గల్ఫ్ గీతం: 1. దుబాయ్

“నానా, ఇక్కడ నేను ఉంటోన్న హోటల్ చూశాక అమెరికా ఎంత వెనకబడిపోయిందో అర్థమవుతోంది…” 2018 జనవరిలో దుబాయ్ నుంచి మా పాప మిన్నీ ఫోను!

తను ప్రతి ఏడాదీ చేసే ఇండియా ప్రయాణంలో ఈసారి దుబాయ్‌ని కూడా చేర్చి ఢిల్లీ నుంచి అట్లాంటా తిరిగి వెళుతూ దుబాయ్‌లో ఆగింది. తన సహోద్యోగి పెళ్ళి. దానితోపాటు మరో రెండ్రోజులు దుబాయ్ నగరం చూడటం–అదీ తన ప్రణాళిక.

“బహుశా నువ్వు ఉన్నది కొత్తగా కట్టిన హోటలయి ఉండాలి. ఏదేమైనా అమెరికాకూ దుబాయ్‌కూ పోలికేమిటీ? ఎంత ముచ్చటనిపించినా మరీ అంత పెద్ద సర్టిఫికెట్టా!”

“కాదు కాదు. ఒక్క హోటలు గురించే నేను చెప్పడంలేదు. నిన్నంతా సిటీలో తిరిగాగదా, చాలా మోడరన్‌గా ఉంది. రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, మధ్యలో దుబాయ్ క్రీకూ, మాల్స్‌లో టెక్నాలజీని వాడుతోన్న విధానం… ఓసారి దుబాయ్ ప్రోగ్రాం పెట్టుకో, నీకు నచ్చుతుంది.”

అమెరికాలో ఆరేళ్ళుగా ఉంటోన్న మనిషి ఆ మాట అంటోంటే కాస్తంత ఆశ్చర్యం, కొండంత కుతూహలం. పోనీ ఓసారి వెళదామా అన్న ఆలోచన.


“అమరేంద్రగారూ! ఇటూ ఇక్కడా!” కలవని ఫోనుకోసం నాలుగోసారి ప్రయత్నిస్తోన్న నాకు ఆ మాట అమృతంలా సోకింది. వెనక్కితిరిగి చూశాను.

రాజేష్! వేమూరి రాజేష్!

“ఎమిరేట్స్‌కి స్వాగతం! మొత్తానికి రెండేళ్ళు పట్టింది మీరు ఇక్కడికి చేరడానికి.”

నిజమే. మిన్నీ 2018లో వేసిన బీజం నిలదొక్కుకొని, మొలకెత్తి, మారాకు వెయ్యడానికి రెండేళ్ళు పట్టేసింది. ఢిల్లీకీ దుబాయ్‌కూ మధ్య ఉన్న నాలుగు గంటల దూరాన్ని దాటడానికి నాకు రెండేళ్ళు పట్టింది. 2020 ఫిబ్రవరిలో ఆ దూరం దాటగలిగాను.

ఆయాప్రాంతాల గురించి అరవై ఏళ్ళ అరకొర జ్ఞానం నాది. పందొమ్మిదివందల అరవైలలో గల్ఫ్ దేశాల ఇసుకలో తైలపు నిధులు బయటపడటం, ఒక్కసారిగా ప్రపంచం దృష్టి ఆ దేశాల మీదకు మళ్ళడం, డెబ్భైల ఆరంభంలో అప్పటిదాకా ఆయాదేశాల మీద ఆధిపత్యం నెరపుతోన్న బ్రిటిషువాళ్ళు అక్కడ్నించి వెళ్ళిపోవడం… ఐదారు ఎమిరేట్స్ కలగలసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌గా ఏర్పడటం, ఆ పక్కనే ఖతార్, బహరైన్, కాస్తంత ఎగువున కువైట్, దిగువున ఒమాన్, పశ్చిమాన పెద్దన్న సౌదీ అరేబియా, ఆ దిగువున యెమెన్…

ఆయా గల్ఫ్ దేశాల్లోనూ, సౌదీలోనూ పనిచేసిన క్లాస్‌మేట్లూ, పూర్వ సహోద్యోగులూ, సన్నిహితమిత్రులూ- వారు అడపాదడపా చెప్పిన ఎన్నెన్నో విశేషాలూ… గల్ఫ్ దేశాలకు కేరళనుంచీ రాయలసీమ నుంచీ వలసవెళ్ళిన బడుగుజీవుల వార్తలూ కథలూ… వారి కనిపించే విజయాలూ, కనిపించని అగచాట్లూ… ఆ ఎడారిలో ఎనభైలలో వికసించిన షార్జా క్రికెట్ కుసుమం… సముద్రాన్ని జయించి అత్యాధునికమైన మినీనగరాలు నిర్మిస్తోన్న దుబాయ్ అధినేతలూ, పామ్ ‌ట్రీ ఆకృతిలో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ రియల్ ఎస్టేట్లూ…

ప్రపంచంలోకెల్లా ఎత్తయిన దుబాయ్ బుర్జ్ నిర్మాణపు వార్తలు, విశేషాలు…

తైలపు సంపదను తండ్రీతాతలు ఇచ్చిన ముల్లెలా ఆత్రంగా ఖర్చుపెట్టేసి చేతులు దులుపుకోకుండా అక్కడి అధినేతలు తమతమ ఆర్థిక కార్యసరళిని విద్యావ్యాపార రంగాలలోకీ, సాంకేతిక ప్రగతికీ, సమాజాన్ని ఆధునికం చెయ్యడానికీ, సమస్త దేశ ప్రజల సంక్షేమం కోసమూ వినియోగిస్తున్నారన్న శుభవార్తలూ, అందుకు అనుగుణంగా దేశదేశాలనుంచి నిపుణులను ఆకర్షించి రప్పించి బిరబిరా అనేకరంగాలలో ఎదిగివస్తోన్న అక్కడి ఎమిరేట్లూ, అందుకు దోహదం చేసేలా సంప్రదాయ కట్టుబాట్లను బాగా సడలించి అన్నిదేశాలవారూ స్వేచ్ఛగా తిరుగాడగల సామాజిక పరిస్థితులు నెలకొల్పిన తీరూ…

ఇవన్నీగాకుండా బాగా చిన్నప్పుడు చదువుకొన్న పర్షియా అఖాతాన్ని దాటుకొని వెళ్ళి సింద్‌బాద్ చేసిన సాహసయాత్రలూ…

ఇలా, ఎన్నో ఎన్నెన్నో మిన్నీతో మాట్లాడాక గబగబా గుర్తొచ్చాయి. పోనీ ఓసారి వెళ్ళివద్దామా అన్న ఆలోచన కలగనే కలిగింది. ఆ ఊపులో ఆమధ్యే పరిచయమయిన వేమూరి రాజేష్‌ను సంప్రదించాను.

