రహస్యనేత్రం

గుప్పెడు అక్షరాలను పోగేశారు
కాసిని వాన చినుకులను చల్లారు
రవికిరణపు వెలుగులను తాగించారు
పూలరంగులను ఒంపి
పరిమళాలు అద్దారు
సీతాకోకల రెక్కలపై ఊరేగించారు
ఆకాశంలోకి ఎగరేశారు
హరివిల్లుపై ఊయలలూపారు.

ఒక్క వాక్యం కనికరించదే!
మునుపు
ఎలా కుంభవృష్టి కురిసింది
నదిలా ఉరకలేస్తూ
లోయలగుండా
ఎలా ప్రవహించింది
ఇప్పుడెందుకిలా
మనసు ఎడారైంది?

నిముషాలు రోజులై
రోజులు వారాలై నడుస్తున్నాయి
వాక్యమెందుకు పలకదు?

ఒక అంతులేని శూన్యం
నల్లమబ్బులా ఆవరించింది.

ఈ స్తబ్ధత
ఈ నిశ్శబ్దం
ఊపిరిని కొరికేస్తున్నాయి.

సరిగ్గా అప్పుడే
మహాతపస్సులో నుండి ఓ మొలక
ఆకుపచ్చ కళ్ళెత్తి పైకి లేచింది.

ఒక రహస్యనేత్రం
లోపలెక్కడో తెరుచుకుంది.

కవిత్వమూ అంతేనా?