తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర

ఆయన రోజూ రాత్రి మరణించి ఉదయం ఉమ్మెత్త పూవులా జీవిస్తాడు.

డెబ్భయ్ ఐదేళ్ళు నిండుతున్న మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షల బదులు ఏమిటీ వాక్యం అనిపిస్తుంది. కానీ, ఇవి ఆయన తన గురించి తాను అనుకున్న మాటలే.

ప్రతి ఉదయం ఉమ్మెత్తలా జీవించే తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి జన్మదినం మే 14. పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో పుట్టారు. తండ్రి కృత్తివాసతీర్ధులు ఇండాలజీ, సంస్కృతం శాస్త్రాల్లో పండితులు. ఒంగోలు కళాశాల అధ్యాపకులు. తల్లి మహాలక్ష్మి. నవ్య సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రి తండ్రి వైపు తాతగారు. మొక్కపాటి నరసింహ శాస్త్రి తల్లి వైపు తాతగారు. వారిరువురి గురించీ తెలుగు సాహిత్య లోకానికి వేరుగా చెప్పనవసరం లేదు. సంగీతం, నృత్యం, సంస్కృత శాస్త్రాల్లో పండితులూ కృష్ణలీలా తరంగిణి కర్తా నారాయణ తీర్ధులు (1650 – 1745) ఆ వంశానికి మూలపురుషులు. (కానీ సరిగ్గా రెండొందలడెబ్భై ఏళ్ళ తరువాత ఆ వంశానికే చెందిన మరొక వ్యక్తి ఓ మేల్ ప్రాస్టిట్యూట్ మీద నవల రాస్తారని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు.)

పతంజలి శాస్త్రి ఒంగోలు, తిరుపతి, పూనేల్లో చదివారు. ప్రతిష్టాత్మక పూనే డక్కన్ కాలేజ్ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ పుచ్చుకున్నారు. 1821లో స్థాపించిన ఈ కాలేజ్ పురావస్తు శాస్త్రం, భాషా శాస్త్రం, సంస్కృతం పరిశోధనలకి పెట్టిన పేరు. ఈ కళాశాల ఆయన జీవితం మీద, సాహిత్యం మీద వేసిన ప్రభావం తరవాత చూస్తాం. పతంజలి శాస్త్రి సంస్కృతం చదివారు. ఎమ్.ఎ. ఇంగ్లీష్‌లో చేరాలని ప్రయత్నించి పురావస్తు శాస్త్రం పరిశోధించారు. చరిత్ర బోధించారు. అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేశాక రాజమండ్రిలో ఎన్విరాన్మెంటల్ సెంటర్ నిర్వహించారు. ప్రస్తుత నివాసం రాజమండ్రి.

అరవై ఏళ్ళ రచనా జీవితం ఆయనది. 1961 నుంచీ కథలు రాస్తున్నారు. కథలతో ప్రారంభించి కవిత్వం, నవల, నాటకం, వ్యాసాలు రచించారు. ఇంకా సంగీతం, నృత్యం, సినిమా (ముఖ్యంగా ప్రపంచ సినిమా), చరిత్ర, పర్యావరణం వంటి అనేక ఆసక్తులు ఉన్నాయి.

– వడ్ల చిలకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు, రామేశ్వరం కాకులు ఇప్పటి వరకు వచ్చిన కథా సంపుటాలు.

– హోరు, దేవరకోటేశు, వీర నాయకుడు, గేదెమీద పిట్ట నవలలు.

– మాధవి అనే నాటకం.

– గాథా సప్తశతి నుంచీ 100 కథల్ని ‘అడవిపూలు’ పేరుతో, ఎడ్వర్డ్ హ్యూమ్ పుస్తకాన్ని ‘ఎర్రవాడి ఇల్లు’ పేరుతో, మేనకా గాంధి రచనను ‘బ్రహ్మ కేశాలు’ పేరుతో తెలుగులోకి అనువాదం.

– భమిడిపాటి కామేశ్వరరావు మీద ఒక మోనోగ్రాఫ్.

– పర్యావరణం మీద రాసిన అనేక వ్యాసాలు, గాథా సప్తశతి కథలూ ఇంకా అచ్చవ్వాల్సి ఉంది.

యునైటెడ్ నేషన్స్ ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సులో (World Social Development Summit, 1995) పాల్గొన్నారు. అమెరికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ దేశాలు పర్యటించారు. దేశవిదేశాల్లో జరిగే అనేక సాహిత్య, పర్యావరణ సమావేశాలకు ఇప్పటికీ ముఖ్య అతిథి.


“ఇల్లు గలాయన పిలుస్తున్నాడు” చెప్పాడు. ​
(“రేపు నన్ను ఉరి తీస్తారుట.”)

“వెళ్ళండి. ఏం సిగ్గా?”
(“బాగానే ఉంటుంది.”)

“వెళ్ళొస్తాను.”
(“ఇవే ఆఖరి చూపులు.”)

ఇంటి యజమాని కాఫీతో సహా సిద్ధంగా ఉన్నాడు.

“తీసుకోండి.”
(“కొంచెం విషం కలిపాను.”)

తాగే కాఫీ లావా లాగా ఉంది. మాట్లాడ్డం అవ్వగానే విశ్వనాథం అక్కడే ఉన్నా లేనట్టు రూఢి అయింది.

“ఇళ్ళు ఖాళీ చెయ్యమన్నారు.”

“చావమనండి.”

“ఇప్పుడెక్కడ దొరుకుతాయి.”

“ఈ మూలశంకలకేమీ లోటు లేదు.”

కొత్త ఇంటికి మారాక ఒకసారి ఖాళీ చేసిన ఇంటికి వెళ్ళాడు. చీకటి బొరియ. గోడమీద పాత కాలెండర్. నల్లగుడ్డు లేని తెల్లగుడ్డులా ఉంది కిటికీ. చటుక్కున గుర్తొచ్చింది. గుమ్మానికి ఎడమవైపు ఇంచుమించు శాశ్వతంగా నల్లగా ఉండిపోయింది రుబ్బురోలు. మెల్లగా దాని దగ్గరికి వెళ్ళాడు విశ్వనాథం. అది గుండెలమీదే ఉన్నట్టుంది. భయమేసింది. చిన్న దడ పాదాల్లోంచి నరాల్ని వణికిస్తూ సన్నపాములా బయల్దేరింది. దీన్ని ఎప్పుడు చేయించాడో జ్ఞాపకం లేదు.

