నిర్ణయం

ఇబ్తిసామ్ పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడు నిర్ణయించుకుందో నాకు బాగానే గుర్తుంది.

1986 అక్టోబర్ అది. రాళ్ళు కురుస్తున్నట్టు పెద్ద శబ్దంతో వర్షం కురుస్తోంది ఆ సాయంత్రం.

అంతకు రెండు నెలల ముందు ఒకసారి హమ్రా రోడ్‌లో సెంట్రల్ బాంక్ సర్కిల్ దగ్గరున్న కఫేలో మేము కలుసుకున్నాం. రద్దీ ప్రదేశం అది. ఎప్పటిలానే పేవ్‌మెంట్ మీద వేసిన టేబుళ్ళ దగ్గర మేధావులు, వ్యాపారస్థులు పిచ్చాపాటీ కబుర్లలో తలమునకలై ఉన్నారు.

నన్ను చూడగానే ఇబ్తిసామ్ కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ పిల్ల మనసంతా గజిబిజిగా ఉన్నట్టు తోచింది. మొహమంతా మసకేసి ఉంది. కళ్ళనిండా నీళ్ళు నింపుకుని, నిరాశగా బరువైన గొంతుతో బిగ్గరగా మాట్లాడింది. ముందురాత్రి ఒక అరబిక్ సినిమా చూసిందట. ప్రేమకథ అది. కథానాయకుడు నాయిక చుట్టూ చేతులు వేసి ఆమె కళ్ళలోకి చూసే దృశ్యం మర్చిపోలేకపోతోందట. గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు ఆ దృశ్యం మింగుడు పడలేదట. చాలాసేపు మాట్లాడింది ఇబ్తిసామ్.

“ఈ విప్లవకారులంతా ఏమనుకుంటారసలు? మనమేమైనా ‘విప్లవం పాకింగ్’లో వచ్చిన రెడీమేడ్ వేశ్యలమనుకుంటారా? ఏదైనా ఒక విషయంలో జీవితంలో ఒటమిపాలైతే, ఇక ప్రేమ, మన కలలు, ఆశయాలు వీటిలో కూడా ఓడిపోయిన వాళ్ళమవుతామా? మన ఆడవాళ్ళు, వాళ్ళ కలలు, భావాలు, ప్రేమలు, చివరకు శరీరాలు కూడా క్రూరంగా దోపిడీకి గురైనా, ఎందుకంతగా నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూపిస్తారు? మనం ఆ దోపిడీలోనే కొత్త కోణాల్ని ఎంతగా వెదుక్కుంటాం? ఆడవాళ్ళ గురించి ఎప్పుడూ మనసులో తేలికభావం, చులకన ఉన్నా, పైకి మాత్రం ఉన్నతంగా కనిపించడానికి నటిస్తూ, దిగజారుడు వ్యక్తిత్వాలు కలిగిన మగవాళ్ళను కూడా మనం నమ్ముతాం. వాళ్ళు స్వేచ్ఛను పొంది అదేదో మనక్కూడా ప్రసాదిస్తారని భావిస్తాం. మనం మన కలల గురించి సహజంగా ఉన్నామంటావా లేక మనం కూడా పైకి రెబెల్స్‌గా కనిపిస్తూ, దాని వెనుక ఉంపుడుగత్తెలుగా దాక్కున్నామంటావా? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా అబద్ధమేనంటావా?

“నాకు తెలిసిందల్లా, ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఒంటరిదాన్ని అయిపోయాను. రాత్రి సినిమాలో చూసిన ప్రేమలాంటి ప్రేమ కావాలి నాకు, అది ఎంత అబద్ధపు ప్రేమ అయినా సరే!”

ఒకప్పటి ఇబ్తిసామ్ అయితే అలాటి ప్రణయకథని ఒట్టి పనికిమాలిన సినిమాగా వేళాకోళం చేసేది. అప్పట్లో ఇబ్తిసామ్ ప్రపంచాన్ని కేవలం తెలుపు-నలుపుల్లో చూసిన రెబెల్. తిరుగుబాటు స్వభావి.


రాళ్ళు కురుస్తున్నట్టు పెద్ద శబ్దంతో వర్షం కురుస్తున్న ఒక సాయంత్రం బర్దా పత్రికలో డిజైన్స్ చూస్తున్నాను, అబ్బాస్‌ని కలిసేటపుడు వేసుకోడానికి మంచి డ్రెస్ ఒకటి కుట్టిద్దామని. ఫోన్ మోగింది.

