ఒక పెద్దాయన ఆకాశం నుంచి చందమామను కిందకి లాగడాన్ని ఒకసారి చూశాను. చాలా ఆశ్చర్యమేసింది. మెల్లగా తేరుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను చూసింది నిజమేనా అనిపించింది. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నేను అలా ఒక్కడినే ప్రశాంతత కోసం బయలుదేరాను. చాలా దూరం వచ్చేశాను… ఊరు వెలుపలకి. ఆ వ్యక్తి ఆకాశం కేసి చూస్తున్నాడు.
ఆయన ఒక పెద్ద తాడు చివర్న కొక్కెం కట్టి చందమామ మీదకి విసురుతున్నాడు. తెల్లనిగోళం తన చేతుల్లోకి వచ్చి పడేవరకూ ప్రయత్నించాడు. చాలా అలసిపోయాడు. అంత పెద్ద గోళం అమాంతం వచ్చి పడేసరికి బరువు మోయలేక నానా యాతన పడ్డాడు. అక్కడికి దగ్గరలోని భవనాల నీడలో నక్కినక్కి చూస్తున్న వ్యక్తిని పిలిచాను, ఆ పెద్దాయనకి సాయం చేయమని. ఒక్క ఉదుటన ఆయన్ను చేరాడతను. అప్పటికే చందమామ నుంచి జారిన నీటి చుక్కలు అతని పాదాలమీద పడ్డాయి. అతనికి ఎంతో ఆనందమేసింది. థాంక్యూ అన్నాడంతే. చందమామ అతన్ని వదిలేసి వెళ్ళింది. అతని వొణుకుతున్న చేతులకు తెల్లని మంచు మరక అంటింది.
“ఎక్కడినుంచి తెచ్చావు దీన్ని?” అడిగాను.
“ఇక్కడే… ఇంటి వెనక ఆ దారి వంపు నుంచి” అంటూ నా భుజం తట్టి మరీ చెప్పాడు. అతనితో నేనూ వెళ్ళాను. అసలా పెద్దాయనకు ఆ చందమామతో పనేమిటో తెలుసుకుందామని.
ఆకాశంలో చందమామ లేకపోయేసరికి రాత్రి చీకటి మరింతగా ఉంది. కానీ నా చేతుల్లో అది మరింత వెలుగుతో మెరుస్తోంది. కళ్ళు చెదిరేంత వెలుగు! అలా పట్టుకొని ఉండడంతో చొక్కా ముందుభాగం తడిసి అంటుకుపోయింది.
“ఇంతకీ చందమామను ఇంటికి ఎందుకు తెచ్చారు?” మోయలేక ఇబ్బందితో అడిగాను.
“మా ఆవిడ నీరసంగా ఉంది. చీకట్లో చురుగ్గా కదల్లేదు. చందమామ వెలుగులో అయితే ఆమెకు ఎలాంటి ఇబ్బందీ కలగదు కదా!” పెద్దాయన వివరిస్తూ తాడుకు పెట్టిన కొక్కాన్ని విడదీశాడు.
“అంటే, ప్రతీ రాత్రి యిలానే చేస్తుంటారా?”
“లేదు. వాస్తవానికి రోజూ తీసుకురావాలనే అనుకుంటాను. కానీ ఇతరుల ఆనందానికి దాన్ని వీలయినన్ని రోజులు వదిలేద్దాంలే అని మా ఆవిడ అంటూంది. కానీ ఒక్కటి మాత్రం నిజం… చందమామ చక్కగా చిక్కని వెలుగు మాత్రం జారవిడుస్తూంటుంది” వివరించాడు పెద్దాయన.
జాబిలి అలా కొంత కోల్పోవడంతో నేల మీదకు జారిపడింది. నేనయితే క్షమాపణలు కోరాను. కానీ ఈ పెద్దాయన మాత్రం క్షంతవ్యుడు కాదు. ఆయనకు మనసులో ఆ భావనే లేదు. పైగా నవ్వుతూ “నేను చేసే పనికంటే గొప్ప పని నువ్వెప్పుడయినా చేశావా?” అని ప్రశ్నించాడాయన.
మేము మెల్లగా పెద్ద పెద్ద భవనాలను చుట్టుకున్న నల్లటి పొరలాంటి చీకటినీ వాటికి వదిలించి, రాళ్ళు రప్పల్నీ చీకటి దుప్పటి నుంచి బయటపడేశాం. అంతలో ఎత్తయిన ప్రదేశానికి చేరాం. ఎదురుగా రెండు పెద్ద భవనాలు కనిపించాయి. వాటి కిటికీలు పచ్చని వెలుగుతో మెరుస్తున్నాయి.
