[వెల్చేరు నారాయణరావు సిద్ధాంతగ్రంథం తెలుగులో కవితావిప్లవాల స్వరూపం నాలుగవ ప్రచురణకు వచ్చిన సందర్భంలో ఆ ప్రతిలో రచయిత ఇచ్చిన వివరణ.]
ఈ పుస్తకం నేను రాస్తున్నప్పుడు హైదరాబాదులో చాలామంది థామస్ కూన్ (Thomas S. Kuhn) రాసిన The Structure of Scientific Revolutions చాలా ఉత్సాహంగా చదువుకొన్నారు. నేనుకూడ చదివాను. ఆ పుస్తక నిర్మాణపద్ధతి నాకు చాలానచ్చింది. కాని, నాకు ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటంటే Kuhn ఒక paradigm నుంచి ఇంకొక paradigm మార్పు కేవలం తానంతట అదే జరుగుతుంది అనిచెప్పడం. నేను Kuhn చెప్పిన నిర్మాణక్రమాన్ని దాదాపు యథాతథంగా అనుసరించాను. నాకు, సమాజంతో సంబంధం లేకుండా సాహిత్యంలో మార్పులు వస్తాయని చెప్పడం సాధ్యంకాలేదు. అంచేత, Kuhn నిర్మాణక్రమాన్ని ఒప్పుకొన్నా, అతను చెప్పిన కారణం నేను అనుసరించలేదు. సమాజంలోని మార్పులవల్లే ఒకరకమైన సాహిత్యం ఇంకొకరకమైన సాహిత్యంగా మారుతుంది అని నేను ప్రతిపాదించాను. అంచేత Kuhn నిర్మాణక్రమం నాకు వర్తించదు. అయినా, అతని పుస్తకంలో Structures అనేమాట, Revolution అనేమాట నా పుస్తకపు పేరులో వాడుకొన్నాను. అందుకనే ‘తెలుగులో కవితావిప్లవాల స్వరూపం’ అని పేరుపెట్టాను.
ఇకపోతే, విప్లవం అనేమాట తెలుగు పాఠకులకి ఒకరకంగానే అర్థం అవుతుంది. ఆ అర్థం నాకు పట్టదు అనీ, ఒకరకమైన సాహిత్యం ఇంకొకరకమైన సాహిత్యంగా మారినప్పుడు రచనాసూత్రాలు మారతాయనీ, ఇలా మారినప్పుడు విప్లవం అనేమాట వాడవచ్చనీ నేను ఎన్నిసార్లు చెప్పినా నా పాఠకులు పట్టించుకోలేదు. భావకవిత్వం విప్లవకవిత్వం ఎలా అవుతుంది-లాంటి విమర్శలు దాదాపు అందరూ చేశారు. దానికి కారణం వాళ్ళు విప్లవం అనేమాటలో ఇరుక్కొని దానిలోంచి బయటకు రాలేకపోవడమే. ఇకపోతే, Marx quotation నా పుస్తకం ఆరంభంలో ఇవ్వడం చూసి, ఇది Marxist గ్రంథమేమో అని చాలామంది ఆశించారు. ప్రాతిపదిక అనేమాటని ఎవరూ సరిగా అర్థం చేసుకోలేదు. తెలుగు సాహిత్యంలో కవులలో చాలామంది వాళ్ళకి భగవంతుడు కలలో కనిపించి చెప్పాడనీ అందువల్ల ఈపుస్తకం రాస్తున్నామని ఇలా రకరకమైన కారణాలు వాళ్ళ పుస్తకం రాయడానికి ప్రేరణగా చెప్పారు. కాదు, పుస్తకం భౌతికమైన కారణాలవల్లే తయారవుతుంది అని బలంగా చెప్పడానికి Marx వాక్యాన్ని నేను ఆరంభంలో చెప్పాను. అది ప్రాతిపదిక అని కూడా చెప్పాను. ప్రాతిపదిక అంటే రుజువు చెయ్యక్కరలేకుండా గ్రహించిన కారణం. ఈ సంగతి గమనించక నేనేదో Marxist గ్రంథం రాస్తున్నానని చాలామంది పొరపాటుపడ్డారు.
ఈ రకంగా నా పుస్తకంలో ఆరభంలో చెప్పిన Marx వాక్యమూ, ఆ తరువాత Kuhn చెప్పిన సిద్ధాంతానికీ నాపుస్తకానికీ మాటలకూర్పులో తప్ప గాఢమైన ఆధారం ఏదీలేదని ఎవరూ గమనించలేదు. అంచేత నా పుస్తకంపేరు చాలామందిని తికమకపెట్టింది. పైపై మాటల అర్థాలు మినహాయిస్తే ఈ పుస్తకం Marxist పుస్తకమూ కాదు, Kuhn సిద్ధాంతాన్ని అనుసరించిన పుస్తకమూ కాదు. అందుకని ఈ సంజాయిషీ ఇచ్చుకొంటున్నాను.