బహుజన సాహిత్యానికి దృష్టాంతం: వలస

ప్రాంతీయవాదము, దళిత బహుజనవాదమూ రాయలసీమ నవలను గొప్పగా ప్రభావితం చేసిన రెండు భావజాలాలని బండి నారాయణస్వామి అంటారు. రెండవ వాదాన్ని వివరంగా విశదీకరిస్తూ నారాయణస్వామి వెంకటయోగి బహుళ పత్రికలో ఈ విధంగా రాస్తారు: గత రెండు దశాబ్దాలుగా తెలుగులో దళిత బహుజన సాహిత్యం (దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు, మైనారిటీల సాహిత్యమే బహుజన సాహిత్యం) ప్రధాన సాహిత్యంగా వచ్చింది, వస్తున్నది. ఈ సాహిత్యం ఇప్పటిదాకా సమాజంలోనూ, జీవితంలోనూ, సాహిత్యంలోనూ పక్కలకు నెట్టివెయ్యబడ్డ సమూహాల (marginalized groups) ప్రత్యేక జీవితాలను, జీవన స్ధితిగతులను, సాంస్కృతిక అస్ధిత్వాలను, భావజాలాలను అద్భుతంగా ప్రతిఫలిస్తున్నది.

విభిన్న సాహిత్య ప్రక్రియలలో సృష్టించబడుతున్న ఈ సమకాలీన తెలుగు సాహిత్యం నిస్సందేహంగా రూపం, వస్తువు, అనుభవం, అనుభూతి, భావం, భావజాలం, ఆలోచన, తాత్త్వికచింతనలలో అతికొత్తది. దీనికీ గత శతాబ్దిలో వచ్చిన సాహిత్యానికీ గుణాత్మకమైన తేడాలున్నాయి.

ఈ దళిత బహుజన వాదాన్ని సాంఘిక, సాంస్కృతిక కోణాలనుంచి సృజించిన వారిలో చెప్పుకోదగ్గవారు వి. ఆర్ .రాసాని. ఆయన చిత్తూరు జిల్లా పల్లెవాస్తవికతను కేంద్రంగా చేసుకుని కథలు, నవలలూ రాశారు. ఈయన రాసిన కథల్లో ముఖ్యమైనవి చావుకూడు, సురసాగర మథనం, హోమం, వేట, ఎన్‌కౌంటర్, కుబుసాలు, నల్లపూసలు, నేరం, తిరిగిరాని తిరుమల. వీటిలో శవాలకు అంత్యక్రియలు జరిపే దాసప్ప కులస్థులు, చాకలివాళ్ళు, మాదిగలు, యానాదులు, ఎరుకలు, సుగాలీలు మొదలైన కులాల దయనీయ స్థితిగతులను చిత్రీకరించారు. వలస నవలకంటే ముందు రాసిన చీకటిరాజ్యం (1994), బతుకాట (2005), ముద్ర (2013) పరస (2015), చీకటిముడులు (2015) నవలలు మంచి గుర్తింపు పొందాయి. ఆయన నవలలు అగ్రకులాల ఆధిపత్యం, దోపిడీ, కులం, మతం, ప్రాంతీయతత్త్వం, స్వార్థం లాంటి వాస్తవాలను చిత్రిస్తాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన నవల వలసను సమీక్షించడానికి పూనుకున్నాను. దీన్ని ఆయన 1993లో ప్రారంభించి 1996లో పూర్తిచేశారు. ఈ మూడేండ్లూ మూడుసార్లు తిప్పిరాయడం జరిగింది. ఈ నవలని పత్రికల్లో సీరియల్‌గా వేయించడానికి కూడా ఆయన చాలా కష్టాలు పడ్డారు. చివరకు ఈ నవలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, జులై 2016లో ప్రచురించింది.

ఈ నవలను వివరంగా విశ్లేషించే ముందు, అసలు వలసలు ఎందుకు జరుగుతాయి అన్న ప్రశ్నకు సమాధానం వెతకాలి. అవి ముఖ్యంగా ఆర్ధికపరమైన కారణాలవలన జరుగుతాయి. పర్యావరణ కారణాలు, సాంస్కృతిక కారణాలు కూడా దోహదం చేస్తాయంటారు. కరువులు, యుద్ధాలు, ప్రకృతివైపరీత్యాల వలన కూడా వలసలు జరుగుతాయి. ఈనాడు ప్రపంచంలో వలసలు ఎక్కువైపోయాయని, సిరియా, ఆఫ్రికాలాంటి దేశాలనుంచి కొనసాగుతున్న వలసల్ని చూస్తుంటే ఈ వలసలకి అంతం లేదనిపిస్తోందనీ నవల మొదట్లో తనమాటగా చెప్తారు రాసాని. ఈ క్రమంలో ఎప్పుడో ప్రారంభమైన రాయలసీమ కరువుప్రాంతపు వలసలు, వారి జీవితాలు ఇప్పటికీ అలాగే వున్నాయని, ఇంకా చెప్పాలంటే ఎక్కువైనాయని కూడా రాస్తారు.