“తప్పకుండా రండి. నాకు తెలుసు, మీరు ఇష్టపడతారు. ఒకవారం ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీరు తప్పకుండా సంతోషపడతారు. మీ అభిరుచికి సరిపడేలా నేను ప్లాను చేస్తాను. ఒక వీకెండ్ నేను కూడా మీతో కలసి తిరుగుతాను.” రాజేష్‌ ప్రోత్సాహం.

అయినా ఎందుకో ఆ ఊపు తాటాకు మంటే అయింది. తటపటాయింపు. డోలాయమానం.

క్రమక్రమంగా వెనకబడిపోయిన దుబాయి ప్లాను.


‘జోత్ సే జోత్ జగాతె చలో’ అన్నది నేను బాగా చిన్నప్పుడు విని అర్థంచేసుకొన్న పాట. ఇప్పటికీ మనసులో నిలచిపోయిన పాట. సంత్ జ్ఞానేశ్వర్ అన్న హిందీ సినిమాలో లతామంగేష్కర్ పాడిన పాట. అదిగో ఆ పాట గుర్తుకొచ్చింది మళ్ళా నా దుబాయ్ ఆలోచన పునరుజ్జీవనం చెందినపుడు!

2019 మే నెలలో వారం పదిరోజులపాటు థాయ్‌లాండ్ వెళ్ళివచ్చాను-వెళ్ళేముందు ఇలానే అన్యమనస్కత, తటపటాయింపు. వెళ్ళివచ్చాక అర్థమయింది–ఏ దేశం వెళ్ళినా చూసి, అనుభవించి, తెలుసుకొనే విషయాలు అపారంగా ఉంటాయని, తెలిసీ తెలియని ప్రదేశమయితే మరీ మంచిదనీ, ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకాలూ, అనుభవాలూ దొరికితీరుతాయనీ నమ్మకం చిక్కింది.

రాజేష్‌‌తో మాట్లాడాను. తన ప్రతిపాదన ఇంకా తాజాగానే ఉందని నొక్కివక్కాణించాడు. శీతాకాలం గడచిపోకముందే వస్తే ఎండల తాకిడి ఉండదని సూచించాడు. నాకూ ఆ సమయం అనుకూలమే.

దుబాయ్ అనుకొన్నానేగానీ కార్యాచరణకు దిగాక ఆశలు పెరిగాయి. పక్కనే ఉన్న ఖతార్, బహరైన్ ఎందుకు కలుపుకోగూడదూ అనిపించింది. మస్కట్లో కొన్ని దశాబ్దాలు పనిచేసిన ఏభై ఏళ్ళనాటి క్లాస్‌మేట్ చేసిన నగర వర్ణనలు గుర్తొచ్చాయి. ఒమాన్‌నూ కలుపుకోవాలన్న ఆలోచన…

“నన్నడిగితే ఖతార్, బహరైన్ వద్దనే అంటాను. అక్కడ మీకు పెద్దగా ఆసక్తి కలిగించే విషయాలేమీ లేవు. ఒమాన్ అంటారా, ఎస్! తప్పక ప్లాన్ చెయ్యండి. ఒక్క మస్కటే‌గాకుండా ఒమాన్ పశ్చిమ కొసన ఉన్న సలాలా అన్న ఊరునూ మీ ప్లానులో చేర్చుకోండి.” రాజేష్‌ సలహా. పాటించాను. అంతా కలసి పన్నెండురోజుల ప్రణాళిక రూపుదిద్దుకొంది.

వీసా వివరాల్లోకి వెళితే ఇప్పటికే అమెరికా వీసా ఉన్నవాళ్ళకి యు.ఎ.ఇ.లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యముందని తెలిసింది. ఆనందం. “మీ ఒమాన్ వీసా సంగతి నాకొదిలెయ్యండి. నాకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ద్వారా ఇక్కడే ఏర్పాటుచేస్తాను. మీ పాస్‌పోర్టూ, ఫోటోలూ స్కాన్ చేసి పంపండి చాలు.” అన్నాడు రాజేష్‌. ఎంత భాగ్యం!

దుబాయ్ విమానాశ్రయంలో దిగి రాజేష్‌‌తో వాళ్ళ ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిది దాటేసింది. రాజేష్‌ సహచరి భార్గవి, అబ్బాయి హన్ష్ ఎదురొచ్చి స్వాగతించారు. రాజేష్‌ ఉండేది షార్జా ఎమిరేట్‌లో–దుబాయ్ నుంచి పాతిక కిలోమీటర్లు.

రాజేష్‌ నాలాగే యాత్రాభిమాని. ఆ అభిమానమే మా పరిచయానికి పునాది. స్వస్థలం కృష్ణా జిల్లా ఘంటసాల. ప్రింటింగ్ టెక్నాలజీ చదివాడు. దాదాపు పదిపన్నెండేళ్ళుగా విదేశాల్లో ఉంటున్నాడు- అందులో కొంతకాలం యూరప్‌లో గడిపాడు. ఆ సమయంలో తాను విస్తృతంగా తిరిగిన యూరప్ గురించి ‘నా ఐరోపా యాత్ర’ అన్న యాత్రాగాథ 2016లో రాశాడు. ఆ పుస్తక ఆవిష్కరణ సమయంలోనే అతనితో పరిచయం, పరస్పర అభిమానాలు.


“ఏం తల్లీ! నీది ఫిలిప్పీన్సా?”

“ఎలా గుర్తుపట్టారూ?”

“నీ రూపురేఖలు… ముందు థాయ్‌లాండ్ అనుకొన్నాను. నీ ఇంగ్లీషు చూసాక ఫిలిప్పీన్స్ అనిపించింది.” మాట కలిసింది ఆ మహిళతో.

అంతకుముందు రాత్రి రాజేష్‌ చెప్పాడు: “అమరేంద్రగారూ! రేపు మీకోసం బిగ్‌బస్ అనీ అందులో ఒక ‘హాప్ ఆన్ హాప్ ఆఫ్’ దుబాయ్ టూరు ఏర్పాటు చేశాను. తెలుసుగదా ఆ టూర్లు ఎలా ఉంటాయో?”

