ఉ. తాకినవిల్లు తాకినటు దాశరథి ప్రథితాంగుళీయక
శ్రీ కిరణాప్తిచే విరిగె చిత్రము నెచ్చెలి! నిక్వణక్వణ
వ్యాకులమై ధనుస్సు యిటువంగిన నా యెద వింటితోడ కే
కీ కలహంసికా పికశుకీ కమనీయ సకాకలీధ్వనిన్.
నానృషిః కురుతే కావ్యమ్ అని. ఋషికానివాడు కావ్యనిర్మాణం చేపట్టలేడు. ఋషి ఎవరు అంటే, ఋషిశ్చ కిల దర్శనాత్ అని. ఇంద్రియాలకు గోచరం కానిదానిని చూసేవాడు ఋషి. ఈ చూపుకు కారణం నిరంతరసాధన. దీనికే తపస్సు అని పేరు. కవి కూడా తపన పడతాడు. ఆ తపన వలననే ఒక విషయంపై అతని మనసు లగ్నమయి, కవితను అల్లగలుగుతుంది. తపించడం ఇరువురికీ ఒక్కటే. తపనపడే వస్తువులో భేదం. ఋషి తపించేది ఎల్లలు లేని దైవత్వం కోసం. కవి తపించేది ఎల్లలకు లోబడిన శుద్ధత్వం కోసం. కనుక కవి ఋషితుల్యుడు.
కవి మనసులో కొన్ని తెరల వెనుకన ఒక ధ్యానం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. తనను కదిలించేటువంటి ఒక సన్నివేశం అతనికి అనుభూతమైనపుడు ఆ ధ్యానవృక్షానికి కవితాఫలాలు కాస్తాయి. గొప్ప కవిని ఈ రకంగా పోల్చుకోవచ్చు. అతని కవితలో పదగుంఫనం వెనుక, ఉత్తమోహల వెనుకా సంస్కారవంతమైన ఒక చూపు కనిపిస్తుంది. ఆ చూపు ఆనుపానులను అదే ఉన్నతమైన సంస్కారం కలిగిన సహృదయపాఠకుడి మనస్సు గుర్తుపడుతుంది. మహాకవి నీలకంఠదీక్షితుల పలుకులు అక్షరసత్యాలు. అందరూ ఉపయోగించే పదాలనే కవి ఉపయోగిస్తాడు. అందరూ అనుభవించే జీవితాన్నే కవీ అనుభవిస్తాడు. కానీ కవి చూపుది ఎంత వైశిష్ట్యం! ఒక కవితలో ఆ కవితాశరీరానికి ఆవల ఉన్న కవి చూపు ఎంతకాలం వరకూ అయితే చదువరి మనసుకు ఆకళింపులోకి వస్తుందో అంతవరకూ ఆ కవితకు ఆయువు. ‘నీవేం వ్రాశావో వినిపించు’ అని కాదు ఒక కవిని అడుగవలసింది. ‘నీవేం చూశావో వినిపించు’ అని అడగాలి.
అటువంటి ఒక చూపు, ఒక వినూత్నదృష్టి ఈ పద్యం. ఈ పద్యం, చూసే చూపును బట్టి ఒక వస్తువు, అది ఎంత ప్రసిద్ధి చెందిందైనా సరే, ఒక నూత్నవర్ణాన్ని పులుముకొంటుంది అని అనడానికి సాక్షి. దానితో పాటుగా, ఎన్నో వేల సంవత్సరాలనుండీ పరిచితమైన వస్తువునైనా వేరొక నూత్నదృక్కుతో చూసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అని అనడానికి కూడా. కవిత్వం ఎప్పుడూ నవనవీనమైది, సజీవమైనది అని చెప్పడానికి ఈ పద్యం చాలు.
