆనాటి సాంఘిక వ్యవస్థకు దర్పణాలుగా ఈ కథల్ని మలచాడట. పరీక్షగా చూస్తే ఆ విగ్రహం దిగువున ఉన్న గంట రూపపు వేదిక మీద ఆ యాత్రికుల బృందపు ఆకృతులూ కనిపించాయి.

మనసు నిండింది. యాత్రాఫలం ఛాసర్‌ విగ్రహం రూపంలో లభించిందనిపించింది కాంటర్‌బరీ శోధనలు చాలించాను. మర్నాడంతా కెంట్‌, ససెక్స్‌ కౌంటీలలో బస్సు ప్రయాణాలూ, చిట్టిపొట్టి గ్రామాలూ పట్నాలూ చూడటాలూ ఉన్నాయి గదా…

(సశేషం)