అవతల పక్క ఇబ్తిసామ్ గొంతు మంద్రంగా. “సాయంత్రం కలుద్దామా?” కొద్దిగా వెనకాడుతూ అడిగింది. చూసి చాలా రోజులు అవడంతో సంతోషం వేసింది ఆమె ఆహ్వానానికి. పైగా ‘నీ మీద బెంగగా ఉంది’ అంది కూడా. ఈమధ్యకాలంలో ఎవరూ అలా అన్లేదు మరి.

వాన ఇంకా తగ్గలేదు. మేమిద్దరం కిటికీ పక్కగా ఉన్న పెద్ద టేబుల్ దగ్గర కూచున్నాం, బయటికి చూస్తూ. అయిదింటికే కారుచీకటి కమ్ముకుంది. నా ముందున్న వేడి టీ కప్పు చుట్టూ పెట్టి అరచేతులు వెచ్చబరుచుకున్నాను. ఇబ్తిసామ్ తన ముందున్న వోడ్కా గ్లాసుని గుండ్రంగా తిప్పింది. కళ్ళలో ఏదో మెరుపు.

తనూ జలాల్ పెళ్ళి చేసుకోబోతున్నామని చెప్పింది. పెళ్ళి విషయమై అతను ఆమెను ఎన్నోసార్లు ఇంతకు ముందే అభ్యర్థించాడు. తెల్లని తన డ్రెస్ జేబుల్లో చేతులు పెట్టుకుని చెప్పింది: “మేమిద్దరం తార్కికంగా ఆలోచించి, పెళ్ళి తర్వాత ప్రతి విషయంలో ఇద్దరమూ సమానంగా వ్యవహరించాలనే నిశ్చయంతో పెళ్ళి నిర్ణయం తీసుకున్నాం. ప్రేమ కంటే కుటుంబ జీవితం ముఖ్యం కదా? అసలు ప్రేమ గీమ ఇవన్నీ అబద్ధాలు. ప్రేమ కోసం వెంపర్లాడి ఓడిపోవడం అయిందిగా, ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోకపోతే మళ్ళీ ఎప్పటికైనా ఎవరితోనైనా ప్రేమలో పడగలనంటావా?” అడిగింది.

“లేదు, కానే కాదు.” తన ప్రశ్నకు తనే జవాబు చెప్పుకుంది.

“ఇకపై పెళ్ళి చేసుకున్న వ్యక్తినే ప్రేమిస్తాను. చాలా అలసిపోయాను. నన్ను నన్నుగా ప్రేమించి, అంగీకరించి, నన్ను జాగర్తగా చూసుకునే మనిషి కావాలి నాకు. జలాల్ నా కోసం ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్నాడు. తిరిగి వెనక్కి చూసుకునే అవసరం లేకుండా నన్ను ప్రేమించే మనిషి అవసరం నాకిపుడు.”

“కానీ, నువ్వు జలాల్ భిన్న ధృవాలు.”

“నువ్వలా అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. జలాల్ బాగా చదువుకున్నాడు. జీవితాన్ని ప్రేమించే మనిషి. రాజకీయాల్లో కూడా అనుభవజ్ఞుడు.”

“అవునా?”

“వేర్వేరు పార్టీల్లో పనిచేశాడు. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఉద్యోగం మీదే శ్రద్ధ పెట్టాడనుకో. అసలు అదే కాదు, జలాల్ ఉన్నతభావాలున్న మనిషి.”

“మరి కరీమ్ మాటేమిటి? అతడు నీకేమీ కానట్టేనా?”

“దాని గురించి నేను మాట్లాడకపోవడమే మంచిది. అసలిప్పుడు అతను నా జీవితంలో లేడు. వెనక్కితిరిగి చూడదల్చుకోలేదు నేను.”

ఇబ్తిసామ్ కలల ప్రపంచం నుంచి బయటపడింది, అమ్మయ్య! తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. కానీ లోపలెక్కడో చిన్న భయం. తన డొల్ల ప్రేమలు, ఊహాప్రపంచాల నుంచి తనని రక్షించడానికి వచ్చిన వీరుడిలాగా జలాల్‌ని భావించట్లేదు కదా ఈ పిల్ల? అలా అయితే మళ్ళీ దుఃఖం తప్పదేమో అని కొద్దిగా భయం వేసింది.