ఆయన తలుపులు తీసి జాబిలిని లోపలికి తీసికెళ్ళాడు. “ఈమె నా భార్య” అంటూ ఆమెకు నన్ను పరిచయం చేశాడు. ఆమె దుప్పటి కప్పుకుని ఒక మూల వొణుకుతూ కూర్చుని ఉంది. చిత్రంగా అలానే నిద్రపోతోంది. పక్కనే ఉన్న ఫైర్‌ప్లేస్‌లో కట్టెలు మండుతూ ఆమె ముఖాన్ని స్పష్టంగా కనిపించేట్టు చేశాయి. పెద్దాయన టోపీ తీసి తలుపుకి తగిలించి “మరోలా అనుకోనంటే, నాతోపాటు బాత్రూమ్‌లోకి నా వెనకే రా, లోపల బాత్‌టబ్ ఉంది, అందులో జాబిలిని పెట్టు” అన్నాడు. ఆయనతో అలానే పెద్ద నీటికుండను మోసినంత జాగ్రత్తగా టబ్‌లో పెట్టడంలో సాయపడ్డాను.
ఇల్లు చిన్నదే. కానీ చాలా శుభ్రంగా ఉంది. రెండు కుర్చీలు, చిన్న టీపాయి మీద పూలసజ్జ, మరో మూల బల్ల మీద ఇద్దరూ ఉన్న ఫోటో! నిజానికి జాబిలిని ఆ పాచిపట్టిన బాత్ టబ్‌లో అమర్చడానికి కాసింత కష్టపడాల్సి వచ్చిందనే అంటాను. దాన్ని అలా పెట్టగానే దాని రూపు మారింది. గది నలుమూలలా వెలుగు పరుచుకుంది. వెండి వెలుగుతో టబ్ మెరిసిపోతోంది.
“సాయం చేసినందుకు ఉట్టి థాంక్స్ చెప్పడం కాదు. నీకు మంచి చొక్కా కూడా ఇస్తాను. నీ చొక్కా తడిసి ముద్దయింది… తెలుస్తోందా?” అన్నాడాయన. నాకు నవ్వొచ్చింది. చల్లదనానికి వొణుకుతున్న నాకు అదో పెద్ద బహుమతి మరి! పెద్దాయన మరో గదిలోకి వెళిపోయాడు. నేనింకా టబ్ అంచున కూర్చునే ఉన్నాను, ఆ వెలుగు నది వొంపులు పోతుంటే చూస్తూ కూర్చుండిపోయాను. అంతలో ఆయన భుజాల దగ్గర కాస్తంత చిరుగు ఉన్న స్వెట్టర్ తెచ్చి ఇచ్చాడు. “ఇది నీ చొక్కా అంత బావోలేదు… ” అంటూ చాలా సిగ్గుపడుతూ అందించాడు. అయ్యో ఫరవాలేదండీ అన్నాను దాన్ని అందుకుంటూ.
“సరే, మీ భార్యను ఇక్కడిదాకా తీసుకురావడానికి సాయం చేయాలా?” అని అడిగాను, జాబిలి మహత్తు ఏమిటన్నది తెలుసుకోవాలన్న ఉత్సుకతతో.
“మరోలా అనుకోకుంటే సరే…” అన్నాడాయన చిత్రంగా చేతులు తిప్పుతూ.
ఇద్దరం ఆమె గదికి వెళ్ళి ఆమెను బట్టల మూటని ఎత్తుకున్నట్టు పట్టుకున్నాం. ఆమె ఇంకా నిద్ర నుంచి పూర్తిగా మేల్కొనలేదు. పెద్దాయన నా వంక చూసి నవ్వి, “ఈ మధ్య ఎక్కువ సమయం నిద్రలోనే కాలం గడిపేస్తోంది” అన్నాడు.
ఇద్దరం ఆమెను పట్టుకు తెస్తున్నాం గాని వాస్తవానికి జాబిలికంటే బరువు లేదామె, పెద్ద దుప్పటిలో పెద్ద పక్షిలా ఉంది. ఆమె తల నా మీదకి వొరిగింది. ఆమె తెల్లని జుత్తు నా చేతుల మీద జీరాడుతోంది. బాగా మిగులపండిన పండు వాసన వస్తోంది ఆమె నుంచి.
ఆమెను మెల్లగా నేల మీద కూర్చోబెట్టాం. గోడకు ఆనుకుంది. చూస్తే ఆమె ఊపిరి తీస్తున్నట్టు కూడా తెలియడం లేదు. భయంతో “ఆమె ఆరోగ్యం క్షీణించలేదు గదా!” అడిగాను.