దాన్ని ఎలాగో కొత్త ఇంటికి తరలించాడు. ఎన్నివేల పచ్చళ్ళు చేసినా అరిగి చావదు. విచిత్రమయిన తన్మయత్వంతో రుబ్బురోల్ని చూస్తున్నాడు విశ్వనాథం. కాసేపటికి రుబ్బురోల్ని తనే మోస్తున్నట్టుంది. ఎవరో శత్రువు తిష్ఠ వేసుక్కూచున్నట్టు ఉంది.

ఇలా నడుస్తుంది రుబ్బురోలు కథ. (పై వాక్యాలు అక్కడక్కడా ఏరినవి.)

ఈ కథను చదివిన పాఠకుడికి రుబ్బురోలు ఏమిటో అర్థం అవ్వొచ్చు (కాక పోవచ్చు).


పతంజలి శాస్త్రి కథలకి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. కథలో వాచ్యార్థం, సూచ్యార్థం అనే రెండు లక్షణాలు ఉంటాయంటారు. వాక్యం చెప్పే కథ ఒకటి. లోతుగా చూస్తే అది సూచించే కథ మరొకటి.

శాస్త్రి గారి రచనా పద్ధతి రెండోది.

తొలి రోజుల్లో రాసిన రుబ్బురోలు, బరువు సామాను, రబ్బిష్ లాంటి కథలతో పాటు ఈ మధ్యనే రాసిన- అతనూ ఆమే ఏనుగూ, మంచుగాలి వంటి కథలు పైకి ఒక కథ చెప్తూంటాయి. వాటి వెనుక మరొక కథ ఉంటుంది. ఈ రెండో కథను పాఠకుడి ఊహకే వదిలేస్తాడు రచయిత. ఇలాంటి కథలు పాఠకుడి అనుభవాన్ని బట్టి ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్థమయ్యి మూడో కథలానో లేక అనేక ఇతర కథల్లానో రూపాంతరం చెందనూవచ్చు. అందుకే నా కథలు ఎక్కడ ముగుస్తాయో అక్కడ ప్రారంభమవుతాయి అంటాడు ఈ రచయిత. కాగితమ్మీద కథ ముగుస్తుంది కానీ పాఠకుడిలో మళ్ళీ కథ మొదలవుతుంది.

ఈ రచయిత కథలు మామూలుగానే మొదలవుతాయి. పాఠకుడు త్వరగా కథలో లీనమయ్యేందుకు అవసరమయిన వాతావరణ వర్ణన, పాత్రలూ, సంభాషణలూ చాలా సహజంగా చిత్రిస్తాడు రచయిత. ఆ చిత్రణ కూడా ఎంతో పరిశీలనతో ఉంటుంది. ఈ పాత్ర ఇలా కాక ఇంకోలా ఉండదని, ఈ సంభాషణ ఇలాగే జరిగి తీరుతుందనీ పాఠకుడు నమ్ముతాడు. అలా కొంత దూరం కథ నడిచాక ఒక సంఘటనో ఒక పాత్రో అందాకా జరిగిన పద్దతికి భిన్నంగా ప్రవేశిస్తుంది. సహజంగా ఒక తలంలో నడుస్తున్న కథ కాస్తా మరో తలంలోకి జరుగుతుంది. ఈ సమాంతర తలంలోకి ప్రవేశించాక కథ కొత్త అర్థాన్ని వెతుక్కుంటుంది. కథ రాయటంలో తనదైన ఈ సొంత పద్దతికి సమాంతర వాస్తవికత అని (మాజికల్ రియలిజం కాదు) పేరు పెట్టుకొన్నారు రచయిత.

సాధారణంగా కథల్లో వస్తువు, శిల్పం, పాత్రలు, నిర్మాణం, శైలి, దృక్కోణం వంటి విడదీయలేని భాగాలుంటాయంటారు. కానీ శాస్త్రిగారి కథల్లో ఓ కొత్త విభాగం చేరుతుంది.

అది పాఠకుడు.

తన పాఠకుడిని అనేకమంది రచయితల్లా కాక ‘ఎక్కువ’ అంచనా వేసి కథానిర్మాణం చేస్తాడు ఈ రచయిత. కథ చదవకముందే అదేమిటో తెలిసిపోవటమో, కథను కథ చెప్పటం కాకుండా రచయితే తలదూర్చి వివరించటమో, ముందే తనెటు వైపో, తన దృక్పథమేమిటో ప్రకటించి ఆ తర్వాత కథలోకి దిగటమో కాకుండా పాఠకుడిని గౌరవించి తన సమ ఉజ్జీగా భావించటం ఈ రచయితలో చూస్తాం. పాఠకుడికి ఆలోచనా శక్తి ఉంటుంది దాన్ని గౌరవించాలి అని గుర్తుపెట్టుకొని రాసినట్టుంటాయి కథలు. అందుకే తన కథల్ని పాఠకుడు శ్రద్ధగా చదవాల్సివస్తుంది. కొన్ని కథల్ని మళ్ళీ మళ్ళీ చదవక తప్పదు. మళ్ళీ చదివినా విసుగు పుట్టనివి కొన్ని కథలు.

కథ చదివేప్పుడు పాఠకుడికి ట్రెజర్ హంట్ లాంటి అనుభవం కలిగిస్తాడు రచయిత. కొన్ని క్లూలు అక్కడక్కడా ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవటం పాఠకుడి పని. పట్టుకున్నాక వాటితో కథను మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సి వస్తుంది. కొందరికది ఇష్టమయితే మరికొందరికి కష్టం. పాఠకుడితో పాటు మరో ముఖ్యమయిన ఎలిమెంట్‌ని కూడా కథల్లోకి తెస్తాడు రచయిత. అది వాతావరణం. ఆమెదనంతపురం, పిచ్చి లచ్చమ్మ, కతలవ్వ-కథలు దీనికి ఉదాహరణలు. అవి పర్యావరణానికి సూచనలన్నారు సమీక్షకులు.

శాస్త్రిగారి కధల్లో కొట్టొచ్చినట్టు కనపడే లక్షణం తరచుగా తన కథల్లో స్థల కాలాలు కలగలిసి పోవటం. కథ కాలక్రమాన్ని బట్టి నడవకుండా ముందుకూ వెనక్కూ వెళ్తుంటుంది. కాలంతో స్థలంతో సంబంధం లేకుండా గతం వర్తమానం కలిసిపోతుంటాయి.

