సంచారి

పుట్టి పెరిగిన ఊరిని
పద్దెనిమిదేళ్ళ పాటు
పెంచుకున్న మమతల్ని
అలవోకగా పక్కన పెట్టి
చిటికెన వేలిని అందించిన చేతితో
లక్షల అడుగుల నడక.

ఉద్యోగం ఊరు మారినప్పుడల్లా
అన్ని సామాన్లతో పాటు
అల్లుకున్న అనుబంధాలను
అట్టపెట్టెల్లో సర్దుకొని
అయ్యగారి ఆఫీసుకో
పెద్దోడి ప్రైవేటుకో
చిన్నోడి కాన్వెంటుకో
దగ్గరగా ఉండే నీడ కోసం అన్వేషణ.
బేడలుగానో, దాల్ గానో
పేరు మార్చుకొని దాగుడుమూతలాడే
వెచ్చాల కోసం వెతుకులాట.

రోమ్‌లో రోమన్‌నే అంటుంది ఆహార్యం
కొత్త పదాలను చేర్చుకున్న భాష
సరికొత్త సోయగాలు పోతుంది.
అమ్మనుడికి దూరంగా జరుగుతుంది
ఏడాదికో, రెండేళ్ళకో
అయినవాళ్ళను కలిసినపుడు
గట్టిగా హత్తుకొని ఏడ్వలేని నాగరికత
కరిగిన కాటుకను
కన్వీనియెంట్ గా కర్ఛిఫ్‌తో అద్దుతుంది.

ఈ వలస పక్షిది
వెనుతిరగలేని ప్రయాణం
ఏ మజిలీ ఎన్నాళ్ళో
ఏది చివరి గమ్యమో
నిశ్చయంగా తెలియని ప్రయాణం.

నిజంగా
సంచారజీవితం
అప్పుడెప్పుడో అడుగుపెట్టిన ఆర్యులదీ
పొట్ట చేతబట్టుకొని పోరాడుతున్న కూలీలదీ
మాత్రమేనా?