గొంతులో వొణుకు నాకే తెలుస్తోంది. ‘అబ్బే ఆరోగ్యానికేం బెంగలేదు’ అన్నట్టు చేయి పూపాడాయన. హమ్మయ్య అనుకున్నాను లోలోపల. ఇద్దరం ఆమెను పట్టి జాబిలిలోకి దించాం.
నేను కళ్ళు తెరిచి చూసేసరికి పెద్దాయన ప్రశాంతంగా కనిపించాడు. ఆయన భార్య జాబిలిలో పీకల్లోతు మునిగి ఉంది. కళ్ళు మూసుకుని ఉన్నాయి. తొట్టెకు ఆనుకున్నాడాయన. “చూశావా…” అన్నాడాయన ఆమెను చూపుతూ, ఆమెకి జాబిలిలో ఉన్న సంగతీ తెలియడం లేదన్నట్టు. నేను మాత్రం జాబిలి మహత్తేమిటో చూడాలనుకుంటున్నాను.
కానీ నా ఉత్సాహం చల్లారింది. ఊహించినట్టు ఏమీ జరగలేదు. పెద్దాయన భార్య అలా మంచుపొగల్లో కదలకుండా ఉన్నది. వెండి జాబిలి ఆమె ముఖం మీద మెరుస్తోంది. ఆమె మాత్రం అంతకు ముందుకంటే పేలవంగానే కనపడుతోంది. ఆమె శరీరం నీటిలోకి మరింత జారిపోతోంది. అది గమనించి పెద్దాయన చట్టుకుని ఆమెను పైకి లాగాడు. “కాస్తుంటే పూర్తిగా మునిగిపోయేది సుమా” అంటూ నా వేపు భయంగా చూశాడు.
ఆమె మొహం మీద నురగను చేత్తో తుడుస్తూ, “ఆమె అప్పుడప్పుడు అలా మునిగిపోతూంటుంది” అన్నాడాయన. నేను గదిలోంచి బయటికి వచ్చేశాను.
“ఎందుకు వెళుతున్నావ్? ఇక్కడే ఉండటం ఆమెకు యిష్టం.”
ఆయన వేపు చూశాను. మొహం వెలిగిపోతోంది. కంటి కొసల్లో నీటి చుక్క మెరిసింది. ఆయన ఆమె మొహం మీద పడిన జుత్తును తీసి నుదురును నురుగుతో రుద్దాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు.
“ఒక్క ముప్పయి నిమిషాలు ఉండు, ఈ జాబిలిని తిరిగి తీసికెళదాం. నాకోసం వేచి ఉండగలవా?” అడిగాడాయన.
ఆయన తన భార్యతో, జాబిలితో గదిలో ఉన్నాడు. ఆయన ఆమె జుత్తును, శరీరాన్ని నీటితో శుభ్రం చేస్తున్నాడు. నేను హాల్లో వాలు కుర్చీ దగ్గరకి వెళ్ళాను. అక్కడ కొలిమి దగ్గర నిలబడి నా చొక్కా తడిని ఆరబెట్టుకుంటున్నాను. కొంతసేపటికి ఆయన తన భార్యను మెల్లగా మోసుకొచ్చి వాళ్ళ బెడ్‌రూమ్‌కి తీసికెళ్ళి ఆమెకు దుస్తులు మార్చాడు.
“ఏమనుకోకుంటే, ఆ జాబిలిని మెల్లగా ఎత్తి పట్టుకురాగలవా?” అన్నాడు గదిలోంచి బయటికి చూస్తూ.
నీరసాన్ని వదిలించుకుని ఆ పనిలో పడ్డాను. చేతుల్లోకి పెద్ద బంతిని తీసుకున్నట్టు బాత్‌టబ్ లోంచి చేతుల్లోకి జాబిలిని తీసుకున్నాను. కాస్తంత బరువుగానే ఉంది. పెద్దాయన బెడ్‌రూమ్‌లోంచి బయటికి వచ్చి జాబిలిని బయటికి తీసికెళ్ళడానికి వీధి తలుపులు తీశాడు. వస్తూ ఆమెనోసారి చూశాడు. ఆమె మాత్రం కదలక మెదలక అలా బెడ్ మీద పడుకుని ఉంది. ఆమె కదిలి స్పందిస్తే బాగుండుననుకున్నాను. కానీ అదేమీ జరగలేదు.