ఈ పద్యం వ్రాసిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. తిలక్ ఉత్తమవచన కవి. అత్యుత్తమ పద్యకవి. ఇరవైయో శతాబ్దం తెలుగుసాహిత్యంలో ఒక సంధియుగం. మార్పులు అంతకుముందెన్నడూ లేని విధంగా ఉవ్వెత్తున సాహిత్యజగత్తులో అలలు అలలుగా విజృంభించి ఊపిరి సలుపనివ్వకుండా ఈ నేల మీదకు వచ్చాయి. దీనివల్లన ఏర్పడిన ఒక దురదృష్టం, ప్రతీ కవిముందుకూ వచ్చిన ఒక ప్రశ్న: ‘నువ్వు కొత్త విధానాన్ని దేన్నైనా సృజించగలిగావా లేదా?’ ఇప్పుడు మనకు ప్రసిద్ధులుగా తెలిసిన ఇరవైయోశతాబ్దపు కవులందరూ ఏదో ఒక నూత్నకవితావిధానం వల్లనే ప్రసిద్ధులు. అలానే తిలక్ మంచి వచనకవిత్వానికి ప్రసిద్ధుడు. ఆయన వ్రాసిన అమృతం కురిసిన రాత్రికవితాసంపుటి ఇప్పటికీ దేశదేశాంతరాలలో ఉన్న ప్రతీతెలుగువాడి కర్ణపుటాలలో సైతం గింగిరాలు తిరుగుతూనే ఉంది. కానీ దురదృష్టమో ఏమో, తిలక్‌కు దక్కిన ఈ కీర్తికాంత హొయల వెనుక ఆయన పద్యకవిత్వం మరుగున పడిపోయిందని అనిపిస్తుంది నాకు.
తిలక్ మొదటగా తనను తాను చూసుకున్నది, చెక్కుకున్నది, పక్వమైనదీ ఒక పద్యకవిగానే. అందుకనే ఆయన వచనకవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టిన తరువాత కూడా పద్యాన్ని విడిచిపెట్టలేదు. తిలక్ పద్యం ఒక మెత్తందనాల జల్లు. కవితాగుణాల పెల్లు. ఆయన ఛందస్సును కించపరచకుండా లొంగదీసుకొని దానికి ఆధునికభాష నేర్పాడు. వినమ్రంగా పద్యసరస్వతి చెంపపై సరికొత్తగా చిటికవేశాడు. ఆమె నవ్వును గమనించి తల పైకి ఎత్తాడు. తన ఛాతీని విప్పార్చాడు.
తిలక్ పద్యంలో ఒక గొప్ప గుణం, అది ప్రాచీనపద్యం నుండి పుట్టినట్టుగా ఉంటుంది. అదే సమయంలో ఆధునికతను చూపుతున్నట్టుగా ఉంటుంది. తిలక్ పద్యరచనావిధానం చూసినప్పుడల్లా నాకు కలిగే ఆలోచన, దీన్ని ఏ మాత్రం గ్రాంథికంగా బిగించినా ప్రబంధకవుల పద్యమైపోతుంది. సడలిస్తే పద్యం కాకుండా పేలవమై వ్యావహారికమైపోతుంది. నేటి యుగానికి సరిగ్గా సమపాళ్ళలో కావలసిన పద్యపు దినుసు తిలక్ కవిత్వంలో కనపడుతుంది. పద్యస్వరూపాన్ని గౌరవించి, కొత్తగా మార్చుతూనే మార్చకుండా ఈ రకమైన నాడిని మొదటగా పరిపూర్ణంగానూ బహుముఖీనంగానూ సమగ్రంగానూ పట్టుకున్నది పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. తనదైన ధోరణిని కనబరుస్తూ ఒకరకంగా తిలక్ ఈ విధంగా పద్యం వ్రాసినవాళ్ళలో చివరివాడు.