నలుపెరుపు-కథలో రత్నం ‘గుర్రుపెడుతున్న జమీలు శవం మీద కళ్ళతో ఉమ్మేసి’ మరీ పనిలోకి పోతుంది (ఈ వాక్యాన్ని రెండుసార్లు చదవాల్సివొస్తుంది, పాఠకుడు ఏమరుపాటుగా ఉంటే). ఆ తర్వాత పనిచేసే ఇంటిలో యజమానురాలికి తలంటు పోస్తుంది. ఇక్కడ స్థలం బాత్‌రూమ్.

ఇక్కడ ఇంటామెకీ రత్నంకీ సంభాషణ జరుగుతున్నపుడే సమాంతరంగా తన షెడ్డులో జమీలుతో మాటలు గుర్తొస్తాయి. కొంతసేపటికి అది షెడ్డులో తర్వాత జరగాల్సిన సంఘటనగా మారుతుంది. రెండు చోట్లా జరిగినవీ జరగాల్సినవీ కలిపి మూడు కాలాలూ ఒక్కటయి పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేసే చిత్రణగా మలుపు తిరుగుతుంది. ఇక్కడ రచయిత వాక్యం కూడా ఊపిరాడనంత వేగంగా మారుతుంది. అలా రెండు స్థలాల్లో మూడు కాలాల్లో జరుగుతున్న సంఘటనలు ఒక దానిలోకి మరొకటి కలిసిపోయి కథ మరొక డైమన్షన్‌లో నడుస్తుంటుంది. నిజానికి రెండో చోట జరిగిన సంఘటన జరిగినట్టా జరగనట్టా అనేది పజిల్. జరిగినట్టుగా రత్నం ఊహించుకొనే జరగబోతున్న కథ అనుకోవాలి పాఠకుడు.

మనందరికీ తెలుగు సినిమాల వల్ల ఫ్లాష్‌బాక్ సుపరిచితమే (అప్పుడు… ఆ రోజు…) కాని, కపి జాతకం-కథల్లో శాస్త (బుద్దుడి) దగ్గర కథ మొదలై భవిష్యత్తు (అంటే మన వర్తమానం) లోకి వచ్చి కోతుల కుటుంబ నియంత్రణ సర్జరీ, దాని వెనకాల వనాల ధ్వంసం, పురపాలకశాఖ, ఫారెస్ట్‌ శాఖల నిర్వాకం నుంచీ మళ్ళీ శాస్త దగ్గరకు వెళ్ళి ఆగుతుంది. ఇందులో డాక్టర్ నర్సుల పాత్ర చిత్రణ వల్ల ఈ ఫ్లాష్ ఫార్వర్డ్ గుర్తు పట్టలేనట్టు ఉంటుంది.

కథని ఒకే ఒక దృష్టికోణం లోంచి రాయాలని అనుకొంటారు రచయితలూ విమర్శకులూ.

అతనూ, ఆమే, ఏనుగూ-కథలో ఓ కాంటీన్ సర్వర్ వాళ్ళిద్దరినీ చూస్తూ, వాళ్ళు మొదటిసారి అక్కడికి రావటాన్ని గుర్తు తెచ్చుకోవటంతో మొదలవుతుంది కథ అతడి వైపు నుంచీ. కథ వాళ్ళ సంభాషణగా మారి అతను అడిగిన ‘ఆర్ యూ హాపీ?’ ప్రశ్నతో వాళ్ళిద్దరి గతంలోకి వెళ్ళి, వాళ్ళిద్దరూ పని చేసిన ఆఫీసు నుంచీ దుబాయ్ దాకా వెళ్ళి తిరిగొచ్చి మళ్ళీ ఆ కాంటీన్‌కి టీ సమోసాల కోసం వెళ్ళాక ఆమెకి ఆ సర్వర్ కనిపిస్తాడు – వాళ్ళిద్దరినీ చూస్తూ. కాథరిన్ మాన్స్‌ఫీల్డ్ కథ ‘ప్రెల్యూడ్’లో లాగే ఈ దృష్టి కోణం మారటం పాఠకుడు గమనించనంత సాఫీగా జరిగిపోతుంది. తెలుగులో ఇలాంటి కథలు చాలా అరుదు.

కథకి ఓ భాష, ఓ సౌందర్యం ఉంటాయి. ఈ రెండూ రచయిత ప్రయత్నపూర్వకంగా సాధించాల్సిందే. కొద్దిమంది రచయితలు దీనికి మినహాయింపు కావచ్చు. ప్రాచీన సాహిత్యంతో ప్రబంధాలతో పురాణాలతో పాటు పాశ్చాత్య సాహిత్యంతో కలిగిన సాహిత్యానుభవం వల్ల (చదవటం వల్ల కాదు) ఈ రచయిత ఎంచుకొన్న కథా వస్తువుల్లో శిల్పంలో ఆ భాష, సౌందర్యం కనిపిస్తాయి. ఒక చిత్రమయిన వైవిధ్యం కూడా ప్రత్యక్షమవుతుంది. కచ్చపు సీత (ఊర్మిళది నిద్రా? ధ్యానమా?) రోహిణి (అప్పటి జల వివాదాల మీద రైతులతో బుద్ధుడు ఏం సంభాషించాడు?), ఉర్వి వంటి కాల్పనిక ప్రాచీన కథలతో పాటు అతను, ఆర్వీ చారి కరెంటు బిల్లు వంటి వర్తమాన కథలు ఇందుకు ఉదాహరణలు.

ఆర్వీ చారి కరెంటు బిల్లు-కథలో కరెంటు బిల్లు ఎక్కువ వస్తోంది చారికి కొన్ని నెలల నుంచీ. ఎంతో ఎక్కువ కాదు ఆ ఐటీ ఉద్యోగికి. కానీ అపార్ట్‌మెంట్ పనివాడు ఆలీకి అది నెలజీతం కన్నా ఎక్కువని అర్థం అయ్యాక ఆర్వీ చారికి సూది గుచ్చుకుంటుంది. కథలో అనేకసార్లు ఆ సూది గుచ్చుకుంటూనే ఉంటుంది.