తెలుసు. ఢిల్లీలో కూడా ఇలాంటి టూర్లు ఉన్నాయి. పరిచయమే. ఏ నగరంతో అయినా ప్రథమ పరిచయానికి ఇది ఉత్తమమైన మార్గం. ప్రధాన రహదారులగుండానూ, ప్రముఖ టూరిస్టు ప్రదేశాల మీదనుంచీ సాగిపోతుంది బస్సు. అంతా కలసి పదిహేనూ ఇరవై స్టాపులుంటాయి. ఎక్కడైనా దిగవచ్చు. ఎంతసేపైనా అక్కడ గడపవచ్చు. అరగంటకోసారి వచ్చిపోయే తర్వాతి బస్సుల్లో ఎక్కి ప్రయాణం కొనసాగించవచ్చు.

రాజేషూ నేనూ తొమ్మిదింటికల్లా దుబాయ్‌లోని డెయ్‌రా సిటీ సెంటర్ అన్న చోటికి చేరాం. ఇంటినుంచి గంట ప్రయాణం. మొదటిరోజు కాబట్టి నన్ను ఒక్కడ్నే పంపడానికి ససేమిరా అన్నాడు రాజేష్. మహాతటాకంలాంటి ఆ డెయ్‌రా మాల్‌లో బిగ్‌బస్ వాళ్ళ ఆఫీసు ఎక్కడుందో కనిపెట్టడానికి, అక్కడ తన ఫోన్ మెసేజ్‌ను టికెట్‌గా మార్చడానికీ అప్పటికి పదేళ్ళుగా దుబాయ్‌లో ఉంటోన్న రాజేష్‌కే పావుగంట పైగా పట్టేసింది. “మీ టికెట్‌లో దుబాయ్ క్రీక్‌లో పడవప్రయాణం కూడా కలగలసి ఉంది, మర్చిపోకండి.” వివరాలు చెప్పాడు రాజేష్‌.

రాజేష్‌ వెళ్ళిపోయాక బస్సుకోసం నిరీక్షిస్తూ అక్కడున్న కరపత్రాలు సంపాదించి అధ్యయనం చేసే ప్రయత్నంలో తటస్థపడింది ఆ ఫిలిప్పీన్స్ యువతి. ఆరు నెలల క్రితం దుబాయ్ వచ్చిందట. అప్పటికే ఇక్కడున్న స్నేహితుల ఆసరాతో ఈ ఉద్యోగం సంపాదించిందట. ఇంకా కన్ఫర్మ్ కాని ఉద్యోగం… అరకొర సంపాదన. “నావరకూ సరిపోతుందిలే, అనుభవం వస్తోందిగదా. నగరానికి అలవాటుపడుతున్నాను. మరో ఏడాదికల్లా స్థిరమైన ఉద్యోగంలో కుదురుకోగలను.” ఎంతో విశ్వాసంతో చెప్పుకొచ్చింది. ఆనాటి నా టూర్ గురించి కరపత్రాల్లో లేని వివరాలు కొన్ని అందించింది. “సౌఖ్ మదినత్ అనీ ఉంటుంది. అక్కడ మాత్రం కనీసం గంట గడుపు. భలేవుంటుంది.” బస్సు వచ్చి నేను ఎక్కేదాకా నాకు తోడుగా ఉంది. ఎప్పట్నించో తెలిసిన మనిషిలాగా అభిమానం చూపించింది. దేశంగాని దేశంలో ఇద్దరు పరదేశీలు దగ్గరకావటం సహజమేగదా అనిపించింది. 

చేతికందిన రంగురంగుల కరపత్రం పుణ్యమా అని దుబాయ్ నగరపు ఆనుపానులు అందాయి. మరికాసిని వివరాలు తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్ ఉండనే ఉంది కదా.

నలుచదరపు సౌదీ అరేబియా బృహత్ ద్వీపకల్పానికి ఆగ్నేయపు దిశలో ఉంది ఈ దుబాయ్ ఎమిరేట్. మళ్ళా ఆ ఉండటం కూడ ఖడ్గమృగపు ఒంటికొమ్ములా పర్షియన్ అఖాతంలోకి చొచ్చుకుపోతూ ఇరాన్‌కు అతిచేరువగా చేరిన భూభాగంలో ఉంది. ఏడు ఎమిరేట్ల ఈ సమాఖ్య ఆ కొమ్ముకొమ్మంతా ఈశాన్య-నైరుతి దిశల్లో విస్తరించి ఉంది. అంతా కలసి డెబ్భైయేడువేల చదరపు కిలోమీటర్లు–దాదాపు పంజాబూ హర్యానా కలగలసినంత. అందులో సింహభాగం-ఎనభై ఆరు శాతం భూభాగం-ఆబు దాబి ఎమిరేట్‌ది. భూమిపరంగా దుబాయ్ రెండో పెద్ద ఎమిరేట్-నాలుగువేల చదరపు కిలోమీటర్లు. గోవాకన్నా కాస్తంత పెద్దదన్నమాట. షార్జాది మూడో స్థానం. జనాభా పరంగా కూడా ర్యాంకులు దాదాపు అవే. దుబాయ్, ఆబు దాబిలలో చెరో ముప్ఫయ్యైదు లక్షలమంది ఉంటే, షార్జాలో పదిహేను. మిగిలిన నాలుగు ఎమిరేట్లు కలసి పదిలక్షలు; అంతా కలసి తొంభయ్యయిదు లక్షలు. మళ్ళా అందులో ఎనభై ఎనిమిది శాతం(!) విదేశాల నుంచి పనికోసం వచ్చినవాళ్ళు. స్థానికులు-ఎమిరైట్స్ అనాలి వాళ్ళని-అంతా కలసి పన్నెండు లక్షలు; అంతే. విదేశాలనుంచి వచ్చినవాళ్ళలో-ఎక్స్‌పాట్స్ అనాలి వాళ్ళని, ఎక్స్‌పాట్రియెట్‌కు హ్రస్వరూపం-పాతిక లక్షలమంది భారతీయులు. దాంతోపాటు మరో ఇరవైలక్షల మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవాళ్ళు. భారత ఉపఖండపు నలభైఅయిదు లక్షలమంది పుణ్యమా అని యు.ఎ.ఇ.లో ఎక్కడికివెళ్ళినా హిందీ, ఉర్దూలు బహుచక్కగా చెల్లుబాటవుతాయి. అదో గొప్ప సౌకర్యం. అన్నట్టు అక్కడ ఎన్ని దశాబ్దాలు పనిచేసినా వర్క్ వీసాలే తప్ప పౌరసత్వం ఇవ్వనే ఇవ్వరట. ఆ ప్రాంతపు అన్ని దేశాలలోనూ అదే నియమం.