తిలక్‌ను సీతాదేవి కదిలించిన విధంగా మరే వస్తువూ కదిలించలేకపోయింది. ఆయన జీవితంలో సీతాదేవిపైనే ఎక్కువ కవితలు వ్రాశాడని చెప్పాలి. అవి కూడా అన్నీ పద్యాలు. అనిదంపూర్వమైన మాధురీమహిమ ఈ కవితలలో కనపడుతుంది. సీత-1, సీత-2 అనే కవితలు సీతాదేవిలోని దుఃఖితహృదయాన్ని, దానిని చూసి విచలితమైన కవి హృదయాన్నీ మనముందు సాక్షాత్కరింపజేస్తాయి. అద్వైతమాన్మథము అనే కవిత సీతారాముల ఆత్మానుబంధనిరూపణము. ఇది సీత రామునితో మాట్లాడుతున్నట్లుగా సాగుతుంది. ఇక మిగిలిన నాలుగవ కవిత స్వయంవర – ఇది జానకీస్వయంవర సమయాన్ని, శివధనుర్భంగాన్నీ వర్ణిస్తుంది. ఇవన్నీ గోరువంకలు అన్న పుస్తకంగా ప్రచురించారు.
పై పద్యం స్వయంవర లోనిదే. స్వయంవర అనే కవిత మొత్తంగా ఒక విలక్షణమైన జానకీదర్శనము. ఇందులో కొంత కల్పన ఉంటుంది. ఒకవేళ విశ్వామిత్రుడితో రాముడు జనకుని ఆస్థానానికి రావడం దగ్గరనుండి, శివధనుర్భంగం వరకూ సీతాదేవి మొత్తాన్నీ గమనిస్తూ ఉంటే, ఆమె మనఃస్థితి ఏవిధంగా ఉంటుందో అన్నది కవి తీసుకున్న వస్తువు. ఈ కవితలో సీతాదేవి తన మనస్సు ఏ విధంగా మల్లగుల్లాలు పడుతోందో తన చెలికత్తెకు చెబుతుంది. రాముడిని మొదటగా చూసి, తన స్వామి ఇతడేనా అని గుర్తుపట్టడం దగ్గరనుండి, శివధనుర్భంగం జరిగాక అప్సరసలు రామునిపై పుష్పవర్షం కురిపించేవరకూ పద్యాలు నడుస్తాయి. రామభావనలో ఆపాదచూడమూ మునిగిపోయిన మైథిలి రాముడు నిండిన మనస్సుతో చివరకు భావసమాధిని పొందుతుంది. ఇటువంటి ఒక కవిత తెలుగు సాహిత్యంలోనే మరొకటి లేదు అనుకుంటాను.
సీతాదేవి సమాధిస్థితిని పొందుతూ తన చెలికత్తెను ఆదుకొమ్మని పిలిచే అందమైన పద్యం ఈ కవితలో ఉన్నా, దానిని కాదని, ఆ పద్యం పైన ఉన్న ప్రస్తుత పద్యాన్ని నేను ఎన్నుకోవడానికి ఒక కారణముంది. ఆ కారణం పైన చెప్పినదే – ఎన్నో వేల సంవత్సరాలనుండీ పరిచితమైన వస్తువునైనా వేరొక నూత్నదృక్కుతో చూసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అని. రామాయణంలో శివధనుర్భంగఘట్టం కవులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. రామాయణవిషయాలను తీసుకొని కావ్యాలను వ్రాసినవారు, నాటకాలను వ్రాసినవారు, చంపువులను వ్రాసిన కవులు ఇలా అందరూ శివధనుర్భంగంపై ముచ్చటపడిన వారే. ఆ సన్నివేశాన్ని రాఘవపరాక్రమస్ఫోరకంగా వర్ణించిన వర్ణనలు కోకొల్లలు. కవులు ఇక్కడ యుక్తితో అతిశయోక్తిని ప్రవేశపెట్టి లక్ష్మణస్వామి చేత ఉప్పొంగుతున్న సముద్రాలను, బ్రద్దలవుతున్న పర్వతాలనూ శాంతింపచేయించారు. శివధనుర్భంగశబ్దానికి భూమే కాదు, స్వర్గ-సత్య-వైకుంఠ-కైలాసాది ఊర్ధ్వలోకాలు; తలాతల-రసాతల-పాతాళాది అధోలోకాలూ కంపించిపోయినట్లుగా కూడా పద్యాలు అల్లారు.