ఇబ్తిసామ్ ప్రేమ కథ నా ప్రేమలాంటిది కాదు. ఆ పిల్ల ప్రేమను శ్వాసించి పూర్తిగా ఆస్వాదించింది. తను బయటికి మొండిగా, సాహసిగా కనపడ్డా, లోపల పసిపిల్లలాంటి మృదువైన మనస్తత్వం.


యుద్ధం మొదలైన తొలి రోజుల్లో తన ప్రేమ కరీమ్‌తో యూనివర్సిటీలో ఎలా మొదలైందో నాకు గుర్తుంది. ఆ రోజుల్లో ఇబ్తిసామ్ ఎంతగా మారిపోయిందంటే, ఈ కొత్త పిల్ల అప్పుడే నా కళ్ళ ముందే పుట్టి పెరిగిందనిపించేది. ఆమె కళ్ళు, స్వరం, శరీరం పూర్తిగా స్త్రీత్వాన్ని సంతరించుకున్నాయి.

నీలి రంగు జీన్స్ మీద తెల్ల షర్టు, భుజాల మీదుగా వేలాడేసుకున్న నల్ల కార్డిగన్ వేసుకుని తిరిగే ఇబ్తిసామ్ నాకింకా కళ్ళ ముందే మెదులుతోంది. కెఫెటేరియాలో నా కోసం, కరీమ్ కోసం ఎదురుచూస్తూ ఒక మూలగా పెట్టిన జూక్‌బాక్స్‌కి చేరగిలబడి కూచునేది. ఆ బాక్స్ లోంచి వినపడే ప్రణయగీతాలను ఆస్వాదిస్తూ, అవి కరీమ్ కోసం పాడుతుండేది కూడా. వాటిలో ప్రసిద్ధ గాయకుడు ఫిరౌజ్ పాడిన ‘సాగరమెంత పెద్దదో చూడు – నా ప్రేమెంత గొప్పదో చూడు’ అనే పాట. ఆ పాట పాడుతూ, దాన్ని అర్థాన్ని కరీమ్ పరంగా అనుభవించేది.

కరీమ్ సమక్షంలో కళ్ళలో మెరుపు, బుగ్గల్లో ఎరుపు, మొహంలో సంతోషం నాట్యమాడేవి. అతని చొక్కా గుండీలతో ఆడుకుంటూ పరవశంగా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయేది. ఆమె కళ్ళు ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అని మరీ మరీ చెప్పేవి. కరీమ్‌ విశాలంగా నవ్వుతూ నా వైపు చూసి ‘నీ ఫ్రెండ్ ఎంత వెర్రిదో చూడు!’ అని గొణిగేవాడు.

కరీమ్‌కి ఏ రాజకీయ పార్టీతోనూ ప్రత్యక్ష సంబంధాలుండేవి కాదు గానీ రెండు రాజకీయ పార్టీలతో సంబంధాలున్న క్రైస్తవ కుటుంబం వాళ్ళది. తను ఈ రెండు పార్టీల మధ్యా వూగిసలాడేవాడు. అయితే లౌకిక భావాలు మెండుగా ఉండటం వల్ల, వామపక్ష పార్టీల వైపు మొగ్గేవాడు.

ఒకసారి కరీమ్‌ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరో అతన్ని ఐడీ కార్డు చూపమని అడుగుతున్నట్టు నటించి, కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. మూడు రోజుల తరవాత అతను విడుదలయ్యేవరకూ ఇబ్తిసామ్ పిచ్చెత్తిపోయింది. తిండీ నిద్రా లేకుండా బ్లాక్ కాఫీ తాగుతూ, సిగరెట్లు వూదేస్తూ తల్లడిల్లిపోయింది. అంతకు రెండురోజుల ముందే ఎవరో బార్బిర్ బ్రిడ్జి దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని కారు నుంచి బలవంతంగా దింపి వంతెన మీదినుంచి తోసేసి చంపడం ఆమె కళ్ళారా చూసి ఉండటంతో ఇంకా భయపడిపోయింది. ఆ వ్యక్తుల శవాలు కళ్ళముందే మెదిలి ఆమెను చాలా సతమతం చేశాయి.