తన వయసుకి మించి కథ రాశాడు ఈ రచయిత అని మెచ్చుకొంటుంటారు కథల్లో రచయిత పరిపక్వతని చూసి. అతను, ఆర్వీ చారి కరెంటు బిల్లు వంటి ఇప్పటి ఐ.టీ. ఉద్యోగుల కథలు చూస్తే శాస్త్రిగారు తన వయసుకి ఎంతో ‘తగ్గి’ రాయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. యువ రచయితలు ఇలాంటి కథలు రాయగలరా అన్న సందేహమూ వస్తుంది. పాఠకుడిని ఆ కథలో లీనం చెయ్యటానికి రచయిత కథలోని వాతావరణాన్ని, సంభాషణల్నీ ఎంతో శ్రద్ధతో చిత్రించటంతో, ఆ చిత్రణ వల్ల కథ ఆరంభంలోనే పాఠకుడి నమ్మకాన్ని పొందగలుగుతాడు రచయిత.

కథ మధ్యలో అప్పుడప్పుడు బ్రాకెట్ల మధ్య ఒక వ్యాఖ్య పెడుతుంటాడు ఈ రచయిత. రుబ్బురోలు-కథ మధ్య వచ్చిన లాంటివి. ఆ వ్యాఖ్య ఎవరు ఎవరితో అంటున్నారో తెలీదు, కానీ, అవి మెరుపులా వచ్చిన పంచ్ డైలాగుల్లా వుంటాయి (‘నా కథల్లో బ్రాకెట్స్ ఉంటాయి గమనించారా? నబొకొవ్ ఒక్కోసారి ఒక పెద్ద సన్నివేశాన్నో, ఒక పాత్రనో, ఒక పెర్సెప్షన్‌నో బ్రాకెట్లో పెట్టి ఒక చిన్న లైన్లో చెప్పేస్తాడు. అది నేను మరికొంత విస్తరించి వాడతాను.’)

కథలోని పాత్రల మీద, ఆ మాటకొస్తే కథా వస్తువుల మీద ఈ రచయిత తీర్పునిచ్చే ప్రయత్నం చెయ్యడు. రచయిత తటస్థంగా ఉండటం అన్నది చాలామంది ఊహకు కూడా అందనిది. కథలు ఓపెన్ ఎండెడ్‌గా ఉంచి పాఠకుడి ఊహకి వదిలి పెట్టటంలో; కథా వస్తువుని ఎంచుకోవటంలో; ఆ వస్తువుని చూసే దృక్పథంలో, దాన్ని కథగా నిర్మించే నైపుణ్యంలో చూపిన పరిణతి పాఠకుడికి కొన్నిసార్లు ఆశ్చర్యం కల్గిస్తుంది.

కథలో అంతర్లీనంగా పాఠకుడికి ప్రసరించే తనదైన తాత్వికత ఈ రచయితది. అతని శీతువు-కథ లోది ఈ కింది సంభాషణ:

“ఇండియా కూడా అమెరికా లాగుంటే బాగుంటుంది” అన్నాడు వరద.

“ప్రపంచం మనం ఎలా కావాలనుకుంటే అలా ఉండదు” స్వామి.

“మరెలా ఉంటుంది?”

“అదెలా ఉంటుందో అలాగే ఉంటుంది సార్.”

“మరెలా ఉంటుంది?”

“ఎలాగూ ఉండదు. మనందరికీ తలొక ప్రపంచం ఉంటుంది. అది మనకు తెలియాలి. జీవితాన్ని ఎలా చూస్తే అలా ఉంటుంది. మీరూ నేనూ ఒకేలా చూడాలని లేదు.”

“మా నాన్నగారు సహస్రనామం చదివితే జీవితం బాగుంటుందనేవాడు.”

“మీ నాన్నగారు రైటు. సహస్రనామం వల్ల జీవితం బాగుపడదు. జీవితం పట్ల మన దృక్పథం మారుతుంది.”

“ఇష్టానికి అర్ధం లేదంటారా?”

“దేనికీ లేదు. ఇష్టానికీ లేదు. ఇష్టాన్ని మీరెట్లా అనుకుంటారో దాని బట్టి అర్ధం మారుతుంది.”


1999లో అచ్చయిన వడ్ల చిలకలు కథా సంపుటంలో 1990 నుంచీ 1996 వరకూ రాసిన ఇరవై కథలున్నాయి. ఐదారు కథలు ఏ సంవత్సరంలో ప్రచురించారో వివరాలు లేవు. ఇందులోని వాల్ పోస్టర్-కథ కథాసాహితి ప్రచురించిన కథ-91లో కూడా అచ్చయ్యింది.

ఈ సంపుటిలోని 19 కథలు, ఇంకా 2000 నుంచీ 2005 వరకూ రాసిన పంతొమ్మిది కథలూ కలిపి పతంజలి శాస్త్రి కథలు కథా సంపుటంగా 2006లో వచ్చాయి. ఆ తర్వాత రాసిన 12 కథలు 2012లో ప్రచురించిన నలుపెరుపు సంపుటంలో ఉన్నాయి. రామేశ్వరం కాకులు నుంచీ రోహిణి కథ వరకూ 12 కథలు 2020లో రామేశ్వరం కాకులు పేరుతో అచ్చయ్యాయి. అలా 1990 నుంచీ రాసిన 63 కథలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య రాసిన ఇంకొన్ని కథలు, ఇదొక అరసున్నా పేరుతో త్వరలో రాబోతున్నాయి.

ఇంతకీ ఈ కథల్లో ఏముంది?