ఒకసారి ఈ పద్యాన్ని చూడండి. శివధనుర్భంగమే ఇక్కడా జరిగినది. కానీ అది జరిగినది సీతాదేవి మనస్సులో. ఆ సంగతిని ఆమె తన నెచ్చెలితో చెప్పుకుంటోంది. కనుక అక్కడ ఫెళఫెళార్భటులు లేవు. మరి ఏమున్నాయి అంటే అక్కడ పుట్టిన చప్పుడు ఇదట: కేకీ (ఆడునెమలి), కలహంసికా (రాజహంస), పిక(కోయిల), శుకీ(ఆడుచిలుక), కూతలతో కూడిన కమనీయమైన కాకలీధ్వని(సూక్ష్మమైన అవ్యక్తమధురధ్వని). ఆ సమయంలో సీతాహృదయంలో ఉన్న ధ్వని ఇదట!
శ్రీరాముని అంగుళుల శ్రీకిరణాలు సోకగానే శివధనువు వంగింది. వంగి విరిగింది. ఇదే కదా అసలు అందం. స్వామికి ధనుస్సును విరవాలన్న సంకల్పం లేదు. ఆ అసంకల్పితచర్యకు కారణం ఆ ధనస్సుకు రామకరాంగుళుల శ్రీకిరణాలు సోకడమట! ఆయన స్పర్శకోసం తపించే గుండె కదా జానకిది! ఆ సమయంలో ఆ వాంఛ ఆమెలో మరింగ బలీయంగా ఉండి ఉంటుంది. అప్పుడు శివధనువుతో పాటుగా సీతాదేవి యెద అనే విల్లు కూడా రామవశమై వంగిపోయింది. ఆ ధనువు ఏ విధంగా ఉన్నది? అది నిక్వణ క్వణ వ్యాకులము. నిక్వణము, క్వణము అనే శబ్దాలు ధ్వన్యర్థకాలు. అయితే క్వణో వీణాయాం చ అని. క్వణ శబ్దం వీణాదుల శబ్దాన్ని సూచిస్తుంది. నిక్వణమన్నా అదే అర్థాన్ని నిఘంటువులు చెప్పాయి. అమరకోశం మాత్రం నిక్వణ, క్వణ శబ్దాలను భూషణధ్వనిని చెప్పే శబ్దాలుగా నిర్వచించింది. ఆ ధ్వనులతో వ్యాకులమైనదట ఆమె మనస్సు.
ఈ విధంగా కళ్యాణఘట్టానికి కొద్దిగా ముందు కోరుకొన్న వాడిని మనువాడబోతున్న ఒక అత్యున్నత స్త్రీ మనస్సులో పుట్టే ధ్వనులను మృదుమూర్తి అయిన తిలక్ కాక మరెవరు ఆలించగలరు?
ఒక ధనువు, అదీ శైవధనువు, ఒక మహాపరాక్రమవంతుని చేతిలో విరగడమనే చోట ఆ సన్నివేశాన్ని చూసే చూపును మార్చి, సీతాదృష్టితో చూస్తూ, అక్కడ ఢమఢమలాడించే శబ్దాలతో ఏదేని ఒక పాషాణపాకపద్యాన్ని వ్రాయకుండా పక్షులను, అవ్యక్తసూక్ష్మధ్వనిని, వీణాది సంగీతవాయిద్యాల ధ్వనులనూ తీసుకొని వచ్చిన కవి ప్రతిభ నాన్యతోదర్శనీయము. ఇది కేవలం కవిదృష్టి. ఆనాడు అమృతం కురిసిన ఆమె మనస్సులో తప్ప, ఒక ధనువు ఈ విధంగా భంగమవడమూ అసాధ్యమే. ఇది కేవలం మైథిలీదృష్టి.