మా బిగ్‌బస్ రానేవచ్చింది. రెండతస్తుల బస్సు అది. పై అంతస్తు ఓపెన్‌టాప్. సహజంగానే ఆ అంతస్తు ఎక్కేశాను.

దుబాయ్ నగరం సముద్రం ఒడ్డమ్మటే ముప్పై, నలభై కిలోమీటర్ల పొడవున విస్తరించి వుంది. వెడల్పు తక్కువే-ఆరేడు కిలోమీటర్లు. బిగ్‌బస్ సంస్థ మొత్తం నగరాన్ని మూడు భాగాలుగా విభజించింది. ఉత్తరపు భాగంలో సాగేది రెడ్‌రూట్, అరుణమార్గం. మధ్యభాగంలో గ్రీన్‌రూట్, హరితమార్గం. దక్షిణ భాగాన బ్లూరూట్, నీలిమార్గం. మూడు మార్గాలు కలసి సుమారు అరవై, డెబ్బై కిలోమీటర్లు. ప్రతి ఇరవై నిముషాలకూ ఓ బస్సు చొప్పున పొద్దున తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది దాకా బస్సులు తిరుగుతూనే ఉంటాయి. మూడు మార్గాలూ ఎక్కడా దిగకుండా చుట్టిరావాలంటే కనీసం ఆరుగంటలు పడుతుంది; మధ్యలో రెండుచోట్ల బస్సులు మారాలి. అరుణం విడచి హరితమూ, మళ్ళా ఆ హరితం విడచి నీలమూ పట్టుకోవాలన్నమాట.

అతి ఉత్సాహంతో అనుకొన్నాను: ఇవాళ ఈ బిగ్‌బస్ ఆద్యంతాలు చూసితీరాలి. మూడు మార్గాలూ ఆరుగంటలపాటు తిరిగి తిరిగి నగరంతో పరిచయం ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క పడవ ప్రయాణానికి తప్ప ఇంకెక్కడా బస్సు దిగగూడదు.

బస్సు బయలుదేరిన పదీ పదిహేను నిముషాలకే ప్రతిజ్ఞాభంగం జరిగిపోయింది!

అవునుమరి. కొన్ని ప్రతిజ్ఞలుండేది నిలబెట్టుకోడానికి, పాలించడానికి; కొన్ని, భంగపరచడానికి!


బస్సు డెయ్‌రా సిటీ సెంటర్ విడిచిపెట్టీపెట్టగానే పచ్చని పరిసరాల్లోకి ప్రవేశించి ఒక విశాలమయిన జలప్రవాహాన్ని దాటింది. అదే దుబాయ్ క్రీక్ అన్నమాట. పచ్చదనం, ముచ్చటగా కనిపిస్తోన్న పూలు అప్రయత్నంగా అలనాటి ‘ఎడారిలోన పూలుపూసె ఎంత సందడీ…’ అన్నపాటను కూనిరాగం తీసేలా చేశాయి. అదేరాగాన్ని రాబోయే వారం పది రోజుల్లో కొన్ని డజన్లసార్లు ఆలపించే అవకాశం వస్తుందని అప్పటికింకా తెలియదు!

క్రీక్ దాటీదాటగానే బస్సు రోడ్డు వదిలి ఈజిప్ట్‌లో ప్రవేశించింది.

ఆ ప్రదేశం పేరు వాఫీ కోర్ట్‌యార్డ్ అట.

కాస్తంత దూరాన ఓ పిరమిడ్, దారికటూయిటూ మనం మ్యూజియంలలో చూసే అలనాటి ఈజిప్టు సైనిక ద్వారపాలకులు, పక్కనేచూస్తే ఓ హోటలు, ఇంకా పరీక్షగా చూస్తే నివాసగృహాలు, కాస్త లోపలికి దృష్టిసారిస్తే అనేకానేక దుకాణాలు, రెస్టారెంట్లు–ఏమిటీ ప్రదేశం?

ఈజిప్టు వాస్తురీతిలో ముప్పై ఏళ్ళ క్రితం వాఫీ అన్న కార్పొరేట్ గ్రూపువాళ్ళు రూపకల్పన చేసిన మైక్రో సిటీ ఇది. దుబాయ్‌లో వచ్చిన మొదటి తరం మాల్స్‌లో ఒకటట.

ఆ వాస్తురీతి అయస్కాంతంలా ఆకర్షించి నన్ను బస్సునుంచి దింపేసింది.

ఆకర్షణేగాదు, ఆ ‘నగర’వీధుల్లో, దుకాణాలమధ్య తిరుగాడటం ఆహ్లాదమూ కలిగించింది. రద్దీ రహదార్లకు పెడగా ఉండటం వల్లనేమో సందర్శకులు, కొనుగోలుదార్లూ దాదాపు లేరు. ఆ వాతావరణాన్నీ భవనాల శోభనూ మనశ్శరీరాలతో ఆస్వాదిస్తూ అక్కడో పావుగంట… ఈలోగా తదుపరి బస్సు రానేవచ్చింది!

మరో ఐదారునిముషాల ప్రయాణం తర్వాత ఆకాశహర్మ్యాల సందడి మొదలయింది. కళ్ళు ఎత్తితేగానీ చివరి అంతస్తులు కనిపించని భవనాలు, ఆ భవనాలన్నిటినీ వామనుల్ని చేస్తూ త్రివిక్రముడిలా ఆకాశంలోకి ఎగసి కనిపిస్తోన్న బుర్జ్ ఖలీఫా. నగర కేంద్రం చేరామన్నమాట. అమెరికన్ పరిభాషలో డౌన్‌టౌన్ అనవచ్చు. దుబాయ్ మాల్ దగ్గర బస్సు ఆగింది. కాసేపు ఆగి, కొత్తవాళ్ళను ఎక్కించుకొని ముందుకు సాగింది.