నగరాల్లో మురికి ప్రవహించే స్లమ్స్ నుంచీ అందమైన నీలి కెరటాల అగాధపు లోతుల వరకూ; ఖాఖీ నిక్కరు ధరించిన పోలీసు నుంచీ యెస్.పి. ఛాంబర్ వరకూ, ఐ.ఎ.ఎస్. నుంచీ గుమస్తా వరకూ; మురికివాడల్లో బతికే హోటల్ క్లీనర్లు, కుట్టుపనివాళ్ళు, ఆటో డ్రైవర్ల వరకూ…

గాజు బుడగల్లాంటి ఐ.టి. భవనాలు, అందులోని ఉద్యోగుల విదేశీ అనుభవాలు; రిటైర్ అయిన ఉద్యోగుల వ్యాకులత, వ్యాపకత, నిర్వ్యాపకత; కాలేజ్ లెక్చరర్ల స్టాఫ్ రూమ్ సంభాషణ; మునులు రాజులు; శాస్త సంభాషణ; అబ్సర్డ్ పాత్రలు, అసంగత సంభాషణలు; జేబుదొంగలు, వేశ్యలు, వేశ్యా జీవితాలు, ఉత్తమ, పతిత స్త్రీ పురుషులు, పతిత ముద్రతో సామూహిక క్రూరత్వం; సెక్రెటేరియట్, పవర్ పాలిటిక్స్; అందరూ మర్చిపోయిన, కాలంతో కలవలేని, కునారిల్లుతున్న బ్రాహ్మణ జీవితాలు-

రొటీన్ లైఫ్; గ్రామ రాజకీయాలు, మూఢ నమ్మకాలు; మారుమూల పల్లెలో వ్యవసాయ కూలీ; గోడమీద వేలాడే వాల్ పోస్టర్ రంగుల కలలు; మూడో తరగతి రైలుపెట్టె ప్రయాణాలు, కళ్ళల్లో పడే బొగ్గు నలుసులు; రైలు పెట్టెలో నిముషాల్లో వికసించే ఆప్యాయత, భరోసా, మోహ ఉష్ణోగ్ర తీవ్రత; పుట్టుక, చావు, మరణాన్ని అంటిపెట్టుకుని వైతరిణిని దాటాల్సిన మురికి ప్రవాహం-

గనుల తవ్వకం, చేపల చెరువులు, పర్యావరణం; సాముగరిడీ చేసే ఖాదర్ సాయిబు, అతడి బుట్టలో లేవలేని నాగుపాము (అనకొండ కాదూ?) అప్పుడే కాలిఫోర్నియా నుంచి వచ్చిన ఐ.టీ. ఉద్యోగి ఆర్వీ చారి, అతని తండ్రి కంసాలి సుబ్బాచారి; కోతులకి కుటుంబ నియంత్రణ సర్జరీ చేసే డాక్టర్ రసూల్, నర్సు మేరీ సరోజిని, బల్ల మీద ముసలి పండుకోతి; రాజమహేంద్రవరం విచ్చేసిన గాంధీజీ-

దయచేసి మీరు కొనుక్కున్న పాత పెంకుటిల్లు పక్క ఈ చెట్టుని కొట్టకండి, పక్షులు చెల్లాచెదురవుతాయి అని అడిగిన నిడదవోలు వెంకట పట్టాభిరామారావు; మిషనరీ స్కూలు, చర్చ్ పాస్టర్; రాకెట్టు అప్పారావుని మించిన ముదుర్లు; గడ్డి కుంభకోణం; సెజ్ కోసం భూ సేకరణలో నయానో భయానో పని జరగకపోతే మంత్ర తంత్రాల ప్రయోగం-

అతి చిన్న జీవితం శకలాల నుంచీ పెద్ద సామాజిక సమస్యల వరకూ.


ఈ కథాంశాలను చూస్తే కొన్ని సామాన్యమయినవి, మరికొన్ని అరుదైనవీ అనిపిస్తుంది. అయితే పై అన్నింటినీ తన కథల్లో చిత్రించిన ఈ రచయిత ప్రత్యేకత ఏమిటి?

తెలుగు సాహిత్యంలో రెండు ప్రధాన స్రవంతులు స్థూలంగా కనిపిస్తాయి. సామాజిక ప్రయోజనం, సామాజిక దృక్పథం, సామాజిక సందేశం వంటివి ఒక వైపు, వ్యక్తి కేంద్రంగా తనదైన అస్తిత్వం, తనదైన అన్వేషణ, సమూహంతో ఘర్షణ ఇంకో వైపూ.

ఈ రెంటిలో మొదటి పాయ ప్రధాన స్రవంతిగా మారి మిగిలిన ధోరణులను అప్రధానం చెయ్యటం గమనిస్తాం. ఈ ప్రధాన స్రవంతి వల్ల ఎంత మేలు జరిగిందో అందరూ చెప్తుంటారు. కానీ కాలక్రమంలో ఈ ధోరణి తనకే పరిమితమయిన దృక్పథంగా, తనకు తానే కేంద్రంగా మారి జీవితంలోని అనేక చిన్న చిన్న (తమ దృష్టిలో) శకలాలను, వైయుక్తిక సంఘర్షణలను, సందిగ్ధాలను చూడలేకపోయింది (బ్లైండ్ స్పాట్). అటు రెండో స్రవంతి కూడా దీనికి భిన్నం కాదు. అది సామాజిక చలనాలను చూడ నిరాకరిస్తుంది. ఈ రెండూ ఒకటి ఆ చివర ఉంటే రెండోది ఈ చివర ఉండి సామాజిక వైయుక్తిక జీవితంలో ఉండే కొన్ని కథాంశాలను సహజంగానే పక్కన పెడతాయి.

పతంజలి శాస్త్రి కథలను చదివితే సరిగ్గా ఆ బ్లైండ్ స్పాట్‌ల మీద రచయిత చూపు పడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది కావాలని పనికట్టుకొని రాయటమూ కాదు. లేదా ఫలానా దాని మీద రాయకపోతే సమాజానికీ వ్యక్తికీ తీవ్రనష్టం ఏదో జరిగిపోతోందనీ కాదు. అది ఈ రచయిత వ్యక్తిత్వంలో ఏర్పడిన కళాత్మక దృక్పథం వల్ల వచ్చిన ఫలితం.

కాసులోడు, సర్మా, రంగురాళ్ళు-కథలను రాసిన రచయితే వాల్‌ పోస్టర్, జెన్, శైత్యాంశం, రామేశ్వరం కాకులు వంటి కథలను రాశాడని నమ్మటం కష్టం.

సెజ్ కోసం భూసేకరణలో నయానో భయానో పని జరగకపోతే మంత్ర తంత్రాల ప్రయోగం కాసులోడు-కథలో ఉంటుంది. శ్రీకాకుళంలో రంగురాళ్ళ తవ్వకంలో మట్టిలో చీకటిలో కప్పడిపోయిన వాళ్ళ ఇవతల బాటరీ లైటు ఇంకా వెలుగుతూనే ఉంటుంది. బొంబాయి రెడ్‌లైట్ ఏరియా నుంచీ పోలీసుల సాయంతో ఇంటికొచ్చిన సరమ్మ తన వూరి కంటే బొంబాయి రెడ్‌లైటే తనని బతకనిస్తుందని మళ్ళీ సర్మాగా పాత దారి పడుతుంది.

