ఏటి గట్టున ఇల్లు

“హమ్మయ్యా! పార్కొచ్చేసింది.” ఇంటి నించి పరుగులు పెట్టుకుంటూ ఇక్కడివరకొచ్చి, రొప్పుతూ ఆగాను. అటు రన్నింగూ కాదు, ఇటు జాగింగూ కాని ఎక్సర్‌సైజ్ చేస్తుంటానిలా, రోజూ సాయంకాలాలు. లేక పోతే తోచదు. ఒక్క రోజు మానేసినా, శరీరం కొండలా అయిపోయిందన్నట్టు ఒకటే ఫీలింగ్, నన్ను నిద్ర పోనీదు. ఆఫీస్ నించి ఇంటికొచ్చి, అమ్మ టీ ఇస్తానన్నా వద్దని వచ్చేశా. సరిగ్గా ఇంటి నించి, ఇక్కడికి ఓ అరగంట పడుతుంది అంతే.

మా వీధికి నాలుగు వీధులవతల, అతి పెద్ద మైదానం, ఇక్కడ్నించి అంతం దాకానూ, పచ్చిక పరచుకునుంటుంది. ఇహ ఇక్కడితో వూరే ఆగిపోయినట్టుంటుంది. అవతల ఏముందో తెలీదు. వరసగా చెట్ల గుంపులు మాత్రం కనిపిస్తాయి, దట్టంగా దడి కట్టేస్తూ. నేను కూర్చున్న చోటే పిల్లలాడుకునే పార్క్! మరి కొంచెం దూరంలో వాలీబాల్, స్కేటింగ్ కోర్ట్స్ వున్నాయి. ఎదురుగా విశాలమైన చోట, నెట్లు కట్టుకుని టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తుంటారు. పిల్లలతో బాటు పెద్ద వాళ్ళూ వస్తారు. ఇంకా, పసిపిల్లలనేసుకుని కొందరు, కుక్క పిల్లలనెత్తుకుని మరి కొందరూ కనిపిస్తుంటారు. మరో పక్క స్టేడియం వుంటుంది. కూర్చుని చూసేందుకు వీలుగా బ్లీచర్స్. ప్లాట్ఫాం మీద వరస చెక్క బెంచీలు, గుంపులుగా కూర్చునే వారికేమో, రంగు రంగు గొడుగులు, వాటి కింద గుండ్రని టేబుల్స్. ఇంతింత పెద్ద పెద్ద గ్లాసులలో స్ట్రాలేసుకుని తాగేస్తూ ఆట చూడ్డంలో నిమగ్నులై పోతుంటారు. స్ట్రాలర్స్‌లో పసి కూనలు సైతం కిక్కురుమనకుండా ఎలా వుంటారో ఆశ్చర్యమేస్తుంది. తొంభై యేళ్ళ ముసలి వాళ్ళని కూడ వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టుకుని మరీ తీసుకొస్తారు, ఇక్కడేదో మహాద్భుతం జరిగిపోతున్నట్టు.

నాకు మా బామ్మ గుర్తొచ్చింది. ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ, ఆరోగ్యంగా తిరుగుతున్నా కూడా, పాపం! ఎక్కడికీ ఆవిణ్ని మేమెవ్వరం తీసుకెళ్ళిన పాపాన పోలేదు ఇంట్లో వాళ్ళం. ఆవిడ పడిపోతే, మంచాన పడుతుందేమోనని ముందు జాగ్రత్త! ఆవిడకేమో అన్నిచోట్లకీ రావాలనీ, అందర్నీ చూడాలనీ వుండేది. అమెరికన్లు ఈ విషయం లో భలే నచ్చేస్తారు నాకు.

ఈ స్టేడియం వెనకంతా దట్టమైన చెట్లతో చిక్కటి అడవిలా వుంటుంది. దూరం నించి చూస్తే, నల్లటి నిశ్శబ్దాన్ని కప్పుకుని, నావైపే చూస్తున్నట్టు, భయమనిపిస్తుంది. నా చెవులకేదో ఒక అపస్వరం లీలగా వినిపిస్తూ వుంటుంది. అందుకే నేనటుకేసి చూడను. అటుకల్లా వెళ్ళను.

