మేము సంతోషంగానే ఉన్నాము
మాకు ఏ చీకుచింతా లేదు.
నిక్కరు లేదని పిల్లలు ఏడిస్తే
ఓ దెబ్బ వేస్తే చాలు
దూరంగా పారిపోతారు.
అంటు మరకలతో
పూలు చెరిగిన చీరలు
పాత గుడ్డల సంతలో
చవక ధరకు దొరుకుతాయి.
కోరికను తీర్చుకునేందుకు
చీకటి రాత్రుల నీడ ఉంది.
కాళ్ళు బార్లాచాపి పడుకునేందుకు
రైలుస్టేషను ఔటరు ఫ్లాట్ఫామ్ ఎలానూ ఉంది.
బట్టబయలులో చల్లగాలి
ఎంతమందికి దక్కుతుంది గనుక, కానీ
మాకా యోగముంది.
ఏది దొరకనపుడు
బంకమట్టిని గోరుముద్దలు చేసి
మింగి మంచినీళ్ళు తాగి
కడుపు నింపుకుంటే
జీర్ణానికి వస్తుంది.
మాకు ఏ చీకుచింతా లేదు
మేము సంతోషంగానే ఉన్నాము.
[మూలం: నిరం అలిళింద వణ్ణత్తు పూచ్చిగళ్ (అంటు మరకలతో పూలు చెరిగిన చీరలు) అనే కవితా సంకలనం నుండి.]