రామేశ్వరం కాకులు-కథలో సరమ్మ కాదు పద్మ, తన దగ్గరకొచ్చిన అతని స్పర్శతో ఆ చూపుతో రామేశ్వరం బయలుదేరుతుంది. అదే చూపు తనని రైడింగ్‌లో పట్టుకొన్న ఎస్.ఐ. కళ్ళలో గుచ్చుకొంటుంది. (సర్మా కథ ప్రారంభంలో పోలీస్ స్టేషన్ వెనుక పెరడు, చెట్టు, రెండు బాత్‌రూమ్‌లూ అక్కడి వాతావరణం, రామేశ్వరం కాకులు-కథలో మళ్ళీ వస్తాయి.)

శైత్యాంశం-కథలో నిర్మల జిడ్డు కృష్ణమూర్తిని కలిసి ఇంగ్లీషు తెలుగులో ఎన్నోపుస్తకాల్ని మథించినప్పటికీ ఇంకా ఎన్నో ప్రశ్నలూ ఎంతో అశాంతీ మిగిలిపోతాయి ఆమెలో. ఓ మారుమూల పల్లెలో తెల్ల బనీను, తెల్ల లుంగీ, మడతమంచం మీద కూచొని ఇంగ్లీష్ రాని, జిడ్డు కృష్ణమూర్తి ఎవరో కూడా తెలీని ఆ మనిషి దగ్గర ఎలా సాంత్వన పొందింది ఆమె? రబ్బిష్ లాంటి కథలో చెత్త యేరుకొనేవాళ్ళ ముష్టియుద్ధం గురించి ఎంత కర్కశంగా ఎలా రాశారో అంతే మృదువుగా అంతే కరుణతో ఈ శైత్యాంశం కథ రాశారు పతంజలి శాస్త్రి.

అలా జీవితంలోని అనేక వైవిధ్యభరిత సన్నివేశాలను తన కథాంశాలుగా ఎంచుకొన్నారు ఈ రచయిత.


ఇంతదాకా వ్యాసం చదివిన పాఠకుడు గమనించని విషయం ఒకటుంది.

ఈ వ్యాసంలో రెండు వాక్యాలున్నాయి.

– 1999లో అచ్చయిన వడ్ల చిలకలు కథా సంపుటంలో 1990 నుంచీ 1996 వరకూ రాసిన కథలున్నాయి.

– పతంజలి శాస్త్రి 1961 నుంచీ కథలు రాస్తున్నారు. అరవై ఏళ్ళ రచనా జీవితం ఆయనది.

మరి 1961 నుంచీ 1990 వరకూ రాసిన కథలేమయ్యాయి?

రచయిత మాటల్లోనే: ‘కథలు చాలా రాశాను. నాకేంటంటే ప్రతి ఏటా వాటికి అంత్యక్రియలు చేస్తుంటాను. చదివి పక్కన పడేస్తాను. I destroyed them. వాటన్నిటినీ చించేశాను. ఏ కథ నేను ఎప్పుడు రాసినా దాన్ని నేను ఊరగాయ పెడతాను. ఆరునెలలు, ఏడు నెలలు.

అంటే… ముప్పయ్యేళ్ళుగా తను రాసిన చాలా కథల్ని తనే నాశనం చేసేశారు. నచ్చక చేశారా? disown చేసుకున్నారా? మనకి తెలీదు. కానీ ఇలా దశాబ్దాలుగా తను రాసిన రచనలని, వాటి మీద వ్యామోహాన్నీ తనే వదులుకొన్న మరొక రచయిత తెలుగులో లేరని మాత్రం మనకు తెలుస్తుంది.

బోర్హెస్ రాసిన పుస్తకం ఓ సంవత్సరంలో 37 కాపీలే అమ్ముడుపోయాయి. కొన్న ప్రతివొక్కరికీ ఓ థాంక్‌యూ నోట్ పంపిద్దామనుకున్నాడట తన చేతిరాతతో. ఓ ప్రపంచ ప్రసిద్ధ రచయిత పరిస్థితే అలా ఉంటే ఓ మారుమూల తెలుగు సాహితీ ప్రపంచంలో ఎవరినీ పట్టించుకోకుండా తన మానాన తను రాసుకుపోయే పతంజలి శాస్త్రి రచనలనెవరు ఎంత పట్టించుకొంటారో సందేహమే.

కానీ సాహిత్యానికి విలువనిచ్చే పాఠకులూ లేదా సంస్థలూ చెయ్యాల్సిన ఓ బాధ్యతాయుతమైన పని మాత్రం మిగిలే ఉంది. అది ఆయన రచనలన్నినిటినీ సంకలనాలుగా తేవటం. ఆయా రచనల మీద విశ్లేషణ, విమర్శ జరిపించటం. వాటిని కూడా ముద్రించటం. పారిస్ రివ్యూ తెచ్చే ‘రైటర్స్ ఎట్ వర్క్‌’లో లాగా రచయిత జీవితం మీదా సాహిత్య కృషి మీదా సమగ్రమయిన ఇంటర్‍వ్యూ చేయగలిగితే సమకాలీన తెలుగు సాహిత్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

తన గురించి తాను


(తన మీద ఎవరి ప్రభావం ఎంత, తన సాహిత్య విలువలు, ఆసక్తులు అవన్నీ తన రచనా జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో ‘కథా సంధి’ పేరుతో సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన రచయిత ప్రసంగంలో భాగాలు… – బోడపాటి పద్మావతి నోట్స్ నుంచి.)

కుటుంబం:

నేను రచయితను కావటం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. నాకు రెండు వైపులా కూడా విస్తృతమైన చరిత్ర ఉంది. వంశం నిండా అందరూ విద్వాంసులు, శాస్త్రవేత్తలూ. నేను ఆ కుటుంబంలో పుట్టటమనేది ఒక పేరెంటల్ యాక్సిడెంట్. మనం ఏ ఇంట్లో పుట్టాలి ఇవన్నీ మన ఇష్టం మీద ఆధారపడి జరగవు కదా! అయితే శివశంకర శాస్త్రిగారి సాన్నిధ్యంలో చాలా ఎక్కువ సంవత్సరాలు గడపటమనేది నాకు గొప్ప అదృష్టం.

