అక్టోబర్ 2021

ప్రసిద్ధ సాహిత్యకారుల జయంతులు వర్ధంతులూ పేరిట ఉండుండీ కొంత చప్పుడు చెయ్యడం ద్వారా, తెలుగుజాతి, భాష మీద తనకింకా ప్రేమ ఉందని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ చప్పుళ్ళు చేసే తెలుగుజాతి పరిధి మాత్రం చాలా చిన్నది. ఏనాడో రాసేసి చేతులు దులిపేసుకున్నవాళ్ళు, ప్రస్తుతం విరివిగా రాస్తున్నవాళ్ళు, రేపో మాపో తమ ప్రచురణలతో ముందుకు రాబోతున్నవాళ్ళు, పత్రికల, సభల నిర్వహకులు – తెలుగుసాహిత్య వర్తమాన చిత్రంలో ఎటు తిరిగినా కనపడేది ఈ నలుగురే. ఏతావాతా రచయితలే మనకు మిగిలిన పాఠకులు. వీరందరికీ ఒకరితోటి ఒకరికి అవసరం. కనుక సాహిత్యానికి సంబంధించి ఉన్నదున్నట్లు చెప్పడానికి భయం. అందుచేత వీరివల్ల సాహిత్యానికి ఒనగూడే లాభం ఏమిటన్నది అర్థం కాదు కాని, నష్టం మాత్రం ఊహించలేనిదేం కాదు. సాహిత్యాన్ని అభిరుచిగా, అలవాటుగా ఇంటింటిలోనూ కనీసం పత్రికలుగానైనా చూసే రోజులనుండి కేవలం సోషల్ మీడియా గుంపుల్లో బాతాఖానీకి పనికొచ్చే భాషగా మిగుల్చుకోవడంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆలోచనల లోతులను లైకుల సంఖ్యతోను, ప్రతిపాదనల బలాన్ని మంది షేర్‌లతోనూ కొలుచుకోవడం మొదలైనప్పుడే, నిజమైన పాఠకుడికోసం విభిన్నంగా శ్రద్ధగా రాయడం పట్ల కవిరచయితలకు అవసరమూ లేకపోయింది. అందుకే ప్రస్తుత సాహిత్యంలో తక్షణ స్పందనలు, హాయిగొలిపే కబుర్లూ కనపడ్డంతగా ఆలోచనతో రాసే రాతలు కనపడవు. ఆలోచన కలిగించే రాతలు అసలే అరుదు. సాహిత్యం మనకు కేవలం ఒక వానపడుతుంటే హాయికోసం పట్టుకొనే హస్తాభరణంగానో, లేదూ కాఫీ టేబుల్ మీద పెట్టుకొనే అలంకరణగానో మిగిలిపోయింది. మనకు సాహిత్యం ఇష్టం అని చెప్పుకొని భుజాలు చరుచుకోవడంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి నిజంగా సాహిత్యం పట్ల లేదు. అందుకే, ఒక సమకాలీన రచయిత రచనల మీద విశ్లేషణ కన్నా, శ్రీశ్రీ పుస్తకపు రీప్రింట్ ఫేస్‌బుక్ గోడల మీద ఎక్కువ హంగామా చేస్తుంది. జాషువాని కులమనో కరుణరసమనో ఒక ఇరుసులో బిగించి చప్పట్లు కొడతాం. విశ్వనాథ అయితే దైవం లేకుంటే దయ్యం, కేవలం అంతే. అడపాదడపా ఏ త్రిపురనో, మోనో, ఇంకెవరినో తలచుకున్నా అది వారి వ్యక్తిగతస్నేహాలు జ్ఞాపకాల నెమరువేత స్థాయిని దాటనివ్వం. వారిగురించి ఎప్పుడూ చెప్పే మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. వారి వర్ధంతులూ జయంతులూ, విగ్రహాలూ పటాల ఆవిష్కరణలూ మాత్రమే మనకు ముఖ్యం. ‘తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుల’ని ఒక మాటనేసి, సదరు ఫేస్‌బుక్ పోస్టుల కింద నమస్కారాల ఎమోజీల దండలు వేసి ఎవరి దారిన వారు పోవడం మినహా తెలుగుసాహిత్యకారుల చేతిలో నిశితమైన సాహిత్య విమర్శ విశ్లేషణకు నోచుకున్న ఒక్క తెలుగు కవి/రచయిత కనపడరు. ఇలా సందర్భాల నెపంతో గొప్ప కవిరచయితలకు గౌరవం ఇవ్వకపోగా ద్రోహం చేస్తున్నాం. వాళ్ళ ప్రాసంగికతను చెరిపేస్తున్నాం. అవమానపరుస్తున్నాం. పాత కళ్ళద్దాలను కొత్తతరానికి బలవంతంగా అంటించి వేడుక చేస్తున్నాం. కొత్త వెలుతురులోకి పాత సాహిత్యాన్ని తీసుకెళ్ళలేనప్పుడు, ఊరికే ఉత్సవాల పేరిట అయినవాళ్ళకి వాయినాలిచ్చుకునే చందాన సాగుతున్న ఈ తంతు అనవసరపు ఆర్భాటమే. సాహిత్యసృజన, విమర్శ సమయాన్ని కోరతాయి. తెలుగువాళ్ళు తెలివైనవాళ్ళు. సమయం విలువ తెలిసినవాళ్ళు. దాన్ని సాహిత్యంలో పారేసుకోరు.