దుబాయ్ రోడ్ల గురించి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించీ మిన్నీ రెండేళ్ళక్రితం చేసిన వ్యాఖ్యలు పదేపదే గుర్తురాసాగాయి. కాసేపట్లో రోడ్డుకు ఎడమవేపున ఆమధ్యే వార్తల్లో బాగా వినిపించిన దుబాయ్‌ఫ్రేమ్ భవనం, ఇంకాస్త ముందుకువెళితే దుబాయ్‌లో జరగబోయే ఎక్స్‌పో-2020 కోసం నగరపు వీధుల్లో నిలబెడుతోన్న విలక్షణ ఆకృతులు. రోడ్డుకు కాస్త ఎగువన, ఎడమపక్కన, అతి విలక్షణమైన రీతిలో కనిపిస్తోన్న నిర్మాణంలో ఉన్న కాలిగ్రఫీ మ్యూజియం… గభాలున ఆధునిక నగరాన్ని వదిలిపెట్టి పాత దుబాయ్ ప్రాంతాల్లోకి అడుగుపెట్టిన బస్సు, అల్‌ఫాహిదీ ఫోర్ట్.

అతిచిన్న కోట. కట్టి రెండువందల ఏభై ఏళ్ళయిందట. సైనిక అవసరాలకన్న వాణిజ్య పరిరక్షణ కోసమే దీన్ని కట్టారేమో అనిపించింది. కొంతకాలం ఆయుధాగారంగానూ, మరికొంతకాలం కారాగారంగానూ వ్యవహరించిందట. ఏభై ఏళ్ళ క్రితం యు.ఎ.ఇ. ఏర్పడ్డాక కోటను మరికాస్త దిట్టపరచి సందర్శకులకు విడిచిపెట్టారట.

ఆగుదామనిపించింది. బస్సు దిగాను. నామమాత్రపు ప్రవేశ రుసుము- మూడు దిర్హమ్‌లు. అన్నట్టు ఒక దిర్హమ్‌‌ మన ఇరవై రూపాయలకు సమానం.

“మీ వయసెంతా?” టికెట్ కౌంటరు మనిషి ప్రశ్న.

చెప్పాను. “మీరు సీనియర్ సిటిజన్ కోవకు చెందుతారు, ఉచితం.” అన్నాడు.

కోట ఆవరణలో పాత ఫిరంగులు, నౌకల నమూనాలు అన్నీ మెరుగుపెట్టబడి, తళతళలాడుతూ… ఆ పక్కనే దుబాయ్ మ్యూజియం అన్న బోర్డు. అప్పుడు గుర్తొచ్చింది రాజేష్‌ మాట: మీరు దుబాయ్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో మ్యూజియం ఒకటి అన్నాడతను.

మ్యూజియం ఉన్నది నేలమాళిగలో. ఒకప్పటి కారాగారమూ అదే అయివుండాలి. యథాలాపంగా ఓ చూపు చూసివద్ధాం అనుకొన్నది గంటన్నర పట్టేసింది!

ఆ సముద్రమూ ఎడారుల అరుదైన లాలనలో అలనాటి అక్కడి ప్రజలు ఎలా జీవించారు, ఎలా నివసించారు, ఏయే పనులు చేశారు, ఎలాంటి కలలు కన్నారు, ఏయే కళలూ విద్యలూ నేర్చారు, అసలు అక్కడ జనావాసాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఇలా ఎలా పరిణామం చెందాయి, ఆనాటి గ్రామాలూ పట్నాలూ ఎలా ఉండేవి, ఎలా వాళ్ళంతా ఇప్పటి ఆధునిక జీవనం అలవరుచుకొన్నారు–వీటన్నిటికీ సమాధానాలు ఆ నేలమాళిగలో దొరుకుతాయి. దొరికాయి.

చాలీచాలని వ్యవసాయం, పశుపాలన, విరివిగా చేపలు పట్టడం, నైపుణ్యంగా పడవలు నిర్మించడం, సాహసంతో సముద్రగర్భంలో ముత్యాలు వేటాడటం–ఇదీ స్థూలంగా అనాది దుబాయివాసుల చరిత్ర. అలా తమకుతామే పరిమితమయిన కొద్దిపాటి జనాభా ఇపుడు ప్రపంచమంతా తలయెత్తి చూసే ఆధునిక సమాజంగా ఎలా గత ఏభై ఏళ్ళలో పరిణామం చెందిందో, ఆ వివరాలూ మ్యూజియంలో పొందుపరిచారు. ఇదే కాలరేఖ మీద, ఇంతే స్వల్పవ్యవధిలో అత్యాధునిక నగర రాజ్యంగా అవతరించిన సింగపూర్ సహజంగానే గుర్తొచ్చింది. పదిహేనేళ్ళ క్రితం ఆ నగరాన్ని చూసినపుడు ఎలాంటి విభ్రమ కలిగిందో దుబాయ్‌లో ఈ రోజున అలాంటి సంతోషమే కలిగింది. అప్పటిదాకా నేను చూసి ఆశ్చర్యాలుపోతున్న ఆ ఆధునిక నగర విన్యాసాల లంగరు ఇక్కడి మ్యూజియంలో దొరికిందనిపించింది.


కోట నుంచి ఐదారు నిముషాల నడక దూరంలో దుబాయ్ క్రీక్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ సెంటరు ఉంది. ఆ ప్రవాహానికి అటూ ఇటూ విపణి వీధులు. స్థానిక పరిభాషలో సౌఖ్‌లు.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గోల్డ్ సౌఖ్-స్వర్ణ విపణి-నదికి అవతల తీరాన. బంగారం సంగతి ఎలా ఉన్నా నేను చెయ్యబోయే గంటసేపటి నౌకావిహారం అవతలిగట్టున మొదలవుతుందట. అటూ ఇటూ మనుషుల్ని చేర్చడానికి క్షణానికొకటి చొప్పున తిరిగే భారీ మరపడవలు… నర్సాపురం, సఖినేటిపల్లి రేవులూ, అక్కడి పడవలూ గుర్తుచ్చాయి.

పడవ ఎక్కి, ఒక్క దిర్హమ్‌ చెల్లించి, అవతలిగట్టు చేరాను.

మధ్యాన్నం రెండవుతోంది. పడవలో ఓ గంట. అందులోనే ఉదయం భార్గవి కట్టియిచ్చిన లంచ్ మూట విప్పాను.

నే ఎక్కిన రేవును తేరిపారా చూస్తే శతాబ్దాల నాటి చరిత్ర ఛాయలు కనిపించాయి. ఇప్పటికీ సరుకులను రవాణా చేస్తోన్న ‘అప్పటి’ నాటుపడవలు కనిపించాయి. మా షోకిల్లా నౌకల కన్నా ఆనాటి నాటు పడవలకే ఆ నీటిమీద అధికారం ఉందనిపించింది.