చల్ల గాలి తెరతెరలు తెరలుగా వచ్చి, వింజామర్లు వీస్తుంటే, అలుపు తీర్చుకుంటున్నా. ఇంతలో ఒక చైనా అమ్మాయి, నా ముందు నించి ఆ అడవి లోకి ట్రెకింగ్‌కి పోతోంది. ఈ బక్క ప్రాణి అందులో చిక్కుకు పోతే ఎలా అనిపించింది. వొద్దని చెప్పబోయి ఆగిపోయాను. మనకెందుకొచ్చిన గొడవలే పోనీ అని. ఎందుకంటే ఆమె వెళ్ళే దారితో నా కొక చేదు అనుభవం వుంది. నేను కూర్చున్న చోట్నించి, ఎడమ వైపుగా, లోతు కల్లా ఒక తారు రోడ్డుంటుంది. ఎంచక్కా మెలిక తిరిగి, పడుచు దాని నడుము నునుపులా! బాగుంది కదాని వెళ్ళామో చుట్టేస్తుంది పాములా. అదే ట్రెకింగ్ లేన్‌కి దారి. అలా వెళ్ళి, కాస్త కుడి వైపుకు తిరుగుతామో లేదో, అబ్బ! వొణుకు పుట్టి పోతూ… చిక్కటి అడవి తేల్తుంది. రోడ్డుంది కదాని అలానే పడి పోయామో హమ్మో, అరణ్యమే అరణ్యం! హబ్బ, చెప్పొద్దూ, ఠారెత్తి పోతుంది.

ఆ రోజేమైందనీ! రఘుతో కలసి వెళ్ళినప్పుడు?

లోపలకెళ్తూనే వొద్దనుకున్నాను, కానీ తీరా రఘు ముందుకెళ్తుంటే రానని చెబితే బాగోదేమోని, అనుసరించాను. ఒక్క మనిషీ లేడు. చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు, వాటిని అల్లుకున్న తీగలు, ఇంకో నాలుగడుగులేస్తే, అదేమిటో నీళ్ళ చప్పుళ్ళు. చెక్క వంతెన కిందనించీ గులకరాళ్ళ మీద దొర్లుకుంటూ పోతున్నాయి. కాస్త ముందుకు వంగుని చూద్దును కదా, చీకటి చిమ్మ చీకటి అక్కడంతా గుండె గుభేల్మనేలా! చిక్కటి నల్ల పొదల్లోంచి, రెక్కలార్చుకుంటూ పిట్టల శబ్దాలు. వుండుండి గొంతులోంచి గోలీకాయని గల గల లాడిస్తూ పేరు తెలీని పక్షుల గరగరలు. హమ్మో! ఒక్క అడుగు ముందుకు పడితే ఒట్టు. సడి లేకుండా పాకుతున్నా, పాము కదలికలకి ఎండుటాకుల చప్పుడు ఎంత భీకరంగా వుంటుందో… మాటల్లో కాదు, ఇలా నా చేతులు చల్లబడటంతో తెలిసొస్తోంది.

“నా వల్ల కాదు. ఇక నే ఒక్కడుగు కూడా వేయలేను. నే పోతున్నా,” అంటూ పాదాలు వెనక్కి తిప్పినప్పుడు రఘు ఎలా ఎలా నవ్వాడు ఘొల్లున! ఆ నవ్వు ప్రతిధ్వనిస్తూంటే ఎంత కఠోరంగా వినిపించిందనీ!

“రఘూ! ప్లీజ్ నవ్వకు. అసలే నాకు భయంగా వుంది. నేనిక రాలేను. పద పోదాం,” అన్నాను బిక్కుబిక్కుమంటూ చుట్టూ కమ్ముకుపోతున్న చీకట్లను చూస్తూ.