1962 నుంచి దాదాపు ముప్పయి, ముప్పయి అయిదు సంవత్సరాల వ్యవధిలో జరిగిన కథ ఈ నవలలో చెప్బబడింది. చిత్తూరు జిల్లాలో ఉన్న పల్లెటూళ్ళలో కరువు కారణంగా ఛిద్రమైన బహుజన రైతుకుటుంబాల గాథ. కురవ కులానికి చెందిన బలభద్రి కరువు ధాటికి తాళలేక అప్పులపాలై పొలముపుట్ర అమ్ముకుని భార్యాబిడ్డలను వెంటపెట్టుకుని కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతికి తనలాంటి ఇంకొన్ని రైతుకుటుంబాలతో కలసి వలస వెళతాడు. ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అడవుల్ని ఆనుకుని ఉన్న గుడ్డదనీర్లకెరె చేరతాడు. అక్కడ వానలకి, నీటికి, పచ్చదనానికీ అచ్చెరువొంది అక్కడే ఉండిపోయి పొలాలను కౌలుకు చేసుకుంటూ ఉంటాడు. గొల్ల దాసేగౌడ ఇంట్లో అద్దెకుంటూ, అతనితో స్నేహాన్ని పెంచుకుని, గౌడ సహాయంతో అడవిని నరికి ఒక ఎకరం పొలం కూడా సంపాదించుకుంటాడు.

కానీ అక్కడ జీవితం గడపటం అంత తేలికకాదని క్రమంగా అర్థమౌతుంది. ఆ ప్రాంత భూస్వామి బసవరాయలు, తమలోనే ఒకడైన అగస్తులు ఒకటై చేస్తున్న మోసాల వల్ల తిండి ఖర్చులకుపోనూ పైసాగూడా మిగలని పరిస్థితి వలసదారులది. దీనికి తోడు స్థానిక ప్రజల్లో వస్తున్న కుల, మత ఘర్షణలు, ఊళ్ళ మీద పడి భీభత్సం సృష్టించే ఏనుగులు, ప్రకృతి ప్రతికూలత, మేకల్నీ దూడల్నీ మింగే కొండచిలువలు, ఇలా విపత్తుల వెంట విపత్తులు సంభవిస్తాయి. ఈ క్రమంలో తన ఇద్దరు కొడుకుల్ని, కోడల్ని, మిత్రుడు దాసేగౌడనీ పోగొట్టుకుంటాడు బలభద్రి. ఇక అక్కడ ఉండలేక, సొంతూరెళ్ళటానికి మొహం చెల్లక భార్య, ఇద్దరు కూతుళ్ళతో పీలేరు చేరుకుంటాడు. పెద్దకూతురు జయమ్మను బావమరిది కిష్టప్పకిచ్చి పెళ్ళి చేస్తాడు. అల్లుడి ప్రవర్తన, తిరుగుబోతుతనం, సోమరితనంతో కూతురితోపాటు మరింత క్షోభపడ్తాడు. ఉండటానికి ఇల్లు లేక, ఆదరించేవారు లేక, పెద్దకూతురు వారిస్తున్నా వినకుండా తిరిగి తన సొంతూరికి ప్రయాణమవుతారు వృద్ధ దంపతులు. క్లుప్తంగా ఇదీ కథ.

వలస ప్రధానాంశంగా రాయబడిన ఈ నవలలో మానవ సంబంధాల చిత్రీకరణకూడా ఎంతో వాస్తవికంగా, సునిశితంగా, హృద్యంగా సాగింది. చిత్తూరు జిల్లావాసి, భద్రావతాయనగా పిలవబడుతూ, ఇప్పటికీ జీవించి ఉన్న మంగరి నాగయ్య జీవితాన్నాధారంగా చేసుకుని బలభద్రి పాత్రను మలచారు రచయిత. అడుగడుగునా అతను పడ్డ కష్టాలు, కొడుకుల్ని, కోడలిని, మిత్రుడు దాసేగౌడని, కూతురు యశోదనీ పోగొట్టుకున్న అతని జీవితం మన హృదయాలను ద్రవింపజేస్తుంది. అగ్రకులాలకు చెందిన మడ్డినాయుడు, బసవరాయలు, తమ స్వప్రయోజనాల కోసం క్రింది కులాలవారిని ఎలా బాధపెట్టిందీ తెలుపుతుందీ నవల. ముఖ్యంగా బసవరాయలు రామేగౌడ, గంగజ్జులను పావులుగా చేసి ఆడుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు రచయిత. స్త్రీల పట్ల కొందరికి ఎంత నీచభావాలుంటాయో కిష్టప్ప పాత్ర ద్వారా తెలియజేశారు. కష్టాలకు ఓర్చుకుని భర్తకు అండగా నిలిచిన రాజమ్మ పాత్ర ఆదర్శనీయంగా ఉంది. భర్తను వదులుకోలేక, తల్లిదండ్రులను ఆపలేక జయమ్మ పడిన వేదన వర్ణనాతీతం. అర్ధాంతరంగా ముగిసిన రఘు, అలివేలు, శేషాద్రి, యశోదల జీవితాలు దయనీయం. అలివేలుని ఏనుగు తొక్కి చంపడం, అది చూసి రఘు పిచ్చివాడవటం మనస్సుని కదిలించే సంఘటనలు.