మా పడవలో పల్చగా అతిథులు. చిరునవ్వులు, పలకరింపులు. ఒకాయనది బీహారట. కువైట్‌లో అనుకొంటాను ఉద్యోగం. ఆఫీసు పనిమీద దుబాయ్ వచ్చాడు. ఈ రోజు కాస్త తీరిక దొరికేసరికి ఇలా నౌకా విహారానికి వచ్చాడు. కబుర్లు సాగాయి. బిడియపడకుండా తన కష్టాలూ సుఖాలూ చెప్పుకొచ్చాడు. ఉండీలేని క్వాలిఫికేషన్లతో కువైట్ చేరడం, దొరికిన పనల్లా చేయ్యడం, మెల్లగా కంప్యూటర్లు నేర్చుకోవడం, అందులో రాణించడం-అతనిదో ఆసక్తికరమైన విజయగాథ.

“బాస్, ఫోటో తీసిపెడతావా?” మరో పొడవాటి వ్యక్తి అడిగాడు. ఆఫ్రికా ఛాయలు, మెరుగైన రూపురేఖలు. మొరాకో మనిషా?

“కాదు. మారిటానియా. మా దేశం పేరు విన్నావా?”

ప్రపంచపటంలో ఎపుడో చూసిన గుర్తు. ఆదినారాయణ యాత్రారచనల్లోనూ ఆ దేశపు ప్రస్తావన వచ్చినట్టు గుర్తు. అల్జీరియాకు దిగువునగదా ఉండేదీ? అదే చెప్పాను. సంతోషపడ్డాడు. “ఎవరికి చెప్పినా అసలు అలాంటి దేశం ఉందనే ఒప్పుకోరు. చాన్నాళ్ళకి నువు కనిపించావు, మా దేశాన్ని గుర్తించే మనిషివి…” అంటూ బహు సంబరపడ్డాడు.

ఒకటికి పది ఫోటోలు తీసిపెట్టాను.

మేం గమనించే లోపలే నౌక తిరిగి రేవు చేరింది. గోల్డ్ సౌఖ్‌కు దారిచూపించే బోర్డు కనిపించింది. ఒక అడుగు అటు వేద్దామా అనిపించినా మళ్ళీ మళ్ళా వస్తాగదా తొందరేముందీ అనుకొని బిగ్‌బస్ యానం కొనసాగించాను. దుబాయ్ మాల్ టెర్మినల్‌కు వెళ్ళి గ్రీన్‌లైన్ పట్టుకొన్నాను.


ఆ హరిత మార్గంలో మొదటి మజిలీ ‘సిటీ వాక్’ అన్న మార్కెట్ ప్రవేశం. నిజానికి అది బజారు వీధి అని తెలియదు. ‘వాక్’ అన్నమాట వినబడగానే నా ప్రమేయం లేకుండానే కాళ్ళు బస్సు దిగిపోయాయి!

అదో ఓపెన్ ఎయిర్ షాపింగ్ సెంటరు.

తీర్చిదిద్దిన వీధులు (పాదచారులకు మాత్రమే), షాపులు, రెస్టారెంట్లు, ఓ ఫౌంటెను, సినిమాహాలు. ఊపందుకొన్న ఎండ, దాన్ని తోసిరాజనే నడకోత్సాహం-ఏదేమైనా దుబాయ్ స్వరూప స్వభావాలు తెలుసుకోవాలంటే డెయ్‌రా మాల్ లాంటి ప్రదేశాలకన్నా నేల పరిమళం కనిపించి వినిపించే ఈ సిటీ వాక్ మేలని అనిపించింది. రెండుమూడేళ్ళ క్రితం అట్లాంటాలో తిరుగాడిన ‘అట్లాంటిక్ ప్లేస్’ దీని సహోదరిలా అనిపించింది.

బస్సు రోడ్డుమీద తేలియాడుతూ సాగి మళ్ళా రహదారి వదిలి ఇసకనిండిన సన్నటిదారులు పట్టుకొంది. ఎడారి ఇసుకా అని ఆలోచిస్తోంటే, కాదు సముద్ర తీరం అని జవాబిచ్చింది జుమైరా బీచ్! అంత తొందరగా దుబాయ్ సముద్రాన్ని చూస్తాననుకోని నాకు అది విందుభోజనమే!

ఫిబ్రవరి మొదటివారమే అయినా ఎండ మండించడం ఆరంభించింది. కాస్తంత మొండితనం లేకపోతే ముందడుగు పడని స్థితి. బస్సులోంచి అక్కడ దిగినది నే ఒక్కడినే. పక్కనే కనిపిస్తోన్న బీచ్‌లో కూడా కనిపించీ కనిపించని మనుషులు.

చిన్న బీచ్. పెద్దగా అలల తాకిడి లేదు. లోతూ అంతంతమాత్రమే అనిపించింది. ఓ పావుగంట నీళ్ళను తాకీ తాకకుండా, కాళ్ళు తడిసీ తడవకుండా నీటి ఒడ్దున కెరటాలతో ఆట. నడక. సాయంత్రం ఆ ఫోటోలు ఫేస్‌బుక్‌లో పెడితే మిత్రులు వేమూరి సత్యం, దుబాయ్ అంటే ఎడారీ ఇసకే అనుకొన్నాను. సముద్రమూ బీచీ కూడా ఉన్నాయా! అంటూ కామెంటు పెట్టారు. నిజానికి యు.ఎ.ఇ.కి పదమూడు వందల కిలోమీటర్ల తీరరేఖ ఉంది. పోల్చి చూస్తే మన ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యికన్నా తక్కువే!

జుమైరా సాగరతీరం నుంచే అల్లంత దూరాన తెరచాప పడవ ఆకృతిలో సముద్రం మధ్యన నిలబడివున్న నిడుపాటి కట్టడం కనిపించసాగింది. బుర్జ్-అల్-అరబ్ అంటూ అలా సముద్రం మధ్యలో ఫైవ్‌స్టార్ హోటల్ కట్టాలన్న సంకల్పం, అందుకోసం సముద్రాన్ని ‘పూడ్చి’ ఒక ద్వీపం సృష్టించడం, అందులో ఆ హోటలు నిర్మాణం–ఇవన్నీ మేవు తొంభైలలో ఆసక్తిగా విన్న గల్ఫ్ విశేషాలు. బుర్జ్ ఖలీఫా రాకముందు దుబాయ్ అనగానే ఆ నగరపు ప్రతీకగా ఈ భవనమే ప్రత్యక్షమయ్యేది.