మెల్లగా మేము వారి బిల్డింగ్ నుంచి చడీచప్పుడూ లేకుండా నడిచాం. ఆయన రాత్రి సంఘటనతో తృప్తి పొందినట్టే కనిపించాడు, నాకు మాత్రం నీరసం పట్టుకుంది. జాబిలిని పట్టిన ప్రదేశాన్ని చేరుకున్నాం. ఆయన తాడు ఉచ్చును మళ్ళీ జాబిలికి తగిలించాడు. అది జాబిలి మధ్యభాగానికి రాగానే, “నీకిచ్చిన చొక్కాని నువ్వే వుంచుకో. నీకు బాగానే ఉంది. ఇంతకంటే నేను ప్రత్యేకించి బహుమానంగా ఏమీ ఇచ్చుకోలేను కూడా” అన్నాడాయన. అది మగ్గిన పండు వాసన కొడుతోంది. అప్పుడపుడే తెల్లారుతోంది. తొలి వెలుగు రేఖలు చూసి “త్వరగా! దాని స్థానంలో అమర్చాలి. సమయం మించిపోతోంది” అన్నాడాయన.
బలాన్నంతా కూడగట్టుకుని చందమామను ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరేసేను. అది గాలిపటంలా అలా తేలుతూ తన అసలు స్థానంలోకి చేరడాన్ని ఇద్దరం అలా చూస్తూండిపోయాం. ఉదయ కిరణాల వెలుగులో అది పేలవంగా కనపడుతోంది. పెద్దాయన గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు. మెడ పైకి ఎత్తి మళ్ళీ జాబిలివంకే చూశాడు. “జాబిలి మహా అందమయినదే సుమా!” అన్నాడాయన నా వేపు చూసి. “ఆమెకూ చందమామ అంటే మహా యిష్టం. రాత్రి నిజంగా గొప్ప సాయం చేశావయ్యా!” అన్నాడు భుజం తడుతూ.
“ఇంతకీ ఎన్నాళ్ళుగా మీరు ఇలా చేస్తున్నారు?” అని అడిగాను, ఎత్తుకున్నపుడు విన్న ఆమె మోకాళ్ళ శబ్దం యింకా చెవుల్లో వినపడుతోంటే.
“సుమారు ఏడాది నుంచి. ఏడాదిగా ఆమె ఆరోగ్యం బాగోలేదు.”
“ఏమిటీ! ఏడాదిగా ఆమె ఆరోగ్యం బాగోలేదా?” అడిగాను ఆయన మొహంలోకి చూస్తూ.
“చందమామను తెస్తుండకపోతే ఈ మాత్రం అన్నా ఉండేది కాదు తెలుసునా? ఆమెతో పాటు నేనూ ఈ మాత్రమన్నా ఉన్నాను…” అంటూ ఆకాశంవేపు చేయి ఎత్తి మళ్ళీ కలుద్దామన్నట్టు చేయి వూపాడాయన.
“మరి ఇక్కడివారికి మీ పని గురించి తెలుసునా?” పిచ్చి ప్రశ్న… తడుముకోకుండా అడిగేశాను.
“అబ్బే. లేదు. వాళ్ళకి తెలిస్తే ఆమెను ఈసరికే ఆస్పత్రిలో చేర్పించేవాళ్ళు. చందమామ చేస్తున్న మేలు వారికి తెలీదు. పట్టించుకోరు కూడా.”
మెల్లగా సూరీడు పైకి వచ్చాడు. నులివెచ్చని కిరణాలు కంటికి తగిలాయి. చేతులు అడ్డుపెట్టుకున్నాను. అంతలో పెద్దాయన నా దగ్గరికి వచ్చి నా భుజాలు పట్టుకుని, “ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు. ఎవ్వరికీ తెలియకూడదు. అర్థం చేసుకోరు కూడాను” అన్నాడు. పిల్లాడిని సముదాయిస్తున్నట్టు భుజాలు పట్టుకుని ఊపుతూ దగ్గరికి తీసుకున్నాడు. సూరీడి వెలుగులో ఆయన మొహం వెలుగుతోంది. “వాళ్ళు నానుంచి ఆమెను దూరం చేయలేరు” అన్నాడు.
ఆయన్ను వదిలించుకుని దూరంగా జరిగాను. నా బట్టలు దులుపుకున్నాను. వొళ్ళు తుడుచుకున్నాను. “సారీ, ఏమీ అనుకోవద్దు” అన్నాను. నా దారిన పడ్డాను.
“ఎవరికీ ఈ సంగతి మాత్రం చెప్పకు!” అంటూ ఆయన అరుస్తున్నాడు. క్రమేపీ ఆయన హెచ్చరికలాంటి పిలుపు మరింత దూరమయింది. నేను పరుగుదీశాను.
(మూలం: Old man of the moon – Shěn Fù. ఆంగ్లానువాదం: Leonard Pratt.)