అతనొక్కసారిగా చూశాడు. “ఇప్పుడేగా, ఇంతకు ముందేగా నా కిష్టమైన పాట పాడి వినిపించిన నువ్వేనా ఇప్పుడిలా ముసలి గొంతుతో వొణుకుతూ మాట్లాడుతోందీ?” అంటూ నన్ను నిలదీస్తున్నట్టున్నాయి ఆ చూపులు.

నా చేతుల్ని తన చేతుల్లో బిగిస్తూ, నాకెదురుగా నిలబడి, మొహం లోకి గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. చల్లబడ్డ చేతుల్ని చూసి అతనెంత మాత్రం చలించక పోగా, పైపెచ్చు కోపంగా చూస్తున్నాడు. అతని కళ్ళ మీదే నా చూపంతా. అవి క్షణ క్షణానికి పెద్దవౌతున్నాయి. అప్పటి దాకా తను గమనించలేదు కాని, ఆ కళ్ళు రక్తం పూసుకున్నట్టు ఎర్రగా ఎర్రెర్రగా చిక్కటి రంగుల్ని మార్చుకుంటున్నాయి. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా చెంపల మీద పడి నిప్పులూదుతున్నాయి. మొత్తానికి అతను ఎప్పట్లా లేడు. పైగా అతి భయానకంగా, నేనింతకుముందెన్నడూ చూడని వాడిలా, ఓ విలన్‌లా కనిపిస్తున్నాడు.

” ర… ఘూ…” పిలిచానో లేదో తెలీడం లేదు. గొంతులోంచి మాట రాక ముందే, గుటక పడినట్టుంది.

“ఏమిటిది? ఎందుకు, ఎందుకనీ ఇలా భయపడుతున్నావ్? ఆఁ? నాతో రావడం ఇష్టం లేదా? చెప్పు! నేనేమైనా దయ్యాన్నా? భూతాన్నా? నిన్ను తినేస్తానా? చెప్పు! చెప్పమంటుంటే” గద్దిస్తున్నాడు.

అసలే పెనుగాలికి పుల్లలా వూగుతున్న నేను ఒక్క సారిగా బెంబేలెత్తి పోయాను. ఇదేమిటీ రఘు హఠాత్తుగా ఇలా మారిపోయాడు. అడవి మధ్యలో అతన్ని కానీ ఏదైనా దుష్ట శక్తి ఆవహించిందా? అయి వుండొచ్చు. లేకుంటే, ఎప్పుడూ లేని ఈ వింత ప్రవర్తనేమిటీ? ఇప్పుడెలా? తను పిలిచినా పలికే దిక్కే లేదే! ఇనుము పట్టు లాటి అతని చేతుల్లో నా అర చేతులు క్రమక్రమంగా బిగుసుకుపోతున్నాయి. అలా, ఈ మొత్తం శరీరాన్నంతా కూడా బిగించేసి, చంపేసి కాని పోతాడా? హమ్మో.

ఏదైతే అదైంది అనుకున్నా. ప్రాణం మీద తీపి నాకెక్కడ లేని శక్తినిచ్చింది. అంతే ఒక్క సారిగా శివమెత్తిన దాన్లా ఒకే ఒక్క విసురుతో చేయి విడిపించుకుని, వెనక్కి పరుగందుకున్నాను. ఎలా అంటే, ఎంత వేగమంటే, ..గాలితో సమానంగా. భూమికి పాదాలు తాకడం లేదు. నేలకీ, నింగికీ మధ్యన తేలుతున్నా. అనుకోని సంఘటన కావడంతో, రఘు ఖంగు తిన్నట్టున్నాడు ఓ సెకను కాలం పాటు. ఆ తర్వాత, నా పేరెట్టి పిలుస్తూ… హేయ్, ఆగు, ఆగు.” అంటూ తనూ పరుగు తీస్తూ వస్తున్నాడు నా వెనకే. లాభం లేదు. ఈ వేగం చాలదు. ఎందుకంటే నాకు మించి వేగంగా పరుగు తీస్తున్నాడు. అందుకే అంటారు దెయ్యం బలమని. అలా అనుకోగానే నాకింకా ఖంగారు పుట్టుకొచ్చింది.