మరికాస్త ముందుకెళ్ళి ‘సౌఖ్ మదీనాట్’ అనే కట్టడం దగ్గరకు చేర్చింది బస్సు. చూడ్డానికి అరబిక్ సంప్రదాయపు మహాభవనంలా కనిపించినా ఆ కట్టడం పేరులో ఉన్న ‘సౌఖ్’ అన్నమాట అది ధనవంతుల నివాస భవనంగాదు, సామాన్యుల విపణివీధి అని విప్పిచెప్పింది.

ఆ ప్రాంగణమంతటినీ మధ్యప్రాచ్య వాస్తురీతిలో, మధ్యయుగాలనాటి దారు నిర్మాణమా అనిపించేటట్టుగా కట్టారు. పొడవాటి నడవలు రెండుమూడు, ఆ నడవలకు అటూ ఇటూ ఏభై అరవై చిన్న చిన్న దుకాణాలు, దుకాణాల్లో అనేకానేక వస్తుసముదాయం, ఏంటిక్స్ అమ్మే షాపులు కొన్ని, తగుమాత్రంగా తిరుగాడుతోన్న కస్టమర్లు, హఠాత్తుగా ‘తిరిగేవారంతా దారి కోల్పోయినవారు కాదు (Not all who wander are lost) అంటూ జె.ఆర్.ఆర్. టోల్కీన్ నవల ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ లోని పద్యపాదం పోస్టర్ నాబోటివాళ్ళలో స్ఫూర్తి నింపే సూక్తి, నా పక్కనుంచే బిరబిరా సాగిపోతోన్న ప్రపంచం… ప్రపంచమే కళ్ళముందు కదలాడుతున్నపుడు సరుకులూ, సామాన్లూ, వాటి నాణ్యాలూ, ధరవరలూ ఎవరికి పట్టేను?!

ఒకటికి రెండుసార్లు ఆబగా ఆ నడవాలలో నడచిన తర్వాత ఆ పక్కనే ఉన్న విశాలమయిన ఆరుబయలు రెస్టారెంటు కనిపించి ఆకర్షించింది. నడవలోంచి బయటకు నడిస్తే అక్కడ రెస్టారెంటే కాకుండా అందంగా అమర్చిన నీటిచెలమ, ఆ చెలమ పక్కన పెంచి పోషించిన పచ్చదనాలు, ఓ పక్కన మళ్ళా కనిపిస్తోన్న తెరచాప ఆకృతిలోని పంచతారల పూటకూళ్ళిల్లు… చక్కని దృశ్యం. ఆహ్లాదకరమైన వాతావరణం. ఎండ తగ్గుమొహం పట్టడం ఇంకో ఆహ్లాదం.

“ఏం తల్లీ, మహా ఆనందంగా కనిపిస్తున్నావు?!” ఆ రెస్టారెంట్లో చకచకా పనిచేస్తూ మొహంనిండా ఆనందమూ సంతృప్తీ నింపుకొని కనిపించిన ఓ ఆఫ్రికన్ మహిళను పలకరించాను. తన పనికి నా పలకరింపు అడ్డేమో అని అనుమానించాను గానీ పాపం ఆమె ఆగి, స్పందించింది.

“కరెక్టుగా చెప్పారు. నా పనంటే నాకు బోలెడు ఇష్టం!” సంబరంగా ఆ యువతి సమాధానం. అంత మనస్ఫూర్తిగా తాము చేస్తోన్న పనిని ఇష్టపడేవాళ్ళు నూటికి కోటికి ఒకరు గదా–అలాంటి అరుదైన మనిషిని గుర్తుపట్టి పలకరించిన సంబరం నాది. గబగబా ప్రవరలు చెప్పుకొన్నాం. మొరాకో మనిషట. డిగ్రీదాకా చదివి దుబాయ్ వచ్చేసిందట. నాలుగేళ్ళయిందట. నగరమంటే ప్రేమ కలిగిందట. ఆమె ఆ మాట అనలేదు గానీ జీవితాన్ని బాగా ప్రేమించే మనిషి అని నాకే అనిపించింది. సూఫీ సాధువులేనా మనసుకు శాంతినిచ్చేదీ?!

నాలుగు దాటేసింది. మిగిలివున్న నీలిమార్గపు జాడలూ చూడాలంటే తిరిగి రాజేష్‌వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి బాగా పొద్దుపోతుంది. నిన్న వచ్చానన్నమాటేగానీ రాజేష్‌‌తోనూ భార్గవితోనూ, పిలగాడితోనూ సరిగ్గా మాట్లాడిందే లేదు. రాజేష్‌తో ఉన్న పరిచయాన్ని స్నేహపు దిశగా మళ్ళించడం జరగనేలేదు. ఈ సాయంత్రం అందుకోసం వినియోగించి కనీసం గంటసేపైనా వాళ్ళతో సన్నిహితంగా గడపటం ముఖ్యమనిపించింది. బ్లూరూట్ ఆవిష్కరణ కార్యక్రమానికి తిలోదకాలిచ్చేశాను.

బస్సు మళ్ళా దుబాయ్ మాల్ దగ్గర తేలింది. అక్కడ్నించి మెట్రో పట్టుకొని డెయ్‌రా మాల్‌కూ, అక్కడ్నించి బస్సు పట్టుకొని షార్జాకూ వెళ్ళడం-అదీ ప్లాను. దాదాపు రెండుగంటల ప్రయాణం.

కానీ బాల్యచాపల్యపు బుద్ధి ‘ఈ మాల్‌లో ఏదో దుబాయ్ ఫౌంటైన్ అంటూ ఉందటగదా, కాసేపు చూసివద్దాం’ అని ప్రలోభపెట్టింది. మాల్‌లోకి నడిచాను.

అదో మహా మహానగరం!

అటూ ఇటూ కనిపించే వింతలూ విశేషాలూ పట్టించుకోకుండా తిన్నగా సాగిపోయినా మాల్‌కు అటు చివర ఉన్న ఫౌంటైన్ దగ్గరకు చేరేసరికి ఇరవై నిముషాలు. టైము పడితే పట్టిందిగానీ అదో ఆనంద అర్ణవ సుందర తీరం అని వెంటనే బోధపడింది. ఏదో ‘దుబాయ్ ఫౌంటైన్’ అని అతి సాధారణంగా పిలుస్తున్నారేగానీ నిజానికి అదో సువిశాల తటాకం. ఆ నీళ్ళ మధ్య ఒకటికి పది ఫౌంటైన్లు. తటాకానికి అవతలి ఒడ్డున నిడుపాటి భవనాల సమూహం. వాటిమధ్య ధీరగంభీరంగా ఎనిమిదివందలముప్పై మీటర్ల ఎత్తున్న బుర్జ్ ఖలీఫా!