నాన్నగారి వల్ల నేను రెండు గొప్ప విషయాలు నేర్చుకొన్నాను చిన్నప్పట్నుంచీ. ఒకటి, నా జీవితం మొత్తం ప్రయాణంలో నాకు ముఖ్యమయినది. ఎపుడూ ఎవర్నీ జన్మలో అనుకరించకు. నీకు తెలియని విషయాల గురించి మాట్లాడటం కాని, రాయటం కాని, తెలుసునని నటించటం కానీ ఎప్పుడూ చేయకు. మరొకటి, నాకాయన చేసిన ఉపకారమేంటంటే మా రోజుల్లో ఇంగ్లీష్ టెక్స్ట్ చాలా పెద్దగా ఉండేది చిన్న క్లాసుల్లోనే. అందులో కథలుంటాయిగా. అవే బట్టీ పట్టి చదివి రాస్తే మార్కులేసేవాళ్ళు. ఒకసారి ఇలాగే చదువుకుంటుంటే ఏమిట్రా చదువుతున్నావంటే ఇదీ అని చెప్పాను. ఆయన ‘ఒరే మీ క్లాసులో ముప్పయ్ మంది ఉంటారు కదా, అందరూ ఇదే రాస్తారు. నువ్వూ ఇదే రాస్తావు. నువ్వు రాసే దాంట్లో ప్రత్యేకత ఏముందందులో? అలా చేయకు. నువ్వు చెప్పింది అర్థం చేసుకొని సొంతగా రాయి. తప్పులొచ్చినా ఫర్లేదు. నువ్వు చదివేది ఇంగ్లీషు మీడియం. ఇంగ్లీషు రాయటం అలవాటు చేసుకో’ అన్నారు. అలా సొంతంగా రాయటం అలవాటు చేసుకొన్నాను ఆరోజు నుండీ. మరొకటి ఈస్థటిక్ సెన్స్. ఈస్థటిక్ సెన్స్ అంటే ఏమిటి వగైరా, వగైరా ఆయన వల్ల చాలా నేర్చుకొన్నాను. Sculpture sous, Aesthetic feelని ఆయన ఒక గంట చెప్పారు ఒకసారి.

మా తాతగారు నేనింకా హైస్కూల్లో ఉండగానే నాకొక నోట్‍బుక్ ఇచ్చి, శుభ్రంగా ఒక పెన్సిల్ చెక్కి ఇచ్చి రాయమనేవారు. ఏం రాయాలని అంటే ‘నీ ఇష్టమొచ్చింది రాయి, నీ తలలో చాలా ఉన్నాయి కదా. వాటి గురించి ఏదో ఒకటి రాయి’ అనేవారు.

నమ్మండి. నేను ఆ క్షణం నుండి ఎప్పుడూ రాస్తూనే ఉన్నాను.

Literary Integrity:

అంటే నీ విశ్వాసాలు, నమ్మకాలు, నిజాయితీతో పాటుగా గొప్ప సంయమనం ఒకటి ఉండాలి. గొప్ప కష్టసాధ్యమయిన విషయమేంటో తెలుసా? నీ రచనలపట్ల నీకు గౌరవం ఉండాలి. ఈ మాట వింటానికి సిల్లీగా ఉంటుంది. నీ రచనల మీద నీకు గౌరవముండటమేమిటి? ఉంటే కదా ఇన్ని పుస్తకాలేయటం. కానీ అది నిజం కాదు. అది నిజం కానే కాదు. నీ రచనల మీద నీకు గౌరవం ఉండాలంటే నీకు ఎంత శాతం నిజాయితీ ఉండాలి. ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి.

నన్ను నేను నిరూపించుకోవటానికి నేనెప్పుడూ రాయలేదు. నాకనవసరం. ఎవరికి నిరూపించుకోవాలి? నేను రాస్తాను, ఎందుకంటే నేను రచయితను కాబట్టి, నేను రాస్తాను. I just write because, I write. I am a writer. ఇటువంటి literary integrity ఉండటాన్ని ఆయన (నాన్నగారు) చెప్తుండేవారు. అది నా నరనరాల జీర్ణించుకుపోయింది.

Deccan College:

నేను అక్కడ పరిశోధక విద్యార్ధిగా ఉన్నప్పుడు ఒక పరిశుభ్రమైన వెలుతురు నిండిన ప్రాణవాయువును పీల్చుకున్నాన్నేను. మీరు ఊహించలేరు నేను ఎంతమంది గొప్ప వ్యక్తుల్ని, ఎంతమంది గొప్ప పండితుల్ని చూశానో.

ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల మనుష్యులు నాకు మిత్రులుగా ఉండేవారు. ఒక మంగోలియన్ బుద్ధిస్ట్ మంక్‍తో సహా. అంతమంది స్నేహితులుండేవారు. ప్రపంచంలో ఉండే గొప్ప విశ్వవిద్యాలయాలనించి వచ్చే ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, ఎంతమంది మహానుభావులు? ఆంత్రొపాలజీ, సోషియాలజీ, మీరెప్పుడూ కలలు కనే ఇరావతీ కార్వే. యుగాంత రాసిన ఇరావతీ కార్వే ఇన్స్టిట్యూట్‌లో ఉండేది. పొడుగ్గా సన్నగా అలా వెళ్తుండేది. చాలా భయంగా ఉండేది ఆవిడ్ని అలా చూస్తూ ఉంటే.

అక్కడ నేర్చుకొందేంటంటే గొప్ప వ్యక్తులెప్పుడూ చాలా మామూలుగానే ఉంటారు. గజం బద్ద మింగేసి జ్ఞానభారంతో తల ఇలా ఒక పక్కకి వంచి ఉపన్యసించరు. చాలా మామూలు భాషలో మాట్లాడతారు. నేను చాలా ఉపన్యాసాలు విన్నాను. జ్ఞానం అంటే నాలుక మీద రుచి లాంటిది. లోపలికి వెళుతుంది. ఏ జ్ఞానమయితే మీ అనుభవంలోకి రాదో ఆ జ్ఞానం వ్యర్ధం. జ్ఞానం నీ అనుభవం కావాలి. అనుభవం అంటే ఇంగ్లీష్ ఎక్స్‌పీరియన్స్ కాదు. ఎక్స్‌పీరియన్స్ అనేది అనుభవానికి ఎక్సాక్ట్ ట్రాన్స్‌లేషన్ కాదు. అనుభవం వేరు. ఈ జ్ఞానం ఎప్పుడయితే నీ అనుభవం అవుతుందో అప్పుడది నువ్వు.