రెట్టింపు వేగంతో పరుగులు తీసి తీసి, హమ్మయ్య, ఎలాగో అలా అదిగో సరిగ్గా ఆ నున్నటి మెలిక మీదకొచ్చి, రొప్పుతూ నిలబడి పోయాను. దూరంగా జనాలు కనిపిస్తున్న ధైర్యంతో, ఆగి రొప్పుతున్నాను. వచ్చి పడ్డానే కానీ, ఊపిరి అందడం లేదు. నా శ్వాస నాకే ఒక తుఫాను గాలిలా వినిపిస్తోంది. గుండెలు కొట్టుకుంటున్నాయో, ఆగిపోయాయో తెలుసుకోలేక పోయాను. అతి భయంకరమైన టెన్షన్ నించి నన్ను నేను డైవర్ట్ చేసుకోవడం కోసం అంకెలు లెక్క పెడుతున్నాను. వన్, టూ, త్రీ…

హబ్బ! ఎంత భయానకమైన అనుభవం! ఇదంతా రఘు మూలానే!

అదిగో వస్తున్నాడు. పరుగులెత్తుకుంటూ వస్తున్నాడు. అసలతను మామూలుగా నడుస్తుంటేనే అతని వేగాన్ని అందుకోలేదు తను. అలాంటిది అతని పరుగు వేగానికి అందకుండా వచ్చిందంటే, ఎంత వేగంగా పరిగెత్తి ఉంటాను?

“ఏంటి నందా, హబ్బ! చచ్చా నీ వెనక పరుగెత్తలేక,” అతనిప్పుడు మామూలుగానే కనిపిస్తున్నాడు. మరి ఇందాకేమిటి అలా… కనిపించాడు? అతి భయాతి భయంకరంగా? పరీక్ష గా చూశాను అతని ముఖం లోకి.

“ఏమిటీ అలా చూస్తున్నావ్? ఇందాక బాగా భయపడి పోయావు కదూ?నేనే, కావాలనే నిన్ను ఏడిపించాలని…” అంటూనే, నన్ను చూసి పడీ పడీ నవ్వడం మొదలు పెట్టాడు. అలా ఎడ తెరిపి లేకుండా నవ్వుతూనే మాట్లాడుతున్నాడు.

“అస్… అస్సలు అప్పుడు నువ్వెలా బెదిరిపోయావో తెలుసా? నీ మొహం చూస్… చూస్తే… కె… కెమెరా వుంటే… ఎంత…” అతను పూర్తి చేయలేక పోతున్నాడు. అంతగా పడీ, పడీ నవ్వుతున్నాడు. అంటే? తను పడ్డ నరక యాతన అతనికంత నవ్వునిచ్చిందా? పైగా, కావాలనే భయ పెట్టాడా? తను కట్టెలా బిగుసుకుపోతుంటే గుండాగిపోయే పరిస్థితికి అతనికి నవ్వెలా వస్తోంది? ఇతన్ని ఏమనాలి?

“అదేమిటీ నందా, నీ చేతులు అలా మంచు కట్టెల్లా..” అతను ఇంకా నవ్వుతున్నాడు.

పట్టలేనంత ఆవేశమొచ్చేసింది. నాకు తెలీకుండానే, పెదాలు వొణుకుతున్నాయి. నాకు తెలీకుండానే చేయి చాచి చెంప మీద బలంగా కొట్టాను. అతను షాకయ్యాడు. “ఏమనుకుంటున్నావ్? నవ్వులాటనుకుంటున్నావా? ఒక్క క్షణం ఆలస్యమైనా, భయంతో నా ప్రాణాలు పోయేవి. నీకది తెలుసా?” దుఖంతో గొంతు కీచుమంది.అతను అలాగే నిలబడి పోయాడు. రాయిలా. నేనిక అతని వైపు చూడ దలచుకోలేదు. నాలుగడుగుల్లో పార్కింగ్ ప్లేస్ కొచ్చి పడ్డాను. ఆ తర్వాత కార్లోకీ! మరు క్షణంలో నేనక్కడ లేనే లేను.