ఆ దృశ్యాన్ని ఆకళించుకోడానికి రెండుకళ్ళే చాలవు, అయిదు ఇంద్రియాలూ శ్రుతి అవడం అవసరం. అందుకు పదీపదిహేను నిముషాలు కాదు, కనీసం రెండుమూడు గంటలు కావాలి అని అర్థమయింది. అయినా సరోవర తీరంలోను, దానిమధ్యన ఉన్న వంతెన మీదుగాను, వంతెన దాటాక ఉన్న సౌఖ్-అల్-బహార్‌లోనూ హడావుడిగా అరగంట. తిరిగి మాల్‌లో ప్రవేశించినపుడు మొదటి అంతస్తులో సువిశాలమైన ఏపిల్ స్టోర్ కనిపిస్తే అక్కడో పది నిముషాలు. అక్కడ్నించి దుబాయ్ మాల్ లోకల్ రైలుస్టేషనుకు చేరడానికి మాల్ లోపల లోపలే నడక అయినా దానికి దాదాపు నలభై నిముషాలు పట్టేసింది! వామ్మో అనిపించింది.

ఏ తడబాటూ లేకుండా రైలూ బస్సూ పట్టుకొని షార్జా బస్టాండ్ చేరేసరికి రాత్రి ఎనిమిది దాటింది. బస్టాండుకు హన్ష్‌తోపాటు వచ్చిన రాజేష్ నాకోసం వెదుకుతోంటే ఆ పిలగాడే నా ఉనికిని దూరంనుంచి గమనించి, ‘నాన్నా, అడుగో తాత!’ అంటూ రాజేష్‌కు చెప్పాడట! మాలిమి అయిపోతున్నాడన్నమాట.

ఇంటికివెళ్ళి చూస్తే వాళ్ళు కూడా నాలానే కబుర్ల కోసం ఎదురుచూస్తున్నారని స్ఫురించింది.

మెల్లగా గంటసేపు భోజనం చేశాం.

రాజేష్‌ చక్కని మాటకారి. అన్నివిషయాలూ ఏ సంకోచమూ లేకుండా చెప్పే మనిషి అని వెంఠనే అర్థమయింది. కుశల ప్రశ్నలూ ఆనాటి నా నగర విహారపు వివరాలూ వినడం అయినతర్వాత తన జీవితంలోని ఒక అధ్యాయం చెప్పుకొచ్చాడు. ఆ జ్ఞాపకాల స్రవంతికి ప్రేరణ నేను యథాలాపంగా అడిగిన ప్రశ్న: మీరు ప్రింటింగ్ టెక్నాలజీ చదువులోకి ఎలా వెళ్ళారూ?!

ఇంటర్ పూర్తిచెయ్యడం. సినిమాల మోజు. అది సినిమాలు చూడటం దగ్గర ఆగక ఎలా అయినా డైరెక్టరు అయితీరాలి అన్న సంకల్పంగా ఘనీభవించడం, హైదరాబాద్, తమ ఘంటసాలకే చెందిన చిరునటుడి సంపర్కం. ఒక రాత్రంతా సినిమా షూటింగు చూడటం. మర్నాటి ఉదయం ఆ నటుడు ‘ముందు కనీసం డిగ్రీ పూర్తిచెయ్యి, సినిమారంగంలో నిలదొక్కుకోలేకపోతే మరో ఆధారం వెదుక్కోడానికి డిగ్రీ పనికొస్తుంది’ అని హితవు చెప్పడం. అయిష్టంగానే దాన్ని అంగీకరించి ఏ డిగ్రీ చేద్దామా అని ఆలోచిస్తూ నడుస్తోంటే నేషనల్ లిథో ప్రింటర్స్‌వాళ్ళు వేసిన సినిమా వాల్‌పోస్టరు కంటబడటం. ఈ ప్రింటింగు చదువయితే సినిమా డైరెక్టరు కాలేకపోయినా కనీసం పోస్టర్లు ప్రింటు చేసుకుంటూ అయినా బతకొచ్చు అన్న ఆలోచన, రాష్ట్రంలో ఉన్న (ఒకే ఒక) ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం–అదీ కథ. అతను చెప్పుకొచ్చిన తీరు చూశాక ఇతగాడు సినీరంగానికి వెళ్ళినా రాణించేవాడేమో అని క్షణకాలం అనిపించింది. వెళ్ళాడట డిగ్రీ తరవాత. అప్పటికే సినీరంగంలో ఉన్న వేమూరి సత్యంగారి చేయూతతో నాలుగు నెలలు ఆ రంగపు రంగూ రుచీ చూశాడట. లోతుపాతులు అర్థమయ్యాక రూటుమార్చి ప్రింటింగ్ రంగానికి చెందిన ఉద్యోగంలో చేరాడట. ఆ ఉద్యోగమే నన్ను భార్గవి దగ్గరకు చేర్చింది! అంటూ కథ ఆపాడు.

అరేబియన్ నైట్స్‌లాగా నేనక్కడ ఉన్న వారం రోజులూ రాజేష్‌ చక్కని కథలు చెప్పగలడని అర్థమయింది. తర్వాత తర్వాత చెప్పాడు కూడానూ!

మా కబుర్ల మధ్య హన్ష్‌ ఎపుడు నిద్రపోయాడో మేం గమనించలేదు.

ఆనాటి మా కబుర్లలో భార్గవి శ్రోతగానే ఉండిపోయింది. తననుంచి కబుర్లు జాలువారడానికి మరో రోజు పట్టింది. ఏదేమైనా రాజేష్‌తో పోలిస్తే ఆమె మితభాషి.

నిద్రపోయేముందు గత ఇరవైనాలుగు గంటలనూ ఒక్కసారి సమీక్షించుకొన్నాను. ఒక్క విషయం స్పష్టమయింది. దుబాయ్ నాకిక పరాయి ఊరు కాదు. ఈ నగరం నన్నూ, నేను ఈ నగరాన్నీ ఇష్టపడుతున్నాం…

(సశేషం)