ఊహ కందని ఉదాసీనత
బరువుకాని బరువై
ఎద మీద వాలుతున్నప్పుడు
మూసీ మూయని నా కనురెప్పల మాటున
కదలీ కదలని ఒంటరి మౌనమేదో
దైన్య చిత్రాలను చెక్కుతుంటుంది.
దిగులు గుదిబండ
గుండెమీద రాతి పాదం మోపుతున్నప్పుడు
తెరచీ తెరువని నా తలపు తలుపుల వెనుక
తెలిసీ తెలియని ఏకాకి మూగ భావమేదో
అశ్రు వాక్యాలను ఎక్కుపెడుతుంటుంది.
చెప్పీ చెప్పక వచ్చిన తుఫాను
నా పూలపాటలను చెరిపేస్తున్నప్పుడు
నేను మూర్చిల్లిన నీరవ నిశ్శబ్దంలోకి
నిర్వికారంగా నిర్గమిస్తుంటాను.
ఆ అశాంత సాయంతనాన
నా అణుగోళ కక్ష్యా౦తర అసీమ
విశ్వా౦తరాళమై విస్తరిస్తుంటుంది;
స్థాణువై పోయిన
నా శుష్క మానసం ముందు
నా ప్రతిబింబంలా
శూన్యం చెక్కిన చలనహీన
బృహత్ విగ్రహం!
రచయిత నాగరాజు రామస్వామి గురించి:
ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజనీరింగ్ లో డిగ్రీలు తీసుకొన్న నాగరాజు రామస్వామిగారు పదిహేనేళ్ళు ఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరునెలలపాటు సాంఘికవిద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఓమాన్, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించారు. వీరు ప్రచురించిన పుస్తకాలు 16 (4 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం, 8 అనువాద సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, పురివిప్పిన పొరుగు స్వరం, రవీంద్రగీత గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియా పాజ్ సూర్యశిల, కల్యాణ గోద – తిరుప్పావై, 1 వచనం – అనువాదం అనుభవాలు, ఆంగ్లంలో The great Void, Wings of Musings, Blue Pleasance. వీరి \’విచ్చుకున్న అక్షరా\’నికి తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది.