ఒలింపియనులు
మౌంట్ ఒలింపస్
ఒలింపస్ పర్వతం (Mt Olympus) గ్రీసు దేశంలో మిక్కిలి ఎత్తయిన పర్వతం (2,918 మీటర్లు). దాని ఠీవి, దాని రాజసం, దాని అందంతో పాటు అది అందరికి అందుబాటులో లేని కారణంగా ప్రాచీన గ్రీసు దేశస్తులు దానిని దేవతల ఆలవాలంగా ఆరాధించేరు. ఈ పర్వతం మీదనే ముఖ్యమైన పన్నెండుమంది దేవతలు నివాసమున్నారని ప్రాచీన కాలంలో గ్రీసు దేశస్తులు నమ్మేవారు. ఈ పన్నెండుమందిని ‘ఒలింపియనులు’ అని పిలుస్తారు.
ఈ పన్నెండుమంది ఒలింపియను దేవతలలో —
క్రోనస్‌కి రేయాకి పుట్టినవారు ఐదుగురు: జూస్ (Zeus), పొసైడన్ (Poseidan), హేరా (Hera), డిమిటర్ (Demeter), హెస్టియా (Hestia).
జూస్‌కి హేరాకి పుట్టిన పిల్లలు ఇద్దరు: ఏరీస్ (Aris), హెఫీస్టస్ (Hephaestus).
జూస్
జూస్‌కి ఇతరులతో ఉన్న వివాహేతర సంబంధాల వల్ల పుట్టినవారిలో ఒలింపియను దేవతలుగా లెక్కలోకి వచ్చేవారు నలుగురు: హెర్మీస్ (Hermes), ఎథీనా (Athena), ఆర్టెమిస్ (Artemis), అపాలో (Apollo).
చిట్టచివరగా, యూరెనస్ వృషణాల నుండి పుట్టిన ప్రేమ దేవత ఏఫ్రొడిటి (Aphrodite). (పాతాళలోకానికి అధిపతి అయిన హేడీస్‌ని ఈ పన్నెండుమందిలో లెక్కించరు.)
జూస్ కొలువులో ఉన్న పన్నెండుమంది ఒలింపియను దేవతలని మరొకసారి మరొక కోణంలో చూద్దాం.
- జూస్: దేవతలకి అధిపతి; మన ఇంద్రుడి లాంటివాడు; రోమను పురాణాలలో ఇతనే జూపిటర్ (Jupiter).
- హేరా: జూస్ పట్టమహిషి, జూస్ చెల్లెలు, క్రోనస్ – రేయాల కూతురు; రోమను పురాణాలలో జూనో (Juno).
- పొసైడన్: సముద్రాలకి అధిపతి; జూస్ తోబుట్టువు; రోమను పురాణాలలో నెప్ట్యూన్ (Neptune).
- డిమిటర్: పాడిపంటలకి అధిపత్ని, క్రోనస్-రేయాల కూతురు; జూస్ తోబుట్టువు; జూస్‍కీ పొసైడన్‍కీ ప్రియురాలు; రోమను పురాణాలలో సీరీస్ (Ceres).
- ఎథీనా: యుద్ధ విద్యలకి అధిపత్ని; జూస్ శిరస్సు నుండి సచేలంగా, సాలంకృతంగా పుట్టింది; రోమను పురాణాలలో మినర్వా (Minerva).
- అపాలో: జూస్-లేతోలకి పుట్టిన కొడుకు. ఆర్టెమిస్-అపాలోలు కవలలు. ఇతను రెండవ తరం ఒలింపియను.
- ఆర్టెమిస్: జూస్-లేతోలకి పుట్టిన కూతురు. ఆర్టెమిస్-అపాలోలు కవలలు. ఈమె రెండవ తరం ఒలింపియను; రోమను పురాణాలలో డయానా (Diana).
- ఎరీస్: యుద్ధ విద్యలకి అధిపతి; జూస్-హేరాలకి పుట్టిన కొడుకు; రోమను పురాణాలలో మార్స్ (Mars).
- ఏఫ్రొడిటి: లైంగిక ప్రేమకి అధిపత్ని; యూరెనస్ జననాంగాలని కోసి సముద్రంలో పారేసినప్పుడు వాటి నుండి స్రవించిన తెల్లటి నురుగు నుండి పుట్టిన వ్యక్తి అని ఒక కథనం ఉంది. (టైటనుల తరం ఒలింపియను); రోమను పురాణాలలో వీనస్ (Venus).
- హెర్మీస్: దేవదూత; వీణ లాంటి వాయిద్యాన్ని పట్టుకుని విశ్వ పర్యటన చేస్తూ ఇక్కడి వార్తలు అక్కడకి చేర్చుతూ ఉంటాడు. మన నారదుడి పోలిక కొంత ఉంది; రోమను పురాణాలలో మెర్కురీ (Mercury).
- హెఫీస్టస్: అగ్నిదేవుడు, దేవతల కమ్మరి; ఏఫ్రొడిటిని పెళ్ళి చేసుకున్నాడు; హేరాకి కొడుకు; తండ్రి ఎవ్వరో తెలియదు (జూస్ కావచ్చు); రోమను పురాణాలలో వల్కన్ (Vulcan).
- హేస్టియా, డయనీసిస్: క్రోనస్‍కి రేయాకి పుట్టిన ప్రథమ సంతానం హేస్టియా. జూస్‍కీ మానవ వనితకు పుట్టిన బిడ్డ కనుక డయనీసిస్ సంపూర్ణ దైవత్వం లేని వ్యక్తి (demigod) కనుక ద్వాదశ ఒలింపియనుల జాబితాలో ఇమడకపోవచ్చు.
ఒలింపస్ పర్వతం మీద నివాసం ఉండే ఈ మూడవ తరం దేవతలలో జూస్-హేరాల సంతానమే ఎక్కువమంది!
ముఖ్యమైన పాత్రల వంశవృక్షం, టూకీగా:
యూరెనస్ + గాయా → క్రోనస్, రేయా, థేమిస్ (పెద్ద)
క్రోనస్ + రేయా → జూస్, హేరా, పొసైడన్, హేడిస్, డిమిటర్, హేస్టియా
జూస్ + హేరా → ఎరీస్, హెఫీస్టస్ (లేదా, హేరా → హెఫీస్టస్?)
జూస్ + మేటిస్ → ఎథీనా
జూస్ + లేతో → అప్పాలో, ఆర్టిమిస్
జూస్ + మయియా → హెర్మీస్
జూస్ + సెమిలీ → డయొనీసన్
జూస్ + డయోన్ → ఏఫ్రొడిటి? లేదా యురేనస్ వృషణాల నుండి → ఏఫ్రొడైటి? (లేదా, జూస్ + డయోన్ → ఏఫ్రొడైటి?)
జూస్ + ఇతరులతో → పెర్సిఫొనీ (Persephone), పెర్సియస్ (Perseus), హెరాక్లిస్ (Heracles), ట్రోయ్‍కి చెందిన హెలెన్ (Helen), మినోస్ (Minos) కాకుండా తొమ్మిది మంది మ్యూజ్‍లు (Muses). (ఈ మ్యూజ్‍లు కళలకి, విద్యలకి అధిపత్నులు.)
థెమిస్
థెమిస్
క్రోనస్-రేయాల పుత్రిక. ఈమె ధర్మపరిపాలనకి అధినేత్రి. ఈమె కుడి చేతిలో దుష్టశిక్షణకి ఒక కత్తి, ఎడమ చేతిలో నిష్పక్షపాత ధర్మపాలనకి గురుతుగా ఒక త్రాసు ఉంటాయి. ఈమె కళ్ళకి కట్టిన గుడ్డ తీర్పు కొరకు వచ్చిన ప్రత్యర్థుల సాంఘిక స్థాయికి అతీతంగా ఆమె తీర్పు ఉంటుందని సూచిస్తుంది.
జాస్ అంతటివాడు తనకి వచ్చిన ధర్మసందేహాలని తీర్చుకుందుకి ఈమెని సంప్రదిస్తూ ఉంటాడు.
గ్రీసు చరిత్రలో మరొక థేమిస్ ఉంది ఈ ‘పెద్ద’ థెమిస్ యూరెనస్-గాయాల కూతురు. ఈమెకి భవిష్యత్తు చూడగలిగే శక్తి ఉంది. ఈ శక్తిని ఆమె తన పెరింటిగత్తె అయిన ‘చిన్న’ థెమిస్‍కి ధారపోసిందని ఒక ఐతిహ్యం ఉంది.
జూస్‍ని పోలిన వ్యక్తి ఇంద్రుడు అని అనుకున్నాం కదా. హిందూ పురాణాలలోని దత్తాత్రేయ పురాణం ప్రకారం బ్రహ్మ మానసపుత్రులలో ఒకడైన మరీచి కొడుకు కశ్యపుడు. ఇతను (బ్రహ్మ మానసపుత్రులలో మరొకడైన) దక్షప్రజాపతి యొక్క ఎనమండుగురు కూతుళ్ళని పెళ్ళి చేసుకుంటాడు. వీరిలో పెద్ద కూతురు అదితికి పుట్టిన వారిలో ఆదిత్యులు పన్నెండుమంది, వసువులు ఎనమండుగురు, రుద్రులు పదకొండుమంది, అశ్వినీ దేవతలు ఇద్దరు. జూస్ పన్నెండుగురు ఒలింపియనులలో ఒకడైతే, ఇంద్రుడు పన్నెండుగురు ఆదిత్యులలో (అనగా, అదితి కొడుకులలో) ఒకడు.
ఋగ్వేదం (1.164.33) ప్రకారం ఇంద్రుడు ద్యయుస్‍కి (ఆకాశం), పృధ్వికి (భూదేవి) పుట్టిన కొడుకు.