కరీమ్ విడుదలయ్యాక అతని బంధువులెవరో సౌదీలో ఉద్యోగం చూసి పంపించారు. ఆ తర్వాత అతను బీరూట్ రావడం తగ్గిపోయింది. ఏడాదికోసారి కొద్దిరోజుల సెలవుపై వచ్చేవాడు. ఆ క్షణాల కోసం ఇబ్తిసామ్ ఒళ్ళంతా కళ్ళుచేసుకుని ఎదురుచూసేది. జీన్స్ బదులు మంచి డ్రెస్‌లు వేసుకొనేది. మేకప్ చేసుకునేది. మామూలుగా అయితే, హుషారుగా బిగ్గరగా అరిచినట్టు మాట్లాడే ఇబ్తిసామ్ కరీమ్ సమక్షంలో మృదువుగా గుసగుసలాడినట్టు తియ్యగా మాట్లాడేది. అతను కనపడితే చాలు, ఆమె శరీరమంతా ప్రేమమయమైపొయేది.

కొన్నాళ్ళకి ఇజ్రాయెల్ సైన్యం బీరూట్‌ని చుట్టుముట్టి బాంబులవర్షం కురిపించసాగింది.

ఒకరోజు రాత్రి ఇబ్తిసామ్‌కి కరీమ్ ఫోన్ చేశాడు. అతను బీరూట్ వచ్చి రెండు వారాలైందని ఆమెకు తెలీదు. ఫోన్‌లో అతని గొంతు వింటూనే ఆనందంగా అరిచింది.

“కరీమ్, నువ్వేనా! ఎప్పుడొచ్చావు? నమ్మలేకపోతున్నా నువ్వేనా అసలు? ఎలా వచ్చావ్? ఎయిర్‌పోర్ట్ మూసేశారుగా?”

“నేనొచ్చి కొద్దిరోజులైందిలే. నీ ఫోన్ కలవలేదు”

“అబద్ధాలు చెప్పకు. ఎవరితోనైనా మాట్లాడాలని లేకపోతే ఫోన్ కలవలేదనే చెప్తారులే. మాట్లాడాలనుకుంటే మార్గాలే లేవా?” ఉల్లాసంగా నిష్టురమాడింది

“సర్లే, నిన్ను చూడాలనుంది.”

“ఎప్పుడు?”

“ఇప్పుడే.”

“ఇప్పుడా! పిచ్చా నీకు? బయట ఎలా ఉందో చూశావా?”

“తెలుసులే. సరే విను, నాకొక ఆడతోడు కావాలి. ఎవరో ఒకరు కాదు. నువ్వే కావాలి నాకు.” నెమ్మదైన గొంతుతో అన్నాడు

“కానీ ఎలా? బయట బాంబులు కురుస్తున్నాయి. అదీగాక, అమ్మానాన్నలకి ఏం చెప్పను?”

“ఏదో ఒకటి చెప్పు. అరంగంటలో నేనొచ్చి నిన్ను తీసుకెళ్తా, నువ్వు బయటికి వచ్చేయ్.”

కార్లో అతని పక్క సీట్లో కూచున్న ఇబ్తిసామ్ అతని చేతిలో చేయి కలిపింది. ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులతో బీరూట్ అంతా మెరుస్తున్న పూసలదండలా అందంగా కనిపిస్తోంది ఆమె మనోస్థితికి. కరీమ్ గబగబా డ్రైవ్ చేస్తున్నాడు బాంబుల భయంతో. అతని చేయితో చేయి కలిపి కూచున్నాక ఆమెకు ఇదంతా పట్టలేదు. అతని వేళ్ళని, ముంజేతిని ముద్దుపెట్టుకుంది ప్రేమతో.

పారిస్ పారిపోయిన అతని స్నేహితుడి ఖాళీ ఫ్లాట్‌కి తీసుకొచ్చాడు కరీమ్. వస్తూనే అక్కడున్న టేబుల్ని దూరంగా జరిపేశాడు. కొవ్వొత్తులు వెలిగించి ఇల్లంతా పరిచి కాంతిమయం చేశాడు. ఆకలిగా ఆమెను ముద్దాడాడు. ఇబ్తిసామ్ అతని మెడ చుట్టూ చేతులు వేసింది.