రాసాని ఈ నవలని చిత్తూరుజిల్లా మాండలికంలో రాశారు. మొదట్లో చదవటం కొంచం కష్టం అనిపించినా కథ చెప్పిన తీరు వలన, రానురానూ పఠనం సులువవుతుంది. చిత్తూరుజిల్లాకి సంబంధించిన కథ కాబట్టి ఆ జిల్లా మాండలికంలోనే కథ చెప్పడం సమంజసం. రాసానిగారే చాలాసార్లు మాండలికపదాలకు అర్థాలను బ్రాకెట్స్‌లో ఇవ్వడం వలన అర్థంచేసుకోవడం అంత కష్టం అనిపించదు. ఆసక్తి కలిగించే కొన్ని మాండలిక పదాలు: సీనీరు (మంచినీళ్ళు), ఊటా (భోజనం), యానె (ఏనుగు), బోకులు (అంట్లు), ఆనక (తర్వాత), గొట్టు (కరువు), పొర్రి (బాధ), కలిగ్గెం (కలియుగం), తలాద్రి (తలరాత).

నవలలో పాఠకులని కదిలించే ఉత్కంఠభరితమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని: తన పొలాన్ని మడ్డినాయుడి మనుష్యులు ఆక్రమించుకుంటుంటే చూస్తూ బలభద్రి రోదించిన విధానం, రఘు తనను చంపడానికి వచ్చిన కెంపన్న ఊబిలో పడిపోయినప్పుడు అతన్ని రక్షించిన వైనం, కొండచిలువ మేకను పట్టుకోవడం, పల్లె యువకులు దాన్ని ఈటెలు, గొడ్డళ్ళు, కట్టెలు తీసుకుని చంపడం, గంగజ్జు బలి తిరగడం, కొంగిరోళ్ళ కోటప్ప ఏనుగును కోసిన విధానం, ఏనుగుల దాడి, బసవరాయలు తన క్రింద పనిచేసే రామేగౌడను ఉపయోగించుకుని హిందువులు, ముస్లింల మధ్య మతకలహాలు రేపడం, ఇత్యాదులు.

రచయిత కథను కొంచెం క్లుప్తంగా చెబితే బాగుండేదనిపించింది. బాబ్రీమసీదు విధ్వంసం కథలో చొప్పించి, అది పల్లెలో జరిగిన హిందూ ముస్లింల మతకలహాలకు కారణంగా చూపించటం అంత అవసరమని అనిపించలేదు. నవల చివరలో ముగింపు నిరాశాజనకంగా ఉండడం పాఠకులలో వెలితిని కలిగిస్తుంది. కానీ అట్టడుగు వర్గాల నిస్సహాయతని బలభద్రి ఓటమి ద్వారా చూపించడం రచయిత ఉద్దేశమయ్యుండవచ్చని తెలుపక తెలుపుతుంది.

వలస చదవాల్సిన నవల. రాయలసీమ బహుజనరైతుల జీవన విధానం, కష్టాలు, సేద్యం, కుటుంబజీవితం, కరవుమూలంగా వలసలు–వీటన్నింటికీ అద్దం పట్టిన నవల. తెరమరుగవుతున్న చరిత్రలను వెలికితీసి మనముందుంచింది. ఇరవై ఒకటవ శతాబ్ది బహుజన సాహిత్యానిదే అంటారు. ఆ సాహిత్యానికి ప్రతీక ఈ నవల. ఈ నవలకు ముందుమాట రాసిన కవి, సాహిత్య విమర్శకులు జీ. లక్ష్మీనరసయ్య దీన్ని ‘సీమ బహుజన బతుకు పుస్తకం’ అనడం ఎంతైనా సముచితం.