ఒక నమ్ర భావన. ఒక సంయమనం. మన గురించి సస్వరూప జ్ఞానమంటారే. అది ఎలాగ మనం ఆకళింపు చేసుకోవాలో అక్కడ నేర్చుకున్నాను నేను. అనేక పుస్తకాలు చదవటం వల్ల వచ్చేది ఇన్ఫర్మేషన్. జ్ఞానం అవుతుంది. నేను ఇందాక చెప్పా కదా వ్యర్ధం. సాహిత్యానుభవం కావాలి. సాహిత్యానుభవం అంటే ఏంటి? ఆ జ్ఞానం వల్ల నీకు అనుభవం వచ్చింది. ఆ అనుభవం ఏ ఎరుక అయితే ఇస్తుందో ఆ యెరుక నీకు సాహిత్యానుభవం. అనేక వేల జీవితాల అనేక వేల ప్రాంతాల్ని నువ్వు ఆరగింపు కాదు, ఆకళింపు చేసుకోవాలి. ఇది రక్తనిష్టమయినప్పుడు లోపల నువ్వేమిటో లోపల నువ్వలా మెరుస్తూ ఉంటావు. అది నువ్వు కళ్ళు మూసుకుని చూసుకున్నప్పుడు నీకు తెలిస్తే చాలు.

ఆసక్తులు:

కల్చర్, మ్యూజిక్, డాన్స్, పొలిటికల్ హిస్టరీ… అసలు భారతీయ సమాజం చరిత్ర పూర్వయుగాల నుండీ ఎలా ఎవాల్వ్ అయింది అనే దాని మీద చాలా ఆసక్తి. హిందూస్తానీ, కర్ణాటక సంగీతం, ఎప్పుడూ రాత్రీ పగళ్ళు వింటుంటాను నేను. ఆదివాసుల సంస్కృతి అంటే నాకు చాల ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ లెజెండ్స్ ఉంటాయే, వాళ్ళ కథలు. ఎంత గొప్ప సృజనాత్మకత. ఎంత గొప్ప సింబాలిజం ఉంటుందో! మన పౌరాణిక గాథల్లో ఉండే అలిగరీ ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా ఉండదు. ఆ అలిగరీ, ఆ సింబల్స్, ఆ ఐకనోగ్రఫీలో ఉండే సింబాలిజం, ఇవి రచయితగా జీర్ణం చేసుకోవాలి. All great art ఎప్పుడూ సింబాలిక్‌గా ఉంటుంది.

రాసే పద్ధతి:

అన్నీ ఎప్పుడూ వాచ్యం చెయ్యకూడదు. నా కథలు చాలా భాగం ఎక్కడ ముగుస్తాయో అక్కడ మొదలవుతుంటాయి. నేనే కాదు, సీరియస్ రచయిత ఎవరైనా వాక్యానికీ వాక్యానికీ మధ్య ఏవుంది? ఎందుకితను ఈ మాట ఇంతటితో వదిలేశాడు, ఎందుకింత తక్కువ చెప్పాడూ? పాఠకుడికి ఆలోచనా శక్తి ఉంటుంది కదా, అతన్ని ఇన్వాల్వ్ చెయ్యాలి.

మరి ఎప్పుడూ రాసేవాడివి. ఇన్ని తక్కువ కథలేంటి? వంద కథలు ఉన్నాయి పబ్లిష్ అయినవి. ఎన్నో సంపుటాలు రావల్సింది కదా అని మిత్రులు చాలామంది అడుగుతుంటారు. అది నిజమే. కానీ అలా రాయలేను నేను. అలవాటు లేదు నాకు.

ఇంకోటేమంటే ఒకటి కొంచెం వింతగా ఉండేది. నేను మేలుకున్నప్పుడు రాయని క్షణం ఉండదు. ఇలా కాదు. నేను నడుస్తున్నా, ఏం చూస్తున్నా, ఏదో ఒక స్టోరీ I keep writing in my mind. నా మనసులో ఏదో ఒక కథ రాస్తూనే ఉంటాను. ఎప్పుడూ. నిరంతరం. నడుస్తున్నా, బస్సులో, ఎక్కడున్నా సరే. కథలలా నా లోపల ఒకదాని మీద ఒకటి దొంతర్లుగా చేరుతుంటాయి. కథలు చాలా రాశాను. ఒక మూడు నవలలు రాశాను. నాకేంటంటే ప్రతి ఏటా వాటికి అంత్యక్రియలు చేస్తుంటాను. చదివి పక్కన పడేస్తాను. వాటన్నిటినీ చించేశాను. ఏ కథ నేను ఎప్పుడు రాసినా దాన్ని నేను ఊరగాయ పెడతాను. ఆరునెలలు, ఏడు నెలలు.

మా తరంలో రచయితలందరం మామ్, మొపాసా, తెలుగులో శరత్… పౌష్టికాహారంగా పెరిగాం. శరత్‌బాబుని బెంగాలీ రచయిత అని ఎవరూ అనుకొనేవాళ్ళు కాదు. తెలుగువాడనే అనుకునేవాళ్ళు. ఆ పొష్టికాహారంతోనే తరవాత్తరవాత చాలా సాహిత్యంతో పరిచయం ఏర్పడింది.

రచయితకి కేవలం పుస్తకాలు చదవటమే కాదు. ఇతర లలిత కళలమీద కూడా ఆసక్తి ఉండాలి. అక్షరం తాలూకూ విస్తృతి ఇదంతా. వినటం, రాయటం, చదవటం ఇదంతా ఒకటే.

(పతంజలి శాస్త్రి కథల్ని ఎవరికి వారు చదివి తమదైన సాహిత్యానుభవాన్ని పొందవలసిందే తప్ప మరొకరి ప్రమేయం అవసరం లేదు. అయినా అరవై ఏళ్ళుగా రచయిత రాసిన కథల్ని కొంతయినా పరిచయం చేసే చిన్న ప్రయత్నంలో మొదటి భాగం ఈ వ్యాసం. మిగతా భాగం త్వరలో. – రచయిత.)