మరికొద్ది నిమిషాలకు కరీమ్ వింతగా నవ్వుతూ అన్నాడు. “ఓయ్, ఏంటీ? నువ్వు కన్యవేనా ఇంకా? ఇదెలా సాధ్యం?”

ఆ ప్రశ్నకు ఆమె జవాబేమిటో అతనికి తెలీదు. మళ్ళీ తెరలు తెరలుగా నవ్వాడు. ఆ నవ్వు ఇబ్తిసామ్‌కి చిరాకు తెప్పించింది.

“అదే, నీలాటి విప్లవకారిణి ఇన్నాళ్ళు కన్యగా ఉండటం ఎలా సాధ్యమైందని అంటున్నా.”

“కరీమ్, ఛీ! ఏం మాట్లాడుతున్నావ్? విప్లవ భావాలున్న ఆడపిల్లలు కన్యగా ఉండకూడదా? ఉండరా? అయినా నీకు తెలుసు కదా, నీతోనే నా మొదటి ప్రేమ బంధం. ఇదే నా మొదటి అనుభవం. నీ మతిలేని మాటలు చిరాకు పుట్టిస్తున్నాయ్. నన్ను నువ్వెలా కోరుకున్నావో, నిన్ను నేనూ అలాగే కోరుకున్నా. నీతో ఇలా గడుపుతున్నందుకు బాధగా ఉందా ఏంటి నీకు?”

“లేదు లేదు, నిజానికి చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పుడో ఈ పని చేసుండాల్సింది.”

“మరి ఈ విచారణ ఏంటి నాకు?”

“అయ్యో లేదు, నీతో ఉండటం నాకు సంతోషమే. విచారణ ఏమీ లేదు, ఊరికే అన్నా.”

అతను ఆమెను తిరిగి ఇంటి దగ్గర దింపే సమయానికి బాగా చీకటిపడింది. కారు కిటికీ లోంచి తల బయటికి పెట్టి ఆమె పెద్దగా అరిచి చెప్పింది “నువ్వంటే నాకిష్టం. ఐ లవ్ యూ.”

కరీమ్ ఆమెతో తన మెదడులో ఆవరించి కదులుతోన్న ఆలోచన గురించి చెప్పాడు. కిడ్నాప్ నుంచి అతను విడులయ్యాక మెదడులోని తెలియని నాళమో, నరమో ఏదో… అతనితో అందిట ‘పెళ్ళి చేసుకో కరీమ్’ అని.

“ఆ నరం నన్ను వేరెవరినైనా పెళ్ళి చేసుకోమని చెప్తోంది. కానీ నా ప్రేమ మాత్రం నీకే. నా మనసు నిన్నే ప్రేమిస్తోంది గానీ అది చాలా బలమైంది. నన్ను వూపిరి తిప్పుకోనివ్వట్లేదు దాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు.” కరీమ్ తనకు అనిపించి తను నమ్మినదాన్ని ఇబ్తిసామ్‌కి చెప్పాడు.

ఆమె అతనికేసి విస్మయంగా చూస్తూ ఉండిపోయింది.

ఏం చెప్పాలో తెలియని అయోమయంలో ఆమె మౌనం వెనక దాక్కుంది. తనకి జరిగిన నిలువెత్తు అన్యాయం ఆమెకి చేదుగా నాలుక మీద తగిలింది. అతనేదో చెప్తున్నాడు. కానీ తన అడుగుల శబ్దం తప్ప అవేమీ ఆమెకు వినిపించడంలేదు. ఎందుకంటే అప్పటికే ఆమె అతనికి దూరంగా నడవడం ప్రారంభించింది.


ఇబ్తిసామ్ తన గ్లాసులోని చివరి వోడ్కా గుక్కని ఖాళీ చేసి అంది: “మనం యవ్వనంలో ఉన్నపుడు, జీవితాన్ని మనకు తగ్గట్టు మార్చుకోవచ్చని నమ్ముతాం. దురదృష్టం ఏంటంటే, మనమే జీవితానికి తగ్గట్టు మారాలని తర్వాతెప్పుడో ఆలస్యంగా తెలుసుకుంటాం.”

జలాల్‌ని పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయాన్ని మళ్ళీ చెప్పింది ఇబ్తిసామ్.

అదే చేసింది కూడా.

[మూలం: Stories by Mariyam by Alawia Sobh. Hikayat: Short Stories by Lebanese Women (2007)]